• facebook
  • whatsapp
  • telegram

భారత రాజ్యాంగం అవలోకనం

అధ్యాయం - I
యూనిట్ - 1
భారత రాజ్యాంగం - అవలోకనం
రాజ్యాంగం - స్వభావం

రాజ్యాంగం అంటే

     ఒక దేశ ప్రజలు, పాలకులు, పాలనా యంత్రాంగం పాటించాల్సిన అత్యున్నత చట్టం. దీనిలో ప్రభుత్వ విభాగాలు, దాని స్వరూపం, స్వభావం, లక్ష్యాలు, ఆశయాలను వివరించారు. రాజ్యాంగం అనేది లేకపోతే పాలనా వ్యవస్థ అదుపు తప్పి అరాచక, అస్తవ్యస్త పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉంది.


రాజ్యాంగం - మూలాలు
     ప్రపంచంలో రాజనీతిని శాస్త్రీయంగా మొదటిసారిగా అధ్యయనం చేసినవారు గ్రీకు దేశీయులు. రాజనీతిశాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ 158 రాజ్యాంగాలను విస్తృతంగా అధ్యయనం చేసి రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా ప్రతిపాదించి, వివరించాడు.
      ప్రపంచంలో తొలి రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం. అయితే ఇది పరిణామాత్మక రాజ్యాంగం. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగంగా అమెరికా రాజ్యాంగం అవతరించింది. రాజ్యాంగాన్ని సవరించడానికి అనుసరించే పద్ధతుల ఆధారంగా దాన్ని దృఢ, అదృఢ రాజ్యాంగంగా పేర్కొంటారు.


దృఢ రాజ్యాంగం
 ఏదైనా రాజ్యాంగాన్ని ప్రత్యేక మెజార్టీ ద్వారా అంటే 2/3వ లేదా 3/4వ వంతు మెజారిటీతో సవరించేది. ఈ విధానంలో రాజ్యాంగ సవరణ కఠినం. దీనికి ఉదాహరణ అమెరికా రాజ్యాంగం.


అదృఢ రాజ్యాంగం
    ఏదైనా రాజ్యాంగాన్ని సాధారణ మెజార్టీ ద్వారా సవరించగలిగితే దాన్ని అదృఢ రాజ్యాంగం అంటారు. దీనికి ఉదాహరణ బ్రిటిష్ రాజ్యాంగం.
    రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందుగా ఏర్పాటు చేసేదే రాజ్యాంగ సభ లేదా రాజ్యాంగ పరిషత్. ప్రపంచంలో మొదటిసారిగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు క్రీ.శ.1787 నాటి అమెరికాలోని ఫిలడెల్ఫియా కన్వెన్షన్.
    మన దేశంలో రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును తొలిసారిగా ప్రతిపాదించిన భారతీయుడు ఎమ్.ఎన్. రాయ్ (1934) కాగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును ప్రతిపాదించిన తొలి రాజకీయ పార్టీ స్వరాజ్యపార్టీ. 1942 నాటి క్రిప్స్ మిషన్ రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటును అధికారికంగా ప్రతిపాదించింది. 1918 డిసెంబరులో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో భారతీయ ప్రజాప్రతినిధులతో కూడిన రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయాలని తీర్మానించారు.


గాంధీజీ అభిప్రాయం
   గాంధీజీ 1922, జనవరి 5న యంగ్ ఇండియా అనే పత్రికలో ''స్వరాజ్ అనేది బ్రిటిష్‌వారు ఇచ్చే భిక్షకాదు, భారత ప్రజలు రాజకీయ భిక్షాటకులు కాదు" అని అన్నారు. 'రాజ్యాంగ నిర్మాణ సభ మాత్రమే దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించగలదు' అని పేర్కొన్నారు. 1937లో ఫైజాపూర్ వద్ద జవహర్‌లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో మొదటిసారిగా అధికార పూర్వకంగా రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటుకు డిమాండ్ చేశారు.


రాజ్యాంగ అభివృధ్ధి క్రమం
   భారత రాజ్యాంగ అభివృధ్ధి క్రమాన్ని బి.సి. రావత్ అనే పండితుడు 6 దశలుగా అధ్యయనం చేయవచ్చని పేర్కొన్నాడు. అవి:
    1. మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    2. రెండో దశ: క్రీ.శ.1773 నుంచి 1858 వరకు
    3. మూడో దశ: క్రీ.శ.1858 నుంచి 1909 వరకు
    4. నాలుగో దశ: క్రీ.శ.1909 నుంచి 1935 వరకు
    5. అయిదో దశ: క్రీ.శ.1935 నుంచి 1947 వరకు
    6. ఆరో దశ: క్రీ.శ.1947 నుంచి 1950 వరకు
మొదటి దశ: క్రీ.శ.1600 నుంచి 1773 వరకు
    క్రీ.శ.1600 డిసెంబరు 31న ఎలిజబెత్ మహారాణి అనుమతితో బ్రిటన్‌కు చెందిన ప్రైవేట్ వర్తకుల సంఘం ఈస్టిండియా కంపెనీ పేరుతో మన దేశంలో వర్తక, వాణిజ్యం నిర్వహించుకునే అవకాశాన్ని దక్కించుకుంది.
   ఈస్టిండియా కంపెనీ తన అధికార విస్తరణలో భాగంగా క్రీ.శ.1773 నాటికి 3 రాష్ట్రాలను స్వాధీనం చేసుకుంది.
అవి: 1) మద్రాసు
        2) బొంబాయి
        3) బెంగాల్
      క్రీ.శ.1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులు ఘన విజయం సాధించి, భారత్‌లో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకు పునాది వేశారు. క్రీ.శ.1764లో జరిగిన బక్సార్ యుద్ధంలో విజయం సాధించిన ఆంగ్లేయులు మొగల్ చక్రవర్తి నుంచి దివానీ హక్కులు పొందారు. ఈస్టిండియా కంపెనీ భారీగా అవకతవకలకు పాల్పడేది.
     ఈస్టిండియా కంపెనీలో జరుగుతున్న అవినీతిని వెలికితీయడానికి జనరల్ బుర్గోయిన్ అధ్యక్షతన బ్రిటిష్ ప్రభుత్వం ఒక రహస్య కమిటీని నియమించింది. ఈ కమిటీ ఈస్టిండియా కంపెనీలో భారీగా అవినీతి జరగుతుందని పేర్కొంటూ భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ కార్యక్రమాలను క్రమబద్ధం చేయాలని సిఫారసు చేసింది. ఈ కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని చేసింది.


రెండో దశ: 1773 నుంచి 1858 వరకు
    రెగ్యులేటింగ్ అంటే క్రమబద్ధం చేయడం అని అర్థం. భారత్‌లో ఈస్టిండియా కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధం చేయడానికి మనదేశంలో బ్రిటిష్‌వారు మొదటగా చేసిన చట్టం ఇది.
రెగ్యులేటింగ్ చట్టంలోని ముఖ్యాంశాలు
ఈ చట్టాన్ని బ్రిటిష్ ప్రధాని లార్డ్ నార్త్ 1773, మే 18న బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు.
*» ఈ చట్టం ప్రకారం బ్రిటిష్ ప్రభుత్వం ఈస్టిండియా కంపెనీ (E.I.C.)కి భారతదేశంలో 20 సంవత్సరాల పాటు వ్యాపారం చేసుకునే అనుమతిని మంజూరు చేసింది.
*» ఈ చట్టాన్ని అనుసరించి మద్రాసు, బొంబాయి ప్రెసిడెన్సీలను బెంగాల్ రాష్ట్ర పరిధిలోకి తీసుకువచ్చారు.
*» బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు.
*» వారన్ హేస్టింగ్స్ 1773 అక్టోబరు 20న బెంగాల్ గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు.
*» వారన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్న కాలంలోనే మనదేశంలో 1772లో కలెక్టర్ పదవిని సృష్టించారు.
*» ఈ చట్టం ప్రకారం 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో తొలిసారిగా సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.
*» ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు సాధారణ న్యాయమూర్తులను నియమించారు. వారు:

*» బెంగాల్ గవర్నర్ జనరల్‌కు సలహా ఇచ్చేందుకు నలుగురు సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అందులో క్లావెరింగ్, బార్‌వెల్, ఫిలిప్ ఫ్రాన్సిస్, మాన్‌సన్ ఉన్నారు.
 

సెటిల్‌మెంట్ చట్టం - 1781
» ఈ చట్టం ద్వారా భారత్‌లో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు అని పేర్కొనడం ద్వారా బ్రిటిష్‌వారు అధికారికంగా మనదేశంపై తమ అధికారాన్ని వ్యవస్థాపితం చేశారు.


పిట్స్ ఇండియా చట్టం - 1784
ఈ చట్టం ద్వారా రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించేందుకు ప్రయత్నించారు.
*» ఈ చట్టాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రధాని విలియం పిట్ జూనియర్ కాలంలో 1784లో బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించడం వల్ల దీనికి పిట్స్ ఇండియా చట్టం అనే పేరు వచ్చింది.
*» బెంగాల్ గవర్నర్ జనరల్‌గా వారన్ హేస్టింగ్స్ ఉన్న సమయంలో ఈ చట్టాన్ని చేశారు.


పిట్స్ ఇండియా చట్టంలోని ముఖ్యాంశాలు
*» ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీలో మొదటిసారిగా ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు.
*» ఈ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనాంశాలను 2 రకాలుగా విభజించారు.
1. వ్యాపార వ్యవహారాలు:
» వీటి నియంత్రణకు కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ఏర్పాటు చేశారు.
2. రాజకీయ వ్యవహారాలు
*» వీటి నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేశారు.
*» ప్రభుత్వ పాలన, న్యాయం, శాంతిభద్రతలు లాంటి వ్యవహారాలను ఇది నియంత్రిస్తుంది.
*» ముగ్గురు డైరెక్టర్లతో కూడిన ఒక రహస్య కమిటీ ఈ బోర్డ్ ఆదేశాలను భారతదేశానికి తెలియజేసేది.
*» గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలికి ప్రెసిడెన్సీ ప్రాంతాలపై ప్రత్యక్ష నియంత్రణ అధికారాన్ని కల్పించారు.

 

చార్టర్ చట్టం - 1793
*» చార్టర్ అంటే 'ఒప్పందం' అని అర్థం.
*» ఈ చట్టాన్ని గవర్నర్ జనరల్ కారన్ వాలీస్ కాలంలో చేశారు.
*» ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ వ్యాపార హక్కులను మరోసారి 20 సంవత్సరాలు పొడిగించారు.
*» గవర్నర్ జనరల్‌కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పించారు.
*» బోర్డ్ ఆఫ్ కంట్రోల్‌లోని సభ్యుల జీతాలు, ఇతర ఖర్చులు భారతదేశ రెవెన్యూ నుంచి చెల్లించేవారు.
*» కమాండర్ ఇన్ చీఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లో సభ్యుడు కాదు.

 

చార్టర్ చట్టం - 1813
*» ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లు పొడిగించారు.
*» ఈ చట్టం ప్రకారం భారతదేశంలో ఈస్టిండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేస్తూ (తేయాకు, చైనాతో వ్యాపారం మినహా) బ్రిటిష్ పౌరులందరికీ స్వేచ్ఛా వ్యాపార అవకాశాలను కల్పించారు.
*» స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని, అవి చెల్లించని వారిపై చర్యలను తీసుకునే అధికారాన్ని అప్పగించారు.
*» భారతదేశంలో విద్యావ్యాప్తికి సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు కేటాయించారు.
*» ప్రభుత్వ ఉద్యోగాల్లో భారతీయులకు అవకాశం కల్పించారు.
*» భారత్‌లోకి క్రైస్తవ మిషనరీల రాకను ఆహ్వానించారు.
*» ఇది మనదేశంలో మతమార్పిడులకు కారణమైంది.
*» కంపెనీ ఆదాయంపై, వ్యాపార లాభాలపై ప్రభుత్వానికి నియంత్రణ కల్పించారు.
*» ప్రైవేట్ వ్యక్తులకు కూడా భూములు కొనుగోలు చేసుకునే హక్కులు కల్పించారు.
*» బోర్డ్ ఆఫ్ కంట్రోల్ పరిధిని మరింత విస్తృతపరచారు.

 

చార్టర్ చట్టం - 1833
ఈ చట్టం ద్వారా ఈస్టిండియా కంపెనీ పాలనను మరో 20 ఏళ్లపాటు పొడిగించారు.
*» బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను భారతదేశ గవర్నర్ జనరల్‌గా మార్చారు.
*» దీని ఫలితంగా బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న విలియం బెంటింక్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్‌గా మారారు.
*» ఇతడికి సివిల్, మిలిటరీ, ఆర్థిక అధికారాలు అప్పగించారు.
*» రాష్ట్ర ప్రభుత్వాల శాసనాధికారాలను రద్దు చేసి, కార్యనిర్వహణ అధిపతియైన గవర్నర్ జనరల్‌కు పూర్తి శాసనాధికారాలను అప్పగించారు.
*» కంపెనీ వ్యాపార లావాదేవీలను రద్దుచేసి, పరిపాలనా సంస్థగా మార్చారు.
*» గవర్నర్ కార్యనిర్వాహక మండలి సభ్యులను నాలుగుకు పెంచి, అందులో ఒక న్యాయ సభ్యుడు ఉండేలా సవరణ చేశారు.
*» మొదటి న్యాయ సభ్యుడిగా మెకాలేను నియమించారు.
*» తేయాకు, చైనాతో వ్యాపారాన్ని కంపెనీ ఆధీనంలో నుంచి తొలగించారు.
*» భారతదేశంలో బానిసత్వాన్ని రద్దు చేశారు. కానీ లార్డ్ ఎలిన్‌బరో వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
*» సివిల్ సర్వీసుల నియామకాల్లో సార్వజనీన పోటీ పద్ధతిని ప్రతిపాదించారు. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడం వల్ల ఇది అమల్లోకి రాలేదు.
*» ఈ చట్టాన్ని భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది మెట్టుగా అభివర్ణిస్తారు.
*» యూరోపియన్లు భారతదేశానికి వలస వచ్చేందుకు; భూమి, ఆస్తులు సంపాదించుకునేందుకు ఉన్న నియంత్రణలను తొలగించి వారికి పూర్తిస్థాయిలో స్వేచ్ఛను కల్పించారు.
*» దీని వల్ల బ్రిటిష్ వలస రాజ్య స్థాపనకు చట్టబద్ధత కల్పించినట్లయ్యింది.
*» భారతీయ శాసనాలను క్రోడీకరించడానికి ఒక భారతీయ లా కమిషన్‌ను ఏర్పరిచారు. దీని మొదటి అధ్యక్షుడిగా లార్డ్ మెకాలేను నియమించారు.
*» భారతీయ పాలనలో కోవనెంటెడ్ పోస్టుల్లో ప్రతిభ ఉన్న భారతీయులను నియమించాలని రాజా రామ్ మోహన్‌ రాయ్ మొదటిసారిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాడు.
*» ఈ చట్టాన్ని సెయింట్ హెలీనా చట్టంగా పేర్కొంటారు.

 

చార్టర్ చట్టం - 1853
*» ఈస్టిండియా కంపెనీ పాలనలో ప్రవేశపెట్టిన చివరి చార్టర్ చట్టం.
*» ఈ చట్టం ద్వారా లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరుచేశారు.
*» శాసనాలు రూపొందించే ప్రక్రియ కోసం ఇండియన్ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఏర్పరిచారు.
*» ఇది బ్రిటిష్ పార్లమెంటులా తన విధులను నిర్వహిస్తుంది. అందుకే దీన్ని మినీ పార్లమెంటు అంటారు.
*» సివిల్ సర్వీస్ పరీక్షల్లో జాతి వివక్ష లేకుండా భారతీయులకు అనుమతి కల్పించి సార్వజనీన పోటీ విధానం ద్వారా నియమించే పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనికోసం 1854లో లార్డ్ మెకాలే కమిటీని ఏర్పాటు చేశారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా స్థానిక ప్రతినిధులకు ప్రాతినిధ్యాన్ని కల్పించారు. మొత్తం ఆరుగురు శాసన సభ్యుల్లో నలుగురిని మద్రాస్, బొంబాయి, బెంగాల్, ఆగ్రా ప్రాంతాల నుంచి తీసుకున్నారు.
*» శాసన నిర్మాణంలో భారతీయులకు తొలిసారిగా అవకాశం కల్పించారు. అయితే తుది నిర్ణయాధికారం మాత్రం గవర్నర్ జనరల్‌దే.
*» వివిధ లా కమిషన్‌ల సిఫారసుల ద్వారా సివిల్ ప్రొసీజర్ కోడ్ (1859), ఇండియన్ పీనల్ కోడ్ (1860), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1861)లను రూపొందించారు.
*» కంపెనీ పాలనకు సంబంధించి నిర్దిష్ట వ్యవధిని పేర్కొనక పోవడం వల్ల కంపెనీ పాలన చక్రవర్తి చేతుల్లోకి మారడానికి ఈ చార్టర్ చట్టం అవకాశం కల్పించింది.
*» 1773 నుంచి 1858 వరకు భారతదేశం ఈస్టిండియా కంపెనీ పాలన కింద ఉండేది. ఈ కాలంలో చేసిన చట్టాలను చార్టర్ చట్టాలు అంటారు.
*» 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటును ఈస్టిండియా కంపెనీ సమర్థవంతంగా అణిచివేయలేదని బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. 1858 నుంచి బ్రిటిష్ రాజు / రాణి నేరుగా అధికారాన్ని *చేపట్టడం ప్రారంభమైంది. అందుకే 1858 తర్వాత చేసిన చట్టాలు భారత ప్రభుత్వ చట్టాలు లేదా కౌన్సిల్ చట్టాలుగా పేరొందాయి.
*మూడో దశ: 1858 నుంచి 1909 వరకు

 

భారత ప్రభుత్వ చట్టం: 1858
» 1857 సిపాయిల తిరుగుబాటు అణిచివేత అనంతరం 1858, నవంబరు 1న బ్రిటిష్ రాణి విక్టోరియా మహారాణి భారతదేశ పరిపాలనా బాధ్యతలను స్వీకరిస్తూ ఒక ప్రకటనను జారీ చేసింది.


అందులోని మఖ్యాంశాలు:
*» ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు డి.డి. బసు ప్రకారం ఈ చట్టంతోనే భారత రాజ్యాంగ చరిత్ర ప్రారంభమైందని పేర్కొన్నారు.
*» భారతదేశ గవర్నర్ జనరల్ అనే పదవిని భారతదేశ వైస్రాయిగా మార్చారు.
*» భారత గవర్నర్ జనరల్, భారత వైస్రాయి అనే పదవులను ఒకే వ్యక్తి నిర్వహిస్తారు. మొదటి గవర్నర్ జనరల్, వైస్రాయి లార్డ్ కానింగ్.
*» బ్రిటిష్ పాలిత రాష్ట్రాల్లో గవర్నర్ జనరల్‌గా, స్వదేశీ సంస్థానాల్లో వైస్రాయిగా ఆ వ్యక్తి వ్యవహరిస్తారు.
*» వైస్రాయి దేశంలో బ్రిటిష్ రాణి మొదటి ప్రత్యక్ష ప్రతినిధి. ఇతడు దేశ పాలనను బ్రిటిష్ రాణి పేరుతో నిర్వహిస్తాడు.
*» ఈ చట్టం ద్వారా మన దేశంలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దయింది.
*» భారతదేశంలో బ్రిటిష్ ప్రత్యక్ష పాలన ప్రారంభమైంది.
*» ఇంగ్లండ్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని సృష్టించారు.
*» భారత రాజ్య కార్యదర్శి బ్రిటిష్ కేబినెట్‌లో భాగంగా భారతదేశ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించి బాధ్యత వహిస్తాడు.
*» భారత రాజ్య కార్యదర్శికి పరిపాలనలో సలహాలు ఇవ్వడానికి 15 మంది సభ్యులతో ఒక సలహా సంఘాన్ని (కౌన్సిల్) ఏర్పాటు చేశారు.
*» మొదటి భారత రాజ్య కార్యదర్శి: చార్లెస్ ఉడ్.
*» భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టారు.
*» ఈ చట్టాన్ని గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియాగా పేర్కొంటారు.
*» ఈ చట్టాన్ని విక్టోరియా మహారాణి భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు మాగ్నాకార్టా లాంటిదిగా అభివర్ణించింది.
*» ఈ చట్టం ద్వారా మనదేశంలో 1784లో ప్రవేశపెట్టిన బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే ద్వంద్వ పాలన రద్దయ్యింది.
*» ఈ చట్టం ద్వారా బ్రిటిష్ రాణి భారత సామ్రాజ్ఞి బిరుదు పొందింది.
*» భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విధానంలో భాగంగా క్రమానుగత శ్రేణి పద్ధతి కింది విధంగా ఉంది.


 

కౌన్సిల్ చట్టం: 1861
*» ఈ చట్టం భారతీయులకు శాసన నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం కల్పించింది.
*» 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా భారతదేశం బ్రిటిష్ ప్రత్యక్ష పాలన కిందకు వచ్చింది. దీనిలో భాగంగా భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ పార్లమెంటు రూపొందించిన చట్టాలన్నింటినీ కౌన్సిల్ చట్టాలుగా పేర్కొంటారు.
*» భారతరాజ్య కార్యదర్శితో కూడిన 15 మంది కౌన్సిల్ సభ్యుల పేరుమీద చట్టాలను రూపొందిచడం వల్ల ఈ చట్టాలను కౌన్సిల్ చట్టాలు అంటారు.
*» 1859లో లార్డ్ కానింగ్ కాలంలో మనదేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌ఫోలియో విధానానికి చట్టబద్దత కల్పించారు.
*» ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించడాన్ని పోర్ట్‌ఫోలియో విధానం అంటారు.
*» 1862లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో హైకోర్టులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1866లో అలహాబాద్‌లో నాలుగో హైకోర్టును ఏర్పాటు చేశారు.
*» 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా రద్దు చేసిన బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీల శాసన అధికారాలను పునరుద్ధరించడం ద్వారా వికేంద్రీకృత పాలనకు బీజాలు వేశారు.
*» గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్స్‌లు జారీ చేసే అధికారం కల్పించారు.
*» 1862లో వైస్రాయి లార్డ్ కానింగ్ కొంతమంది భారతీయులను అనధికార సభ్యులుగా నామినేట్ చేశాడు. ఈ విధంగా నామినేట్ అయినవారిలో బెనారస్ రాజు దేవ్ నారాయణ్‌సింగ్, పాటియాలా రాజు నరేంద్రసింగ్, సర్ దినకర్ రావు ఉన్నారు.
*» బెంగాల్, పంజాబ్, ఈశాన్య సరిహద్దు ప్రావిన్సులతో నూతన లెజిస్లేటివ్ కౌన్సిళ్లను ఏర్పాటు చేశారు.
*» ప్రభుత్వ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.

 

కౌన్సిల్ చట్టం: 1892
*» 1885లో మనదేశంలో భారత జాతీయ కాంగ్రెస్ (I.N.C.) ఏర్పడి జాతీయోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమంలో భాగంగా మితవాద నాయకులు గోపాలకృష్ణ గోఖలే నాయకత్వంలో పోరాడి ఆంగ్లేయులపై ఒత్తిడి తీసుకొచ్చారు.
*» మితవాదులు బ్రిటిష్ పాలనలోని లోపాలను ఎత్తిచూపుతూ భారతీయ మేధావులను చైతన్యపరచి ప్రజాఉద్యమాన్ని నిర్మించారు. వీరిని ఎదుర్కొనేందుకు ఆంగ్లేయులు 1892 కౌన్సిల్ చట్టాన్ని చేశారు.

 

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు
*» ఈ చట్టం ద్వారా మొదటిసారిగా పరోక్ష పద్ధతిలో శాసన సభ్యులను ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.
*» కేంద్ర శాసనసభలో అనధికార సభ్యులను 10 మందికి తక్కువ కాకుండా, 16 మందికి మించకుండా, అలాగే రాష్ట్ర శాసనసభల్లో 8 మందికి తక్కువ కాకుండా 20 మందికి మించకుండా నియంత్రించారు.
*» లెజిస్లేటివ్ కౌన్సిల్ అధికార పరిధిని విస్తృతపరిచి భారతీయులకు వైస్రాయి, గవర్నర్ల కౌన్సిళ్లలో స్థానం కల్పించారు. కౌన్సిల్‌లో ఆరుగురు భారతీయులకు ప్రాతినిధ్యం దక్కింది. వారు:

     1. సురేంద్రనాథ్ బెనర్జీ
     2. దాదాభాయ్ నౌరోజీ
     3. గోపాలకృష్ణ గోఖలే
     4. ఫిరోజ్‌షా మెహతా
     5. రాస్‌బిహారి ఘోష్
     6. బిల్‌గ్రామీ
*» ఈ చట్టం ద్వారా శాసనమండలి అధికారాలను విస్తృతం చేశారు. బడ్జెట్‌పై చర్చించడం లాంటి అధికారాలను కల్పించారు.
» ప్రజాప్రయోజనాల దృష్ట్యా శాసనసభల్లో ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేయడానికి సభ్యులకు అవకాశం కల్పించారు. అయితే ప్రశ్నలు అడగడానికి గవర్నర్, గవర్నర్ జనరల్‌ల ముందస్తు అనుమతి పొందాలి. శాసనసభల్లో తమ స్థానం నామమాత్రమే అని భావించిన భారతీయులు ఈ చట్టాన్ని వ్యతిరేకించారు.


ఈ దశలోని మరికొన్ని ముఖ్యాంశాలు


»

* లార్డ్ మెకాలే కృషి వల్ల భారత్‌లో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు.
*» మెకాలే లా కమిషన్ చైర్మన్‌గా అనేక చట్టాలను క్రోడీకరించారు.

*» 1854 నాటి ఉడ్స్ డిస్పాచ్ భారత్‌లో ఆంగ్ల విద్యావిధానానికి మాగ్నాకార్టాగా పేరొందింది.
*» కారన్ వాలీస్ భారత్‌లో సివిల్ సర్వీసులకు ఒక రూపం తీసుకొచ్చారు.
*» లార్డ్ కర్జన్ చేసిన బెంగాల్ విభజన 1905, అక్టోబరు 16 నుంచి అమల్లోకి వచ్చింది.
*» 1906లో ఢాకా నవాబు సలీముల్లాఖాన్ ఢాకాలో ముస్లింలీగ్‌ను ఏర్పరిచాడు. దీని మొదటి అధ్యక్షుడు ఆగాఖాన్.
*» 1907లో సూరత్‌లో రాస్‌బిహారి ఘోష్ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది.

 

నాలుగో దశ: 1909 - 1935
*భారత కౌన్సిల్ చట్టం లేదా మింటో - మార్లే సంస్కరణలు: 1909
*» 1892 కౌన్సిల్ చట్టంలోని లోపాలను సవరించడం, భారత్‌లో ఉద్ధృతమవుతున్న జాతీయోద్యమాన్ని ఎదుర్కోవడం, మితవాదులను సంతృప్తిపరచడం అనే లక్ష్యాల సాధనగా 1909లో మింటో మార్లే సంస్కరణలు చేశారు.
*» ఆనాటి భారత వైస్రాయి మింటో, భారత రాజ్య కార్యదర్శి మార్లే పేర్లతో ఈ చట్టాన్ని చేయడం వల్ల దీన్ని మింటో - మార్లే సంస్కరణల చట్టం అంటారు.

 

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:
*» మనదేశంలో మొదటిసారిగా పరిమిత ప్రాతిపాదికన ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని ప్రవేశపెట్టారు.
*» కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌ను ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా మార్చారు.
*» కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో సభ్యుల సంఖ్యను పెంచారు.
*» వైస్రాయి కార్యనిర్వాహక కౌన్సిల్‌లోని సభ్యుల సంఖ్యను శాసన ప్రక్రియ కోసం 16 నుంచి 60కి పెంచారు.
*» మద్రాస్, బెంగాల్, యునైటెడ్ ప్రావిన్స్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల శాసనమండళ్లలో సభ్యత్వ సంఖ్యను 50కి; పంజాబ్, అస్సాం, బర్మాలలో 30కి పెంచారు.
*» గవర్నర్ జనరల్ శాసనమండలిలో 4 రకాల సభ్యులుంటారు. వారు:
     1. నామినేటెడ్ అధికార సభ్యులు
     2. నామినేటెడ్ అనధికార సభ్యులు
     3. హోదారీత్యా సభ్యులు
     4. ఎన్నికైన సభ్యులు

*» వైస్రాయి, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో భారతీయులకు మొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులైన మొదటి భారతీయుడు సత్యేంద్రప్రసాద్ సిన్హా (న్యాయసభ్యుడు).
*» 1906లో ఏర్పడిన ముస్లిం లీగ్ కృషి మేరకు మనదేశంలో ముస్లింలకు వారి జనాభాకు మించి ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ముస్లిం సభ్యులను ముస్లింలే ఎన్నుకునేందుకు వీలైంది. అందుకే లార్డ్ మింటోను భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడిగా పేర్కొంటారు. ఈ విధానం 1947లో దేశ విభజనకు పునాది వేసింది.
*» శాసనసభలో బడ్జెట్‌తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని భారతీయులకు కల్పించారు.
*» ఈ చట్టం ద్వారా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు, భూస్వాములు, వ్యాపార సంస్థలకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించారు.
*» కేంద్ర, రాష్ట్ర శాసనమండళ్లలో పోటీ చేసే అభ్యర్థులకు కచ్చితమైన అర్హతలను నిర్దేశించారు.
*» 1911లో రెండో లార్డ్ హార్డింజ్ కాలంలో బెంగాల్ విభజనను రద్దు చేసి, భారతదేశ రాజధానిగా కలకత్తాకు బదులు దిల్లీని నిర్దేశించారు.
*» మింటో మార్లే చట్టాన్ని చంద్రకాంతితో పోల్చారు. ఇది కేవలం నీడ లాంటి ఆకారాన్ని మాత్రమే అందించింది. ఈ చట్టం హిందువులు, ముస్లింల మధ్య వేర్పాటు బీజాలు నాటి భారతదేశ విభజనకు కారణమైందని జవహర్‌లాల్ నెహ్రూ వ్యాఖ్యానించారు.
 

మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం: 1919
భారత రాజ్య కార్యదర్శి మాంటేగ్, గవర్నర్ జనరల్ చెమ్స్‌ఫర్డ్ ఈ చట్టాన్ని రూపొందిచడం వల్ల దీనికి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం అని పేరు వచ్చింది.
ఈ చట్టం రూపొందించడానికి కారణాలు
*» 1916 ఏప్రిల్‌లో పుణె కేంద్రంగా బాలగంగాధర తిలక్, సెప్టెంబరులో మద్రాస్ కేంద్రంగా అనిబిసెంట్ హోంరూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారత జాతీయోద్యమాన్ని బలోపేతం చేయడం.
*» 1909 నాటి మింటో మార్లే సంస్కరణల చట్టం భారతీయులను సంతృప్తి పరచలేకపోవడం.
*» 1919, ఏప్రిల్ 13న పంజాబ్‌లో జనరల్ డయ్యర్ వికృత చేష్ట జలియన్ వాలాబాగ్ దురంతం వల్ల భారతీయుల్లో పెల్లుబికిన ఆగ్రహ జ్వాలలను చల్లబరచడం.
*» రౌలత్ చట్టాన్ని గాంధీజీ BLACK ACT (నల్ల చట్టం)గా అభివర్ణించి 1919, ఏప్రిల్ 6న జాతిని అవమానించిన దినంగా పాటించాలని భారతీయులకు పిలుపు నివ్వడం.


మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టంలోని ముఖ్యాంశాలు
*» భారతదేశంలో తొలిసారిగా బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టారు. పార్లమెంటరీ విధానం ప్రారంభమైంది.
*» భారత రాజ్య కార్యదర్శి వేతనాలను భారత ఆదాయం నుంచి కాకుండా బ్రిటన్ నుంచి చెల్లిస్తారు.
*» కేంద్ర శాసనసభలో మొదటిసారిగా ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. అవి:
1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ (ఎగువ సభ)
*» దీనిలో 60 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 34 మంది ఎన్నికైనవారు. 26 మంది గవర్నర్ జనరల్ నామినేట్ చేసినవారు ఉంటారు.
*» వీరి పదవీ కాలం 5 సంవత్సరాలు.
*» దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేశారు.
*» దీనికి గవర్నర్ జనరల్ ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
2. లెజిస్లేటివ్ కౌన్సిల్ (దిగువ సభ)
*» ఈ సభలో మొత్తం సభ్యుల సంఖ్య 144. వీరిలో 103 మంది ఎన్నికైనవారు కాగా, 41 మంది నామినేటెడ్ సభ్యులు.
*» ఈ సభ పదవీకాలం 3 సంవత్సరాలు.
*» ఈ సభకు తొలి అధ్యక్షుడు - విఠల్‌భాయ్ పటేల్, తొలి ఉపాధ్యక్షుడు - సచ్చిదానంద సిన్హా.
*» కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, లెజిస్లేటివ్ అసెంబ్లీలను 1921లో ఏర్పాటు చేశారు.
*» కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పాలనాంశాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితాలుగా విభజించారు.
1. కేంద్ర జాబితా
» ఈ జాబితాలో మొత్తం 47 అంశాలను చేర్చారు.
*» జాతీయ ప్రాముఖ్యం గల అంశాలన్నీ ఈ జాబితాలో ఉన్నాయి.
ఉదా: దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, ప్రభుత్వ రుణం, నౌకాయానం, తంతి తపాలా, రక్షణ, కరెన్సీ, ఎగుమతులు, దిగుమతులు.
2. రాష్ట్ర జాబితా
*» ఈ జాబితాలో మొత్తం 51 అంశాలను చేర్చారు.
*» ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలను రాష్ట్ర జాబితాలో చేర్చారు.
*ఉదా: ప్రజారోగ్యం, విద్య, వ్యవసాయం, అడవులు, స్థానిక ప్రభుత్వాలు, శాంతి భద్రతలు, రోడ్డు రవాణా, నీటిపారుదల.
*» ఈ చట్టం ద్వారా రాష్ట్ర స్థాయిలో ద్వంద్వ పాలన (Dyarchy)ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ప్రభుత్వ పాలనాంశాలను రెండు జాబితాలుగా వర్గీకరించారు. అవి:
1. రిజర్వ్‌డ్ జాబితా
*» దీనిలో మొత్తం 28 పాలనాంశాలను నిర్దేశించారు.
*» అత్యంత ప్రాధాన్యం ఉన్న అధికారాలు, ఆదాయమున్న విత్తం, భూమిశిస్తు, న్యాయం, నీటిపారుదల, పరిశ్రమలు మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.
*» ఈ అంశాలకు సంబంధించిన పరిపాలనాంశాలను కార్యనిర్వాహక మండలి సహాయంతో ఆయా రాష్ట్రాల గవర్నర్లు నిర్వహిస్తారు. ఈ కార్యనిర్వాహక వర్గ సభ్యులు తమ విధి నిర్వహణలో రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
2. ట్రాన్స్‌ఫర్డ్ జాబితా
*» దీనిలో మొత్తం 22 అంశాలు ఉంటాయి.
*» అధికారాలు లేని, ప్రాముఖ్యం లేని కేవలం బాధ్యతలు మాత్రమే కలిగి ఉండే అంశాలను దీనిలో చేర్చారు.
*» స్థానిక పాలన, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, వ్యవసాయం దీనిలో ఉన్నాయి.
*» రాష్ట్ర గవర్నర్లు ఈ అంశాల పాలనా వ్యవహారాలను భారతీయ మంత్రుల సహాయంతో నిర్వహిస్తారు. భారతీయ మంత్రులు ఆయా రాష్ట్ర శాసనసభల్లో సభ్యులై ఉంటారు. వీరు తమ విధుల నిర్వహణలో శాసనసభకు బాధ్యత వహిస్తారు.
*» చట్టసభల్లో సిక్కులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారు.
*» చట్టసభల్లో క్రైస్తవులకు, ఆంగ్లో ఇండియన్లకు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలు కేటాయించడం ద్వారా మతపరమైన ప్రాతినిధ్యాన్ని విస్తృతపరిచారు.
*» ఆస్తి, పన్నులు చెల్లించే ప్రాతిపదికపై పరిమిత ఓటుహక్కును కల్పించారు.
*» ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తనిఖీ చేయడం కోసం ఆడిటర్ జనరల్ పదవిని ఏర్పాటుచేశారు.
*» లండన్‌లో భారత వ్యవహారాలను పర్యవేక్షించడానికి భారత హైకమిషనర్ అనే పదవిని సృష్టించారు. లండన్‌లో భారత హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
*» 1921లో ప్రభుత్వ ఖాతాల సంఘాన్ని (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ - పీఏసీ) ఏర్పాటు చేశారు.
*» కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.
*» గవర్నర్ జనరల్ కౌన్సిల్‌లోని ఆరుగురు సభ్యుల్లో ముగ్గురు భారతీయులకు అవకాశం కల్పించారు.
*» కేంద్ర, రాష్ట్రాల మధ్య; అంతర్ రాష్ట్రాల మధ్య ఉత్పన్నమయ్యే వివాదాలను పరిష్కరించే అధికారం వైస్రాయికి ఇచ్చారు.
*» పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు గురించి అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి లీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా 1926లో కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటయ్యాయి.
*» రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్ నుంచి వేరుచేశారు.
*» మాంటేగ్ - ఛెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం కేవలం మనదేశంలో 2.6% ప్రజలకు మాత్రమే ఓటుహక్కును కల్పించింది.

*1919 చట్టం తర్వాత బ్రిటిష్ ఇండియా పరిపాలన కింది విధంగా ఉంది.
* 1919 చట్టంపై ఉన్న విమర్శ:
*» ''నేరమే అధికారమై నేరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కరూ నేరుస్థులే" - గాంధీజీ.
*» ఈ చట్టం సూర్యుడు లేని ఉదయం లాంటిది అని బాలగంగాధర్ తిలక్ అభివర్ణించారు.
*» 10 సంవత్సరాల తర్వాత ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
*» ఈ చట్టం 1921 నుంచి అమల్లోకి వచ్చింది.
*» భారతదేశంలో ద్వంద్వ పాలన అనేది చాలావరకు దూషించే మాట అయింది. ''ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని నీవు డైయార్కివి అని అనడం విన్నాను" అని సర్ బట్లర్ అనే రచయిత పేర్కొన్నాడు.
» ద్వంద్వ పాలనను ఎప్పుడూ ఆదర్శంగా భావించలేదు. ఇంకో ఉత్తమ ప్రయోజన స్థితికి ఇది ఒక మెట్టు మాత్రమే. ఈ ఉత్తమ ప్రయోజనం పేరు పరిపూర్ణ స్వపరిపాలిత భారతదేశం అని పలాండే (రచయిత) పేర్కొన్నాడు.
*» ద్వంద్వ ప్రభుత్వాన్ని మడ్డీ మాన్ కమిటీ సమర్థించింది.

 

సైమన్ కమిషన్: 1927
*» 1919 నాటి మాంటేగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించేందుకు నాటి బ్రిటన్ ప్రధాని బాల్డ్విన్ 1927 లో సర్ జాన్ సైమన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో ఒక కమిషన్‌ను నియమించాడు.
*» ఈ కమిషన్‌లో ఒక్క భారతీయుడికి కూడా ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో భారతీయులు దీన్ని వ్యతిరేకించారు. సైమన్ గో బ్యాక్ అనే నినాదంతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
*» సైమన్ కమిషన్ భారతదేశంలో రెండు పర్యాయాలు పర్యటించింది.
    1) 1928, ఫిబ్రవరి 3 నుంచి మార్చి 31 వరకు
    2) 1928, అక్టోబరు 11 నుంచి 1929, ఏప్రిల్ 6 వరకు
» సైమన్ కమిషన్ తన నివేదికను 1930లో లండన్‌లోని బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించింది.


సైమన్ కమిషన్ నివేదికలో ముఖ్యాంశాలు:
*» భారతదేశంలో సమాఖ్య తరహా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.
*» 1919లో రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ పాలనను రద్దు చేయాలి.
*» మంత్రులందరూ శాసనసభకు బాధ్యత వహించాలి.
*» భారతీయులకు ప్రభుత్వ నిర్వహణలో స్వయం ప్రతిపత్తిని కల్పించాలి.
*» హైకోర్టులపై కేంద్ర ప్రభుత్వానికి పాలనాపరమైన నియంత్రణను ఏర్పరచాలి.
*» భాషా ప్రాతిపదికపై ఒరిస్సా, సింధు రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి.
*» సార్వత్రిక వయోజన ఓటుహక్కు సాధ్యం కాదు.
*» ప్రాథమిక హక్కులను నిరాకరించారు.
*» కమ్యూనల్ ప్రాతినిధ్యం సమంజసం కాకపోయినా దీనికి ప్రత్యామ్నాయం లేని దృష్ట్యా కొనసాగించాలి.
*» అధినివేశ ప్రతిపత్తి (డొమినియన్ స్టేటస్)తో కూడుకున్న స్వాతంత్య్రాన్ని తిరస్కరించాలి.
* సైమన్ కమిషన్ నివేదిక అనేది భారతదేశ సమస్యలపై ఒక సమగ్రమైన అధ్యయనం అని కూప్లాండ్ (రచయిత) పేర్కొన్నాడు.
* 1935లో చేసిన భారత ప్రభుత్వ చట్టంలో సైమన్ కమిషన్ సిఫారసులను పొందుపరిచారు.

 

నెహ్రూ నివేదిక : 1928
» సైమన్ కమిషన్‌ను బహిష్కరిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస అయ్యంగార్ ప్రకటించడంతో... భారతరాజ్య క్యార్యదర్శి లార్డ్ బిర్కెన్‌హెడ్ 1927, నవంబరు 24న బ్రిటిష్ ఎగువ సభలో ప్రసంగిస్తూ ''భారతీయులు అన్ని వర్గాలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన స్వయంగా రచించుకోగలరా'' అని భారతీయులకు సవాలు విసిరారు. ఆ సవాలును స్వీకరించిన భారత జాతీయ కాంగ్రెస్ 1928, మే 19న బొంబాయిలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగ రచనకు మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన 9 మంది సభ్యులతో ఒక ఉపసంఘాన్ని నియమించారు.

 

నెహ్రూ నివేదికలోని ముఖ్యాంశాలు:
*» భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఇవ్వాలి.
*» కార్యనిర్వాహక శాఖ శాసనసభకు బాధ్యత వహించాలి.
*» ఇందులో 19 ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు.
*» దేశంలో సమాఖ్య వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
*» పంజాబ్, బెంగాల్‌లోని ప్రత్యేక మత నియోజక వర్గాలను రద్దు చేయాలి.
*» అల్పసంఖ్యాక వర్గాల వారికి శాసనమండళ్లలో కనీసం 10 సంవత్సరాల పాటు కొన్ని స్థానాలను కేటాయించాలి.

 

దీపావళి ప్రకటన:
*» సైమన్ కమిషన్ నివేదికపైనా, భారత్‌లో రాజ్యాంగ సంస్కరణలపైనా చర్చించేందుకు లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహిస్తామని... భారత్‌కు త్వరలోనే స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని భారత గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్ 1929, అక్టోబరు 31న ఒక ప్రకటన చేశాడు. దీన్నే దీపావళి ప్రకటన అంటారు.
*» 1929లో బ్రిటన్‌లో జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లేబర్ పార్టీ గెలుపొంది రామ్‌సే మెక్‌డొనాల్డ్ ప్రధానమంత్రి అయ్యాడు. ఇతడు గవర్నర్ జనరల్ లార్డ్ ఇర్విన్‌తో సంప్రదింపులు జరిపాడు. *సైమన్ కమిషన్‌ను భారతీయులు తిరస్కరించడంతో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రయత్నించాడు. లండన్‌లో రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
మొదటి రౌండ్ టేబుల్ సమావేశం:
*» ఇది లండన్‌లో 1930, నవంబరు 12 నుంచి 1931, జనవరి 19 వరకు జరిగింది. దీనిలో 89 మంది ప్రముఖులు పాల్గొన్నారు.
*» ఈ సమావేశంలో ముస్లిం లీగ్ తరఫున జిన్నా, ఆగాఖాన్, మహ్మద్ షఫీ, ఫజల్ హక్; హిందూ మహాసభ తరఫున ఎమ్.ఆర్ .జయకర్, మూంజే; ఉదారవాదుల తరఫున తేజ్‌బహదూర్ సప్రూ, చింతామణి, బి.ఆర్. అంబేడ్కర్, హైదరాబాద్ దివాన్ అక్బర్ హైదర్ కూడా హాజరయ్యారు.
*» ఈ సమావేశంలో సంపూర్ణ బాధ్యతాయుత పాలనపై చర్చిస్తామని ఆంగ్లేయులు ప్రత్యేక హామీని ఇవ్వనందున భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు. కాంగ్రెస్ పాల్గొనక పోవడం వల్ల ఈ సమావేశం విఫలమైంది. సమావేశంలో పాల్గొనని ప్రజా వర్గాల సహకారం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రధానమంత్రి రామ్‌సే మెక్‌డొనాల్డ్ ఈ సమావేశాన్ని ముగించినట్లు ప్రకటించాడు.
గాంధీ - ఇర్విన్ ఒప్పందం:
*» కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేనిదే తాము నిర్వహించే సమావేశాలు సఫలం కావని గుర్తించిన ఆంగ్లేయ ప్రభుత్వం రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీని ఒప్పించాలని వైస్రాయి ఇర్విన్‌ను ఆదేశించింది. ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో అరెస్టయిన గాంధీజీని విడుదల చేయడంతో 1931, మార్చి 5న గాంధీ, ఇర్విన్ మధ్య సమావేశం జరిగింది. దీన్నే గాంధీ ఇర్విన్ ఒప్పందం అంటారు.
దీనిలోని ముఖ్యాంశాలు:
*» రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి.
*» కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి, రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
*» తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పన్ను లేకుండా ఉప్పును తయారు చేసుకునే అవకాశాన్ని కల్పించాలి.
*» శాసనోల్లంఘన ఉద్యమంలో స్వాధీనం చేసుకున్న ఆస్తులను తిరిగి ఇవ్వడం.

 

రెండో రౌండ్ టేబుల్ సమావేశం:
» ఇది లండన్‌లో 1931, సెప్టెంబరు 7 నుంచి డిసెంబరు 1 వరకు జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున గాంధీజీ హాజరయ్యారు. స్వదేశీ సంస్థానాధిపతులతో సహా 107 మంది ప్రతినిధులు, మహిళా ప్రతినిధిగా సరోజినీ నాయుడు హాజరయ్యారు. బలహీన వర్గాల తరఫున బి.ఆర్.అంబేడ్కర్ పాల్గొన్నారు. అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై గాంధీజీ - మహ్మద్ అలీ జిన్నా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఆంగ్లేయులు విభజించు -  పాలించు సూత్రాన్ని పాటించడం వల్ల గాంధీ సమావేశం నుంచి ఉపసంహరించుకుని భారత్‌కు రావడంతో ఆంగ్లేయులు అతడిని అరెస్ట్ చేశారు


కమ్యూనల్ అవార్డు: 1932
» ఆనాటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డొనాల్డ్ 1932, ఆగస్టు 4న కమ్యూనల్ అవార్డును ప్రకటించాడు. దీని ప్రకారం ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్డ్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక వర్గాలను ప్రతిపాదించాడు. దీన్ని వ్యతిరేకిస్తూ మహాత్మాగాంధీ పూనాలోని ఎరవాడ కారాగారంలో 1932, సెప్టెంబరు 20న ఆమరణ నిరాహర దీక్షకు పూనుకున్నారు. దీంతో గాంధీజీ - అంబేడ్కర్ మధ్య పూనాలో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే పూనా ఒప్పందం - 1932 అంటారు. దీని ఫలితంగా కమ్యూనల్ అవార్డు కంటే ఎక్కువగా షెడ్యూల్డు కులాలకు అవకాశాలు లభించాయి. కమ్యూనల్ అవార్డు షెడ్యూల్డ్ కులాలను దళితులుగా పేర్కొంది.


మూడో రౌండ్ టేబుల్ సమావేశం:
*» ఈ సమావేశం లండన్‌లో 1932, నవంబరు 17 నుంచి డిసెంబరు 24 వరకు జరిగింది. ఈ సమావేశానికి జాతీయ కాంగ్రెస్ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశానికి జిన్నా, అంబేడ్కర్‌లతో సహా మొత్తం 46 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
*» మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించి, నిర్ణయించిన అంశాలతో బ్రిటిష్ ప్రభుత్వం ఒక శ్వేత పత్రాన్ని ప్రచురించింది. దీనిలోని ప్రతిపాదనలను లార్డ్ లిన్‌లిత్‌గో అధ్యక్షతన బ్రిటిష్ *పార్లమెంటుకు చెందిన సెలెక్ట్ కమిటీ పరిశీలించి... 1934, నవంబరు 11న ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కాంగ్రెస్ తిరస్కరించింది. ముస్లిం లీగ్ సమాఖ్య అనే భావనను తిరస్కరించి, ప్రాంతాలకు సంబంధించిన భాగాన్ని ఆమోదించింది.
*5వ దశ: 1935 - 1947
*భారత ప్రభుత్వ చట్టం - 1935
*» బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలన్నింటిలో సమగ్రమైంది, భారత పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ముఖ్యమైంది.
*» 800 సంవత్సరాల బ్రిటిష్ పార్లమెంటు చరిత్రలో ఆమోదం పొందిన అతిపెద్ద చట్టం.
*» ఈ చట్టంలో 321 ఆర్టికల్స్, 10 షెడ్యూల్స్ ఉన్నాయి.
*» ఈ చట్టం 1937, ఏప్రిల్ నుంచి అమల్లోకి వచ్చింది.
*» భారత రాజ్యాంగ నిర్మాతలు 70 శాతం పైగా అంశాలను ఈ చట్టం నుంచి గ్రహించారు. అందుకే ఈ చట్టాన్ని భారత రాజ్యాంగానికి జిరాక్స్ కాపీ లాంటిదని హస్రత్ మొహాని పేర్కొన్నాడు.
» భారతదేశంలో బాధ్యతాయుతమైన పాలనను అందించడం ఈ చట్టం ముఖ్య లక్ష్యంగా ప్రకటించారు.

 

చట్టంలోని ముఖ్యాంశాలు:
అఖిల భారత సమాఖ్య ఏర్పాటు:
» సైమన్ కమిషన్ సూచనలను అనుసరించి మనదేశంలో ఆంగ్లేయులు సమాఖ్య తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు, సమాఖ్యలో చేరడానికి అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు ఉంటాయి.
» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల అధికార విభజన జరిగింది.
ఎ) కేంద్ర జాబితా: దీనిలో రక్షణ, కరెన్సీ, విదేశీ వ్యవహారాలు, తంతి తపాలా లాంటి జాతీయ ప్రాధాన్యం ఉన్న 59 అంశాలు ఉన్నాయి.
బి) రాష్ట్ర జాబితా: దీనిలో నీటిపారుదల, వ్యవసాయం, విద్య, స్థానిక పాలన లాంటి ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న 54 అంశాలు ఉన్నాయి.
సి) ఉమ్మడి జాబితా: దీనిలో వివాహం, విడాకులు, వారసత్వం లాంటి 36 అంశాలు ఉన్నాయి.
    పైన పేర్కొన్న 3 జాబితాల్లో లేని అంశాలను అవశిష్టాధికారాలు అంటారు. వీటిని గవర్నర్ జనరల్‌కు బదలాయించారు.
     రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలను రద్దు చేసి, కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనాంశాలను రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ అంశాలుగా విభజించారు.
ఎ) రిజర్వ్‌డ్ జాబితా: దీనిలో ప్రాధాన్యం గల అధికారాలు, ఆదాయమున్న అంశాలు చోటుచేసుకున్నాయి. వీటిపై బ్రిటిష్ గవర్నర్ జనరల్‌కు అధికారం కల్పించారు.
బి) ట్రాన్స్‌ఫర్డ్ జాబితా: అధికారాలు, ఆదాయం లేని; అంతగా ప్రాధాన్యం లేని అంశాలను ఈ జాబితాలో చేర్చారు. దీనిలో బాధ్యతలు అధికంగా ఉంటాయి. వీటిని భారతీయ మంత్రులకు అప్పగించారు.
కేంద్ర శాసనసభ: కేంద్రంలో ద్విసభా విధానాన్ని కొనసాగిస్తూ సభల్లోని సభ్యుల సంఖ్యను పెంచారు.
ఎ) కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్:
    ఎగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 260. దీనిలో మూడో వంతు సభ్యులను మన దేశంలోని స్వదేశీ సంస్థానాల ప్రతినిధులకు కేటాయించారు.
బి) లెజిస్లేటివ్ అసెంబ్లీ:
» దిగువసభ అయిన దీనిలో మొత్తం సభ్యుల సంఖ్య 375.


రాష్ట్రాల్లో ద్విసభా విధానం
» ఈ చట్టం ద్వారా భారత్‌లోని రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
» భారత్‌లోని మొత్తం 11 బ్రిటిష్ పాలిత రాష్ట్రాలకు గాను 6 రాష్ట్రాల్లో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు.
అవి: 1. అస్సాం
        2. బెంగాల్
        3. బీహార్
        4. ఉత్తర్‌ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్స్)
        5. మద్రాస్
        6. బొంబాయి
*» 1919 చట్టం ద్వారా మనదేశంలోని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని 1935 చట్టం ద్వారా రద్దుచేశారు.
*» రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ రాష్ట్రాల్లో రిజర్వ్‌డ్, ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలను రద్దుచేసి... రాష్ట్ర జాబితాలోని 54 అంశాలపై భారతీయ మంత్రులకు అధికారాలు కల్పించారు.
ఫెడరల్ కోర్టు:
*» ఢిల్లీలో 1935, అక్టోబరు 1న ఫెడరల్ కోర్టును స్థాపించారు. ఇది 1937 నుంచి పని విధానాలను ప్రారంభించింది.
*» మనదేశంలో సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టినందున కేంద్రం - రాష్ట్రాలు; దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను ఇది పరిష్కరిస్తుంది.
*» దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు.
*» మొదటి ప్రధాన న్యాయమూర్తి - మారిస్ గ్వేయర్.
*» ఈ కోర్టు ఇచ్చిన తీర్పులపై లండన్‌లోని ప్రీవి కౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
*» ఓటు హక్కును విస్తృతపరిచి, జనాభాలో 10 శాతానికి ఓటుహక్కును వర్తింపజేశారు.
*» భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా బర్మాను భారతదేశం నుంచి వేరుచేశారు.
*» ఒరిస్సా, సింధ్ అనే రెండు కొత్త ప్రావిన్సులను ఏర్పాటు చేశారు. బ్రిటిష్ ఇండియాపై బ్రిటిష్ పార్లమెంట్ సర్వాధిపత్యాన్ని పునరుద్ఘాటించారు.
*» భారతదేశంలో ఆర్థిక విధానం, రుణ నియంత్రణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు.
*» ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కేంద్రంలో ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను, రాష్ట్రాల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను ఏర్పాటు చేశారు.
*» రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన న్యాయ సలహాదారుడైన అడ్వకేట్ జనరల్ పదవిని సృష్టించారు.
*» కేంద్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ జనరల్ బ్రిటిష్ రాణి పరిశీలన కోసం లండన్‌కు పంపే అధికారాన్ని కల్పించారు.
*» సామాజికంగా వెనుకబడిన, బలహీన వర్గాలకు ప్రత్యేక రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు.
*» భారత రాజ్య కార్యదర్శికి సలహాను ఇచ్చే భారత కౌన్సిల్‌ను రద్దు చేశారు.
*» 1937 నుంచి భారత ప్రభుత్వ చట్టం - 1935 అమల్లోకి వచ్చింది. 1937లో కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలు జరిగాయి.
*» 11 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో భారత జాతీయ కాంగ్రెస్ విజయం సాధించింది. 3 రాష్ట్రాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.
*» 1939, అక్టోబరులో బ్రిటిష్ వైఖరికి నిరసనగా 8 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజీనామా చేశాయి.
*» భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా ప్రవేశపెట్టిన ప్రధాన అంశం ప్రాంతీయ స్వపరిపాలన.

 

1935 చట్టంపై విమర్శలు
*''ఇది పొట్టి మనుషులు (పిగ్మీస్) కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం (రాక్షస స్తంభం)" - విన్‌స్టన్ చర్చిల్
*''భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వం బలవంతంగా రుద్దిన చట్టం" - కె.టి. షా
*''మనదేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది" - జవహర్‌లాల్‌ నెహ్రూ
*''కచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అనంగీకృతమైంది" - మహ్మద్ అలీ జిన్నా
*''ఒక మంచి వాహనానికి చక్కటి బ్రేకులను అమర్చి ముఖ్యమైన ఇంజిన్‌ను బిగించడం మరచిపోయారు" - జవహర్‌లాల్‌ నెహ్రూ
*''భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో గోచరించే భూస్వామ్య వ్యవస్థను దృఢతరం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం" - సుభాష్ చంద్రబోస్

 

లిన్‌లిత్‌గో ఆగస్టు ప్రతిపాదనలు: 1940
*» భారత గవర్నర్ జనరల్, వైస్రాయి అయిన లార్డ్ లిన్‌లిత్‌గో 1940, ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలను ఆగస్టు ప్రతిపాదనలు అంటారు.
ముఖ్యాంశాలు:
*» రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి కల్పించడం అనే విషయాన్ని పరిశీలించడం. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకునే బాధ్యత ప్రధానంగా భారతీయులకే ఉంటుందని మొదటిసారిగా ప్రకటించారు.
*» రాజ్యాంగ పరిషత్తులో అల్పసంఖ్యాక వర్గాల వారికి సముచిత ప్రాతినిధ్యం ఇవ్వడం. భారతీయులు రెండో ప్రపంచ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించాలి.
*» అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంస్థానాల ప్రతినిధులతో కూడిన యుద్ధ సలహా మండలిని ఏర్పాటు చేయడం.
*» వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులకు గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో సభ్యత్వం కల్పించి మండలిని విస్తృతపరచడం.
*» ఆగస్టు ప్రతిపాదనలను భారతీయులు తీవ్రంగా వ్యతిరేకించారు.

 

క్రిప్స్ ప్రతిపాదనలు: (1942)
*      రెండో ప్రపంచ యుద్ధ సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న బ్రిటన్ యుద్ధంలో భారతీయ సైన్యాల సహకారం పొందేందుకు క్రిప్స్ ప్రతిపాదనలు అనే పేరుతో బ్రిటన్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తన కేబినెట్ మంత్రి అయిన సర్ స్టాఫర్డ్ క్రిప్స్‌ను భారత్‌కు పంపాడు. 1942, మార్చి 22న భారత్‌కు వచ్చిన క్రిప్స్ ప్రతిపాదనల్లోని ముఖ్యాంశాలు
*» భారత ప్రజల ప్రతిపాదన అయిన కొత్త రాజ్యాంగాన్ని నిర్మించడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు అవుతుందని ప్రకటించారు.
*» గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక మండలిలో ఒక భారతీయుడికి సభ్యత్వం ఇస్తారు.
*» రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగాన్ని కలిగి ఉండవచ్చు లేదా నూతన రాజ్యాంగాన్ని రూపొందించుకోవచ్చు.
*» బ్రిటిష్‌వారు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని పేర్కొంటూ, దానికి బదులుగా భారతీయులు బ్రిటిష్‌వారికి సహకరించాలని అని పేర్కొన్నారు.
» భారతీయులకు అధినివేశ ప్రతిపత్తి (పాక్షిక స్వాతంత్య్రం) కల్పిస్తామని ప్రకటించారు.
*» క్రిప్స్ ప్రతిపాదనలను వ్యతిరేకించిన భారత జాతీయ కాంగ్రెస్ చారిత్రక క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించింది.
» 1942, ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రకటిస్తూ గాంధీజీ Do or Die నినాదాన్ని ఇచ్చారు.
*» క్రిప్స్ ప్రతిపాదనలను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ''దివాళా తీస్తున్న బ్యాంకు మీద ముందు తేది వేసి ఇచ్చిన ఒక చెక్కు లాంటిది" అని వ్యాఖ్యానించారు. (Post - dated cheque drawn on the crashing bank).

Posted Date : 24-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌