• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో మృత్తికలు - ప్రధాన సమస్యలు

భారతదేశంలో మృత్తికలకు కింది కారకాలు ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అవి:


1. మృత్తికా క్రమక్షయం  [Soil Erosion]


2. మృత్తికా సారం తగ్గిపోవడం [Soil Degradation]


3. ఆమ్లత్వం - క్షారత్వం [Alkalinity and Salinity]


4. నీటి నిల్వ ప్రదేశాలు (Water Logging Areas)


5. ఎడారీకరణ (Desertification)


మృత్తికా క్రమక్షయం 


మొక్కలు పెరగడానికి సారవంతమైన నేలపైపొర అవసరం. ఇది కొట్టుకుపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.


ప్రభావితం చేసే అంశాలు: భూ ఉపరితల వాలు, మృత్తికా నిర్మాణం, మృత్తిక పరిమాణం, భూమి/ మృత్తికల వినియోగ విధానం, ప్రకృతి విపత్తులు, మానవ సంబంధ కారకాలు.


* పోడు వ్యవసాయం, అడవుల నరికివేత, అధికంగా పశువులను మేపడం, లోపభూయిష్టమైన సాగు, కొండచరియల వెంట రోడ్లు - నివాస గృహాల నిర్మాణం, ఏక పంట విధానం మొదలైనవి మానవ సంబంధ కారకాలు.


రకాలు: ఇందులో నాలుగు రకాలు ఉన్నాయి. అవి: 


1. జల క్రమక్షయం: నీటి ప్రవాహం తరచుగా ఉన్న ప్రాంతాలు, నదీ ప్రవాహ ప్రాంతాల్లో జల క్రమక్షయాన్ని గమనించవచ్చు.


2. పవన క్రమక్షయం: వేగంగా గాలులు వీచే ఎడారి ప్రాంతాల్లో ఈ రకమైన క్రమక్షయం ఉంటుంది. మన దేశంలో రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, హరియాణాలో దీన్ని చూడొచ్చు.


3. హిమానీనద క్రమక్షయం: జమ్మూ-కశ్మీర్, లద్దాఖ్, సిక్కిం, ఉత్తరాఖండ్‌లో హిమనీనద క్రమక్షయం ఉంటుంది.


4. సముద్ర తరంగాల క్రమక్షయం: సముద్ర తీరాల్లో మడ అడవులు తక్కువగా ఉండి, సముద్ర తరంగాల ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకమైన క్రమక్షయం జరుగుతుంది. మలబార్, ఉత్కళ తీరం, కోరమాండల్‌ తీరప్రాంతాల్లో దీన్ని చూడొచ్చు.


ఆమ్లత్వం - క్షారత్వం


అవపాతం [precipitation] కంటే బాష్పీభవం అధికంగా ఉన్న ప్రాంతాల్లోని మృత్తికల్లో సాధారణంగా ఆమ్లత్వం - క్షారత్వం ఎక్కువగా ఉంటాయి.


* సాంద్ర వ్యవసాయం అమల్లో ఉన్న ప్రాంతాల్లో అధికంగా రసాయన ఎరువులు వినియోగించడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.


* భూ ఉపరితలంపై చేరిన లవణాల్లో సోడియం క్లోరైడ్‌ అధికంగా ఉంటే ఆమ్లత్వంగా, వీటికి అదనంగా కార్బొనేట్స్‌ ఉంటే క్షారత్వంగా పేర్కొంటారు. మన దేశంలో 6.7 మిలియన్‌ హెక్టార్ల విస్తీర్ణంలో ఈ మృత్తికలు ఉన్నాయి.


* నీటిపారుదల పద్ధతులను మెరుగుపరచడం, జిప్సంను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.


లవణ నేలల విస్తరణ: 


హరియాణాలోని సెంట్రల్‌ సాయిల్‌ సెలైనిటి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదిక ప్రకారం, మన దేశంలో లవణ నేలలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు - గుజరాత్, ఉత్తర్‌ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ్‌ బంగా, రాజస్థాన్, తమిళనాడు.

ఎడారీకరణ 


శుష్క ఎడారి ప్రాంతాలు ఇసుక ఎడారి ప్రాంతాలుగా మారడమే ఎడారీకరణ.


* ఎడారీకరణకు ప్రధాన కారణం అడవుల క్షీణత.


* అడవులను ఖనిజాల వెలికితీత, రవాణా సదుపాయాలు, వ్యవసాయ భూముల కోసం నిర్మూలించడం వల్ల ఈ ప్రాంతాలు క్రమంగా ఎడారులుగా మారుతున్నాయి.


* థార్‌ ఎడారి రోజురోజుకు తూర్పువైపు విస్తరిస్తూ గంగా, యమునా నదీ పరీవాహక ప్రాంతాల్లోని ఒండ్రు మృత్తికలను ముంచెత్తుతోంది.


* మృత్తికలను కప్పి ఉంచే పచ్చదనం లేకపోవడం, మృతికల్లో తేమ శాతం అత్యల్పంగా ఉండటం వల్ల ఎడారీకరణ వేగవంతంగా జరుగుతుంది.


* భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2016లో చేసిన 


సర్వే ప్రకారం, వాయవ్య భారతదేశంలో సుమారు 50% భూభాగం ఎడారీకరణ ముప్పును ఎదుర్కొంటోంది.


మృత్తిక ఆరోగ్య కార్డ్‌ పథకం (Soil Health Card Scheme)


మృత్తికా పరిరక్షణ కోసం 2015, ఫిబ్రవరి 19న కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.


* ఈ పథకం నినాదం స్వస్థ్య్‌ ధార, ఖేత్‌ హరా (Health Earth, Green farm).


* ప్రభుత్వం ప్రతి రెండేళ్లకోసారి ఈ కార్డ్‌లను రైతులకు అందిస్తుంది. దీనిద్వారా నిర్దిష్ట పంటలకు సంబంధించి ఏ పోషకాలను ఉపయోగించాలో తెలుపుతుంది.


pH విలువ హ్యూమస్, నత్రజని, ఫాస్పరస్, పొటాషియం మొదలైన 12 రకాల పోషక స్థాయులను తెలుపుతుంది.


కందర భూములు 


మృత్తికా క్రమక్షయంలో మృత్తికల పైపొర కొట్టుకుపోయి లోతైన, అతి పెద్ద గాడులు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన భూములను కందర భూములు అంటారు. ఇలాంటి భూస్వరూపాన్ని ఉత్కట భూమి (Badland Topography)  అంటారు.


మృత్తికా సంరక్షణ పద్ధతులు


భారతదేశంలో మృత్తికలను సంరక్షించడానికి పాటించాల్సిన పద్ధతులు:


* వ్యవసాయ సాగు భూముల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటడం, గడ్డి జాతి మొక్కలు పెంచటం. వీటి వల్ల వర్షపునీటి వేగాన్ని నియంత్రించవచ్చు.


* చెక్‌ డ్యామ్‌లు, వ్యవసాయ పొలం గట్ల వద్ద; కొండవాలు ప్రాంతాల్లో నీటి గుంటలను ఏర్పాటు చేయటం. వీటివల్ల వర్షపు నీటిని నిల్వ చేయొచ్చు. భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఉండటమే కాకుండా, మృత్తికల్లో నీటి శాతం తగ్గిపోకుండా చేయొచ్చు.


* ఖాళీగా ఉన్న బంజరు భూముల్లో సామాజిక 


అడవుల పెంపకాన్ని చేపట్టడం.


*మిశ్రమ వ్యవసాయం - అంటే వ్యవసాయంతో పాటు పశువులను పెంచడం.


* అడవులను సంరక్షించడం.


* చెరువుల్లోని పూడిక తీయించి, వాటి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచటం.


* గనుల భూముల్ని పునర్వినియోగంలోకి 


తీసుకురావడం.


నీటి నిల్వ ప్రదేశాలు


ఈ నేలల్లో నీరు ఇంకిపోదు. ఒక ప్రాంతంలో భూగర్భజలతలం సంతృప్తస్థాయికి చేరాక అక్కడ నీటి పారుదల జరిగినప్పుడు, సాగు నీరు వెళ్లడానికి వీలులేని ప్రాంతాల్లో ఈ రకమైన నేలలు ఏర్పడతాయి. ప్రత్యేకించి నైరుతి రుతుపవన సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి.


* సముద్ర తీర ప్రాంతాలు, డెల్టా ముఖ ద్వారాల వద్ద నీటి నిల్వ ప్రదేశాలు కనిపిస్తాయి.


* పశ్చిమ్‌ బంగా, అసోం, టెరాయ్‌లోని ప్రాంతాలు; కేరళలోని వృష్టజల ప్రాంతాల్లో ఈ రకమైన మృత్తికలు ఉన్నాయి.


* దేశం మొత్తంలో 0.65 మిలియన్‌ హెక్టార్ల భూమి ఈ నీటి నిల్వ ప్రమాదానికి గురవుతోంది.


* నీటిపారుదల పద్ధతులను మెరుగుపరచడం; కాలువలు, డ్యామ్‌ల నుంచి నీరు లీకేజీ అవ్వకుండా చూడటం ద్వారా ఈ నష్టాన్ని కొంతమేర అధిగమించొచ్చు.


భారత్‌లోని మృత్తికా పరిశోధనా సంస్థలు (Soil Research Centers in India)


1. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్‌ (IISS): ఇది ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ (ఐకార్‌)కు అనుబంధ సంస్థ. దీన్ని భోపాల్‌ కేంద్రంగా 1988లో స్థాపించారు.


2. సెంట్రల్‌ సాయిల్‌ సెలైనిటి రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(CSSRI):ఇది ఐకార్‌కి అనుబంధ సంస్థ. దీన్ని 1969లో హరియాణాలోని కర్నాల్‌లో స్థాపించారు.


3. ది నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ సాయిల్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ యూజ్‌ ప్లానింగ్‌  (NBSS & LUP): 1996లో నాగ్‌పుర్‌లో ఏర్పాటు చేశారు.


4. సెంట్రల్‌ అరిడ్‌జోన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CAZRI): 1959లో రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో స్థాపించారు.


5. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ అండ్‌ వాటర్‌ కన్జర్వేషన్‌ (IISWC):  దీన్ని 1947లో డెహ్రాడూన్‌లో స్థాపించారు. దీని అధీనంలో 8 ప్రాంతీయ పరిశోధన సంస్థలు ఉన్నాయి.


మృత్తికా సారం తగ్గిపోవడం


రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడటం, అశాస్త్రీయమైన పంట మార్పిడి, సాంద్ర వ్యవసాయ విధానం మొదలైన కారణాల వల్ల మృత్తికల్లోని సహజ సారం తగ్గుతోంది. దీని వల్ల అవి వ్యవసాయయోగ్యం కాని మృత్తికలుగా మారుతున్నాయి.


* హరిత విప్లవం వల్ల దేశంలో పంటల దిగుబడి అధికమైనా, మృత్తికల్లోని సారం తగ్గిపోతోంది. పురుగు మందులను ఎక్కువగా వాడటం, సరైన మృత్తికా నిర్వహణా విధానం లేకపోవడం, రైతుల నిరక్షరాస్యత మొదలైనవి దీనికి ప్రధాన కారణం.


నియంత్రణ పద్ధతులు:


* నత్రజని స్థాపక మొక్కలను లెగ్యూమ్‌ లేదా పప్పుధాన్యాల మొక్కలను అంతర పంటలుగా పండించడం. 


* సరైన పంట మార్పిడి పద్ధతులను అనుసరించడం.


* పంట విరామాలు [crop holidays] పాటించడం.


* రసాయన ఎరువుల వాడకం తగ్గించడం. 


* భూసార పరీక్షలు నిర్వహించి, దానికి అనుగుణంగా ఎరువులు వాడటం.


 

Posted Date : 27-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌