• facebook
  • whatsapp
  • telegram

భారత విదేశాంగ విధానం - వ్యూహాలు

ప్రపంచంలోని ఏ దేశం ఒంటరిగా మనుగడ సాధించలేదు. ప్రతి దేశం ఇతర దేశాలపై ఎంతోకొంత ఆధారపడుతుంది. ప్రపంచీకరణ క్రమం ప్రారంభం నుంచి ఈ ధోరణి మరింత పెరిగింది. ఏ దేశమైనా ఇతర దేశాల పట్ల నిర్దిష్ట విధానాన్ని రూపొందించుకోవడం తప్పనిసరి. ఈ విధంగా ఒక దేశం ఇతర దేశాలతో అనుసరించాల్సిన వైఖరినే ‘విదేశాంగ విధానం’ అంటారు.

* ఒక దేశం తన స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూ, ప్రపంచంలోని ఇతర దేశాలతో తన ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి అనుసరించే నియమ నిబంధనల విధానాన్ని ‘విదేశాంగ విధానం’ అంటారు. దేశం అనుసరించే విదేశాంగ విధానం ప్రపంచపటంలో ఆ దేశ ప్రాధాన్యాన్ని సూచిస్తుంది.

* దేశ విదేశాంగ విధాన రూపకల్పనలో భౌగోళిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సైనిక, సాంకేతిక అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి.

* ‘మనకు శాంతి అనేది ఒక ఇష్టమైన ఆశయం కాదు, తక్షణ అవసరం’ అని భారత  తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విదేశాంగ విధాన ఆవశ్యకత గురించి పేర్కొన్నారు.


మూలాలు

* భారతదేశ విదేశాంగ విధానానికి జాతీయోద్యమ సమయంలోనే బీజాలు పడ్డాయి. 1920 నాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ స్పష్టమైన అంతర్జాతీయ దృక్పథం, విధానాన్ని రూపొందించింది. ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ 1927లో ‘విదేశీ వ్యవహారాల విభాగాన్ని (Foreign Affairs Department) ఏర్పాటు చేసింది. దీనికి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతినిధిగా వ్యవహరించారు.

* గౌహతి (1926); మద్రాసు (1927); కలకత్తా (1928) లో జరిగిన ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ సమావేశాల్లో అంతర్జాతీయ పరిణామాలపై ప్రత్యేక తీర్మానాలు ఆమోదించారు. జాతీయ విముక్తి పోరాటాలు, ఉద్యమాలను బలపరిచారు.

* భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చాక తొలి ప్రధాని, విదేశాంగ మంత్రిగా జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యవహరించారు. ఆయనహయాంలోనే భారతదేశ విదేశాంగ విధానానికి పునాదులు పడ్డాయి. 

* భారతదేశంలో అమెరికా రాయబారిగా పనిచేసిన దౌత్యవేత్త గాల్‌ బ్రైత్‌ ‘‘దేశీయ విధానంలాగానే విదేశాంగ విధానం కూడా వాటిని రూపొందించే వ్యక్తుల మౌలిక సహజాతాల  (Fundamental Instincts)పై ఆధారపడి ఉంటుంది.’’ అని వ్యాఖ్యానించారు.

* భారత్‌ - సోవియట్‌ యూనియన్‌ మధ్య సత్సంబంధాల స్థాపనకు డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ఎంతో కృషిచేశారు. ఈయన  స్టాలిన్‌ అధికారంలో ఉన్న సమయంలో ఉభయ దేశాల మధ్య స్నేహపూర్వక ధోరణి ఏర్పడేలా చర్యలు తీసుకున్నారు.

* పాకిస్థాన్‌తో భారతదేశ సంబంధాల విధాన నిర్ణయాల విషయంలో జవహర్‌లాల్‌ నెహ్రూకు సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, గోవింద్‌ వల్లభ్‌ పంత్‌ సహకరించారు.

* 1962 వరకు చైనాతో భారతదేశ సంబంధాల మెరుగుదలకు వీకే కృష్ణమీనన్, కేఎం ఫణిక్కర్‌ కృషి చేశారు.
 

నేపథ్యం

* భారతదేశ విదేశాంగ విధానం శూన్యం నుంచి ఆవిర్భవించింది కాదు. దీని మూలాలు మన చారిత్రక నాగరికత, సంస్కృతి, బ్రిటిష్‌ విధానాల వారసత్వం, స్వాతంత్య్ర పోరాటం, గాంధీజీ తాత్విక బోధనల్లో కనిపిస్తాయి.

* 1903లో అప్పటి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ కర్జన్‌ ‘భారతదేశ ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ వ్యవహారాల వేదికపై భవిష్యత్తులో మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది.’ అని పేర్కొన్నారు. 

* 1946, డిసెంబరు 13న జవహర్‌లాల్‌ నెహ్రూ రాజ్యాంగసభలో ‘చారిత్రక లక్ష్యాలు, ఆశయాల తీర్మానాన్ని’ ప్రవేశపెట్టి, భారతదేశం ప్రపంచశాంతికి, మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు.

* ‘దక్షిణాసియా, ఆగ్నేయాసియా, పశ్చిమాసియాలో భారతదేశానికి కీలకపాత్ర ఉంది. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా మన దేశం ఆసియా ఖండానికి వంతెనలా వ్యవహరిస్తుంది.’ అని 1948లో జవహర్‌లాల్‌ నెహ్రూ వ్యాఖ్యానించారు.
 

మౌలిక లక్షణాలు

* జాతి వివక్షతకు వ్యతిరేకం: జాతి ఆధారంగా వ్యక్తుల పట్ల వివక్ష చూపడాన్ని భారతదేశం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయులు నల్లజాతీయులపై అనుసరిస్తున్న జాతి వివక్షత (అపార్థీడ్‌) విధానాన్ని భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ, 1954లో ఆ దేశంతో దౌత్య సంబంధాలను వదులుకుంది. శ్వేతజాతీయుల ఆధిపత్యాన్ని నిరసిస్తూ జింబాబ్వే (పూర్వ రొడీషియా) జరిపిన విముక్తి పోరాటానికి మనదేశం అండగా నిలిచింది. 1948, డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ‘విశ్వ మానవ హక్కుల ప్రకటన’లోని అంశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించే చర్యలను భారత్‌ ప్రతిఘటిస్తోంది.

* వలస, సామ్రాజ్యవాదాల వ్యతిరేకత: భారతదేశ విదేశాంగ విధానం వలస, సామ్రాజ్యవాదాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇవి ప్రపంచంలో ప్రజాస్వామ్యం, సుస్థిరతను దెబ్బతీస్తాయి. ఆఫ్రో - ఆసియా దేశాలైన ఘనా, నమీబియా, అల్జీరియా, ట్యునీషియా, ఇండోనేసియా దేశాల్లో జరిగిన స్వాతంత్రోద్యమాలకు భారత్‌ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించింది. అగ్రరాజ్యాల సామ్రాజ్యవాద వ్యూహాలకు వ్యతిరేకంగా మనదేశం అనేక సందర్భాల్లో అంతర్జాతీయ వేదికలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

* 1936లో ఫైజ్‌పూర్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షతన జరిగిన ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ సమావేశంలో భారతీయులు సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తీర్మానించారు.

* అంతర్జాతీయ స్థాయిలో స్వాతంత్య్రం కోసం జరుగుతున్న విస్తృత పోరాటంలో భారత స్వాతంత్య్ర ఉద్యమం కేవలం ఒక భాగమే అని నెహ్రూ తన డిస్కవరీ ఆఫ్‌ ఇండియా గ్రంథంలో పేర్కొన్నారు.

లక్ష్యాలు

* ప్రపంచానికి పెనుముప్పుగా పరిణమించిన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజాన్ని ఏకం చేయడం.

* దేశ స్వయంప్రతిపత్తిని సంరక్షించుకుంటూ స్థిరమైన, దృఢమైన ప్రగతిశీల ప్రపంచ వ్యవస్థ ఏర్పాటుకు కృషిచేయడం.

* అంతర్జాతీయ వేదికలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేయడం.

* ఆర్థిక, రాజకీయ, సాంకేతిక, దౌత్యరంగాల్లో అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య సమన్వయాన్ని సాధించడం.

* అంతర్జాతీయంగా బహుముఖీకరణను సాధించి సార్వభౌమత్వం, తటస్థ వైఖరి సూత్రాలను గౌరవించడం.

* మన దేశానికి అవసరమైన చమురు, సహజవాయువును సరఫరా చేస్తున్న గల్ఫ్‌ దేశాలతో సంబంధాలను పటిష్ఠం చేసుకోవడం.

* ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సంస్కరించి తద్వారా ప్రపంచ దేశాల మధ్య సమతౌల్యతను పరిరక్షించే ప్రయత్నాలను కొనసాగించడం.

* ప్రపంచం నుంచి అణ్వాయుధాలను నిర్మూలించాలనే లక్ష్యాన్ని చేరుకునేందుకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రణాళికల అమలుకు కృషిచేయడం.

* వివిధ ప్రాంతీయ సంస్థల మధ్య సమన్వయానికి కృషి చేయడం.

* వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ప్రపంచ దేశాల మద్దతును సాధించడం.
 

ప్రపంచశాంతి: భారత రాజ్యాంగంలోని ఖిజువ భాగంలో పేర్కొన్న ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్‌ 51 ప్రకారం ప్రపంచశాంతి కోసం భారత్‌ కృషిచేస్తోంది. ప్రపంచ దేశాలతో గౌరవప్రదమైన, న్యాయమైన సంబంధాలను కొనసాగించడం, అంతర్జాతీయ న్యాయ సూత్రాలు, ఒప్పందాలను ఆచరించడం, అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం ద్వారా ప్రపంచశాంతి, అభివృద్ధి సాధ్యమవుతుందని విశ్వసిస్తోంది. అగ్రరాజ్యాల మధ్య యుద్ధం మొదలైతే మానవజాతి మనుగడ ప్రమాదంలో పడుతుందని భారత్‌ భావిస్తోంది.
 

పంచశీల 

భారతదేశ విదేశాంగ విధానంలో ‘పంచశీల’ అత్యంత కీలకమైంది. 1954లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, చైనా ప్రధాని చౌ-ఎన్‌లై మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఇందులోని అయిదు మౌలికాంశాలు:

1. రెండు దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాలను పరస్పరం గౌరవించుకోవాలి.

2. ఒకదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోకూడదు.

3. ఒకదేశంపై మరో దేశం దురాక్రమణకు పాల్పడరాదు.

4. సమానత్వం, పరస్పర ప్రయోజనాలను పరిరక్షించుకోవాలి.

5. శాంతియుత సహజీవనాన్ని అనుసరించాలి.

* అంతర్జాతీయ సంబంధాల్లో భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యున్నత కానుకగా ‘పంచశీల’ను పేర్కొంటారు.

ఐక్యరాజ్యసమితి పట్ల విశ్వాసం

రెండో ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచ శాంతి స్థాపన కోసం 1945, అక్టోబరు 24న ఐక్యరాజ్యసమితిని నెలకొల్పారు. దీని  స్థాపక దేశాల్లో భారతదేశం ఒకటి. ఐక్యరాజ్యసమితి ఆశయాలకు అనుగుణంగా భారతదేశ విదేశాంగ విధానం ఉంది. ప్రపంచదేశాల మధ్య శాంతి, పరస్పర సహకార భావనలను పెంపొదించేందుకు ఐక్యరాజ్యసమితి చేస్తున్న ప్రయత్నాలకు భారత్‌ పూర్తిస్థాయి మద్దతు అందిస్తోంది. కొరియా, కంబోడియా, వియత్నాం, లెబనాన్, పశ్చిమాసియా మొదలైన దేశాల సమస్యల పరిష్కారంలో భారత్‌ ఐక్యరాజ్యసమితికి అండగా నిలిచింది. ప్రపంచశాంతి, ప్రగతి సాధన కోసం ఐక్యరాజ్యసమితికి అవసరమైన సైనిక, ఆర్థిక, దౌత్యపరమైన సహకారాన్ని భారత్‌ అందిస్తోంది.

నిరాయుధీకరణ: ఆయుధ పోటీకి భారతదేశం దూరంగా ఉంటుంది. అణ్వస్త్రాల నిరాయుధీకరణకు అన్ని విధాలా కట్టుబడి ఉంది. అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని కేవలం శాంతియుత ప్రయోజనాలకు వినియోగించాలనేది భారత్‌ ఆకాంక్ష. యుద్ధ క్షిపణులు, అణ్వస్త్రాలు మోహరించడాన్ని, బాంబులు  వేయడాన్ని మనదేశం వ్యతిరేకిస్తుంది. అణ్వాయుధాలను కలిగి ఉన్నప్పటికీ ముందుగా తాను ప్రయోగించరాదనేది భారతదేశ విధానం. 1985లో న్యూదిల్లీలో ఆరు దేశాల శిఖరాగ్ర సదస్సును నిర్వహించి, అణ్వాయుధ నిరోధానికి మనదేశం నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది.

* అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందం (NPT) - 1968;  సమగ్ర అణ్వాయుధ పరీక్షల రద్దు ఒప్పందం (CTBT) - 1996 లపై సంతకాలు చేయకుండా అణ్వాయుధాలపై భారత్‌ తన వైఖరిని ప్రపంచానికి స్పష్టం చేసింది.

* ఆసియా దేశాలకు ప్రాధాన్యం: భారత్‌ తన చుట్టుపక్కల ఉన్న ఆసియా దేశాలతో సన్నిహిత, సహకార సంబంధాలను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తోంది.  న్యూదిల్లీలో  1947, 1949లో ఆసియా దేశాల శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి జవహర్‌లాల్‌ నెహ్రూ అధ్యక్షత వహించారు. ఇందులో అంతర్జాతీయ సంబంధాల నిర్వహణలో కీలక మలుపుల కోసం అనేక తీర్మానాలను ఆమోదించారు. ఇరుగు పొరుగు దేశాల్లో భారత్‌ ‘పెద్దన్న’గా పేరు తెచ్చుకుంది.

విశిష్టత: భారతదేశానికి సుమారు 3500 మైళ్ల మేర సరిహద్దు తీరప్రాంతం; 8200 మైళ్ల భూభాగ సరిహద్దు ప్రాంతం ఉన్నాయి. సుమారు 11,700 మైళ్ల సరిహద్దు భూభాగాన్ని నిత్యం జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన బాధ్యత భారతదేశంపై ఉంది.

* భారతదేశ ఉపఖండానికి ఉన్నట్లు ప్రపంచం లో మరే దేశానికి స్పష్టమైన సరిహద్దు రేఖలు లేవు. దేశ సరిహద్దు రేఖలను భౌగోళిక పరిస్థితులే నిర్దేశిస్తాయి.

* భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం, దక్షిణాన హిందూమహాసముద్రం, ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి. 

* మన దేశానికి పొరుగు దేశాలుగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఆప్ఘనిస్థాన్, మయన్మార్, చైనా, శ్రీలంక ఉన్నాయి.

* భారత్, పాకిస్థాన్‌ల మధ్య 1948, 1965, 1971, 1999 సంవత్సరాల్లో యుద్ధాలు జరిగాయి. భారత్, చైనాల మధ్య 1962లో చైనా దురాక్రమణ ఫలితంగా యుద్ధం జరిగింది. 

* ఇటీవల గాల్వన్‌లోయలో జరిగిన సంఘటనలు భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలను మరింత క్షీణింపజేశాయి. ఈ నేపథ్యంలో భారతదేశ విదేశాంగ విధానం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అలీన విధానం

1945 నాటికి అమెరికా అణ్వస్త్రదేశంగా అవతరించగా, 1949 నాటికి సోవియట్‌ రష్యా అణ్వాయుధాలను సమకూర్చుకుంది. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చే నాటికి ప్రపంచ దేశాలు సిద్ధాంత ప్రాతిపదికన రెండు కూటములుగా విడిపోయాయి. అమెరికా నాయకత్వంలోని పెట్టుబడిదారీ దేశాలు ఒక వర్గంగా, సోవియట్‌ రష్యా నాయకత్వంలోని కమ్యూనిస్ట్‌ దేశాలు మరో వర్గంగా ఏర్పడి ‘ప్రచ్ఛన్న యుద్ధానికి’ ్బద్నిః్ట జ్చూ౯్శ కారణమయ్యాయి. ఆ సమయంలో భారత్‌ ఏ వర్గంలోనూ చేరకుండా తన సొంత విదేశాంగ విధానమైన ‘అలీన విధానాన్ని’ అనుసరించింది.

* 1955లో ఇండోనేసియాలోని ‘బాండుంగ్‌’ లో జరిగిన ఆసియా-ఆఫ్రికా దేశాల సమావేశంలో ‘అలీన విధానం’ అనే భావన ఊపిరిపోసుకుంది. రెండో ప్రపంచయుద్ధం అనంతరం ఈ భావన మరింత ప్రాచుర్యం పొందింది. ఈ విధానాన్ని అంతర్జాతీయ సంబంధాలు విశేషంగా ప్రభావితం చేశాయి.

* అలీన విధాన రూపకల్పనలో జవహర్‌లాల్‌ నెహ్రూ (భారతదేశం), మార్షల్‌టిటో (యుగోస్లేవియా), డాక్టర్‌ సుకర్నో  (ఇండోనేసియా), నాజర్‌ (ఈజిప్ట్‌) కీలక పాత్ర పోషించారు.

* భారతదేశం అలీన విధానం ద్వారా అన్ని రకాల సైనిక కూటములను వ్యతిరేకించి,  ఎందులోనూ చేరదు.

ఏకధ్రువ ప్రపంచం - భారత్‌ వైఖరి

* 1991 కంటే ముందు ప్రపంచం ‘ద్విధ్రువ ప్రపంచం’గా కొనసాగింది. సోవియట్‌ యూనియన్‌ నేతృత్వంలో సోషలిస్ట్‌; అమెరికా సారథ్యంలో క్యాపిటలిస్ట్‌ ధ్రువాలు ఉండేవి.

* 1991లో సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నమై, సోషలిస్ట్‌ ధ్రువం అదృశ్యమైంది. దీంతో ప్రపంచ వేదికపై అమెరికా ఏకైక శక్తిగా అవతరించింది. అంతర్జాతీయ ఘటనలు, పరిణామాలపై అమెరికా ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని, అమలుచేస్తుండటంతో అంతర్జాతీయ సమాజం సమతౌల్యతను కోల్పోయింది.

* 1991లో ప్రచ్ఛన్నయుద్ధ శకం ముగియడం, భారత్‌లో నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం, పాకిస్థాన్‌ ఉగ్రవాద స్థావరాలకు నిలయంగా మారడం, చైనా ధిక్కార ధోరణి మొదలైన అంశాలు అమెరికా, భారత్‌ మధ్య సంబంధాలు బలపడేలా తోడ్పడ్డాయి. దీంతో 1995లో రెండు దేశాల మధ్య కీలక ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది.


గుజ్రాల్‌ డాక్ట్రిన్‌

* భారతదేశ విదేశాంగ విధానంలో గుజ్రాల్‌ డాక్ట్రిన్‌ (గుజ్రాల్‌ సిద్ధాంతం) కీలకమైంది. 1996లో హెచ్‌.డి.దేవెగౌడ ప్రభుత్వంలో  ఐ.కె.గుజ్రాల్‌ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఈయన రూపొందించి, ప్రతిపాదించిన విధానాన్నే ‘గుజ్రాల్‌ డాక్ట్రిన్‌’ అంటారు.

ముఖ్యాంశాలు: దక్షిణాసియాలో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్‌ తన చుట్టు పక్కల ఉన్న చిన్న దేశాలకు ఏకపక్ష రాయితీలను ప్రకటించాలి. పొరుగుదేశాలతో సానుకూల ధోరణితో వ్యవహరిస్తూ, వారి నుంచి తిరిగి ఆశించకూడదనే సూత్రం ఆధారంగా ఈ విధానాన్ని రూపొందించారు. 

* బంగ్లాదేశ్, నేపాల్, భూటన్, శ్రీలంక, మాల్దీవులు లాంటి పొరుగు దేశాలకు అన్నిరకాల సహకారాన్ని అందిస్తూ విశ్వసనీయతను పెంపొందించాలి.

* ఒక దేశం మరొక దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదు. 

* దక్షిణాసియా దేశాలన్నీ తమ వివాదాలను శాంతియుత, ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. 

* దక్షిణాసియా దేశాలు తమ దేశ భూభాగాన్ని వేరే దేశ ప్రయోజనాలకు అనుమతించకూడదు.

* దక్షిణాసియా దేశాలన్నీ తమ సార్వభౌమాధికారాలు, సమగ్రతలను పరస్పరం గౌరవించుకోవాలి.


భారత అణువిధానం

భారతదేశం 1974, మే 18న రాజస్థాన్‌లోని పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించడం ద్వారా అణ్వస్త్ర దేశంగా అవతరించింది. భారత్‌ తన అణ్వాయుధ సిద్ధాంతాన్ని 2003 నుంచి అమల్లోకి తెచ్చింది.

ముఖ్యాంశాలు: అణ్వాయుధాలు లేని దేశాలపై అణ్వాయుధాలు ప్రయోగించరాదు.

* అణ్వాయుధాలను ముందుగా ఏ దేశంపైనా ప్రయోగించరాదు.

* అణ్వాయుధ ప్రతిదాడులకు ఆదేశాలు పౌర రాజకీయ నాయకత్వం నుంచి మాత్రమే న్యూక్లియర్‌ కమాండ్‌ (అణ్వాయుధ నియంత్రణ వ్యవస్థ)కు అందాలి.

* భారత్‌పై ఏదైనా దేశం అణుదాడికి దిగితే జరిగే ప్రతిదాడి చెప్పలేనంత తీవ్రనష్టాన్ని కలిగించేలా ఉండాలి.

* ప్రపంచవ్యాప్తంగా తనిఖీలు, వివక్షకు తావులేని అణ్వాయుధాల నిరోధం ద్వారా అణ్వాయుధాలు లేని ప్రపంచమే లక్ష్యంగా కృషి చేయాలి.

* భారతదేశం, భారత దళాలపై క్రిమి లేదా రసాయన ఆయుధాలతో పెద్దఎత్తున దాడి జరిగిన సందర్భంలో ప్రతిదాడికి అణ్వాయుధాలను వినియోగించే వెసులుబాటు భారత్‌కు ఉంది.

* న్యూక్లియర్‌ కమాండ్‌ అథారిటీలో ఒక రాజకీయ మండలి, కార్యనిర్వాహక మండలి ఉంటాయి. రాజకీయ మండలికి ప్రధానమంత్రి అధ్యక్షులుగా ఉంటారు. దీనికే అణ్వాయుధాలను వినియోగించే నిర్ణయాధికారం ఉంటుంది. కార్యనిర్వాహక మండలికి జాతీయ భద్రతా సలహాదారు అధ్యక్షత వహిస్తారు.


లుక్‌ ఈస్ట్‌ పాలసీ

* ప్రపంచీకరణ నేపథ్యంలో పీవీ నరసింహా రావు ప్రభుత్వం నూతన ఆర్థిక సంస్కరణలు ప్రారంభించింది. దీంతో భారతదేశ విదేశాంగ విధానంలో 1992 నాటికి లుక్‌ ఈస్ట్‌ పాలసీని (ప్రాగ్దిశా వీక్షణ విధానం) ప్రవేశపెట్టారు. ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ఈ విధాన లక్ష్యం.

* 2003లో బాలిలో (ఇండోనేసియా) జరిగిన సమావేశాలకు అప్పటి భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హాజరయ్యారు. దీంతో ఆసియన్‌ దేశాలతో భారత్‌ సంబంధాలు మరింత దృఢమయ్యాయి.

* ‘ఆసియాన్‌ స్నేహ సహకార ఒడంబడిక’లోకి భారత్‌ను అనుమతించారు. 2011 నాటికి ఆసియాన్‌ దేశాలు, ఇండియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదిరింది.

* 1992లో ఆసియాన్‌లో పాక్షిక డైలాగ్‌ పార్టనర్‌గా భారత్‌ చేరింది. 1995లో పూర్తిస్థాయి డైలాగ్‌ పార్టనర్‌ హోదా లభించింది. ఇది లుక్‌ ఈస్ట్‌ విధానం విజయాన్ని సూచిస్తుంది.

* బంగాళాఖాత తీరప్రాంత దేశాల మధ్య సహకారం సాధించే లక్ష్యంతో ‘బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ ఆర్థిక సహకార వ్యవస్థను (BIST-EC) ఏర్పాటు చేయాలని 1994లో థాయ్‌లాండ్‌ ప్రతిపాదించింది. దీని ఫలితంగా 1997, జూన్‌ 6న ‘BIST-EC’  ఆవిర్భవించింది. 1997లో దీనిలో మయన్మార్‌ కూడా చేరడంతో ఇది ‘BIMST-EC’ గా మారింది. 
 

BIMST-EC పేరు మార్పు 

* నేపాల్, భూటాన్‌ దేశాలు కూడా  BIMST-EC లో చేరాయి. దీంతో సభ్యదేశాల సంఖ్య 7కు చేరింది. BIMST-EC పేరును ‘బంగాళాఖాత తీర దేశాల బహుళార్థక సాంకేతిక ఆర్థిక సహకార వ్యవస్థ’ (Bay of Bengal Initiative for Multi Sectoral Technical and Economic Cooperation-BIMSTEC)గా మార్చారు. 

* దీన్ని 2004 జులైలో జరిగిన బ్యాంకాక్‌ శిఖరాగ్ర సదస్సు ఆమోదించింది.


బ్యాంకాక్‌ శిఖరాగ్ర సదస్సు 

ముఖ్యాంశాలు: ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటు. 

* తమ భూభాగాన్ని స్థావరంగా చేసుకొని మిత్రదేశాలపై ఉగ్రవాదులు దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలి.

* అంతర్జాతీయ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలి.

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌