• facebook
  • whatsapp
  • telegram

భారత పార్లమెంట్ - లోక్‌సభ

కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత శాసన నిర్మాణ సంస్థ భారత పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ (79వ అధికరణ) అంటారు. రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి వివరిస్తాయి.

  పార్లమెంట్‌లోని దిగువ సభను లోక్‌సభ House of the People అంటారు. ఇందులో రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 552 మంది ఉండవచ్చు. 550 మందిని జనాభా ఆధారంగా విభజించిన ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు 543 మంది, ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఆ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుతం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 80 మందికి, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన జాతీయ రాజధాని దిల్లీకి ఏడుగురు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి నియమించిన ప్రోటెం స్పీకర్ (Pro Tem Speaker) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంప్రదాయం ప్రకారం సభలో అత్యధిక అనుభవం ఉన్న సీనియర్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రోటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ 10 మంది సభ్యులతో ప్యానల్ స్పీకర్ల జాబితాను రూపొందిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకపోతే సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించుకుంటారు.

* ప్రధానమంత్రి లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే ఆయన రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తూ, లోక్‌సభలో సభ్యత్వం ఉన్న తన మంత్రివర్గ సహచరుడిని లోక్‌సభ నాయకుడిగా నియమిస్తారు.

* ప్రస్తుత లోక్‌సభలో (16వ లోక్‌సభ) 38 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కనీసం 10 శాతం స్థానాలు పొందలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను పొందలేకపోయాయి. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే.

* లోక్‌సభలోని సభ్యులు ఎన్నుకున్న స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ఉపసభాపతి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా, యం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.

* లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు రాయాల్సి ఉంటుంది. స్పీకర్ సంతృప్తి మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

* స్పీకర్ అనుమతి లేకుండా సభ సమావేశాలకు 60 రోజులు గైర్హాజరు అయితే వారి సభ్యత్వం రద్దవుతుంది.

నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ: 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత పార్లమెంట్ నియమించే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజక వర్గాల సంఖ్యను పెంచడం లేదా ప్రాదేశిక సరిహద్దులను మార్చడం, షెడ్యూల్డ్ కులాలు, తెగల నియోజకవర్గాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47, మొత్తం 131 (24.03%) స్థానాలను రిజర్వు చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 82 ప్రకారం ప్రతి పది సంవత్సరాలకోసారి జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. అనంతరం ప్రభుత్వం డీలిమిటేషన్‌ కమిటీ (నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ)ని ఏర్పాటు చేస్తుంది. ఈ కమిటీ సూచనలను అనుసరించి పార్లమెంట్‌ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను నిర్దేశిస్తుంది. ఇప్పటివరకు మన దేశంలో నాలుగు నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీలను ఏర్పాటు చేశారు.

* 1950లో మొదటి నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ కమిటీ సిఫార్సు ఆధారంగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 489గా నిర్ణయించారు. 

* 1962లో రెండో డీలిమిటేషన్‌ కమిటీ సిఫార్సుల మేరకు నిర్ణయించిన లోక్‌సభ సభ్యుల సంఖ్య - 525

* 1972లో మూడో డీలిమిటేషన్‌ కమిటీ సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ సభ్యుల సంఖ్యను 550 + 2 గా  (31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా)  నిర్ణయించారు.

* 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని స్థానాల సంఖ్యను 2000 సంవత్సరం వరకు మార్చకూడదని ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్ణయించింది.

* 2001లో 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని  స్థానాల సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం నిర్ణయించింది.

* ప్రస్తుతం మనదేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో స్థానాల రిజర్వేషన్లు  కొనసాగించేందుకు ఇప్పటివరకు ఏడు రాజ్యాంగ సవరణ చట్టాలను రూపొందించారు.

 

రాజ్యాంగ సవరణ చట్టం

ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ల పొడిగింపు కాలం

8వ రాజ్యాంగ సవరణ చట్టం - 1960 1960 నుంచి 1970 వరకు
23వ రాజ్యాంగ సవరణ చట్టం - 1970 1970 నుంచి 1980 వరకు
45వ రాజ్యాంగ సవరణ చట్టం - 1980 1980 నుంచి 1990 వరకు
62వ రాజ్యాంగ సవరణ  చట్టం - 1989 1990 నుంచి 2000 వరకు
79వ రాజ్యాంగ సవరణ చట్టం - 2000 2000 నుంచి 2010 వరకు
95వ రాజ్యాంగ సవరణ చట్టం - 2010 2010 నుంచి 2020 వరకు
104వ రాజ్యాంగ సవరణ చట్టం - 2020 2020 నుంచి 2030 వరకు

* చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ల పొడిగింపునకు ఉద్దేశించిన 126వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇది 104వ రాజ్యాంగ సవరణ చట్టం - 2020గా అమల్లోకి వచ్చింది.

4వ డీలిమిటేషన్‌ కమిటీ (2002)

* నాలుగో డీలిమిటేషన్‌ కమిటీని 2002లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ కుల్‌దీప్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సిఫార్సుల మేరకు 2003లో 87వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పలు అంశాలను నిర్దేశించారు. అవి

* షెడ్యూల్డ్‌ కులాలు, తెగల జనాభాలో వచ్చిన మార్పులను అనుసరించి జనాభా పెరుగుదలకు అనుగుణంగా రిజర్వ్‌ చేసిన స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయడం.

* 2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య ఆధారంగా భౌగోళికంగా లోక్‌సభ, శాసనసభల నియోజకవర్గాలను పునర్‌వ్యవస్థీకరించడం.

* దీని ప్రకారం లోక్‌సభలో ఎస్సీ వర్గాలకు రిజర్వ్‌ చేసిన స్థానాల సంఖ్య 79 నుంచి 84కు పెరగ్గా, ఎస్టీ వర్గాలకు రిజర్వ్‌ చేసిన స్థానాలు 41 నుంచి 47కు చేరాయి.

ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్లు

ఆర్టికల్‌ 330 ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఆయా వర్గాల జనాభా ఆధారంగా కొన్ని నియోజకవర్గ స్థానాలను రిజర్వ్‌ చేశారు. 

* ఈ రిజర్వేషన్‌ సదుపాయం ప్రారంభంలో 10 సంవత్సరాల వరకే ఉండేది.

* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 4

అవి: 1. అమలాపురం 2. బాపట్ల  3. చిత్తూరు 4. తిరుపతి

* తెలంగాణలో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 3

అవి: 1. పెద్దపల్లి   2. నాగర్‌కర్నూల్‌   3. వరంగల్‌

* ఆంధ్రప్రదేశ్‌లో ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 1 (అరకు)

* తెలంగాణలో ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానాలు - 2

1. ఆదిలాబాద్‌  2. మహబూబాబాద్‌

* మనదేశంలో వైశాల్యం పరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం - లద్దాఖ్‌ 

* మనదేశంలో వైశాల్యం రీత్యా అతిచిన్న లోక్‌సభ నియోజకవర్గం - చాందినీచౌక్‌ (దిల్లీ)

* మనదేశంలో ఓటర్లపరంగా అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం - మల్కాజ్‌గిరి (తెలంగాణ)

* ఓటర్ల రీత్యా మనదేశంలో అతిచిన్న లోక్‌సభ నియోజకవర్గం - లక్షద్వీప్‌

* ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి లోక్‌సభకు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్‌ చేస్తారు. ఈ విధానాన్ని ప్రారంభంలో 1960 వరకే నిర్దేశించారు. దీన్ని పార్లమెంట్‌ ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చట్టం ద్వారా పొడిగిస్తుంది.

* 2009లో 109వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్‌ చేసే విధానాన్ని 2020 వరకు పొడిగించారు.

లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. ఉదా: 4వ లోక్‌సభ పదవీకాలం పూర్తవకుండానే 1971లో రద్దుచేసి, అదే ఏడాది లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలను నిర్వహించారు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు. ఉదా: 1976లో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండటం వల్ల ఇందిరాగాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 5వ లోక్‌సభ పదవీకాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు పొడిగించింది. మనదేశంలో 5వ లోక్‌సభ 1971 నుంచి 1977 వరకు అత్యధికంగా 5 సంవత్సరాల 10 నెలల 6 రోజులు కొనసాగింది. మనదేశంలో 12వ లోక్‌సభ అత్యల్పంగా 1998 నుంచి 1999 వరకు కేవలం 13 నెలల 4 రోజులు కొనసాగింది. అందుకే లోక్‌సభను ‘అనిశ్చిత సభ’గా పేర్కొంటారు.

లోక్‌సభ స్పీకర్

భారతదేశ ప్రజాస్వామ్యానికి ‘లోక్‌సభ’ను మూలస్తంభంగా పరిగణిస్తారు. నియోజకవర్గాల ప్రాతిపదికన, సార్వజనీన వయోజన ఓటు  ద్వారా లోక్‌సభ సభ్యులు ఎన్నికవుతారు. వీరు దేశ ప్రజల సంక్షేమానికి అవసరమైన శాసనాల రూపకల్పనలో కీలకపాత్ర పోషిస్తారు. లోక్‌సభను భారతజాతికి ప్రతిబింబంగా పేర్కొంటారు. రాజ్యాంగంలో 93 నుంచి 97 వరకు ఉన్న అధికరణలు స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. లోక్‌సభకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1921 వరకు కేంద్ర శాసన మండలికి గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించేవారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ప్రెసిడెంట్ (స్పీకర్), డిప్యూటీ ప్రెసిడెంట్ (డిప్యూటీ స్పీకర్) పదవులను ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఫ్రెడరిక్ వైట్ ప్రెసిడెంట్‌గా, సచ్చిదానంద సిన్హా (వైస్ ప్రెసిడెంట్)డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కేంద్రశాసన మండలికి విఠల్‌భాయ్ జె. పటేల్ మొదటిసారిగా ఎన్నికైన ప్రెసిడెంట్ (స్పీకర్). 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చాయి.

అర్హతలు, షరతులు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 84 ప్రకారం లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేసే వ్యక్తికి కింది అర్హతలుండాలి.

* భారతీయ పౌరుడై ఉండాలి. 

* 25 ఏళ్లు నిండి ఉండాలి. 

* భారత ఎన్నికల సంఘం ద్వారా నియమితుడైన వ్యక్తి ఎదుట మూడో షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ప్రమాణం చేయాలి.

భారత ప్రజాప్రాతినిధ్య చట్టం - 1950, 1951లో పేర్కొన్న ఇతర అంశాలు

* దేశంలో ఏదైనా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.

* 25% ప్రభుత్వ పెట్టుబడులు ఉన్న కంపెనీలో డైరెక్టర్‌ స్థాయి పదవిలో ఉండరాదు.

* కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల్లో ఆదాయాన్నిచ్చే ఉద్యోగంలో ఉండకూడదు.

* ఎన్నికల వ్యయ పరిమితి రూ.70 లక్షలు మించరాదు.

* ఎన్నికల నామినేషన్‌ పత్రంతో పాటు సాధారణ అభ్యర్థులు రూ. 25,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్‌గా చెల్లించాలి.

* 1976 నాటి పౌరహక్కుల పరిరక్షణ చట్టం, 1989 నాటి షెడ్యూల్డ్‌ కులాలు, తెగల అకృత్యాల నిరోధక చట్టం ప్రకారం శిక్షార్హులై ఉండకూడదు. 

* దివాలాకోరై ఉండరాదు.    

* 2002లో సవరించిన ‘భారత ప్రజాప్రాతినిధ్య చట్టం’ ప్రకారం నామినేషన్‌ పత్రంతో పాటు వ్యక్తిగత వివరాలతో కూడిన అఫిడవిట్‌ను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించాలి.

* భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడం ద్వారా లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థుల అర్హతలో మార్పులు, చేర్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. భారత పార్లమెంట్‌ ఎన్నికల నియమాలను 1950, 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాల్లో పేర్కొంది. 1961లో ‘ఎన్నికల నిర్వహణ చట్టాన్ని’ రూపొందించింది.

* భారత మౌలిక రాజ్యాంగంలో వయోజన ఓటు హక్కు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాలుగా నిర్దేశించారు. రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో పార్లమెంట్‌ 61వ రాజ్యాంగ సవరణ చట్టం(988) ద్వారా వయోజన ఓటుహక్కు కనీస వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 సార్వజనీన వయోజన ఓటు హక్కు గురించి వివరిస్తుంది.

లోక్‌సభ సభ్యుల ఎన్నిక: లోక్‌సభ సభ్యులు ఓటర్ల ద్వారా నేరుగా నియోజకవర్గాలు, సార్వజనీన వయోజన ఓటు ప్రాతిపదికన ఎన్నికవుతారు. దీన్నే "First past the post" అంటారు.

ప్రమాణ స్వీకారం: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 99 లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం గురించి వివరిస్తుంది. దీని ప్రకారం రాష్ట్రపతి లేదా ఆ స్థానంలో నియమించిన వ్యక్తి సమక్షంలో 3వ షెడ్యూల్‌లో ప్రస్తావించిన విధంగా లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 

పదవీ ప్రమాణ స్వీకారం చేయకుండా సభా కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తికి రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.

ప్రొటెం స్పీకర్‌ 

సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సభ్యుల్లో అందరికంటే సీనియర్‌ వ్యక్తిని రాష్ట్రపతి ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తారు. ఈ పదవిని ఫ్రాన్స్‌ రాజ్యాంగం నుంచి గ్రహించారు. లోక్‌సభ నూతన స్పీకర్‌ ఎన్నిక జరిగే వరకు ప్రొటెం స్పీకరే సభా అధ్యక్షులుగా కొనసాగుతారు.

* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు జి.వి.మౌలాంకర్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు.

* 2019లో ఏర్పడిన 17వ లోక్‌సభకు వీరేంద్రకుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా ఉన్నారు.

* బి.డి.దాస్, ఇంద్రజిత్‌ గుప్తా నాలుగుసార్లు ప్రొటెం స్పీకర్‌ పదవిని నిర్వహించారు.

* ప్రొటెం స్పీకర్‌గా పనిచేసే వ్యక్తి స్పీకర్‌ పదవికి పోటీ చేయాలంటే తన ప్రొటెం స్పీకర్‌ పదవికి రాజీనామా చేయాలి.

స్పీకర్‌

* మాంటేగ్‌ చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919 ప్రకారం 1921లో కేంద్ర శాసనసభకు ‘అధ్యక్ష’ ్బశి౯’(i్ట’-్మ్శ పదవిని తొలిసారి ఏర్పాటు చేశారు. గవర్నర్‌ జనరల్‌ 4 సంవత్సరాల పదవీ కాలానికి అధ్యక్షుడ్ని నియమించేవారు. 1921లో కేంద్ర శాసనసభకు మొదటి అధ్యక్షుడిగా సర్‌ ఫ్రెడరిక్‌ వైట్‌ నియమితులయ్యారు.

* 1925లో కేంద్ర శాసనసభ తన అధ్యక్షుడిని తానే ఎన్నుకోవడం ప్రారంభించింది. ఇలా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు విఠల్‌భాయ్‌ పటేల్‌.

* భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కేంద్ర శాసనసభ అధ్యక్షుడు అనే పదాన్ని ‘స్పీకర్‌’గా మార్చారు.

* మనదేశ లోక్‌సభ స్పీకర్‌ పదవి బ్రిటిష్‌ కామన్స్‌ సభ స్పీకర్‌ను పోలి ఉంటుంది. మన రాజ్యాంగ నిర్మాతలు స్పీకర్‌ పదవిని బ్రిటన్‌ నుంచి గ్రహించారు.


 

రాజ్యాంగ వివరణ

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 93 నుంచి 97 వరకు ఉన్న 5 ఆర్టికల్స్‌లో లోక్‌సభ స్పీకర్‌  గురించి వివరించారు.

* ఆర్టికల్‌ 93 ప్రకారం లోక్‌సభ సభ్యులు సభా కార్యకలాపాల నిర్వహణకు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.

* 1952లో ఏర్పడిన మొదటి లోక్‌సభకు స్పీకర్‌గా జి.వి.మౌలాంకర్, డిప్యూటీ స్పీకర్‌గా అనంతశయనం అయ్యంగార్‌ ఎన్నికయ్యారు.

* 1967 నుంచి డిప్యూటీ స్పీకర్‌ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించే పద్ధతిని మనదేశంలో ప్రవేశపెట్టారు.

* స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు సమర్పించాలి. డిప్యూటీ స్పీకర్, లోక్‌సభ సభ్యులు తమ రాజీనామాలను లోక్‌సభ స్పీకర్‌కు సమర్పించాలి.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ పదవులకు ప్రత్యేక ప్రమాణ స్వీకారం ఉండదు.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతే, వారి పదవులు కూడా రద్దవుతాయి.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల తొలగింపు ప్రక్రియ

* రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 94 లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల తొలగింపు విధానాన్ని తెలుపుతుంది. లోక్‌సభ సభ్యుల సాధారణ తీర్మానం ద్వారా 14 రోజుల ముందస్తు నోటీసుతో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.

* ఆర్టికల్‌ 95 ప్రకారం స్పీకర్‌ పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఆ విధులను డిప్యూటీ స్పీకర్‌ నిర్వహిస్తారు.

* ఆర్టికల్‌ 96 ప్రకారం స్పీకర్‌/ డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ఎవరిపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెడతారో వారు సభకు అధ్యక్షత వహించకూడదు.

* ఆర్టికల్‌ 97 ప్రకారం లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ వేతనాలను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.

* ఆర్టికల్‌ 98 ప్రకారం లోక్‌సభ కార్యకలాపాల నియంత్రణ, నిర్వహణకు లోక్‌సభ సచివాలయం ఉంటుంది. దీనికి సెక్రటరీ జనరల్‌ కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తారు.

* మొదటి లోక్‌సభ సెక్రటరీ జనరల్‌-  ఎం.ఎన్‌.కౌల్‌. 17వ లోక్‌సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్‌ - ఉత్పల్‌ కుమార్‌ సింగ్‌ ్బ2020, నవంబరు 30 నుంచ్శి లోక్‌సభ సచివాలయం స్పీకర్‌ నియంత్రణలో ఉంటుంది. 

అధికారాలు, విధులు

* స్పీకర్‌ లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు.

* లోక్‌సభలో ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా స్పీకర్‌ అనుమతి తప్పనిసరి. సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేస్తారు.

* సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అనే విషయాన్ని ధ్రువీకరిస్తారు.

* లోక్‌సభలో ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ జరిగినప్పుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు స్పీకర్‌ తన ‘నిర్ణాయక ఓటు’ (Casting vote)ను వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్దేశిస్తారు.

* పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

* స్పీకర్‌ భారత అధికార హోదాలో ఏడో స్థానాన్ని కలిగి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమాన గౌరవ హోదాను పొందుతారు.

* పార్లమెంట్‌ నుంచి ఏర్పడే సభా వ్యవహారాలు, నియమ నిబంధనలు, సాధారణ అవసరాల కమిటీలకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

* పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించే లోక్‌సభ సభ్యుల అనర్హతలను ప్రకటిస్తారు.

* పార్లమెంట్, రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి రాజీనామాను అధికారికంగా ప్రకటిస్తారు. 

* హోదా రీత్యా ఇండియన్‌ పార్లమెంటరీ గ్రూప్‌నకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.

* లోక్‌సభ సమావేశాలను తేదీ/ సమయం చెప్పి తాత్కాలిక (Adjoum) తేదీ/ సమయం చెప్పకుండా అర్ధాంతరంగా (Sine die) వాయిదా వేస్తారు.

* సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ప్రశ్నలు, సభా సమావేశాల నిర్వహణకు అవసరమైన ‘కోరం’ నిర్ణయం మొదలైన అంశాలపై నియంత్రణ కలిగి ఉంటారు.

* లోక్‌సభలో జరిగిన చర్చల వివరాలకు సభా రికార్డుల్లో చోటు కల్పించే లేదా తొలగించే అంశంపై విచక్షణాధికారాన్ని కలిగి ఉంటారు.

* స్పీకర్‌ అనుమతి లేకుండా లోక్‌సభ సభ్యులను అరెస్ట్‌ చేయకూడదు. 

* లోక్‌సభలో 1/10వ వంతు స్థానాలు గెలిచిన ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాను ధ్రువీకరిస్తారు.

* ప్యానల్‌ స్పీకర్లను నియమిస్తారు. వీరి సంఖ్య 1 నుంచి 6 మధ్య ఉంటుంది.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రాతినిధ్యం

* లోక్‌సభలో గరిష్ఠంగా 552 మంది సభ్యులు ఉండొచ్చు. ప్రస్తుతం 545 మంది సభ్యులకు అవకాశం కల్పిస్తున్నారు.

* ఆర్టికల్‌ 81 (1a) ప్రకారం రాష్ట్రాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య  530

* ఆర్టికల్‌ 81 (1b) ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించేవారి సంఖ్య - 20

* ఆర్టికల్‌ 331 ప్రకారం రాష్ట్రపతి ఇద్దరు   ఆంగ్లో ఇండియన్లను లోక్‌సభకు నామినేట్‌ చేస్తారు.

ప్రస్తుతం లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలు

1. ఉత్తర్‌ప్రదేశ్‌ 80
2. మహారాష్ట్ర 48
3. పశ్చిమ్‌ బెంగాల్‌ 42
4. బిహార్‌ 40
5. తమిళనాడు 39
6. మధ్యప్రదేశ్‌ 29
7. కర్ణాటక 28
8. గుజరాత్‌ 26
9. ఆంధ్రప్రదేశ్‌ 25
10. రాజస్థాన్‌ 25
11. ఒడిశా 21
12. కేరళ 20
13. తెలంగాణ 17
14. అసోం 14
15. ఝార్ఖండ్‌ 14
16. పంజాబ్‌ 13
17. చత్తీస్‌గఢ్ 11
18. హరియాణా 10
19. ఉత్తరాఖండ్‌ 5
20. హిమాచల్‌ ప్రదేశ్‌    4
21. త్రిపుర 2
22. మేఘాలయ 2
23. మణిపూర్‌ 2
24. అరుణాచల్‌ప్రదేశ్‌ 2
25. గోవా 2
26. మిజోరం 1
27. సిక్కిం‌ 1
28. నాగాలాండ్ 1
మొత్తం స్థానాలు 524

 

 
కేంద్రపాలిత ప్రాంతాల నుంచి
1. దిల్లీ 7
2. జమ్మూకశ్మీర్‌ 5
3. దాద్రానగర్‌ హవేలి, డామన్‌ డయ్యూ 2
4. పాండిచ్చేరి 1
5. అండమాన్‌ నికోబార్‌ 1
6. చండీఘర్‌ 1
7. లక్షద్వీప్‌ 1
8. లద్దాఖ్‌    1 1
మొత్తం స్థానాలు 19
Posted Date : 26-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌