• facebook
  • whatsapp
  • telegram

హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక స్థానంగా భారతదేశం

 విశ్వ వాణిజ్యానికి విశిష్ట కూడలి! 


 

హిందూ మహాసముద్రం భారత దేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. ఇది ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా సహా పలు ఖండాల్లోని అనేక దేశాలతో సత్సంబంధాలను సాగించడానికి మనకు వీలు కలిగిస్తోంది. అంతర్జాతీయ వ్యాపారానికి, చమురు రవాణాకు ప్రత్యేక కూడలిగా  ఇండియా మారడానికి దోహదపడింది. దీంతో భద్రత పరంగా, రాజకీయంగా అపార భౌగోళిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ప్రాంతీయ శక్తిగా ఎదిగేందుకు, దౌత్య, వాణిజ్య, సైనిక రంగాల్లో ఆధిపత్యాన్ని సాధించేందుకు ఆ మహాసముద్రం మన దేశానికి సహజంగా కల్పించిన సానుకూలతలపై పోటీ పరీక్షార్థులు తగిన అవగాహన పెంచుకోవాలి. 


భూమధ్యరేఖకు ఉత్తరాన 8ా4× నుంచి 37ా6× ఉత్తర అక్షాంశాలు, 68ా7× నుంచి 97ా25× తూర్పు రేఖాంశాల మధ్య భారతదేశం ఉంది. ప్రపంచంలో వైశాల్యం పరంగా ఏడో స్థానంలో (32,87,263 చ.కి.మీ.),.జనాభాకు సంబంధించి మొదటి స్థానంలో ఉంది.  ఉత్తరం నుంచి దక్షిణానికి 3,214 కి.మీ., తూర్పు నుంచి పడమరకు 2,933 కి.మీ. పొడవున విస్తరించి ఉంది. భూసరిహద్దు 15,200 కి.మీ.; తీరరేఖ 7,516.6 కి.మీ..దేశానికి పశ్చిమాన అరేబియా, తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం ఉన్నాయి. భారత్‌ను ఆగ్నేయంగా శ్రీలంక నుంచి పాక్‌ జలసంధి, గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వేరు చేస్తున్నాయి.లక్షదీవులకు 125 కి.మీ. దూరంలోనే మాల్దీవులు ఉన్నాయి. మయన్మార్, థాయ్‌లాండ్, ఇండొనేసియాలతో అండమాన్‌-నికోబార్‌ దీవులు సముద్ర సరిహద్దు పంచుకుంటున్నాయి. దేశానికి దక్షిణ చివరి కొనగా గ్రేట్‌ నికోబార్‌ ద్వీపంలోని ఇందిరా పాయింట్, ఉత్తర చివరి భాగంగా ఇందిరా కల్‌ (సియాచిన్‌-గ్లేసియర్‌) ఉన్నాయి. భారత ప్రాదేశిక జలాలు తీరరేఖ నుంచి సముద్రంలో 12 నాటికల్‌ మైళ్ల వరకు విస్తరించాయి. 


సాంఘికంగా, సాంస్కృతికంగా, వాణిజ్యపరంగా ప్రపంచ పటంలో ఒక ముఖ్యమైన, వ్యూహాత్మక ప్రాంతంలో, ప్రపంచం నలుమూలలకు వాణిజ్య మార్గంగా ఉన్న ఉత్తరార్ధ గోళంలోని హిందూ మహాసముద్రానికి శిఖర స్థానంలో భారత్‌ ఉంది. దేశానికి తూర్పు, పశ్చిమ తీరాల్లో అనేక నౌకాశ్రయాలు/ఓడరేవులు ఉన్నాయి. అందుకే అనాదిగా, చారిత్రక ఆధారాల పరంగా చూసినా మన దేశానికి సుసంపన్నమైన సముద్ర వాణిజ్య సంపద ఉంది.


హిందూ మహాసముద్రం (ఇండియన్‌ ఓషన్‌) పేరును పరిశీలిస్తే, ప్రపంచంలోనే ఒక దేశం పేరు మీదుగా ఉన్న ఏకైక మహాసముద్రం. ఇది తూర్పు, పడమర దిక్కుల్లో ఉన్న దేశాలకు వారధిగా పనిచేస్తుంది. సముద్ర తీర ప్రాంత దేశాలకు గొప్ప అనుసంధానంగా ఉంది. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతం (దక్షిణ ప్రాంతం), హిందూ మహాసముద్రంలోకి చొచ్చుకొని వచ్చి, సముద్ర భాగాన్ని రెండుగా విభజిస్తోంది. అందులోని పశ్చిమ భాగాన్ని అరేబియా సముద్రం, తూర్పున ఉన్న సముద్రాన్ని బంగాళాఖాతంగా వ్యవహరిస్తున్నారు. ఈ మహా సముద్రంలో భారతదేశానికి ఉన్నంత తీరరేఖ మరే దేశానికీ లేదు. ఈ భౌగోళిక విశిష్టతలన్నీ మన దేశానికి అంతర్జాతీయ వాణిజ్యంలో కలిసివచ్చే అంశాలు.


 హిందూ మహాసముదానికి పైభాగంలో భారత్‌ ఉండటం వల్ల పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్‌లోని పశ్చిమ తీరం; తూర్పు ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.తూర్పు ఆసియా, యూరప్‌ దేశాలను కలిపే సముద్ర మార్గానికి మన దేశం ముఖ్యమైన రవాణా కేంద్రంగా మారింది. 


తూర్పు-పశ్చిమాసియా దేశాలకు మధ్యలో వ్యూహాత్మకంగా ఇండియా ఉండటంతో పశ్చిమాన యూరోపియన్‌ దేశాలకు, నాలుగు తూర్పు ఆసియా దేశాలను కలిపే కీలకమైన ట్రాన్స్‌ హిందూ మహాసముద్ర మార్గం ఇక్కడే ఏర్పడింది. దీని వల్ల పశ్చిమ తీరం నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్‌లతో సన్నిహిత సంబంధాలకు వీలు కలిగింది. అంతేకాకుండా ఐరోపాలోని రెండు ప్రాంతాలను తూర్పు ఆసియా దేశాలతో కలిపే సముద్ర మార్గాలకు ముఖ్య రవాణా కేంద్రంగానూ మన దేశం నిలిచింది. హిందూ మహాసముద్రంలో ఉన్న పొడవైన తీర రేఖ వల్ల ఆఫ్రికా, ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, ఐరోపాలతో వాణిజ్యపరంగా భారత్‌కు అనేక ప్రయోజనాలు సమకూరుతున్నాయి. దాంతోపాటు దేశానికి దక్షిణంగా హిందూ మహాసముద్రం ఉండటం వల్ల అత్యధిక వర్షాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ప్రాంతం మీదుగా వీస్తున్నాయి. 

పూర్వ (తూర్పు) అర్ధగోళంలో కేంద్ర స్థానం: యురేషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలకు భారతదేశ పూర్వార్ధ గోళం (తూర్పు అర్ధ గోళం) చాలా అనుకూలమైన కేంద్రంగా ఉంది. ఈ భౌగోళిక స్థితి వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలతో పాటు, తూర్పు ఆసియా దేశాలతో సాంస్కృతిక సంబంధాలను పెంపొందించుకోడానికి వీలు కలుగుతోంది. మన తూర్పు తీరంలోని ఓడరేవుల వల్ల ఆగ్నేయ, తూర్పు ఆసియా దేశాలతో సాన్నిహిత్యం ఏర్పరచుకోడానికీ అవకాశం దక్కుతోంది. తూర్పు, పడమర రెండువైపుల్లో వ్యాపార, వాణిజ్యాలను విస్తరించడానికి అంతర్జాతీయంగా అనుకూలంగా ఉంది. మన ఉపఖండం మీదుగా కొన్ని ముఖ్యమైన అంతర్జాతీయ వాయు, జలమార్గాలు కూడా వెళుతున్నాయి.


దక్షిణాసియా ఖండంలోని కేంద్ర స్థానం: ఆసియా మధ్యలో భారత్‌ ఉండటం వల్ల పశ్చిమాన యూరోపియన్‌ దేశాలను, తూర్పున ఆసియా దేశాలను కలిపే వ్యూహాత్మక ట్రాన్స్‌ హిందూ మహాసముద్ర మార్గం ఇక్కడి నుంచే వెళుతోంది. పశ్చిమ తీరం నుంచి పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరప్‌లతో, తూర్పు తీరం నుంచి ఆగ్నేయ, తూర్పు ఆసియా దేశాలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఆసియా ఖండానికి నైరుతి వైపు పొడిగించినట్లు భారత భూభాగం ఉంటుంది. దీనివల్ల పశ్చిమ యూరప్‌లోని అభివృద్ధి చెందిన దేశాలను, తూర్పు ఆసియాలోని అభివృద్ధి చెందుతున్న దేశాలను కలిపే ట్రాన్స్‌ హిందూ మహాసముద్ర మార్గాలు భారత తీరాన్ని దాటిపోవాల్సి వచ్చింది. దీని వల్ల  మన దేశం వ్యూహాత్మక కేంద్ర స్థానంగా మారింది. భారత దక్షిణ ద్వీపకల్ప భాగం సముద్రంలోకి చొచ్చుకొని వచ్చి హిందూ మహాసముద్రాన్ని అరేబియా, బంగాళాఖాతాలుగా విభజిస్తోంది. దాంతో ఈ రెండు తీరాల నుంచి పశ్చిమాసియా, తూర్పు ఆఫ్రికా, యూరప్‌లతో; ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా, ఆస్ట్రేలియాలతో సత్సంబంధాలకు అవకాశం ఏర్పడింది. తూర్పు ఆసియా దేశాలకు, పశ్చిమాసియా దేశాలకు మధ్యలో భారత్‌ ఉండటం వ్యూహాత్మకం. ఎందుకంటే ట్రాన్స్‌ హిందూ మహాసముద్ర మార్గాలు పశ్చిమాన పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలను, తూర్పు ఆసియాలోని అభివృద్ధి చెందని దేశాలతో కలుపుతున్నాయి.


హిందూ మహాసముద్ర ప్రాంతం- భౌగోళిక వ్యూహాత్మక ప్రాధాన్యం: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాల కూడలిలో హిందూ మహాసముద్రం ఉంది. దాంతో ఈ ప్రాంతం అనేక సముద్ర తీరాలతో కీలకంగా మారింది. ఇక్కడే ఉన్న హెర్ముండ్, మలక్కా జలసంధులు, బాబ్‌-ఎల్‌ మాండెబ్‌ లాంటి ఇరుకైన మార్గాల మీదుగానే భారీ వాణిజ్యం/వాణిజ్య నౌకల రవాణా జరుగుతోంది. దీంతో పైరసీకి, అంతర్జాతీయ వివాదాలకు, రాజకీయ విభేదాలకు, ప్రమాదాలకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాటిని నివారించడానికి, వనరులు అధికంగా ఉండే ఈ ప్రాంతంపై పట్టు సాధించడానికి బాహ్య శక్తులు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. ఇక్కడి ద్వీపాలు కూడా భద్రతా పరంగా అత్యంత ముఖ్యమైనవి. 


పశ్చిమాసియా నుంచి చమురు రవాణాకు హిందూ మహాసముద్ర మార్గం కూడలి ప్రాంతం కావడంతో పలుదేశాలు ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని చూస్తున్నాయి. కానీ ఇక్కడి భౌగోళిక స్థితులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. అరేబియా సముద్రంలో పర్షియన్‌ గల్ఫ్‌ కూడా మన దేశానికి భద్రతా పరంగా చాలా కీలకం. అందుకే ఆఫ్రికా కొమ్ము ప్రాంతం (సోమాలియా), ఎర్ర సముద్రంలో పైరసీ (సముద్ర దొంగల) బెదిరింపులు ఎదురయ్యే మార్గాలను భారత్‌ రక్షిస్తోంది. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్, పర్షియన్‌ గల్ఫ్‌లో  యుద్ధ నౌకలను మోహరించి,  నౌకలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని మన దేశం కల్పిస్తోంది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్‌ ఫ్యూజన్‌ సెంటర్‌ - ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ (IFC-IOR) ను ఏర్పాటు చేసింది. ఇది భాగస్వామ్య దేశాలతో నౌకల సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది.


చైనా ఆధిపత్య ధోరణికి విరుగుడు: సరిహద్దుల విషయంలో భారత్‌ వాదనలను చైనా వ్యతిరేకిస్తూ తరచూ వివాదాలను సృష్టిస్తోంది. హిందూ మహాసముద్రంపై పట్టు సాధించాలన్న భౌగోళిక, రాజకీయ వ్యూహం ఆ డ్రాగన్‌ దేశానికి ఉంది. అందుకోసమే అది కొంతకాలంగా ఇండియా చుట్టుపక్కల దేశాల్లో భారీ, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపడుతోంది. చైనా దూకుడును ఎదుర్కోవాలంటే, భారత్‌ సముద్ర మార్గంలో శక్తిని పెంచుకోవాలి. 2014 నుంచి మన ప్రభుత్వం సైనిక వ్యవస్థకు సంబంధించిన పెట్టుబడులను క్రమంగా పెంచుతోంది. బంగాళాఖాతంలోని కాంప్‌బెల్‌ అఖాతంలోని స్థావరంలో సౌకర్యాలను ఆధునీకరించింది. 2019లో అండమాన్, నికోబార్‌ దీవుల్లో అదనపు యుద్ధనౌకలు, విమానాలు, సైనిక దళాలు, డ్రోన్‌లను నిలిపేందుకు అవసరమైన ఆర్థిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలను రూపొందించింది. భారత నౌకాదళానికి సంబంధించి ఐఎన్‌ఎస్‌ కోహస్సా అనే స్థావరాన్ని బంగాళాఖాతంలో ప్రారంభించింది.


కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలో భౌగోళికంగా వ్యూహాత్మక మార్పులు జరిగాయి. దాంతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో సైనిక సామర్థ్యాన్ని బలోపేతం చేసే చర్యలను భారత్‌ వేగవంతం చేసింది. మలక్కా జలసంధి నుంచి ఆఫ్రికా తీరం వరకు కార్యకలాపాలను పెంచింది. ఆ ప్రదేశంలో చైనా చర్యలను గమనించేందుకు  శ్రీలంక, మాల్దీవులు, మారిషస్, సీషెల్స్‌ లాంటి హిందూ మహాసముద్ర తీర దేశాలతో కలిసి పని చేయడానికి సిద్ధమవుతోంది. చైనా వ్యతిరేక ఎత్తుగడలను బహిరంగంగా ప్రకటించకుండానే అమెరికాతో కలిసి వ్యూహాత్మకంగా సాగుతోంది. అందుకే హిందూ మహాసముద్రం ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మక ప్రదేశాల్లో ఒకటిగా మారింది. మొత్తం సముద్ర వాణిజ్యంలో 75% పైగా, రోజువారీ ప్రపంచ చమురు రవాణాలో 50 శాతం వరకు ఈ ప్రాంతం నుంచే జరుగుతోంది. దీంతో హిందూ మహాసముద్ర ప్రాంతాన్ని శాంతియుతంగా, సుస్థిరంగా ఉంచడం భారత్‌ ప్రధాన లక్ష్యంగా మారింది. చైనా బెదిరింపులను తిప్పికొట్టడానికి కూడా ఇది అత్యవసరం. 

రచయిత: డాక్టర్‌ గోపగోని ఆనంద్‌


 

Posted Date : 03-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌