• facebook
  • whatsapp
  • telegram

విపత్తుల నిర్వహణలో రిమోట్‌ సెన్సింగ్‌  

(భౌగోళిక సమాచార వ్యవస్థల పాత్ర)

ఆపదల్లో ఆదుకునే సాంకేతికత!
 


సహజ విపత్తులకు తోడు మానవకారక ప్రమాదాలు అత్యధికంగా చోటుచేసుకుంటున్న దేశాల్లో భారతదేశం తొలివరుసలో ఉంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, వరదలు, భూకంపాలు లాంటి విపత్తుల గురించి ముందస్తుగా హెచ్చరించడం మొదలు ప్రమాదంలో చిక్కుకున్నవారిని గుర్తించి, రక్షించి,  ఉపశమనం కల్పించడంలో జీపీఎస్, జీఐఎస్‌ లాంటి  సాంకేతికతలు కీలకంగా మారాయి. ముందస్తు సన్నద్ధత, తక్షణ స్పందన, సదుపాయాల పునరుద్ధరణ, బాధితులకు పునరావాసం తదితర పనుల్లో ఈ టెక్నాలజీలను ఏవిధంగా  వినియోగిస్తున్నదీ పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. రిమోట్‌ సెన్సింగ్‌తో ప్రాంతాలవారీగా దుర్బలత్వాన్ని సూచించే మ్యాపులు రూపొందించే తీరుపై తగిన అవగాహన కలిగి ఉండాలి.


ఆగ్నేయాసియాలో అందులోనూ భారత్‌లో ఏటా ఎక్కువగా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 85% ప్రాంతం ఏదో ఒక ప్రకృతి వైపరీత్యానికి గురయ్యే అవకాశం ఉంది. దేశ భూభాగంలో 58% ప్రాంతంలో భూకంపాలు, 8% ప్రాంతంలో తుపానులు, 12% ప్రాంతంలో వరదలు, 15% ప్రాంతంలో భూపాతాలు లాంటి వైపరీత్యాలు సంభవించే దుర్బలత్వం ఉంది. మొత్తం సాగు భూమిలో 68% ప్రాంతం కరవు బారిన పడే ప్రమాదం ఉంది. ఈ విధమైన ప్రకృతి వైపరీత్యాల విషయంలో ముందుగా తగిన హెచ్చరికలు చేయడానికి, నివారణ, సంసిద్ధత, ఉపశమన, పునరావాస, పునర్మిర్మాణ చర్యలు తీసుకునేందుకు, వాటి ప్రభావాన్ని, నష్టాన్ని అంచనా వేయడానికి, సత్వర సమాచార వ్యాప్తి, బదిలీ కోసం రిమోట్‌ సెన్సింగ్, భౌగోళిక సమాచార వ్యవస్థల సేవలు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. వాటిలో ముఖ్యమైనవి-


1. రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ మిషన్‌  ఫర్‌ అగ్రికల్చర్‌ (RSAMA)


2. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం (NADAMS) 


3. రియల్‌ టైమ్‌ ఫ్లడ్‌ మానిటరింగ్‌ పథకాలు.  వీటిని 1987-1997 మధ్యకాలంలో 7వ, 8వ పంచవర్ష ప్రణాళికల కాలంలో అమలుచేశారు.


* సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, మంచు పరిమాణం, మేఘాల అధ్యయనాలు, సముద్రపు గాలులు, ఉష్ణ, శీతల వాయు గమనాలు మొదలైన వాటి గురించి తెలుసుకోవడం ద్వారా దేశంలో రుతుపవనాల పోకడలను ముందుగానే ఊహించవచ్చు. అలాగే కరవు ప్రాంతాలపై రుతుపవనాల ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా కరవు నివారణ చర్యలు తీసుకోవచ్చు.


* రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల్లో వాడుతున్న మల్టిపుల్‌ రిగ్రెషన్‌ మోడల్‌(MRM), ఆటో రిగ్రెషన్‌ ఇంటిగ్రేటెడ్‌ మూవింగ్‌ ఏవరేజ్‌(ARIMA) లు కరవు ప్రమాద సూచనలను మెరుగ్గా అందిస్తున్నాయి. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్‌ జిల్లా లాతూరులో భూకంపం వచ్చిన సమయంలో రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాలు చాలా ప్రయోజనాలను అందించాయి. అడవుల్లో అగ్నిప్రమాదాలను గుర్తించి, నివారించడంలో కూడా వీటిని  ఉపయోగిస్తున్నారు.


4. విపత్తు నిర్వహణలో అంతరిక్ష ఆధారిత సేవలు అందిస్తున్న జాతీయ, అంతర్జాతీయ సంస్థలన్నీ దాదాపుగా జీఐఎస్, రిమోట్‌ సెన్సింగ్‌ను  ఉపయోగిస్తున్నాయి.


5. విపత్తు సమయంలో పరిస్థితిని సమీక్షించి, సరైన నిర్దారణ నమూనాలు రూపొందించి అత్యవసర ప్రణాళికలు సిద్ధం చేసి, ప్రాదేశిక డేటా బేస్‌లను  రూపొందిస్తారు.


6. రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని విపత్తు తీవ్రతను అంచనా వేయడంలో ఉపయోగిస్తారు. భూకంపాలు, వరదలు, అడవులకు నిప్పు అంటుకోవడం, తుపాన్లు, కరవు లాంటి విపత్తుల ప్రభావాలను గుర్తించి అంచనా వేస్తారు.


7. విపత్తుల బారిన పడే అవకాశాన్ని, ప్రమాద తీవ్రతను అంచనా వేసేందుకు, భారీస్థాయి సమాచారాన్ని నిర్వహించేందుకు జీఐఎస్‌ను ఉపయోగిస్తారు.


8. విపత్తు సంసిద్ధత సమయంలో జీఐఎస్‌ను పలు అవసరాలకు ఉపయోగిస్తారు.

ఎ) విపత్తు బారిన పడిన వారిని ప్రమాదం నుంచి రక్షించే మార్గాలను సిద్ధం చేయడం.

బి) అత్యవసర సేవలు అందించే కేంద్రాల రూపకల్పన.

సి) ఉపగ్రహ సమాచారాన్ని ఇతర రకాల సమాచారంతో అనుసంధానించి విపత్తు హెచ్చరిక వ్యవస్థలను రూపొందించడం.


9. విపత్తు స్పందన సమయంలో జీఐఎస్‌ను పలు అవసరాలకు ఉపయోగిస్తారు.

ఎ) గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టంను జీఐఎస్‌తో కలిపి సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ కార్యకలాపాలు  నిర్వహించడం.

బి) తద్వారా ప్రమాదంలో చిక్కుకున్న వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం.


10. విపత్తు అనంతర పునరుద్ధరణ సమయంలో వివిధ అవసరాలకు జీఐఎస్‌ను ఉపయోగిస్తారు.

ఎ) నష్ట సమాచారాన్ని సేకరించి, క్రమబద్ధీకరించడంలో..

బి) అభివృద్ధి ప్రణాళికల్లో, కొత్త ప్రాజెక్టుల్లో, విపత్తుల సమాచారాన్ని ఉపయోగించడంలో..

సి) తద్వారా విపత్తులను తగ్గించే నమూనాలను  అభివృద్ధి చేయడంలో.. జీఐఎస్, రిమోట్‌ సెన్సింగ్‌ ద్వారా జాతీయ, 


11. రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో విపత్తు నిర్వహణ సాధ్యమవుతుంది.

ఎ) విపత్తు మ్యాపింగ్‌: గ్రౌండ్‌ ఆధారిత సమాచార సేకరణ, రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహాల సాయంతో విపత్తులు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి, అక్కడ సంభవించే అవకాశం ఉన్న ప్రాణ, ఆస్తి, మౌలిక సదుపాయాల నష్టాలపై సమాచారాన్ని సేకరిస్తారు. ఇలాంటి చర్యలు పలు రకాలుగా ఉంటాయి. వరద ప్రమాద మండలాలు, సీస్మిక్‌ జోన్‌ మ్యాప్స్, ఫారెస్ట్‌ ఫైర్‌ రిస్క్‌ మ్యాప్స్, ఇండస్ట్రియల్‌ రిస్క్‌ జోన్‌ మ్యాప్స్, సైక్లోన్‌ రిస్క్‌ మిటిగేషన్‌ మ్యాప్స్‌ మొదలైనవి.

బి) సెర్చ్‌ అండ్‌ రెస్క్(SAR) : ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడం. ఒక విపత్తు సంభవించిన వెంటనే నిర్వహించే కీలక చర్య ఇది.


12. ఈ రకమైన కార్యకలాపాల్లో జాతీయ, రాష్ట్రస్థాయి విపత్తు స్పందన దళాలు, వాలంటీర్లు రాష్ట్ర, జిల్లాస్థాయి ఏజెన్సీలు పాల్గొంటాయి. పరిస్థితులు విషమంగా మారినప్పుడు సైనికుల సాయం లభిస్తుంది.

సాధ్యమైనంత మేరకు ప్రాణనష్టాన్ని తగ్గించాలన్నది SAR లక్ష్యం. ఈ పద్ధతిలో రక్షించిన వారిలో భయాన్ని,ఆందోళనను తొలగించి ఉపశమన సేవలు అందించాలి. అవి.. ఆవాసం, ఆహారం, కమ్యూనికేషన్స్, నీరు, పవర్‌ సప్లై, తాత్కాలిక హౌసింగ్, పారిశుద్ధ్య సేవలు, రక్షణ.


13. ఈ విధంగా జీఐఎస్, రిమోట్‌ సెన్సింగ్‌ అనే రెండు రకాల సాంకేతికతలు విపత్తు నిర్వహణలో పూర్తిస్థాయిలో దోహదపడుతున్నాయి.

ఎ) విపత్తు సంభవించే ప్రాంతాలను గుర్తించడం.

బి) ఆ ప్రాంతాలను ప్రమాదస్థాయి ఆధారంగా  విభజించడం.

సి) ప్రమాదానికి గురయ్యే జనాభా, నష్టం వాటిల్లే   ఆస్తులను గుర్తించడం.

డి) ప్రమాదం సంభవించే అవకాశాలను సిమ్యులేషన్స్‌ ద్వారా తెలుసుకోవడం.

ఇ) విపత్తు ప్రమాద హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయడం

ఎఫ్‌) సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ వ్యవస్థల   పునరుద్ధరణ.
 

 

రచయిత: ఈదుబిల్లి వేణుగోపాల్‌
 
 

Posted Date : 25-07-2024

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు