• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు - ప్రాథమిక విధులు - కేంద్రం - సమాఖ్య వ్యవస్థలు

 * రాజ్యం ద్వారా గుర్తింపు పొంది, చట్టబద్దత కలిగి, విశ్వజనీన స్వభావం ఉన్న సదుపాయాలను హక్కులు అంటారు.

* మానవుడు సంపూర్ణంగా అభివృద్ధి సాధించడానికి కావాల్సిన కనీస సదుపాయాలను ప్రాథమిక హక్కులు అని పేర్కొంటారు.

* ''భారత ప్రజాస్వామ్యానికి పునాదిరాళ్లు ప్రాథమిక హక్కులు" అని నానీఫాల్కీ వాలా పేర్కొన్నారు.

* ''ప్రభుత్వం యొక్క గొప్పదనం అది ప్రజలకు కల్పించే హక్కులపై ఆధారపడి ఉంటుంది" అని హెచ్.జె.లాస్కి పేర్కొన్నారు.

* హక్కులు అనేవి ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులను విధిస్తాయి. వ్యక్తి తన శక్తి, తెలివితేటల ఆధారంగా తన ఔన్నత్యానికి, సంపూర్ణ వికాసం పొందడానికి దోహదపడే పరిస్థితులనే హక్కులుగా చెప్పవచ్చు.

* ప్రాథమిక హక్కుల లక్ష్యం రక్షణ, పౌర సమానత్వం, న్యాయాన్ని అందరికీ సమాన పరిస్థితుల్లో కల్పించడానికి అవసరమైన భౌతిక, నైతిక స్వచ్ఛతను పెంపొందించడం.

హక్కుల చరిత్ర:

మాగ్నాకార్టా (1215)

    ఇంగ్లండ్ రాజు కింగ్ జాన్ ఎడ్వర్డ్ క్రీ.శ.1215లో ప్రజలకు మొదటిసారిగా కొన్ని హక్కులను గుర్తిస్తూ ఒక ప్రమాణ ప్రకటనను జారీచేశాడు. దీన్నే మాగ్నాకార్టా అంటారు. లాటిన్ భాషలో మాగ్నా అంటే పెద్దది. కార్టా అంటే ఒప్పందం అని అర్థం. ఈ ప్రకటనను హక్కులకు మూలంగా భావిస్తారు.

* మహావిప్లవం తర్వాత 1689లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన హక్కుల ప్రకటన ప్రజల రాజకీయ హక్కులను, పౌరుల హక్కులను గుర్తించింది.

బిల్ ఆఫ్ రైట్స్: 1789

     అమెరికా మౌలిక రాజ్యాంగంలో హక్కుల ప్రస్తావన లేదు. ఆ తర్వాత 10 రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించి, అందులో భాగంగా బిల్ ఆఫ్ రైట్స్ పేరుతో ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు. వీటిని అమెరికా రాజ్యాంగ సభ 1791, డిసెంబరు 15న ధ్రువీకరించింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో జన్మించిన మానవులు జీవితాంతం వాటితోనే కొనసాగుతారని 1776 నాటి అమెరికా స్వాతంత్య్ర ప్రకటన సందర్భంగా, థామస్ జఫర్‌సన్ పేర్కొన్న అంశం ఆధారంగా దీన్ని చరిత్రలో మైలు రాయి (బిల్ ఆఫ్ రైట్స్)గా పేర్కొన్నారు. జేమ్స్ మాడిసన్ అమెరికా రాజ్యాంగ పితామహుడు. ఇతడే 'బిల్ ఆఫ్ రైట్స్' రూపకర్త.

ఫ్రెంచి హక్కుల ప్రకటన: 1789

    1789లో ఫ్రెంచి జాతీయ సభ చేసిన మానవ హక్కుల ప్రకటన, తద్వారా ఇచ్చిన నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు ప్రపంచ రాజ్యాంగాలన్నింటినీ ప్రభావితం చేశాయి.

రష్యా విప్లవం: 1917

    రష్యాలో బోల్ష్‌విక్ విప్లవం తర్వాత కొత్త రాజ్యాంగంలో సామాజిక, రాజకీయ హక్కులను ప్రకటించారు. ఇవి అనేక రాజ్యాంగాలకు దిక్సూచిలా నిలిచాయి.

UNO విశ్వమానవ హక్కుల ప్రకటన: 1948

      ఐక్యరాజ్యసమితి (UNO) 1948, డిసెంబరు 10న విశ్వమానవ హక్కుల ప్రకటనను జారీ చేసింది. దీని ప్రకారం ప్రపంచ పౌరులందరికీ గుర్తింపునిచ్చి, సమాన హక్కులు కలగజేయడం ద్వారా ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతి భావనలకు పునాది వేయవచ్చని పేర్కొంది. వ్యక్తులందరూ స్వేచ్ఛతో జన్మించారని, వారికి సమాన హక్కులు, గుర్తింపు ఉన్నాయని UNO ప్రకటన తెలియజేస్తుంది. ఈ హక్కుల్లో కేవలం పౌర, రాజకీయ హక్కులే కాకుండా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులతోపాటు పనిచేసే హక్కు, విద్యార్జన చేసే హక్కులు కూడా ఉన్నాయి.

ప్రాథమిక హక్కుల లక్షణాలు

* ప్రాథమిక హక్కులు రాజ్యాంగ ఆమోదం పొందాయి.

* వీటిని ఏ పౌరుడూ వదులుకోవడానికి వీల్లేదు.

* ప్రాథమిక హక్కులకు న్యాయ సంరక్షణ ఉంది. వీటి రక్షణ కోసం ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు రిట్లు జారీ చేస్తాయి.

* ప్రవేశికలో పేర్కొన్న స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే ఆదర్శాలకు విస్తృత రూపమే ప్రాథమిక హక్కులు.

* కొన్ని ప్రాథమిక హక్కులు పౌరులతోపాటు విదేశీయులకు కూడా వర్తిస్తాయి.

* ప్రాథమిక హక్కులు ప్రభుత్వ నిరపేక్ష అధికారాలపై పరిమితులు విధిస్తాయి.

* ప్రాథమిక హక్కులను రాజ్యాంగ బద్ధంగా, వాటి స్ఫూర్తికి భంగం కలగని రీతిలో తగ్గించవచ్చు లేదా వాటిపై పరిమితులు విధించవచ్చు.

* ఈ హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంది.

* కొన్ని ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి (Positive). ఇవి ప్రభుత్వ బాధ్యతలను తెలియజేస్తాయి.

ఉదా: ఆర్టికల్ 17 - అస్పృశ్యతా నిషేధం, ఆర్టికల్ 24 - బాలకార్మిక వ్యవస్థ నిషేధం.

* ప్రాథమిక హక్కులన్నీ స్వతహాగా అమల్లోకి వస్తాయి. కానీ ఆర్టికల్స్ 17, 23, 24లలో ప్రస్తావించిన అంశాలు స్వతహాగా అమల్లోకి రావు. వాటి అమలు కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాల చేయాల్సి ఉంటుంది.

* ప్రాథమిక హక్కుల్లో పేర్కొన్న నిషేధాలు, వివక్షలు ప్రభుత్వాలకు, పౌరులకు సమానంగా వర్తిస్తాయి.

ఉదా: కుల, మత, జాతి, లింగ, జన్మ సంబంధమైన వివక్షలను ఎవరూ పాటించరాదు.

* ప్రాథమిక హక్కులను అతిక్రమించడం నేరం.

* కొన్ని హక్కులను అల్పసంఖ్యాక వర్గాల ప్రయోజనాలను కాపాడి, జాతీయ సమగ్రతను నిలపడానికి ఉద్దేశించారు.

ఉదా: మతస్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు.

* ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 20, 21 మినహా ఇతర ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చు.

   ''ప్రాథమిక హక్కులు ప్రభుత్వాలు రూపొందించే ఇతర సాధారణ చట్టాల కంటే సర్వోన్నతమైనవి. అవి ప్రభుత్వ అధికారానికి పరిమితులను విధించడంతోపాటు, శాసనసభల మెజార్టీ నియంతృత్వాన్ని అరికట్టి వ్యక్తికి రక్షణ కల్పిస్తాయి. ప్రాథమిక హక్కులనేవి ప్రజాస్వామ్యానికి రక్షక కవచం లాంటివి".

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి - పతంజలిశాస్త్రి

ప్రాథమిక హక్కులన్నీ చట్టబద్ధమైన హక్కులే, కానీ చట్టబద్ధమైన హక్కులన్నీ ప్రాథమిక హక్కులు కావు.

మనదేశంలో ప్రాథమిక హక్కుల అభివృద్ధి క్రమం

* 1895లో బాల గంగాధర్ తిలక్ స్వరాజ్ అనే బిల్లును ప్రతిపాదించి భారతీయులకు వాక్ స్వాతంత్య్రాన్ని కల్పించాలని, ప్రజల ఇళ్లకూ, ఆస్తికి రక్షణ కల్పించి తీరాలని మొదటిసారిగా డిమాండ్ చేశారు.

* 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో హక్కులపై తీర్మానాన్ని ఆమోదించారు.

* 1918లో బొంబాయిలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం బ్రిటిష్ పౌరులకు ఉన్నట్లే భారతీయ ప్రజలకూ హక్కులుండాలని కోరింది.

* 1922లో యంగ్ ఇండియా పత్రికలో ప్రజల హక్కుల గురించి గాంధీజీ ప్రస్తావించారు.

* 1925లో అనిబిసెంట్ కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనే బిల్లును ప్రతిపాదించి ఐరిష్ ప్రజలకు ప్రసాదించిన హక్కుల లాంటివే భారతీయులకు కూడా ఇవ్వాలని కోరారు.

* 1927లో మద్రాస్‌లో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన 'భారత జాతీయ కాంగ్రెస్' సమావేశంలో ఒక తీర్మానం ఆమోదిస్తూ భవిష్యత్తులో భారతీయుల కోసం రూపొందించబోయే రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులు ప్రాతిపదిక కావాలని పేర్కొన్నారు.

* 1928లో మోతీలాల్ నెహ్రూ కమిటీ తన నివేదికలో భారత్‌లో ప్రవేశపెట్టే చట్టాలన్నింటిలో కూడా ప్రాథమిక హక్కులను చేర్చాలని, అన్ని వర్గాల ప్రజల ప్రయోజనాలను సంరక్షించే విధంగా హక్కులు ఉండాలని పేర్కొంది.

* 1931లో కరాచీలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం భారతీయులకు ప్రాథమిక హక్కులు, ఆర్థిక విధానంపై తీర్మానాన్ని ఆమోదించింది.

* 1931లో లండన్‌లో జరిగిన రెండో రౌండ్‌టేబుల్ సమావేశంలో మహాత్మాగాంధీ ప్రాథమిక హక్కులను డిమాండ్ చేశారు. ఆనాటి బ్రిటన్ ప్రధాని రాంసే మెక్‌డొనాల్డ్ భారతీయులకు ప్రాథమిక హక్కులను కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తించినప్పటికీ, కొన్ని రాజకీయ కారణాల వల్ల ఇవ్వలేకపోయారు.

* 1945లో సర్ తేజ్ బహదూర్ సప్రూ నేతృత్వంలో ఏర్పడిన భారతీయ మేధావుల కమిటీ భవిష్యత్‌లో రూపొందించబోయే భారత రాజ్యాంగానికి ప్రాథమిక హక్కులను కావాలని పేర్కొంది.

* అల్పసంఖ్యాక వర్గాలకు తగిన విధంగా రక్షణలను, హామీలను రాజ్యాంగ చట్టబద్ధంగా కల్పించడానికి ప్రాథమిక హక్కులను పొందుపరచడం ఒక్కటే సరైన మార్గమని, రాజ్యాంగ పరిషత్తు ప్రాథమిక హక్కుల జాబితాను సిద్ధంచేసి, వాటిలో ఏవి న్యాయస్థానాల రక్షణ గలవో, ఏవికావో స్పష్టం చేయాలని సప్రూ కమిటీ పేర్కొంది.

* 1947, జనవరి 24న సర్ధార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన 1+54 సభ్యులతో కూడిన ప్రాథమిక హక్కుల సలహా సంఘాన్ని రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేసింది. ఇది అల్పసంఖ్యాకుల హక్కులు, ఆటవిక జాతులు, వారి ప్రాంతాలను గురించి నివేదికను సమర్పించవలసిందిగా కోరింది.

* ఈ సలహా సంఘాన్ని 1947, ఫిబ్రవరి 12న అయిదు ఉపసంఘాలుగా విభజించారు. వీటిలో ఒకటి ప్రాథమిక హక్కుల ఉపసంఘం. ప్రాథమిక హక్కులను నిర్దేశించడానికి ఆచార్య జె.బి.కృపలాని అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో ఇది ఏర్పడింది.

ఈ ఉపసంఘంలోని సభ్యులు

   1. ఎ.కృష్ణస్వామి అయ్యర్ 

   2. కె.టి.షా

   3. ఎం.ఆర్.మసాని 

   4. రాజకుమారి అమృతకౌర్

   5. హరనామ్ సింగ్ 

   6. కె.ఎం.మున్షీ

   7. జైరాందాస్ - దౌలత్‌రామ్

  8. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్

   9. మౌలానా అబుల్‌కలాం ఆజాద్

ప్రాథమిక హక్కులపై ప్రముఖుల అభిప్రాయాలు

''సమాజంచేత కోరబడి, రాజ్యంచేత గుర్తించబడిన అంశాలే హక్కులు"   - గార్నర్

''ప్రాథమిక హక్కులు అనేవి రాజ్యాంగానికి శాశ్వతత్వాన్ని కలిగించే లంగరు"  - ఎన్.ఎ.ఫాల్కీవాలా

''ప్రాథమిక హక్కులు రాజ్యాంగానికి ఆత్మ, అంతరంగం"  - జవహర్‌లాల్ నెహ్రూ

ప్రాథమిక హక్కుల - వర్గీకరణ

* 1950, జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పుడు మన రాజ్యాంగంలో 7 రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి:

   1. సమానత్వపు హక్కు - ఆర్టికల్ 14 నుంచి 18

   2. స్వేచ్ఛా స్వాతంత్య్రపు హక్కు - ఆర్టికల్ 19 నుంచి 22

   3. పీడనాన్ని నిరోధించే హక్కు - ఆర్టికల్ 23 నుంచి 24

   4. మత స్వాతంత్య్రపు హక్కు - ఆర్టికల్ 25 నుంచి 28

   5. విద్యా, సాంస్కృతిక హక్కు - ఆర్టికల్ 29 నుంచి 30

   6. ఆస్తి హక్కు - ఆర్టికల్ 31

   7. రాజ్యాంగ పరిరక్షణ హక్కు - ఆర్టికల్ 32

* భారత రాజ్యాంగంలోని IIIవ భాగంలో 12 నుంచి 35 వరకు ఉన్న ఆర్టికల్స్‌లో ప్రాథమిక హక్కులను గురించి పరిపూర్ణంగా వివరించారు.

ఆర్టికల్-12: భారత రాజ్య నిర్వచనం

* దీని ప్రకారం రాజ్యానికి సంబంధించిన నిర్వచనాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యం అంటే:

     A. భారత ప్రభుత్వం

     B. రాష్ట్ర ప్రభుత్వాలు

    C. పార్లమెంటు

     D. రాష్ట్ర శాసనసభలు

     E. భారత ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఇతర అధికార సంస్థలు

* రాజ్య నిర్వచనానికి సంబంధించి, సుప్రీంకోర్టు తీర్పుల్లోని సారాంశం:

అజయ్ హాసియా Vs ఖలీద్ ముజీద్ కేసు: 1981

* ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.ఎన్. భగవతి నేతృత్వంలో, ధర్మాసనం ఇచ్చిన తీర్పు రాజ్యనిర్వచనానికి ఒక స్పష్టతను ఇచ్చింది. దీని ప్రకారం

A. ఒక సంస్థ చేస్తున్న మొత్తం ఖర్చును రాజ్యం ఇస్తున్నప్పుడు దాన్ని రాజ్యసంస్థగా పేర్కొనవచ్చు.

B. ఒక సంస్థ మూలధనం యొక్క పూర్తి వాటాను ప్రభుత్వం కలిగి ఉంటే దాన్ని రాజ్యసంస్థగా పేర్కొనవచ్చు.

C. ఒక సంస్థపై రాజ్యం పూర్తి నియంత్రణను కలిగి ఉన్నట్లయితే ఆ సంస్థను రాజ్య ఏజెన్సీగా భావించవచ్చు.

D. ఒక ప్రభుత్వ శాఖను ప్రత్యేకంగా ఒక సంస్థకు బదిలీ చేసినప్పుడు దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.

E. ఒక సంస్థ కార్యకలాపాలు ప్రజాప్రాముఖ్యం, ప్రభుత్వ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉన్నప్పుడు దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.

F. ఒక సంస్థను రాజ్యం ద్వారా నిర్వహిస్తున్నప్పుడు ఆ సంస్థ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉంటే దాన్ని రాజ్యసంస్థగా భావించవచ్చు.

సుఖ్‌దేవ్ సింగ్ Vs భగత్‌రామ్ కేసు (1975)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కింద పేర్కొన్న వాటిని రాజ్యసంస్థలు/రాజ్యంగా గుర్తించింది. అవి:

A. Oil and Natural Gas Commission (ONGC)

B. Life Insurance Corporation (LIC)

C. Industrial Financial Corporation (IFC)

రాజస్థాన్ విద్యుత్ బోర్డు Vs మోహన్‌లాల్ కేసు (1967)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ రాజస్థాన్ విద్యుత్ బోర్డును రాజ్యంగా గుర్తించింది.=

* రాజ్యాంగం లేదా ప్రభుత్వ శాసనం ద్వారా ఏర్పాటయ్యే సంస్థలన్నింటిని ప్రభుత్వ సంస్థలుగానే పరిగణించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పుల ఆధారంగా రాజ్యసంస్థగా పరిగణిస్తున్న సంస్థలు:

* భారత పెట్రోలియం కంపెనీ

* ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్

* ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ

* 90% మేరకు సహాయం పొందుతున్న ఎయిడెడ్ విద్యాసంస్థలు

* సిటీ & ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ మహారాష్ట్ర

* విశ్వవిద్యాలయాలు

* భారత ఆహార సంస్థ

* స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా

రాజ్య పరిధిలోకి రాని సంస్థలు

* 1980 - Co-operative Society చట్టం ద్వారా నమోదైన సంస్థలు

* ట్రస్టీలు - సొంత నిధులతో నడిచే సంస్థలు

* ఆజ్ఞలు - జారీచేసే అధికారం లేని సంస్థలు

* కోనసీమ సహకార బ్యాంకు

* NCERT

* BCCI

* ప్రభుత్వ ధనసహాయం పొందని ప్రైవేట్ విద్యాసంస్థలు

ఎ.ఆర్. అంతూలే Vs ఆర్.ఎస్.నాయక్ కేసు (1988)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఆదేశాలను కోర్టు జారీచేయలేదని పేర్కొంది.

రాంగోపాల్ పూజారీ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు:

* న్యాయస్థానం కేవలం ఒక వ్యవస్థ సార్వజనిక విధులను నిర్వహిస్తుందనే కారణంగా దాన్ని రాజ్యంగా భావించలేమని పేర్కొంది.

* వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు రాజ్యంకు ఇచ్చిన నిర్వచనాలను బట్టి న్యాయశాఖ రాజ్యం పరిధిలోకి రాదు. అయితే న్యాయశాఖ నిర్వహించే కార్యనిర్వాహక విధులు రాజ్యం పరిధిలోకి వస్తాయి.

షందాసాని Vs సెంట్రల్ బ్యాంకు కేసు: (1951)

* ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా లభిస్తాయే తప్ప ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా లభించవని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఆర్టికల్-13

* ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు

* ఆర్టికల్ 13 ప్రకారం మనదేశ న్యాయ వ్యవస్థకు న్యాయసమీక్ష అధికారం ఉంది. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమైన చట్టాలు చెల్లవు.

* 1950, జనవరి 26 నాటికి అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చే నాటికి ఉన్న చట్టాలను రాజ్యాంగ పూర్వ చట్టాలుగా పేర్కొంటారు. ఈ చట్టాలు లేదా చట్టాల్లోని భాగాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే చెల్లవు.

ఆర్టికల్ 13(3)లోని చట్టం నిర్వచనంలోకి కింది అంశాలు వస్తాయి

* కేంద్ర, రాష్ట్ర శాసనసభలు రూపొందించిన శాసనాలు.

* రాష్ట్రపతి, గవర్నరులు జారీచేసిన ఆదేశాలు, ఆర్డినెన్స్‌లు.

* ప్రభుత్వ నియమాలు, నోటిఫికేషన్లు, ప్రకటనలు.

* ప్రభుత్వం గుర్తించిన, చట్టబద్ధత ఉన్న ప్రజల ఆచారాలు, వ్యవహారాలు.

కామేశ్వరి సింగ్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు (1950)

    జమీందారీ వ్యవస్థను రద్దుచేసి, బీహార్‌లో భూసంస్కరణలను ప్రవేశపెట్టినప్పుడు దానికి వ్యతిరేకంగా కామేశ్వరి సింగ్ అనే జమీందార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, బీహార్‌లో ప్రవేశపెట్టిన భూసంస్కరణలను రద్దు చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా IXవ షెడ్యూల్‌ను రాజ్యాంగానికి చేర్చి కొన్ని శాసనాల చట్టబద్ధతను న్యాయస్థానాల్లో ప్రశ్నించకుండా చేసింది.
 

శంకరీ ప్రసాద్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1951)

    ఈ కేసులో 1951లో చేసిన మొదటి రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులను హరించేదిగా ఉందనే కారణంతో సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు 368వ ప్రకరణ కింద జరిగే రాజ్యాంగ సవరణకు, సాధారణంగా పార్లమెంట్ చేసే ఇతర శాసనాలకు తేడా ఉందని, రెండూ ఒకటి కాదని పేర్కొంటూ రాజ్యాంగ సవరణ అనేది ఆర్టికల్ 13 కిందకు రాదని, రాజ్యాంగ సవరణలన్నీ చెల్లుబాటు అవుతాయని తీర్పును ఇచ్చింది. ఈ కేసులోనే సుప్రీంకోర్టు మొదటిసారిగా న్యాయసమీక్షను వినియోగించింది.

సజ్జన్‌సింగ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు (1965)

     17వ రాజ్యాంగ సవరణ చట్టం (1964) ద్వారా IXవ షెడ్యూల్‌లో మరికొన్ని అంశాలను చేర్చి దాని పరిధిని విస్తరించడంతో సజ్జన్‌సింగ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించగా, రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 13 కిందకు రాదని కోర్టు తీర్పును ఇచ్చింది.
 

గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1967)

    ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, రాజ్యాంగ సవరణలు కూడా ఆర్టికల్ 13 ప్రకారం న్యాయసమీక్షకు గురవుతాయని పేర్కొంది.
ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ (Prospective Effect): గోలక్‌నాథ్ కేసులో ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు అంతకుముందు ఇచ్చిన తీర్పులకు వర్తించదని, అందువల్ల రాజ్యాంగంలో చేసిన 1వ, 4వ, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయని తన తీర్పులో పేర్కొంది. ఇలా అంతకుముందు ఇచ్చిన తీర్పులకు వర్తించకపోవడాన్ని, రాబోయే వాటికి వర్తించడాన్ని Prospective Effect అంటారు.

కేశవానంద భారతి కేసు (1973)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమైన రాజ్యాంగ సవరణలు చెల్లవని ప్రకటించే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉందని దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పును ఇచ్చింది.

మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1980)

      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 368కి చేర్చిన 4, 5 క్లాజులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి అవి చెల్లవని పేర్కొంది.
 

ఎ.కె.గోపాలన్ Vs మద్రాస్ గవర్నమెంట్ (1950)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 1950లో పి.డి. చట్టం రాజ్యాంగబద్ధమే అయినా దానిలోని 19వ క్లాజు రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఈ తీర్పు ద్వారా ధర్మాసనం రాజ్యాంగ అనంతర చట్టాలను న్యాయసమీక్షకు గురిచేసింది.
 

పృథకరించే సిద్ధాంతం (Doctrine of Separability)

     ప్రభుత్వం రూపొందించిన చట్టాల్లోని ఏదైనా భాగం లేదా నియమం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే ఆ అంశాన్ని మాత్రమే వేరుచేసి, అది రాజ్యాంగ విరుద్ధం, అది చెల్లదు అని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే డాక్ట్రిన్ ఆఫ్ సెపరబిలిటీ లేదా పృథకరించే సిద్ధాంతం అంటారు.
 

మిథు Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు

     ఈ కేసులో సుప్రీంకోర్టు... IPCలోని 303వ సెక్షన్ ప్రాథమిక హక్కుల్లోని సమానత్వపు హక్కుకు విరుద్ధమైందని, అది చెల్లదని తీర్పునిచ్చింది. తర్వాత IPC నుంచి 303వ సెక్షన్‌ను తొలగించారు.
 

కిహోటా Vs జాచీలూ కేసు

       ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టంలోని 7వ పేరాలో పేర్కొన్న ఏ ఒక్క అంశాన్ని కూడా వేరుచేయడానికి అవకాశం లేనందున ఆ పేరా మొత్తం ఒక భాగమేనని అది చెల్లదని తీర్పునిచ్చింది. అంటే చట్టంలోని ఏదైనా ఒక భాగం లేదా అంశం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నప్పుడు, ఆ చట్టం నుంచి వేరుచేసే అవకాశం లేనప్పుడు ఆ చట్టం ఉన్న భాగాన్ని మొత్తం రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.

గ్రహణ సిద్ధాంతం (Doctrine of Eclipse)

    రాజ్యాంగం అమల్లోకి రాకముందు చేసిన శాసనాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా రద్దయిపోయాయి అనడం సమంజసం కాదు.
 

భికాజీ నారాయణ్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు (1955)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్వాతంత్య్రానికి పూర్వం రూపొందించిన చట్టాలు ఏవైనా ప్రస్తుతం అమల్లో లేకపోయినప్పటికీ, వాటి అవసరాన్ని, ప్రాధాన్యాన్ని అనుసరించి ప్రభుత్వాలు వాటిని అమలు చేయవచ్చు. వీటినే తెరమరుగు శాసనాలు అంటారు. గ్రహణ సిద్ధాంతం ప్రకారం ఈ శాసనాలను అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

దీప్ చంద్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు (1959)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న చట్టాలకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
 

శ్రీ అంబికా మిల్స్ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అనేది కేవలం రాజ్యాంగపూర్వ చట్టాలకు మాత్రమే కాకుండా రాజ్యాంగ అనంతర చట్టాలకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.
 

పరిత్యజించు/వదులుకునే సిద్ధాంతం: Doctrine of Waiver (1959)

      బేహారం Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ... రాజ్యాంగం భారత పౌరులకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఏ పౌరుడు కూడా వదులుకునే అవకాశం లేదని, వాటి సంరక్షణ బాధ్యత నుంచి ఏ ప్రభుత్వాలు కూడా తప్పించుకునే అవకాశాలు లేవని, ఆ బాధ్యతను ప్రభుత్వాలు వదులుకోరాదని పేర్కొంది.

సమానత్వపు హక్కు: (ఆర్టికల్ 14 నుంచి 18)

* సమాజంలోని అసమానతలను రూపుమాపి, చట్ట సమానత్వాన్ని సాధించాలనే ఉద్దేశంతో బ్రిటన్‌లో అమల్లో ఉన్న సమన్యాయ పాలనను అనుసరించి, రాజ్యాంగ నిర్మాతలు మన రాజ్యాంగంలో సమానత్వపు హక్కును పొందుపరిచారు.

* The Law Constituion అనే గ్రంథంలో ఎ.వి.డైసీ ప్రతిపాదించిన సమన్యాయ పాలన సమానత్వపు హక్కుకు ప్రాతిపదిక.
 

ఆర్టికల్ 14 - చట్టం ముందు అందరూ సమానులే

    ఈ ఆర్టికల్ ప్రకారం కుల, మత, వర్గ, వర్ణ, లింగ వివక్షలతో సంబంధం లేకుండా చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే.
ఆర్టికల్ 14(A) - చట్టం దృష్టిలో సమానత్వం

* ఈ ఆర్టికల్ ప్రకారం చట్టం దృష్టిలో వ్యక్తులందరూ సమానమే. ఇది భారత పౌరులకే కాకుండా విదేశీయులకు కూడా వర్తిస్తుంది. ఈ భావనను మనం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించాం.

* దీని ప్రకారం ప్రధానమంత్రి మొదలుకుని సామాన్య వ్యక్తి వరకు తాము చేసే తప్పులకు సమానంగా బాధ్యత వహించాలి. రాజ్యం అన్యాయంగా వ్యవహరించడాన్ని సమ న్యాయం అనుమతించదు.

ఆర్టికల్ 14(B) - చట్టం మూలంగా సమాన రక్షణ

* దీని ప్రకారం వ్యక్తులందరూ న్యాయాన్ని పొందేందుకు, కోర్టులను ఆశ్రయించేందుకు సమాన హక్కులను కలిగి ఉంటారు. సమాన పరిస్థితుల్లో మాత్రమే సమాన రక్షణ లభిస్తుంది. చట్టం దృష్టిలో సమానత్వం అనేది మన రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో ఒకటి.

* ఈ భావనను అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
పరిమితులు/ మినహాయింపులు

* 'చట్టం ముందు అందరూ సమానులే' అనేదానికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

* ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లు పదవిలో ఉండగా వారిపై క్రిమినల్ కేసులు పెట్టడానికి వీల్లేదు. ఒకవేళ సివిల్ కేసు వేయాలన్నా రెండు నెలల ముందుగా నోటీసు ఇవ్వాలి.

* రాష్ట్రపతి, గవర్నర్లు వారి అధికారిక విధుల నిర్వహణలో ఏ న్యాయస్థానాలకు బాధ్యులు కారు. వీరి చర్యలను ఏ న్యాయ స్థానాల్లో ప్రశ్నించడానికి వీల్లేదు. పదవీకాలంలో వారిని అరెస్ట్ చేయరాదు.

* విదేశీ రాయబారులు, దౌత్యవేత్తలు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు; పబ్లిక్ సర్వెంట్స్.... వీరందరికి ఆర్టికల్ 14 నుంచి మినహాయింపు ఉంటుంది.

* వ్యవసాయ రంగాన్ని ప్రత్యేకంగా గుర్తించి ఆస్తి పన్ను నుంచి మినహాయించారు.

ఆర్టికల్ 14 - సుప్రీంకోర్టు తీర్పులు

సాఘీర్ అహ్మద్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్: (1955)

    ప్రైవేట్ వ్యక్తులతో పోల్చినప్పుడు రాజ్యం ఒక ప్రత్యేక వర్గంగా పరిగణించుకుని తనకు అనుకూలంగా ఒక గుత్తాధిపత్యాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.

చిరంజిత్‌లాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1961)

    సమానుల్లో మాత్రమే సమానత్వం అమలుపరచడం జరుగుతుందని, సమాన పరిస్థితుల్లో మాత్రమే సమానత్వాన్ని వర్తింపజేయవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

E.I. టొబాకో కంపెనీ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు: (1962)

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వర్జీనియా పొగాకుపై అమ్మకం పన్ను విధించి, దేశవాళి పొగాకును అమ్మకం పన్ను నుంచి మినహాయించే అధికారం ప్రభుత్వానికి ఉందని, అది సమంజసమేనని పేర్కొంది.
 

బెన్నెట్ కోల్‌మన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1973)

     కేంద్ర ప్రభుత్వం న్యూస్‌ప్రింట్ పంపిణీ విధానంలో చిన్న, పెద్ద పత్రికల యాజమాన్యాలకు సమానంగా న్యూస్‌ప్రింట్ పంపిణీ చేయడం న్యాయసమ్మతం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

రమేష్‌కాఫర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సమానుల్లో మాత్రమే సమానత్వం వర్తిస్తుందని అసమానులను సమానులుగా చేయడానికి దీన్ని వినియోగించలేమని పేర్కొంది.

వీడియోకాన్ Vs పంజాబ్ కేసు: (1990)

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భౌగోళిక ప్రాంతాల్లోని తేడాలను పరిగణనలోనికి తీసుకుని రూపొందించిన శాసనాలు ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు కాదని పేర్కొంది.
 

విశాఖ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు: (1997)

    మహిళలకు వారు పనిచేస్తున్న ప్రాంతంలో లైంగిక వేధింపులను నివారించడానికి ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను జారీచేసింది.
 

బల్సారా Vs స్టేట్ ఆఫ్ బాంబే కేసు (1951)

    రక్షణ దళాలు, రాయబారులు, సాధారణ ప్రజానీకానికి మధ్య వివక్ష చూపించడం ఆర్టికల్ 14ను ఉల్లంఘించినట్లు కాదని సుప్రీంకోర్టు ప్రకటించింది.
 

రణధీర్‌సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1982)

     సమాన పనికి సమాన వేతనం ప్రాథమిక హక్కు కానప్పటికీ అది రాజ్యాంగబద్ధ లక్షణమని, స్కేళ్ల విషయంలో ఈ హక్కును అమలు చేయవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

రాధాచరణ్ Vs స్టేట్ ఆఫ్ ఒరిస్సా కేసు: (1969)

     కొన్ని నియామకాల్లో కనీస అర్హత వయసును నిర్ణయించడం ఆర్టికల్ 14కు వ్యతిరేకం కాదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

కృష్ణనాయర్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు: (1978)

    ఏకీకృత న్యాయ సర్వీసును సివిల్, క్రిమినల్ న్యాయ సర్వీసులుగా హేతుబద్ధంగా వర్గీకరించడం ఆర్టికల్ 14కు విరుద్ధం కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

డి.కె.యాదవ్ Vs జె.ఎమ్.ఎ.ఇండస్ట్రీస్ కేసు: (1993)

     సహజ న్యాయ సూత్రాలు, న్యాయ విధులు, న్యాయ సదృశ్య విధులు, పురపాలక విధులకు కూడా వర్తిస్తుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఆర్టికల్-15: జాతి, మత, కుల, లింగ, జన్మ సంబంధ (5 రకాల) విచక్షణలు నిషేధం.
ఆర్టికల్, 15(1) - దీని ప్రకారం కేవలం కుల, మత, వర్గ, లింగ, జన్మ సంబంధ విషయాల ప్రాతిపదికన ఏ వ్యక్తిని ప్రభుత్వం వివక్షకు గురిచేయకూడదు.
ఆర్టికల్, 15(2) - కేవలం మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ప్రాతిపదికగా పబ్లిక్ స్థలాల్లో ఏ వ్యక్తి పట్ల కూడా వివక్ష చూపరాదు. పబ్లిక్ స్థలాల్లోకి నిరాకరించడం, నియంత్రించడం, అర్హత లేకుండా చేయడం లాంటి వివక్షలు చూపరాదు. ఇది రాజ్యానికి, ప్రైవేట్ వ్యక్తులకు వర్తిస్తుంది. దీనివల్ల కులవివక్ష, అస్పృశ్యతను నిరోధించవచ్చు.
ఆర్టికల్, 15(3) - దీని ప్రకారం స్త్రీ, శిశు సంక్షేమం కోసం ప్రత్యేక సదుపాయాలను చట్టరీత్యా కల్పించవచ్చు. స్త్రీలు, పసిపిల్లలకు కల్పించే ప్రత్యేక వసతులను వివక్షగా భావించరాదు.

ఆర్టికల్, 15(4) - ఈ క్లాజును మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో చేర్చారు. సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడినవారు, ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు అభివృద్ధి చెందడానికి వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. వీటిని వివక్షగా భావించరాదు.
 

చంపకం దొరైరాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు: 1951

* మద్రాసు ప్రభుత్వం మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు జరిపే సమయంలో కొన్ని కులాల వారికి రిజర్వేషన్లను అమలు చేసింది. దీంతో చంపకం దొరైరాజన్ అనే విద్యార్థిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇది ఆర్టికల్ 15కు వ్యతిరేకమని సుప్రీంకోర్టు రిజర్వేషన్లు రద్దుచేయాలని ఆదేశించింది.

* దీని ఫలితంగా భారత ప్రభుత్వం ఆర్టికల్ 15కు 4వ క్లాజును చేర్చింది. ఈ క్లాజు (4) ద్వారా రిజర్వేషన్లను కొనసాగించింది.
ఆర్టికల్ 15(5) - దీని ప్రకారం ఉన్నత విద్యాసంస్థలు, వృత్తివిద్యా సంస్థల్లో OBCలకు రిజర్వేషన్లు కల్పించారు.

 

అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (2008)

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 93వ రాజ్యాంగ సవరణ చట్టం (2005) ద్వారా విద్యాసంస్థల్లో OBCలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడాన్ని, వాటికి రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ - 15(5) రాజ్యాంగబద్ధమేనని సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

డాక్టర్ నీలిమ Vs అగ్రికల్చరల్ యూనివర్సిటీ కేసు: (1993)

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉన్నత కులానికి చెందిన యువతి షెడ్యూల్డ్ తెగకు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నప్పటికీ, షెడ్యూల్డ్ తెగలవారికి లభించే రిజర్వేషన్ సౌకర్యం ఆ యువతికి లభించదని పేర్కొంది.
 

ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు: (2005)

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మైనారిటీ, మైనారిటీ యేతర నాన్ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలల్లో రిజర్వేషన్లు చెల్లవు అని తీర్పునిచ్చింది.

* భారత్‌లో అమల్లో ఉన్న వివక్ష రక్షిత వివక్ష.

* కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే అంటురోగాలు, దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమయ్యే వారిపై ప్రభుత్వాలు పరిమితులను విధించవచ్చు.

* ఎయిర్‌హోస్టెస్, ఆస్పత్రులు, టీచింగ్ మొదలైనవాటిలో స్త్రీలకు ప్రత్యేక అవకాశాలను కల్పించవచ్చు.
 

ఎం.ఆర్.బాలాజీ Vs మైసూర్ రాష్ట్రం కేసు: 1963 సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు

* ఆర్టికల్ 15(4) ప్రకారం వెనుకబాటుతనం అంటే కేవలం కులాన్ని బట్టే కాకుండా సామాజిక, విద్యాసంబంధమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

* ఒక కులం వెనుకబడిందా? కాదా? అని నిర్ణయించడంలో పేదరికం, నివాసం ఉండే ప్రదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

* వెనుకబడిన తరగతుల వారిని వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులుగా విభజిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం చెల్లదు.

ఆర్టికల్-16: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం.

ఆర్టికల్-16(1): ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలను పొందే విషయంలో పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి.

ఆర్టికల్-16(2): ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో కేవలం 7 రకాల విచక్షణలు అంటే మతం, కులం, వర్ణం, లింగం, వంశం, జన్మస్థలం, నివాసస్థలం లాంటి విచక్షణలు పాటించరాదు.

ఆర్టికల్, 16(3): కేంద్రపాలిత ప్రాంతాలు, జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో, ఆర్టికల్ 371 ప్రకారం నిర్దేశించిన రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీ విషయంలో అనుసరించే కొన్ని ప్రత్యేక వసతులను సమాన అవకాశాలకు విరుద్ధమని భావించరాదు.

* 1957లో ప్రభుత్వ ఉద్యోగాలు - నివాస అర్హతల చట్టాన్ని పార్లమెంటు రూపొందించింది. దీని ప్రాతిపదికగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1959లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్టాన్ని ముల్కీ నిబంధనల పేరుతో రూపొందించింది.
 

ఎ.వి.ఎస్.నరసింహారావు Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (1970)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒకే రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల మధ్య ఎలాంటి వివక్ష చూపరాదని, రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాలను యావత్ రాష్ట్రంలోని నివాసితులకు రిజర్వ్ చేయవచ్చునని, తెలంగాణ ప్రాంతం వారికి తెలంగాణలోని ఉద్యోగాలను రిజర్వ్ చేసే ముల్కీ నిబంధనలు చెల్లవని సుప్రీంకోర్టు పేర్కొంది. దీని ఫలితంగా ఏర్పడిన ఘర్షణలు, ఉద్యమాల నేపథ్యంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ముల్కీ నిబంధనలకు రాజ్యాంగబద్ధతను కల్పించేందుకు 1973లో 32వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి, ఆర్టికల్ 371(D)ని రాజ్యాంగానికి చేర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక నిబంధనలను ఏర్పరచింది. ఈ సవరణ చట్టం 1974, జులై 1 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్ 16(4):

     ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు కల్పించే రిజర్వేషన్లను సమాన అవకాశాలకు విరుద్ధమని భావించరాదు. ఉద్యోగాల్లో కొన్నివర్గాలకు ప్రాతినిథ్యం కల్పించే లక్ష్యంతో విద్య, సామాజిక వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను అమలు చేయవచ్చు.
 

ఉదాహరణకు:

    మహిళలు = 33.3%
    ఎస్సీ వర్గాలు = 15%
    ఎస్టీ వర్గాలు = 7.5%
    బీసీ వర్గాలు = 27% రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పొందుతున్నారు.

 

ఆర్టికల్ 16(4A): ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు.

ఇందిరా సహాని Vs యూనియన్ ఆఫ్ ఇండియా

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించరాదని పేర్కొంది. ఈ తీర్పు తర్వాత 77వ రాజ్యాంగ సవరణ ద్వారా పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించారు.
 

ఆర్టికల్ 16 (4B): దీని ప్రకారం ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగపరమైన నోటిఫికేషన్లు విడుదల చేసినప్పుడు వివిధ రిజర్వేషన్లు, కేటగిరీలకు రిజర్వ్ చేసిన స్థానాలకు అర్హులైన అభ్యర్థులు లభించని సందర్భంలో వారు లభించేవరకు ఆ పోస్టులను బ్యాక్‌లాగ్ పోస్టులుగా ఉంచాలి. ఈ అంశాన్ని 81వ రాజ్యాంగ సవరణ చట్టం 2000 ద్వారా చేర్చారు. బ్యాక్‌లాగ్ ఖాళీల్లో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లపై చేసిన 50% పరిమితిని తొలిగించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టికల్ 16 (4B) 2000, సెప్టెంబరు 6 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్ 16(5): ప్రభుత్వంలోని ఏదైనా శాఖ పూర్తిగా ఒక మత విశ్వాసానికే సంబంధించి ఉన్నప్పుడు ఆ శాఖలో కేవలం ఆ మత విశ్వాసానికి చెందినవారినే నియమించే విధంగా శాసనాలను రూపొందించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.

సుప్రీంకోర్టు తీర్పులు

అశోక్‌కుమార్ గుప్తా Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్: (1997)దేవదాసన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1964)
    
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50% కంటే మించరాదని పేర్కొంది. క్యారీ ఫార్వర్డ్ నియమం వల్ల రిజర్వేషన్లు 60% కంటే మించే అవకాశం ఉంది కాబట్టి ఈ నియమం చెల్లదని పేర్కొంది.

 

ఎ.బి.ఎస్.కె. సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1981)
    
ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ క్యారీ ఫార్వర్డ్ రూలు సమంజసమేనని, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 64.4% ఉన్నప్పటికీ అదేమీ తప్పుకాదని పేర్కొంది.

 

వసంతకుమార్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు: (1985)
* ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 15 సంవత్సరాలకు మించకుండా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పునిచ్చింది.

* శాసన సభలు, విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో అమలవుతున్న రిజర్వేషన్ విధానాన్ని ప్రతి 5 సంవత్సరాలకోసారి సమీక్షించాలని కూడా పేర్కొంది.

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 16కు 4A క్లాజ్‌ను చేర్చడం విధానపరమైన నిర్ణయం కాబట్టి 4A క్లాజ్ న్యాయసమీక్ష పరిధిలోకి రాదని ధర్మాసనం నిస్సహాయతను తెలిపింది.

* 85వ రాజ్యాంగ సవరణ చట్టం (2001) ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లను చట్టబద్ధం చేశారు.
 

ఆర్టికల్ 17: అస్పృశ్యత నిషేధం

* దీని ప్రకారం అస్పృశ్యతను ఏ రూపంలోనైనా ఆచరించడం నిషేధించారు. భారత ప్రభుత్వం 1955లో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని చేసింది. ఇది 1955, నవంబరు 19 నుంచి అమల్లోకి వచ్చింది.

* అస్పృశ్యత అనే పదం వాడరాదని 1974లో కర్ణాటక హైకోర్టు తీర్పుని ఇవ్వడంతో అస్పృశ్యత నేర నిషేధ చట్టాన్ని భారత ప్రభుత్వం పౌర హక్కుల పరిరక్షణ చట్టం (Protection of Civil Liberties Act)గా 1976లో మార్చారు.

* ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధిస్తారు. అలాంటివారిని ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటిస్తారు.
 

ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టం

     ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి రక్షణకు పటిష్టమైన నియమాలను రూపొందిస్తూ పార్లమెంటు ఎస్సీ, ఎస్టీ అకృత్యాల నిరోధక చట్టాన్ని 1989, సెప్టెంబరు 11న ఆమోదించింది. ఈ చట్టం 1990, జనవరి 30 నుంచి అమల్లోకి వచ్చింది.

అప్ప ఇంగాల్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు:

     ఈ కేసులో కర్ణాటక హైకోర్టు తీర్పునిస్తూ షెడ్యూల్డ్ కులాలను నిర్వహించడం, కులాల జాబితా గురించి పేర్కొనడం అస్పృశ్యత రీత్యా సాధ్యంకాదని ప్రకటించింది.
 

ఆర్టికల్, 18: బిరుదుల రద్దు
 

ఆర్టికల్-18(1): విద్య లేదా సైనిక సంబంధమైనవి మినహా ఇతర బిరుదులను ప్రభుత్వం ఎవరికీ ప్రకటించరాదు.
 

ఆర్టికల్-18(2): విదేశాలు ప్రకటించే ఎలాంటి బిరుదునైనా భారతీయ పౌరులు స్వీకరించరాదు.
 

ఆర్టికల్-18(3): ఒక వ్యక్తి భారతీయ పౌరుడు కాకపోయినప్పటికీ, భారతదేశంలో ప్రభుత్వం ద్వారా ఆదాయం పొందే ఉద్యోగాన్ని చేస్తే రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ఇచ్చే బిరుదులు స్వీకరించరాదు.
 

ఆర్టికల్-18(4): భారత ప్రభుత్వం కింద ఆదాయాన్నిచ్చే ఉద్యోగాన్ని నిర్వర్తిస్తున్న ఏ వ్యక్తీ రాష్ట్రపతి అనుమతి లేకుండా అతడు ఇతర దేశాల నుంచి ఎలాంటి బిరుదులూ స్వీకరించరాదు.

* బ్రిటిష్‌వారి పాలనా కాలంలో సర్, దేశ్‌పాండే, జాగిర్దార్, జమీందార్, రావు సాహెబ్, రావు బహద్దూర్, ఇనాందార్ లాంటి బిరుదులు మన దేశంలో అమల్లో ఉండేవి. వీటిని ఆర్టికల్ 18 ప్రకారం నిషేధించారు.

* విద్యా సంబంధిత డాక్టరేట్లు, సైనిక సంబంధమైన శౌర్యచక్ర, పరమవీర చక్ర, మహావీర చక్ర, కీర్తిచక్ర లాంటి బిరుదులను ఇవ్వవచ్చు.

* 1954 నుంచి భారత ప్రభుత్వం భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ లాంటి పౌర పురస్కారాలను ప్రవేశపెట్టింది.

* మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పును అనుసరించి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం 1977లో భారతరత్న బిరుదులను రద్దుచేసింది. 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ బిరుదులను తిరిగి పునరుద్ధరించింది.

బాలాజీ రాఘవన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1996)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, భారతరత్న లాంటి అవార్డులు కేవలం పౌర పురస్కారాలే గానీ బిరుదులు మాత్రం కావని, పౌర పురస్కారాన్ని పేరుకు ముందు లేదా తర్వాత వినియోగించరాదని తీర్పును ఇచ్చింది. ఒకవేళ అలా ఉపయోగిస్తే వాటిని రద్దుచేసే, ఉపసంహరించే అధికారం ప్రభుత్వానికి ఉందని తీర్పునిచ్చింది.

* తెలుగు సినీ పరిశ్రమకు చెందిన బ్రహ్మానందం, మోహన్‌బాబు నటులు సినిమా టైటిల్స్‌లో పేర్లకు ముందు 'పద్మశ్రీ' లాంటి అవార్డులను బిరుదుగా వాడటాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పు పట్టింది.
 

II. స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు: (ఆర్టికల్ 19 నుంచి 22 వరకు)

''ఇతరుల స్వేచ్ఛకు భంగం కలగకుండా ప్రతి వ్యక్తీ తనకు నచ్చిన రీతిలో వ్యవహరించడానికి ఉన్న అవకాశమే స్వేచ్ఛ" - హెర్బర్ట్ స్పెన్సర్
''స్వేచ్ఛా, స్వాతంత్య్రపు హక్కు రాజ్యాంగానికి ఆత్మ లాంటిది" అని జస్టిస్ సిక్రీ పేర్కొన్నారు.

 

ఆర్టికల్-19: భారత పౌరులకు లభించే 7 రకాల స్వాతంత్య్రాలు
ఆర్టికల్- 19(1)(a): వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వాతంత్య్రం.

* ఒక వ్యక్తి తన భావాలను ఇతరులతో పంచుకోవడానికి, ఇతరుల భావాలను తాను తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ వీలు కల్పిస్తుంది.
 

భావ వ్యక్తీకరణ సాధనాలు

     పత్రికలు, సినిమాలు, రేడియో, టి.వి., కరపత్రాలు, కార్టూన్లు, కటౌట్లు, పాటలు, నృత్యాలు, నాటకాలు, కథలు, బొమ్మలు, సమావేశాలు, వేదికలు, వెబ్‌సైట్లు, ప్రచురణలు మొదలైనవి.

* భారత రాజ్యాంగం పత్రికా స్వాతంత్య్రాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించలేదు. కానీ ఆర్టికల్ 19 (1a) ప్రకారం భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలోనే పత్రికా స్వాతంత్య్రం అంతర్భాగంగా ఉంది.
 

పరిమితులు
* దేశ సార్వభౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించరాదు.

* విదేశీ సంబంధాలు దెబ్బతినకుండా వ్యవహరించాలి.

* శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడకూడదు.


సుప్రీంకోర్టు తీర్పులు

మేనకా గాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1978)

బ్రిజ్ భూషణ్ Vs స్టేట్ ఆఫ్ ఢిల్లీ: (1950)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక పత్రికపై దాని ప్రచురణకు ముందే సెన్సార్‌షిప్ విధించకూడదని పేర్కొంది.
 

బెన్నెట్ కోల్‌మన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1973)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, ఒక వార్తాపత్రిక ప్రచురించాల్సిన పేజీల సంఖ్యను నిర్ణయిస్తూ జారీచేసిన న్యూస్ ప్రింట్ కంట్రోల్ ఆర్డరు ఆర్టికల్ 19(1)(a)కు వ్యతిరేకంగా ఉంది కాబట్టి అది చెల్లదని పేర్కొంది.

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వాక్, భావ ప్రకటనా స్వాతంత్య్రపు హక్కుకు భౌగోళిక హద్దులు లేవని, ఒక వ్యక్తి తన అభిప్రాయాలను దేశంలో/ విదేశాల్లో సంచరిస్తున్నప్పుడు వ్యక్తీకరించవచ్చునని పేర్కొంది.
 

ఖలీద్ అబ్బాస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, సినిమాలు మనుషుల భావోద్రేకాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి సినిమాలపై సెన్సార్‌షిప్ విధించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది

* ప్రదీప్ దాల్వీ రచించిన ''మై నాథూరాం గాడ్సే బోల్తా హై" అనే నాటకాన్ని నిషేధించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధంకాదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.
 

బిజయ్ ఇమ్మాన్యుయేల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ: (1986)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ జాతీయ గీతం పాడాలని ఏ వ్యక్తినీ ఒత్తిడి చేయకూడదని, మౌనంగా ఉండటం అనేది వాక్, భావ ప్రకటనా హక్కులో అంతర్భాగమని పేర్కొంది.
 

నక్కీరన్ పత్రిక సంపాదకుడు ఆర్. రాజగోపాల్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు (1994)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అధికారులపై పరువు నష్టానికి సంబంధించిన విషయాలను ప్రచురించడంపై ముందుగా పరిమితులు విధించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని పేర్కొంది.

టాటా ప్రెస్ Vs ఎం.టి.ఎన్.ఎల్.కేసు: (1995)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ వ్యాపార పరమైన ప్రకటనలు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకే వస్తాయని పేర్కొంది.
 

సకల్ పేపర్స్ లిమిటెడ్ కంపెనీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ పత్రికా స్వాతంత్య్రాన్ని కూడా ప్రాథమిక హక్కుగానే గుర్తించాలని పేర్కొంది.
 

రమేష్ థాపర్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు: (1950)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక రాష్ట్రంలో ఒక జర్నల్ ప్రవేశించకుండా, పత్రికను సర్క్యులేట్ కాకుండా నిషేధించే శాసనం చెల్లదని పేర్కొంది.
 

మురళీదేవరా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

    ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని ప్రభుత్వం నిషేధించడాన్ని రాజ్యాంగబద్ధమేనని పేర్కొంటూ అవి వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే అంశాలేవీ కాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (2004)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జాతీయ జెండాను ఎగురవేయడం కూడా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛగానే భావించాలని పేర్కొంది.

చరిత Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జైళ్లలో ఉండే ఖైదీలను మీడియా ఇష్టం వచ్చినట్లు ఇంటర్వ్యూ చేయరాదని, వాటిని యధావిధిగా ప్రసారం చేయరాదని పేర్కొంది.
 

బీసీసీఐ, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ Vs దూరదర్శన్: (1995)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, క్రికెట్ ప్రసారాలను చేసే సందర్భంలో దూరదర్శన్ ఒక్కటే గుత్తాధిపత్య హక్కులను కలిగి ఉండాల్సిన అవసరం లేదని, ఇతర సంస్థలకు కూడా ఇలాంటి అవకాశం కల్పించాలని పేర్కొంది.
 

ఆర్టికల్, 19 (1b): సభలు, సమావేశాలు నిర్వహించుకోవడం.

* పౌరులు శాంతి భద్రతలకు భంగం కలిగించని విధంగా, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశం కావచ్చు.

* ఊరేగింపులు, బంద్‌లు, ప్రదర్శనలు, సభలు, సమావేశాల నిర్వహణ దీనిలో అంతర్భాగం.

మినహాయింపుసిక్కు మతస్తులు వారి మత సంకేతమైన కృపాణం అనే చిన్న కత్తిని ధరించి కూడా శాంతియుతంగా సమావేశం కావచ్చు.

* కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుందని భావించినట్లయితే 144వ సెక్షన్‌ను విధించవచ్చు. పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని భావిస్తే కర్ఫ్యూను కూడా విధించవచ్చు.

బాబూలాల్ పరాటే Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు: (1961)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రదర్శనలు, వాటికి ప్రతి ప్రదర్శనల ఫలితంగా శాంతిభద్రతలకు భంగం వాటిల్లుతుంది. కాబట్టి ప్రభుత్వం 144 సెక్షన్ విధించడం సరైందేనని పేర్కొంది.

భరత్ కుమార్ సీపీఐ(ఎం) కేసు: (1998)

     ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బంద్‌ల విషయంలో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, బంద్‌లు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. ఒక వ్యక్తి లేదా ఒక వర్గం ప్రాథమిక హక్కు కంటే ప్రజలందరి సామూహిక ప్రాథమిక హక్కులు ఎక్కువని అభిప్రాయపడింది. బలవంతంగా బంద్ చేయించడం అంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించడమేనని ఈ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం పేర్కొంది.
 

కెప్టెన్ హరీష్ ఉప్పల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1988)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లాయర్లకు సమ్మె చేసే హక్కు లేదని పేర్కొంది.
 

టి.కె.రంగరాజన్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు: (2003)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సమ్మె చేయడం అనేది ప్రాథమిక హక్కు కాదని, ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెను ప్రాథమిక హక్కుగా భావించరాదని పేర్కొంది.
 

ఆర్టికల్, 19(1c): సంఘాలు, సంస్థలు, సహకార సంస్థలను నెలకొల్పడం:

పౌరులు తమ లక్ష్యసాధనకు, సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి సంఘాలు, సంస్థలను స్థాపించుకుని, వాటిలో సభ్యత్వం పొందవచ్చు. దీనిలో భాగంగానే రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, వ్యాపార సంఘాలు.... ఏర్పడుతున్నాయి.

పరిమితులు

* దేశ సమగ్రత, శాంతిభద్రతలు, సార్వభౌమత్వం, నైతిక విలువల దృష్ట్యా కిందివారు సంఘాలుగా ఏర్పడకూడదు.

* సైనికులు, దొంగలు, వ్యభిచారిణులు

* తాగుబోతులు, ప్రభుత్వం నిషేధించిన ఇతర వర్గాలు.
 

కులకర్ణి Vs స్టేట్ ఆఫ్ బాంబే:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తులు స్థాపించుకునే సంఘాలు, సంస్థలకు ప్రభుత్వాలు తప్పనిసరిగా గుర్తింపు ఇవ్వాలనే నియమం లేదని, దాన్ని వ్యక్తి ప్రాథమిక హక్కుగా పరిగణించడానికి అవకాశం లేదని పేర్కొంది.
 

ఒ.కె.ఘోష్ Vs జోసెఫ్:

* ఈ వ్యాజ్యంలో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు సంఘాలు, సంస్థలను స్థాపించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటారని పేర్కొంది.
 

బాల కోటయ్య Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1958)

* కమ్యూనిస్టులతో కలిసి, రైల్వే ఉద్యోగులు సార్వత్రిక సమ్మె కోసం పిలుపును ఇచ్చారన్న కారణంగా కొందరు రైల్వే ఉద్యోగులను జనరల్ మేనేజర్ సర్వీసు నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

* శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సంస్థలపై పరిమితులు, నిషేధం విధించవచ్చు.

ఉదా: మావోయిస్టులు, జైషే మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, ముజాహిద్దీన్ లాంటి సంస్థలను ప్రభుత్వం నిషేధించింది.

ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ Vs నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్:

    ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సంఘాలు, సంస్థలను స్థాపించుకోవడానికి వ్యక్తులు హక్కులు కలిగి ఉన్నప్పటికీ, సమ్మెలు చేయడం ప్రాథమిక హక్కుగా పరిగణించరాదని పేర్కొంది.
 

ఆర్టికల్, 19(1d): దేశ వ్యాప్తంగా సంచరించే స్వాతంత్య్రం

* భారతీయ పౌరులకు దేశవ్యాప్తంగా తమ ఇష్టానుసారం సంచరించడానికి, పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి స్వేచ్ఛ ఉంది. దీని ఫలితంగా జాతీయ సమైక్యత, సమగ్రత భావాలు వారిలో పెంపొందుతాయి.
 

పరిమితులు:

* నాగరికులు షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో సంచరించడంపై పరిమితులు.

* అంటువ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు స్వేచ్ఛగా సంచరించడంపై పరిమితులు.

* మత కల్లోలాలు చెలరేగే పరిస్థితులు ఉన్నట్లయితే నాయకులు/ఇతర ప్రముఖులు ఒక ప్రాంతాన్ని సందర్శించడాన్ని నిషేధించవచ్చు.

* శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా 144 సెక్షన్, కర్ఫ్యూ నిషేధ ఆజ్ఞలను విధించవచ్చు.

ఉదా: 1990లో ఎల్.కె.అడ్వాణీ రథయాత్రను బిహార్‌లోని లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.

సుప్రీంకోర్టు తీర్పులు

కౌలస్య Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు: (1964)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రజారోగ్యం, ప్రజా నైతికతల దృష్ట్యా వేశ్యలు స్వేచ్ఛగా సంచరించే హక్కుపై పరిమితులు విధించింది.
 

లూసీ ఆర్.డి. సూజా Vs స్టేట్ ఆఫ్ గోవా

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంచార స్వాతంత్య్రంపై పరిమితులు విధిస్తూ గోవా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని సమర్థించింది.
 

అజయ్ కామా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1988)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మోటార్ వెహికల్ రూల్స్ నియమాల చట్టం, 1964ను అనుసరించి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి మాత్రమే సంచరించాలని చేసిన చట్టాన్ని సమర్థించింది.
 

ఆర్టికల్, 19(1e): దేశంలో ఎక్కడైనా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే స్వాతంత్య్రం

* భారత పౌరులు దేశంలో ఎక్కడైనా స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవచ్చు.

పరిమితులు

* ఆర్టికల్, 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండటం వల్ల ఆ రాష్ట్రంలో రాష్ట్రేతరులు స్థిరనివాసం ఏర్పాటు చేసుకునే వీల్లేదు.

* ఈశాన్య రాష్ట్రాలు, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఇతరుల స్థిరనివాసంపై పరిమితులు ఉన్నాయి.

* 1970లో తీసుకువచ్చిన 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఇతర వ్యక్తుల నివాసం పైన ప్రభుత్వాలు పరిమితులు విధించవచ్చు.
 

ఆర్టికల్, 19(1F):

* ఆస్తిని సంపాదించుకోవడానికి అనుభవించడానికి, అన్యాక్రాంతం చేయడానికి ఉన్న హక్కు.

* ఈ హక్కును 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978 ద్వారా మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, ఆర్టికల్ 300 (A)లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చింది.

ఆర్టికల్, 19(1G):

* ఏ వృత్తినైనా, వ్యాపారాన్నైనా చేపట్టే స్వాతంత్య్రం.

* ఈ ఆర్టికల్ ప్రకారం వ్యక్తులు జీవనభృతి కోసం తమకిష్టమైన వృత్తులను స్వీకరించే స్వేచ్ఛ, స్వాతంత్య్రం వారికి ఉంది. వారు ఇష్టమైన వర్తక, వాణిజ్యాలను నిర్వహించవచ్చు.
 

పరిమితులు

* ఆయుధాలు, మాదక ద్రవ్యాల తయారీ; వ్యభిచారం, దొంగతనం, జోగిని, దందాలు చేయడం లాంటి వాటిని వృత్తిగా స్వీకరించరాదు.

సుప్రీంకోర్టు తీర్పులు

బి.ఆర్. ఎంటర్‌ప్రైజస్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ (1999):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లాటరీలపై పరిమితులు విధిస్తూ చేసిన చట్టాన్ని సమర్థించింది. లాటరీ నిర్వహించడం వృత్తికాదని, అది జూదం అయినందున, పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

చింతామణిరావు Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు (1951):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బీడీ కంపెనీల్లో బీడీ కార్మికుల లభ్యత కోసం చట్టరీత్యా వ్యవసాయకూలీ పనిని నిషేధించే విధంగా చేసిన చట్టం చెల్లదని ధర్మాసనం పేర్కొంది.
 

లఖన్‌లాల్ Vs స్టేట్ ఆఫ్ ఒడిస్సా కేసు (1977):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మత్తుపదార్థాల వ్యాపారం చేయడం అనేది ఏ పౌరుడికి ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది.
 

ఎక్సెల్‌వేర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1979):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఏదైనా వృత్తిని చేపట్టేందుకు హక్కును ఎలా కలిగి ఉంటామో అదేవిధంగా ఆ వృత్తిని మానివేసేందుకు కూడా హక్కు ఉంటుందని పేర్కొంది.

పి.ఎ. ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దాతృత్వంతో, ప్రజాహితం కోసం ప్రారంభించిన విద్యాసంస్థలు తద్వారా విద్యను అందించడం పరిపాటి. అయితే క్రమేపి నేటి రోజుల్లో అదొక వృత్తిగా మారిందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
 

సోరన్‌సింగ్ Vs న్యూఢిల్లీ మున్సిపల్ కమిటీ కేసు (1989):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ క్రమబద్ధీకరించిన రహదారుల కాలిబాటలపై, వీధుల వెంబడి తిరుగుతూ వ్యాపారం చేసుకునే హక్కు వ్యాపారులకు ఉందని పేర్కొంది.

ఆర్టికల్, 20: నేరం, శిక్ష నుంచి రక్షణ పొందేహక్కు.

ఆర్టికల్ 20(1): ఏ వ్యక్తినీ నేరం చేయనిదే శిక్షించరాదు. ఒకవ్యక్తి చేసిన పని అది చేసిన సమయానికి చట్టరీత్యా నేరం అయితేనే శిక్షించాలి.

ఆర్టికల్ 20(2): ఏ వ్యక్తినీ ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువసార్లు విచారించి శిక్షించకూడదు.

ఆర్టికల్ 20(3): ఏ వ్యక్తినీ తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదు.
 

ఎక్స్‌పోస్ట్ ఫ్యాక్టో చట్టాలు:

* క్రిమినల్ చట్టాలు అవి చేసిన రోజు నుంచి లేదా తర్వాత కాలం నుంచి అమల్లోకి వస్తాయి. వీటిని వెనుకటి తేదీతో అమలు చేయడానికి వీల్లేదు. అయితే సివిల్ చట్టాలను ప్రస్తుత కాలంతోపాటు గతకాలానికి కూడా వర్తింప చేయవచ్చు.

డబుల్ జియోపార్డి (Double Jeopardy)

* దీని ప్రకారం ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఒక పర్యాయం శిక్షపడి ఉంటే అదే నేరానికి మరోసారి శిక్షవేయరాదు.
 

సుప్రీంకోర్టు తీర్పులు

కేదార్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు (1953):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 1947లో చేసిన పని, 1949లో చేసిన చట్టం ప్రకారం నేరమైనప్పుడు, ఆ పనికి 1949 చట్టం కింద నేరం చేశాడని శిక్షించడానికి వీల్లేదని అత్యున్నత ధర్మాసనం తీర్పునిచ్చింది.
 

సంపత్‌కుమార్ Vs ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, మద్రాస్ కేసు (1998):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఒక వ్యక్తిని నిజాలు చెప్పాలని హెచ్చరించడం రాజ్యాంగ వ్యతిరేకం కాదని పేర్కొంది.
 

ఎం.పి. శర్మ Vs సతీష్ చంద్ర (డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, ఢిల్లీ) కేసు (1954):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ నిందితుడి నుంచి ఏదైనా వస్తువు లేదా నేరానికి సంబంధించిన పత్రాలు సోదా చేసి పట్టుకోవడం ఆర్టికల్ 20(3)ను ఉల్లంఘించినట్లు కాదని కోర్టు పేర్కొంది.
 

నందినీ శతపతి Vs పి.ఎల్. దానీ కేసు (1978):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బలవంతపు సాక్ష్యం అనే అంశాన్ని విశదీకరించింది. దీని ప్రకారం శారీరకంగా పదేపదే బెదిరించి, హింసించి, మానసిక క్షోభకు గురిచేసి, నేరం అంగీకరించేలా చేసి సమాచారాన్ని రాబడితే అది బలవంతపు సాక్ష్యం కిందకు వస్తుందని పేర్కొంది. అలాంటి చర్యలు ఆర్టికల్ 20(3) కు వ్యతిరేకమని పేర్కొంది.

సెల్వీ Vs కర్ణాటక కేసు (2014):

 ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కొన్ని రసాయనాలు ఉపయోగించి చేసే నార్కో అనాలసిస్ అనేది పూర్తిగా శాస్త్రబద్ధం కాదని, రాజ్యాంగ వ్యతిరేకమని, రహస్యాలను కాపాడుకునే హక్కును అది ఉల్లంఘిస్తుందనీ పేర్కొంది.

* ఆర్టికల్ 20 (3)ను ఉల్లంఘిస్తున్న కారణంగా కోబాడ్ గాంధీ కేసు (2011)లో సుప్రీంకోర్టు నార్కో అనాలసిస్ పరీక్షను రద్దు చేసింది.

* నార్కో అనాలసిస్ పరీక్షలో సోడియం పెంటథాల్, సోడియం అమైటాల్ (అమోబార్బిటాల్) అనే పదార్థాలను ఉపయోగిస్తారు.
 

ఆర్టికల్ 21 - జీవించే హక్కు

* దీని ప్రకారం చట్టం నిర్ధారించిన పద్ధతిలో తప్ప, మరే విధంగాను ఒక వ్యక్తి స్వేచ్ఛకు, ప్రాణానికి హాని కలిగించరాదు. ఇది పాలనా యంత్రాంగం మీద పరిమితి. దీన్ని జపాన్ రాజ్యాంగం నుంచి గ్రహించాం.

* జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు కూడా జీవించే హక్కును (ఆర్టికల్ 21) రద్దు చేయడం లేదా నిలుపుదల చేయడానికి వీల్లేదు.

* ఆర్టికల్ 21 ప్రకారం ఆత్మహత్యను నేరంగా పరిగణిస్తారు.

* ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను విధించినప్పుడు ఆర్టికల్స్ 20, 21 రద్దుకావు.

సుప్రీంకోర్టు తీర్పులు

ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు (1950):

* పార్లమెంటు సభ్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడైన ఎ.కె. గోపాలన్‌ను నివారక నిర్బంధ చట్టం, 1950 కింద అరెస్ట్ చేయగా, అతడు ఆర్టికల్ 19 ప్రకారం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

* ఈ కేసులో సుప్రీంకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఒక వ్యక్తిని చట్టబద్ధంగా నిర్బంధించినప్పుడు సహజ న్యాయసూత్రాలు వర్తించవని పేర్కొంది. సహజ న్యాయ సూత్రాల ప్రాధాన్యాన్ని గుర్తించడానికి తిరస్కరించింది.

* ఆర్టికల్ 21లో కల్పించిన రక్షణలు కార్యనిర్వాహక చర్యలకు వ్యతిరేకంగా మాత్రమే వర్తిస్తాయి. శాసనపరమైన చర్యలకు వర్తించవని ఈ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
 

మేనకాగాంధీ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1978):

* ప్రభుత్వం 1977లో మేనకాగాంధీ పాస్‌పోర్ట్‌ను ప్రజాసంక్షేమం దృష్ట్యా ఏ విధమైన కారణాలు చెప్పకుండానే స్వాధీనం చేసుకుంది. దీంతో మేనకాగాంధీ విదేశాలకు వెళ్లే హక్కు ఆర్టికల్ 21లో పేర్కొన్న జీవించే హక్కులో భాగమని, ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను వేసింది.

* ఈ కేసులో అమెరికా రాజ్యాంగంలో ఉన్న డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాను సుప్రీంకోర్టు అనువర్తింపజేసింది.

* కేవలం కార్యనిర్వాహక శాఖ చర్యలను మాత్రమే కాకుండా శాసన ప్రక్రియలోని అంశాలను కూడా న్యాయసమీక్షకు గురిచేసింది.

* ఈ కేసులో సహజ న్యాయ సూత్రాలను వర్తింపజేసింది.

* ఆర్టికల్ 14, 19, 21 అధికరణాల మధ్య అవినాభావ సంబంధం ఉందని తద్వారానే వ్యక్తి స్వేచ్ఛకు సమగ్రత్వం లభిస్తుందనీ కోర్టు పేర్కొంది.

* ఈ కేసు ద్వారా సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిధిని విస్తరించింది.
 

ఆర్టికల్ 21 (జీవించే హక్కు)లో అంతర్భాగంగా ఉన్న హక్కులు:

     1. మానవ మర్యాదలతో జీవించే హక్కు

     2. విద్యార్జన హక్కు

     3. సమాచార హక్కు

     4. చేతులకు బేడీలు వేయడానికి విరుద్ధంగా ఉన్న హక్కు

     5. మిత్రులను, న్యాయవాదిని కలవడానికి ఖైదీలకు ఉన్న హక్కు

     6. ఆరోగ్యానికి హక్కు

     7. ఏకాంతంగా జీవించే హక్కు

     8. ఆశ్రయం పొందేహక్కు

     9. జీవనోపాధిని పొందే హక్కు

     10. జీవిత బీమా పాలసీలను పొందే హక్కు

    11. విచారణ జరపకుండానే నిర్బంధించడంపై అడిగే హక్కు

     12. పరిహారాన్ని పొందే హక్కు

     13. పొగతాగనివారికి ఉండే హక్కు

     14. వ్యక్తిగత రహస్యాలను కాపాడుకునే హక్కు

     15. కాలుష్యరహిత నీరు, గాలిని పొందే హక్కు

     16. షెడ్యూల్డ్ తెగలకు వారసత్వపు హక్కు

     17. ముద్దాయిని క్రూరంగా హింసించే చర్యల నుంచి రక్షణ పొందే హక్కు

     18. పాస్‌పోర్ట్ పొందే హక్కు, విదేశాలకు వెళ్లే హక్కు

     19. కారణం లేకుండా బెయిలు నిరాకరించడంపై అడిగే హక్కు

     20. ఉచిత న్యాయ సహాయం పొందే హక్కు
 

ఇంటలెక్చువల్ ఫోరం Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎవరైతే కాలుష్యానికి కారకులయ్యారో వారే నష్టపరిహారం చెల్లించాలని పేర్కొంది.
 

ఉన్నికృష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (1993):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 14 ఏళ్ల వయసు వరకు విద్యార్జన హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా ప్రకటించింది. ఈ కేసు తీర్పులో మోహినీజైన్ కేసులోని అన్ని స్థాయుల్లో విద్యార్జన హక్కు పరిధిని తగ్గించి 14 సంవత్సరాల పరిమిత స్థాయికి కుదించారు.

జ్ఞాన్ కౌర్ Vs పంజాబ్ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, మరణించే హక్కు ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది.
 

చంద్రభాను Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ సస్పెండ్ అయిన ప్రభుత్వోద్యోగికి నెలకు ఒక రూపాయి చొప్పున నామమాత్రపు జీవనభృతిని ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమైందని పేర్కొంది.
 

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1997):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఫోను సంభాషణను దొంగచాటుగా వినడం, ఏకాంత హక్కును ఉల్లంఘించడమేనని, వ్యక్తిగత రహస్యాలను కాపాడుకునే హక్కు ఆర్టికల్ 21లో అంతర్భాగమని పేర్కొంది.
 

డాక్టర్ కునాల్ సాహు Vs అడ్వాన్స్‌డ్ మెడికేర్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కోల్‌కతా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆరోగ్యమనేది ఆర్టికల్ 21 కింద ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, జీవితంపై ఆశతో, గౌరవంతో వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారించే వైద్యసిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం కింద కునాల్ సాహుకు రూ.11.41 కోట్లు పరిహారం అందించాలని సంబంధిత వైద్యశాలను, వైద్యులను ఆదేశించింది. కునాల్‌సాహు భార్య అనూరాధ వైద్యం కోసం వెళ్లడంతో వైద్యం అందించే క్రమంలో చేసిన పొరపాట్ల వల్ల ఆమె మరణించారు.

ఖత్రి Vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసు (1981):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఒక వ్యక్తి న్యాయపరమైన సహాయం కోసం ఖర్చు చేయలేని పేదరికంలో ఉంటే అతడికి ఉచిత న్యాయ సహాయాన్ని కల్పించాలని, లేదంటే అది ఆర్టికల్ 21ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
 

లక్ష్మణ్‌దేవి Vs అటార్నీ జనరల్ కేసు (1986):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బహిరంగంగా ఉరి తీయడం అనేది ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అని పేర్కొంది.
 

ప్రకాశ్ కదమ్ Vs రాంప్రసాద్ గుప్తా కేసు (2013):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడిన సందర్భంలో అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు రుజువైతే, సంబంధిత అధికారులకు ఉరిశిక్షను విధించవచ్చని పేర్కొంది.
 

రామ్‌శరణ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1989):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, జీవితం అంటే మానవ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వంతో కూడుకుని ఉంటుందని పేర్కొంది.
 

రతినామ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ జీవించే హక్కుతోపాటు స్వచ్ఛందంగా మరణించాలనే హక్కును కూడా ప్రాథమిక హక్కుగా పేర్కొంది.

కేహర్‌సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఉరిశిక్ష రాజ్యాంగ విరుద్ధం కాదని, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్‌గా మాత్రమే వినియోగించాలని తీర్పునిచ్చింది.
 

వీడియోకాన్ Vs మహారాష్ట్ర కేసు (2013):

ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 21 ప్రకారం లభిస్తున్న జీవించే హక్కు, స్వేచ్ఛ అనేవి విదేశీయులకు కూడా వర్తిస్తాయని పేర్కొంది.
 

భువన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు (1974):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తి స్వేచ్ఛ, జీవించే హక్కు పౌరులు, విదేశీయులకు మాత్రమే కాకుండా చట్టం ప్రకారం శిక్షను అనుభవిస్తున్న నేరస్థులకు కూడా వర్తిస్తుందని పేర్కొంది.

* ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యా ప్రయత్నం శిక్షార్హమైన నేరం.

* జైనుల సంప్రదాయమైన సల్లేఖన (ఉపవాస దీక్ష ద్వారా చనిపోవడం)ను ఆత్మహత్యగా పరిగణించకూడదని 2015 ఆగస్టులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 

కారుణ్య మరణం (Euthanasia)

* అరుణ షాన్‌బాగ్ అనే ఒక నర్సు బొంబాయి ఎడ్వర్డ్ ఆసుపత్రిలో లైంగిక దాడికి గురై కోమాలోకి వెళ్లిపోయి 37 సంవత్సరాలు విషమ స్థితిలో ఉంది. ఈమె తరఫున పింకి వీరాని అనే పాత్రికేయురాలు 2011లో సుప్రీంకోర్టులో కేసు వేసి, కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరగా, సుప్రీంకోర్టు తిరస్కరించింది.

ఆర్టికల్ 21(A): ఉచిత నిర్బంధ విద్యా హక్కు

* భారతీయులందరికీ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని స్వాతంత్రోద్యమ కాలంలో మితవాద నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే 1911లో ఆంగ్లేయులను కోరారు. రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 45 ద్వారా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పదేళ్లలోగా సాధించాలని రాజ్యాంగ నిర్మాతలు సంకల్పించారు.

* ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని చేసి, రాష్ట్ర జాబితాలోని విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చడంతో విద్యారంగంలో కేంద్రం పాత్ర పెరిగింది.
 

సుప్రీంకోర్టు తీర్పులు

మోహినీ జైన్ Vs కర్ణాటక కేసు, ఉన్నికృష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు

* ఈ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ విద్యాహక్కు అనేది జీవించే హక్కులోనూ, వ్యక్తి గౌరవాన్ని పొందే హక్కులోనూ అంతర్భాగంగా పేర్కొంది. 14 ఏళ్ల లోపు పిల్లలందరూ ప్రాథమిక విద్యను పొందడం ప్రాథమిక హక్కుగా పేర్కొంది.

* భారత ప్రభుత్వం 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21(A)ను చేర్చి, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా చేయాలని సంకల్పించింది. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయో వర్గంలోని బాలబాలికలందరికీ, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కును కల్పించారు. 

* 86వ రాజ్యాంగ సవరణ చట్టం (2002) ద్వారానే ఆర్టికల్ 45లో 6 ఏళ్లలోపు బాలబాలికలందరికీ శిశు సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని నిర్ణయించారు.

* ఈ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 51(A) లో 11వ ప్రాథమిక విధిగా 6 నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉన్న ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు/ సంరక్షకులపై ఉందని పేర్కొన్నారు.

* భారత పార్లమెంటు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మారుస్తూ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు చట్టాన్ని - 2009 (R.T.E.) ను ఆమోదించింది. ఈ చట్టం 2010, ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

* ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్న ప్రపంచ దేశాల్లో భారతదేశం 135వ దేశంగా అవతరించింది.
 

ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టంలోని ముఖ్యాంశాలు:

* 1 నుంచి 8వ తరగతి వరకు ఉండే ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందే వయోవర్గంలో 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలుంటారు.

* బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణత అనే నిబంధన ఉండకూడదు.

* ఉపాధ్యాయ - విద్యార్థి నిష్పత్తి 1 : 30 గా ఉండాలి.

* బాలిబాలికలను పాఠశాల నుంచి వెనక్కి పంపడం, వారి పేర్లను తొలగించడం చేయకూడదు.

* ప్రైవేట్ పాఠశాలల్లో 25% సీట్లు పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా కేటాయించాలి.

* ప్రవేశాన్ని కోరుతూ వచ్చిన బాలబాలికలకు ప్రవేశాన్ని నిరాకరించకూడదు.

* పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు 5 సంవత్సరాలలోగా తమ బోధనకు తగిన విద్యార్హత పొందాలి.

* ఈ చట్టం అమలుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65 : 35 నిష్పత్తిలో భరిస్తాయి.

* ఆరేళ్ల వయసు వచ్చిన తర్వాత వారిని ఏ తరగతిలో చేర్చడం సమంజసంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు/ సంరక్షకులు భావిస్తారో ఆ తరగతిలో విద్యార్థికి ప్రవేశం కల్పించాలి.

* బడి మానేసిన పిల్లలు వారి సమవయస్కులతో సమానంగా నిలిచేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.

* పాఠశాలలకు ప్రాథమిక వనరులు సమకూర్చుకునే విషయంలో ఏవైనా లోపాలుంటే 3 సంవత్సరాల్లోగా పూర్తి చేయాలి.

* విద్యాహక్కు చట్టానికి చెందిన "టన్‌టన్‌టన్ సునో ఘంటీ బజే స్కూల్‌కీ" అనే గీతాన్ని ప్రముఖ హిందీ గీత రచయిత జావేద్ అక్తర్ రాశారు.
 

శ్యామ్‌సుందర్ Vs తమిళనాడు స్టేట్ కేసు (2011):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బాలలకు ప్రమాణాలతో కూడిన విద్యను వారి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యంతో సంబంధం లేకుండా అందించాలని పేర్కొంది.

ఆర్టికల్ 22:

* అక్రమ నిర్బంధం నుంచి రక్షణ, అరెస్టుల నుంచి రక్షణ

* ఒక వ్యక్తిని అరెస్టు చేసినప్పుడు, విచారణ లేకుండా అతడిని నిర్బంధంలోనే ఉంచినప్పుడు అనుసరించాల్సిన ప్రక్రియను ఆర్టికల్ 22 తెలియజేస్తుంది.
 

ఆర్టికల్ 22(1):

* ప్రతి అరెస్టుకు కారణం ఉండాలి లేదా కారణాన్ని తెలియజేయాలి. అరెస్టయిన వ్యక్తికి న్యాయవాదిని సంప్రదించే అవకాశం ఇవ్వాలి.
 

ఆర్టికల్ 22(2):

* అరెస్ట్ చేసిన సమయం నుంచి ప్రయాణ సమయాన్ని మినహాయించి, అరెస్టయిన వ్యక్తిని 24 గంటల లోపల సమీప న్యాయస్థానంలో హాజరు పరచాలి.
 

ఆర్టికల్ 22(3):

* అరెస్టయిన వ్యక్తి శత్రుదేశానికి చెందిన వాడైతే, నివారక నిర్బంధ చట్టం కింద అరెస్ట్ అయితే ఆర్టికల్ 22(1), ఆర్టికల్ 22(2) నిబంధనలు వర్తించవు.

ఆర్టికల్ 22(4):

* ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం కింద అరెస్ట్ అయినవారిని 3 నెలలకు మించి నిర్బంధంలో ఉంచకూడదు. కానీ ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద ఏర్పాటైన అడ్వయిజరీ బోర్డు సూచన మేరకు 3 నెలల కంటే ఎక్కువ నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ బోర్డులో హైకోర్టు స్థాయి న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు.
 

ఆర్టికల్ 22(5):

* ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టయిన వారికి అరెస్టుకు గల కారణాలు సాధ్యమైనంత త్వరగా తెలియజేయాలి. దీనివల్ల బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసుకునే అవకాశాన్ని పొందుతారు.

ఆర్టికల్ 22(6):

* ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రివెంటివ్ చట్టాల కింద అరెస్ట్ అయినవారికి అరెస్టుకు గల కారణాలను వెల్లడి చేయకుండా ఉండేందుకు ప్రభుత్వానికి అధికారం ఉంటుంది.
 

ఆర్టికల్ 22(7):

* పార్లమెంటు కొన్ని రకాల కేసుల్లో ఆర్టికల్ 22(4)లో పేర్కొన్న సలహా సంఘం అభిప్రాయంతో నిమిత్తం లేకుండా 3 నెలల కంటే ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచడానికి అవకాశం కల్పిస్తూ శాసనాలను చేయవచ్చు.

* దేశ భద్రత, దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను చేసే శాసనాధికారం కేవలం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది.

* ప్రజాశ్రేయస్సు, రాష్ట్ర భద్రత, సమాజానికి అవసరమైన నిత్యావసర వస్తువులు, సేవలకు సంబంధించిన ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాలను రూపొందించడంలో, చట్టం చేసే విషయంలో పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు ఉమ్మడి శాసనాధికారాన్ని కలిగి ఉంటాయి.
 

మనదేశంలో రెండు రకాల నిర్బంధాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి. అవి:
1) శిక్షించే చట్టాలు (Punitive Detention):

* ఒక వ్యక్తి ఇదివరకే చేసి ఉన్న చర్యకు అతడిని నిర్బంధంలో ఉంచడం దీని లక్ష్యం. దీని ప్రకారం వ్యక్తి చేసిన నేరం నిరూపితమైన తర్వాత కోర్టు ద్వారా శిక్షను అమలు చేస్తారు.
 

2) నివారక నిర్బంధ చట్టం (Prevention Detention Act):

* ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటానికి ముందే అతడిని నిరోధించి ఆ పని చేయకుండా ఆపుతారు. ఈ కేసులో బందీ అయిన వ్యక్తిపై ఎలాంటి అభియోగం ఉండదు. చట్టం నిషేధించిన పనిని ఒక వ్యక్తి చేసే అవకాశం ఉందని అనుమానించినప్పుడు ఆ వ్యక్తిని ఈ చట్టం కింద నిర్బంధంలో ఉంచుతారు.

ముఖ్యమైన ప్రివెంటివ్ డిటెన్షన్ - చట్టాలు 

1. Preventive Detention Act: నివారక నిర్భంధ చట్టం: 1950

ఈ చట్టాన్ని 1950లో చేశారు. దీన్ని 1969, డిసెంబరు 31న రద్దు చేశారు.

2. Maintenance of Internal Security Act: 1971 (అంతర్గత భద్రతా నిర్వహణ చట్టం)

* ఈ చట్టాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం 1971లో రూపొందించింది. 1975 - 1977 మధ్య కాలంలో జాతీయ ఆంతరంగిక అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఈ చట్టం ద్వారా ప్రభుత్వం అపరిమితమైన అధికారాలను పొంది, ప్రతిపక్ష నాయకులైన జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వాజ్‌పేయిలను నిర్బంధించింది.

* మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో కేంద్రంలో జనతా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 44వ రాజ్యాంగ సవరణ చట్టం - 1978 ద్వారా M.I.S.A. చట్టాన్ని 1978లో రద్దు చేశారు.
 

3. COFEPOSA Act: 1974

* 1974లో Conservation of Foreign Exchange and Prevention of Smuggling activities Act చట్టాన్ని రూపొందించారు. దీని ప్రకారం విదేశీ మారక మార్పిడి, దొంగ రవాణా కార్యకలాపాల నివారణ చట్టం చేశారు.
 

4. National Security Act జాతీయ భద్రత చట్టం: (1980)

* జాతీయ భద్రతా చట్టాన్ని 1980లో రూపొందించారు. దీని ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్‌లకు, పోలీసు కమిషనర్లకు నిరోధక ఆజ్ఞలు జారీ చేసే అధికారం లభించింది. ఈ ఆజ్ఞలు 12 రోజులపాటు అమల్లో ఉంటాయి. నిర్బంధించిన వ్యక్తి అరెస్టుకు కారణాలు తెలపాలి.

5. PBMSECAAct: 1980

* 1980లో Prevention & Black Marketing and Maintenance of Essential Commodities Act చేశారు.

* దీని ప్రకారం అత్యవసర సరకుల దొంగ వ్యాపారాన్ని నిరోధిస్తూ చట్టం చేశారు.
 

6. Smugglers and Foreign Exchange Manipulators Act: 1976

* ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి రెగ్యులేషన్ నిర్బంధాలు, స్మగ్లర్, ఫారిన్ ఎక్స్ఛేంజుల్లో అక్రమాలను నిషేధిస్తూ, ఈ చట్టాన్ని 1976లో చేశారు.
 

7. TADA 1985: (Terrorists and Disruptive Activities Prevention Act):

* ఉగ్రవాదుల, విచ్ఛిన్నకర కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1985, మే 23 నుంచి అమలు చేశారు. దీన్ని 1995లో రద్దు చేశారు.
 

8. ESMAAct: (1988)

* Essential Services Maintenance Actని 1988లో చేశారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రభుత్వ శాఖల్లోనూ, ప్రైవేట్ సంస్థల్లోనూ, ప్రభుత్వరంగ సంస్థల్లోనూ సమ్మెలను, లాకౌట్లను, లే - ఆఫ్‌లను నిషేధించే అధికారాన్ని కల్పించింది.
 

9. PITNDPSA: (1988)

* Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotrophic Substances Act.

10. UAPA: (1968)

* Unlawfull Activity Prevention Act. ఈ చట్టాన్ని 1968లో ప్రవేశపెట్టారు. 2004లో అనేక సవరణలకు గురై నూతన UAPA చట్టంగా 2004 నుంచి అమల్లో వచ్చింది.

11. POTA (Prevention of Terrorism Act): 2002

* ఈ చట్టాన్ని 2002లో NDA ప్రభుత్వం రూపొందించింది. దీన్ని 2004లో UPA ప్రభుత్వం రద్దు చేసింది.
 

సుప్రీంకోర్టు తీర్పులు

A.K. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు: (1950)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్నప్పుడు అతడిని ఏ కారణాలపై అరెస్టు చేస్తున్నారో తెలియజేయడం సంబంధిత పోలీసు అధికారి బాధ్యత. అరెస్టుకు కారణాలను అరెస్టయిన తర్వాత త్వరగా తెలియజేయకపోతే ఆ అలసత్వానికి దారితీసిన కారణాల గురించి పోలీసులు కోర్టుకు తెలపాల్సి ఉంటుంది.
 

భరత్ షా Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థీకృత నేరాలను నిరోధించడం కోసం తీసుకొచ్చిన మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజెడ్ క్రిమినల్ యాక్టివిటీస్ చట్టం రాజ్యాంగ బద్దమేనని పేర్కొన్నది.

కర్తార్‌సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో ప్రవేశపెట్టిన TADA చట్టం అనేక సందర్భాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగమైందని, ఈ చట్టం అమలును నిలిపివేయాలని 1995లో తీర్పునిచ్చింది. దీంతో పి.వి. నరసింహారావు ప్రభుత్వం 1995లో TADA చట్టాన్ని రద్దు చేసింది.
 

అబ్దుల్ సమద్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ పదేశ్ కేసు: (1962)

* అరెస్టయిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరు పరచకపోతే, 24 గంటలు గడిచిన తర్వాత ఆ వ్యక్తి విడుదల అయ్యే హక్కు కలిగి ఉంటాడని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
 

జోగిందర్ కుమార్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్: (1994)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు, ఆ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు ఆర్టికల్ 22 ప్రకారం తప్పనిసరిగా తెలియజేయాలని పేర్కొంది.
 

లూయిస్ డి రిడిట్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1991)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, 19వ నిబంధనలో అంతర్భాగమైన హక్కులు విదేశీయులకు వర్తించవని పేర్కొంది.
 

చంద్రిమదాస్ Vs రైల్వే బోర్డు ఛైర్మన్ కేసు: (2000)

* బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ మన దేశంలో సామూహిక అత్యాచారానికి గురి కావడంతో ఆమెకు నష్టపరిహారాన్ని అందించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.

రుస్తుం కవస్జీ కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1970)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, వివిధ వర్గాల ప్రజలు ఏయే ఏ సందర్భాల్లో రిట్ పిటిషన్లు వేయాలో పేర్కొంది.
 

హేమదర్ హజారికా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో గౌహతి హైకోర్టు తీర్పునిస్తూ పోలీస్ కస్టడీలో మరణించడం ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని, ఆర్టికల్ 21 ప్రసాదించే జీవించే హక్కుకు విరుద్ధమని, బాధితుడి వారసులకు నష్టపరిహారం పొందే హక్కు ఉందని కోర్టు పేర్కొంది.

* మన దేశంలో వ్యక్తి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అణిచివేసి, నియంతృత్వ రాజ్యస్థాపనకు, అధికారయుత రాజ్యస్థాపనకు తోడ్పడే అంశాలుగా పి.డి. చట్టాలను అభివర్ణించినవారు కె.టి.షా.
 

3. పీడనాన్ని నిరోధించే హక్కు: ఆర్టికల్స్ 23, 24

ఆర్టికల్ 23 ప్రకారం

* వ్యక్తులను నిర్బంధ పూర్వకంగా పనిచేయించడం నిషిద్ధం.

* వెట్టిచాకిరి (బేగార్) వ్యవస్థను నిషేధించారు.

* మనుషుల అక్రమ రవాణా, కొనుగోలు లాంటి అంశాలను నిషేధించారు.

* వ్యభిచారం, జోగినీ, దేవదాసి లాంటివి నిషేధించారు.
 

ఆర్టికల్ 23ను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేసిన చట్టాలు

* స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపార నిరోధక చట్టం, 1956

* వెట్టి చాకిరీ నిరోధక చట్టం, 1976

* కనీస వేతనాల చట్టం, 1976

* సమాన పనికి సమాన వేతన చట్టం, 1976

* అనైతిక కార్యకలాపాల నిషేధ చట్టం, 1978
 

ఆర్టికల్ 24:

* బాలబాలికలతో పరిశ్రమల్లో బలవంతంగా పనిచేయించకూడదు.

* 14 ఏళ్ల లోపు బాలబాలికలు నిర్బంధ ప్రదేశాలైన గనులు, పేలుడు పదార్థాల తయారీ, పరిశ్రమలు లాంటి చోట పనిచేయడం నిషిద్ధం.

* బాలబాలికల మానసిక, శారీరక ఆరోగ్యాలను, దృఢత్వాన్ని కాపాడేందుకు కృషి చేయాలి.

ఆర్టికల్ 24 అమలు కోసం ప్రభుత్వం చేసిన చట్టాలు:

* బాలల హక్కుల చట్టం, 1938

* ఫ్యాక్టరీల చట్టం, 1948

* గనుల చట్టం, 1952

* మర్చెంట్ షిప్పింగ్ చట్టం, 1958

* ప్లాంటేషన్ కార్మిక చట్టం, 1951

* మనుషుల అక్రమ వ్యాపార నిషేధ చట్టం, 1956

* అప్రెంటీస్‌షిప్ చట్టం, 1961

* వరకట్న నిషేధ చట్టం, 1961

* బీడీ కార్మికుల, సిగరెట్ కార్మికుల చట్టం, 1966

* బాల కార్మిక నిషేధ చట్టం, 1986

* గృహ హింస నిరోధక చట్టం, 2005

* బాల కార్మికుల హక్కుల చట్టం, 2005

సుప్రీంకోర్టు తీర్పులు
దీనా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1983)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ కనీస వేతనం చెల్లించకుండా ఖైదీలతో పనిచేయించడం వెట్టిచాకిరీ కిందకు వస్తుందని పేర్కొంది.
 

రంజిత్‌రాయ్ Vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్ కేసు: (1983)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పనికి ఆహార పథకం కింద పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతన చట్టాలు వర్తింపజేయాలని తీర్పునిచ్చింది.
 

పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (PUCL) Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (2001)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆసియా క్రీడల నిర్వహణ కోసం చేసే నిర్మాణాల దగ్గర పనిచేసే కార్మికులకు కూడా కనీస వేతనాలు చెల్లించాలని, అలా చెల్లించని సందర్భంలో వారిని పీడిస్తున్నట్లు భావించాలని తీర్పునిచ్చింది.
 

పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 14 ఏళ్లలోపు బాలలను నిర్మాణరంగం లాంటి ప్రమాదకరమైన పనుల్లో నియమించకూడదని పేర్కొంది.

ఎం.సి.మెహతా Vs తమిళనాడు కేసు: (1997)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 14 సంవత్సరాల లోపు పిల్లలను ప్రమాదకరమైన లేదా పరిశ్రమల్లో పనుల కోసం నియమించకూడదని పేర్కొంది.

* బాలకార్మికుల పునరావాస నిధిని ఏర్పాటు చేసి, ఆ నిధికి బాలకార్మికులతో పనిచేయించుకుంటున్న యజమానుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసిన రూ.20,000 రూపాయలను కూడా డిపాజిట్ చేయాలని పేర్కొంది.
 

దిల్లీ హైకోర్టు తీర్పు: (2004)

* పాఠశాలల్లో విద్యార్థులను భౌతికంగా దండించడం కూడా పీడనం కిందకే వస్తుందని తీర్పునిచ్చింది.

* 2004లో ఎమ్.ఎస్. గురుపాదస్వామి నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ బాల కార్మికుల హక్కుల సంరక్షణ కోసం అనేక సూచనలు చేసింది.
 

4. మత స్వాతంత్య్రపు హక్కు: ఆర్టికల్ 25 నుంచి 28 వరకు

* భారతదేశం ప్రాచీన కాలం నుంచి మత సామరస్యానికి పుట్టినిల్లు. రాజ్యానికి మతంతో ప్రమేయం లేదు. మత వ్యవహారాల్లో ప్రభుత్వం తటస్థంగా ఉంటుంది. రాజ్యానికి అధికార మతం అంటూ ఉండదు.

* ఇందిరా గాంధీ ప్రభుత్వం 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా రాజ్యాంగ ప్రవేశికకు లౌకిక (Secular) అనే పదాన్ని చేర్చింది.

ఆర్టికల్ 25(1)

* ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు. ప్రతి వ్యక్తి అంతరాత్మ ప్రబోధానుసారం మతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడకూడదు. బలవంతపు మత మార్పిడులను నిషేధించిన తొలి రాష్ట్రం ఒరిస్సా (1965).
 

ఆర్టికల్ 25(2)

* మత సంబంధమైన అంశాలతో ఉన్న ఆర్థిక, రాజకీయ అంశాలతోపాటు శాంతి భద్రతల దృష్ట్యా పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
 

ఆర్టికల్ 25(3)

* నిమ్న వర్గాలకు చెందిన ప్రజలు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశించడానికి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలను రూపొందించవచ్చు.
 

ఆర్టికల్ 25(4)

* సిక్కులు తమ మతాచారాన్ని అనుసరించి కృపాణం (ఖడ్గం) ధరించే స్వేచ్ఛపై ప్రభుత్వం చట్టాలను రూపొందించవచ్చు.
 

ఆర్టికల్ 25(2)(b)

* హిందువులు అనే పదంలో సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా సమ్మిళితమై ఉన్నారు.

ఆర్టికల్ 26:

* మత సంస్థలు, మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛ.

* మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలు స్థాపించి నిర్వహించుకోవచ్చు.

* మత సంస్థల నిర్వహణకు అవసరమైన స్థిర, చరాస్తులను సమకూర్చుకోవచ్చు.

* చట్టం ప్రకారం స్థిర, చరాస్తులను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంటుంది.
 

ఆర్టికల్ 27

* మత పరంగా ఏ వ్యక్తి నుంచి పన్నులు వసూలు చేయకూడదు.

* మతాన్ని అభివృద్ధి చేసుకునేందుకు మతపరమైన పన్నులను వసూలు చేయకూడదు.

* ప్రభుత్వం మత ప్రాతిపదికపై ప్రత్యేక సేవలు అందించినందుకుగాను ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్నులు వసూలు చేయవచ్చు.
 

ఆర్టికల్ 28: విద్యాలయాల్లో మత బోధన నిషేధం

ఆర్టికల్ 28(1)

* ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధం.

ఆర్టికల్ 28(2)

* కొన్ని ప్రత్యేక మినహాయింపులతో ప్రభుత్వం నిర్వహిస్తున్న దేవాదాయ, ధర్మాదాయ సంస్థల్లో మత బోధన చేయవచ్చు.
 

ఆర్టికల్ 28(3)

* ప్రభుత్వ గుర్తింపు పొంది ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లో ఒక వ్యక్తి ఐచ్ఛికంగా లేదా మైనర్ అయితే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల అనుమతితో మాత్రమే ప్రత్యేక మత బోధన చేయవచ్చు.
 

సుప్రీంకోర్టు తీర్పులు

నరసు అప్పమణి Vs స్టేట్ ఆఫ్ బొంబాయి కేసు: (1951)

* ఆర్టికల్ 25(2)(b) ప్రకారం ఒకే వ్యక్తి రెండు పెళ్లిళ్లు చేసుకోవడాన్ని నిషేధిస్తూ బొంబాయి ప్రభుత్వం చేసిన చట్టం సరైందేనని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది.
 

ఎస్.పి.మిట్టల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1983)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ రామకృష్ణ మఠం, కంచి కామకోటి పీఠం, ఇతర పీఠాలు, మఠాలు కూడా హిందూమతంలో ఒక ఉపశాఖ కిందకు వస్తాయని పేర్కొంది. కానీ ఆర్యసమాజం, అరబిందో సొసైటీ లాంటివి మతం కిందకు రావని పేర్కొంది.

బిజో ఇమాన్యుయెల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు: (1986)

* క్రైస్తవ మతానికి చెందిన కొందరు విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలో జాతీయ గీతాలాపన సమయంలో లేచి నిలబడుతున్నారే తప్ప జాతీయ గీతాన్ని పాడటం లేదు. ఫలితంగా ఆ విద్యార్థులను పాఠశాల నుంచి బహిష్కరించారు. దీన్ని కేరళ హైకోర్టు సమర్థించింది.

* బహిష్కరణకు గురైన విద్యార్థుల తరఫున ఆర్టికల్ 136 ప్రకారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో లేచి నిలబడ్డారంటే జాతీయ గీతాన్ని గౌరవిస్తున్నారనీ, జాతీయ గీతాన్ని ఆలపించకపోవడం తప్పు కాదని పేర్కొంటూ, కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.
 

భారత నాస్తిక సంఘం Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు:

* ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో, ప్రభుత్వ పండగల్లో కొబ్బరికాయలు కొట్టడం, పూజలు చేయడం, వివిధ మతాల మంత్రాలు, సూక్తులు చదవడాన్ని భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమని సమర్థిస్తూ దేవుడు లేడని నమ్మే నాస్తిక మతానికి రాజ్యాంగ హామీ ఏమీ లేదని, మత ఆచరణలను లౌకిక రాజ్యం నిషేధించలేదని పేర్కొంది.
 

రెవరెండ్ స్టానిస్‌లాస్ Vs స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసు: (1977)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ బలవంతపు మతమార్పిడులను నిషేధిస్తూ మధ్యప్రదేశ్, ఒడిస్సా ప్రభుత్వాలు రూపొందించిన చట్టాలు రాజ్యాంగ విరుద్ధం కావని పేర్కొంది.

మహ్మద్ హనీఫ్ ఖురేషి Vs బీహార్ రాష్ట్రం కేసు: (1958)

* ఈ కేసులో పాట్నా హైకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 25(2)(A) కింద ప్రభుత్వం గోవధను నిషేధించడం సరైందేనని, బక్రీద్ పండగ సమయంలో ముస్లింలు గోవధ చేయడాన్ని వ్యతిరేకించింది.
 

రెహ్మాన్ బర్మతి Vs స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు: (1998)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రార్థనా మందిరాల్లో మైకుల వాడకాన్ని, ధ్వని కాలుష్యాన్ని నిషేధించింది. ప్రార్థనా మందిరాల్లో నిర్ణీత సమయం తర్వాత మైకులు వాడటం మత స్వేచ్ఛకు సంబంధించిన ప్రాథమిక హక్కు పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
 

జి.కె.హెచ్. మీనన్ Vs సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ కేసు

* ఈ కేసులో గుజరాత్ హైకోర్టు తీర్పునిస్తూ రహదారులను వెడల్పు చేసే క్రమంలో రహదారులపై ఉన్న ప్రార్థనా మందిరాలను తొలగించడం సమర్థనీయమేనని పేర్కొంది.
 

అజ్మీర్ దర్గా కమిటీ Vs సయ్యద్ హుస్సేన్ అలీ కేసు: (1961)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 26(d) ప్రకారం మత సంస్థలు ఆస్తులను నిర్వహించుకోవడం అనేది సమర్థనీయమేనని పేర్కొంది.

సెయింట్ జేవియర్ కాలేజీ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు: (1974)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికత్వం అంటే దేవుడి పట్ల ద్వేషం లేదా స్నేహం చూపని స్వభావం అనీ, ఇది దేవుడిని ఇష్టపడే వ్యక్తిని, ఇష్టపడని వ్యక్తిని ఒకే విధంగా చూస్తుందని పేర్కొంది.
 

ఎస్.ఆర్. బొమ్మై Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1994)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ లౌకికత్వం (Secular) అనేది భారత రాజ్యాంగ మౌలిక లక్షణంగా నొక్కి చెప్పింది.
 

ఎ.ఎస్. నారాయణ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు: (1996)

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్చకులకు వారసత్వ హక్కులను రద్దు చేస్తూ ఎండోమెంటు చట్టాన్ని చేయడాన్ని సవాల్ చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రధాన పూజారి అయిన ఎ.ఎస్. నారాయణ సుప్రీంకోర్టు ఆశ్రయించారు.

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ అర్చకుల నియామకాలను లౌకిక కార్యకలాపంగా పేర్కొంటూ, దాన్ని ప్రభుత్వం చట్టం ద్వారా క్రమబద్ధం చేయవచ్చని, ఈ చట్టం ఆర్టికల్స్ 25, 26ను ఉల్లంఘించినట్లు కాదని పేర్కొంది.
 

రతీలాల్ Vs స్టేట్ ఆప్ బొంబాయి కేసు (1954):

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అంతరాత్మ ప్రబోధానుసారం మతవిశ్వాసాలను కలిగి ఉండే హక్కును గురించి వివరిస్తూ పన్ను, ఫీజు మధ్య ఉండే తేడాలను వివరించింది.

* పన్ను అనేది సార్వజనిక ప్రయోజనాల నిమిత్తం బలవంతంగా డబ్బును వసూలు చేయడమని, ఫీజులు అనేవి నిర్దిష్ట ప్రయోజనం కోసం చేసే చెల్లింపులు అని పేర్కొంది. ఏవైనా మత సంస్థలు అందించే సేవలకు ఫీజులు వసూలు చేసినట్లయితే అది ఆర్టికల్ 27 కింద రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీం కోర్టు పేర్కొంది.

అజీజ్ బాషా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1968):

* అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని ముస్లిం మత శాఖ నెలకొల్పలేదని ఆర్టికల్ 26(ఎ) ప్రకారం యూనివర్సిటీకి చెందిన ఆస్తులను నిర్వహించే అధికారం ముస్లిం మైనారిటీ వర్గానికి లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 

ఇస్మాయిల్ ఫారుఖి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు (1994):

* అయోధ్యలోని బాబ్రీమసీదు కూల్చివేత అనంతరం దేశంలో శాంతి భద్రతలు కాపాడటానికి మసీదును ఆనుకొని ఉన్న మొత్తం ప్రాంతాన్ని ఒక చట్టం చేసి కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీని వల్ల ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రార్థనలు చేసుకునే హక్కును తాము కోల్పోయామని పిటిషనర్లు పేర్కొనగా సుప్రీం కోర్టు పిటిషనర్ల వాదనను తిరస్కరిస్తూ తీర్పునిచ్చింది.
 

కె.ఎస్. కుట్టి Vs ఐ.జి. పోలీస్ ఆఫ్ త్రివేండ్రం కేసు: (1987)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ పోలీసు ఉద్యోగాలు చేసేవారు గడ్డం పెంచరాదని నిషేధిస్తూ చేసిన చట్టం ఉత్తర్వులు ఇస్లాం మతం సూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
 

వెంకటరమణ దేవరు Vs స్టేట్ ఆఫ్ మైసూరు కేసు: (1957)

* పూజలు చేయడానికి దేవాలయంలోకి ప్రవేశించే హక్కు అపరిమిత స్వభావం కాదని, ఎవరైనా/ఎవరికైనా పగలు, రాత్రి అన్ని వేళల్లోనూ పూజించడానికి హిందూ దేవాలయాలను తెరిచి ఉంచాలని అడిగే హక్కులేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.

5. విద్య, సాంస్కృతిక హక్కు: ఆర్టికల్స్ 29, 30

* మన దేశంలోని భిన్నమైన భాషలు, మతాలు, సంస్కృతులు, ఆచార, సంప్రదాయాలను కలిగినవారు ఉన్నారు. వీరు తమ భాషలను, లిపిని, సంస్కృతిని ఆచరించి, అభివృద్ధి చేసుకుని స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కలిగి ఉండే హక్కును రాజ్యాంగ నిర్మాతలు కల్పించారు.
 

ఆర్టికల్ 29: అల్పసంఖ్యాక వర్గాలవారి ప్రయోజనాలు

ఆర్టికల్ 29(1)

* దీని ప్రకారం భారతదేశంలోని ప్రజలు ఏ వర్గానికి చెందినవారైనా వారికి ప్రత్యేక భాష, లిపి లేదా సంస్కృతి ఉన్నట్లయితే దాన్ని కాపాడుకునే హక్కు వారికి ఉంది.
 

ఆర్టికల్ 29(2)

* ప్రభుత్వం పోషించే లేదా ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందే ఏ విద్యా సంస్థల్లోనైనా కేవలం మతం, జాతి, కులం, భాష అనే కారణాల ఆధారంగా ఏ పౌరుడికి ప్రవేశం తిరస్కరించకూడదు.
 

ఆర్టికల్ 30:

* అల్పసంఖ్యాక వర్గాలవారు విద్యాసంస్థలను స్థాపించడం, నిర్వహించడం.

ఆర్టికల్ 30(1)

* మత ప్రాతిపదికపై లేదా భాషా ప్రాతిపదికపై ఏర్పడిన అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన ప్రజలు, తమ అభీష్టం మేరకు విద్యా సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకోవచ్చు.

* భారత రాజ్యాంగంలో మైనార్టీ పదం గురించి ఎలాంటి నిర్వచనం లేదు. చట్టబద్ధంగా మన దేశంలో మతపరమైన, భాషాపరమైన మైనార్టీలను గుర్తించారు.

* మతపరమైన మైనార్టీలను గుర్తించేటప్పుడు దేశం మొత్తాన్ని ఒక యూనిట్‌గా పరిగణించగా, భాషాపరమైన మైనార్టీలను గుర్తించేటప్పుడు రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

* మన దేశంలో హిందువులు మినహా మిగతా వారందరూ మతపరమైన మైనార్టీల కిందకు వస్తారు.

* జాతీయ స్థాయిలో అధిక సంఖ్యాకులైన హిందువులను జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో అల్పసంఖ్యాకులుగా పరిగణిస్తున్నారు.
 

ఆర్టికల్ 30(2)

* ఆర్థిక సహాయాన్ని అందజేసే విషయంలో ప్రభుత్వం అల్పసంఖ్యాక వర్గాలు నడిపే విద్యాసంస్థలు, అధిక సంఖ్యాక వర్గాలు నడిపే విద్యాసంస్థల మధ్య వ్యత్యాసం చూపకూడదు.

* మైనార్టీ వర్గాల విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను, పాలకవర్గాన్ని నియమించుకునే అధికారం వారికి ఉంది. విద్యా సంస్థల్లో బోధనా మాధ్యమాన్ని నిర్ణయించుకునే హక్కు కూడా వారికి ఉంది. కానీ మైనార్టీ విద్యాసంస్థల మీద ప్రభుత్వం కొన్ని హేతుబద్ధమైన పరిమితులను విధించవచ్చు.
ఉదా: బోధనా సిబ్బందికి ఉండాల్సిన విద్యార్హతలను నిర్ణయించడం.

సుప్రీంకోర్టు తీర్పులు

ఆల్ సెయింట్స్ స్కూల్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు: (1980)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యాసంస్థల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని పేర్కొంది.
 

సెయింట్ జేవియర్ కాలేజ్ Vs స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు: (1974)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యా సంస్థల బోధన, బోధనేతర సిబ్బంది, ఎంపిక సందర్భంలో వారికి స్వేచ్ఛ ఉంటుందని, ప్రభుత్వాలు అనవసరంగా జోక్యం చేసుకోరాదని తీర్పునిచ్చింది.
 

ఫ్రాంక్ ఆంటోని Vs దిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ మైనార్టీ విద్యా సంస్థల్లో పనిచేసే సిబ్బందికి చెల్లించే జీతభత్యాల విషయంలో, ప్రభుత్వ నిబంధనలను పాటించని సందర్భంలో ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారాన్ని కలిగి ఉందని పేర్కొంది.
 

డి.ఎ.వి.కాలేజీ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు

* గురునానక్‌దేవ్ విశ్వవిద్యాలయం తమ అనుబంధ కళాశాలైన డి.ఎ.వి. కళాశాలలో పంజాబీ భాష మాత్రమే బోధనా భాషగా ఉండాలని ఆదేశించడం చెల్లదని, తమకు నచ్చిన భాషలో విద్యను అభ్యసించే స్వేచ్ఛ ప్రతి వ్యక్తికీ ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 

పి.ఎ. ఇనాందార్ Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రయివేట్, అన్ఎయిడెడ్ విద్యాసంస్థల్లో అంటే మైనార్టీల నిర్వహణలో ఉన్న సంస్థల్లో రిజర్వేషన్ వర్తించదని పేర్కొంది.

టి.ఎమ్.ఎ. పాయ్ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు: (2003)

* ఈ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిస్తూ, ప్రభుత్వాలు మైనార్టీ విద్యాసంస్థల్లో జోక్యం చేసుకునే సందర్భాలు, జోక్యం చేసుకోకూడని సందర్భాలను వివరించింది.
 

జోక్యం చేసుకునే సందర్భాలు:

* విద్యా ప్రమాణాలను మెరుగుపరిచే, సంరక్షించే సందర్భంలో

* విద్యాసంస్థలు ప్రభుత్వ నియమ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు

* విద్యాసంస్థల నిర్వహణలో అక్రమాలు ఉన్నప్పుడు

* ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలను అనుసరించి, వసతులను కల్పించనప్పుడు

* విద్యా సంస్థ అక్రమాలకు పాల్పడినప్పుడు
 

జోక్యం చేసుకోకూడని సందర్భాలు:

* సిబ్బంది ఎంపిక

* సంస్థ నిర్వహణ

* అభివృద్ధి

* కాల నిర్ణయ పట్టికను నిర్ణయించడం

* ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహించడం

ప్రమతి ఎడ్యుకేషనల్ సొసైటీ Vs స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసు:

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, ప్రాథమిక విద్య మొత్తం పూర్తిగా, కన్నడ భాషలో మాత్రమే బోధించాలని పేర్కొంటూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. వ్యక్తులు విద్యను ఆర్జించే విషయంలో తమకు నచ్చిన భాషను ఎంచుకునే స్వేచ్ఛ ఉందని పేర్కొంది.
 

చంపకం దొరై రాజన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు: (1951)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, మద్రాస్ ప్రభుత్వం కులం, మతం, జాతి, ప్రాతిపదికపై వైద్య, ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్ని సీట్లను రిజర్వు చేయడం ఆర్టికల్ 29(2)ను ఉల్లంఘించడం అవుతుంది అందువల్ల అది చెల్లదని పేర్కొంది.
 

జగదేవ్‌సింగ్ సిద్ధాంతి Vs ప్రతాప్‌సింగ్ దౌల్తా కేసు: (1965)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, పౌరుల భాషా పరిరక్షణ హక్కులో భాషా రక్షణకు ఉద్యమించే హక్కు కూడా చేరి ఉందని స్పష్టం చేసింది.
 

హిందీ హిత రక్షక్ సమితి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1990)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రాంతీయ భాషలో ప్రవేశ పరీక్ష నిర్వహించకపోవడం ఆర్టికల్ 29(2) కింద ఉల్లంఘన కాదని పేర్కొంది.

ఉన్నికృష్ణన్ Vs స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు: (1993)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ ఒక విద్యాసంస్థను గుర్తించే లేదా అనుబంధించే హక్కు ప్రాథమిక హక్కు కాదని పేర్కొంది.
 

ఫాదర్ థామస్ షింగారే Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు: (2002)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోకుండా ఒక మైనార్టీ సంస్థ విద్యాసంస్థను నడుపుతున్నంత కాలం, ఆ సంస్థలో విద్యాబోధనను మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం మినహా ఆ విద్యాసంస్థ పరిపాలనలో ఎలాంటి పరిమితులు విధించడానికి ప్రభుత్వానికి అధికారం లేదని పేర్కొంది.
 

6. ఆస్తి హక్కు ఆర్టికల్ 31

* భారత రాజ్యాంగంలో ప్రారంభంలో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా ఉండేది. ఆస్తి హక్కుకు సంబంధించి పార్లమెంట్ అనేక రాజ్యాంగ సవరణ చట్టాలను చేసింది. అవి:

* 1951లో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం

* 1964లో 17వ రాజ్యాంగ సవరణ చట్టం

* 1971లో 24వ రాజ్యాంగ సవరణ చట్టం

* మొరార్జీ దేశాయ్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి, రాజ్యాంగంలోని 12వ భాగంలోని ఆర్టికల్ 300 (A)లో సాధారణ చట్టబద్ధమైన హక్కుగా మార్చింది. ఇది 1979, జూన్ 20 నుంచి అమల్లోకి వచ్చింది.

ఆర్టికల్ 31(A)

* ప్రభుత్వం ఆస్తిని స్వాధీనం చేసుకున్నప్పుడు వర్తించే కొన్ని మినహాయింపులు, భూసంస్కరణల అమలు కోసం చేసిన చట్టాలు దీనిలో ఉన్నాయి.

* ఇవి ఆర్టికల్ 14, 19కి వ్యతిరేకంగా ఉన్నాయని న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదు.
 

ఆర్టికల్ 31(B)

* కొన్ని చట్టాల వర్తింపునకు సంబంధించిన మినహాయింపులు ఉన్నాయి.

* వీటిని 9వ షెడ్యూల్‌లో వివరించారు. ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణాలపై ఇలాంటి చట్టాలను న్యాయస్థానంలో ప్రశ్నించకూడదు. 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలు సాధారణంగా న్యాయ సమీక్ష అధికారం పరిధిలోకి రావు. కానీ సుప్రీంకోర్టు 1973లో కేశవానంద రతి కేసులో కీలకమైన తీర్పునిస్తూ, న్యాయసమీక్ష అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.

ఐ.ఆర్. కొల్హాయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు: (2007)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన అంశాలు న్యాయ సమీక్షకు గురవుతాయని పేర్కొంది.

ఆర్టికల్ 31(C)

* నిర్దేశిక నియమాల అమలు కోసం ప్రాథమిక హక్కులపై, ముఖ్యంగా ఆస్తి హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. ఇలాంటి పరిమితులు రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించే వీల్లేదు.

* నిర్దేశిక నియమాల్లోని ఆర్టికల్ 39లోని క్లాజ్ బి, సిలో పేర్కొన్న సామ్యవాద తరహా సమాజ స్థాపనకు పార్లమెంటు రాజ్యాంగ సవరణ ద్వారా కొన్ని పరిమితులను విధిస్తే, ఆ పరిమితులను ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమంటూ న్యాయస్థానాల్లో ప్రశ్నించకూడదు.
 

రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ 32

* భారత పౌరుల హక్కులకు, స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భవిష్యత్తులో ఏ రకమైన ఆటంకాలు కానీ లేదా భంగం కానీ కలగకుండా ఉండటం కోసం రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కుల సంరక్షణ బాధ్యతను సుప్రీం కోర్టు, హైకోర్టులకు అప్పగించారు.

* ఈ హక్కును రాజ్యాంగం ప్రసాదించే ప్రాథమిక హక్కులకు పూచీకత్తు లాంటిదని పేర్కొంటారు. ప్రభుత్వాల అధికార దుర్వినియోగం, నియంతృత్వ విధానాల నుంచి పౌరులు ఈ హక్కు ద్వారా పరిహారాన్ని పొందవచ్చు.

* రాజ్యాంగ పరిహారపు హక్కు భారత రాజ్యాంగానికి ఆత్మలాంటిది, హృదయం లాంటిది అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభివర్ణించారు.

* రాజ్యాంగపు 3వ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల అమలు ఈ హక్కు పైనే ఆధారపడి ఉంటుంది.

ఆర్టికల్ 32(1)

* ఒక వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు లేదా అవి అమలు కాలేనప్పుడు ఆ వ్యక్తి నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించి తగిన పరిహారాన్ని పొందవచ్చు.
 

ఆర్టికల్ 32(2)

* ప్రాథమిక హక్కుల అమలు, సంరక్షణ కోసం ఉన్నత న్యాయస్థానాలు 5 రకాల రిట్లు జారీ చేస్తాయి.
 

ఆర్టికల్ 32(3)

* సుప్రీం కోర్టు అధికారాలకు విఘాతం కలగకుండా, ఇతర న్యాయస్థానాలకు అంటే జిల్లా కోర్టులు, స్థానిక కోర్టులు కూడా రిట్లు జారీ చేసే అధికారాన్ని పార్లమెంటు చట్టం ద్వారా కల్పించవచ్చు.
 

ఆర్టికల్ 32(4)

* చట్టబద్ధంగా తప్ప మరే విధంగానూ ఆజ్ఞలు జారీ చేసే అధికారంపై పరిమితులు ఉండకూడదు.

* రిట్లు జారీ చేసే పద్ధతిని బ్రిటన్ నుంచి గ్రహించారు.

* ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీం కోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్లు జారీ చేస్తాయి.

* కార్యనిర్వాహక శాఖ చర్యలను న్యాయ సమీక్షకు గురిచేయడానికి అవకాశం కల్పించే హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు.

* జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి ఈ హక్కు అమలును సస్పెండ్ చేయవచ్చు.

* ప్రాథమిక హక్కుల పరిరక్షణలో సుప్రీం కోర్టుకు ప్రత్యేక, ప్రధాన, ప్రాథమిక విచారణ పరిధి ఉంటుంది. అందుకే సుప్రీం కోర్టును ప్రాథమిక హక్కుల పరిరక్షణ కర్త అంటారు.


రిట్స్ (Writs) 

1. హెబియస్ కార్పస్: (బందీ ప్రత్యక్ష):

* ఇది అతి పురాతనమైన రిట్. ఈ పదం లాటిన్ భాష నుంచి ఆవిర్భవించింది. నిర్బంధించిన వ్యక్తిని మొత్తం శరీరంతో సహా తన ముందు హాజరుపరచమని కోర్టు జారీ చేసే ఆదేశం.

* రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపరచిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్‌ను జారీ చేస్తారు.

* దీని ప్రకారం అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప కోర్టులో హాజరుపరచాలి. అరెస్టుకు కారణాలను తెలపాలి. అరెస్టయిన వ్యక్తికి తన వాదనను వినిపించుకునే అవకాశం కల్పించాలి.

* ఈ రిట్‌ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు.

* బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్‌ను జారీ చేయాలని కోర్టును ఆశ్రయించవచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్ అంటారు.

2. మాండమస్: (పరమాదేశ)

* మాండమస్ అంటే ఆదేశం అని అర్థం. ఎవరైనా ప్రభుత్వాధికారి/ అధికార సంస్థ తమ చట్టబద్ధమైన విధులను సక్రమంగా నిర్వర్తించనప్పుడు మీరు మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి అని ఉన్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశం.

* ఈ రిట్‌ను పబ్లిక్ సంస్థలకు, క్వాజీ పబ్లిక్ సంస్థలకు, జ్యుడీషియల్ సంస్థలకు, క్వాజీ జ్యుడీషియల్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేస్తారు.
 

మినహాయింపు:

* ఈ రిట్‌ను రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రయివేట్ వ్యక్తులు, ప్రయివేట్ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు.

అధికారులు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన విధులకే ఇది వర్తిస్తుంది. సంబంధిత అధికారి విచక్షణా పూర్వకమైన విధులకు ఇది వర్తించదు.

* మాండమస్ రిట్‌ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు. ఈ రిట్‌ను జారీ చేయడం అనేది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
 

3. ప్రొహిబిషన్: (ప్రతి నిషేధం)

* ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం. దిగువ న్యాయస్థానం లేదా ట్రైబ్యునల్ తమ పరిధిని అతిక్రమించి, కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తక్షణం నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం దిగువ న్యాయస్థానాలకు జారీ చేసే రిట్ ఇది. దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే ఈ రిట్ లక్ష్యం.

* ఈ రిట్ న్యాయసంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పరిపాలనా, చట్టపర సంస్థలకు వర్తించదు.

4. సెర్షియోరరి: (ఉత్ప్రేషణ)

* సాధారణంగా ఈ రిట్‌ను ప్రొహిబిషన్‌తో కలిపి జారీ చేస్తారు. దిగువ కోర్టు లేదా ట్రైబ్యునల్ కేసు విచారణను తక్షణం నిలిపివేసి, ఆ కేసును తనకు/ మరో కోర్టుకు బదిలీ చేయాలని జారీ చేసే రిట్.

* సెర్షియోరరి అంటే సుపీరియర్ లేదా To be certified.

* కొన్ని రకాల వ్యవహారాల తొలి దశల్లో ప్రొహిబిషన్ రిట్ వర్తిస్తుంది. అదే రకపు వ్యవహారాల చివరి దశలో అవే కారణాలపై సెర్షియోరరి రిట్ వర్తిస్తుంది. ఈ రెండు రిట్లను జ్యుడీషియల్ రిట్లు అంటారు.
 

5. కోవారంటో

* ఏ అధికారంతో ఈ పనిచేస్తున్నావు? అని కోర్టు జారీ చేసే రిట్.

* రాజ్యాంగబద్దంగా, చట్టబద్దంగా అధికారాలు లేనప్పటికీ అధికారాలను నిర్వహించే వ్యక్తిని నియంత్రించేందుకు ఈ రిట్‌ను జారీ చేస్తారు.

* ప్రజా పదవుల దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ లక్ష్యం.

* వ్యక్తి ప్రాథమిక హక్కులకు భంగం కలిగినా, కలగకపోయినా అర్హత లేని వ్యక్తి పబ్లిక్ పదవిని చేపట్టినప్పుడు ఆ నియామకం సరైంది కాదంటూ, ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడే సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా కోవారంట్ రిట్‌ను జారీ చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు.

ఇంజక్షన్:

* న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశమే ఇంజక్షన్.

* ఆస్తికి సంబంధించిన సివిల్ వివాదాల్లో యధాతథ స్థితిని కాపాడటానికి జారీ చేసే ఆజ్ఞ ఇది.

* సరిచేయడానికి వీలుపడని నష్టాన్ని నిలిపివేయడమే ఇంజక్షన్ ప్రధాన లక్ష్యం. ఈ రిట్‌ను ప్రయివేట్ వ్యక్తులపై కూడా జారీ చేయవచ్చు.
 

ప్రజా ప్రయోజన వ్యాజ్యం: (Public Interest Litigation) (PIL)

* 'PIL' అనే భావన తొలిసారిగా అమెరికాలో ఆవిర్భవించింది. మన దేశంలో PIL అనే భావనను జస్టిస్ కృష్ణయ్యర్ ప్రవేశపెట్టారు.

* ఈ భావనకు మన దేశంలో విస్తృత ప్రాచుర్యం కల్పించినవారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పి.ఎన్. భగవతి, చంద్రచూడ్.

* ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న PIL భావన నుంచి జస్టిస్ పి.ఎన్. భగవతి ఎక్కువగా ప్రభావితమయ్యారు.

* ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లిన వ్యక్తులు పేదరికం, అజ్ఞానం, నిరక్షరాస్యత, అమాయకత్వం, భయం ద్వారా కోర్టును ఆశ్రయించలేని పక్షంలో వారి తరఫున ప్రజాశ్రేయస్సును కోరే ఎవరైనా కోర్టును ఆశ్రయించడాన్ని ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) అంటారు. దీనిలో ప్రజల సమష్టి ప్రయోజనాలు ఇమిడి ఉంటాయి.

* ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా మన దేశంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్రను పోషిస్తోంది.

* SALS: (Socially Action Litigation Cases) (సామాజిక ప్రయోజన వ్యాజ్యం)

* PIL తోపాటు న్యాయస్థానాలు ఇటీవలి కాలంలో SALSను కూడా జారీ చేస్తున్నాయి.

ఉదా: దిల్లీలోని నగర వీధుల్లో ఫుట్‌పాత్‌లపై నివసించేవారికి నివాసం కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

* న్యాయస్థానాలు PIL ను జారీ చేసేటప్పుడు కేవలం ఫిర్యాదులను అనుసరించి మాత్రమే కాకుండా స్వతహాగా సుమోటో కేసులుగా విచారించవచ్చు.

* పాట్నా నాగరిక్ మంచ్ పిటిషన్‌ను అనుసరించి, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి జారీ చేసిన PIL ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అఫిడవిట్ రూపంలో సమర్పించేలా చేసింది.

* డి.కె. బసు పిటిషన్‌ను అనుసరించి మన దేశంలో పోలీస్ సంస్కరణలను ప్రవేశపెట్టారు.

* ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాలు, ప్రచారం కోసం ప్రయత్నిస్తే కోర్టు సమయం వృథా కావడం వల్ల వారిపై కఠిన చర్యలకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చు.

ఉదా: జాతీయ గీతం జనగణమన నుంచి సింధ్ అనే పదాన్ని తొలగించాలని సంజీవ్ భట్నాగర్ వేసిన PIL పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడికి రూ.10,000 జరిమానా విధించింది.

అమికస్ క్యూరీ:

* బాధితుడు న్యాయస్థానం ముందు హాజరై తన వాదనను వినిపించుకునే స్థితిలో లేనప్పుడు అతడి తరఫున వాదించడం కోసం న్యాయస్థానం నియమించే వ్యక్తి లేదా అధికారిని అమికస్ క్యూరీ అంటారు.
 

సుమోటో కేసు:

* కేసులను స్వతహాగా అంటే కోర్టు తనకు తానే తీసుకుని విచారించడం.

ఉదా: ఆంధ్రప్రదేశ్‌లో ఎర్రచందనం స్మగ్లర్ల కాల్చివేత.
 

లోకస్ స్టాండి: (న్యాయ అర్హతా నియమం)

* వ్యక్తుల హక్కులకు భంగం వాటిల్లిన సందర్భంలో కేవలం బాధితులు, వారి బంధువులు మాత్రమే కాకుండా అంటే 1st person, 2nd person మాత్రమే కాకుండా 3rd person కూడా న్యాయస్థానాలను సంప్రదించవచ్చునని సుప్రీంకోర్టు న్యాయ అర్హతా నియమంలో మార్పులు చేసింది. ప్రజాప్రయోజనాలను కాంక్షిస్తూ సామాజిక స్ఫూర్తి ఉన్న ఏ వ్యక్తి అయినా ఉన్నత న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు.
 

కింది అంశాలపై ప్రజల హక్కుల సంరక్షణ కోసం న్యాయస్థానాలు PILS జారీ చేస్తాయి.

* కట్టుబానిసత్వం నిర్మూలన

* కనీస వేతనాల చట్టం అమలు

అనాథ బాలల హక్కుల సంరక్షణ

* మహిళలపై అత్యాచారాలు

* జైళ్లలో మగ్గుతున్న ఖైదీల హక్కుల సంరక్షణ

* ఫుట్‌పాత్‌లపై, మురికివాడల్లో నివసిస్తున్న ప్రజల నివాస వసతి.
 

రెగ్యులర్ అడ్వర్సీ రియల్ ప్రొసీజర్:

* కేసులో ఇమిడి ఉన్న వాదనాంశాలను న్యాయవాదులు న్యాయస్థానం ముందు ఉంచుతారు. సుప్రీంకోర్టు వీటిని ఆధారం చేసుకుని తీర్పునిస్తుంది.
 

ఇంక్విజిషియోరియల్ ప్రొసీజర్:

* దీనిలో న్యాయస్థానం తనకు తానుగా పరిశీలన జరిపి ఆ పరిశీలనా నివేదిక ఆధారంగా ఆదేశాలను జారీచేస్తుంది.

* ప్రజాప్రయోజన వ్యాజ్యాల కేసులో సుప్రీంకోర్టు రెగ్యులర్ అడ్వర్సీ రియల్ ప్రొసీజర్‌ను కాకుండా ఇంక్విజిషియోరియల్ ప్రొసీజర్‌ను అనుసరిస్తుంది.

* రిట్లు జారీచేసే విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి.

          సుప్రీంకోర్టు

           హైకోర్టు

* సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం 'రిట్లు' జారీ చేస్తుంది.

* హైకోర్టు ఆర్టికల్ 226 ప్రకారం 'రిట్లు' జారీ చేయవచ్చు.

* దేశంలోని ఏ వ్యక్తికైనా, ప్రభుత్వ సంస్థకైనా 'రిట్లు' జారీ చేయవచ్చు.

* ఆ రాష్ట్ర భూభాగ పరిధిలోని వ్యక్తులకే 'రిట్లు' జారీ చేయగలదు.

* కేవలం ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసమే రిట్లు జారీ చేస్తుంది.

* ప్రాథమిక హక్కుల పరిరక్షణతో పాటు, ఇతర హక్కుల పరిరక్షణకు కూడా ప్రత్యేక పరిస్థితుల్లో రిట్లు జారీ చేస్తుంది.

* ఆర్టికల్ 32 విషయ పరిధి తక్కువ.

* ఆర్టికల్ 226 విషయ పరిధి ఎక్కువ.

* అత్యవసర పరిస్థితుల్లో ఇది రద్దవుతుంది.

* అత్యవసర పరిస్థితుల్లో ఇది రద్దు కాదు.

'రిట్‌'ను ఒక హక్కుగా డిమాండ్ చేయవచ్చు. ఇది కోర్టు విచక్షణపై ఆధారపడదు. దీన్ని కోర్టు నిరాకరించడానికి అవకాశం లేదు. అందుకే దీన్ని రెమిడియల్ రైట్ అంటారు.

* ఇక్కడ రిట్ జారీ అనేది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

రాజ్యాంగ పరిహారపు హక్కు - కోర్టు కేసులు

ఫెర్టిలైజర్ కార్పొరేషన్ కామ్‌గార్ యూనియన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను భారత రాజ్యాంగం ఆర్టికల్ 32 ద్వారా సుప్రీంకోర్టుకు అప్పగించిందని, దీన్ని రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగమని పేర్కొంది.
 

రమేష్ థాపర్ Vs స్టేట్ ఆఫ్ మద్రాసు కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సంరక్షించే బాధ్యతను రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించిందని, ఏ వ్యక్తి అయినా తన హక్కుల సంరక్షణ కోసం లేదా అమలుకు న్యాయస్థానాన్ని సంప్రదించినప్పుడు బాధ్యతను తిరస్కరించే అధికారం కోర్టుకు లేదని పేర్కొంది.
 

హుస్సేన్‌నా రాఖాతూన్ Vs బీహార్ హోం సెక్రటరీ కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ హక్కులను కోల్పోయిన బాధితుడు నేరుగా న్యాయస్థానాలను సంప్రదించలేకపోయినప్పటికీ, తన బాధ గురించి కోర్టుకు రాసుకునే విజ్ఞాపన పత్రాన్ని కూడా పిటిషన్‌లా స్వీకరిస్తామని పేర్కొంటూ బాధితుడి తరఫున అమికస్ క్యూరీని నియమించవచ్చని పేర్కొంది.
 

ఎ.కె. గోపాలన్ Vs స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సంరక్షించే, అమలు పరిచే సందర్భంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు సమానమైన అధికారాలను కలిగి ఉన్నందున హైకోర్టును సంప్రదించిన తర్వాత మాత్రమే సుప్రీంకోర్టును సంప్రదించాలనే నియమం లేదని హక్కుల కోసం వ్యక్తులు నేరుగా సుప్రీంకోర్టును సంప్రదించవచ్చని పేర్కొంది.

షీలా బర్సె Vs స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసు

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించిన మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులను అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలపై మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది.
 

ద ఇండియన్ ఎన్విరో లీగల్ యాక్షన్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ హర్యానాలోని ఓ రసాయన పరిశ్రమ నుంచి వ్యర్థ పదార్థాలు ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలను కలుషితం చేసి, పౌరుల హక్కులకు భంగం కలిగించే పరిస్థితి నెలకొన్నప్పుడు పౌరుల హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే ప్రైవేట్ సంస్థలకు కూడా ఆజ్ఞలు జారీ చేస్తామని పేర్కొంది.
 

బంధువా ముక్తి మోర్చా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఫరీదాబాద్‌లోని రెండు రాతి గనుల్లో పనిచేస్తున్న వెట్టి చాకిరీ కార్మికులను గుర్తించి వెట్టి కార్మికతకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ సుప్రీం కోర్టుకు లేఖ రాసింది. ఈ సంస్థ రాసిన లేఖను సుప్రీంకోర్టు రిట్ పిటిషన్‌గా స్వీకరించి, కార్మికులకు సహాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

లక్ష్మీకాంత్ పాండే Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో దత్తత రూపంలోని భారతీయ పిల్లల అక్రమ రవాణాను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చే ప్రజా ప్రయోజనాల పిటిషన్ సరైందేనని తీర్పు చెప్పింది.

మోహన్‌లాల్ శర్మ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు

* ఈ కేసులో పిటిషనర్ పోలీస్ లాకప్‌లో తన కొడుకు మృతి వివరాలను పొందుపరచి, సుప్రీంకోర్టుకు "Telegram" పంపారు. దీన్ని కోర్టు రిట్ పిటిషన్‌గా స్వీకరించి, దర్యాప్తు జరిపేందుకు కేసును సీబీఐకి పంపాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

అర్వీందర్ బగ్గా Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన బాధితులకు, పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినందుకు, ఆర్టికల్ 32 కింద నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సుప్రీంకోర్టు పేర్కొంది.
 

ఎమ్.సి.మెహతా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ మోటార్ వెహికల్ చట్టం, 1988ను సమర్థవంతంగా అమలుపరచడంలో భాగంగా దిల్లీలో కాలుష్యాన్ని నివారించడం కోసం, 1998 తర్వాత నుంచి డీజిల్, పెట్రోల్ వాహనాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని దిల్లీ పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించింది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉపయోగించిన దిల్లీలోని వాహనాలను రవాణాకు అనుమతించరాదని పేర్కొంది.
 

రూప అశోక్ హుర్రా Vs అశోక్ హుర్రా కేసు
* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ, ఉన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్ష చేయడానికి క్యురేటివ్ పిటిషన్ వేసే అధికారం బాధితుడికి ఉంటుందని పేర్కొంది.

ఆర్టికల్ 33

* ప్రాథమిక హక్కులు కింది వర్గాల వారికి వర్తించే విషయంలో కొన్ని పరిమితులను పార్లమెంటు విధిస్తుంది.

1) సైనిక దళాలు, పారామిలిటరీ దళాలు

2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు

3) పోలీసులు, ఇతర రక్షణపరమైన విధులను నిర్వర్తిస్తున్న సంస్థలు

4) అత్యవసర సర్వీసులైన టెలికమ్యూనికేషన్లు, ఇతర బ్యూరోల్లో పనిచేసే ఉద్యోగులు

5) రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన విచారణ సంస్థలు
 

దిల్లీ పోలీస్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఆర్టికల్ 33 ప్రకారం కేంద్ర సాయుధ బలగాల కోసం పార్లమెంటు రూపొందించిన చట్టాలను 1966లో రూపొందించిన పోలీస్ ఫోర్సెస్ యాక్ట్‌కు కూడా వర్తింపజేయడం తప్పు కాదని, భావ ప్రకటనా స్వేచ్ఛకు కూడా వ్యతిరేకం కాదని పేర్కొంది.
 

ఆర్టికల్ 34 - సైనిక చట్టం: ప్రాథమిక హక్కులపై పరిమితులు

* సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాథమిక హక్కులు ఏ మేరకు వర్తిస్తాయనేది భారత పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఈ ప్రాంతంలో సైనిక బలగాలు తీసుకున్న చర్యలకు, తద్వారా జరిగిన నష్టాలకు, పరిణామాలకు వారిని బాధ్యులు చేయడానికి వీల్లేదు. పార్లమెంటు ఒక చట్టం ద్వారా వారి చర్యలకు రక్షణ కల్పిస్తుంది.

ఎ.డి.ఎం.జబల్‌పూర్ Vs శ్యామ్ చరణ్ శుక్లా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రజా శాంతి భద్రతలను సంరక్షించడంలో, సాయుధ బలగాల క్రమశిక్షణను సంరక్షించడం కోసం వారి విధులను సక్రమంగా నిర్వర్తించడంలో అవసరమైన చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని పేర్కొంది.

* 1958లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని చేశారు.
 

ఆర్టికల్ 35 - చట్టబద్దత, శిక్షలు:

* ఆర్టికల్ 33 ద్వారా పేర్కొన్న వర్గాలకు, ఆర్టికల్ 34 ద్వారా పేర్కొన్న ప్రాంతాల్లోని ప్రజలకు, ఆర్టికల్ 16(3) ప్రకారం జమ్మూ కశ్మీర్, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లోని ప్రజలకు, ఆర్టికల్ 371 ద్వారా పేర్కొన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, అసోం, నాగాలాండ్, మిజోరం రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల ప్రజలకు వారి హక్కుల కోసం పార్లమెంటు ప్రత్యేక చట్టాలను రూపొందించవచ్చు.

ఉదా: The Navy Force Act, 1950
         The Airforce Act, 1950
         The Police force Act, 1966
         National Investigation Agency Act, 2008

ప్రాథమిక హక్కులపై పరిమితులు 

* ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధించగానే ఆర్టికల్ 19 వెంటనే రద్దవుతుంది.

* ఆర్టికల్ 359 ప్రకారం రాష్ట్రపతి ఆర్టికల్స్ 20, 21 మినహా మిగతా హక్కుల్ని సస్పెండ్ చేయవచ్చు.

* సాధారణ పరిస్థితుల్లో ఆర్టికల్ 19(2)లోని అంశాలపై పరిమితులు విధించవచ్చు.

* నివారక నిర్బంధ చట్టాలను ప్రయోగించినప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్య్రపు హక్కుపై పరిమితులు విధిస్తారు.

* పీడీ చట్టాల కింద అరెస్టయిన వ్యక్తులకు ప్రాథమిక హక్కులు పరిమితం.
 

2002 నాటి రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ప్రాథమిక హక్కుల్లో కింద పేర్కొన్న అంశాలను కూడా చేర్చాలని సిఫారసు చేసింది. అవి:

* పత్రికా స్వాతంత్య్రం

* తగిన జీవనోపాధి పొందే హక్కు

* నియంతృత్వ చట్టాల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు

* రహస్యాలను కాపాడుకునే హక్కు

* న్యాయాన్ని, న్యాయ సలహాను పొందే హక్కు

* సమాచార స్వాతంత్య్రం

* సత్వర న్యాయాన్ని పొందే హక్కు

* పర్యావరణ హక్కు

ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు భిన్నమైన, విరుద్ధమైన తీర్పును ఇవ్వడం.
రెట్రాస్పెక్టివ్ అంటే సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను గత కాలానికి కూడా వర్తింపజేస్తూ తీర్పును ఇవ్వడం.

ప్రాథమిక హక్కులు - రాజ్యాంగ సవరణలు

* 1వ రాజ్యాంగ సవరణ ద్వారా 1951లో ఆర్టికల్ 31ను సవరించి, ఆస్తి హక్కుకు కొత్తగా ఆర్టికల్ A, B లను చేర్చారు.

* 4వ రాజ్యాంగ సవరణ ద్వారా 1955లో ఆర్టికల్ 31ను సవరించి ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు చెల్లించే నష్ట పరిహారం విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకూడదు.

* 17వ రాజ్యాంగ సవరణ ద్వారా 1964లో ఆర్టికల్ 31ని సవరించి ప్రభుత్వం వ్యవసాయ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువను నష్టపరిహారంగా చెల్లించాలి.

* 24వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఆర్టికల్స్ 13, 368లను సవరించి ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించేలా చేశారు.

* 25వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఆర్టికల్ 39(B) (C)ల సవరణ జరిపి ఆస్తి హక్కు స్థాయిని తగ్గించారు. ఆర్టికల్ 39B, Cలను అమలుపరుస్తూ చేసిన చట్టాలు ప్రాథమిక హక్కులకు వ్యతిరేకమని న్యాయస్థానాలు ప్రశ్నించకూడదు.

* 26వ రాజ్యాంగ సవరణ ద్వారా 1971లో ఆర్టికల్స్ 366, 366(A)లను సవరించి రాజాభరణాలను రద్దు చేశారు.

* 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఆర్టికల్స్ 19(1), 31, 31(C)లను సవరించి ఆదేశిక సూత్రాలకు ప్రాముఖ్యాన్ని కల్పించారు.

* 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఆర్టికల్స్ 19, 31(A), 31(C)లను సవరించి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

* 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో ఆర్టికల్ 21(A)ను చేర్చి ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు.

* 97వ రాజ్యాంగ సవరణ ద్వారా 2012లో ఆర్టికల్ 19(1)(C) ప్రకారం సహకార సంఘాలను ఏర్పాటు చేశారు.

ప్రాథమిక హక్కులు - ఇతర కేసులు 

కామేశ్వరి Vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రైవేట్ ఆస్తులను జాతీయం చేసినప్పుడు చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని పేర్కొంది.
 

గోలక్‌నాథ్ Vs స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదని, ప్రాథమిక హక్కులను సవరించాలంటే నూతనంగా రాజ్యాంగ పరిషత్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొంది. రాజ్యాంగ సవరణలను కూడా న్యాయ సమీక్షకు గురిచేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు వ్యవహరించారు.

R.C. కూపర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* 1969లో ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడాన్ని ప్రాథమిక హక్కులకు, ఆస్తి హక్కుకు వ్యతిరేకమని పేర్కొంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
 

కేశవానంద భారతి Vs కేరళ కేసు (1973):

* ఈ కేసులో ఇందిరాగాంధీ ప్రభుత్వం చేసిన 24, 25, 26వ రాజ్యాంగ సవరణలను సవాల్ చేశారు. సుప్రీంకోర్టు 24, 26 సవరణలను సమర్థించింది.

* ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని పేర్కొంది.

* ఈ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి: ఎస్.ఎమ్. సిక్రీ
 

రాజ్‌నారాయణ్ Vs ఇందిరాగాంధీ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ చట్ట సమానత్వం అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం కిందకు వస్తుందని పేర్కొంది.
 

మినర్వా మిల్స్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రాథమిక హక్కులను రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగంగా పేర్కొన్నప్పటికీ, వాటికి భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని సవరించరాదని పేర్కొంది.

జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు:

* భారత రాజ్యాంగంలోని 3వ భాగంలోని ప్రాథమిక హక్కులు జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి 1954 మే 14 నుంచి వర్తించాయి. ఆర్టికల్ 16(3)లో ఉన్న 'రాష్ట్రం, ఆర్టికల్ 19లోని విషయాలు 25 సంవత్సరాల వరకు కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే జమ్ము కశ్మీర్ రాష్ట్రానికి వర్తిస్తాయి.

* జమ్ము కశ్మీర్‌లోని శాశ్వత నివాసితులకు, వారి సంతతికి మాత్రమే జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు, ఆస్తి సంపాదనకూ, స్థిర నివాసానికి హక్కులున్నాయి. శాశ్వత నివాసితులు కాని వారికి ఈ హక్కులు లభించవు.

ఆదేశిక సూత్రాలు

* ప్రాథమిక హక్కులు వ్యక్తి స్వేచ్ఛ, రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించడానికి ఉద్దేశిస్తే, ఆదేశిక సూత్రాలు ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యం సాధించడానికి ఉద్దేశించినవి.

* రూస్కో పౌండ్ అభిప్రాయం ప్రకారం సంక్షేమ రాజ్యాలే శ్రేయోరాజ్యాలు. ఆధునిక రాజ్యాలన్నీ సంక్షేమ రాజ్యాలుగానే వర్ధిల్లుతున్నాయి. రాజ్యం అనేది అత్యధిక ప్రజల అత్యధిక సంతోషం కోసం పాటుపడాలని ఉపయోగితావాద సిద్ధాంతంలో జెర్మి బెంథామ్ పేర్కొన్నారు.

* అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం రాజ్యం మానవుడికి ఉత్తమ జీవనం ప్రసాదించడానికి ఏర్పడింది, అది అందుకోసమే కొనసాగుతుంది.

* సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రజాస్వామ్యాన్ని సాధించకపోతే ఎంతో కష్టపడి సాధించుకున్న రాజకీయ ప్రజాస్వామ్యం విలువ లేకుండా పోతుందని డా.బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు.

ఆదేశిక సూత్రాల మూలాలు

* క్రీ.శ.18వ శతాబ్దంలో స్కాండేనేవియన్ దేశాల్లో సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉండేది. స్పెయిన్ రాజ్యాంగంలో "Directive Principles of Social Policy" అనే పేరుతో మొదటిసారిగా ఆదేశిక సూత్రాలను చేర్చారు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఆదేశిక సూత్రాలను "Instruments of Instructions" పేరుతో పొందుపరిచారు. 1937లో స్పెయిన్ నుంచి ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ గ్రహించింది. మన రాజ్యాంగ నిర్మాతలు ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలను గ్రహించారు.

* సర్ తేజ్‌బహదూర్ సప్రూ నాయకత్వంలోని బృందం 1945లో చేసిన తీర్మానాల ఆధారంగా మన రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారు. సంక్షేమ రాజ్య స్థాపనలో నిమగ్నమైన మనదేశంలో నిర్దేశిక నియమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలుగా పనిచేస్తాయని ఎం.సి.సెతల్వాడ్ పేర్కొన్నారు.

* భారత రాజ్యాంగాన్ని ఒక సామాజిక పత్రంగా గాన్‌విల్ ఆస్టిన్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ప్రవేశికలో దేశ ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించే వ్యవస్థ ఏర్పాటుకు కృషి చేయాలని నిర్దేశించారు.

ఆదేశిక సూత్రాల లక్షణాలు

* వీటికి న్యాయస్థానాల న్యాయ సంరక్షణ లేదు. ఇవి స్వయంగా అమల్లోకి రావు.

* ఇవి కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు మార్గదర్శకాలు.

* మన దేశంలో ఆర్థిక సమానత్వాన్ని సాధించి, సామ్యవాద తరహా సమాజాన్ని నిర్మించి, సంక్షేమ రాజ్యాన్ని సాధించడం వీటి లక్ష్యం.

* ప్రవేశికలోని ఆశయాలకు ఆచరణ రూపాన్నిస్తాయి.

* ప్రాథమిక హక్కులకు పోషకులుగా ఉండి, వాటిలోని వెలితిని పూరిస్తాయి.

* శాసనసభకు, కార్యనిర్వాహక శాఖకు స్నేహితుడిగా వ్యవహరిస్తాయి.

* సమగ్ర ఆర్థిక, సామాజిక, రాజకీయ, ప్రజాస్వామ్య సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తాయి.

రాజ్యాంగంలో వివరణ

* ఆదేశిక సూత్రాలను మన రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు వివరించారు. స్వభావం ఆధారంగా వీటిని ప్రొఫెసర్ ఎం.పి. శర్మ 3 రకాలుగా వర్గీకరించారు. అవి:

1. సామ్యవాద/ శ్రేయోవాద నియమాలు: ఆర్టికల్స్ 38, 39, 41, 42, 53

2. గాంధేయ నియమాలు: ఆర్టికల్స్ 40, 46, 47, 48, 49

3. ఉదారవాద నియమాలు: ఆర్టికల్స్ 44, 45, 50, 51

ఆర్టికల్ 36

* ఇది ఆర్టికల్ 12లో పేర్కొన్న రాజ్యం నిర్వచనాన్ని తెలియజేస్తుంది.

* రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల అమల్లో భాగస్వాములయ్యే కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలతో పాటు ఇతర అధికార సంస్థలన్నీ రాజ్య నిర్వచనంలో అంతర్భాగమేనని పేర్కొంటుంది.
 

ఆర్టికల్ 37

* ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేకపోవడం వల్ల ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించడానికి వీల్లేదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం ఉన్నత న్యాయస్థానాలు కూడా ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసే వీల్లేదు.


సామ్యవాద నియమాలు (Socialistic Principles)

ఆర్టికల్ 38(B)
* 'నేను సామ్యవాదిని, గణతంత్రవాదిని, రాళ్లల్లో రప్పల్లో నాకు నమ్మకం లేదు. ఆధునిక పరిశ్రమలు సృష్టిస్తున్న రోజుల్లో కూడా నాకు నమ్మకం లేదు' అని భారత ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ పేర్కొన్నారు.

ఆర్టికల్ 38

* ప్రభుత్వాలు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి.
 

ఆర్టికల్ 38(A)

* ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. రాజ్యం స్థాపించే సంస్థలు, వ్యవస్థ ప్రజలకు సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని సమకూర్చే విధంగా ఉండాలి.

* వ్యక్తుల మధ్య ఆదాయ అసమానతలు తగ్గించడానికి, హోదాలోని అసమానతలను నిర్మూలించడానికి రాజ్యం కృషి చేయాలి. విభిన్న ప్రాంతాల్లో, విభిన్న ఆర్థిక పరిస్థితుల్లో పనిచేస్తున్న వారి మధ్య అసమానతలను తగ్గించాలి.
 

ఆర్టికల్ 39

* జాతీయ సంపదను వికేంద్రీకరించాలి. దేశసంపద, సహజవనరులను దేశ ప్రజలందరి సమష్టి ప్రయోజనం కోసం వినియోగించేందుకు కృషి చేయాలి.
 

ఆర్టికల్ 39(A)

* పౌరులందరికీ స్త్రీ, పురుష బేధం లేకుండా సమానంగా జీవన సదుపాయాలు కల్పించాలి.

* ప్రజలకు ఉచిత న్యాయ సేవా సహాయాన్ని అందించాలి.
 

ఆర్టికల్ 39(B)

* దేశంలోని వనరులు, వాటి పంపిణీ, యాజమాన్యం సమాజ అభివృద్ధికి దోహదపడేలా నిర్వహించాలి.
 

ఆర్టికల్ 39(C)

* సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడాలి.
 

ఆర్టికల్ 39(D)

* స్త్రీ, పురుషుల సమాన పనికి, సమాన వేతనం కల్పించాలి.

ఆర్టికల్ 39(E)

* కార్మికులు, స్త్రీలు, పురుషులకు వారి శారీరక దారుఢ్యానికి మించి పనులు అప్పగించరాదు.
 

ఆర్టికల్ 39(F)

* బాలలు స్వేచ్ఛాయుత, గౌరవప్రదమైన వాతావరణంలో వికాసం చెందడానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలి. వారు ఎలాంటి పీడనానికి గురి కాకుండా చర్యలు చేపట్టాలి.
 

ఆర్టికల్ 41

* వృద్ధులు, దివ్యాంగులు, నిరుద్యోగులకు జీవనభృతిని కల్పించాలి. పనిహక్కును గుర్తించాలి.
 

ఆర్టికల్ 42

* మాతా, శిశు సంక్షేమం కోసం కృషి చేయాలి. హేతుబద్ధమైన పనిగంటలను, పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు తోడ్పడాలి. ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి.
 

ఆర్టికల్ 43

* వ్యక్తి, సహకార ప్రాతిపదికలపై చిన్నతరహా కుటీర పరిశ్రమలను నెలకొల్పాలి. కార్మికుల మానసిక, శారీరక వికాసానికి కృషి చేయాలి.

గాంధేయ నియమాలు (Gandhian Principles) 

* గాంధీజీ తన జీవితకాలంలో అనుసరించిన సూత్రాలు, సిద్ధాంతాలను ఆధారం చేసుకుని శ్రీమన్నారాయణ్ అగర్వాల్ రాజ్యాంగ పరిషత్‌లో ప్రవేశపెట్టిన గాంధీజీ ప్రణాళికలోని సూత్రాలే నిర్దేశిక నియమాలు. ఇవి గాంధీజీ కలలుగన్న రామరాజ్య స్థాపనకు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణకు తోడ్పడతాయి.

ఆర్టికల్ 40

* గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం ద్వారా స్థానిక స్వపరిపాలనను మెరుగుపరచి, ప్రజలను పాలనా వ్యవస్థలో భాగస్వాములను చేయడం.
 

ఆర్టికల్ 46

* విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక వసతులు కల్పించాలి. ఈ వర్గాల వారిని సాంఘిక దోపిడీ నుంచి రక్షించాలి.
 

ఆర్టికల్ 47

* ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టివేసే మద్యపానాన్ని, మత్తు పానీయాలను నిషేధించాలి. పౌష్టికాహారంలో ప్రజారోగ్య స్థాయిని పెంపొందించాలి.

ఆర్టికల్ 48

* వ్యవసాయం, పాడి పరిశ్రమలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ద్వారా ఉత్పత్తిని సాధించడం.

* పశువులు, గోవుల వధను నిషేధించడం.
 

ఆర్టికల్ 48(A)

* పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకం కోసం కృషి చేయాలి.
 

ఆర్టికల్ 49

* భారతీయుల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వానికి చిహ్నంగా నిలిచే పురాతన కట్టడాలు, శిల్పసంపదను సంరక్షించడం.

* పార్లమెంటు ఒక చట్టం ద్వారా చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలు, పురావస్తు వస్తువులను; స్థిర, చర, వస్తు సంపదను గుర్తించి వాటిని పరిరక్షించాల్సి ఉంటుంది.


ఉదార వాద నియమాలు (Liberal Priniciples)

ఆర్టికల్ 45
ఆర్టికల్ 44
* దేశంలో నివసించే పౌరులందరికీ (హిందూ, ముస్లిం, క్రైస్తవ, ....) ఒకేరకమైన ఉమ్మడి పౌరస్మృతిని (Common Civil Code) రూపొందించడానికి ప్రభుత్వం కృషి చేయాలి. మనదేశంలో కామన్ సివిల్ కోడ్ ఉన్న ఒకే ఒక రాష్ట్రం - గోవా.

* 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలి. అయితే 86వ రాజ్యాంగ సవరణ చట్టం, 2002 ద్వారా ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 21(A) లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని 14 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలందరికీ కల్పించారు. దానివల్ల ఆర్టికల్ 45లో ప్రస్తుతం ఆరేళ్ల లోపు బాలబాలికలకు ఆరోగ్య పరిరక్షణ, పూర్వప్రాథమిక విద్యావసతులను కల్పించడానికి రాజ్యం కృషి చేయాలని నిర్దేశించడమైంది.
 

ఆర్టికల్ 50

* న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించేందుకు కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను వేరుచేయాలి.
 

ఆర్టికల్ 51

* ప్రపంచ దేశాలతో స్నేహ, సహాయ, సహకార సంబంధాలను మనదేశం నెలకొల్పడంతోపాటు ప్రతి భారతీయుడు ప్రపంచ శాంతి కోసం కృషి చేయాలి.

రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు

16వ భాగంలో ఆర్టికల్ 335

* ప్రభుత్వం కల్పించే అవకాశాల్లో ఏ వర్గానికైనా సరైన ప్రాతినిధ్యం లభించలేదని భావించినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టవచ్చు. అయితే తీసుకునే చర్యల వల్ల సాధారణ పాలనా సామర్థ్యం దెబ్బతినకుండా ఉండాలి.
 

17వ భాగంలో, ఆర్టికల్ 350(A)

* మాతృభాషలో విద్యాబోధనకు కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు ఆదేశాలను జారీ చేయవచ్చు.
 

17వ భాగంలో, ఆర్టికల్ 351

* హిందీని జాతీయ భాషగా అభివృద్ధి పరచడానికి కేంద్రం, రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు.
 

ఆదేశ సూత్రాల జాబితాలో చేర్చిన అదనపు అంశాలు

ఆర్టికల్ 39(F)

* ఈ ఆర్టికల్‌ను 42వ సవరణ ద్వారా 1976లో చేర్చారు.

* బాలల అభివృద్ధికి తగిన అవకాశాలు, సౌకర్యాలను ఆరోగ్యకరమైన రీతిలో కల్పించడం. బాల్యం, యవ్వనం దోపిడీకి గురికాకుండా నైతికతను పెంపొందించడం.

ఆర్టికల్ 39(A)

* ఈ ఆర్టికల్‌ను 42వ సవరణ ద్వారా 1976లో రాజ్యాంగంలో చేర్చారు.

* పేదలు, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. 1987లో జాతీయ న్యాయసేవల అథారిటీని ఏర్పాటు చేయాలి.
 

ఆర్టికల్ 43(A)

* దీన్ని 42వ సవరణ ద్వారా 1976లో చేర్చారు.

* ఈ ఆర్టికల్ ప్రకారం పరిశ్రమల యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలి.
 

ఆర్టికల్ 48(A)

* దీన్ని 42వ సవరణ ద్వారా 1976లో చేర్చారు.\

* ఈ ఆర్టికల్ ప్రకారం పర్యావరణం, అడవులు, వన్యమృగాల సంరక్షణకు కృషి చేయాలి.
 

ఆర్టికల్ 38(2)

* ఈ ఆర్టికల్‌ను 44వ సవరణ ద్వారా 1978లో చేర్చారు.

* దీని ప్రకారం ఆదాయాలు, అవకాశాలు, స్థాయులు, సౌకర్యాల్లో అసమానతలు తగ్గించడం.

ఆర్టికల్ 43(B):

* దీన్ని 97వ సవరణ ద్వారా 2011లో చేర్చారు.

* ఈ ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వం సహకార సంఘాలను స్వచ్ఛందంగా ఏర్పాటు చేయడానికి, వాటికి స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి, ప్రజాస్వామ్య నియంత్రణను, వృత్తిపరమైన నిర్వహణను పెంపొందించడానికి కృషి చేయాలి.

ఆదేశ సూత్రాల అమలు 

* 1982లో మహిళల స్వయం సమృద్ధి కోసం DWCRA పథకాన్ని ప్రారంభించారు.¤ మనదేశంలో జాతీయసంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా, ఏకస్వామ్య నిరోధక చట్టాలను ఏర్పాటు చేశారు.

* భూ సంస్కరణల అమలు ద్వారా మిగులు భూములను పేదలకు పంచారు.

* 1969లో 14 బ్యాంకులను, 1980లో 6 బ్యాంకులను ఇందిరాగాంధీ ప్రభుత్వం జాతీయం చేసింది.

* 1970లో స్వదేశీ సంస్థానాధీనులకు ఇచ్చే రాజాభరణాలను రద్దుచేశారు.

* 1956లో L.I.C. ని జాతీయం చేశారు.

* 1976లో సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనాల చట్టం ప్రవేశపెట్టారు.

* ప్రజలకు ఉచిత న్యాయ సహాయం అందించడానికి 1987లో "Legal Services Authority" ని స్థాపించారు.

* 1959లో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

* 1987లో 'ఆపరేషన్ బ్లాక్ బోర్డ్', 2002లో 'సర్వశిక్షా అభియాన్' కార్యక్రమాల ద్వారా ప్రాథమిక విద్యావ్యాప్తికి చట్టాలు చేశారు.

* 1988లో నిరక్షరాస్యులైన వయోజనులకు అక్షరాస్యతను అందించే లక్ష్యంతో "National Literacy Mission" ను ప్రారంభించారు.

* 1986లో నూతన జాతీయ విద్యావిధానాన్ని ప్రారంభించారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించారు.

* 2006లో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని ప్రారంభించారు.

* 1973లో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాల్లో మార్పులు చేశారు.

* 1986లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహం, విడాకులు, హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టింది.

* పశ్చిమ బంగా, హరియాణ రాష్ట్రాల్లో నిరుద్యోగులకు జీవనోపాధి నిమిత్తం నిరుద్యోగ భృతిని కల్పిస్తున్నారు.

ఆదేశిక సూత్రాల అమలు - ప్రభుత్వ చట్టాలు 

* సంపదపై పన్ను - 1957

* బహుమతులపై పన్ను - 1958

* జాతీయ పురాతన కట్టడాల సంరక్షణ చట్టం - 1958

* ఆదాయపు పన్ను చట్టం - 1961

* ప్రసూతి సెలవుల చట్టం - 1961

వరకట్న నిషేధ చట్టం - 1961

* MRTP చట్టం - 1969

* వృద్ధాప్య పెన్షన్ చట్టం - 1995

* వృద్ధుల సంరక్షణ చట్టం - 2007

* జాతీయ ఆహార భద్రతా చట్టం - 2009


ఆదేశిక సూత్రాలపై ప్రముఖుల వ్యాఖ్యానాలు 

''నిర్దేశిక నియమాలు మనదేశంలో ఆర్థిక ప్రజాస్వామ్యం స్థాపించడానికి ఉద్దేశించిన సూత్రాలు" - డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్''నిర్దేశిక నియమాలు రాజ్యాంగ లక్ష్యాలు" - ఆశయాల మేనిఫెస్టో - కె.సి.వేర్

''నిర్దేశిక నియమాలు శ్రేయోరాజ్య స్థాపనలో నిమగ్నమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరదీపికలుగా పనిచేస్తాయి"

- ఎం.సి. సెతల్వాడ్

''వీటికి న్యాయ సంరక్షణ లేనప్పటికీ, ప్రజల సమ్మతి, సామాజిక మద్ధతు ఉన్నందున, ప్రభుత్వాలు వీటిని విస్మరించడానికి అవకాశం లేదు" - అల్లాడి కృష్ణస్వామి అయ్యర్

''నిర్దేశిక నియమాలు నైతిక ప్రవచనాలు. అధికారులు, ప్రభుత్వం వీటిని గౌరవించాలి" - బి.ఎన్. రావు

''నిర్దేశిక నియమాలు ఎంతో వైవిధ్యభరితమైన అంశాలతో కూడిన చెత్తబుట్ట లాంటివి" - టి.టి. కృష్ణమాచారి

''నిర్దేశిక నియమాల అమలు అనేది ప్రభుత్వాల చిత్తశుద్ధిపైన ఆధారపడి ఉంటుంది" - డి.డి. బసు

''ఆదేశిక సూత్రాలు బ్యాంకులు తమ వద్ద ఉండే డబ్బు సౌకర్యాన్ని అనుసరించి, ఇచ్చే చెక్కు లాంటివి" - కె.టి. షా

''నిర్దేశిక నియమాలు నూతన సంవత్సర తీర్మానాలు, అవి ఆరోజే ఉల్లంఘింపబడినవి" - నసీరుద్దీన్ మహ్మద్

''నిర్దేశిక నియమాలను సంపూర్ణంగా అమలు చేస్తే భారతదేశం భూతల స్వర్గం అవుతుంది" - ఎం.సి. చాగ్లా


ఆదేశిక సూత్రాలు - సుప్రీంకోర్టు తీర్పులు 

బలార్షా Vs స్టేట్ ఆఫ్ బాంబే:అబూకబూర్ భాయ్ Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, తమిళనాడు రాష్ట్రంలో రవాణా సదుపాయాలను జాతీయం చేస్తూ, రాష్ట్రప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, బాంబే రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధిస్తూ చేసిన చట్టాన్ని సమర్థించింది.
 

మహర్షి అవధేష్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1994)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, "Common Civil Code"ను అమలుపరచాలని కేంద్రప్రభుత్వానికి 'మాండమస్‌'ను జారీచేయడం సాధ్యంకాదని పేర్కొంది.
 

సరళాముద్గల్ కేసు: (1995)

* ఈ కేసులో Common Civil Codeను తీసుకురావాలని సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి సూచించింది. ఈ తీర్పును "Obit Dicta"గా అంటే కేవలం సలహాపూర్వకమైందిగా ధర్మాసనం పేర్కొంది.
 

నూర్‌సభా ఖాతూన్ Vs మహ్మద్ ఖాసిం కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ముస్లిం మతానికి చెందిన భార్యాభర్తలు విడాకులు తీసుకున్నపుడు భార్య తిరిగి వివాహం చేసుకునేంతవరకు ఆమె పోషణాభారం భర్తే భరించాలని తీర్పునిచ్చింది.
 

పన్నవలాల్ భన్సీలాల్ పాటిల్ Vs స్టేట్ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, భారతదేశంలో 'Common Civil Code'ను అన్నివర్గాల ఆమోదంతో మాత్రమే ప్రవేశపెట్టాలని, అలాకాకుండా బలవంతంగా Common Civil Codeను ఏర్పాటుచేస్తే దేశసమగ్రత దెబ్బతింటుందని పేర్కొంది.

కామేశ్వరీసింగ్ Vs స్టేట్ ఆఫ్ బీహార్ కేసు, బేలాబెనర్జీ Vs స్టేట్ ఆఫ్ బెంగాల్ కేసు:

* ఈ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ వ్యక్తుల ప్రైవేట్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నపుడు చెల్లించే నష్టపరిహారం న్యాయబద్ధంగా ఉండాలని పేర్కొంది. ఈ తీర్పును అధిగమించడానికి కేంద్రప్రభుత్వం 4వ రాజ్యాంగ సవరణను చేసి, నష్టపరిహారం విషయంలో ప్రభుత్వాలు చట్టబద్దంగా నిర్ణయించిన అంశానికి న్యాయసంరక్షణ కల్పిస్తూ 9వ షెడ్యూల్‌లో చేర్చింది.
 

ఎం. నాగరాజు Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించడాన్ని, దీనికోసం 1995లో 77వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్, 16(4)(A) సమర్థనీయమేనని పేర్కొంది.
 

అశోక్‌కుమార్ ఠాకూర్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 93వ రాజ్యాంగ సవరణ ద్వారా OBCలకు విద్యాసంస్థల్లో ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించడాన్ని, వాటికి రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 15(5) సమర్థనీయమేనని పేర్కొంది.
 

ఎం.సి. మెహతా Vs స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసు: (1997)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్ 39(F), ఆర్టికల్ 45లోని అంశాలను పరిగణనలోకి తీసుకుని బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా మార్గదర్శకాలను జారీచేస్తూ, బాలకార్మిక వ్యవస్థ నిషేధం తప్పనిసరి అని పేర్కొంది.

సిద్ధాస్ Vs యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ కేసు: (1996)

* ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తూ, ఆర్టికల్ 39(A) ప్రకారం సమన్యాయాన్ని, ఉచిత న్యాయసహాయాన్ని పేదలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొంటూ, ఆర్టికల్ 21 కింద ఉచిత న్యాయసహాయం ప్రాథమిక హక్కుగా ప్రకటించింది.
 

రణధీర్‌సింగ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (1982)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్స్ 14, 16 ప్రకరణలను అనుసరించి, ''సమాన పనికి సమాన వేతనాన్ని ప్రాథమిక" హక్కుగా గుర్తించింది. దీని ద్వారా ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 39(D) సాకారమైంది.
 

డి.కె. యాదవ్ Vs జె.ఎం.ఎ. ఇండస్ట్రీస్ కేసు: (1993)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ఆర్టికల్ 39(A) ప్రకారం పౌరులకు తగిన జీవనోపాధిని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంటూ, జీవనోపాధి హక్కును ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో అంతర్భాగంగా పేర్కొంది.

ప్రాథ‌మిక హ‌క్కులు - ఆదేశిక సూత్రాలు మ‌ధ్య వ్యత్యాసాలు

 

      ప్రాథమిక హక్కులు

           ఆదేశిక సూత్రాలు

* వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించారు.

* వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.

* వీటికి న్యాయస్థానాల రక్షణ ఉంది.

* వీటికి న్యాయస్థానాల రక్షణ లేదు.

* రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్స్ 12 నుంచి 35 మధ్య వీటిని వివరించారు.

* 4వ భాగంలో ఆర్టికల్స్ 36 నుంచి 51 మధ్య వీటిని వివరించారు.

* ఇవి వ్యక్తి స్వేచ్ఛా, స్వాతంత్య్రాలకు ప్రాధాన్యం ఇస్తాయి.

* ఇవి సమాజ సమష్టి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తాయి.

* వీటిని అమలు చేసే బాధ్యత న్యాయస్థానాలది.

* వీటిని అమలు చేసే బాధ్యత ప్రభుత్వానిది.

* ఇవి సర్వకాల, సర్వ వ్యవస్థల్లో అందుబాటులో ఉంటాయి.

* ప్రభుత్వాల ఆర్థిక స్థోమతను అనుసరించి మాత్రమే అందుబాటులో ఉంటాయి.

* ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి.

* ఆర్థిక, సామాజిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి.

ప్రాథమిక హక్కులు

ఆదేశిక సూత్రాలు

* వీటి అమలు కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలు చేయాల్సిన అవసరం లేదు.

* వీటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా చట్టాలు చేయాలి.

* ఇవి నకారాత్మక దృక్పథం కలిగి ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయకూడని పనులను తెలియజేస్తాయి.

* ఇవి సకారాత్మక దృక్పథం కలిగి ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన పనులను తెలియజేస్తాయి.

* జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో వీటిని సస్పెండ్ (తాత్కలికంగా ఆపడం) చేయవచ్చు.

* ఇవి ఎల్లప్పుడూ సుప్తచేతనావస్థలో ఉంటాయి.

రాజ్యాంగ లక్ష్యాలను సాధించడానికి ఇవి  సాధనాలుగా ఉంటాయి.

* ఇవి రాజ్యాంగ లక్ష్యాలను తెలియజేస్తాయి.

ఆదేశిక సూత్రాలు - సమీక్ష 

* ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో 1971లో 24వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాల అమలు కోసం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని చట్టం చేసింది.

* 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు 24వ రాజ్యాంగ సవరణను సమర్థించడం ద్వారా నిర్దేశిక నియమాల ప్రాధాన్యాన్ని గుర్తించింది.

* 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్దేశిక నియమాలకు ప్రాధాన్యాన్ని కల్పిస్తూ, వీటి అమలు కోసం రాజ్యాంగంలోని ఏ భాగాన్ని అయినా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని పేర్కొంది.

* 1980లో మినర్వామిల్స్ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకూ, ఆదేశిక సూత్రాలకూ మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసింది. ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు కింది అంశాలను వివరించింది.
 

1. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కావు.

2. ఈ రెండూ భారత ప్రజాస్వామ్యానికి రథచక్రాల్లాంటివి.

3. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య సంఘర్షణ మొదలైతే ప్రాథమిక హక్కులే ప్రాధాన్యాన్ని కలిగి ఉంటాయి.

4. ఆదేశిక సూత్రాలను అమలుపరిచే సందర్భంలో ఆర్టికల్ 39(B), ఆర్టికల్ 39(C)లను అమలుపరచడం కోసం చేసే చట్టాలకు మాత్రమే న్యాయ సంరక్షణ ఉంటుంది.

5. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులకు అనుబంధంగా ఉంటాయి.

ప్రాథమిక విధులు 

* విధి అంటే ఇతరుల కోసం వ్యక్తులు నిర్వర్తించాల్సిన బాధ్యత. ప్రతి పౌరుడు దేశం, తన తోటి పౌరులపట్ల కొన్ని కనీస బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుంది. అందుకే వీటిని ప్రాథమిక విధులు అంటారు. ప్రాథమిక విధుల భావన ప్రధానంగా సోషలిస్ట్ దేశాలకు చెందింది. ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాంగాల్లో జపాన్ మినహాయించి, ఏ దేశ రాజ్యాంగాల్లోనూ (అంటే మెజార్టీ రాజ్యాంగాల్లో) ప్రాథమిక విధులను గురించి పొందుపరచలేదు.

* 1950, జనవరి 26 నుంచి మన దేశంలో అమల్లోకి వచ్చిన ప్రారంభ భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు లేవు.

* సర్దార్ స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు ఇందిరాగాంధీ ప్రభుత్వం పూర్వపు సోవియట్ రష్యా రాజ్యాంగం నుంచి 10 ప్రాథమిక విధులను గ్రహించి రాజ్యాంగంలోని IV (A) భాగంలో ఆర్టికల్ 51(A) లో పొందుపరిచింది.

* 1976లో అప్పటి కేంద్ర న్యాయశాఖామంత్రి హెచ్.ఆర్. గోఖలే ప్రాథమిక విధులకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు.


ప్రాథమిక విధులు

1. ప్రకృతి రమణీయతను పరిరక్షించాలి. ప్రాణికోటి పట్ల దయతో వ్యవహరించాలి.1. రాజ్యాంగాన్ని, దాని లక్ష్యాలను, వ్యవస్థలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించాలి.

2. దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను పరిరక్షించాలి.

3. స్వాతంత్య్ర సాధన కోసం జరిగిన జాతీయ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన ఉన్నత భావాలను పెంపొందించి, గౌరవించి, ఆచరించాలి.

5. దేశాన్ని రక్షించేందుకు, అవసరమైనప్పుడు దేశసేవ చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

6. ప్రభుత్వ ఆస్తులను రక్షించాలి. హింసాయుత చర్యలను విడనాడాలి.

7. సమష్టి, వ్యక్తిగత సేవా కార్యక్రమాల ద్వారా దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలి.

8. శాస్త్రీయ, మానవతా, సంస్కరణా, పరిశీలనా దృక్పథాలను పెంపొందించాలి.

9. మత, భాష, ప్రాంతీయ, వర్గ విభేదాలకు అతీతంగా దేశ ప్రజలందరి మధ్య సోదరభావాన్ని పెంపొందించాలి. మహిళల పట్ల గౌరవ భావంతో వ్యవహరించాలి.

10. భిన్న సంస్కృతుల సమ్మేళనాన్ని ప్రతిబింబించే మన సంస్కృతి వారసత్వాన్ని గౌరవించి, పరిరక్షించాలి.

* ఈ 10 ప్రాథమిక విధులు 1977, జనవరి 3 నుంచి అమల్లోకి వచ్చాయి. అందుకే మనదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 3ను ప్రాథమిక విధుల దినోత్సవంగా పేర్కొంటారు.

11. 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న బాలబాలికలందరికీ 1 నుంచి 8వ తరగతి వరకు ఉండే ప్రాథమిక విద్యను అందించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు/సంరక్షకులపై ఉంటుంది.

* 11వ ప్రాథమిక విధి 2002, డిసెంబరు 12 నుంచి అమలుల్లోకి వచ్చింది.

స్వరణ్‌సింగ్ కమిటీ సిఫార్సుల్లో ప్రాథమిక విధుల్లో చేర్చని అంశాలు

* సకాలంలో పన్నులు చెల్లించడం

* విధులు పాటించనివారిపై చర్యలు తీసుకోవడం

* విధులను పాటించనివారిపై తీసుకున్న చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయకపోవడం.

* 2002లో రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ సకాలంలో పన్నులు చెల్లించడం, ప్రాథమిక విధులను పాటించేలా చట్టాలు చేయడం రాజ్యాంగంలో చేర్చాలని సూచించింది.

ప్రాథమిక విధులు - లక్షణాలు 

ప్రాథమిక విధులపై ప్రముఖుల వ్యాఖ్యానాలు 

* ప్రాథమిక విధులకు న్యాయసంరక్షణ లేదు. ఇవి నేరుగా అమల్లోకి రావు.

* వీటి అమలు కోసం ప్రత్యేక చట్టాలు లేవు. ప్రత్యేక యంత్రాంగం లేదు.

* వీటిని పాటించకపోతే శిక్షించడానికి అవకాశం లేదు.

* వీటిని ఉల్లంఘిస్తే మాత్రం శిక్షార్హులు అవుతారు.

* ఇవి వ్యక్తిగత జీవనానికి నైతికతను సమకూరుస్తాయి.

* ఇవి కేవలం సలహాపూర్వకమైనవి మాత్రమే.

* ఇవి కేవలం పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.

* ఇవి సామాజిక విలువలను పెంపొందిస్తాయి.

* ఇవి సామాజిక జీవనానికి క్రమబద్ధతను సమకూరుస్తాయి.

''హక్కులు, విధులు ఒకే నాణానికి ఉన్న ఇరు ప్రక్కలు" - హెచ్.జె. లాస్కి

''హక్కులు, విధులను విడదీస్తే అవి వికలాంగులు" - బర్జెస్

''ప్రాథమిక విధులు కేవలం నైతిక సలహాల లాంటివి" - డి.కె. బారువా

''ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందుపరచడం అనవసరం" - సి.కె. దఫ్తారి

''ప్రాథమిక విధులు కేవలం అలంకారప్రాయమే, ఎందుకంటే వాటిని పాటించనివారిపై ఎలాంటి చర్యలను పేర్కొనలేదు" - కె.పి. ముఖర్జీ

''ఆదేశిక సూత్రాల అమలు ప్రభుత్వాల చిత్తశుద్ధిపై ఆధారపడినట్లే, ప్రాథమిక విధుల పాటింపు అనేది కూడా పౌరుల చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది" - డి.డి. బసు


ప్రాథమిక విధులు - జస్టిస్ వర్మ కమిటీ 

* అన్ని విద్యాసంస్థల్లో ఎన్‌సీసీని తప్పనిసరిగా ప్రవేశపెట్టాలి.

* ప్రాథమిక విధుల అమలుపై తీసుకోవాల్సిన చర్యలను సిఫార్సు చేసేందుకు భారత ప్రభుత్వం 1998లో జస్టిస్ జగదీశ్ శరణ్ వర్మ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1999లో సమర్పించింది.
 

ముఖ్యాంశాలు

* అన్ని విద్యాసంస్థల్లో ప్రాథమిక విధులు అనే అంశాన్ని తప్పనిసరిగా పాఠ్యాంశంగా చేర్చాలి.

* ప్రాథమిక విధుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి జాతీయ సంస్థలో ఒక సంస్థను ఏర్పాటు చేయాలి.

* పౌరసత్వ విధులను తెలపడానికి స్వతంత్ర ప్రతిపత్తిగల అంబుడ్స్‌మెన్ వ్యవస్థను ప్రవేశపెట్టాలి.

* జస్టిస్ వర్మ కమిటీ ప్రాథమిక విధుల అమలు కోసం ప్రత్యేకమైన చట్టాలను చేయాల్సిన అవసరం లేదనీ, ప్రస్తుతం ఉన్న చట్టాలను సమర్థంగా అమలుచేస్తే చాలని పేర్కొంది.
 

ఆ చట్టాలు...
* జాతీయ చిహ్నాల గౌరవ చట్టం, 1950

* ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951

* అస్పృశ్యత నేర నిషేధ చట్టం, 1955

* ప్రాచీన కట్టడాల, శిల్పసంపద సంరక్షణ చట్టం, 1958

* జంతువుల పట్ల క్రూర హింసను నిరోధించే చట్టం, 1960

* జాతీయ చిహ్నాల గౌరవ భంగాన్ని నిరోధించే చట్టం, 1971

* వన్యమృగ ప్రాణుల సంరక్షణ చట్టం, 1972

* నీటి కాలుష్య నివారణ చట్టం, 1974

* అటవీ సంరక్షణ చట్టం, 1980

* పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986

* ఎయిర్ పొల్యూషన్ చట్టం, 1981

* బాల్య కార్మిక నిషేధ చట్టం, 1986

* బాల్య వివాహాల నిషేధ చట్టం (శారదా చట్టం), 1929

* ఇండియన్ పీనల్ కోడ్ చట్టం, 1860

* విధులు లేని హక్కులు అరాచకత్వానికి దారితీస్తాయి. హక్కులు లేని విధులు బానిసత్వానికి దారితీస్తాయి.

* ప్రాథమిక హక్కులపై ఉన్న హేతుబద్ధమైన పరిమితులుగా ప్రాథమిక విధులను పరిగణించవచ్చని 1992లో సుప్రీంకోర్టు పేర్కొంది.
''ప్రాథమిక హక్కులనే కాయలు విధులుగా పరిపక్వం చెందినప్పుడే సామాజిక జీవనం సాఫల్యం అవుతుంది." - మహాత్మా గాంధీ


ప్రాథమిక విధులు - సుప్రీంకోర్టు కేసులు 

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని, జాతీయగీతం పాడేలా ఆదేశాలు జారీ చేయడం వీల్లేదని పేర్కొంది.బిజోయ్ ఇమ్మాన్యుయేల్ Vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు: (1986)

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (AIIMS) యాజమాన్యం Vs విద్యార్థి యూనియన్ కేసు: (2002)

* ఈ కేసులో సుప్రీం కోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విధులను విస్మరించడానికి వీల్లేదని, ఇవి సమగ్ర సామాజిక జీవనానికి ఆదర్శమైన అంశాలని, వాటిని గౌరవించి, పాటించాల్సిన బాధ్యత పౌరులపైన ఉందని పేర్కొంది. కానీ వాటిని పాటించాలని ఆదేశించడానికి అవకాశం లేదని పేర్కొంది.
 

అరుణా రాయ్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు

* ఈ కేసులో సుప్రీంకోర్టు జాతీయ కరిక్యులంపై తీర్పునిస్తూ పాఠ్యాంశాల్లో పొందుపరిచే అంశాలు ఏవైనా సరే ప్రాథమిక విధుల్లో పొందుపరిచిన ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించుకునే అవకాశానికి విరుద్ధంగా ఉండకూడదని, ప్రజల మధ్య అహింస, సహనం, శాంతి, ప్రేమ లాంటి ఉన్నత ఆశయాలను పెంపొందించేవిగా ఉండాలని పేర్కొంది.
 

రాంప్రసాద్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు: (1988)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక విధుల్లో ఆర్టికల్ 51 (A)లోని J క్లాజులో పేర్కొన్న ఔన్నత్వాన్ని సాధించాలంటే ఉన్నతమైన ఆశయాలతోపాటు ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికి, ప్రతిభను చాటుకోవడానికి ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా చూడాలని పేర్కొంది.
ఎం.సి. మెహతా Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, విద్యాసంస్థల్లో వారంలో ఒక గంట నుంచి 2 గంటల వరకు పర్యావరణ పరిరక్షణ పై తరగతులు నిర్వహించాలని, అదేవిధంగా, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సాహిత్యాన్ని విద్యాసంస్థలు ఉచితంగా పంపిణీ చేయాలని పేర్కొంది.

రూరల్ లిటిగేషన్ Vs స్టేట్ ఆఫ్ ఉత్తర్ ప్రదేశ్ కేసు:

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, ప్రాథమిక విధులు పౌరుడి కనీస బాధ్యతలు అయినందున ప్రభుత్వాలు వాటిని పాటించే విషయమై చట్టాలను రూపొందించవచ్చునని పేర్కొంది.
 

శ్యామ్ నారాయణ్ చేక్సి Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (2003)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, జాతీయగీతాన్ని ప్రసార సాధనాల్లో, చలన చిత్రాల్లో అడ్వర్‌టైజ్‌మెంట్‌ల కోసం వినియోగించరాదని పేర్కొంది.

* కబీ కుషీ - కభీ గమ్ సినిమాలో జాతీయగీతాన్ని ఒక సన్నివేశంలో నాటకీయంగా వినియోగించడం సరైంది కాదని, ఆ సన్నివేశాన్ని తొలగించిన తర్వాత మాత్రమే చిత్రాన్ని ప్రదర్శించాలని పేర్కొంది.
 

నవీన్ జిందాల్ Vs యూనియన్ ఆఫ్ ఇండియా కేసు: (2004)

* ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ, జాతీయ జెండాను ఎగురవేయడం కూడా భావవ్యక్తీకరణ కిందకే వస్తుందని పేర్కొంది.


భారత సమాఖ్య 

ఎ.వి. డైసీ అభిప్రాయం ప్రకారం

పరిపాలనా వ్యవస్థ ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా రాజ్యవ్యవస్థను సమాఖ్య, ఏకకేంద్ర ప్రభుత్వాలుగా వర్గీకరించవచ్చు.

* ఒక దేశ పరిపాలనకు సంబంధించిన శాసనాధికారాలను ఒకే ఒక కేంద్రీయ శాసన వ్యవస్థ వాడుకగా వినియోగిస్తుందో ఆ ప్రభుత్వాన్ని ఏకకేంద్ర ప్రభుత్వంగా చెప్పవచ్చు.

* బ్రిటన్, ఫ్రాన్స్, శ్రీలంక, ఇజ్రాయెల్, చైనా, జపాన్, ఇటలీ దేశాల్లో ఏకకేంద్ర విధానం అమల్లో ఉంది.
 

ఎ.వి. డైసీ అభిప్రాయం ప్రకారం

* దేశ పరిపాలనా అధికారాలు రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయబడి, వాటి పరిధిలో స్వతంత్రంగా వ్యవహరించే అధికారాలను కలిగి ఉండటాన్ని సమాఖ్య ప్రభుత్వంగా చెప్పవచ్చు.

* అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా, మెక్సికో దేశాల్లో సమాఖ్య విధానం అమల్లో ఉంది.
 

ఎ.వి. డైసీ అభిప్రాయం ప్రకారం సమాఖ్య అంటే..

* ప్రతీది రాజ్యాంగం వల్ల పుట్టి, రాజ్యాంగంతో నియంత్రితమయ్యే అనేక సమన్వయ అంగాల మధ్య రాజ్యాధికారాలను పంచడం.

* భారత రాజ్యాంగ నిర్మాతలు మనదేశాన్ని సంపూర్ణ సమాఖ్యగా కాకుండా, పూర్తి ఏకకేంద్ర ప్రభుత్వంగా కాకుండా, ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల సమ్మేళనంగా ఏర్పాటు చేశారు.

జవహర్‌లాల్ నెహ్రూ కింది విధంగా పేర్కొన్నారు

* ఏ దేశ రాజ్యాంగమైనా ఆనాటి పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. మనదేశం స్వాతంత్య్రాన్ని సంపాదించి, మన రాజ్యాంగాన్ని రూపొందించుకునే కాలం నాటికి మనదేశంలో ఉన్న వాస్తవిక పరిస్థితులను ఆధారం చేసుకుని మన రాజ్యాంగాన్ని ఏకకేంద్ర, సమాఖ్య లక్షణాల కలయికగా ఏర్పాటు చేశారు.
 

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ ప్రకారం

* మన దేశంలో సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగా, అసాధారణ పరిస్థితుల్లో ఏకకేంద్రంగా వ్యవహరిస్తుంది.

* భారత సమాఖ్య వ్యవస్థకు పితామహుడిగా లార్డ్‌మేయో పేరొందాడు. భారత సమాఖ్య చరిత్ర 1870లో లార్డ్ మేయో వికేంద్రీకరణ విధానంతో ప్రారంభమవుతుంది.

* 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం భారతదేశానికి నిజమైన సమాఖ్య లక్షణాన్ని ఇచ్చింది. ఈ చట్టం ప్రకారం కేంద్ర జాబితాలో 47 అంశాలు, ప్రాంతీయ జాబితాలో 50 అంశాలను చేర్చారు.

* 1927లో ఏర్పడిన సైమన్ కమిషన్ భారత రాజ్యాంగం సమాఖ్య ప్రాతిపదికన ఏర్పడాలని సూచించింది.

* 1935 భారత ప్రభుత్వ చట్టం భారతదేశానికి నిర్మాణాత్మకమైన సమాఖ్యను ప్రతిపాదించింది.

* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో రాజ్యాంగ ముసాయిదాను ప్రవేశపెడుతూ భారత రాజ్యాంగం సమాఖ్యరూపం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధి కలిగి ఉంటాయని, రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల ఆధారంగా పాలన సాగిస్తాయని ప్రకటించారు. అయితే భారత రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదు. భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ గానే పేర్కొన్నారు. దీని ప్రకారం

A. భారత సమాఖ్య రాష్ట్రాల ఒప్పందంతో ఏర్పడింది కాదు.

B. భారత సమాఖ్యలోని రాష్ట్రాలకు విడిపోవడానికి స్వేచ్ఛ లేదు.
 

భారత సమాఖ్య విశిష్ట లక్షణాలు

అధికారాల పంపిణీ:

* భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజ్యాంగం 3 రకాల అధికారాల విభజనను చేసింది. అవి: కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా.
 

A. కేంద్ర జాబితా: దీనిలో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలో 100 అంశాలు ఉన్నాయి.
 

B. రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 66 అంశాలను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలో 61 అంశాలు ఉన్నాయి.
 

C. ఉమ్మడి జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉండి, జాతీయ దృక్పథం ఉన్న 47 అంశాలను చేర్చారు. ప్రస్తుతం ఈ జాబితాలో 52 అంశాలు ఉన్నాయి.

* పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.

లిఖిత రాజ్యాంగం:

* భారత రాజ్యాంగం ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. దీనిలో ప్రారంభంలో 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం మన రాజ్యాంగంలో సుమారు 465 ఆర్టికల్స్, 12 షెడ్యూల్స్, సుమారు 25 భాగాలు ఉన్నాయి.

* ఆర్టికల్ 73లో కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్ 162లో రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిని పేర్కొన్నారు.
 

దృఢ రాజ్యాంగం:

* మన రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే కఠిన పద్ధతి అంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతోపాటు, భారతదేశంలో సగాని కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అవసరం. అందుకే మనది దృఢ లక్షణాలు అధికంగా ఉన్న రాజ్యాంగం.
 

స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న న్యాయవ్యవస్థ:

* భారతదేశంలోని న్యాయవ్యవస్థకు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది.

* సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. అయితే వారిని తొలగించాలంటే మాత్రం పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా అది సాధ్యమవుతుంది.

* కేంద్రానికి, రాష్ట్రాలకు; ఒక రాష్ట్రానికి మరొక రాష్ట్రానికి మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది.

* మనదేశంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిలో లేదా రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలో లేకుండా స్వతంత్ర ప్రతిపత్తితో తీర్పులను ఇస్తుంది.
 

రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల పాత్ర:

* భారత రాజ్యాంగంలోని సమాఖ్య లక్షణాలను సవరించాలంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతోపాటు, దేశంలో సగాని కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి.
 

ద్విసభా విధానం:

* సమాఖ్య విధానంలో కేంద్ర శాసనశాఖ ద్విసభా విధానాన్ని కలిగి ఉంటుంది. ఎగువ సభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుతుంది. మనదేశంలో ఎగువసభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అందుకే దీన్ని రాష్ట్రాల మండలి అంటారు. దిగువసభ అయిన లోక్‌సభ విశ్వాసం ఉన్నంత మేరకే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతాయి.

రాజ్యాంగ ఆధిక్యత:

* మన దేశంలో రాజ్యాంగమే అత్యున్నత శాసనం. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలన్నీ రాజ్యాంగం ద్వారానే సంక్రమిస్తాయి.

రెండు స్థాయుల్లో ప్రభుత్వాలు:

* మన దేశంలో జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వం, ప్రాంతీయ స్థాయుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు పరిపాలనను నిర్వహిస్తున్నాయి.

భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణాలు

బలమైన కేంద్ర ప్రభుత్వం:

* మనదేశంలో బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర జాబితాలో ప్రస్తుతం 100 అంశాలున్నాయి. కానీ రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 61 అంశాలు మాత్రమే ఉన్నాయి. ఉమ్మడి జాబితాలోని 52 అంశాలపై శాసనాలు చేయడంలో కేంద్రం ఆధిక్యం ఉంది.

* భారతదేశం సుస్థిరత, సమగ్రత, భద్రతల దృష్ట్యా రాజ్యాంగం భారతీయులందరికీ ఏక పౌరసత్వాన్ని కల్పిస్తుంది. పౌరసత్వానికి సంబంధించిన చట్టాలను కేవలం పార్లమెంటు మాత్రమే రూపొందించగలదు.
 

* కేంద్రం రాష్ట్రాల్లో తన ప్రతినిధిగా గవర్నరును నియమించడం ద్వారా రాష్ట్రాలను నియంత్రిస్తుంది.

* భారతదేశంలో ఏకీకృత న్యాయవ్యవస్థ అమల్లో ఉంది.

* భారతీయులందరికీ ఒకే రాజ్యాంగం ఉంది.

* ఆర్టికల్ 148 ప్రకారం - కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖాతాలను తనిఖీ చేస్తుంది.

* ఆర్టికల్ 280 ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ, వనరుల పంపిణీ జరుగుతుంది.

* ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం జాతీయ, రాష్ట్రాల శాసన వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుంది.

* ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పడిన అంతర్ రాష్ట్ర మండలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరిస్తుంది.

* ఆర్టికల్ 352 ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలు చేస్తుంది.

* ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కేంద్రం శాసనాలను చేస్తుంది.

* ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తే రాష్ట్రాల ఆర్థిక వనరులు కేంద్రం పరిధిలోకి వెళతాయి.

వ్యాఖ్యానాలు 

''భారతదేశాన్ని అర్ధసమాఖ్యగా అభివర్ణించినవారు" - కె.సి. వేర్

''భారతదేశాన్ని సహకార సమాఖ్యగా పేర్కొన్నవారు" - గాన్‌విల్ ఆస్టిన్, డి.ఎన్. బెనర్జీ.

రచయిత: బంగారు సత్యన్నారాయణ

Posted Date : 19-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌