• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర శాసనసభ

విధాన నిర్ణయాల విశిష్ట వేదిక!

  ఒక శాసనం ప్రజల అవసరాలను ప్రతిబింబిచాలి. సంక్షేమాన్ని కాంక్షించాలి. అందుకోసం ఎన్నో సమాలోచనలు సాగాలి. చర్చలు జరగాలి. అందరి అభిప్రాయాలు వ్యక్తం కావాలి. సమతౌల్యత సాధించాలి. అంతిమంగా అత్యుత్తమైన నిర్ణయం వెలువడాలి. ఈ ప్రక్రియకు జాతీయస్థాయిలో పార్లమెంటు, రాష్ట్రంలో శాసనసభ ఉన్నాయి. రాష్ట్రస్థాయిలో ప్రధానంగా విధానసభ అలాంటి విధాన నిర్ణయాలకు విశిష్ట వేదికగా నిలిచింది. ఆ అత్యున్నత సభ నిర్మాణం, సభ్యుల ఎన్నిక, ఇతర రాజ్యాంగపరమైన అంశాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. 

రాష్ట్రస్థాయిలో రాష్ట్రానికి అవసరమైన శాసనాలను రూపొందించే అత్యున్నత వ్యవస్థ శాసన సభ. ఇది రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ, ప్రజాస్వామ్య విధానాలకు ప్రాతిపదికగా నిలుస్తుంది.

రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్‌ 168 నుంచి 212 మధ్య రాష్ట్ర శాసనసభ నిర్మాణం, అధికారాలు, విధులు, సభ్యుల ఎన్నిక, అర్హతలు, అనర్హతల గురించి పేర్కొన్నారు.

ఆర్టికల్‌ 168: ప్రతి రాష్ట్రానికి ఒక శాసన సభ ఉంటుంది. అదే రెండు సభలు ఉన్నప్పుడు గవర్నర్‌ + విధాన సభ + విధాన పరిషత్‌గానూ, ఒకే సభ ఉన్నప్పుడు గవర్నర్‌ + విధానసభగానూ ఉంటుంది. గవర్నర్‌ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా కొనసాగుతారు. కానీ శాసన సభలో సభ్యత్వం ఉండదు.

విధానసభ

దీన్ని దిగువసభ, ప్రజాప్రతినిధుల సభ, శాసనసభ, అనిశ్చితసభగా పేర్కొంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 విధానసభ గురించి వివరిస్తుంది.

* 1950 నాటి భారత ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రాష్ట్ర విధానసభలో ఉండాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 60. గరిష్ఠ ఎమ్మెల్యేల సంఖ్య 500.

* జనాభా తక్కువ ఉన్న చిన్న రాష్ట్రాల్లో కనీస ఎమ్మెల్యేల సంఖ్య విషయంలో మినహాయింపు ఉంది.

ఉదా: సిక్కిం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 32. గోవా విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40. మిజోరం విధాన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 40.

* రాష్ట్ర విధానసభ సభ్యుల సంఖ్య (ఎమ్మెల్యేలు) సంబంధిత రాష్ట్ర జనాభా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది.

* ప్రస్తుతం మనదేశంలో విధానసభల సభ్యుల సంఖ్యను 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం 84వ రాజ్యాంగ సవరణ చట్టం, 2001 ద్వారా నిర్ణయించింది.

* ‘ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014’లోని సెక్షన్‌ 26 ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌ విధానసభలో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యేల సంఖ్యను 225కి, తెలంగాణ విధానసభలో ఇప్పుడు ఉన్న 119 ఎమ్మెల్యేల సంఖ్యను 153కి పెంచే అవకాశం కల్పించారు. కానీ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేదు.

* ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 175. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 29 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 7 స్థానాలు రిజర్వు చేశారు.

* ప్రస్తుతం తెలంగాణ విధానసభలోని ఎమ్మెల్యేల సంఖ్య 119. ఇందులో ఎస్సీ వర్గాల వారికి 19 స్థానాలు, ఎస్టీ వర్గాలకు 12 స్థానాలు రిజర్వు చేశారు.

సభ్యుల అర్హతలు: రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 173 రాష్ట్ర విధానసభ/శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలను పేర్కొంటుంది. అవి 

* భారతీయ పౌరుడై ఉండాలి.

* 25 ఏళ్లు నిండి ఉండాలి.

* లాభసాటి ప్రభుత్వ పదవిలో ఉండకూడదు.

* కాలానుగుణంగా పార్లమెంటు చేసే చట్టాలకు అనుగుణమైన అర్హతలు కలిగి ఉండాలి.

* సభ్యులు దివాలా తీసినట్లుగా న్యాయస్థానం ప్రకటించి ఉండకూడదు.

* మానసిక వైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ జరిగి ఉండకూడదు.

ఎన్నికల ప్రక్రియ: ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎన్నికలు, రాజకీయ పార్టీలు అత్యంత కీలకమైనవి. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని విధాన సభలకు కేంద్ర ఎన్నికల సంఘం స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల్లో అనేక రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి నిలబెడతాయి. ఏ రాజకీయ పక్షానికి చెందనివారు కూడా ‘స్వతంత్ర అభ్యర్థులు’గా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.

ఎలక్షన్‌ మేనిఫెస్టో: ఎన్నికల్లో రాజకీయ పక్షాలు తమ ఎన్నికల ప్రణాళిక పత్రాన్ని (ఎలక్షన్‌ మేనిఫెస్టో) ప్రకటిస్తాయి. ఈ మేనిఫెస్టోలో తాము ఎన్నికైతే ఎలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులో చేపడతారో, ఏయే వాగ్దానాలను నెరవేరుస్తారో తమ నియోజక వర్గ ప్రజలకు తెలియజేస్తూ హామీ ఇస్తారు. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకునేందుకు ‘ఎలక్షన్‌ మేనిఫెస్టో’ దోహదం చేస్తుంది.

పోలింగ్‌ నిర్వహణ: ఎన్నికల రోజు ప్రజలు ఒకరి తర్వాత మరొకరు ఓటు వేస్తారు. పోలింగ్‌ బూత్‌ అధికారి (ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ - పీఓ) ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తారు. సాధారణంగా ఓటర్లందరికీ ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డులు జారీ చేస్తుంది. ఓటు హక్కును ఓటర్లు రహస్యంగా వినియోగించుకోవాలి

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌

కంట్రోల్‌ యూనిట్‌: కంట్రోల్‌ యూనిట్‌లో ప్రిసైడింగ్‌ అధికారి బ్యాలట్‌ బటన్‌ నొక్కగానే ఓటు వేసేందుకు ఈవీఎమ్‌ సిద్ధంగా ఉంటుంది. బ్యాలట్‌ యూనిట్‌లో ఓటరు ఓటు వేయగానే కంట్రోల్‌ యూనిట్‌పై ఉన్న బల్బు ఆగిపోయి, అదే సమయంలో ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి, ఓటు నమోదవుతుంది.

బ్యాలట్‌ యూనిట్‌: ఇది మూడు విధాలుగా ఉంటుంది.

ఎ) యంత్రం మీద ‘ఆకుపచ్చ రంగు బల్బు’ వెలుగుతున్నట్లయితే ఓటు వినియోగించుకోవడానికి ఈవీఎం సిద్ధమని అర్థం.

బి) ఓటరు అభ్యర్థి గుర్తుకి ఎదురుగా ఉన్న ‘నీలం రంగు బటన్‌’ను గట్టిగా నొక్కాలి.

సి) నీలం రంగు బటన్‌ను నొక్కగానే దానికి ఎదురుగా ఉన్న ‘ఎరుపు రంగు బల్బు బటన్‌’ వెలిగి, ‘బీప్‌’ అనే శబ్దం వచ్చి ఓటు నమోదవుతుంది.

ప్రమాణ స్వీకారం: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 188 పేర్కొంటుంది. వీరు గవర్నర్‌ సమక్షంలో లేదా గవర్నర్‌ నియమించిన వ్యక్తి సమక్షంలో రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్‌లో ఉదహరించిన విధంగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

ప్రొటెం స్పీకర్‌: విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలలో అత్యంత సీనియర్‌ను ‘ప్రొటెం స్పీకర్‌’గా గవర్నర్‌ నియమిస్తారు. ఆ వ్యక్తి గవర్నర్‌ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.  మిగిలిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రొటెం స్పీకర్‌ సమక్షంలో జరుగుతుంది.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌: * విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమర్థంగా నిర్వహించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 178 ప్రకారం స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ ఉంటారు. విధానసభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తప్పనిసరిగా విధానసభలో సభ్యులై ఉండాలి.

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ స్పీకర్‌ - తమ్మినేని సీతారాం

* ఆంధ్రప్రదేశ్‌ విధానసభ డిప్యూటీ స్పీకర్‌ - కోలగట్ల వీరభద్రస్వామి

* హైదరాబాద్‌ రాష్ట్ర విధానసభకు తొలి, చివరి స్పీకర్‌ - కాశీనాథ్‌రావు వైద్య

* మన దేశంలో విధానసభకు స్పీకర్‌గా వ్యవహరించిన తొలి మహిళ - షాణోదేవి (హరియాణా)

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ తొలగింపు: * రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 179 స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల తొలగింపు ప్రక్రియను వివరిస్తుంది.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించే తీర్మానాన్ని ఎమ్మెల్యేలు 14 రోజుల ముందస్తు నోటీసుతో విధాన సభలో ప్రవేశపెడతారు. విధాన సభ సభ్యులు (ఎమ్మెల్యేలు) సాధారణ మెజారిటీతో ఒక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లను తొలగించవచ్చు.

* స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ విధానసభ/ శాసనసభలో సభ్యత్వం కోల్పోతే పదవులను కూడా కోల్పోతారు.

* స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

* విధానసభ స్పీకర్‌పైన గానీ, డిప్యూటీ స్పీకర్‌పైనగానీ తొలగింపు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ఎవరిపై తీర్మానం ప్రవేశపెడతారో వారు సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు. అవిశ్వాస తీర్మానంపై/ తొలగింపు తీర్మానంపై చర్చ జరిగే సమయంలో వీరు విధానసభ సమావేశాలకు హాజరుకావచ్చు. చర్చలో పాల్గొనవచ్చు. సాధారణ సభ్యుల్లా సభలో ఓటు హక్కును కూడా వినియోగించుకోవచ్చు.

సభలో సభ్యత్వం కోల్పోవడం

ఆర్టికల్‌ 191(1) ప్రకారం కింది సందర్భాల్లో శాసన సభ్యులు తమ పదవిని కోల్పోతారు. 

* విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ స్పీకర్‌కు రాజీనామా పత్రాన్ని సమర్పించిన తర్వాత స్పీకర్‌ దాన్ని ఆమోదించినప్పుడు.

నోట్‌: విధానసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పంపిన రాజీనామా పత్రాన్ని సంబంధిత వ్యక్తి స్వచ్ఛందంగా రాసింది కాదని, విశ్వసించదగినది కాదని స్పీకర్‌ భావిస్తే అలాంటి రాజీనామాను ఆమోదించరు. ఈ నియమాన్ని 33వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు.

* పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం విధానసభ సభ్యులు పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ధ్రువీకరణ జరిగితే స్పీకర్‌ వారిని అనర్హులుగా ప్రకటిస్తారు.

* విధానసభ సభ్యులు ఎవరైనా సభాధ్యక్షుడి అనుమతి లేకుండా వరుసగా 60 రోజులపాటు సభా సమావేశాలకు గైర్హాజరైతే వారు పదవి కోల్పోతారు.

* ఆర్టికల్‌ 190 ప్రకారం ఒక వ్యక్తి ఒకే సమయంలో విధానసభలో ఎమ్మెల్యేగా, విధాన పరిషత్తులో ఎమ్మెల్సీగా ఉండకూడదు. అంటే ద్వంద్వ సభ్యత్వానికి అనుమతి లేదు.

* ఆర్టికల్‌ 193 ప్రకారం చట్టసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా సభా సమావేశాల్లో పాల్గొనడం, ఓటు వేయడం నిషేధం. ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే వారికి సభలో ఎన్ని రోజులు ప్రవేశించారో అన్నిరోజులకు రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.

స్పీకర్‌ అధికారాలు - విధులు

* విధాన సభ సమావేశాలకు అధ్యక్షత వహించి, సమావేశాలను సమర్థంగా నిర్వహించడం.

* సభా నియమాలను ఉల్లంఘించిన సభ్యులను శిక్షించడం.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడే సభ్యుల అనర్హతలను ప్రకటించడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా ఒక బిల్లు ఆర్థిక బిల్లా? కాదా? అని ధ్రువీకరించడం.

* అర్థన్యాయాధికారాలను కలిగి ఉండటం.

* సభా వ్యవహారాల కమిటీ, రూల్స్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించడం.

* సభా కార్యక్రమాల నిర్వహణ, వాయిదా వేయడం.

* సభలో ప్రవేశపెట్టిన ఏదైనా బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించినప్పుడు బిల్లుకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాన ఓట్లు వచ్చినప్పుడు అధ్యక్ష స్థానంలో ఉన్న స్పీకర్‌ తన నిర్ణాయక ఓటు/ కాస్టింగ్‌ ఓటు/ కొసరు ఓటును వినియోగించి బిల్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

* విధానసభ సభ్యులకు రక్షణ కల్పించడం. విధాన సభ్యులను పోలీసులు అరెస్టు చేయాలంటే ముందుగా స్పీకర్‌ నుంచి అనుమతి పొందాలి.

* సభా సమావేశాల నిర్వహణకు ఉండాల్సిన ‘కోరం’ను స్పీకర్‌ ధ్రువీకరిస్తారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా విధానసభల్లో ఎమ్మెల్యేల సంఖ్య 


1. ఉత్తర్‌ప్రదేశ్‌ - 403 


2. పశ్చిమ బెంగాల్‌ - 294


3. మహారాష్ట్ర - 288


4. బిహార్‌ - 243


5. తమిళనాడు - 234


6. మధ్యప్రదేశ్‌ - 230


7. కర్ణాటక - 224


8. రాజస్థాన్‌ - 200


9. గుజరాత్‌ - 182


10. ఆంధ్రప్రదేశ్‌ - 175


11. ఒడిశా - 147


12. కేరళ - 140


13. అస్సాం - 126


14. తెలంగాణ - 119


15. పంజాబ్‌ - 117


16. హరియాణా - 90


17. ఛత్తీస్‌గఢ్‌ - 90


18. ఝార్ఖండ్‌ - 81


19. ఉత్తరాఖండ్‌ - 70


20. హిమాచల్‌ప్రదేశ్‌ - 68


21. మేఘాలయ - 60


22. మణిపుర్‌ - 60


23. నాగాలాండ్‌ - 60


24. అరుణాచల్‌ ప్రదేశ్‌ - 60


25. త్రిపుర - 60


26. గోవా - 40


27. మిజోరం - 40


28. సిక్కిం - 32

కేంద్రపాలిత ప్రాంతాలు


1. దిల్లీ- 70


2. పుదుచ్చేరి - 30


3. జమ్ము-కశ్మీర్‌ - 83


 రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 03-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌