• facebook
  • whatsapp
  • telegram

రాజ్యసభ - ప్రత్యేక అధికారాలు

సమాఖ్య వ్యవస్థకు సమగ్ర ప్రాతినిధ్యం! 

జాతీయస్థాయి ప్రయోజనాలే ప్రధాన ప్రాతిపదికగా లోక్‌సభ నడుస్తుంది. ఆ సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల  రాజ్యాంగ పరమైన హక్కులకు, అధికారాలకు భంగం కలగకుండా రాజ్యసభ వ్యవహరిస్తుంది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం ఏర్పడకుండా చూస్తుంది. సమగ్ర శాసన ప్రక్రియకు దోహదపడుతుంది. కొత్త చట్టాల రూపకల్పనలో చర్చలను ప్రోత్సహించి, సమతౌల్యత సాధనకు సాయపడుతుంది. శాసనాల సమీక్ష, సవరణలతోపాటు దేశ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇందుకు సంబంధించిన అంశాలు, రాజ్యాంగ నిబంధనలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. చట్టాల తయారీలో తొందరపాటుకు, ఏకపక్ష ధోరణికి తావు లేకుండా లోక్‌సభను రాజ్యసభ కట్టడి చేసే విధానాలను ఉదాహరణలతో తెలుసుకోవాలి.


రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 80 రాజ్యసభ నిర్మాణం గురించి వివరిస్తుంది. 1951 నాటి ‘భారత ప్రజాప్రాతినిధ్య చట్టం’ ప్రకారం రాజ్యసభ గరిష్ఠ సభ్యుల సంఖ్య 250. ప్రస్తుతం ఆ సభలో సభ్యుల సంఖ్య 245. వీరిలో రాష్ట్రాల నుంచి 225 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 8 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళలు, సాహిత్యం, సామాజిక సేవారంగాల్లో ప్రావీణ్యం ఉన్న 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్‌ చేస్తారు.


* రాజ్యాంగంలోని  IV వ షెడ్యూల్‌లో రాజ్యసభ సభ్యుల సంఖ్యను పేర్కొన్నారు. వీరిని ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించారు. రాజ్యసభ సభ్యులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధానసభల సభ్యులు (ఎంఎల్‌ఏలు) నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో ఎన్నుకుంటారు. 


* రాజ్యసభ శాశ్వత సభగా, నిరంతర సభగా కొనసాగుతుంది. దీనికి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు. ప్రతి రెండేళ్లకోసారి 1/3వ వంతు సభ్యులు పదవీవిరమణ చేస్తారు. ద్వైవార్షిక ఎన్నికలు నిర్వహించి ఆ ఖాళీలను భర్తీ చేస్తారు. రాజ్యసభ సభ్యులు మొత్తం ఒకేసారి ఎన్నిక అవ్వరు. ఒకేసారి పదవీవిమరణ చేయరు.


* 30 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ‘రాజ్యసభ’కు జరిగే ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అభ్యర్థి ఏ రాష్ట్రం నుంచి పోటీ చేస్తున్నారో ఆ రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉండాలనే నిబంధన ఉండేది. 2003లో భారత ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఓటరుగా ఉన్న వ్యక్తి, ఏ రాష్ట్రం నుంచైనా పోటీచేయవచ్చని నిర్దేశించారు. 2003 నుంచి రాజ్యసభ ఎన్నికల్లో ‘రహస్య ఓటింగ్‌’ బదులుగా, బహిరంగ ఓటింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు.


ఛైర్మన్‌గా ఉపరాష్ట్రపతి:  ఆర్టికల్‌ 89 ప్రకారం ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఎక్స్‌-అఫీషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. రాజ్యసభలో సభ్యుడు కాకపోయినప్పటికీ సభకు అధ్యక్షత వహిస్తారు.రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.


రాజ్యసభ ప్రత్యేక అధికారాలు:  లోక్‌సభ అధికారాలతో పోలిస్తే రాజ్యసభకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.


ఆర్టికల్‌ 249: జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు శాసనం రూపొందించాలంటే ముందుగా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. ఆ తీర్మానం ఆధారంగా పార్లమెంటు రూపొందించే శాసనం ఒక సంవత్సరకాలం పాటు అమలులో ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ మరొక తీర్మానాన్ని ఆమోదిస్తే ఇంకో సంవత్సరం పాటు కొనసాగుతుంది. ఆ విధంగా ఎంతకాలమైనా పొడిగించవచ్చు.


ఉదా: రాజ్యసభ చేసిన తీర్మానం ఆధారంగా 1965లో ఆహారధాన్యాల విషయంలో పార్లమెంటు శాసనాన్ని రూపొందించింది.


ఆర్టికల్‌ 312: మన దేశంలో నూతన ‘అఖిల భారత సర్వీసులు’ ఏర్పాటు చేయాలంటే ముందుగా రాజ్యసభ 2/3 ప్రత్యేక మెజార్టీతో ఒక తీర్మానాన్ని ఆమోదించాలి. దాని ఆధారంగా పార్లమెంటు నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేస్తూ చట్టం చేస్తుంది.


ఉదా: 1963లో రాజ్యసభ నూతన అఖిల భారత సర్వీసుల ఏర్పాటుకు తీర్మానించింది. 


1) ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ -- ఇది 1966లో అమల్లోకి వచ్చింది. 


2) ఇండియన్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీస్‌ -- ఇది అమలులోకి రాలేదు. 


3) ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీస్‌ -- అమలులో ఉంది.         ,,


ఆర్టికల్‌ 67(B):రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. తొలగింపు తీర్మాన నోటీసును రాజ్యసభ సభ్యులు 14 రోజుల ముందు ఇవ్వాలి. తీర్మానంపై చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. దానిని రాజ్యసభ సాధారణ మెజార్టీతో ఆమోదించాలి. అనంతరం లోక్‌సభలో కూడా చర్చ అనంతరం ఓటింగ్‌ జరుగుతుంది. అక్కడ కూడా సాధారణ మెజార్టీతో ఈ తీర్మానాన్ని ఆమోదిస్తే ఉపరాష్ట్రపతి పదవిని కోల్పోతారు.


రాజ్యసభ తన ప్రత్యేక అధికారాలను పలు సందర్భాల్లో వినియోగించింది.


* 1961లో ‘వరకట్న నిషేధ బిల్లు’ను వ్యతిరేకించింది.


* 1970లో ‘మాజీ సంస్థానాధిపతుల హక్కులు, సౌకర్యాల రద్దు’ బిల్లును తిరస్కరించింది.


* 1978లో ‘బ్యాంకింగ్‌ సర్వీస్‌ ఏర్పాటు/రద్దు’కు సంబంధించిన బిల్లును ఆమోదించలేదు.


* 1978లో ‘గుంటూరు’లోని ‘టొబాకో బోర్డు’ను వేరే ప్రాంతానికి తరలించే అంశాన్ని వ్యతిరేకించింది.


* 1978లో మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వ కాలంలో రూపొందించిన 44వ రాజ్యాంగ సవరణ బిల్లులోని 7 అంశాలను తిరస్కరించింది. 


రాజ్యసభ - ప్రాధాన్యం:  లోక్‌సభ తొందరపాటుతో రూపొందించే శాసన ప్రక్రియను రాజ్యసభ సవరిస్తుంది. శాసనపరంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తుంది. అవసరమైన అదనపు రాజకీయ పదవులను సృష్టిస్తుంది. నాణ్యత ఉన్న, అభిలషణీయమైన శాసనాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే మేధావులను శాసన నిర్మాణ ప్రక్రియలో భాగస్వాములను చేస్తుంది.

లోక్‌సభతో సమానంగా రాజ్యసభకు ఉన్న అధికారాలు: మన దేశంలో సాధారణ చట్టాల రూపకల్పనలో, సాధారణ పరిపాలనాంశాల విషయంలో లోక్‌సభ, రాజ్యసభలకు సమాన అధికారాలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ఒక బిల్లును చట్టంగా రూపొందించాలంటే ఉభయసభల ఆమోదం తప్పనిసరి.


రాజ్యాంగ సవరణ ప్రక్రియ: ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి ఉంది. ఈ ప్రక్రియలో రాజ్యసభ, లోక్‌సభలకు సమాన అధికారాలున్నాయి. రాజ్యాంగాన్ని సవరించే విషయంలో ఉభయ సభల మధ్య అభిప్రాయ భేదాలు వస్తే సంబంధిత బిల్లు వీగిపోతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


ఉదా: ఎల్‌.ఎం.సింఘ్వీ కమిషన్‌ సిఫార్సుల మేరకు రాజీవ్‌గాంధీ ప్రభుత్వ కాలంలో 1989లో 64వ రాజ్యాంగ సవరణ బిల్లు ద్వారా పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే ప్రయత్నం జరిగింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభ తిరస్కరించడంతో బిల్లు వీగిపోయింది.


* పి.వి.నరసింహారావు ప్రభుత్వ కాలంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించే 73వ రాజ్యాంగ సవరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించడంతో, అది రాష్ట్రపతి ఆమోదం కూడా పొంది 73వ రాజ్యాంగ సవరణ చట్టంగా 1993, ఏప్రిల్‌ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

ఎన్నికల అధికారాలు: రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్‌ కాలేజీ’లో పార్లమెంటు ఉభయసభల సభ్యులకు సమాన అధికారాలు ఉంటాయి.


అత్యవసర పరిస్థితుల ఆమోదం: రాష్ట్రపతి ఆర్టికల్‌ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని, ఆర్టికల్‌ 356 ప్రకారం రాజ్యాంగ అత్యవసర పరిస్థితి/ రాష్ట్రపతి పాలన, ఆర్టికల్‌ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు. రాష్ట్రపతి విధించే ఈ అత్యవసర పరిస్థితులు అమలు కావాలంటే పార్లమెంటు ఉభయసభలు తప్పనిసరిగా ఆమోదించాలి. వీటిని ఒక సభ ఆమోదించి రెండో సభ తిరస్కరిస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు. అత్యవసర పరిస్థితి ప్రకటన రద్దవుతుంది.


ఉదా: అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వ సిఫార్సుల మేరకు 1999లో అప్పటి రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి బిహార్‌లోని రబ్రీ దేవి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. దీన్ని లోక్‌సభ ఆమోదించినప్పటికీ, రాజ్యసభ తిరస్కరించడంతో రాష్ట్రపతి పాలన అమలులోకి రాలేదు.


న్యాయాధికారాలు: రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించేందుకు ఉద్దేశించిన ‘మహాభియోగ తీర్మానం’ ను పార్లమెంటు ఉభయ సభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. ఈ తీర్మానాన్ని ఉభయ సభలు వేర్వేరుగా 2/3 ప్రత్యేక మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పదవీచ్యుతులు అవుతారు. తీర్మానం ప్రవేశపెట్టిన సభ తీర్మానాన్ని తిరస్కరిస్తే, దాన్ని రెండో సభలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేదు. ఈ తీర్మానంపై ఉభయసభల మధ్య భేదాభిప్రాయాలు వస్తే ఉభయ సభల సంయుక్త సమావేశానికి అవకాశం లేదు.


* ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన, ఇతర న్యాయమూర్తులు, కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన, ఇతర కమిషనర్లపై వచ్చే ఆరోపణలను విచారించి, వారిని పదవి నుంచి తొలగించే సందర్భంలో రాజ్యసభ, లోక్‌సభలకు సమాన అధికారాలున్నాయి. వీరిని తొలగించే తీర్మానాన్ని ఏ ఒక్క సభ ఆమోదించకపోయినా సంబంధిత తీర్మానం వీగిపోతుంది.


కేంద్ర మంత్రి మండలి: కేంద్ర మంత్రి మండలిలో పదవులు చేపట్టే అవకాశం పార్లమెంటు ఉభయసభల సభ్యులకు ఉంటుంది. ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టాలంటే పార్లమెంటు సభ్యుడిగా ఉండాలి. అయితే పార్లమెంటులో సభ్యత్వం లేని వ్యక్తి ప్రధాని లేదా కేంద్రమంత్రి పదవిని చేపట్టినప్పుడు, ఆ పదవి చేపట్టిన తేదీ నుంచి 6 నెలల్లోగా పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. లేకపోతే పదవిని కోల్పోతారు. సాధారణంగా లోక్‌సభలో మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడు ప్రధాని పదవి నిర్వహిస్తారు. అయితే రాజ్యసభ సభ్యత్వంతో ప్రధాని పదవులను నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి.


ఉదా: హెచ్‌డీ.దేవేగౌడ, ఐ.కె.గుజ్రాల్, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యత్వంతోనే ప్రధాని పదవి నిర్వహించారు.

పార్లమెంటరీ కమిటీల్లో ప్రాతినిధ్యం: ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వరంగ సంస్థల సంఘం, సభాహక్కుల సంఘం, జీతభత్యాల సంఘం మొదలైన పార్లమెంటరీ కమిటీల్లో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ప్రాతినిధ్యం ఉంటుంది.


రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటు: భారతదేశంలో నూతన రాజ్యాంగబద్ధ సంస్థలను ఏర్పాటు చేయాలంటే పార్లమెంటు ఉభయసభల ఆమోదం తప్పనిసరి. ఉభయ సభలు వేర్వేరుగా 2/3 ప్రత్యేక మెజార్టీతో తీర్మానం ఆమోదించిన తర్వాతే కొత్త రాజ్యాంగబద్ధ సంస్థల ఏర్పాటుకు అవకాశం లభిస్తుంది.

నివేదికలపై చర్చ: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్‌సీ), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), కేంద్ర ఆర్థిక సంఘం, జాతీయ మహిళా కమిషన్, జాతీయ సమాచార కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, జాతీయ షెడ్యూల్డు కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డు తెగల కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్‌ మొదలైనవి తమ నివేదికలను రాష్ట్రపతికి సమర్పించిన అనంతరం,  రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు పంపిస్తారు. ఆ నివేదికలపై పార్లమెంటు ఉభయ సభల్లో చర్చ జరుగుతుంది.


 

 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 09-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌