• facebook
  • whatsapp
  • telegram

పార్ల‌మెంట‌రీ, అధ్య‌క్ష త‌ర‌హా ప్ర‌భుత్వాలు

సుదీర్ఘ ప్రయోజనాలు.. స్వతంత్ర నిర్ణయాలు! 


ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా దేశాలు అనుసరిస్తున్న పాలనా విధానాల్లో ప్రజాస్వామ్యం అత్యుత్తమంగా నిలుస్తోంది. పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వ వ్యవస్థలు రెండూ ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నప్పటికీ వాటి నిర్మాణం, పరిధి వేర్వేరుగా ఉంటాయి. పార్లమెంటరీ విధానంలో నియంతృత్వం కుదరదు. సుదీర్ఘ ప్రయోజనాలు ఉంటాయి. అధ్యక్ష పద్ధతిలో స్వతంత్ర నిర్ణయాలు వేగంగా సాధ్యమవుతాయి. ఈ రెండుపాలనలకు సంబంధించిన మౌలికాంశాలు, ప్రధాన వ్యత్యాసాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ప్రభుత్వంలోని శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం ఎలా జరుగుతుంది, వాస్తవ కార్యనిర్వహణ ఎవరి చేతిలో ఉంటుందనే వివరాలతోపాటు రెండు విధానాలకు ఉన్న ప్రయోజనాలను, లోపాలను సమగ్రంగా తెలుసుకోవాలి.


కార్యనిర్వాహక వర్గం, శాసన వ్యవస్థ మధ్య సంబంధాలను ఆధారం చేసుకుని ప్రభుత్వాలను పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాలని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.

పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక వర్గం అంటే ప్రధాని నేతృత్వంలోని కేంద్ర మంత్రిమండలి.  అది పార్లమెంటు/శాసన వ్యవస్థ విశ్వాసం ఉన్నంత వరకు కొనసాగుతుంది. దానిని బాధ్యతాయుత ప్రభుత్వం, కేబినెట్‌ తరహా ప్రభుత్వమని పేర్కొంటారు. ఇలాంటి ప్రభుత్వాలు బ్రిటన్, భారత్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్నాయి.


లక్షణాలు:

వాస్తవ, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతులు: పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో వాస్తవ, నామమాత్ర కార్యనిర్వాహక అధిపతులు ఉంటారు. దేశాధినేతలకు నామమాత్రపు అధికారాలు ఉంటే, ప్రధానమంత్రులకు వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు ఉంటాయి.

ఉదా: బ్రిటన్‌ రాణి, జపాన్‌ చక్రవర్తి, భారత రాష్ట్రపతులకు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. ఆ దేశాల్లోని వాస్తవ కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రధాని నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌ కలిగి ఉంటుంది. 


శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం: పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానం శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయాన్ని సాధిస్తుంది. ఈ రెండు వ్యవస్థలకు చెందిన సభ్యులకు ఒకేసారి శాసనసభలో సభ్యత్వం ఉంటుంది. శాసన వ్యవస్థలోని సభ్యులు కేబినెట్‌లో మంత్రులుగా కొనసాగుతారు. శాసన వ్యవస్థ ఆమోదించిన సంక్షేమ పథకాలు, విధానాలను అమలుచేస్తారు. అనేక అంశాలకు సంబంధించి వారు శాసన సభ్యులకు సలహాలు ఇస్తుంటారు. తద్వారా రెండు వ్యవస్థల మధ్య సమన్వయం సాధ్యమవుతుంది.


సమష్టి బాధ్యత:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధాన మౌలిక లక్షణం ‘సమష్టి బాధ్యత’. దీనిలో ప్రధాని నేతృత్వంలోని మంత్రివర్గ సభ్యులందరూ శాసన వ్యవస్థలోని దిగువ సభకు ‘సమష్టి’గా బాధ్యత వహిస్తారు. దిగువ సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే మంత్రిమండలి మనుగడలో ఉంటుంది. ప్రధాని నేతృత్వంలోని మంత్రులంతా సమష్టిగా విధాన నిర్ణయాలు తీసుకుంటారు. కేబినెట్‌ సమావేశంలో ఏ మంత్రి అయినా తన అసమ్మతిని తెలియజేయవచ్చు. కానీ అంతిమంగా కేబినెట్‌ నిర్ణయాన్ని అంగీకరించాల్సిందే. ఆ మంత్రి వ్యక్తిగతంగా, సమష్టిగా తన శాఖకు సంబంధించి తీసుకునే అన్ని నిర్ణయాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది.


ప్రధానమంత్రి నాయకత్వం:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానాన్ని ‘ప్రధాన మంత్రిత్వ ప్రభుత్వ విధానం’గా పేర్కొనవచ్చు. ఈ విధానంలో ప్రధానమంత్రి వాస్తవ కార్యనిర్వాహక అధిపతిగా వ్యవహరిస్తారు. ఈయన దిగువ సభలో మెజార్టీ పార్టీ నాయకుడిగా/సంకీర్ణ మంత్రిమండలికి అధిపతిగా ఉంటారు. కేంద్ర కేబినెట్‌కు ‘మూల విరాట్‌’గా నిలబడతారు. కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. సమావేశాల అజెండాను నిర్ణయిస్తారు. ప్రభుత్వ విధానాలను రూపొందించి, అమలు చేయడం ద్వారా జాతి భవిష్యత్తును నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తారు. సమష్టి బాధ్యత సూత్రాన్ని మంత్రిమండలి సభ్యులంతా అనుసరించే విధంగా చూస్తారు.   మంత్రులకు మంత్రిత్వ శాఖల కేటాయింపు, మంత్రుల ప్రమాణస్వీకారం; అధికార, విధుల నిర్వహణ, రాజకీయ విధేయత ప్రధానమంత్రి మార్గదర్శకంలో జరుగుతాయి.


రాజకీయ సజాతీయత: రాజకీయ సజాతీయత అనేది పార్లమెంటరీ ప్రభుత్వ విధానంలో కీలక అంశం. దీనిలో సాధారణంగా మంత్రులంతా ఒకే రాజకీయ పార్టీకి చెందినవారై ఉంటారు. సాధారణ ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన పూర్తిస్థాయి మెజార్టీ ఏ రాజకీయ పార్టీకి లభించకపోతే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా ఏర్పడిన ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమానికి కట్టుబడి పనిచేస్తాయి.

ఉదా: యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయన్స్‌ (గీశితి), నేషనల్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ (విదీతి) 


పార్టీ క్రమశిక్షణ:  పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ‘రాజకీయ పార్టీ క్రమశిక్షణ’ ప్రధానమైంది. ప్రతి రాజకీయ పార్టీకి తమ సభ్యులందరిపై నియంత్రణ ఉంటుంది. పార్టీ విధానాలను ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. తద్వారా రాజకీయ పటిష్టత కొనసాగుతుంది.

ప్రయోజనాలు: * పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య సమన్వయం, సహకారం ఉంటుంది. దాని వల్ల దీర్ఘకాలిక జాతీయ ప్రయోజనాలు సాధ్యమవుతాయి.

* ఈ విధానంలో విభిన్న వర్గాలు, ప్రాంతాలకు తగిన ప్రాతినిధ్యం లభిస్తుంది. ప్రభుత్వంలో భిన్న స్వరాలకు సంబంధించిన వ్యక్తులందరికీ శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల్లో ప్రాతినిధ్యం ఉంటుంది.

* నియంతృత్వానికి అవకాశం లేదు. అధికార పక్ష విధానాలను ప్రతిపక్షాల సభ్యులు దిగువ సభలో అనేక పద్ధతుల ద్వారా నియంత్రిస్తారు. 

ఉదా: ప్రశ్నలు - అనుబంధ ప్రశ్నలు అడగడం, అవిశ్వాస తీర్మానం, అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం.

* పార్లమెంటరీ తరహా ప్రభుత్వ విధానంలో ప్రత్యామ్నాయ మార్పులను సులభంగా అమలుచేయవచ్చు. అధికార పక్షం రాజీనామా చేసినా లేదా అధికారం నుంచి తప్పించినా ప్రతిపక్ష రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది.

* ఈ విధానంలో ఎన్నికల ప్రక్రియ ఫలితంగా ప్రజల్లో రాజకీయ చైతన్యం ఏర్పడుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు చేసే ప్రచారాన్ని బట్టి ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంత నిరుపేద, నిరక్షరాస్యులు కూడా ఎన్నికల సమయంలో సరైన రాజకీయ తీర్పును వెలువరిస్తారు.

లోపాలు:  * సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు జాతి ప్రయోజనాల కంటే రాజకీయ పార్టీల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తుంటారు.

* అత్యవసర సమయాల్లో త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది.

* ప్రధాని నేతృత్వంలోని కేబినెట్‌ ఏకపక్ష విధానాలను అనుసరిస్తూ, మంత్రివర్గ నియంతృత్వం కొనసాగే ప్రమాదం ఉంది.

* మంత్రులు శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వర్గంలో సభ్యులుగా ఉండటం వల్ల తమకు అనుకూలమైన విధానాలను మెజారిటీతో ఆమోదింపజేసుకుని, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే ప్రమాదం ఉంది.

* రాజకీయ స్థిరత్వం లోపించవచ్చు. రాజకీయ అనిశ్చితి కారణంగా తరచూ ప్రభుత్వాలు మారవచ్చు.

అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానం:  అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖ శాసన వ్యవస్థకు ఎలాంటి బాధ్యత వహించదు. ఈ విధానంలో అధ్యక్షుడు ఒక్కడే అన్నిరకాల కార్యనిర్వాహక అధికారాలను కలిగి ఉంటాడు. అధ్యక్షుడిని ప్రజలు ప్రత్యక్షంగా ‘ఎన్నికల గణం’ ద్వారా ఎన్నుకుంటారు. ఈ తరహా ప్రభుత్వం మాంటెస్క్యూ ప్రతిపాదించిన ‘అధికారాల వేర్పాటు వాద సిద్ధాంతం’ ఆధారంగా ఆచరణలోకి వచ్చింది.

ఉదా: అమెరికా, మెక్సికో, అర్జెంటీనా, చిలీ దేశాలు అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తున్నాయి.

లక్షణాలు:  * అధ్యక్షుడే దేశానికి వాస్తవ కార్యనిర్వాహక అధిపతి. ఈయనకు ప్రభుత్వ అధిపతిగా తిరుగులేని అధికారాలు ఉంటాయి. జాతీయ ప్రయోజనాలు, మెజారిటీ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటారు.

* శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల మధ్య స్పష్టమైన అధికారాల విభజన ఉంటుంది. శాసన సభ్యులు నిర్దిష్ట కాలపరిమితికి ఎన్నికవుతారు. వారిని కాలపరిమితి కంటే ముందుగా తొలగించడానికి వీల్లేదు. అధ్యక్షుడిని సాధారణ పరిస్థితుల్లో శాసన వ్యవస్థ తొలగించలేదు. శాసన వ్యవస్థకు అధ్యక్షుడు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. న్యాయవ్యవస్థలో కూడా ఒకసారి నియమించిన న్యాయమూర్తులను పదవీకాలం కంటే ముందే తొలగించడానికి వీల్లేదు. ఎందుకంటే న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని కలిగి ఉంటుంది. ఈ ఏర్పాట్లన్నీ అధ్యక్ష ప్రభుత్వంలో పెట్టడంలో ప్రధాన ఉద్దేశం వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలను పరిరక్షించడమే.

* అధ్యక్షుడు రాజ్యాంగ నియమాలను ఉల్లంఘిస్తే పదవిని కోల్పోయే ప్రమాదం ఉంది. శాసన వ్యవస్థ అధ్యక్షుడికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే పదవిని కోల్పోతాడు.

* అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థలు నిరోధ సమతౌల్యాన్ని కలిగి ఉంటాయి. తద్వారా ప్రతి ప్రభుత్వ అంగం మరో అంగం అధికంగా నిర్వహించే అధికారాలను నిరోధించే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది.

ప్రయోజనాలు:  * ప్రభుత్వంలోని అన్ని అంగాలు స్వతంత్రంగా ఉండటం వల్ల నియంతృత్వ పోకడలు సాధ్యం కాదు. 

* దేశాధ్యక్షుడు నిర్ణీత కాలపరిమితికి ఎన్నిక కావడం వల్ల సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుంది.

* కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో ఉండటంతో సత్వర నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. పరిపాలనా సామర్థ్యం పెరుగుతుంది.

* అత్యవసర పరిస్థితి సమయంలో, అనూహ్య పరిణామాలు సంభవించిన సందర్భంలో అధ్యక్షుడు దేశ సంక్షేమం దృష్ట్యా పాలనా చర్యలు తీసుకోవచ్చు.

లోపాలు:  * శాసన, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం లోపించి, వైరుధ్యాలు ఏర్పడే ప్రమాదం ఉంది.

* అధ్యక్షుడిపై శాసన వ్యవస్థ నియంత్రణ లేకపోవడం వల్ల బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అవకాశం ఉంది.

* సమాజంలోని భిన్న సమూహాలకు సరైన ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు. అధ్యక్షుడు తన కార్యదర్శులను (మంత్రులు) ఎంపిక చేసే సమయంలో విధేయతకు, వ్యక్తిపూజకు, కపట నాటకదారులకు ప్రాధాన్యం ఇచ్చుకోవచ్చు.

* ఎన్నికల అనంతరం ప్రజాభిప్రాయానికి స్థానం ఉండదు.

* కార్యనిర్వాహక శాఖ అధిక ప్రాధాన్యాన్ని పొందడం వల్ల శాసన వ్యవస్థ ప్రాధాన్యం తగ్గుతుంది.


రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 10-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌