• facebook
  • whatsapp
  • telegram

మత స్వాతంత్య్రపు హక్కు, సాంస్కృతిక, విద్యా హక్కులు 

భారత రాజ్యాంగం మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పేర్కొంటోంది. మత విషయాల్లో నిష్పక్షపాత ధోరణితో, అన్ని మతాలను సమానంగా ఆదరించే రాజ్య వ్యవస్థను లౌకిక రాజ్యం అంటారు. అలౌకిక (మతపరమైన) అంశాల పట్ల కాకుండా లౌకిక (ఈ జగత్తుకు సంబంధించిన) అంశాల పట్ల శ్రద్ధ వహించేదే లౌకిక రాజ్యం. 

ఐరోపాలో చీకటి యుగంగా పేరొందిన మధ్యయుగాన్ని ఛేదిస్తూ మత సంస్కరణోద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం వెలుగులోకి వచ్చాయి. ఇందులో భాగంగానే లౌకిక రాజ్యాలు ఆవిర్భవించాయి. మధ్యయుగ కాలం నాటి మత భావాలు, నైతిక విలువలు, సంప్రదాయ సిద్ధాంతాలను తిరస్కరిస్తూ మాకియవెల్లి లాంటి వారు రాజకీయాలను మత ప్రభావం నుంచి వేరు చేయాలని సూచించారు. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలన్నీ, లౌకిక రాజ్యాలే. మతాన్ని వ్యక్తిగతమైన విషయంగా పరిగణిస్తున్న రాజ్యాలే. ఇందులో భాగంగానే మనం మన రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వాతంత్య్ర హక్కుల గురించి తెలుసుకుందాం.

మత స్వాత్రంత్య్రపు హక్కు

భారత రాజ్యాంగంలో 25వ అధికరణం నుంచి 28వ అధికరణం వరకు మత స్వాతంత్య్ర హక్కులకు సంబంధించిన వివరణ ఉంది.
25వ అధికరణం: ప్రజలందరూ తమకు ఇష్టమైన విశ్వాసాలను (Freedom of Conscience) కలిగి ఉండి, తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ప్రచారం చేసుకోవచ్చు.

* కింద ఇచ్చిన క్లాజుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు.
a) మతపరమైన అంశాలతో ముడిపడి ఉన్న ఆర్థిక, రాజకీయ లేదా ప్రజా సంక్షేమ కార్యక్రమాల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు.
b) హిందూ మత సంస్థల్లో హిందువుల్లోని అన్ని తరగతులు, వర్గాల వారికి ప్రవేశం కల్పించడం కోసం లేదా హిందూ మత సంస్కరణల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవచ్చు (ఇక్కడ సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా హిందువుల పరిధిలోకే వస్తారు).
* హిందూ మతంలో అనాదిగా వస్తున్న కొన్ని సామాజిక రుగ్మతలను నిర్మూలించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. బాల్య వివాహాలు, దేవదాసీ వ్యవస్థ, బహు భార్యత్వం, అంటరానితనం లాంటివి రూపుమాపాలంటే ప్రభుత్వ జోక్యం తప్పనిసరి. అందుకే హిందూ మత సంస్కరణలకు అవసరమైన శాసనాధికారాన్ని ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇది మతస్వేచ్ఛకు ఎంత మాత్రం భంగకరం కాదు.
* 25వ అధికరణంలో ఉపయోగించిన 'మత ప్రచారం' అనే పదం మత మార్పిళ్లను ప్రోత్సహించే ప్రచారం కాకూడదని 1977లో స్టేన్‌లూస్ Vs మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. ఏదైనా మతాన్ని స్వీకరించడం అనేది వ్యక్తి అంతరాత్మ ప్రబోధానుసారం (Freedom of Conscience) జరగాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశం.
* హనీఫ్ ఖురేషి Vs బిహార్ రాష్ట్రం (1958) వ్యాజ్యంలో బక్రీద్ పర్వదినాన గోవధ ఇస్లాం ముఖ్య ఉద్దేశం కాదని, కాబట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనం ద్వారా ఈ ఆచారాన్ని రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.

* 1984లో ఆనంద్ మార్గ్ కేసులో ఆయుధాలతో, మానవ కపాలాలతో నాట్యం చేయడం మతాచారాల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
* ప్రార్థనా మందిరాల్లో మైకులు ఉపయోగించడాన్ని పశ్చిమ్ బంగ ప్రభుత్వం నియంత్రించింది. ఈ నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది (ఎం.ఎం.ఎస్.ఎం.ఎన్.ఆర్ బర్కారియా వర్సెస్ పశ్చిమ్ బంగ రాష్ట్రం, 1999).
* 1998లో రోడ్లు వెడల్పు చేసే క్రమంలో అడ్డుగా ఉన్న ప్రార్థనా మందిరాలను కూల్చివేయడాన్ని గుజరాత్ హైకోర్టు సమర్థించింది (జీకేహెచ్ మీనన్ వర్సెస్ సూరత్ మున్సిపల్ కార్పొరేషన్). సరిగ్గా ఇదే అభిప్రాయాన్ని అంతకు ముందు 1994లో ఇస్మాయిల్ ఫరూకీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది.
* మనోహర్ జోషి వర్సెస్ ఎన్.బి. పటేల్ కేసులో (1995) 'హిందుత్వం అనేది భారత ఉపఖండంలోని ప్రజల జీవన విధానం' అని సుప్రీంకోర్టు పేర్కొంది.

26వ అధికరణం 

      25వ అధికరణాన్ని ఆచరణీయంగా ముందుకు తీసుకు వెళ్లేదే 26వ అధికరణం. ఈ అధికరణం ప్రతి మతానికి తమ మత సంస్థలను ఏర్పాటు చేసుకుని, నిర్వహించుకునే హక్కు కల్పిస్తుంది. ధర్మాదాయ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. స్థిర, చరాస్తులను సంపాదించి, వాటిని నిర్వహించుకోవచ్చు. అయితే ఇదంతా చట్టానికి లోబడి జరగాలి. 25వ అధికరణంలాగే 26వ అధికరణంలో ఉన్న హక్కులపై శాంతిభద్రతలు, నైతికత, ప్రజారోగ్యం అనే పరిమితులున్నాయి.
* రతిలాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే (1954); రామానుజ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1961); స్వరూప్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1959); నరేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ (1974); రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1981) తదితర కేసుల్లో - మత సంస్థల ఆస్తులను 'నియంత్రించే' అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, కానీ మత సంస్థల స్వయం ప్రతిపత్తిని, వాటిని అవి నిర్వహించుకునే అధికారాన్ని కట్టడి చేసే మితిమీరిన జోక్యం తగదని సుప్రీంకోర్టు సూచిస్తూ వచ్చింది.
* 25, 26 అధికరణాలను కలిపి చూసినప్పుడు రాజ్యాంగం ఈ దేశంలో మతానికి, రాజ్యానికి తమతమ నిర్దేశిత పరిధిని నిర్వచిస్తూ, వాటి మధ్య ఒక స్పష్టమైన విభజన రేఖ గీసినట్లు అర్థమవుతుంది.

27వ అధికరణం

    ఈ అధికరణం ప్రకారం మత ప్రాతిపదికపై రాజ్యం పన్ను విధించకూడదు. అయితే దేవాలయాల ప్రవేశార్థం, పూజల కోసం, వివిధ రకాల ప్రత్యేక దర్శనాల కోసం ప్రజలు చెల్లించే రుసుములు ఇందులో భాగం కాదు.

28వ అధికరణం

* 28(1) ప్రకారం రాజ్యం నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో మత బోధనను నిషేధించారు.
* 28(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న దేవాదాయ, ధర్మాదాయ సంస్థల్లో ప్రత్యేక మత బోధన చేయొచ్చు.
* 28(3) ప్రకారం ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే (ఎయిడెడ్) విద్యా సంస్థల్లో ప్రార్థనల్లో, మత బోధనల్లో పాల్గొనమని ఎవరినీ ఒత్తిడి చేయకూడదు.

సాంస్కృతిక, విద్యా హక్కులు

      విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులు ఉన్న దేశం మనది. జాతీయ సమైక్యత సాధించాలంటే అల్ప సంఖ్యాక వర్గాలకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. సాంస్కృతిక, విద్యా హక్కులు ఇందులోని భాగమే.
 

29వ అధికరణం (ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతిని సంరక్షించుకునే హక్కు):
* 29(1) ప్రకారం ప్రజలకు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతిని పరిరక్షించుకునే స్వేచ్ఛ ఉంది.
* 29(2) ప్రకారం ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో ప్రవేశానికి మతం, జాతి, కులం, భాషా ప్రాతిపదిక ఆధారంగా వివక్ష చూపకూడదు.

30వ అధికరణం 

     ఈ అధికరణం అల్పసంఖ్యాక వర్గాల ప్రజలు విద్యాలయాలను స్థాపించుకుని, నిర్వహించుకునే హక్కు గురించి వివరిస్తుంది.
* 30(1) ప్రకారం మైనారిటీ వర్గాల వారు ప్రత్యేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని, నిర్వహించుకోవచ్చు.
* 30(1) (a) ప్రకారం మైనారిటీలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను, వాటి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారం చెల్లించాలి (30 (1) (a) ని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు).
* 30(2) ప్రకారం ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందచేసే క్రమంలో అల్ప సంఖ్యాక సంస్థలు, అధిక సంఖ్యాక సంస్థలు అనే భేదం చూపకూడదు.
* 29, 30 అధికరణాల్లో మైనారిటీ అనే (అల్పసంఖ్యాక వర్గాలు) ప్రస్తావన వచ్చినప్పటికీ రాజ్యాంగం ఎక్కడా 'మైనారిటీ' అనే పదాన్ని నిర్వచించలేదు.

రచయిత: జి. కళ్యాణ చక్రవర్తి

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌