• facebook
  • whatsapp
  • telegram

 మానవ భూగోళశాస్త్ర స్వభావం

పరిసరాలతో మానవ బంధం! 

 



 

మనుషుల సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వ్యవహారాలు పర్యావరణంపై ప్రభావాన్ని చూపుతుంటాయి. పట్టణాల్లో జనాభా పెరిగిపోయి వనరులు, భూ వినియోగానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతుంటాయి. వలసలు, వాతావరణ మార్పులు, పట్టణీకరణల వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ప్రజల నమ్మకాలు, వారు సృష్టించిన ప్రదేశాలతో అనుబంధాల వల్ల కొన్నిసార్లు స్పర్థలు ఏర్పడుతుంటాయి. మానవ చర్యలతో సుస్థిరాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు విఘాతాలు కలుగుతుంటాయి. వీటన్నింటినీ అర్థం చేసుకోవడానికి, సరైన పరిష్కార మార్గాలను అన్వేషించడానికి మానవ భూగోళశాస్త్రం ఉపయోగపడుతుంది. జనాభా, సంస్కృతులు, ఆర్థిక వ్యవస్థలు, సామాజిక ప్రవర్తనల సహా మానవ కార్యకలాపాల ప్రాదేశిక పంపిణీ, నమూనాలను వివరించేదే మానవ భూగోళశాస్త్రం. భౌతిక భూగోళ శాస్త్రంలో భాగమైన ఈ శాస్త్రం గురించి పోటీ పరీక్షార్థులు ప్రాథమిక అవగాహనను పెంపొందించుకోవాలి.

మానవ భూగోళశాస్త్రాన్ని నిర్వచించాలంటే ముందుగా సాధారణ భూగోళశాస్త్రం గురించి తెలుసుకోవాలి. ఒక శాస్త్ర విభాగాన్ని నిర్వచించడం చాలా కష్టమైన పని. దానికి కారణం అన్ని శాస్త్ర విభాగాలకు విషయపరంగా ఉన్న గమనశీల స్వభావమే. దాంతోపాటు వివిధ సమయాల్లో శాస్త్రజ్ఞులు అనుసరించిన అధ్యయన పద్ధతులు, విధానాలు భిన్నంగా ఉండటం. మానవ భూగోళ శాస్త్రం విషయంలో ఈ నిర్వచన ప్రక్రియ మరింత కష్టం.ఎందుకంటే విజ్ఞానాన్ని మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న ప్రాథమిక ప్రత్యేకతల ఆధారంగా మానవ సంబంధ (సామాజిక, సాంఘిక శాస్త్రాలు), ప్రకృతి సంబంధ (ప్రకృతి శాస్త్రాలుగా) సంప్రదాయక వ్యవస్థీకరణ లక్షణాల పద్ధతిలో వివిధ ప్రత్యేక శాస్త్ర విభాగాలుగా చేసినప్పుడు అందులో భూగోళశాస్త్రం స్థానం అస్పష్టంగా ఉండిపోయింది.

విజ్ఞాన వ్యవస్థలో మానవ భూగోళశాస్త్రం స్థానం: సంప్రదాయ విజ్ఞాన వ్యవస్థలో మానవ భూగోళశాస్త్రానికి అస్పష్ట స్థానమే ఉంది. ఇది పూర్తిగా సామాజిక శాస్త్రం కాదు, అలా అని మొత్తం ప్రకృతి శాస్త్రం కూడా కాదు. అలాంటి విభజన జరగక ముందే దీని మేధో మూలాలు ఒక విలక్షణమైన విభాగంగా అధ్యయనం చేసే పద్ధతిని సూచిస్తున్నాయి. మానవ భూగోళశాస్త్రం విశ్వవిద్యాలయ విభాగం ఆలస్యంగా ఏర్పడింది. 1870 నాటికి జర్మనీ భాష మాట్లాడే దేశాల్లో ఈ శాస్త్రానికి ప్రత్యేక విభాగాలు ఉద్భవించాయి. కానీ ఇంగ్లండ్, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాత్రం 20వ శతాబ్దం వరకు అది జరగలేదు. అప్పటికే అధికారిక అధ్యాపక సంస్థల్లో సామాజిక, సాంఘిక శాస్త్రాలను ఒక వైపు, ప్రకృతి శాస్త్రాన్ని మరొక వైపు స్పష్టంగా విభజించారు. దీంతో ఆచరణలో మానవ భూగోళశాస్త్రాన్ని అప్పటికే ఏర్పడిన విజ్ఞాన క్రమంలో అమర్చాల్సి వచ్చింది. కొన్నిసార్లు దీన్ని ప్రకృతి శాస్త్రాల విభాగంలో, మరికొన్ని సార్లు సాంఘిక శాస్త్ర విభాగంలో, ఇంకొన్నిసార్లు ఈ రెండింటి మధ్య విభజించారు. దీని పర్యవసానం భూగోళశాస్త్రాన్ని రెండు భాగాలుగా విభజించగలిగే శక్తిమంతమైన బాహ్య శక్తులు (దాంతోపాటు అంతర్గత తర్కం) ఉన్నాయి. అవి 

1) సహజ ప్రపంచానికి చెందిన భూగోళ శాస్త్రమైన భౌతిక భూగోళశాస్త్రం 

2) మానవ నిర్మిత ప్రపంచ భూగోళ శాస్త్రమైన మానవ భూగోళ శాస్త్రం. కొన్ని విశ్వవిద్యాలయాల్లో భౌతిక భూగోళశాస్త్రం, మానవ భూగోళశాస్త్రం సూక్ష్మమైన పరస్పర సంబంధాలతో విడిగా ఏర్పడ్డాయి.

నిర్వచనం, పరిధి: భూగోళశాస్త్రం పదం  'Geography' అనే ఆంగ్ల పదానికి అనువాదం. Geo (భూమి), Graphos (వివరించడం) అనే రెండు గ్రీకు పదాల నుంచి ఇది వచ్చింది. భూవిజ్ఞాన శాస్త్రం, మృత్తికా శాస్త్రం, వృక్ష శాస్త్రం, జంతుశాస్త్రం, వాతావరణ శాస్త్రం లాంటి అనేక విభాగాలు భూమి గురించి వివరిస్తాయి. కానీ మానవ భూగోళశాస్త్రం అనేది భూశాస్త్రాల సంకలనం కాదు. ప్రతి భౌతిక, జీవ, సామాజిక శాస్త్రాలకు వాటి సొంత తత్వం, పద్ధతి, పరిధి ఉంటాయి. ఉదాహరణకు ఆర్థికశాస్త్రం ప్రధానంగా వస్తువుల ఉత్పత్తి, రవాణా, వినియోగం సేవలకు సంబంధించిన వ్యవహారాలను అధ్యయనం చేస్తుంది. భూగర్భశాస్త్రం భూ పటలం కూర్పు, అంతర్భాగం గురించి; జనాభా శాస్త్రం మానవ జనాభా లక్షణాలకు సంబంధించి; వృక్ష, జంతుశాస్త్రాలు మొక్కలు, జంతువుల గురించి అధ్యయనం చేస్తాయి. అదేవిధంగా మానవ భూగోళ శాస్త్రం కనిపించే, కనిపించని సహజసిద్ధమైన మానవ నిర్మిత దృగ్విషయాలను పరిశీలిస్తుంది.

వ్యవస్థాగత శాస్త్రాలకు (ఆర్థిక, సామాజిక, జీవ, భూగర్భ శాస్త్రాలు), మానవ భూగోళ శాస్త్రానికి మధ్య దృక్కోణ తేడా ఉంటుంది. ఆ విభాగాలకు చెందిన ప్రతి విద్యార్థి వాస్తవంగా ఒక నిర్దిష్టమైన దృగ్విషయ అధ్యయనాన్ని ఎంచుకోవాలి. భూగోళ శాస్త్రవేత్తలు ప్రజలు, పరిశ్రమలు, నగరాలు, వాతావరణం లాంటి వాటిని విడివిడిగా అధ్యయనం చేయడమే కాకుండా ఒక ప్రదేశ ప్రత్యేకతను నిర్దిష్టంగా అధ్యయనం చేయాలి. దానికి మానవ భూగోళ శాస్త్రజ్ఞులు సమీకృత క్రియాత్మక విధానాన్ని అనుసరిస్తారు.

ప్రదేశాల వాస్తవికతను అర్థం చేసుకోవడానికి చిన్న భాగాలుగా విభజితమైన పరిజ్ఞానాన్ని క్రమమైన మార్గంలో ఒక చోటకు చేర్చాల్సిన అవసరం ఉందని మానవ భూగోళ శాస్త్రవేత్తల భావన. దేని గురించి అధ్యయనం చేశామనేది కాకుండా ఏ విధంగా అధ్యయనం చేశామనేదే ఈ శాస్త్రం ముఖ్య లక్షణం.

* మానవ భూగోళ శాస్త్రవేత్తకు ప్రధానంగా ఒక ప్రాంతానికి, మరొక ప్రాంతానికి మధ్య వైవిధ్యాలు (ప్రాదేశిక విశ్లేషణ), ప్రాదేశిక సంబంధాలను అర్థం చేసుకోవడం (పర్యావరణ విశ్లేషణ), ప్రాంతీయ భేదాన్ని (ప్రాంతీయ సంయోజనం) గుర్తించే పనులతో సంబంధం ఉంటుంది.

భౌతిక, మానవ దృగ్విషయం భూమిపైన ఏకరీతిలో ఉంటే మానవ భూగోళశాస్త్రం అవసరమే ఉండదు. ఏదైనా దృగ్విషయం ప్రాంతాల వారీగా విభిన్నంగా ఉండటాన్ని ప్రాదేశిక చలరాశిగా పేర్కొంటారు. మానవ భూగోళశాస్త్రానికి సంబంధించిన అంశంగా పరిగణిస్తారు. దాని పరిధి విస్తారమైనది. శాస్త్రజ్ఞులందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో మానవ భూగోళశాస్త్రానికి సంపూర్ణ, సాధారణమైన నిర్వచనాన్ని సూత్రీకరించడం అసాధ్యం. ఈ శాస్త్రానికి ఇప్పటివరకు ఉన్న నిర్వచనాల్లో రిచర్డ్‌ హార్ట్‌ షర్న్‌ ‘పర్‌స్పెక్టివ్స్‌ ఆన్‌ నేచర్‌ ఆఫ్‌ జాగ్రఫీ’ (1959) గ్రంథంలో ఇచ్చిన నిర్వచనం బాగా ప్రాచుర్యం పొందింది.

‘‘భూమి ఉపరితల అస్థిర స్వభావానికి కచ్చితమైన, క్రమబద్ధమైన, హేతుబద్ధమైన వర్ణన, వివరణ ఇవ్వడమే మానవ భూగోళశాస్త్రం పని’’.

అధ్యయన పద్ధతులు:

మానవ భూగోళశాస్త్రం Vs భౌతిక భూగోళశాస్త్రం: మానవ భూగోళ శాస్త్రం భౌతిక, సామాన్య శాస్త్రాల సమ్మేళనం. భౌతిక అంశాల (నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, మృత్తికలు, పరీవాహం) అధ్యయనంపై భూగోళశాస్త్రం దృష్టి సారిస్తే దాన్ని భౌతిక భూగోళశాస్త్రం అంటారు. అలాగే సాంస్కృతిక అంశాలపై (భాష, సామాజిక ఆచారాలు, మానవ వృత్తులు) అధ్యయనం చేసేటప్పుడు సాంఘిక శాస్త్రంగా వ్యవహరిస్తారు. ఈ శాస్త్ర విలక్షణ లక్షణాల్లో ఒకటి ప్రాదేశిక రీతులను వివరించడం. దీనికి భౌతిక, భూగోళశాస్త్ర భావనలు సహాయపడతాయి. భౌతిక, మానవ భూగోళ శాస్త్రాల మధ్య ఉన్న వ్యత్యాసం సంపూర్ణ విభజనను కాకుండా, విషయానికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది.

అంశాలవారీ పద్ధతి Vs ప్రాంతీయ అధ్యయన విధానాలు: అంశాలవారీ పద్ధతిలో భౌతిక విషయాలు (నైసర్గిక స్వరూపం, శీతోష్ణస్థితి, జలావరణం) లేదా సాంస్కృతిక విషయాలను (జనాభా, జనావాసాలు, మానవ వృత్తులు) ఎంపిక చేస్తారు. వీటికి సంబంధించిన వివిధ కోణాలు, ప్రాదేశిక వైవిధ్యాల్లో దాగి ఉన్న ప్రక్రియలు, వాటి సంబంధాల గురించి పరిశీలిస్తాయి. ప్రాంతీయ పద్ధతిలో మానవ భూగోళ శాస్త్రవేత్తలు భూమి ఒక భాగాన్ని (ఉదా: ఒక ఖండం, నదీ హరివాణం, తీరమైదానం, పర్వత వ్యవస్థ వంటి భౌతిక ఏకాంకం, ఒక దేశం, రాష్ట్రం, జిల్లా లాంటి పరిపాలనా విభాగం) ఎంచుకొని భౌగోళిక కోణంలో దాని భౌతిక, సాంస్కృతిక అంశాలను అధ్యయనం చేస్తారు.

వర్ణనాత్మక పద్ధతి Vs సిద్ధాంతపరమైన పద్ధతి: ప్రాంతీయ, అంశాలవారీ విధానాల్లో మానవ భూగోళశాస్త్రవేత్తలు వర్ణనాత్మక లేదా సిద్ధాంతపరమైన పద్ధతిని ఎంచుకోవచ్చు. వర్ణనాత్మక పద్ధతి భూఉపరితలంపైన ఉండే ఒక ముఖ్యమైన ప్రదేశం గురించి వివిధ వివరాల సేకరణపై దృష్టిసారిస్తుంది. కార్యకలాపాల విస్తరణను వివరించడానికి భూగోళ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మూల సిద్ధాంతాలను (ఉదా: పలకల విరూపకారకాల సిద్ధాంతం, పరిశ్రమ స్థల నిర్ణయ సిద్ధాంతం), శాస్త్రీయ పద్ధతులను (ఉదా: జనాభా ప్రక్షేపణలు, జనావాసాల పరిమాణం, విస్తరణ) గుర్తించడానికి సిద్ధాంతపర పద్ధతి ప్రాధాన్యం ఇస్తుంది. రెండు విధానాల్లోనూ అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి.



రచయిత: జయకర్‌ సక్కరి


 

Posted Date : 11-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌