• facebook
  • whatsapp
  • telegram

సమాచార హక్కు చట్టం - లోక్‌పాల్‌, లోకాయుక్త

పరిపాలనా వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించి, ప్రభుత్వ పాలనలో గోప్యతను నివారించే లక్ష్యంతో 1776లో స్వీడన్ తన దేశ రాజ్యాంగంలో తొలిసారిగా సమాచార హక్కును పొందుపరచడం ద్వారా బాధ్యతాయుత పాలనకు శ్రీకారం చుట్టింది.

* 1951లో ఫిన్‌లాండ్, 1966లో అమెరికా, 1970లో డెన్మార్క్, నార్వే దేశాలు సమాచార హక్కును చట్టబద్దం చేశాయి.

* మన దేశాన్ని బ్రిటిష్‌వారు పాలిస్తున్న కాలంలో (1923) అధికార రహస్యాల చట్టాన్ని (The Official Secrets Act) రూపొందించారు. దీని ప్రకారం ప్రజా అధికారులు సమాచారాలను వెల్లడించకుండా ఉండే వీలు ఏర్పడింది.

* 1976లో రాజ్‌నారాయణ్ Vs ఇందిరా గాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ భారతదేశం ప్రజాస్వామ్య దేశమని, ప్రజలు సార్వభౌములని; ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధుల పనితీరుకు సంబంధించిన సమాచారం, సమాచార హక్కుకు సంబంధించిన సమాచారాన్ని పౌరులకు తప్పనిసరిగా అందించాలని తెలియజేసింది. సమాచార హక్కు పౌరుల ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగమని పేర్కొంది.

* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్, 19(1)(a) భావవ్యక్తీకరణ హక్కులో అంతర్భాగంగా సమాచార హక్కు చట్టం ఉంది.

* 1996లో జస్టిస్ పి.బి. సావంత్ నాయకత్వంలో, 1997లో "NITRD" నాయకత్వంలో ఏర్పడిన (National Institute of Rural Development) స్టడీ టీమ్‌లు రూపొందించిన నివేదికలు సమాచార స్వేచ్ఛ చట్టానికి ఆధారంగా నిలిచాయి.

* మాజీ ఐఏఎస్ అధికారి, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత అరుణారాయ్; సామాజిక వేత్త, రామన్‌మెగసెసె అవార్డు గ్రహీత సందీప్ పాండేల కృషి ఫలితంగా, మన దేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించారు.

* అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2002లో సమాచార స్వాతంత్య్ర చట్టాన్ని రూపొందించింది. దీనిలోని లోపాలను సవరించి డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని 2005 అక్టోబరు, 12 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టం జమ్మూకశ్మీర్‌లో తప్ప దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

* సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం ప్రభుత్వ పాలనకు సంబంధించిన 17 రకాల సమాచారాలను పౌరులు తెలుసుకోవచ్చు.

అవి:

   1. రికార్డులు

   2. పత్రాలు

   3. సలహాలు

   4. అభిప్రాయాలు

   5. ఈ - మెయిల్స్

   6. నివేదికలు

   7. మెమోలు

   8. కాంట్రాక్టులు

   9. లాగ్ పుస్తకాలు

   10. ఆర్డర్లు

   11. సర్క్యులర్లు

   12. పత్రికా ప్రకటనలు

   13. రాతప్రతులు

   14. నమూనాలు

   15. మోడల్స్

   16. ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న గణాంకాలు

   17. అమల్లో ఉన్న చట్టాల ప్రకారం ప్రభుత్వ అధికారికి అందుబాటులో ఉండే ప్రైవేట్ సంస్థల వివరాలు

సమాచార హక్కు చట్టం పరిధిలోకి రాని అంశాలు

* దేశరక్షణకు సంబంధించిన అంశాలు

* భారతదేశ సార్వభౌమత్వానికి ఆటంకం కలిగించే అంశాలు

* గూఢచారి సంస్థలు అందించే సమాచారం

* విదేశాలతో భారతదేశం కుదుర్చుకున్న ఒప్పందాలు

* కేంద్ర మంత్రిమండలి పరిపాలనలో రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు

* రాష్ట్ర మంత్రిమండలి పరిపాలనలో గవర్నర్‌కు ఇచ్చే సలహాలు

* న్యాయ విచారణలో ఉన్న కేసులకు సంబంధించిన అంశాలు

సమాచారాన్ని పొందే పద్ధతులు

* రికార్డులు

* సర్టిఫైడ్ కాపీలు

* సీడీలు, ఫోటోలు, ప్లాపీలు

* జిరాక్స్ కాపీలు

* డాక్యుమెంట్లు, వీడియో టేపులు

* సహకార సంఘాలన్నింటినీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకువస్తూ కేరళ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సహకార సంఘాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని పేర్కొంది. ఈ సంఘాలను ప్రభుత్వ సంస్థలుగా భావించలేమని జస్టిస్ సిక్రీ, జస్టిస్ రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

సుభాష్ అగర్వాల్ Vs సుప్రీంకోర్టు రిజిస్ట్రర్

సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తారని, న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడికి సంబంధించిన వివాదంలో దిల్లీ హైకోర్టు పేర్కొంది.

* సమాచారాన్ని ఇవ్వడానికి ప్రతి ప్రభుత్వ కార్యాలయ అధిపతి Public Information Officer (PIO)గా వ్యవహరిస్తారు.

* ఎవరైనా వ్యక్తి సమాచారాన్ని కోరుతూ దరఖాస్తు చేసుకున్నట్లయితే సంబంధిత వ్యక్తికి 30 రోజుల్లోపు సమాచారాన్ని ఇవ్వాలి.

* కోరిన సమాచారం జీవన్మరణానికి సంబంధించిందైతే 48 గంటల్లోగా అందించాలి.

* సమాచార అధికారికి కాకుండా, సహాయ సమాచార అధికారికి దరఖాస్తును ఇచ్చినట్లయితే సంబంధిత అధికారి 35 రోజుల్లోగా సమాచారాన్ని ఇవ్వాలి.
 

సమాచారం కోసం అప్పీలు
* నిర్దేశించిన గడువులోగా ఏ విషయాన్ని తెలియజేయకపోతే సమాచారం ఇవ్వడానికి తిరస్కరించినట్లుగానే భావించాలి.
* సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల్లోపు ఏవిధమైన సమాచారాన్ని ఇవ్వకపోయినా, దరఖాస్తును తిరస్కరించినా, తిరస్కరించడానికి సరైన కారణాలు తెలియజేయకపోయినా సంబంధిత అధికారిపై ఉన్నతాధికారికి 30 రోజుల్లోపు అప్పీలు (మొదటి అప్పీలు) చేసుకోవాలి.

* ఉన్నతాధికారి కూడా సమాచారాన్ని లేదా దరఖాస్తును తిరస్కరిస్తే 90 రోజుల్లోగా రాష్ట్ర సమాచార కమిషన్‌కు అప్పీలు (రెండో అప్పీలు) చేసుకోవాలి.
* మొదటి అప్పీలు దాఖలు చేసుకున్నప్పుడు లేదా రెండో అప్పీలు దాఖలు చేసుకున్నప్పుడు 30 రోజుల్లోపు లేదా గరిష్ఠంగా 45 రోజుల్లోపు అప్పీలేట్ అథారిటీ తన తీర్పును వెలువరించాల్సి ఉంటుంది.
* నిర్ణీత గడువులోగా సమాచారాన్ని ఇవ్వని పీఐవోకు రోజుకు రూ.250 చొప్పున, గరిష్ఠంగా రూ.25000 జరిమానా విధిస్తారు.

 

సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము
* సమాచార హక్కు చట్టం ప్రకారం ఏవ్యక్తి అయినా సమాచారం కోరుతూ దరఖాస్తు చేస్తే దరఖాస్తుతో పాటు రూ.10 రుసుము నగదుగా ఇచ్చి రసీదును పొందాలి.
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లో సమాచార దరఖాస్తుకు రుసుము వసూలు చేయకూడదని, మండలాల్లో 5 రూపాయలు, డివిజన్ కేంద్రాల్లో 10 రూపాయలు రుసుముగా నిర్దేశించింది.
* దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజల నుంచి రుసుము వసూలు చేయకూడని సమాచార హక్కు చట్టమే పేర్కొంటుంది.
* కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ఆన్‌లైన్ దరఖాస్తు పోర్టల్ ను 2013, ఆగస్ట్ 21న ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా 82 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు సమాచారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

కేంద్ర సమాచార కమిషన్

* సమాచార హక్కు చట్టంలోని అధికార విధులను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ను ఏర్పాటు చేసింది.
* కేంద్ర సమాచార కమిషన్‌లో ఒక ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లు ఉంటారు.
* ప్రధానమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ చేసిన సిఫారసుల మేరకు సమాచార కమిషనర్లను రాష్ట్రపతి నియమిస్తారు.
* న్యూదిల్లీ కేంద్రంగా కేంద్ర సమాచార కమిషన్ స్వతంత్రంగా పని చేస్తుంది. కేంద్ర సమాచార కమిషన్ పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు ప్రధాన సమాచార కమిషనర్ నియంత్రణలో ఉంటాయి.
* ప్రధాన, ఇతర సమాచార కమిషన్లర్ల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు. వీరు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* సమాచార కమిషన్ జీతభత్యాలు, సర్వీసు నియమాలు కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమానంగా ఉంటాయి. (రూ.90,000)
* ప్రధాన, ఇతర సమాచార కమిషనర్లను సుప్రీంకోర్టు విచారణ అనంతరం రాష్ట్రపతి తొలగిస్తారు.

కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్లు

క్రమ సంఖ్య

ప్రధాన సమాచార కమిషనర్ పేరు

పదవీకాలం

1.

వజాహత్ హబీబుల్లా

2005 - 2010

2.

ఎ.ఎన్. తివారి

2010 - 2010

3.

సత్యానంద మిశ్రా

2010 - 2013

4.

దీపక్ సంధు

2013 - 2013

5.

సుష్మాసింగ్

2013 - 2014

6.

రాజీవ్ మాథూర్

2014 - 2014

7.

విజయ్ శర్మ

2014 - 2015

8.

ఆర్.కె. మాథూర్

2016 - ప్రస్తుతం

* రాజకీయ పార్టీలు కేంద్రం నుంచి పరోక్షంగా నిధుల పొందడంతో పాటు ప్రజావిధుల్లో పాల్గొనడం వల్ల అవి ప్రజాసంస్థల కిందకే వస్తాయని, 2013, జూన్ 3న కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేస్తూ, జాతీయ రాజకీయ పార్టీలు 6 వారాల్లోగా సమాచార అధికారులను, అప్పిలేట్ యంత్రాంగాలను ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951 కింద నమోదైన రాజకీయ పార్టీలను ప్రజా సంస్థలుగా పేర్కొనరాదని ఒక బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాయి.

విజిల్‌బ్లోయర్స్ రక్షణ చట్టం-2014
* ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరే వ్యక్తులకు బెదిరింపులు, వేధింపులు ఎదురవడంతో వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఆర్‌టీఐ కార్యకర్తల పరిరక్షణ బిల్లు (విజిల్‌బ్లోయర్స్)ను తీసుకువచ్చింది. ఈ బిల్లును రాష్ట్రపతి 2014, మే 9న ఆమోదించడంతో 2014, మే 12న ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు.
 

ముఖ్యాంశాలు
* ఆర్‌టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించడం.
* ఆర్‌టీఐ కార్యకర్తల గోప్యతను నిర్లక్ష్యంగా లేదా ఉద్దేశ పూర్వకంగా బయటపెట్టే అధికారులకు 3 సంవత్సరాల జైలుశిక్ష /రూ.50,000 జరిమానా విధించడం.
* అవినీతి అధికారుల వివరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం.

 

సమాచార హక్కు అమలవుతున్న రాష్ట్రాలు

* తమిళనాడు-1993
* గోవా-1997
* కర్ణాటక-2000
* రాజస్థాన్-2000
* దిల్లీ-2001

* మహారాష్ట్ర, అసోం-2002
* కేరళ, ఆంధ్రప్రదేశ్, హరియాణా-2005
* గత 8 ఏళ్ల కాలంలో రాష్ట్ర సమాచార కమిషనర్లకు కేవలం 14.5% మాత్రమే జరిమానా విధించారు.
* సమాచార హక్కు చట్టంపై కేవలం 23% మందికి మాత్రమే అవగాహనఉందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది.
* సమాచార హక్కు చట్టం, 2005 ప్రకారం సమాచార కమిషన్‌లను ఏర్పాటు చేసే అధికారం కేంద్రపాలిత ప్రాంతాలకు లేదు.
* కేంద్రపాలిత ప్రాంతాల్లోని సమాచారాన్ని పొందాలనుకునేవారు కాంపిటెంట్ అథారిటీ అంటే సంబంధిత కేంద్రపాలిత ప్రాంత పాలకుడి లేదా లెఫ్టినెంట్ గవర్నర్‌ను సంబోధిస్తూ సమాచారాన్ని కోరాలి.

 

రాష్ట్ర సమాచార కమిషన్

* సమాచార హక్కు చట్టం-2005లో పొందుపరచిన అధికార విధులను అమలు చేయడానికి సమాచార హక్కు చట్టం (2005)లోని సెక్షన్ 15(1) ప్రకారం రాష్ట్రస్థాయిలో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సమాచార కమిషన్ ను ఏర్పాటు చేయాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో 2005, అక్టోబరు 13న రాష్ట్ర సమాచార కమిషన్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర సమాచార కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్, 10 మందికి మించకుండా ఇతర సమాచార కమిషనర్లను గవర్నర్ నియమిస్తారు.

* ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్‌ల పదవీకాలం 5 సంవత్సరాలు లేదా వారికి 65 ఏళ్లు వచ్చే వరకు (ఈ రెండింటిలో ఏది ముందయితే అది వర్తిస్తుంది).
* వీరు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు.
* రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీతభత్యాలకు సమానంగా ఉంటాయి.
* రాష్ట్ర ప్రధాన, ఇతర సమాచార కమిషనర్‌లను గవర్నర్ తొలగిస్తారు.
* సమాచార హక్కు చట్టం అమలు తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తుంది.
* జిల్లాల్లో సమాచార హక్కు చట్టం సక్రమంగా అమలయ్యేలా చూసేందుకు జిల్లా కలెక్టర్ సమన్వయ అధికారిగా, రెవెన్యూ అధికారి నోడల్ అధికారిగా ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు.
* ఇద్దరు సమాచార హక్కు కార్యకర్తలను కలెక్టర్ సభ్యులుగా నియమిస్తారు. జిల్లా స్థాయి కమిటీ 3 నెలలకు ఒకసారి సమావేశమై చట్టం అమలు తీరును పరిశీలిస్తుంది.

కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్‌లు - నివేదికలు

* కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషన్‌లు అన్ని సంస్థల నుంచి నివేదికలను తీసుకుని వార్షిక నివేదికలను రూపొందిస్తాయి.
* కేంద్ర సమాచార కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర సమాచార కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి తమ వార్షిక నివేదికలను పంపిస్తాయి.
* కేంద్ర ప్రభుత్వం తన వార్షిక నివేదికను పార్లమెంటుకు, రాష్ట్ర ప్రభుత్వం తన వార్షిక నివేదికను శాసన సభకు సమర్పిస్తాయి.
* సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రభుత్వ సంస్థ ఈ 17 అంశాలు ప్రచురించి నోటీసు బోర్డులో పెట్టాలి. 

అవి:
1. తమ సంస్థ అధికార విధులు
2. తమ సంస్థలో పనిచేసే సిబ్బంది అధికార విధులు
3. నిర్ణయాలు ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నారు. పర్యవేక్షణ, జవాబుదారీతనానికి సంబంధించిన వివరాలు
4. తమ సంస్థ రూపొందించుకున్న నియమాలు
5. ఉద్యోగులు తమ విధి నిర్వహణలో ఉపయోగించుకునే నిబంధనలు, ఆదేశాలు, రికార్డులు.
6. తమ సంస్థ ఆధీనంలో ఉండే వివిధ రకాల డాక్యుమెంట్ల వర్గీకరణకు సంబంధించిన వివరాలు
7. సంస్థ విధివిధానాలను రూపొందించేటప్పుడు, వాటిని అమలు పరిచేటప్పుడు పౌరులను సంప్రదించేందుకు లేదా పౌరులు పాల్గొనేందుకు ఉన్న ఏర్పాట్లు

8. సంస్థల్లో ఏర్పాటు చేసిన బోర్డులు, కౌన్సిళ్లు, కమిటీల వివరాలు
9. తమ సంస్థలోని అధికారులు, సిబ్బంది వివరాలు
10. తమ సంస్థలో పనిచేసే అధికారులకు, సిబ్బందికి చెల్లించే వేతన వివరాలు
11. తమ సంస్థలోని ఒక్కో విభాగానికి కేటాయించిన బడ్జెట్, ప్రణాళికల వివరాలు, లబ్ధిదారులకు చెల్లించిన వివరాలు
12. సంస్థలో సబ్సిడీతో కూడిన కార్యక్రమాల అమలు విధానం, వాటి లబ్ధిదారుల వివరాలు
13. తమ సంస్థ నుంచి రాయితీలను లేదా అనుమతులను పొందిన వారి వివరాలు
14. తమ సంస్థలో ఎలక్ట్రానిక్ రూపంలో అందుబాటులో ఉన్న సమాచార వివరాలు
15. సమాచారం పొందే పౌరులకు కల్పించిన సౌకర్యాలు
16. తమ సంస్థలోని అధికారుల పేర్లు, వారి హోదా తదితర వివరాలు
17. ఇతర సమాచార వివరాలు లేదా నివేదికలు

 

* పాలనాయంత్రాంగం, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించడానికి, పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడానికి ఏర్పరిచిన సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో ఉండే ఒక ఆయుధమని పేర్కొనవచ్చు.
* కేంద్ర సమాచార కమిషన్లు, రాష్ట్ర సమాచార కమిషన్ల నియామకాలకు సంబంధించిన సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 14 , 15లను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.
* ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ప్రధాన సమాచార కమిషనర్ చరణ్‌దాస్ అర్హ.

* ఆంధ్రప్రదేశ్‌కు రెండో ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్ హుస్సేన్.
* National Campaign for Peoples Right to Information (NCPRI), United Forum Right to Information (UFRTI)ల సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సీబీఐ, ఏసీబీ, ఇంటలిజెన్స్‌తో సహా అన్ని ప్రభుత్వ విభాగాల్లోనూ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయాలని రామన్‌మెగసెసె అవార్డ్ గ్రహీత అరుణారాయ్ డిమాండ్ చేశారు.
* ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించే బోర్డు సభ్యుల పేర్లు, చిరునామాలను సమాచార హక్కు చట్టం ప్రకారం వెల్లడించడం కుదరదని, ఇంటర్వ్యూ చేసిన వారి పేర్లను వెల్లడించడం వల్ల వారి భద్రతకు నష్టం వాటిల్లే అవకాశముందని బిహార్‌లో సీఐడీకి చెందిన పోలీసు ఉద్యోగాల ఇంటర్వ్యూ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

 

లోక్‌పాల్, లోకాయుక్త

* ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి పదవుల్లో ఉన్నవారి పైన వచ్చిన అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, అక్రమాలపై విచారించే స్వతంత్ర న్యాయాధికార వ్యవస్థను 1809లో స్వీడన్‌లో అంబుడ్స్‌మన్ పేరుతో ఏర్పాటు చేశారు. అంబుడ్స్‌మన్ అనగా ప్రజల న్యాయవాది అని అర్థం.
* మనదేశంలో అత్యున్నత స్థాయి వ్యక్తుల అవినీతి చర్యలను విచారించేందుకు లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 1959లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి సి.డి. దేశ్‌ముఖ్ ప్రతిపాదించారు.

* పార్లమెంటు సభ్యుడు లక్ష్మీమాల్ సింఘ్వి 1963లో లోక్‌పాల్ అనే పదానికి రూపకల్పన చేశారు.
* 1966లో మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పడిన మొదటి పరిపాలనా సంస్కరణల కమిటీ లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
* లోక్ అనగా ప్రజలు, పాల్ అనగా సంరక్షకుడు అని అర్థం.
* 1968లో ఇందిరా గాంధీ ప్రభుత్వం మొదటిసారిగా లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభ పరిశీలనలో ఉండగా లోక్‌సభ రద్దు కావడంతో, బిల్లు కూడా రద్దు అయింది.
* లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో 8 సార్లు ప్రవేశపెట్టారు.
* 2013లో పార్లమెంటు లోక్‌పాల్ బిల్లును ఆమోదించింది. 2014, జనవరి 1న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో 2014, జనవరి 16 నుంచి లోక్‌పాల్, లోకాయుక్త చట్టాలుగా అమల్లోకి వచ్చాయి.
* కేంద్రంలో ఉన్నత స్థాయిలో జరిగే అవినీతి అక్రమాలను విచారించడానికి చట్టబద్ధత కలిగిన వ్యవస్థను లోక్‌పాల్ గాను, రాష్ట్రాల్లో అవినీతిని విచారించడానికి ఏర్పడిన వ్యవస్థను లోకాయుక్త గాను పేర్కొన్నారు.

 

లోక్‌పాల్ - నిర్మాణం

* 'లోక్‌పాల్‌'లో ఒక ఛైర్మన్, 8 మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం మంది జ్యూడీషియల్ సభ్యులు కాగా, మిగిలిన సగం మంది పరిపాలన, అవినీతి నిర్మూలన, వివిధ రంగాల్లో నిష్ణాతులై ఉంటారు. మొత్తం సభ్యుల్లో సగం మంది సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళావర్గానికి చెందినవారై ఉండాలి.

నియామకం
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యులను రాష్ట్రపతి తన రాజముద్రతో స్వయంగా సంతకం చేసిన పత్రం ద్వారా నియమిస్తారు.
* ప్రధాని నాయకత్వంలో ఉన్న సెలక్షన్ కమిటీ సిఫారసుల మేరకు ఈ నియామకం ఉంటుంది. ఈ కమిటీలో లోక్‌సభ స్పీకర్, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా అతడు సిఫారసు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఒక నిష్ణాతుడైన వ్యక్తి సభ్యులుగా ఉంటారు.

 

ఛైర్మన్, సభ్యుల అర్హతలు
* లోక్‌పాల్ ఛైర్మన్‌గా నియమితులయ్యే వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి లేదా నిష్ణాతుడైన వ్యక్తి అయిఉండాలి.
* జ్యూడిషీయల్ మొంబర్లుగా నియమితులయ్యే వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కానీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కానీ పనిచేసి ఉండాలి.
* నాన్ జ్యూడిషీయల్ సభ్యులుగా నియమితులయ్యే వారు పరిపాలన, అవినీతి నిర్మూలన మొదలైన అంశాల్లో సుదీర్ఘ అనుభవం కలిగి ఉండాలి.

 

పదవీకాలం
* లోక్‌పాల్ ఛైర్మన్, సభ్యుల పదవీకాలం 5 ఏళ్లు లేదా వారికి 70 సంవత్సరాలు వచ్చే వరకు(ఈ రెండింటిలో ఏది ముందైతే అది వర్తిస్తుంది).

* పదవీ విరమణ అనంతరం 5 సంవత్సరాల వరకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదు.
* ఛైర్మన్, సభ్యులు తమ రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి. వీరిని సరైన ప్రవర్తన లేని కారణంగా సుప్రీంకోర్టు సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.
* లోక్‌పాల్ ఛైర్మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, సభ్యులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.
* లోక్‌పాల్ వ్యవస్థ తన వార్షిక నివేదికను రాష్ట్రపతికి సమర్పించగా, రాష్ట్రపతి ఆ నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు.
* 7 సంవత్సరాలు దాటిన ఫిర్యాదులను లోక్‌పాల్ విచారణకు స్వీకరించదు. దీనికి సివిల్‌కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.

 

లోక్‌పాల్ అధికారాలు, విధులు

* లోక్‌పాల్‌కు స్వతంత్రంగా ఒక విచారణ, ప్రాసిక్యూషన్ విభాగం ఉంటుంది.
* ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై అవినీతి ఆరోపణలను విచారించే అధికారం లోక్‌పాల్‌కు ఉంటుంది.
* జాతీయ భద్రతా, ప్రజా భద్రతా అంశాలకు సంబంధించి ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలు దీని పరిధిలోకి రావు.

* కేంద్ర విజిలెన్స్ కమిషన్ విచారించిన అంశాలను, తీసుకున్న చర్యల గురించి లోక్‌పాల్‌కు తెలియజేయాలి.
* దేశంలో ఉన్న ఇతర విచారణ సంస్థలు, సీబీఐ లోక్‌పాల్ పరిపాలనా నియంత్రణలోకి వస్తాయి.
* ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తుల ఆస్తులను స్వాధీనపరచుకునే అధికారం, వారిని సస్పెండ్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసే అధికారం ఉంది.
* ప్రాసిక్యూట్ చేయడానికి పూర్వ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
* ఫిర్యాదులపై ఆరు నెలల్లోగా విచారణ ముగించాలి.
* అధికార దుర్వినియోగానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార వ్యవస్థకు సిఫారసులు చేస్తుంది.
* విదేశాల నుంచి డోనేషన్లు తీసుకునే స్వచ్ఛంద సంస్థలు కూడా లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి.
* లోక్‌పాల్ కేసుల విచారణ కోసం ఎటువంటి డాక్యుమెంటునైనా, అఫిడవిట్లనైనా పరిశీలించే అధికారాన్ని కలిగి ఉంది. దర్యాప్తును 60 రోజుల్లో, విచారణను ఆరు నెలల్లో ముగించాలి. విచారణను దర్యాప్తు నుంచి మినహాయించాలి.
* న్యాయ వ్యవస్థపై విచారణ చేసే అధికారం లోక్‌పాల్‌కు ఉండదు.
* సీబీఐని స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థగా మార్చాలని 1998లో వినీత్ నారాయణ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
* ప్రధానమంత్రి అవినీతి ఆరోపణలకు సంబంధించి లోక్‌పాల్ విచారణ చేయాల్సి వస్తే ఛైర్మన్‌తో సహా సభ్యులందరూ విచారణను ప్రారంభించేందుకు అనుమతించాలి. మొత్తం సభ్యుల్లో 3/4వ వంతు సభ్యులు విచారణను జరిపేందుకు ఆమోదించాలి.

* ప్రధానమంత్రిపై చేసే అవినీతి ఆరోపణలు అంతర్జాతీయ సంబంధాలు, ప్రజాశ్రేయస్సు, అణుశక్తి, అంతరిక్ష రంగానికి సంబంధించినవై ఉండకూడదు.
* అన్నాహజారే నేతృత్వంలో పౌరసమాజం 'జన్‌లోక్‌పాల్' సాధన కోసం విశేషకృషి జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో విజయం సాధించలేదు.

 

లోకాయుక్త

* రాష్ట్రస్థాయిలోని అత్యున్నత వ్యక్తులపై వచ్చిన అవినీతి, అక్రమాలను విచారించే స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉన్న వ్యవస్థను లోకాయుక్త అంటారు. మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* ప్రస్తుతం మన దేశంలో 19 రాష్ట్రాల్లో లోకాయుక్త వ్యవస్థను ఏర్పాటు చేశారు.
* మన దేశంలో మొదటిసారిగా ఒడిశా రాష్ట్రంలో 1970లో లోకాయుక్త చట్టాన్ని రూపొందించినప్పటికీ అది 1983లో అముల్లోకి వచ్చింది.
* కానీ 1971లో మహారాష్ట్ర దేశంలోనే ప్రథమంగా లోకాయుక్త చట్టాన్ని అమలు చేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో లోకాయుక్త చట్టం 1983, సెప్టెంబరు 23 నుంచి అమల్లోకి వచ్చింది.

నియామకం - పదవీకాలం
* హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిని లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తిని లోకాయుక్త గా గవర్నర్ నియమిస్తారు.
* ముఖ్యమంత్రి నాయకత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్ లోకాయుక్తను నియమించి ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పంపిన 5 మంది జిల్లా న్యాయమూర్తుల్లో ఒకరిని ఉపలోకాయుక్తగా గవర్నర్ నియమిస్తారు.
* వీరి పదవీకాలం 5 ఏళ్లు. తిరిగి ఈ పదవులు పొందడానికి అనర్హులు.
* లోకాయుక్తకు సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు ఉంటాయి.
* లోకాయుక్తలో పాలనాధిపతి రిజిస్ట్రార్, ప్రత్యేక ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాలో విచారణ సంచాలకుడు ఉంటారు. ఇతనికి సహాయకులుగా నలుగురు ఉపసంచాలకులు, ముగ్గురు విచారణాధికారులు ఉంటారు.
* రాష్ట్ర శాసనసభ ప్రత్యేక మెజార్టీ తీర్మానం మేరకు అక్రమ ప్రవర్తన, అసమర్దత అనే కారణాలపై గవర్నర్ లోకాయుక్త, ఉపలోకాయుక్తను తొలగిస్తారు.
* లోకాయుక్తకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమానంగా, ఉపలోకాయుక్తకు హైకోర్టు సాధారణ న్యాయమూర్తితో సమానంగా జీతభత్యాలు ఉంటాయి.

* లోకాయుక్త, ఉపలోకాయుక్తలు తమ రాజీనామాను గవర్నర్‌కు సమర్పిస్తారు. లోకాయుక్త పరిధిలోకి వచ్చే అంశాలు
* ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి కార్యకలాపాలు.
* ప్రభుత్వ అధికార దుర్వినియోగం.
* గవర్నర్ ఆదేశాల మేరకు విచారణను జరపడం
* బాధితులు ఎవరైనా తమ అభియోగాలను దీని దృష్టికి తీసుకురావచ్చు. దరఖాస్తుతో పాటు రూ.150 డి.డి.ని జతపరచాలి.
* 6 సంవత్సరాలలోపు జరిగిన సంఘటనలను మాత్రమే ఫిర్యాదులుగా స్వీకరిస్తుంది.
* ప్రస్తుత, మాజీ మంత్రులు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మున్సిపాలిటీల ఛైర్మన్లు, స్థానిక సంస్థల నిర్వహణ అధ్యక్షులు, సంచాలకులు, సహకార సంఘాల అధ్యక్షులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతి, రిజిస్ట్రార్, ప్రభుత్వోద్యోగులు దీని పరిధిలోకి వస్తారు.
* లోకాయుక్త ఫిర్యాదులను విచారించి, నివేదికను తయారు చేసి, నిందితుడు పనిచేసే శాఖాధికారికి తగిన సిఫారసులు చేస్తుంది.
* ఈ సిఫారసులపై సంబంధిత అధికారి 3 నెలల్లోగా చర్యలు తీసుకుని ఆ సమాచారాన్ని లోకాయుక్తకు తెలియజేయాలి.
* లోకాయుక్త ఫిర్యాదులపై ప్రాథమిక విచారణను రహస్యంగా చేయాలి.

లోకాయుక్త విచారణ పరిధిలోకి రాని అంశాలు

* హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులు, జ్యూడిషీయల్ సర్వీసుకు చెందిన ఇతర ప్రముఖులు.
* ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్
* పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్, సభ్యులు
* పరిపాలనా ట్రైబ్యునల్ ఛైర్మన్, సభ్యులు
* శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్
* కేంద్ర, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు
* లోకాయుక్త ఫిర్యాదు అందిన రోజు నుంచి ఒక సంవత్సరం లోపల విచారణను పూర్తి చేయాల్సి ఉంటుంది.
* ఆంధ్రప్రదేశ్‌కు లోకాయుక్తగా జస్టిస్ బి. సుభాషణ్‌రెడ్డి 2012, అక్టోబరు 12న నియమితులయ్యారు.
* లోకాయుక్త నియామకంలో మంత్రిమండలి సలహాను గవర్నర్ పాటించాలని గుజరాత్ లోకాయుక్త జస్టిస్ ఏ.ఆర్.మెహతాను గవర్నరైన కమలా బేణీవాల్ నియమించిన వివాదంలో సుప్రీంకోర్టు పేర్కొంది.
* ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో లోకాయుక్తను లోక్‌పాల్‌గా పిలుస్తారు.
* చత్తీస్‌ఘడ్‌లో లోకాయుక్తను 'లోక్ ఆయోగ్‌'గా పిలుస్తారు.

రచయిత: బంగారు సత్యన్నారాయణ

Posted Date : 05-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌