• facebook
  • whatsapp
  • telegram

పాలనపై శాసన నియంత్రణ

పాలనపై శాసన నియంత్రణ పద్ధతులు

శాసనాలు రూపొందించడం:

పార్లమెంట్‌ రాజ్యాంగ నియమాలకు లోబడి దేశానికి అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది.

ఈ శాసన నియమాల ఆధారంగానే మంత్రులు, ఉద్యోగులు పరిపాలనను నిర్వహిస్తారు. 

* శాసన నియమాలను ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటారు.


ప్రశ్నోత్తరాలు:

* వివిధ మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల పాలనా వ్యవహారాలపై ‘ప్రశ్నోత్తరాల’ ద్వారా శాసన వ్యవస్థ పాలన నియంత్రణ కలిగి ఉంటుంది.

* పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైన మొదటి గంట సమయాన్ని ప్రశ్నలు అడగడానికి నిర్దేశిస్తారు. అందుకే దీన్ని ‘ప్రశ్నోత్తరాల సమయం’ (Question Hour) గా పేర్కొంటారు.

* ఇది సాధారణంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది.

* పార్లమెంట్‌ సభ్యులు సంబంధిత మంత్రులను వారు నిర్వర్తించిన విధులకు సంబంధించి ప్రశ్నలు అడిగితే మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

* ప్రశ్నోత్తరాల సమయంలో 3 రకాల ప్రశ్నలు అడిగేందుకు వీలుంది. అవి:


1. నక్షత్రం గుర్తున్న ప్రశ్నలు 

* పార్లమెంట్‌ సభ్యులు అడిగే ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ‘మౌఖిక సమాధానాలు’ ఇస్తారు. 

*  మంత్రులు ఇచ్చే సమాధానాలకు సంతృప్తి చెందని సభ్యులు అనుబంధ ప్రశ్నలనూ అడగవచ్చు.

* ప్రశ్న అనేది నక్షత్రపు గుర్తు ఉన్నదా? నక్షత్రపు గుర్తు లేనిదా? అని ధృవీకరించేది సభాధ్యక్షులు.

* రోజుకు గరిష్ఠంగా 20 వరకు నక్షత్రపు గుర్తులున్న ప్రశ్నలను సభలో అనుమతిస్తారు.


2. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలు 

*  పార్లమెంట్‌ సభ్యులు అడిగే ఈ ప్రశ్నలకు సంబంధిత మంత్రులు ‘లిఖిత సమాధానాలు’ (Written Answers) ఇస్తారు. 

*  ఈ ప్రశ్నలపై అనుబంధ ప్రశ్నలు అడగడానికి వీలులేదు.

*  గరిష్ఠంగా రోజుకు 230 వరకు అనుమతిస్తారు.


3. స్వల్ప కాలవ్యవధి ప్రశ్నలు 

*  అత్యవసర ప్రజా ప్రాధాన్యత అంశాలపై మంత్రుల నుంచి సమాధానాలు రాబట్టేందుకు పార్లమెంట్‌లో ‘స్వల్ప కాలవ్యవధి ప్రశ్నల’కు అవకాశం కల్పించారు. 

*   అత్యవసరమైన అంశమని సభాధ్యక్షులు గుర్తించిన తర్వాత తక్కువ సమయంలో సమాధానం ఇచ్చేందుకు సంబంధిత మంత్రి సిద్ధంగా ఉన్నారా? లేదా? అని స్పీకర్‌ మంత్రిని అడిగి ధృవీకరించుకుంటారు. 

*  మంత్రి సమాధానాన్ని ఇచ్చేందుకు అంగీకరిస్తే మంత్రి సూచించిన రోజున ఆ ప్రశ్న అడగటానికి అవకాశం కల్పిస్తారు. 

*   ఒకవేళ మంత్రి సిద్ధంగా లేకపోతే స్పీకర్‌/ ఛైర్మన్‌ సదరు ప్రశ్నను నక్షత్రం గుర్తు ప్రశ్నగా మార్చి మౌఖిక సమాధానం ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తారు.


అర్ధగంట చర్చ 

*   సభలో అంతకుముందు అంటే ఒక మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో ఇచ్చిన సమాధానం సరిపడలేదు అని భావిస్తే అదనపు సమాచారం కోరుతూ అర్ధగంట చర్చకు అవకాశం కల్పిస్తారు. 

*  దీన్ని సభాధ్యక్షులు అనుమతించాలి. సభాసమావేశాలు జరుగుతున్న కాలంలో సాధారణంగా లోక్‌సభలో వారంలో 3 రోజులు (సోమ, బుధ, శుక్ర) చివరి అర్ధగంటను చర్చకు కేటాయిస్తారు. 

*  రాజ్యసభలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 5:30 గంటల మధ్య దీనికి అనుమతిస్తారు.


సావధాన తీర్మానం 

*  ఏదైనా ఒక అత్యవసర ప్రజాప్రాధాన్యత కలిగిన అంశంపైకి ప్రభుత్వ దృష్టిని మళ్లించి దాని పరిష్కారానికి అధికారిక విధానాన్ని ప్రకటించాలని కోరుతూ సభలో సభ్యులు ప్రవేశపెట్టే అంశాన్ని ‘సావధాన తీర్మానం’ అంటారు.

*  సాధారణంగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత దీన్ని అనుమతిస్తారు.

*  ప్రభుత్వం నుంచి అధికారపూర్వకమైన సమాధానాన్ని రాబట్టేందుకు దీన్ని ఉపయోగిస్తారు. 

*  ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ ఉండవు.

*  పాలన శాసన నియంత్రణలో ఇది కీలకమైంది.


అభిశంసన తీర్మానం: (Censure Motion) 

* ప్రభుత్వ పాలనలో వైఫల్యాన్ని గుర్తించి, నియంత్రించేందుకు సభలో ప్రవేశపెడతారు. 

*  దీన్ని ఒక మంత్రిపైగానీ, కొందరు మంత్రులపైగానీ, మొత్తం ప్రభుత్వంపైగానీ ప్రవేశపెడతారు. 

*  ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కారణం చూపాలి. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని నియంత్రించడం. 

* ఈ తీర్మానంపై చర్చ, ఓటింగ్‌ ఉంటాయి. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టే ఈ తీర్మానం నెగ్గినప్పటికీ ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ప్రమాదం ఉండదు.


వాయిదా తీర్మానం 

* ప్రజాప్రాముఖ్యమైన, అత్యవసరమైన అంశంపై చర్చించేందుకు ఎజెండాలోని కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని వాయిదా తీర్మానం అంటారు. 

* దీన్ని ప్రవేశపెట్టేందుకు సభలోని 50 మంది సభ్యులు లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. 

* ఈ తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? లేదా? అనేది సభాధ్యక్షులు నిర్ణయిస్తారు.


కోత తీర్మానాలు

* బడ్జెట్‌లోని పలు పద్దుల నుంచి నిర్ణీత మొత్తాన్ని తగ్గించేందుకు చేసే ప్రతిపాదనను కోత తీర్మానం అంటారు. 

* వీటిని లోక్‌సభలో స్పీకర్‌ అనుమతితో ప్రతిపక్ష పార్టీలు ప్రవేశపెడతాయి. 

* ఈ తీర్మానాలపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఇవి నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి.  


ఈ తీర్మానాలు 3 రకాలు. అవి

1. విధాన కోత తీర్మానం     2. ఆర్థిక కోత తీర్మానం      3. నామమాత్ర కోత తీర్మానం 


అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) 

* ప్రభుత్వ పాలనపై అసంతృప్తితో ఉన్న ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్‌సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు.

* స్పీకర్‌ అనుమతితోనే దీన్ని ప్రవేశపెట్టాలి. తీర్మాన నోటీసుపై కనీసం 50 మంది సభ్యుల సంతకాలు ఉండాలి. 

* ఈ తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణాలు తెలియజేయాల్సిన అవసరం లేదు. 

* ‘‘రూల్స్‌ ఆఫ్‌ ప్రొసీజర్‌ అండ్‌ కండక్ట్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఇన్‌ పార్లమెంట్‌-1950’’ చట్టాన్ని అనుసరించి ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. 

* ఈ తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. ఇందులో నెగ్గితే ప్రభుత్వం పతనమవుతుంది. 

* ఒక అవిశ్వాస తీర్మానానికి, మరొక అవిశ్వాస తీర్మానానికి మధ్య 6 నెలలు విరామం ఉండాలి. 

* కార్యనిర్వాహక వర్గంపై శాసన వ్యవస్థ జరిపే నియంత్రణ సాధనాల్లో ఇది అతి శక్తిమంతమైన తీర్మానం.


ధన్యవాద తీర్మానం 

* రాష్ట్రపతి పార్లమెంట్‌లో ప్రభుత్వ పాలనా విధానాలను తెలియజేస్తూ ప్రభుత్వం సాధించిన, సాధించాల్సిన అంశాలను వివరిస్తారు. 

* రాష్ట్రపతి చేసే ఈ ప్రసంగాన్ని ప్రధాని నేతృ త్వంలోని కేంద్ర కేబినెట్‌ రూపొందిస్తుంది. 

* ఈ తీర్మానం లోక్‌సభలో ఓడిపోతే ప్రభుత్వం రాజీనామా చేయాలి.


శూన్యకాలం  (Zero Hour)  

*  ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభాకార్యకలాపాలకు  (Agenda)  వస్తుంది. ఈ ఖాళీ  సమయాన్ని శూన్యకాలం అంటారు. 

* ఇది సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. దీనికి ఎలాంటి కాలపరిమితి లేదు. 

* పార్లమెంట్‌ సభ్యులు ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే ఏ అంశం గురించైనా మంత్రులను ప్రశ్నించవచ్చు. శూన్య కాలం అనేది భారత పార్లమెంట్‌ సృష్టించిన నూతన ఒరవడి. ఇది 1962 నుంచి కొనసాగుతోంది.


పార్లమెంటరీ కమిటీలు - పాలనపై శాసన నియంత్రణ

పార్లమెంట్‌ మూడు రకాల కమిటీల ద్వారా ప్రభుత్వ పాలనను నియంత్రిస్తుంది. అవి: 

I. ఆర్థిక కమిటీలు

ఇవి ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలపై నియంత్రణను కలిగి ఉంటాయి. ఇవి మూడు రకాలు - అవి: 

ఎ. ప్రభుత్వ ఖాతాల సంఘం: ఇది అతిపురాతనమైన పార్లమెంటరీ కమిటీ. 

ఈ కమిటీకి 1967 నుంచి ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించే సంప్రదాయం కొనసాగుతోంది. 

ఇది CAG (Comptroller and Auditor General)సమర్పించిన నివేదికపై కూలంకషంగా చర్చించి, ప్రభుత్వ వ్యయం నిర్దేశించిన పద్దులకు అనుగుణంగా జరిగిందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తుంది.

ప్రభుత్వ వ్యయం పార్లమెంట్‌ ఆమోదించిన ఉప కల్పన బిల్లుకు అనుగుణంగా ఉందా? లేదా? అనే అంశాన్ని నిశితంగా చూస్తుంది. అయితే ఈ కమిటీ చేసే పరిశీలన శవ పరీక్ష లాంటిదని విమర్శకుల అభిప్రాయం.

బి. అంచనాల సంఘం: ఈ కమిటీ పొదుపు పెంపొందించడానికి ప్రత్యామ్నాయ విధానాలను సూచిస్తుంది. 

ప్రభుత్వ పాలనా వ్యవహారాలలో పొదుపును ప్రోత్సహించడం ఈ కమిటీ ప్రధాన విధి.

సి. ప్రభుత్వరంగ సంస్థల సంఘం: ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టిన పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా నివారిస్తుంది.


II. సాధారణ పాలనా కమిటీలు

ఈ కమిటీలు రెండు రకాలు. అవి.

ఎ. దత్త శాసనాల కమిటీ: పార్లమెంట్‌ ప్రభుత్వానికి అప్పగించిన శాసన నిర్మాణ బాధ్యతలను శాసన దత్తత అంటారు. 

 దీనిలో భాగంగా రూపొందించిన నియమ నిబంధనలు పార్లమెంట్‌ నిర్దేశించిన చట్టానికి లోబడి ఉన్నాయో లేవో అనే అంశాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. 

*  ఈ కమిటీని నియోజిత శాసనాల   కమిటీ అని కూడా అంటారు.

బి. ప్రభుత్వ వాగ్దానాల కమిటీ: మంత్రులు సభా వేదికలపై చేసిన పలు వాగ్దానాలు ఎంతమేరకు అమలవుతున్నాయో ఈ కమిటీ పరిశీలిస్తుంది.


III. డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీలు

 వివిధ పాలనా శాఖల రోజువారీ పరిపాలనపై, బడ్జెట్‌ ప్రతిపాదనలపై నియంత్రణ కోసం 1993లో మొదటిసారిగా 17 డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. 

 2004లో మరో 7 డిపార్ట్‌మెంట్‌ స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేశారు. 

  ప్రస్తుతం మొత్తం కమిటీల సంఖ్య: 24. ఒక్కొక్క కమిటీ 5 లేదా 6 పాలనా శాఖలపై నియంత్రణ కలిగి ఉంటుంది.

  ఈ 24 కమిటీల్లో లోక్‌సభ నియంత్రణలో పనిచేసే కమిటీలు: 16. 

రాజ్యసభ నియంత్రణలో పనిచేసే కమిటీలు: 8.

Posted Date : 19-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌