• facebook
  • whatsapp
  • telegram

పార్లమెంటు

  భారత ప్రజల అభిప్రాయాలు, ఆశలు, ఆశయాలకు ప్రతిరూపమే భారత పార్లమెంటు. మన దేశంలో పార్లమెంటరీ తరహా ప్రజాస్వామ్య పద్ధతి అమల్లో ఉంది. ప్రజాస్వామ్యంలో కేంద్ర బిందువు ప్రజలే. చట్ట సభల్లో ప్రజలెన్నుకున్నవారు కూర్చున్నప్పుడు ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరతాయనే ఆశ, నమ్మకం ఉంటుంది. ఆరు దశాబ్దాల భారత పార్లమెంటరీ చరిత్రను పరిశీలిస్తే అనేక ఆటుపోట్లు ఎదురైనా భారత ప్రజల హృదయ స్పందనకు అద్దం పట్టడంలో పార్లమెంటు చెప్పుకోదగిన పాత్ర పోషిస్తోంది. ఇటీవల అంటే 2009 ఏప్రిల్ 16 నుంచి మే 13 వరకు 15వ లోక్‌సభకు విజయవంతంగా ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో భారత పార్లమెంటు నిర్మాణం, పార్లమెంటుకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు, సభల కాలపరిమితి మొదలైన విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

 భారత రాజ్యాంగంలోని అయిదో భాగం కేంద్ర శాసనసభ అయిన పార్లమెంటు నిర్మాణం, అధికారాలు, బాధ్యతల గురించి వివరిస్తుంది.

కేంద్ర శాసనసభను పార్లమెంటు అని 79వ ప్రకరణ పేర్కొంటుంది. ఈ అధికరణ ప్రకారం పార్లమెంటు అంటే లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. పార్లమెంటరీ తరహా వ్యవస్థ ప్రకారం భారత పార్లమెంటులో రాష్ట్రపతి అంతర్భాగం. పార్లమెంటులో రాష్ట్రపతి సభ్యుడు కానప్పటికీ రాష్ట్రపతికి ఉన్న శాసనాధికారాల కారణంగా పార్లమెంటులో అంతర్భాగంగా గుర్తించాల్సి ఉంటుంది.

శాసనసభలు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లు జారీ చేయడం, రాష్ట్రపతి ఆమోదముద్ర లేకుండా పార్లమెంటు ఆమోదించిన బిల్లు చట్టం కాకపోవడం మొదలైనవి రాష్ట్రపతిని పార్లమెంటులో అంతర్భాగంగా గుర్తిస్తాయని దుర్గాదాస్ బసు పేర్కొన్నారు.

రాజ్యసభ, లోక్‌సభ పార్లమెంట్‌లోని రెండు సభలు. రాజ్యసభ, లోక్‌సభ అనే పదాలు హిందీ భాషాపదాలు. రాజ్యసభను ఎగువసభ, లోక్‌సభను దిగువ సభ అనికూడా అంటారు. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే సభ. అందుకే దీన్ని కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ లేదా రాష్ట్రమండలి అని రాజ్యాంగం పేర్కొంది. హిందీ భాషలో రాజ్య అంటే రాష్ట్రం. అంటే రాష్ట్రాలకు రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తుంది. దిగువసభ లోక్‌సభ దేశ ప్రజల ప్రాతినిధ్య సభ. హిందీ భాషలో లోక్ అంటే ప్రజలు. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే సభ లోక్‌సభ. దీన్నే హౌస్ ఆఫ్ పీపుల్స్ అంటారు.

రాజ్యసభ నిర్మాణం

భారత రాజ్యాంగం సమాఖ్య విధానాన్ని అనుసరిస్తుంది. కాబట్టి కేంద్ర శాసనసభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం అవసరమైంది. ఈ కారణంగానే రాజ్యసభ ఏర్పడింది. అయితే ప్రతి రాష్ట్రం నుంచి ఎగువసభలో సమాన ప్రాతినిధ్య పద్ధతి అనే అమెరికన్ సమాఖ్య పద్ధతి మన రాజ్యాంగంలో లేదు. రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల జనాభా ఆధారంగా రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో స్థానాల సంఖ్యను నిర్ణయించారు. 4వ షెడ్యూల్‌లో రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి ఉంది.
80వ ప్రకరణ ప్రకారం రాజ్యసభలో కింది సభ్యులు ఉంటారు.

1. రాష్ట్రపతితో నామినేట్ అయిన 12 మంది సభ్యులు.

2. 238 సభ్యులకు మించకుండా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల ప్రతినిధులు.

ఈ విధంగా రాజ్యసభ గరిష్ఠ సభ్యుల పరిమితి 250. 229 మందిని రాష్ట్ర విధానసభలు, 9 మందిని కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్నుకుంటాయి. రాష్ట్రపతి సాహిత్యం, కళలు, శాస్త్ర విజ్ఞానం, సాంఘిక సేవ మొదలైన రంగాల్లో విశేషానుభవం ఉన్నవారిని రాజ్యసభకు నామినేట్ చేస్తారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 245.


ఎన్నిక విధానం: రాజ్యసభ సభ్యులను రాష్ట్ర విధానసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ఓటు బదిలీ ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్ర అసెంబ్లీలలోని నామినేటెడ్ సభ్యులు కూడా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు చేస్తారు. రాజ్యసభకు జరిగే ఎన్నికల పద్ధతిని దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక భారత ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతుంది. రాజ్యసభ సభ్యుల ఎన్నికల్లో రాజకీయ అవినీతిని నిర్మూలించి బహిరంగ ఓటింగ్ పద్ధతి ప్రవేశపెట్టేందుకు పార్లమెంటు 2003 ఆగస్టులో చట్టాన్ని ఆమోదించింది. దేశంలోని ఏ రాష్ట్రంలో ఓటుహక్కు ఉన్న పౌరుడెవరైనా ఏ రాష్ట్రం నుంచి అయినా రాజ్యసభకు పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 
 

అర్హతలు:

1. భారతీయ పౌరుడై ఉండాలి.

2. 30 సంవత్సరాల వయసు ఉండాలి.
 

అనర్హతలు:

1. లోక్‌సభ సభ్యుడిగా లేదా రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా కొనసాగడం.

2. సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరు కావడం.

3. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన పదవుల్లో ఉండటం.
 

కాలపరిమితి: రాజ్యసభ శాశ్వత సభ. అయితే రాజ్యసభ సభ్యుల కాలపరిమితి 6 సంవత్సరాలు. మొత్తం సభ్యుల్లో 1/3 వంతు సభ్యులు ప్రతి రెండేళ్లకోసారి పదవీ విరమణ చేస్తారు. వీరి స్థానంలో కొత్త సభ్యులను ఎన్నుకుంటారు.
 

సమావేశాలు: రాజ్యసభ సంవత్సరానికి కనీసం రెండు సార్లు సమావేశమవుతుంది. ఒక సమావేశానికి మరో సమావేశానికి మధ్య 6 నెలల వ్యవధి మించకూడదు. లోక్‌సభ రద్దయినా రాజ్యసభ సమావేశాలు జరుగుతాయి. సమావేశాలకు భారత ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. ఆయన లేనిసమయంలో వైస్ ఛైర్మన్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. వైస్ చైర్మన్ కూడా లేకపోతే చైర్మన్ నియమించిన ప్యానెల్‌లోని సభ్యుల్లో ఒకరు సభను నిర్వహిస్తారు. ఛైర్మన్ ప్యానెల్‌లో ఆరుగురిని నియమిస్తారు. 
 

కోరం: రాజ్యసభ సమావేశాలు నిర్వహించేందుకు మొత్తం సభ్యత్వ సంఖ్యలో పదోవంతు సభ్యులు హాజరుకావాల్సి ఉంటుంది. దీన్నే కోరం అంటారు. ఒకవేళ కోరం లేని పక్షంలో సభను కొంతసేపుగాని, మరుసటి రోజుకుగాని వాయిదా వేసేందుకు ఆ సభా నిర్వాహకుడికి అధికారం ఉంది.
 

రాజ్యసభ ఛైర్మన్: రాజ్యాంగంలోని 89వ అధికరణ ప్రకారం భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. కానీ ఆయనకు రాజ్యసభలో సభ్యత్వం ఉండదు. సభలో సభ్యత్వం లేకుండా సభకు ఛైర్మన్‌గా వ్యవహరించేది ఉపరాష్ట్రపతి మాత్రమే. రాజ్యసభ ఛైర్మన్‌గా ఎన్నిక జరగదు. ఉపరాష్ట్రపతికి ఎన్నిక జరుగుతుంది. అయితే ఉపరాష్ట్రపతి తన వేతనాల్ని రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పొందుతారు. రాజ్యసభ సభ్యులు తమలో ఒకరిని సభా కార్యక్రమాల నిర్వహణకు డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.

రాజ్యసభ ఛైర్మన్ అధికారాలు: రాజ్యసభ ఛైర్మన్‌కు సభ నిర్వహణలో విశేషమైన అధికారాలు ఉన్నాయి. అయితే లోక్‌సభ స్పీకర్‌కు ఉన్న 1) బిల్లుల ఆర్థిక స్వభావాన్ని నిర్ణయించడం, 2) పార్లమెంటు ఉభయ సభల సమావేశానికి అధ్యక్షత వహించడం లాంటి అధికారాలు ఉండవు.
 

రాజ్యసభ ఛైర్మన్ అధికారాలు గమనిస్తే..
1. రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు.
2. వివిధ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టేందుకు, వాటిపై చర్చ జరిపేందుకు అధికార పక్షం, ప్రతిపక్షాల సభ్యులకు అవకాశం ఇస్తాడు.
3. వివిధ బిల్లులపై ఓటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తాడు ఒకవేళ బిల్లుపై ప్రతిష్ఠంభన ఏర్పడితే, బిల్లుపై ఓటింగ్ సమయంలో రెండుపక్షాలకు సమానమైన ఓట్లు వస్తే అప్పుడు తన అంతిమ నిర్ణాయక ఓటును వినియోగిస్తాడు.
4. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో పార్లమెంటు సంయుక్త సమావేశాల్లో పాల్గొంటాడు.
5. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక జరుపుతాడు.
6. సభ నిర్వహణకోసం ప్యానెల్ సభ్యుల పేర్లను ప్రకటిస్తాడు. 

ఇతర అంశాలు

* రాజ్యసభకు అత్యధికంగా సభ్యులను పంపే రాష్ట్రాలు వరుసగా ఉత్తరప్రదేశ్ (31 మంది), మహారాష్ట్ర (19 మంది) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు 18 మంది సభ్యులను పంపుతాయి. ఈశాన్య రాష్ట్రాలు, గోవా రాజ్యసభకు ఒకే ఒక సభ్యుడిని పంపుతాయి. కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ నుంచి ముగ్గురు, పాండిచ్చేరి నుంచి ఒకరు రాజ్యసభకు ఎన్నికవుతారు.

* రాజ్యసభ తొలి ఛైర్మన్ సర్వేపల్లి రాధాకృష్ణన్.
* రాజ్యసభ తొలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్.వి. కృష్ణమూర్తి.
* ప్రస్తుత రాజ్యసభ ఛైర్మన్ మహ్మద్ హమీద్ అన్సారీ.
* ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కె. రహమాన్ ఖాన్.

 

రాజ్యసభ అధికారాలు: ఆర్థిక, కొన్ని కార్యనిర్వాహక విషయాలు మినహా చాలావరకు లోక్‌సభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థలో భాగంగా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే, రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడే రాజ్యసభకు కొన్ని విశేష అధికారాలు కూడా ఉన్నాయి. అధికారాలను గమనిస్తే...
* శాసనాధికారాలు
* కార్యనిర్వాహక అధికారాలు
* ఆర్థిక అధికారాలు
* న్యాయ అధికారాలు
* ఎన్నికల అధికారాలు
* రాజ్యాంగ సవరణ అధికారాలు
* ఇతర అధికారాలు
* రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.

శాసనాధికారాలు: సాధారణ బిల్లులను రాజ్యసభలోనైనా, లోక్‌సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లులు అనేవి కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఈ బిల్లులను రాష్ట్రపతి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశపెడతారు.
              ఒక సభ ఒక బిల్లును ఆమోదించి రెండో సభకు పంపితే ఆ రెండో సభ 6 నెలల కాలంలోగా బిల్లును ఆమోదించాలి. ఒకవేళ బిల్లుల ఆమోదం విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలుంటే రాష్ట్రపతి ఆ బిల్లు ఆమోదం విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.
              ఉభయ సభల సంయుక్త సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తాడు. సాధారణంగా లోక్‌సభ సభ్యుల సంఖ్య, రాజ్యసభ సభ్యుల కంటే రెండింతలు ఎక్కువ. కాబట్టి ఉభయ సభల సంయుక్త సమావేశంలో లోక్‌సభదే పైచేయి అవుతుంది.
             బిల్లుల ప్రతిష్ఠంభన విషయంలో ఇప్పటివరకు మూడుసార్లు ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. 1. 1961లో వరకట్న నిషేధ బిల్లు. 2. 1978 బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ రద్దు. 3. 2002 పోటా చట్టం.

 

కార్యనిర్వాహక అధికారాలు: కేంద్ర మంత్రిమండలి లోక్‌సభకు మాత్రమే బాధ్యత వహిస్తుంది. అయినా రాజ్యసభ కార్యనిర్వాహక వర్గంపై నియంత్రణ చేస్తుంది.
             ప్రశ్నోత్తరాల సమయంలో లిఖితపూర్వక, మౌఖిక ప్రశ్నల ద్వారా; వాయిదా, సావధాన తీర్మానం మొదలైన వాటి ద్వారా నియంత్రణ చేస్తుంది.

ఆర్థిక అధికారాలు: రాజ్యసభకు ఆర్థిక అధికారాలు చాలా పరిమితం. ఆర్థిక బిల్లులను మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. లోక్‌సభ ఆమోదించిన ఒక ఆర్థిక బిల్లును రాజ్యసభ ఆమోదం కోసం పంపితే 14 రోజుల లోపల దాన్ని చర్చించి తన అభిప్రాయాలను సిఫారసుల రూపంలో పంపాలి. ఈ సిఫారసులను లోక్‌సభ ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

న్యాయ అధికారాలు: ఈ విషయంలో లోక్‌సభకు, రాజ్యసభకు సమాన అధికారాలు ఉంటాయి. రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానాన్ని రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి ప్రవర్తనపై స్వయంగా న్యాయ విచారణ జరపవచ్చు లేదా తాను ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ ద్వారా చేపట్టవచ్చు. ఇదే విధంగా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ మొదలైన వారిపై వచ్చిన ఆరోపణలపైనా న్యాయ విచారణ జరుపుతుంది.
 

ఎన్నికల అధికారాలు: రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణంలో రాజ్యసభ ఒక భాగం. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ పాల్గొంటుంది. పార్లమెంటుకు చెందిన వివిధ కమిటీలకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో సభ్యులను ఎన్నుకుంటారు.

రాజ్యాంగ సవరణ అధికారాలు: రాజ్యాంగ సవరణ విషయంలో రాజ్యసభకు, లోక్‌సభకు సమాన అధికారాలున్నాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదాలుంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేయడానికి వీలులేదు.
 

ఇతర అధికారాలు: రాజ్యాసభకు పై అధికారాలతోపాటు, మరికొన్ని అధికారాలు కూడా ఉన్నాయి. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్‌సభ రద్దయిన పక్షంలో ఒక నెలలోగా రాజ్యసభ దాన్ని ఆమోదించాలి. అదేవిధంగా రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలనను రెండు నెలల్లోగా రాజ్యసభ ఆమోదించాలి.

రాజ్యసభ ప్రత్యేకాధికారాలు: దిగువ తెలిపిన అధికారాలను రాజ్యసభ ప్రత్యేకంగా చలాయిస్తుంది.
1. 249 నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితాలోని ఏ అంశం అయినా జాతీయ ప్రాముఖ్యమున్నదని రాజ్యసభ భావిస్తే, ఆ విషయంపై 2/3 వంతు మెజారిటీతో రాజ్యసభ మొదట తీర్మానం చేస్తుంది. ఇలాంటి తీర్మానం సంవత్సరంపాటు అమల్లో ఉంటుంది. అధికార విభజనకు సంబంధించి రాజ్యాంగంలో మూడు జాబితాలు ఉన్నాయి. అవి:
                     1. కేంద్ర జాబితా. 
                     2. రాష్ట్ర జాబితా. 
                     3. ఉమ్మడి జాబితా.
* డాక్టర్ అంబేద్కర్ 249 నిబంధన ప్రయోజనాన్ని వివరిస్తూ భారత సమాఖ్యలో రాష్ట్రాలకు ప్రతినిధిగా వ్యవహరించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
* 1952లో దేశంలో ఆహార కొరత ఏర్పడిన పరిస్థితిలో ఆహార ధాన్యాల ఉత్పత్తి, పంపిణీ, వ్యాపార వాణిజ్యాలను క్రమబద్ధం చేయడానికి రాజ్యసభ ఈ నిబంధనను ఉపయోగించింది.
2. 312 అధికరణ ప్రకారం జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రత్యేకంగా అఖిల భారత సర్వీసులను ఏర్పాటుచేసే అధికారం రాజ్యసభకే ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసినవి ఆలిండియా ఇంజినీరింగ్, ఆలిండియా ఫారెస్టు సర్వీసులు మొదలైనవి.
3. ఉపరాష్ట్రపతిని తొలగించడానికి తీర్మానం మొదట రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి.

రాజ్యసభ - ప్రముఖుల వ్యాఖ్యానాలు

ప్రొఫెసర్ మారిన్ జోన్స్: 'ది గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఆఫ్ ఇండియా' అనే గ్రంథంలో రాజ్యసభ ప్రయోజనాలను కింది విధంగా పేర్కొన్నారు.
1. లోక్‌సభ తొందరపాటుతో చేసే శాసనాలను పునరాలోచన చేసి, లోటుపాట్లను సవరించడానికి రాజ్యసభ ఉపయోగపడుతుంది.
2. శాసన నిర్మాణపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది.
3. రాజ్యసభ అధికార పార్టీ ప్రయోజనాలను కాపాడేందుకు, అదనపు రాజకీయ పదవులను సృష్టించడానికి ఉపయోగపడుతుంది.

 

ఎన్.గోపాలస్వామి అయ్యంగార్: ఎగువసభ లేదా రాజ్యసభ తన కార్యకలాపాలను చాలా హుందాగా నిర్వహిస్తుంది. తాత్కాలిక ఆవేశాల మధ్య రూపొందించే బిల్లులు చట్టాలు కాకుండా వీలైనంత జాప్యం చేస్తుంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండే మేధావులు, విజ్ఞానవేత్తలు సభ కార్యకలాపాల్లో పాల్గొని వారి విజ్ఞానాన్ని దేశానికి అందజేయడానికి అవకాశం కల్పిస్తుంది.
బి.డి.జెట్టి: కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉండి, రాష్ట్రాల్లో ఇతర పార్టీలు అధికారంలో ఉన్నట్లయితే దాని ప్రభావం రాజ్యసభపై ఉంటుంది. అప్పుడు ఉత్పన్నమయ్యే సమాఖ్య సమస్యల పరిష్కారంలో రాజ్యసభ పాత్ర చాలా స్పష్టంగా ఉంటుంది.

లోక్‌సభ

       భారత పార్లమెంట్‌లోని దిగువసభను లోక్‌సభ అంటారు. ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఈ సభలో ఉంటారు. అందుకే దీన్ని ప్రజలసభ అంటారు. మంత్రిమండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిని తొలగించాలంటే లోక్‌సభలో అవిశ్వాసం, మద్దతుగానైతే విశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారు. విశేష అధికారాలున్న లోక్‌సభ నిర్మాణం, పోటీచేసేందుకు కావాల్సిన అర్హతలు, కాలపరిమితి, లోక్‌సభ స్పీకర్, లోక్‌సభ అధికారాలు గురించి వివరంగా తెలుసుకుందాం.

లోక్‌సభ నిర్మాణం
        రాజ్యాంగం అనుమతించిన లోక్‌సభ మొత్తం గరిష్ఠ సభ్యత్వ సంఖ్య 552. ఇందులో 3 రకాల సభ్యులు ఉంటారు. వారు  :
1. రాష్ట్రాలనుంచి ఎన్నికైన 530 మంది సభ్యులు.
2. కేంద్రపాలిత ప్రాంతాలనుంచి ఎన్నికైన 20 మంది సభ్యులు.
3. ఆంగ్లోఇండియన్ తెగకు చెందిన ఇద్దరు నామినేటెడ్ సభ్యులు.
        ఆంగ్లో - ఇండియన్ తెగకు చెందిన సభ్యులెవరూ ఎన్నిక కాలేదని రాష్ట్రపతి భావిస్తే ఆ తెగకు చెందిన ఇద్దరు ప్రముఖులను నామినేట్ చేస్తారు.

     ప్రస్తుతం లోక్‌సభలో సభ్యుల సంఖ్య 545. మొదట 500 లోక్‌సభ స్థానాలు ఉండగా, 1973లో 31వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 545కు పెంచారు. 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2000 సంవత్సరం వరకు లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకూడదని నిర్ణయించారు. 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2026 సంవత్సరం వరకు లోక్‌సభ, విధానసభ స్థానాల సంఖ్య మార్చరాదని మరోసారి నిర్ణయించారు.

షెడ్యూల్డ్ కులాలు, తెగలవారికి రిజర్వేషన్లు

          రాజ్యాంగంలోని 330 నిబంధన ప్రకారం లోక్‌సభలో ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేస్తారు. రాజ్యాంగంలో మొదట వీరికి ప్రత్యేక స్థానాల కేటాయింపు పది సంవత్సరాల కాలానికి మాత్రమే పరిమితం చేశారు. తర్వాత 8వ రాజ్యాంగ సవరణ చట్టం (1959) ద్వారా ప్రత్యేక స్థానం కేటాయింపు 1970 వరకు కొనసాగేలా పొడిగించారు. తిరిగి 23వ రాజ్యాంగ సవరణ చట్టం (1969) ద్వారా 1980 వరకు, 45వ రాజ్యాంగ సవరణ చట్టం (1980) ద్వారా 1990 వరకు, 62వ రాజ్యాంగ సవరణ చట్టం (1989) ద్వారా 2000 వరకు, 79వ రాజ్యాంగ సవరణ చట్టం (1999) ద్వారా 2010 వరకు కొనసాగేలా పొడిగించారు. 14వ లోక్‌సభలో మొత్తం 543 స్థానాలుండగా 79 స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, 41 స్థానాలను షెడ్యూల్డ్ తెగలకు కేటాయించారు.

నియోజక వర్గాల పునర్విభజన

          రాజ్యాంగంలోని 82వ అధికరణ ప్రకారం జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం పూర్తయిన తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. 2001 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనకు 2002 నియోజకవర్గాల పునర్విభజన చట్టం చేశారు.

నియోజక వర్గాల పునర్విభజన నిర్వహించేందుకు 2002లోనే కులదీప్‌సింగ్ నేతృత్వంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వేశారు. 2003లో చేసిన 87వ రాజ్యాంగ సవరణ చట్టం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించింది. దీని ప్రకారం...
*  1971 జనాభా లెక్కల ప్రాతిపదికన లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన నియోజకవర్గాల సంఖ్యలో ఎలాంటి మార్పు ఉండదు.
*  1971 జనాభా లెక్కల ప్రాతిపదికన వివిధ రాష్ట్రాల శాసనసభల్లో నిర్ణయించిన నియోజకవర్గాల సంఖ్యలో కూడా మార్పు ఉండదు.
*  లోక్‌సభలో, వివిధ రాష్ట్రాల శాసనసభల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులకు రిజర్వ్ చేసిన స్థానాల సంఖ్యలో 2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా మార్పులు చేయాలి.
*  2001 జనాభా లెక్కల ప్రాతిపదికగా ప్రతి రాష్ట్రాన్ని ప్రాదేశిక పార్లమెంటరీ, శాసనసభ నియోజకవర్గాలుగా పునర్విభజన చేయాలి. ఈ నియోజక వర్గాల పునర్విభజన ఫలితాలను సంక్షిప్తంగా గమనిస్తే..
*  ఎస్సీ, ఎస్టీ స్థానాల సంఖ్య లోక్‌సభ, విధానసభల్లో వారి జనాభా ఆధారంగా మారుతుంది.
*  నియోజకవర్గాల విస్తీర్ణంలో మార్పులు ఏర్పడి రాష్ట్రాల్లోని జిల్లాల్లో నియోజకవర్గాల సంఖ్య తగ్గడం, పెరగడం జరుగుతుంది.
*  నియోజకవర్గాల పునర్విభజన దేశం మొత్తం మీద 5 రాష్ట్రాల్లో జరగలేదు. అవి: ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, బీహార్ నుంచి విడిపోయిన జార్ఖండ్ రాష్ట్రం.

*  నియోజక వర్గాల పునర్విభజన ఫలితంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పు వచ్చింది.
*  లోక్‌సభలో ఎస్సీ స్థానాల సంఖ్య 79 నుంచి 85కు, ఎస్టీ స్థానాల సంఖ్య 41 నుంచి 48కి పెరిగాయి.
*  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గమనిస్తే లోక్‌సభలో ఎస్సీ స్థానాల సంఖ్య 6 నుంచి 7కు, ఎస్టీ స్థానాల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది.
*  నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎన్నికలు జరిగిన తొలి రాష్ట్రం కర్ణాటక. ఇటీవలి 15వ లోక్‌సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నియోజకవర్గాల పునర్విభజన ఆధారంగానే జరిగాయి.

 

అర్హతలు: 
        లోక్‌సభకు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికవడానికి దిగువ అర్హతలు ఉండాలి.
*  భారతీయ పౌరుడై ఉండాలి.
*  25 సంవత్సరాల వయసు నిండి ఉండాలి.
*  పార్లమెంటు నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి.
*  నామినేషన్‌తో రూ.10,000 డిపాజిట్ చెల్లించాలి.

 

అనర్హతలు
*  ఒక వ్యక్తి ఏకకాలంలో ఉభయసభల్లో సభ్యుడిగా కొనసాగలేడు. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా రెండింటికీ ఎన్నికైతే నిర్ణీత గడువులోపల రాష్ట్ర అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయకపోతే గెలుపొందిన పార్లమెంట్ స్థానం ఖాళీఅయినట్లుగా రాష్ట్రపతి ప్రకటిస్తారు.

*  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆదాయం పొందే పదవి ఉండటం.
*  మతిస్థిమితం లేనివాడని న్యాయస్థానం ధ్రువీక రించడం.
*  ఒక వ్యక్తి లోక్‌సభ సభ్యుడిగా కొనసాగడానికి అర్హత కోల్పోయాడా లేదా అనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు.  దీనికోసం మొదట ఎన్నికల సంఘం అభిప్రాయాన్ని తెలుసుకుంటారు.

 

కాలపరిమితి

83వ నిబంధన ప్రకారం లోక్‌సభ కాలపరిమితి 5 సంవత్సరాలు. ఎన్నికల తర్వాత ప్రారంభమైన తొలి సమావేశం తేదీ నుంచి 5 సంవత్సరాల వరకు లోక్‌సభ తన అధికారాలు, విధులు నిర్వహిస్తుంది. కొన్ని అవాంతర పరిస్థితుల్లో మధ్యలోనే రద్దుచేసి లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు జరిపించవచ్చు. జాతీయ అత్యవసర పరిస్థితి విధించినపుడు లోక్‌సభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 1976లో 5వ లోక్‌సభ కాలపరిమితిని జాతీయ అత్యవసర పరిస్థితి కారణంగా ఒక సంవత్సరం పొడిగించారు.
42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ కాలపరిమితిని 5 నుంచి 6 సంవత్సరాలవరకు పొడిగించారు. తిరిగి 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభ కాలపరిమితిని 5 సంవత్సరాలకు తగ్గించారు. 
 ఇప్పటివరకు 8 పర్యాయాలు నిర్ణీత గడువు కంటే (5 సంవత్సరాలు) ముందే లోక్‌సభ రద్దయ్యింది. మొదటిసారిగా 4వ లోక్‌సభ నిర్ణీత కాలపరిమితి కంటే ముందుగా రద్దయ్యింది. చివరిగా 13వ లోక్‌సభ కూడా నిర్ణీత గడువు కంటే ముందుగా రద్దయ్యింది.

         1952 మే 13న లోక్‌సభ మొదటిసారిగా సమావేశమయ్యింది. అతి తక్కువ కాలం కొనసాగిన లోక్‌సభగా 12వ లోక్‌సభ రికార్డుకెక్కింది.  13 నెలలు మాత్రమే 12వ లోక్‌సభ కొనసాగింది. అత్యధికకాలం కొనసాగిన లోక్‌సభగా 5వ లోక్‌సభ రికార్డుకెక్కింది. 5వ లోక్‌సభ ఆరేళ్లు కొనసాగింది.
 

కోరం : 
         లోక్‌సభ సమావేశాలు నిర్వహించేందుకు అవసరమైన కనీస సభ్యుల సంఖ్యనే కోరం అంటారు. మొత్తం సభ్యుల్లో 1/10 వంతు సంఖ్యను కోరంగా పరిగణిస్తారు. కోరం ఉన్నదీ లేనిదీ నిర్ధారించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది. స్పీకర్ అంటే లోక్‌సభ అధ్యక్షుడు. సభలో కోరం లేకపోతే, అంటే- హాజరుకావాల్సిన సభ్యుల కనీస సంఖ్య లేకుంటే స్పీకర్ సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేయవచ్చు.
 

సాధారణ, ప్రత్యేక సమావేశాలు 

         రాజ్యాంగ నిబంధన 85 ప్రకారం 6 నెలల వ్యవధికి తక్కువ కాకుండా ప్రతి సంవత్సరం 2 పర్యాయాలు లోక్‌సభ సాధారణ సమావేశాలు నిర్వహించాలి. అంటే- ఏ రెండు సమావేశాల మధ్య వ్యవధి 6 నెలలు మించరాదు. లోక్‌సభ రద్దయిన సందర్భంలో మాత్రం ఈ నియమం వర్తించదు. సాధారణంగా లోక్‌సభ సమావేశాలను ప్రతి సంవత్సరం 3 పర్యాయాలు నిర్వహిస్తారు. అవి:
1. బడ్జెట్ సమావేశాలు,
2. వర్షాకాల సమావేశాలు,
3. శీతాకాల సమావేశాలు.

బడ్జెట్ సమావేశాలు : 
         సాధారణంగా బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడోవారంలో ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య ఈ సమావేశాలు నిర్వహిస్తారు. మొదట రైల్వే బడ్జెట్, తర్వాత సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఎక్కువకాలం బడ్జెట్‌పై దృష్టి సారించడంవల్ల ఈ సమావేశాలను బడ్జెట్ సమావేశాలు అంటారు.
 

వర్షాకాల సమావేశాలు : 
         సాధారణంగా జులై మూడో వారంలో ప్రారంభమవుతాయి. జులై - ఆగస్టు నెలల్లో కొనసాగుతాయి.
 

చలికాల లేదా శీతాకాల సమావేశాలు : 
 నవంబరు మొదటివారంలో ప్రారంభమవుతాయి. నవంబరు, డిసెంబరు నెలల్లో కొనసాగుతాయి. అతి తక్కువకాలం ఉండే సమావేశాలివే. 
 అవసరమైతే రాష్ట్రపతి లోక్‌సభ ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటుచేయవచ్చు. లోక్‌సభ సమావేశం లేని కాలంలో నేరుగా రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని సమర్పిస్తే, రాష్ట్రపతి 14 రోజుల్లోగా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు, విదేశీనేతల దేశ పర్యటన, మహనీయుల ఉత్సవాల వంటి సందర్భాల్లో ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయవచ్చు.

 

లోక్‌సభ రద్దు - దాని ప్రభావం 

 రాజ్యాంగ పరిభాషలో సాధారణంగా ప్రొరోగ్ చేయడం, డిసాల్వ్ చేయడం అనే పదాలు వింటూ ఉంటాం. రాష్ట్రపతి ప్రకటన ద్వారా లోక్‌సభ సమావేశం ప్రొరోగ్ అవుతుంది. అంటే లోక్‌సభ అప్పటి సమావేశకాలం ముగిసిందని, మరోసారి సమావేశమయ్యేంత వరకు విరామకాలమని అర్థం. లోక్‌సభను ప్రొరోగ్ చేయడంవల్ల లోక్‌సభ పరిశీలనలో ఉన్న బిల్లులు రద్దుకావువిరామకాలమని అర్థం. లోక్‌సభను ప్రొరోగ్ చేయడంవల్ల లోక్‌సభ పరిశీలనలో ఉన్న బిల్లులు రద్దుకావు. 

లోక్‌సభ అధికారాలు

లోక్‌సభ డిసాల్వ్ కావడం అంటే లోక్‌సభ రద్దుకావడం అని అర్థం. లోక్‌సభ కాలపరిమితి ముగిసిన తర్వాత, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దుచేస్తూ ఆదేశాలు జారీచేస్తారు. లోక్‌సభను రద్దుచేయడంవల్ల కింది పరిణామాలు సంభవిస్తాయి.
1. లోక్‌సభను రద్దుచేసిన తేదీ నుంచి ఆరునెలల్లోగా నూతన లోక్‌సభను ఏర్పాటుచేయాలి.
2. లోక్‌సభ పరిశీలనలోఉన్న బిల్లులు రద్దయిపోతాయి. రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లులు కూడా లోక్‌సభ పరిశీలనలో ఉండినప్పటికీ రద్దవుతాయి.
3. ఒక బిల్లు ఆమోదం విషయంలో రెండుసభల మధ్య అభిప్రాయభేదం కారణంగా ఉభయసభల సంయుక్త సమావేశానికి నోటీసు జారీచేసిన తర్వాత ఒకవేళ లోక్‌సభ రద్దయినట్లయితే, ఆ బిల్లు రద్దుకాదు.

          పార్లమెంటులో ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రజలసభ అయిన లోక్‌సభ (దిగువసభ)కు విశేష అధికారాలున్నాయి. ఆర్థికాధికారాల్లో, మంత్రి మండలిని తొలగించే విషయంలో లోక్‌సభకు ప్రత్యేక అధికారాలున్నాయి. శాసన నిర్మాణాధికారాలు, ఆర్థిక, న్యాయసంబంధ, రాజ్యాంగ సవరణ, ఎన్నికపరమైన, కార్యనిర్వాహక శాఖపై నియంత్రణాధికారాలు లోక్‌సభకు ఉంటాయి.

శాసన నిర్మాణాధికారాలు

  ఆర్థికబిల్లులతోపాటు సాధారణ బిల్లులను కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టవచ్చు. సాధారణ బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థికేతర, పాలనాపరమైన వ్యవహారాలకు సంబంధించినవి. ఆర్థిక బిల్లులు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణకు సంబంధించినవి. సాధారణ బిల్లులను ఏ సభలోనైనా మొదట ప్రవేశపెట్టవచ్చు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న అధికారాల జాబితాలోని కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, అవశిష్ట అధికారాలపై లోక్‌సభ శాసనాలు చేస్తుంది. రాష్ట్ర జాబితాపై కూడా ఇది శాసనాలు చేస్తుంది.
 

రాష్ట్ర జాబితాపై లోక్‌సభ శాసనాలు చేసే సందర్భాలు
* 249 నిబంధన ప్రకారం రాష్ట్ర జాబితా అంశాలపై శాసనాలు చేయాలని రాజ్యసభ తీర్మానం చేయడం.
* దేశంలో అత్యవసర పరిస్థితి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నప్పుడు రాష్ట్ర జాబితాపై శాసనాలు చేయడం.

* 252 నిబంధన ప్రకారం 2 లేదా అంతకు మించి రాష్ట్రాలు రాష్ట్ర జాబితాలోని ఏ అంశంపైనైనా శాసనం చేయాలని తీర్మానించడం.
* అంతర్జాతీయ ఒడంబడికలను అమలుచేయడం.

 

ఆర్థికాధికారాలు

  ఆర్థికాధికారాల విషయంలో రాజ్యసభ అధికారాలు నామమాత్రం. లోక్‌సభకు ఆర్థిక విషయాల్లో ఎక్కువ అధికారాలున్నాయి. ఆర్థికాధికారాలను పరిశీలిస్తే..

* వార్షికాదాయ, వ్యయ పట్టిక (బడ్జెట్)ను లోక్‌సభలో ప్రవేశపెట్టడం.
* పన్నుల విధింపు, తొలగింపు, తగ్గింపు.
* ప్రభుత్వం చేసే రుణాలకు పరిమితి విధించడం మొదలైనవి.
* ఒక బిల్లు సాధారణ బిల్లు అవుతుందా, ఆర్థికబిల్లు అవుతుందా అనే విషయాన్ని లోక్‌సభ స్పీకర్ నిర్ణయిస్తారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయడానికి వీలులేదు. 
             స్పీకర్ ఒక బిల్లును 'ఆర్థిక బిల్లు' అని ధ్రువీకరించిన తరువాత రాష్ట్రపతి అనుమతితోనే మొదట దాన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. లోక్‌సభ ఆమోదం పొందిన తరువాత దాన్ని రాజ్యసభ ఆమోదం కోసం పంపుతారు. రాజ్యసభ 14 రోజుల్లోగా దాన్ని ఆమోదించి తిరిగి లోక్‌సభకు పంపాలి. ఏ కారణంతోనైనా రాజ్యసభ ఆర్థిక బిల్లును ఆమోదించక, చేర్పులు, మార్పులను సూచించి పంపితే, లోక్‌సభ ఆ ప్రతిపాదనలను ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. రాజ్యసభ ఆర్థిక బిల్లును కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకోవచ్చు.

రాజ్యసభకు ఆర్థిక బిల్లుపై మార్పులు, చేర్పులు సిఫార్సు చేసే అధికారం మాత్రమే ఉంటుంది. ఆర్థిక బిల్లుల విషయంలో లోక్‌సభకు సర్వాధికారాలు ఉన్నాయి. 
           రాష్ట్రపతి పూర్వానుమతితోనే ఆర్థిక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆర్థిక బిల్లును ఉభయసభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి ఆమోదానికి పంపితే రాష్ట్రపతి తప్పక ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. సాధారణ బిల్లుల విషయంలో పార్లమెంటు ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి తన ఆమోదం తెలుపవచ్చు లేదా పునఃపరిశీలనకు పార్లమెంటుకు పంపవచ్చు.
           ఆర్థిక బిల్లుల విషయంలో ఉభయ సభల ఉమ్మడి సమావేశం జరిగే అవకాశమే లేదు. కారణం ఆర్థిక బిల్లులను రాజ్యసభ కేవలం 14 రోజులు మాత్రమే తన దగ్గర ఉంచుకొనే అధికారం ఉండటమే. అదే సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య ఏకాభిప్రాయం లేకపోతే ఉభయసభల ఉమ్మడి సమావేశం ఏర్పాటవుతుంది.

 

న్యాయసంబంధ అధికారాలు

  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యు.పి.ఎస్.సి. ఛైర్మన్ మొదలైన వారి తొలగింపులో లోక్‌సభకు అధికారాలున్నాయి.
రాష్ట్రపతిని తొలగించేందుకు ఏ సభలో అయినా మొదట మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. ఉపరాష్ట్రపతిని తొలగించాలంటే మొదట రాజ్యసభలోనే అభియోగ తీర్మానం ప్రవేశపెట్టాలి.

 

రాజ్యాంగ సవరణ అధికారం
           368 నిబంధన ప్రకారం రాజ్యాంగ సవరణను ప్రతిపాదించే అధికారం లోక్‌సభకు ఉంది.

రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్లును కూడా ఉభయసభలు ఆరు నెలల్లోగా ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే, ఆ బిల్లు వీగిపోతుంది. రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో ఉభయసభల సంయుక్త సమావేశం ఏర్పాటుచేసే అవకాశం లేదు.
 

ఎన్నికపరమైన అధికారాలు
           రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం నియోజక గణంలో లోక్‌సభ భాగంగా ఉంటుంది. అదే విధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఇది పాల్గొంటుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొనే అవకాశం లేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు. 
           లోక్‌సభ స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను లోక్‌సభ సభ్యులు ఎన్నుకుంటారు. అయితే, రాజ్యసభ ఛైర్మన్‌ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకోరు. ఉపరాష్ట్రపతే రాజ్యసభ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభ సభ్యులు డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. 
          లోక్‌సభ వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను ఎన్నుకుంటుంది. పార్లమెంటు చేపట్టాల్సిన విధులు, బాధ్యతలు పెరగడం, పార్లమెంటు సమావేశాల కాలవ్యవధి తక్కువగా ఉండటం వల్ల పార్లమెంటు తన విధులు, బాధ్యతలు నెరవేర్చేందుకు పార్లమెంటరీ కమిటీలు సహాయం చేస్తాయి. ఉదాహరణకు అంచనాల సంఘం, ప్రభుత్వ ఖాతాల సంఘం మొదలైనవి.

 

కార్యనిర్వాహక శాఖపై నియంత్రణాధికారం
             లోక్‌సభ అధికారాల్లో కార్యనిర్వాహక వర్గం కూడా ఒకటి. అంటే, మంత్రిమండలిని నియంత్రించడం.

మన పార్లమెంటరీ వ్యవస్థలో మంత్రిమండలి లోక్‌సభకు బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలి సభ్యుల్లో ఎక్కువమంది లోక్‌సభ సభ్యులే కావడంతో లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రి మండలి అధికారంలో ఉండి, విశ్వాసం కోల్పోయిన వెంటనే వైదొలగాల్సి ఉంటుంది. కార్యనిర్వాహకవర్గంపై నియంత్రణను లోక్‌సభ రెండు రకాలుగా చేపడుతుంది.
1. ప్రభుత్వ వ్యవహారాల గురించి సమాచారాన్ని తెలుసుకోవడం.
2. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం లేదా విమర్శించడం.
             వీటి కోసం వివిధ పార్లమెంటరీ ప్రక్రియలను అనుసరిస్తుంది. ఈ ప్రక్రియల్లో ప్రశ్నోత్తరాలు, తీర్మానాలు ఉంటాయి.

 

ప్రశ్నోత్తరాలు
             వివిధ ప్రభుత్వ శాఖల కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని స్పీకర్ అనుమతితో మంత్రులను ప్రశ్నించడం ద్వారా తెలుసుకోవచ్చు. 
             ప్రతిరోజూ పార్లమెంటు ఉభయసభలు ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమవుతాయి. మొదటి గంటను ప్రశ్నలు అడగడానికి కేటాయిస్తారు. పౌరుల సమస్యలపై, పరిపాలనా అసమర్థతపై, అవసరమైనచోట ప్రభుత్వ చొరవ కోసం ప్రశ్నలు అడగవచ్చు. 
             ప్రశ్నోత్తరాల సమయంలో అడిగే ప్రశ్నలను మూడు రకాలుగా విభజించవచ్చు. 1. నక్షత్ర గుర్తు ప్రశ్నలు 2.నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు 3. స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు. ప్రశ్నల ప్రాధాన్యాన్ని బట్టి వాటి వర్గీకరణ జరుగుతుంది.

1. నక్షత్ర గుర్తు ప్రశ్నలు: ఈ పశ్నలకు మౌఖికంగా జవాబిస్తారు. వీటిపై అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చు. 'నక్షత్ర గుర్తు ప్రశ్నలు' అనడానికి కారణం ప్రశ్నల ముందు 'నక్షత్రం' గుర్తు ఉండటమే.
 

2. నక్షత్రం గుర్తులేని ప్రశ్నలు: ఈ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానాన్ని ఇస్తారు. ఇందులో అనుబంధ ప్రశ్నలు అడిగే అవకాశం లేదు.
 

3. స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు: సాధారణంగా ప్రశ్నలు అడగాలంటే కనీసం పది రోజుల ముందు సభ్యులు నోటీసు ఇవ్వాలి. అలా కాకుండా, అత్యవసరమైన ప్రజాప్రాముఖ్య విషయంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి సమాధాన ప్రశ్నలు అంటారు. 

ప్రముఖుల వ్యాఖ్యానాలు

ప్రొఫెసర్ మారిస్ జోన్స్: అత్యంత క్రమశిక్షణతో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే, అనుబంధ ప్రశ్నల విషయానికి వచ్చేసరికి మంత్రులు సమాధానాలను దాటవేయడానికి ప్రయత్నిస్తారు.

సర్ ఆంథోని ఈడెన్: భారతదేశ పార్లమెంటులో ప్రశ్నోత్తరాల పట్ల విశేష శ్రద్ధ చూపుతారు.

శూన్య సమయం (జీరో అవర్)

   జీరో అవర్ అనేది భారత పార్లమెంటు సొంతంగా రూపొందించుకున్న పద్ధతి. 1962లో పార్లమెంటులో ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత జీరో అవర్ ఉంటుంది. ప్రశ్నోత్తరాల కార్యక్రమం 11 గంటలకు, జీరో అవర్ 12 గంటలకు ప్రారంభమవుతాయి. జీరో అవర్‌లో మొదలుకావడంవల్ల దీన్ని జీరో అవర్ అంటారు. ఇందులో ఎలాంటి నోటీసూ లేకుండా ప్రశ్నలు అడగవచ్చు.

రాష్ట్రపతి ప్రసంగం -ప్రభుత్వ విధానాలపై విమర్శ: లోక్‌సభ బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగ పాఠాన్ని మంత్రిమండలి తయారుచేసి ఆమోదిస్తుంది. ఇందులో గత సంవత్సరం ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలు, ప్రస్తుత సంవత్సరంలో తలపెట్టిన సాంఘిక, ఆర్థిక, రాజకీయ విధానాలను పేర్కొంటారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఈ తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించాలి. ఏదైనా కారణంతో తీర్మానం వీగిపోతే, అంటే మెజారిటీ సభ్యులు ఆమోదించకపోతే, ప్రభుత్వం ప్రజావిశ్వాసం కోల్పోయినట్లు భావించి, మంత్రిమండలి రాజీనామా చేస్తుంది.
తీర్మానాలు
తీర్మానాల్లో అవిశ్వాస తీర్మానం, విశ్వాస తీర్మానం, వాయిదా తీర్మానం మొదలైనవి ఉన్నాయి.

 

అవిశ్వాస తీర్మానం: ప్రభుత్వాన్ని నియంత్రించే శక్తిమంతరాజ్యాంగ పద్ధతుల్లో అవిశ్వాస తీర్మానం ఒకటి. దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానం 'ఫలానా అంశంపై' అని చెప్పనవసరం లేదు. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతాయి. ఈ తీర్మానాన్ని మొత్తం మంత్రిమండలిపై ప్రవేశపెట్టాలి. అవిశ్వాస తీర్మానాన్ని సభ స్వీకరించడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. అవిశ్వాస తీర్మానానికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే నిర్ణయాధికారం స్పీకర్‌కు ఉంటుంది. స్పీకర్ అనుమతినిస్తే, అనుమతించిన పది రోజుల్లోగా స్పీకర్ నిర్ణయించిన తేదీల్లో చర్చ, దాని తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే మంత్రిమండలి రాజీనామా చేస్తుంది. 

           1963లో జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు మొదటిసారిగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇంధిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఎక్కువసార్లు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయిన మొదటి ప్రధాని మొరార్జీదేశాయ్ (1979).
 

విశ్వాస తీర్మానం: దీన్ని లోక్‌సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. అధికార పక్షం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది. విశ్వాస తీర్మానంపై చర్చ, ఆ తరువాత ఓటింగ్ జరుగుతాయి. ఓటింగ్‌లో ప్రభుత్వం ఓడిపోతే వెంటనే రాజీనామా చేయాలి. భారతదేశ పార్లమెంటు చరిత్రలో మొదటిసారిగా విశ్వాసతీర్మానాన్ని 1979 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టారు. అప్పటి చరణ్‌సింగ్ ప్రభుత్వాన్ని సభావిశ్వాసాన్ని పొందవలసిందిగా అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఆదేశించారు. దాంతో భారతదేశ పార్లమెంటరీ సంప్రదాయాల్లో విశ్వాస తీర్మానం ఆచరణలోకి వచ్చింది. విశ్వాస తీర్మానం లోక్‌సభలో చర్చకు రాకుండానే, చరణ్‌సింగ్ రాజీనామా చేశారు. ఇలా విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన తొలి ప్రధానిగా చరణ్‌సింగ్ గుర్తింపు పొందారు. 2008 జులై నెలలో యు.పి.ఎ. ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతు ఉపసంహరించడంతో మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం విశ్వాసాన్ని కోరింది. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 275 ఓట్లు, వ్యతిరేకంగా 256 ఓట్లు వచ్చాయి. ఇలా విశ్వాస తీర్మానంలో ప్రభుత్వం విజయం సాధించింది.
 

వాయిదా తీర్మానం: ప్రజాప్రాముఖ్యం ఉన్న ఆకస్మిక లేదా హఠాత్ సంఘటనలను చర్చించడానికి స్పీకర్ అనుమతితో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దీన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది సభ్యుల మద్దతు అవసరం. వాయిదా తీర్మానం అనుమతి పొందితే సభలో మిగిలిన వ్యవహారాలన్నీ వాయిదా వేస్తారు. ఈ తీర్మానం ముఖ్యోద్దేశం ముఖ్యమైన విషయం మీదకు సభ దృష్టిని మళ్లించడం. ఈ తీర్మానంపై ఓటింగ్ జరగదు.

సావధాన తీర్మానం: ప్రజా ప్రాముఖ్యం ఉన్న సమస్యను అత్యవసరంగా చర్చించేందుకు, ఆ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. సావధాన తీర్మానం ముఖ్యోద్దేశం సమస్యపై సంబంధిత మంత్రి నుంచి 'అధికారిక వ్యాఖ్య' ను కోరడం. సభ నియమాల ప్రకారం కనీసం ఇద్దరు సభ్యులు స్పీకర్‌కు ఒక గంట ముందు నోటీసు ఇవ్వాలి. స్పీకర్ అనుమతి లభిస్తే 2.30 గంటలు చర్చ జరుగుతుంది. ఈ తీర్మానం ప్రభుత్వ మందకొడితనానికి చికిత్స లాంటిది.
 

కోత తీర్మానాలు: ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు బడ్జెట్ మొత్తంలో కొంత తగ్గింపు కోరుతూ చేసే తీర్మానాలే కోత తీర్మానాలు. ఇవి మూడు రకాలు. 1. విధాన 2. పొదుపు 3. నామమాత్రపు కోత తీర్మానాలు.
 

విధాన కోత తీర్మానం: ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తాన్ని ఒక రూపాయికి తగ్గించాల్సిందిగా చేసేదే విధానకోత తీర్మానం.
 

పొదుపు కోత తీర్మానం: ఇది ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తంలో కొంతమేర తగ్గించాలనే తీర్మానం.
 

నామమాత్రపు కోత తీర్మానం: ప్రభుత్వం ప్రతిపాదించిన బడ్జెట్ మొత్తాన్ని వంద రూపాయలకు తగ్గించాల్సిందిగా చేసే తీర్మానం. కోత తీర్మానాలను ప్రతిపక్షాలు ప్రవేశపెట్టి, ప్రభుత్వంపై వ్యతిరేకతను తెలియజేస్తాయి. ఇప్పటివరకు కోత తీర్మానాలను లోక్‌సభ ఒక్కసారి కూడా ఆమోదించలేదు. కోత తీర్మానం లోక్‌సభ ఆమోదం పొందితే తప్పనిసరిగా ప్రభుత్వం రాజీనామా చేయాలి.
             పైన వివరించిన తీర్మానాలు కార్యనిర్వాహక శాఖను అదుపులో ఉంచి, అది తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేలా చేస్తుంది.

రాజ్యసభ

     పార్లమెంట్ అధ్యయనంలోభాగంగా రాజ్యసభ గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా సభ ఏర్పాటు, ప్రత్యేక అధికారాలు, వివిధ సందర్భాల్లో దాని పాత్ర, సంబంధిత అధికరణలపై దృష్టి పెట్టాలి. దీంతో పాటు లోక్‌సభతో పోల్చి అభ్యర్థులు స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి.
పార్లమెంట్‌లోని ఎగువ సభను రాజ్యసభ (Council of States) అంటారు. రాజ్యాంగంలోని 80వ అధికరణ రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. అయితే ప్రస్తుత సభ్యుల సంఖ్య 245. ఇందులో ఎన్నికైన సభ్యులు 233 మంది, నియమించినవారు 12 మంది. ఎన్నికైన సభ్యుల్లో 229 మందిని రాష్ట్రాల నుంచి, నలుగురిని కేంద్రపాలిత ప్రాంతాలైన దిల్లీ (03), పుదుచ్చేరీ (1) నుంచి విధానసభ సభ్యులు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో, బహిరంగ ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. సాహిత్యం, విజ్ఞానం, కళలు, సామాజిక సేవారంగాల్లో ప్రత్యేక పరిజ్ఞానం లేదా అనుభవం ఉన్న వారిని ప్రధాని సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు.
రాజ్యసభ శాశ్వత సభ. దీనిలోని సభ్యుల కాల పరిమితి 6 సంవత్సరాలు. ప్రతి రెండు సంవత్సరాలకు 1/3వ వంతు సభ్యులు పదవీ విరమణ చేస్తారు. తిరిగి అంతేమంది ఎన్నికవుతారు.
రాజ్యసభ కూడా లోక్‌సభమాదిరి రాజ్యాంగం ప్రకారం సంవత్సరానికి కనీసం రెండు సార్లయినా సమావేశం కావాలి.

* రాజ్యసభ సమావేశం కావడానికి కోరం 1/10వ వంతు. కోరం ఉన్నదీ లేనిదీ నిర్ణయించే అధికారం సభాధ్యక్షుడికి ఉంటుంది.

రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్ హోదాలోనే జీతభత్యాలు స్వీకరిస్తారు. రాజ్యసభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ రాజ్యసభ మొదటి ఛైర్మన్‌, ఎస్.వి.కృష్ణమూర్తిరావు మొదటి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుత ఛైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.
తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి విధులు నిర్వహిస్తున్న కాలంలో రాజ్యసభకు అధ్యక్షత వహించడానికి వీలుండదు.
రాజ్యసభకు అనేక అంశాల్లో లోక్‌సభతో సమాన అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు సాధారణ బిల్లులు, రాజ్యాంగ సవరణ బిల్లు, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానం, రాష్ట్రపతి జారీచేసే ఆర్డినెన్సుల ఆమోదం, అత్యవసర పరిస్థితి ప్రకటన మొదలైనవి.
రాజ్యసభకు కొన్ని అంశాల్లో ప్రత్యేక అధికారాలు ఉంటాయి. ఉదాహరణకు 249 అధికరణ ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనాధికారాన్ని పార్లమెంట్‌కు కల్పించే అధికారం రాజ్యసభకు ఉంది. అదే విధంగా 312 అధికరణ ప్రకారం నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటుచేసే అధికారాన్ని పార్లమెంట్‌కు కల్పిస్తూ రాజ్యసభ తీర్మానం చేయగలదు.

* రాజ్యసభకు కొన్ని అంశాల్లో లోక్‌సభ కంటే తక్కువ అధికారాలుంటాయి. ఉదాహరణకు ద్రవ్యబిల్లును మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. అంతేకాకుండా వచ్చిన ద్రవ్య బిల్లును 14 రోజుల్లో తగిన సిఫారసులతో లేదా యథాతథంగా స్పీకర్‌కు పంపాల్సి ఉంటుంది. బిల్లును తిరస్కరించే అధికారం రాజ్యసభకు లేదు. బడ్జెట్‌పై చర్చించే అధికారం మాత్రమే ఉంది, ఓటు వేసే హక్కులేదు. ప్రభుత్వానికివ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించే అధికారం లేదు, కేవలం చర్చించే అధికారం మాత్రమే ఉంటుంది.

రాజ్యసభ అభ్యర్థి అర్హతలు

1. భారత పౌరుడై ఉండాలి.
2. వయసు 30 సంవత్సరాలు నిండి ఉండాలి.
3. పార్లమెంట్ నిర్ణయించిన ఇతర అర్హతలు ఉండాలి.

పార్లమెంట్ సమావేశాలు

రాజ్యాంగంలోని 85వ అధికరణం ప్రకారం అవసరానికి అనుగుణంగా రాష్ట్రపతి పార్లమెంట్‌ను సమావేశపరచగలరు. అయితే ఏ రెండు సమావేశాల మధ్య గడువు 6 నెలలకు మించకూడదు. సంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మొదటి లోక్‌సభ సమావేశం 1952, మే 13న జరిగింది. రాష్ట్రపతి పార్లమెంట్‌ను 'ప్రోరోగ్' (సమావేశ ముగింపు) చేయగలరు.
* సభను సమావేశపరచడానికి లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం 1/10వ వంతు సభ్యులు హాజరు కావాలి. దీన్నే 'కోరం' అంటారు. 'కోరం' ఉన్నదీ, లేనిదీ నిర్ణయించే అధికారం స్పీకర్‌కు ఉంటుంది.

* రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ వ్యవహారాలను హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించాలి. ఇంగ్లిష్ భాషను రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత 15 సంవత్సరాల (1965) వరకే అనుమతించినప్పటికీ అధికార భాషల చట్టం (1963) ప్రకారం హిందీతో పాటు ఇంగ్లిష్‌నూ కొనసాగిస్తున్నారు. సభ్యులు తమ మాతృభాషలో మాట్లాడటానికి స్పీకర్ అనుమతిస్తారు. అనువాదానికి తగిన ఏర్పాట్లు చేస్తారు.

పార్లమెంట్ అధికారాలు

పార్లమెంట్‌కు అత్యున్నత శాసన సంస్థగా కేంద్రజాబితాపై (100 అంశాలు) సంపూర్ణ అధికారాలు, ఉమ్మడి జాబితాపై (52 అంశాలు) ఆధిక్యత, రాష్ట్ర జాబితాపై కొన్ని ప్రత్యేక సందర్భాల్లో శాసనాధికారాలుంటాయి.
* ప్రశ్నలు అడగడం, విశ్వాస, అవిశ్వాస, కోత, సావధాన తీర్మానాలు, బిల్లులను తిరస్కరించడం మొదలైన పద్ధతుల ద్వారా కార్యనిర్వాహక వర్గాన్ని పార్లమెంట్ నియంత్రిస్తూ ఉంటుంది.
* ఆర్థిక విషయాల్లో పార్లమెంట్ అనుమతి లేకుండా పన్నులు విధించడానికి, సవరించడానికి, రద్దుచేయడానికి ప్రభుత్వానికి అధికారం లేదు. పార్లమెంట్ ఆమోదంతోనే బడ్జెట్ అమలు చేయాల్సి ఉంటుంది.
* రాష్ట్రపతి (మహాభియోగ తీర్మానం), ఉపరాష్ట్రపతి తొలగింపు, లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్, సుప్రీంకోర్ట్, హైకోర్ట్ ప్రధాన, సాధారణ న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఎన్నికల సంఘం ప్రధాన, సాధారణ కమిషనర్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులపై వచ్చే ఆరోపణలను పార్లమెంట్ విచారించి తొలగించగలదు.

* భారత రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంటుంది. కేవలం కొన్ని అంశాల్లో ముఖ్యంగా సమాఖ్య విధానాన్ని ప్రభావితం చేసే అంశాల్లో రాజ్యాంగాన్ని సవరించడానికి సగం రాష్ట్రాల విధానసభల ఆమోదం అవసరం.
* ప్రభుత్వ విభాగాల్లో భారత పార్లమెంట్‌కు విశేష స్థానం ఉంది. దేశ చరిత్రను మలుపు తిప్పిన అనేక శాసనాలను ఆమోదించింది. ఉదాహరణకు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించింది, ఓటు హక్కు పొందే వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. అలాగే 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, సమాచార హక్కు చట్టాలను (R.T.I.) ఆమోదించింది.

రచయిత: ఎం. భాస్కర్ రాజు

Posted Date : 03-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌