• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌లో సంప్రదాయేతర ఇంధన వనరులు

  సీమ‌లో స‌మృద్ధిగా సౌర విద్యుత్తు!


పర్యావరణ పరిరక్షణపై పెరుగుతున్న స్పృహ, భూతాపాన్ని అరికట్టేలా రూపొందుతున్న విధానాల ఫలితంగా మన దేశం హరిత ఇంధన ఉత్పత్తి, వినియోగానికి మొగ్గు చూపుతోంది. విద్యుత్తు సంస్కరణల్లో ఎప్పుడూ ముందుండే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఈ విషయంలో మరింత చురుగ్గా వ్యవహరిస్తోంది. సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేలా నూతన విధానాలు తీసుకొచ్చి అమలుచేస్తోంది. సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తికి రాష్ట్రానికి ఉన్న సహజ అనుకూలతలను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని సౌర విద్యుత్తు హబ్‌గా మార్చేందుకు కృషిచేస్తోంది. ఈ విధాన మార్పును, రాష్ట్రవ్యాప్తంగా మెగా సోలార్‌ పార్కులు ఏర్పాటైన ప్రాంతాలు, వాటి సామర్థ్యం గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. రాష్ట్రంలోని విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా సంస్థలు, విద్యుత్తు ధరల నియంత్రణ యంత్రాంగం, విధులు, పరిధితో పాటు సంప్రదాయేతర విద్యుత్తు రంగంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి.


ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం సంచిత పునరుత్పాదక ఇంధన శక్తి వ్యవస్థాపిత సామర్థ్యం 28,937.71 మె.వా. అందులో

1) పవన విద్యుత్తు - 5927.03 మె.వా.

2) సౌర విద్యుత్తు - 5066.39 మె.వా.

3) ఇతర ప్రత్యామ్నాయ వనరులు - 585.49 మె.వా.

సౌరశక్తి: 2022, నవంబరు నాటికి రాష్ట్రంలో సౌర విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 5066.39 మె.వా.


ఆంధ్రప్రదేశ్‌ సౌర విద్యుత్తు విధానం - 2015:  రాష్ట్ర ప్రభుత్వం 2015 - 2020 మధ్య కాలంలో అదనంగా 5000 మె.వా. సౌరవిద్యుత్తు ఉత్పత్తి చేసే లక్ష్యంతో 2015, ఫిబ్రవరి 12న ఈ విధానాన్ని ప్రకటించింది. 500-1000 హెక్టార్లలో సోలార్‌ పార్కులు ఏర్పాటు చేసి, 2500 మె.వా. విద్యుత్తు ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. అలాగే రైతులకు రాయితీపై సౌర విద్యుత్తుతో నడిచే 50,000 పంపుసెట్లు అందజేస్తారు. సూర్యుడి నుంచి గ్రహించిన సౌరశక్తిని సౌర ఘటాల్లో నిల్వ చేసి విద్యుత్తు ఉత్పత్తి చేయడాన్ని సౌర విద్యుత్తుగా పరిగణించవచ్చు. ఈ ప్రక్రియలో అనేక సౌర ఘటాలను సౌర పలకలకు కలుపుతారు. ఇవి సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి.

భౌగోళికంగా ఉష్ణమండలంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు సౌరవిద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. ఇందులో భాగంగా వీధిదీపాలు, ట్రాఫిక్‌ సిగ్నల్స్, సోలార్‌ హీటర్లు, కుక్కర్లు, మోటార్లు, డ్రయ్యర్లకు సౌర విద్యుత్తు ఉపయోగిస్తున్నారు. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నాలుగు సోలార్‌ పవర్‌ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. అవి..

1) అనంతపురం అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ పార్కు-1: ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన సోలార్‌ పార్కు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి డివిజన్‌లోని నంబులపూలకుంట మండలంలో నిర్మించనున్నారు. ఉత్పాదక సామర్థ్యం 2200 మె.వా.

2) అనంతపురం అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ ప్రాజెక్ట్‌-2: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని తలారి చెరువు వద్ద నిర్మించనున్నారు. ఉత్పాదక సామర్థ్యం 500 మె.వా.

3) కర్నూలు అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ పార్కు: కర్నూలు జిల్లాలో గడివేముల, ఓర్వకల్లు మండలాల మధ్య ఏర్పాటు చేయనున్నారు. ఉత్పాదకత సామర్థ్యం 1000 మె.వా.

4) కడప అల్ట్రా మెగా సోలార్‌ పవర్‌ పార్కు: అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో ఏర్పాటు చేయనున్నారు. ఉత్పాదక సామర్థ్యం: 1000 మె.వా.


ఏపీ సోలార్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌ విద్యుత్తు పొదుపు కార్యకలాపాలు


గ్రామ పంచాయతీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలు: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈఈఎస్‌ఎల్‌ సంస్థ సహకారంతో 13 జిల్లాల్లోని మొత్తం 13,065 పంచాయతీల్లో 30 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాల ఏర్పాటు లక్ష్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రామీణ ఎల్‌ఈడీ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రారంభించింది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 23.64 లక్షల ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చారు.

* కేంద్ర ప్రభుత్వం నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఆర్థిక సహకారంతో రాష్ట్రంలో పంపుసెట్ల కార్యక్రమాన్ని చేపట్టింది. సాగునీటి పారుదల కోసం 30,000కు పైగా సోలార్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో తొలి సోలార్‌ విలేజ్‌గా అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సమీపంలోని ‘గద్దలరేవుపల్లి’ నిలిచింది. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు లక్షల వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్తు పరికరాలు అమర్చారు.

పవన విద్యుత్తు


దేశంలో మొదటి పవన విద్యుత్తు కేంద్రం గుజరాత్‌లోని మాండవి. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పవన విద్యుత్తు కేంద్రం రామగిరి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పవన శక్తి వ్యవస్థాపిత సామర్థ్యం 5927.03 మెగావాట్లు. దేశంలో 2023, మార్చి నాటికి పవన విద్యుత్తు స్థాపిత సామర్థ్యంలో ఏపీది ఆరో స్థానం. పవన విద్యుత్తు ఉత్పత్తికి అనువైంది నైరుతి రుతుపవన కాలం. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 3 పవన విద్యుత్తు కేంద్రాలున్నాయి.


1. రామగిరి పవన విద్యుత్తు కేంద్రం: శ్రీసత్యసాయి జిల్లా రామగిరి వద్ద 1994లో స్థాపించారు. ఉత్పత్తి సామర్థ్యం 2 మె.వా. ఈ ప్రాంతాన్ని దక్షిణ భారతదేశంలోనే పవన విద్యుత్తు ఉత్పత్తికి అత్యంత అనుకూల ప్రాంతంగా కేంద్రం ప్రకటించింది.


2. కొండపల్లి పవన విద్యుత్తు కేంద్రం: కృష్ణా జిల్లా కొండపల్లిలో ఉంది. ఉత్పాదక సామర్థ్యం 2 మె.వా.


3. తిరుమల పవన విద్యుత్తు కేంద్రం: తిరుపతి జిల్లాలో 1996లో స్థాపించారు. ఉత్పాదక సామర్థ్యం 1 మె.వా.

ఆంధ్రప్రదేశ్‌ పవన విద్యుత్తు విధానం - 2015:  

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2015 - 20లో అదనంగా 400 మె.వా. పవన విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంతో 2015, ఫిబ్రవరి 13న ఈ విధానాన్ని ప్రకటించింది. రాయలసీమలోని అన్ని జిల్లాలు, నెల్లూరు జిల్లా పవన విద్యుత్తుకు అనుకూలమని నిర్ధారించింది.


ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌: 

ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్కరణల చట్టం-1998 ప్రకారం 1999, మార్చి 31న ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ విద్యుత్తు రంగం అభివృద్ధి, నియంత్రణకు చర్యలు చేపడుతుంది. వినియోగదారుల హక్కుల సంరక్షణకు బాధ్యత వహిస్తుంది. ఇది ఏపీ ట్రాన్స్‌కో, రెండు పంపిణీ సంస్థలకు, 9 గ్రామీణ విద్యుత్తు సహకార సంస్థలకు అనుమతులు జారీ చేస్తుంది. ఈ సంస్థ ఉత్పత్తి, వ్యయం, వినియోగ ఛార్జీలు లాంటి అంశాలపై బహిరంగ విచారణ నిర్వహించి టారిఫ్‌లను నిర్ణయిస్తుంది. విద్యుత్తు రంగ సంస్థల పనితీరు మెరుగుదలకు సలహాలిస్తుంది.


ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు :

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డు (APSEB)ని 1959లో స్థాపించారు. దీనిపై 1995లో నియమించిన హై లెవెల్‌ కమిటీ అన్నిపక్షాలతో చర్చించాక ఏపీఎస్‌ఈబీ సమర్థంగా పనిచేయడానికి వీలుగా రెండుగా విభజించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకు 1998లో ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు సంస్కరణల చట్టం చేసి రెండు కొత్త సంస్థల్ని ఏర్పాటుచేశారు.

1. ఏపీ జెన్‌కో (ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌)

2. ఏపీ ట్రాన్స్‌కో (ట్రాన్స్‌మిషన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌)


ఏపీ జెన్‌కో

దీన్ని 1998, డిసెంబరు, 28న ఏర్పడింది. కార్యకలాపాలు 1999, ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్తు ఉత్పత్తి బాధ్యతలు నిర్వహిస్తుంది. విద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ, సామర్థ్యం లాంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను ఆధునీకరించడం, కొత్త విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం, పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ పనులు చేపడుతుంది.


ఏపీ ట్రాన్స్‌కో

ఈ సంస్థ 1999, ఫిబ్రవరి 1 నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా చేసే సంస్థ. ఏపీలోని పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు 

1) ది సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (తిశిళీశిదీదిలి): దీన్ని 2000, ఏప్రిల్‌ 1న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం తిరుపతిలో ఉంది. దీని పరిధిలోని జిల్లాల సంఖ్య 8. అవి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం.

2) ది ఈస్ట్రన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (తిశినిశిదీదిలి): . దీన్ని 2000, మార్చి 31న ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం విశాఖపట్నంలో ఉంది. దీని పరిధిలోని జిల్లాల సంఖ్య 5. అవి: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం.


ముఖ్యాంశాలు

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 18,494 మె.వా.

* గరిష్ఠంగా అవుతున్న విద్యుత్తు ఉత్పత్తి 15,490 మె.వా.

* జల విద్యుత్తు ఉత్పత్తి మొత్తం 3,219 మె.వా.

* అతిపెద్ద విద్యుత్తు ఉత్పత్తిదారు ఏపీజెన్‌కో.

* అతిపెద్ద థర్మల్‌ విద్యుత్తు కేంద్రం సింహాద్రి విద్యుత్తు కేంద్రం.

* రాష్ట్రంలో అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టును నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఏర్పాటు చేశారు.

* ఏపీకి అత్యధికంగా విద్యుత్తు సరఫరా చేసే విద్యుత్తు కేంద్రం సింహాద్రి పవర్‌ స్టేషన్‌ (కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది).

* రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం శ్రీశైలం కుడిగట్టు విద్యుత్తు కేంద్రం.

* రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో అతిపెద్ద బొగ్గు ఆధారిత విద్యుత్తు కేంద్రం నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం, విజయవాడ

* భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రం ఎగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం.

* రాష్ట్రంలో మొదటిసారిగా గుంటూరు జిల్లాలో వ్యర్థాలతో విద్యుత్తు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

* నిర్మాణంలో ఉన్న థర్మల్‌ విద్యుత్తు కేంద్రం: కాకరాపల్లి (శ్రీకాకుళం), సామర్థ్యం 1500 మె.వా. 

* పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని గొల్లవాని పిప్ప సమీపంలో లోసరి కాలువపై 1 మె.వా. సామర్థ్యంతో సౌర విద్యుత్తు ప్రాజెక్టు నిర్మించనున్నారు.

 

రచయిత: దంపూరు శ్రీనివాస్‌

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌