• facebook
  • whatsapp
  • telegram

మౌర్యుల అనంతర యుగం

 (క్రీ.పూ.184 నుంచి క్రీ.శ.320)

సమాజంలో కలిసిపోయి.. సంస్కృతిని సుసంపన్నం చేసి!
 


 

భారత ఉపఖండంలో తొలి మహాసామ్రాజ్యంగా విస్తరించిన మౌర్య సామ్రాజ్యం అశోకుడి కాలంలో ఉచ్ఛ స్థితికి చేరి, ఆ తర్వాత పతనమైంది. నాటి నుంచి తిరిగి గుప్తుల పాలనలో స్వర్ణయుగం మొదలయ్యే వరకు పలు రాజవంశాలవారు పాలకులుగా అవతరించారు. స్థానిక వంశీకులైన శుంగులు, కణ్వులు; విదేశీ తెగలైన గ్రీకులు, శకులు, కుషాణులు ప్రాచీన భారతదేశ చరిత్రలో  తమదైన ప్రస్థానాన్ని కొనసాగించారు. భారతీయ సంస్కృతిని మరింత సుసంపన్నం చేసిన ఆ పాలకులు, వారి పాలనా కాలం విశేషాల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. గొప్ప పాలకులుగా ప్రసిద్ధికెక్కిన పుష్యమిత్ర శుంగుడు,  కనిష్కుడు తదితరుల విజయాలు, వారి హయాంలో సాహిత్య  పరంగా జరిగిన కృషి గురించి తెలుసుకోవాలి.
 

అశోకుడి అనంతరం మౌర్య సామ్రాజ్యం విచ్ఛిన్నమై స్వతంత్ర రాజ్యాలు ఏర్పడటం ప్రారంభమైంది. కడపటి మౌర్య చక్రవర్తులు అసమర్థులు కావడంతో విశాల మౌర్య సామ్రాజ్య పతనాన్ని అరికట్టలేకపోయారు. క్రీ.పూ.184లో మౌర్య సామ్రాజ్య చివరి పాలకుడు బృహద్రదుడిని సంహరించి, మౌర్య సేనాని పుష్యమిత్ర శుంగుడు పాటలీపుత్ర సింహాసనాన్ని ఆక్రమించాడు. మౌర్య వంశ పతనంతో భారత ఉపఖండంలో అనేక శక్తులు ఆవిర్భవించాయి.

మౌర్యుల పతనం నుంచి గుప్తుల రాక వరకు (క్రీ.పూ.2వ శతాబ్దం చివరి నుంచి క్రీ.శ.4వ శతాబ్దం ప్రారంభం వరకు) భారతదేశ చరిత్రలో మౌర్యుల అనంతరయుగంగా పరిగణిస్తారు. ఈ యుగంలో మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశంలో శుంగులు, కణ్వ రాజవంశాలు పాటలీపుత్రం కేంద్రంగా పాలించాయి. దక్కన్‌లో శాతవాహనులు, కళింగలో ఛేది వంశం ప్రాబల్యం వహించాయి. భారతదేశ పశ్చిమోత్తర దిక్కున మధ్యఆసియాకు చెందిన అనేక విదేశీ రాజవంశాలు రాజ్యాలను స్థాపించాయి. ఈ యుగాన్ని స్థూలంగా పరిశీలిస్తే ఉత్తర భారతచరిత్రలో కొన్ని ప్రముఖ రాజవంశాల చరిత్ర తప్ప, మిగతా ప్రాంతాల గురించి స్పష్టత లేదు. అయితే వాణిజ్యాభివృద్ధి జరిగి పట్టణాలు స్థిరపడ్డాయి. విదేశీయులు రాజ్యాలు ఏర్పరుచుకొని, భారతీయ సమాజంలో కలిసిపోయారు. స్థానిక మతాలను స్వీకరించారు. స్థానిక భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేశారు.


 స్థానిక వంశాలు
 

శుంగులు (క్రీ.పూ.184 నుంచి క్రీ.పూ.73): శుంగ రాజ్య స్థాపకుడు పుష్యమిత్ర శుంగుడు. పాటలీపుత్రను రాజధానిగా చేసుకుని పాలించాడు. ఈ వంశంలో ముఖ్య పాలకులు పుష్యమిత్ర శుంగుడు, అతడి కుమారుడు అగ్నిమిత్రుడు. వసుమిత్రుడు, వజ్రమిత్రుడు, భాగవత, దేవభూతి ఇతర పాలకులు. శుంగ వంశ అధ్యయనానికి ముఖ్య ఆధారాలు: పతంజలి రాసిన మహాభాష్యం, బాణుడు రాసిన హర్ష చరిత్ర, కాళిదాసు రాసిన మాళవికాగ్నిమిత్రం, బౌద్ధ గ్రంథాలు మిళింద పన్హా మొదలైనవి. పుష్యమిత్ర శుంగుడి రాజ్యం బిహార్, బెంగాల్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాలకు పరిమితమైంది. అతడు వైదిక మతాభిమాని. రెండు అశ్వమేధ యాగాలు చేశాడు. సంస్కృత భాషకు పునర్‌ వైభవం తీసుకొచ్చాడు. పశ్చిమోత్తర భాగం నుంచి గ్రీకు పాలకుడు డిమిట్రియస్‌ దండయాత్రను తిప్పికొట్టాడు. శుంగ వంశ రాజు పాలనా కాలంలో గ్రీకు రాజు అంటియల్కిడస్‌ తన రాయబారిగా హీలియో డోరస్‌ను నియమించాడు. అతడు భాగవత మతాన్ని స్వీకరించి, విదిశ వద్ద బేస్‌నగర్‌లో గరుడ స్తంభాన్ని ప్రతిష్ఠించాడు. శుంగులు గొప్ప కళాభిమానులు. సాంచీ, బార్హుట్‌ స్తూపాలకు తోరణాలు, ద్వారబంధాలు వీరికాలంలోనే ఏర్పరిచినట్లు తెలుస్తోంది. వైదిక మతానికి పునర్‌ ప్రాభవాన్ని కల్పించి, సంస్కృత భాషకు పట్టం కట్టిన శుంగుల కాలం ఆ తర్వాతి గుప్తుల కాలపు సంస్కృతీ వికాసానికి నాంది అని చెప్పవచ్చు. శుంగ వంశ చివరి పాలకుడైన దేవభూతిని అతడి మంత్రి వాసుదేవ కణ్వ వధించి, కణ్వ వంశ పాలన ప్రారంభించాడు.

కణ్వ వంశం (క్రీ.పూ. 73 - క్రీ.పూ.28): స్థాపకుడు వాసుదేవ కణ్వ. ఇతర పాలకులు భూమిపుత్ర, నారాయణ. చివరి పాలకుడు సుశర్మ. కణ్వ వంశం పాలనా కాలం తక్కువ. దీని తర్వాత మగధ గురించి సమాచారం స్పష్టంగా లేదు. కణ్వులు కూడా వైదిక మతాన్ని, సంస్కృత భాషను ఆదరించారు.


విదేశీ వంశాలు
 

ఇండో-బాక్ట్రియన్లు: హిందూకుష్‌ - ఆక్సస్‌ పర్వతాల మధ్య ప్రాంతాన్ని బాక్ట్రియా రాజ్యం అంటారు. దీనిని గ్రీకులు పాలించారు. అలెగ్జాండర్‌ మరణాంతరం బాక్ట్రియా ప్రాంతం సెల్యూకస్‌ రాజ్యంలో భాగమైంది. మొదటి డియోడోటస్‌ కాలంలో బాక్ట్రియా స్వతంత్య్ర రాజ్యంగా అవతరించింది. ఆ తర్వాత యుథేయి డెయిమస్‌ కాలంలో పంజాబ్‌ వరకు ఆక్రమించారు. అతడి తర్వాత డిమిట్రియస్‌ రాజ్యానికి వచ్చాడు. ఇతడు పుష్యమిత్ర శుంగుడి రాజధాని వరకు దండయాత్రలు చేశాడు. వాటిని పుష్యమిత్రుడు విజయవంతంగా తిప్పికొట్టాడు. ఇండో- బాక్ట్రియన్లలో గొప్ప రాజు మిళిందుడు (మినాన్డర్‌). అతడు అనేక ప్రాంతాలను దండయాత్రల ద్వారా జయించినట్లు నాణేల ఆధారంగా తెలుస్తోంది. ఇతడి రాజ్యం కాబూల్, సింధు, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతం, కథైవార్‌ ప్రాంతాల్లో వ్యాపించింది. రాజధాని సకాల. మిళిందుడు బౌద్ధమతాన్ని స్వీకరించి ఆదరించాడు. తన ఆస్థాన పండితుడు నాగసేనుడితో బౌద్ధ మత విషయాలపై చేసిన సంవాదం ‘మిళింద పన్హా’ అనే గ్రంథంగా వెలువడింది. మిళిందుడి తర్వాతి పాలకుల గురించి సమాచారం లేదు. శకులు వీరి ప్రాంతాలను ఆక్రమించారు.

* భారతీయులు, గ్రీకులు పరస్పరం ప్రభావితులయ్యారు. గ్రీకుల రాజ్య విభజన విధానం, పాలకుల నాణేలు, శిల్పకళ, నాటకానికి వాడే తెర (యవనిక), కాలాన్ని గణించే విధానం తదితరాలను భారతీయులు తెలుసుకున్నారు. గ్రీకు పదాలు భారతీయ భాషల్లోకి ప్రవేశించాయి. భారత తత్వశాస్త్రం గ్రీకులను ప్రభావితం చేసింది.

శకులు: గ్రీకుల తర్వాత శకులు లేదా సిథియన్లు వచ్చారు. వీరు మధ్య ఆసియా ప్రాంత సంచార తెగ. భారతదేశంలో శకుల తొలి పాలకుడు మావూస్‌. శకులు నాలుగు ప్రధాన శాఖలుగా విస్తరించారు. మొదటిది తక్షశిల రాజధానిగా పంజాబ్‌లో, రెండోది మధుర రాజధానిగా ఉత్తర భారతంలో, మూడోది ఉజ్జయిని రాజధానిగా మాళ్వా పశ్చిమ తీరం వరకు, నాలుగోది బారుకచ్చ రాజధానిగా దక్కన్‌ పీఠభూమి ఉత్తర భాగంలో తమ రాజ్యాలను స్థాపించారు. శకుల పాలనను క్రీ.పూ.58 ప్రాంతంలో విక్రమాదిత్య అంతం చేసి విక్రమ శకాన్ని ప్రారంభించాడు. శకులు రాష్ట్రపాలకులను ‘క్షాత్రపులు’, ‘మహా క్షాత్రపులు’ అని పిలిచేవారు. శకుల రెండు శాఖలు భారతదేశంలో స్థిరంగా రాజ్యం చేస్తూ దీర్ఘకాలం కొనసాగాయి. అవి మహారాష్ట్రలో ‘క్షహరాటులు’, మాళ్వా ప్రాంతంలో ‘కార్ధముఖులు’. క్షహరాటుల్లో గొప్ప రాజు నహపాణుడు. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి నహపాణుడిని ఓడించి ‘క్షహరాట వంశ నిరవశేషకరుడు’ అనే బిరుదు పొందాడు. నాసిక్‌ వద్ద, జోగులతంబి గ్రామంలో జరిపిన పురావస్తు తవ్వకాల్లో నహపాణుడి నాణేలపై గౌతమీపుత్ర శాతకర్ణి పేరుతో పునర్‌ ముద్రించినవి లభించాయి. అక్కడితో బారుకచ్చ శకుల ప్రాబల్యం క్షీణించింది. కార్ధముఖ వంశ శకుల రాజధాని ఉజ్జయిని. వీరిలో గొప్ప పాలకుడు రుద్రదమనుడు. ఇతడు సంస్కృతంలో మొదటి సుదీర్ఘ శాసనాన్ని గిర్నార్‌లో వేయించాడు. ఈ శాసనం వల్ల మౌర్యుల కాలంలో నిర్మించిన సుదర్శన తటాకాన్ని బాగుచేయించినట్లు తెలుస్తోంది. గుప్త వంశ రెండో చంద్రగుప్తుడు మాళ్వా శకులను ఓడించి ‘శకారి’ అనే బిరుదు పొందాడు.

పార్థియన్లు: పార్థియన్లు లేదా పహ్లవుల చరిత్రకు సంబంధించి ఆధారాలు స్పష్టంగా లేవు. పార్థియన్లు ఇరాన్‌ (పర్షియా)కు చెందినవారు. చరిత్రకు తెలిసిన గొప్ప ఇండో పార్థియన్‌ రాజు గొండో ఫెర్నీస్‌. ఇతడు క్రీ.శ. మొదటి శతాబ్దపు ప్రథమార్ధంలో పాలించాడు. ఇతడి రాజ్యం తూర్పు పర్షియా, వాయవ్య భారతదేశంలో కొంత వ్యాపించింది. ఇతడి కాలంలో క్రైస్తవ మత ప్రచారకుడు సెయింట్‌ థామస్‌ భారతదేశానికి వచ్చి మతప్రచారం చేశాడు. తర్వాత కాలంలో కుషాణులు ఈ ప్రాంతాలను ఆక్రమించారు.

కుషాణులు: వీరు యూచీ తెగకు చెందినవారు. చైనా సరిహద్దుల్లో నివసించేవారు. వీరిపై హూణులు తరచూ దాడి చేసి పశ్చిమం వైపు తరిమేయడంతో, వారు బాక్ట్రియాపై దాడి చేసి, అక్కడి శకులను ఓడించి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. వీరి అయిదు తెగల్లో ఒక తెగ భారతదేశం వైపు వచ్చి ఇక్కడ రాజ్యస్థాపన చేసింది. వీరినే కుషాణులు అంటారు. భారతదేశపు కుషాణు రాజుల్లో ముఖ్యులు మొదటి ఖడ్‌ ఫైసిస్‌ (మహారాజ బిరుదు వహించాడు), రెండో ఖడ్‌ ఫైసిస్‌ (మహేశ్వర బిరుదు), కనిష్క (కుషాణుల్లో అగ్రగణ్యుడు), వషిష్క, వాసుదేవ మొదలైనవారు. వీరి రాజధాని పురుషపురము (పెషావర్‌).రెండో రాజధాని మధుర.

కనిష్కుడు: కుషాణులలో అగ్రగణ్యుడు. బౌద్ధాన్ని ఆచరించి, బౌద్ధ మత వ్యాప్తికి కృషిచేసి రెండవ అశోకుడిగా పేరుపొందాడు. ఇతడి బిరుదు దేవపుత్ర. కనిష్కుడు క్రీ.శ.78లో శకయుగాన్ని ప్రారంభించాడు. వసుమిత్రుడి అధ్యక్షతన నాలుగో బౌద్ధ సంగీతిని నిర్వహించాడు. చైనా నుంచి కాందహార్‌ మీదుగా మధ్య ఆసియా, రోమన్‌ సామ్రాజ్యానికి వెళ్లే సిల్క్‌ రూట్‌ కనిష్కుడి నియంత్రణలో ఉండేది.

శకులు, కుషాణులు భారతీయ సమాజంలో కలిసిపోయి ప్రాచీన భారతదేశ సాహిత్య సంస్కృతీ వైభవంలో భాగస్వాములయ్యారు.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం 
 

Posted Date : 24-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు