• facebook
  • whatsapp
  • telegram

ఆస్ట్రేలియా ఖండం


మకరరేఖ మధ్యలో కంగారూల ఖండం!

భూగోళం దక్షిణ భాగంలో ఒక మూలన విడిగా, వైశాల్యంలో పెద్దగా ఉంటుంది ఆస్ట్రేలియా. ఖండం అంతా ఒకే దేశంగా ఉన్నది ఇదొక్కటే. భూభాగంలో ఎక్కువశాతం ఎడారిగా, విపరీతమైన శీతోష్ణ పరిస్థితులతో ఉన్నప్పటికీ విశాలమైన గడ్డిభూములు, విస్తృతంగా ఖనిజ వనరులతో అభివృద్ధిలో ముందుంది. పంటల కంటే పశుపోషణకే ప్రాధాన్యం. జనాభా అంతా తీర నగరాల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది. భౌగోళిక విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రమే నివసించే, కనిపించే జంతువులు, పక్షులతోనే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. ఈ ఖండం నైసర్గిక స్వరూప స్వభావాలు, వాతావరణం, జనాభా వైవిధ్యం గురించి ప్రాథమిక సమాచారాన్ని పరీక్షార్థులు తెలుసుకోవాలి.

ఆస్ట్రేలియా ఒక ద్వీపఖండం. అన్ని ఖండాల్లోకి ఇదే చిన్నది. ప్రపంచంలో ఆరో అతిపెద్ద దేశం. 1788లో జేమ్స్‌ కుక్‌ దీన్ని కనుక్కున్నారు. ఆస్ట్రేలియాను ఒక ద్వీపంగా పరిగణిస్తే ప్రపంచంలోనే పెద్దది అవుతుంది.


ఉనికి: ఇది దక్షిణార్ధ గోళంలో ఉంది. 10ా41× - 39ా08× దక్షిణ అక్షాంశాలు, 113ా09×- 153ా35× తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కలిపి ‘ఓషియన్‌’గా పిలుస్తారు. మకరరేఖ ఆస్ట్రేలియాను రెండు భాగాలుగా విభజిస్తుంది.


వైశాల్యం: దాదాపు 7.7 మిలియన్‌ చ.కి.మీ. మేర విస్తరించింది. ఆస్ట్రేలియాకు దక్షిణంగా అందులోనే భాగమైన ‘టాస్మానియా ద్వీపం’ ఉంది. ఈ రెండింటికి మధ్య ‘బాస్‌ జలసంధి’ ఉంది. ఆస్ట్రేలియాలో 8 రాజకీయ విభాగాలున్నాయి. వీటిలో ఏడు రాష్ట్రాలు కాగా, ఒకటి రాజధాని నగర ప్రాంతం. అవి న్యూ సౌత్‌ వేల్స్, ఉత్తర ప్రాంతాలు, క్వీన్స్‌లాండ్, దక్షిణ ఆస్ట్రేలియా, టాస్మానియా, విక్టోరియా, పశ్చిమ ఆస్ట్రేలియా, బ్రెస్‌బేన్‌.


* ప్రపంచంలో అతిపొడవైన (1920 కి.మీ.) ప్రవాళ అవరోధ భిత్తిక ‘గ్రేట్‌ బేరియర్‌ రీఫ్‌’ ఆస్ట్రేలియాకు తూర్పు తీరాన ఉంది.


* ఆస్ట్రేలియాను మూడు నిర్దిష్ట భౌతిక ప్రాంతాలుగా విభజించవచ్చు. 

1) తూర్పు ఉన్నత ప్రాంతం 

2) మధ్య మైదాన ప్రాంతం 

3) పశ్చిమ పీఠభూమి ప్రాంతం


తూర్పు ఉన్నత ప్రాంతం: ఈ ప్రాంతంలో ‘గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌’ అనే పర్వతశ్రేణి ఉంది. ఇక్కడ అతి ఎత్తయిన కోషియాస్కో శిఖరం 2,229 మీ. ఎత్తులో ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలో ‘ఆస్ట్రేలియా ఆల్ఫ్స్‌’గా ప్రాచుర్యంలో ఉన్న ‘గ్రేట్‌ డివైడింగ్‌ రేంజ్‌’లో ఉంది. ఇక్కడి నుంచి ముర్రే నది (2,500 కి.మీ. పొడవు) పశ్చిమంగా ప్రవహించి అడిలైడ్‌ నగరానికి సమీపంలో దక్షిణ మహాసముద్రంలో కలుస్తుంది. ముర్రే ఉపనదులు ముర్రం బిడ్జ్, లాచియన్, డార్లింగ్‌.


మధ్య మైదాన ప్రాంతం: ఈ మైదాన ప్రాంతంలో స్వల్ప వర్షపాతం సంభవిస్తుంది. దీన్ని ‘వర్షచ్ఛాయ ప్రాంతం’ అంటారు. ఈ ప్రాంతంలో ‘ఐర్‌’ (15 మీటర్లు), ‘టోరెన్స్‌’ అనే రెండు ఉప్పునీటి సరస్సులు సముద్రమట్టం కంటే దిగువన ఉన్నాయి.


పశ్చిమ పీఠభూమి ప్రాంతం: ఇది వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉండటంతో చాలా భాగం ఎడారిగా ఉంటుంది. 


శీతోష్ణస్థితి: మకరరేఖకు ఇరువైపులా ఆస్ట్రేలియా విస్తరించి ఉండటంతో ఈ ఖండంలో నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు వేసవి కాలం; మే నుంచి అక్టోబరు వరకు శీతాకాలం ఉంటాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు జనవరిలో, అత్యల్పంగా జులైలో నమోదవుతాయి. దక్షిణాన సమశీతోష్ణస్థితి, ఉత్తరాన ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంది. శీతాకాలంలో తీరప్రాంతాల కంటే ఖండాంతర్గత ఎడారి ప్రాంతంలో చలి ఎక్కువ.

* పశ్చిమ సమశీతోష్ణ మండల గడ్డి మైదానాలను ‘డౌన్స్‌’ అంటారు. విశాలమైన ఆస్ట్రేలియా భూస్వరూపం వల్ల నీటిపారుదల వసతులు ఉండవు. అందుకే ఇక్కడ ‘విస్తృత వ్యవసాయం’ అమలులో ఉంది. కేవలం 6.88% భూభాగం మాత్రమే పంట సాగు కింద ఉంది. పశుపోషణకు ప్రాధాన్యం ఎక్కువ.

* గోధుమ, బార్లీ, మొక్కజొన్న, నూనెగింజలు, కాఫీ, పొగాకు, వరి ప్రధాన పంటలు. గోధుమ ఎగుమతి చేసే దేశాల్లో ఆస్ట్రేలియా 4వ స్థానంలో ఉంది.

* ఉన్ని ఉత్పత్తి, ఎగుమతిలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచం మొత్తం మీద మూడో వంతు ఉన్నిని ఆస్ట్రేలియా ఉత్పత్తి చేస్తోంది. మెరీనా జాతి గొర్రెల నుంచి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. దేశంలోని మొత్తం గొర్రెల్లో సగానికి పైగా న్యూసౌత్‌ వేల్స్‌ రాష్ట్రంలో ఉన్నాయి. సిడ్నీ, మెల్‌బోర్న్‌ నగరాలు ప్రధాన ఉన్ని మార్కెట్‌ కేంద్రాలు.

* ఆస్ట్రేలియా ప్రధాన ఎగుమతుల్లో ఉన్ని, గోధుమ తర్వాత స్థానం మాంసానిదే.

* మధ్య మైదాన ప్రాంతంలో పశువుల మందలను ‘రాంచ్‌’లలో పెంచుతుంటారు. 

* ఆస్ట్రేలియా తూర్పు, ఈశాన్య ప్రాంతంలో సతత హరితారణ్యాలు ఉన్నాయి.

* యూకలిప్టస్‌ జాతికి చెందిన 500 రకాల వృక్షాలున్నాయి.

* ఇక్కడి అడవుల్లో జర్రా, కర్రి, వాటిల్‌ లాంటి గట్టి కలపనిచ్చే వృక్షాలు ఉంటాయి.

* ‘టాస్మానియా’ ప్రాంతంలోనూ అడవులు విస్తరించాయి.

* ఆస్ట్రేలియాలో తృణ భూముల్లో ఉష్ణమండల తృణ భూములు (సవన్నాలు), ఉప ఉష్ణమండల తృణ భూములు (డౌన్‌లు) అని రెండు రకాలు ఉన్నాయి. ఈ గడ్డిభూములు పశుగ్రాసంగా ఉపయోగపడుతున్నాయి.



వన్యమృగాలు: ఇక్కడి అరణ్యాల్లో దాదాపు 400 రకాల జంతువులు, 700 రకాల పక్షులున్నాయి. ‘కంగారు’ జంతువు ఇక్కడ మాత్రమే ఉంటుంది. దింగో అనే అడవి కుక్కలు ఉన్నాయి. నీటిలో, భూమిపై సంచరించే ప్లాటిపస్‌ను ఇక్కడ చూడవచ్చు. ఆస్ట్రేలియా పక్షుల్లో ఈము, కూక బుర్రాలైర్‌ ముఖ్యమైనవి. ఈము పెద్దపరిమాణంలో ఉండి ‘ఆస్ట్రిచ్‌’ పక్షిని పోలి ఉంటుంది.


ఖనిజాలు: దేశంలో ప్రధాన ఖనిజం బొగ్గు. బంగారం, వెండి, యురేనియం, వజ్రాలు, నికెల్, చమురు, సహజ వాయువు, ఇనుప ఖనిజం, బాక్సైట్, రాగి, తగరం, సీసం నిక్షేపాలు విస్తారంగా ఉన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియాలో కాల్‌గూర్లీ, కూల్‌గార్డీ, దక్షిణక్రాస్, మార్గరేట్‌ మౌంట్‌లలో పసిడి గనులున్నాయి. క్వీన్స్‌లాండ్‌లోని ‘క్లాంకరీ సమీపంలో, టాస్మానియాలోని మౌంట్‌ లయల్‌ వద్ద రాగి, తగరపు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా సీసం ఉత్పత్తి చేస్తున్న దేశం ఆస్ట్రేలియా. అలాగే యశదపు ఖనిజాన్ని ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఒకటిగా ఉంది.

* మొత్తం కార్మికుల్లో 25% పారిశ్రామిక రంగంలో ఉన్నారు. దేశ ఆదాయంలో 20% పారిశ్రామిక రంగం సమకూరుస్తోంది. ఉన్ని పరిశ్రమ ద్వారా దేశీయాదాయంలో 5% లభిస్తుంది.

* క్వీన్స్‌లాండ్‌ తీరంలో రాక్‌ హంప్టన్, టౌన్స్‌విల్లే రేవు నగరాల్లో ఎగుమతికి వీలుగా మాంసాన్ని డబ్బాల్లో భద్రపరిచే కర్మాగారాలు ఉంటాయి.

* 90% పైగా జనాభా సముద్ర తీరాలకు దగ్గరగా, ఖండపు అంచుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఆస్ట్రేలియా పరిమాణంతో పోలిస్తే నివసించే జనాభా చాలా తక్కువ కావడంతో ‘నిర్జన ఖండం’ అంటారు.


అంకెల్లో ఆస్ట్రేలియా

జనాభా: 2.5 కోట్లు

అక్షరాస్యత: 100%

* జనాభాలో 80% నీరు సమృద్ధిగా దొరికే తూర్పు, ఆగ్నేయ, నైరుతి ఆస్ట్రేలియా ఉపఉష్ణ తీర ప్రాంతాల్లో ఉన్నారు.

* జనాభాలో ఆంగ్లీకన్స్‌ - 26.1%, రోమన్‌ క్యాథలిక్‌లు - 26%, క్రైస్తవులు - 24.3%, క్రైస్తవేతరులు - 11%, ఇతర మతాలవారు - 12.6%.

* 35% భూభాగాన్ని ఎడారిగా వర్గీకరించారు.

* దేశంలో రోడ్డు మార్గం పొడవు - 14 లక్షల కి.మీ; రైలు మార్గం 33,819 కి.మీ; జలమార్గం 8,368 కి.మీ.

* మొత్తం విమానాశ్రయాలు - 421


ముఖ్యాంశాలు

* ఆస్ట్రేలియా అధికారిక పేరు ‘ది కామన్వెల్త్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా’.

* ఆస్ట్రేలియా అంటే అర్థం - దక్షిణ ప్రాంతం (సౌత్‌ లాండ్‌)

* ఆస్ట్రేలియా డే - జనవరి 26

* అడవి కుక్కలను ‘దింగోలు’ అని పిలుస్తారు.

* రాజధాని - కాన్‌బెర్రా

* కరెన్సీ - ఆస్ట్రేలియన్‌ డాలర్‌

* అతిపెద్ద, ఎక్కువ జనాభా ఉన్న నగరం - సిడ్నీ

* ఎత్తయిన పర్వతం - మౌంట్‌ మిక్‌లిన్‌టక్‌ (3,490 మీటర్లు/11,456 అడుగులు)

* ఆస్ట్రేలియాలోని ‘ద గ్రేట్‌ బేరియర్‌ రీఫ్‌’ను 1981లో ప్రపంచ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా యూనిసెఫ్‌ గుర్తించింది.

* కటట్‌జుట జాతీయ పార్కులో ‘ఎయెర్స్‌ రాక్‌’గా పిలిచే అతిపెద్ద ఇసుక దిబ్బ ఉంది. దీన్నే ‘ఉలురు’ అంటారు. 

* ప్రధాన ఎడారులు- గిబ్సన్, విక్టోరియా, గ్రేట్‌సాండీ. అతిపెద్ద ఎడారి - ‘ది గ్రేట్‌ విక్టోరియా’

* ముఖ్యమైన పీఠభూములు- కింబర్లి, పశ్చిమ ఆస్ట్రేలియా పీఠభూములు

* అడిలైడ్‌ టోరెన్స్‌ నదిపై ఉంది.

* ఫ్రిమాంటిల్‌ అనే రేవు నగర ప్రజలను ‘ఫ్రెయో’ అని పిలుస్తారు.


రచయిత: జయకర్‌ సక్కరి
 

Posted Date : 27-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌