• facebook
  • whatsapp
  • telegram

ప్రపంచం-ఖండాలు-విశిష్టతలు

అక్కడ దేశాలు లేవు.. శాశ్వత నివాసాలు లేవు!


 

ఆసియా ప్రకాశవంతమైన ఖండం. అత్యంత, అత్యల్ప ఎత్తయిన ప్రదేశాలు ఇక్కడే ఉన్నాయి. ఆఫ్రికా మీదుగా మూడు అక్షాంశ రేఖలు వెళుతున్నాయి. ఉత్తర అమెరికానుÅ ఆసియా నుంచి బేరింగ్‌ జలసంధి వేరు చేస్తోంది. భూమికి ఊపిరితిత్తులు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. అంటార్కిటికాలో దేశాలు లేవు, శాశ్వత మానవ నివాసాలు లేవు. మరో రెండు ఖండాల్లోనే అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇవన్నీ పరీక్షల కోణంలో ముఖ్యమైనవే. అందుకే ప్రతి ఖండం ఉనికి, విస్తరణ, దేశాల రాజకీయ సరిహద్దులతో పాటు భౌగోళికంగా ఆసక్తికరమైన అంశాలను అభ్యర్థులు తెలుసుకోవాలి.

ప్రపంచంలో ఏడు ఖండాలు ఉన్నాయి. అవి ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ (ఐరోపా), ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. భూమిపై 71% నీరు ఆవరించగా, మిగిలిన 29% భూభాగాన్ని ఈ ఖండాలు ఆక్రమించాయి.

1) ఆసియా: విస్తీర్ణం, జనాభా పరంగా అతిపెద్ద ఖండం ఆసియా. ఇందులో 48 దేశాలున్నాయి. ప్రపంచ జనాభాలో 60% జనాభా ఇక్కడే ఉంది.

విస్తీర్ణం: 4,45,79,000 చ.కి.మీ.

హద్దులు: తూర్పున పసిఫిక్‌ మహాసముద్రం, ఉత్తరాన ఆర్కిటిక్‌ మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన యూరప్‌ ఖండం ఉన్నాయి.

ప్రత్యేకతలు: ఆసియాను ఐరోపా నుంచి యూరల్‌ పర్వతాలు, ఆఫ్రికా నుంచి సీనాయి ద్వీపకల్పం, ఎర్రసముద్రం వేరుచేస్తున్నాయి. ప్రపంచంలోనే ఎత్తయిన హిమాలయ పర్వత శ్రేణులు ఈ ఖండంలో ఉన్నాయి. అత్యధిక జనాభా ఉన్న రెండు దేశాలతో పాటు మరెన్నో విశిష్టతలకు ఆసియా నిలయం.
* ఆసియాను ప్రపంచంలో ప్రకాశవంతమైన, అత్యంత వైవిధ్యమైన, విభిన్నమైన భాగంగా పరిగణిస్తారు. ప్రపంచంలోని శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థలున్న ఈ ఖండాన్ని ఆరు ప్రధాన భాగాలుగా విభజించారు. అవి ఉత్తర (పూర్వ రష్యాలో భాగమైన దేశాలు), మధ్య, తూర్పు, పశ్చిమ, దక్షిణాసియా, ఆగ్నేయాసియా భాగాలు.

* కర్కటరేఖ ఈ ఖండంలోని 8 దేశాల మీదుగా వెళుతుంది. అవి మయన్మార్, ఒమన్, బంగ్లాదేశ్, భారతదేశం, సౌదీ అరేబియా, చైనా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), తైవాన్‌.

* యూఏఈలోని దుబాయ్‌లో ఉన్న ‘బుర్జ్‌ ఖలీఫా’ ప్రపంచంలోనే ఎత్తయిన భవనం.

* ఆసియాలో భూమిపై అతి ఎత్తయిన, అత్యల్ప ఎత్తయిన ప్రదేశాలున్నాయి. అవి ఎవరెస్ట్‌ (నేపాల్‌), మృతసముద్రం (జోర్డాన్, ఇజ్రాయెల్‌ మధ్య).

* రష్యా, తుర్కియే దేశాలు పాక్షికంగా ఐరోపాలోనూ ఉన్నాయి. రష్యా అతిపెద్ద దేశం. భూగోళంలో దాదాపు 11% భూభాగం ఈ దేశానిదే.

* ప్రపంచంలో ఉత్పత్తయ్యే బియ్యంలో దాదాపు 90% ఆసియా దేశాల్లోనే వినియోగిస్తున్నారు. 

* ఇండొనేసియా అత్యధిక సంఖ్యలో క్రియాశీలక అగ్నిపర్వతాలు (దాదాపు 150) ఉన్న దేశం.

* చైనాలోని యాంగ్జీ ప్రపంచంలో మూడో పొడవైన నది.

* ఆసియాలో అతిపెద్ద నగరం టోక్యో (జపాన్‌). అతిచిన్న దేశం మాల్దీవులు.
* ఈ ఖండంలో అత్యధికంగా 2,300 భాషలు మాట్లాడుతున్నారు. ఇది అత్యధికంగా బిలియనీర్లు ఉన్న ఖండం.

* జపాన్‌లో ఆయుర్దాయం ప్రపంచంలోనే అత్యధికం (84.2 సంవత్సరాలు).

* ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ (182 మీ.)

* ప్రపంచంలో అతి పొడవైన రైల్వే ప్లాట్‌ఫారం గోరఖ్‌పుర్‌ రైల్వేస్టేషన్‌.

* ప్రపంచంలో అతి పొడవైన ఆనకట్ట త్రీగోర్జెస్‌.

2) ఆఫ్రికా: జనాభా, విస్తీర్ణం పరంగా రెండో అతిపెద్ద ఖండం. ప్రపంచ జనాభాలో 16% జనాభా ఉంది. విస్తీర్ణం 3,03,70,000 చ.కి.మీ.

హద్దులు: ఈ ఖండానికి పడమర అట్లాంటిక్‌ మహాసముద్రం, ఉత్తరాన మధ్యదరా సముద్రం, తూర్పున ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రం; దక్షిణాన అట్లాంటిక్, హిందూ మహాసముద్రం ఉన్నాయి. ఇందులో 54 దేశాలున్నాయి. 48 దేశాలు ఆఫ్రికా ప్రధాన భూభాగాన్ని పంచుకుంటున్నాయి. ఆరు ద్వీప దేశాలను ఖండంలో భాగంగా పరిగణిస్తారు. మరో రెండు వివాదస్పద ప్రాంతాలు ఉన్నాయి. ఆఫ్రికాలో అతిపెద్ద దేశం అల్జీరియా, అతిచిన్న దేశం సీషెల్స్‌. ఖండాంతర ఆఫ్రికాలో గాంబియాను అతిచిన్న దేశంగా పరిగణిస్తారు. అతిపెద్ద నగరం కైరో. అల్జీరియా తర్వాత అతిపెద్ద దేశాలు కాంగో, సూడాన్‌. ఈ ఖండంలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. తలసరి ఆదాయం పరంగా ఆఫ్రికాలో అత్యంత సంపన్న దేశం సీషెల్స్‌. జీడీపీ పరంగా అత్యంత సంపన్న దేశం నైజీరియా. ఆఫ్రికాలోని ఈజిప్టును మిషోర్‌ అని పిలుస్తారు (మిస్ర్, మిసర్, మసర్‌).

ప్రత్యేకతలు: ఈ ఖండం మీదుగా మూడు అక్షాంశాలు వెళుతున్నాయి. అవి భూమధ్యరేఖ, కర్కటరేఖ, మకరరేఖ.


3) ఉత్తర అమెరికా: విస్తీర్ణపరంగా మూడో అతిపెద్ద ఖండం. జనాభా పరంగా నాలుగో పెద్ద ఖండం. పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో ఉంది. దీనిలో 23 దేశాలున్నాయి. విస్తీర్ణం 2,47,09,000 చ.కి.మీ.

హద్దులు: ఉత్తరాన ఆర్కిటిక్‌ మహాసముద్రం, తూర్పున అట్లాంటిక్‌ మహాసముద్రం, పడమర పసిఫిక్‌ మహాసముద్రం, దక్షిణాన దక్షిణ అమెరికా ఉన్నాయి.

ప్రత్యేకతలు: సన్నని, ఇరుకైన ఇస్తమస్‌ ఆఫ్‌ పనామా ఈ ఖండాన్ని దక్షిణ అమెరికాతో కలుపుతుంది. బేరింగ్‌ జలసంధి ఆసియా నుంచి వేరుచేస్తుంది.

4) దక్షిణ అమెరికా: విస్తీర్ణపరంగా నాలుగో పెద్ద ఖండం. జనాభాపరంగా అయిదోది. దీనిలో 12 దేశాలున్నాయి. ఈ ఖండం విస్తీర్ణంలో అధిక భాగం దక్షిణార్ధ గోళంలో, కొంత భాగం పశ్చిమార్ధ గోళంలో ఉంది. విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ.

హద్దులు: తూర్పున అట్లాంటిక్‌ మహాసముద్రం, పడమర పసిఫిక్‌ మహాసముద్రం, దక్షిణాన అంటార్కిటిక్‌ మహాసముద్రం, ఉత్తరాన ఉత్తర అమెరికా ఉన్నాయి.

ప్రత్యేకతలు: ఈ ఖండం అమెజాన్‌ అడవులకు నిలయం. వీటిని భూమికి ఊపిరితిత్తులుగా అభివర్ణిస్తారు.


5) అంటార్కిటికా: విస్తీర్ణ పరంగా అయిదో పెద్ద ఖండం. శాశ్వత మానవ నివాసం, దేశాలు లేని ఖండం. అయినప్పటికీ ఇక్కడ శాస్త్రజ్ఞులు, సిబ్బంది వంతులవారీ పద్ధతిలో శాశ్వతంగా నివసిస్తున్నారు.

విస్తీర్ణం: 14,200,000 చ.కి.మీ.

హద్దులు: ఇది పూర్తిగా అంటార్కిటికా మహాసముద్రంతో ఆవరించి ఉంది.

6) యూరప్‌/ఐరోపా: విస్తీర్ణంలో ఆరో పెద్ద ఖండం. జనాభా పరంగా మూడోది. భౌగోళికంగా కలిసి ఉన్న ఐరోపా, ఆసియాను కొన్ని సమయాల్లో యురేషియాగా పిలుస్తారు. కానీ సాంస్కృతిక, భాషా భేదాల వల్ల ఇవి రెండు ప్రత్యేక ఖండాలుగా ఉన్నాయి. ఐరోపా ఖండంలో 50 దేశాలున్నాయి. అయితే రాజధానులు 44 మాత్రమే ఉన్నాయి.

హద్దులు: ఉత్తరాన ఆర్కిటిక్‌ మహాసముద్రం, పడమర అట్లాంటిక్‌ మహాసముద్రం, ఆగ్నేయాన కాస్పియన్‌ సముద్రం, దక్షిణాన మధ్యధరా సముద్రం, నల్ల సముద్రం; తూర్పున యూరల్, కాకసస్‌ పర్వతాలు ఉన్నాయి. విస్తీర్ణం 1,05,30,000 చ.కి.మీ. ఇది ఆస్ట్రేలియా తర్వాత రెôడో చిన్నఖండం.


7) ఆస్ట్రేలియా: అతిచిన్న ఖండం. ప్రపంచంలో చదునైన, రెండో పొడి ఖండం. (అంటార్కిటికా తర్వాత). జనాభా పరంగా రెండో చిన్న ఖండం. (అంటార్కిటికా తర్వాత). ఈ ఖండంలో 14 దేశాలున్నాయి. విస్తీర్ణం 85,25,989 చ.కి.మీ.

ప్రత్యేకతలు: దీన్ని ‘ఓషియానియా’గా పిలుస్తారు. ఎందుకంటే ఖండం పేరే దేశం పేరుగా ఉంటుంది. అంటార్కిటికా ఖండం నుంచి ఇది 60 మిలియన్‌ సంవత్సరాల కిందట విడిపోయింది.

*ప్రస్తుతం ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి గుర్తింపు పొందిన దేశాలు 193 ఉన్నాయి. గుర్తింపు పొందని, పరిశీలక హోదాలో మరో రెండు దేశాలున్నాయి. అవి 1) వాటికన్‌ సిటీ.  2) పాలస్తీనా. 

*మొత్తంగా ఆఫ్రికా నుంచి 54, ఆసియా 48, ఐరోపా 44, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌ దేశాలు 33, ఓషియానియా 14, ఉత్తర అమెరికా దేశాలు 2 ఉన్నాయి.

రచయిత: సక్కరి జయకర్‌

Posted Date : 08-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌