• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - నైసర్గిక స్వరూపం

తీరంలో సారం.. పీఠంలో ఖనిజం!


మన చుట్టూ ఉన్న భూమి అనేక రూపాల్లో కనిపిస్తుంటుంది. ప్రతి స్వరూపం దేనికదే ప్రత్యేకం. కొన్ని నేలలు సమతలం, సారవంతమైతే, ఇంకొన్ని నిస్సారంగా, శిలలుగా ఖనిజాలతో కూడి ఉంటాయి. మరికొన్ని పర్వతాలు, కొండలు, సరస్సులుగా ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఇలాంటి భూస్వరూపాల లక్షణాలను, వివరాలను, విశేషాలను అభ్యర్థులు పోటీ పరీక్షల కోణంలో తెలుసుకోవాలి. 


మనం నివసిస్తున్న భూమి సమతలంగా, ఏకరీతిగా ఉండదు. మైదానాలు, పీఠభూములు, కొండలు, పర్వతాలు, లోయలు తదితర ఎన్నో రూపాల్లో కనిపిస్తుంటుంది. ఆ విషయాన్ని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తున్నప్పుడు గమనించవచ్చు. దీనినే నైసర్గిక స్వరూపం అంటారు. క్లుప్తంగా చెప్పాలంటే ‘భూ ఉపరితలం వివిధ రూపాల్లో ఉండటమే నైసర్గిక స్వరూపం’. ఇది మూడు రకాలు 1) పర్వతాలు, కొండలు 2) పీఠభూములు 3) మైదానాలు.


పర్వతాలు, కొండలు: భూ ఉపరితలంపై సహజమైన అత్యధిక ఎత్తు, అధిక వాలుతో, పైభాగంలో చిన్న శిఖరాన్ని కలిగి, కింది భాగం విశాలంగా ఉండి సముద్ర మట్టానికి 900 మీటర్లపైగా ఎత్తున్న స్వరూపాన్ని ‘పర్వతం’ అంటారు. సముద్ర మట్టానికి 900 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్న స్వరూపాన్ని ‘కొండ’ అంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన ప్రాంతాలు అత్యధిక భాగం కొండల వరుసలుగానే ఉన్నాయి.


పీఠభూములు: ఎత్తుగా ఉండి సమతలంగా లేదా స్వల్ప ఎత్తుపల్లాలతో కూడిన బల్ల పరుపు నేలలను పీఠభూములు అంటారు. ఇవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపుల్లో  నిటారుగా ఉండి, సున్నితమైన వాలుతో ఉంటాయి. పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం ఉంటుంది. మన రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి పీఠభూమి లక్షణాలున్నాయి.


మైదానాలు: సముద్ర మట్టానికి గరిష్ఠంగా 200 మీటర్ల ఎత్తులో ఉన్న సమతల విశాల ప్రాంతాలను మైదానాలు అంటారు. ఇవి సారవంతమైన నేలలు, మెరుగైన భూగర్భ జలాలతో పంటలకు అనుకూలంగా ఉంటాయి. జన నివాసానికి యోగ్యంగా ఉండటంతో జనసాంద్రత అధికంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు భాగం అంతా తూర్పు తీర మైదానంలో భాగంగా ఉంది. 


రాష్ట్రాన్ని నైసర్గికంగా మూడు ప్రాంతాలుగా విభజించవచ్చు. 1) తీర మైదానం 2) తూర్పు కనుమలు 3) ఆంధ్రా పీఠభూమి.


తీర మైదానం: ఈ మైదానం తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది. ఉత్తరాన శ్రీకాకుళం నుంచి దక్షిణాన పులికాట్‌ సరస్సు (తిరుపతి జిల్లా) వరకు వ్యాపించి, సముద్ర మట్టానికి 0-150 మీటర్ల ఎత్తులో ఉంది. వెడల్పు గోదావరి, కృష్ణా నదుల మధ్య అధికంగా (160 కి.మీ.), ఉత్తరాన శ్రీకాకుళం, దక్షిణాన తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో తక్కువగానూ ఉంది. వ్యవసాయానికి అత్యంత అనుకూలం. కృష్ణా-గోదావరి నదుల ప్రాంతం ‘దక్షిణ భారత ధాన్యాగారం’గా ప్రసిద్ధి చెందింది.

* ఈ మైదానంలో కృష్ణా, గోదావరి నదుల మధ్యభాగంలో విశాలమైన డెల్టా ఏర్పడింది. ఉత్తరంలో వంశధార నది, దక్షిణం వైపు పెన్నా నది డెల్టాలు ఇరుకుగా ఉంటాయి. కృష్ణా నది వల్ల పల్నాడు, ఎన్‌.టి.ఆర్, గుంటూరు, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో; గోదావరి వల్ల పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో విశాలమైన, సారవంతమైన నేలలు ఏర్పడ్డాయి. ఈ నదీపాయల మధ్య ఉన్న సప్త గోదావరి ప్రాంతమైన ‘కోనసీమ’ చాలా సారవంతమైనది. కృష్ణా నది గర్భంలో ఉన్న ‘దివిసీమ’ కూడా కోనసీమ లాంటిదే.

గోదావరి నదికి ఉత్తరంగా వెళ్లేకొద్దీ సముద్ర తీరానికి దగ్గర్లో తూర్పు కనుమలు లోపలికి చొచ్చుకొచ్చాయి. విజయనగరానికి దక్షిణ దిశ నుంచి విశాఖ ఓడరేవు వరకు యారాడ కొండలు వ్యాపించి ఉన్నాయి. విశాఖ ఓడరేవు దగ్గర ఉన్న డాల్ఫిన్‌ నోస్, యారాడ కొండలకు చివరి భాగం. ఈ డాల్ఫిన్‌ నోస్‌ కొండ వల్లనే విశాఖ ఓడరేవు సముద్ర తరంగాల తాకిడిని తట్టుకొని సహజమైన ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది. విశాఖపట్నం సమీపంలో గంగవరం తీరం వద్ద సముద్ర అలల వల్ల పర్వతాలు, కొండలు క్రమ క్షయానికి గురై స్టాక్స్, స్టంప్స్‌ గుహలు ఏర్పడ్డాయి. రాజమండ్రి సమీపంలోని తీరం స్పిట్‌ (కొడవలి ఆకారంలోని ఇసుకదిబ్బ)కు ప్రసిద్ధి.

తీర మైదానంలో ప్రధానంగా రెండు సరస్సులున్నాయి. అవి 1) కొల్లేరు సరస్సు  2) పులికాట్‌ సరస్సు.


కొల్లేరు సరస్సు: ఇది రాష్ట్రంలో అతి పెద్ద మంచినీటి సరస్సు. కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రాంతం ఈ నదుల నీటితో నిండి కొల్లేరు సరస్సుగా ఏర్పడింది. ఇది ఆక్స్‌-బౌ సరస్సు. ప్రస్తుతం ఏలూరు జిల్లాలో విస్తరించి ఉంది. దీని విస్తీర్ణం 260 చ.కి.మీ. ఇందులో కలిసే నదులు తమ్మిలేరు, బుడమేరు, రామిలేరు. పెలికాన్‌ కొంగలు, సైబీరియన్‌ క్రేన్, స్పాట్‌బిల్డ్‌ పెలికాన్‌లకు నిలయమైన కొల్లేరు ప్రాంతాన్ని 1999లో అభయారణ్యంగా ప్రభుత్వం ప్రకటించింది. రామ్‌సర్‌ ఒప్పందంలో భాగంగా దీన్ని చిత్తడినేలల సంరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. రాష్ట్రంలో ఏకైక చిత్తడి నేలల సంరక్షణ ప్రాంతం కొల్లేరు. కొల్లేరు సరస్సులోని నీటిని బంగాళాఖాతంలోకి చేర్చే నది ఉప్పుటేరు.

పులికాట్‌ సరస్సు: దీని అసలు పేరు ప్రళయ కావేరి. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద ఉప్పునీటి సరస్సు (లాగూన్‌). తిరుపతి జిల్లాలో భాగంగా ఉంది. విస్తీర్ణం 450 చ.కి.మీ. ఏపీలో ఎక్కువగా, తమిళనాడులో తక్కువగా విస్తరించి ఉంది. దీని ముఖద్వారం తమిళనాడు వైపు ఉంది. ఇందులో శ్రీహరికోట, వేనాడు, ఇరకం దీవులు ప్రధానంగా ఉన్నాయి. శ్రీహరికోటలో అంతరిక్ష రాకెట్‌ ప్రయోగ కేంద్రం (షార్‌) ఉంది. ఈ సరస్సు పెలికాన్, ఫ్లెమింగో పక్షులకు సంరక్షణ కేంద్రం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఫ్లెమింగో ఉత్సవాలను నిర్వహిస్తుంది. పులికాట్‌ పక్షుల సంరక్షణ కేంద్రాన్ని 1976లో ఏర్పాటు చేశారు.


బీచ్‌లు: ఆంధ్రా తీరంలో ప్రసిద్ధి చెందిన బీచ్‌లు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సుందర ప్రదేశాలతో తీరం వెంబడి ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుంది.


తూర్పు కనుమలు: తూర్పు కనుమలు విచ్ఛిన్న శ్రేణులు. ఇవి ఖండోలైట్, చార్నోఖైట్‌ వంటి శిలలతో ఏర్పడ్డాయి. ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య భాగంలో, తీర మైదానానికి, పీఠభూమికి మధ్య ఉత్తరం నుంచి దక్షిణానికి వ్యాపించి ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదులు ఈ శ్రేణులను ఉత్తర, దక్షిణ భాగాలుగా విడదీస్తున్నాయి. గోదావరి నదికి ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలు 60 నుంచి 70 కి.మీ. వెడల్పుతో సగటున 1,200 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. కృష్ణా నదికి దక్షిణంగా ఉన్న నల్లమల, వెలికొండలు, పాలకొండలు, శేషాచల కొండలు, ఎర్రమల కొండలన్నీ అవశిష్ట పర్వతాలు. ఉత్తరంగా ఉన్న తూర్పు కనుమలను తూర్పు శ్రేణులని, దక్షిణంగా ఉన్న తూర్పు కనుమలను కడప శ్రేణులని అంటారు. తూర్పు కనుమల్లో ఎత్తయిన శిఖరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి వద్ద ఉన్న అరోమకొండ/సీతమ్మకొండ. దీని ఎత్తు 1,680 మీటర్లు. ఈ శ్రేణులు సముద్రానికి దాదాపుగా 10 కి.మీ దూరంలో విస్తరించి ఉన్నప్పటికీ విశాఖపట్నం వద్ద ముందుకు చొచ్చుకువచ్చాయి. ఇందులో భాగమైన డాల్ఫిన్‌ నోస్‌ కొండ సముద్రానికి అతి దగ్గరగా ఉంటుంది.


అరకు లోయ: తూర్పు కనుమల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో విస్తరించిన అరకు లోయ సహజసిద్ధ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ఇది సముద్ర మట్టానికి 911 మీటర్ల ఎత్తులో ఒడిశా సరిహద్దు వరకు విస్తరించి ఉంది. దీని చుట్టూ గాలికొండ, రక్తకొండ, సుంకరీమెట్ట, చిట్ట మోగండి కొండలున్నాయి. అనంతగిరి, సుంకరిమెట్ట అటవీ ప్రాంతాలు జీవవైవిధ్యానికి నిలయాలు. ఈ ప్రాంతం బాక్సైట్‌ ఖనిజ నిక్షేపాలతో పాటు సేంద్రియ వ్యవసాయానికి ప్రసిద్ధి. ఇక్కడి సారవంతమైన ఏటవాలు నేలలు కాఫీ, తేయాకు తోటలకు అనుకూలం. అరకు ఎమరాల్డ్‌ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంది. లోయ సమీపంలో అనేక జలపాతాలున్నాయి. వాటిలో ప్రసిద్ధి చెందినది తాడిమడ జలపాతం. అరకు వెళ్లే దారిలో అనంతగిరి శ్రేణుల్లో ఉన్న బొర్రా గుహలు ప్రముఖ పర్యాటక ప్రాంతం.


బొర్రా గుహలు: ఈ గుహలను 1807లో విలియమ్‌ కింగ్‌ కనిపెట్టాడు. సముద్ర మట్టానికి 705 మీటర్లు ఎత్తులో సున్నపురాయి రాళ్లతో ఏర్పడిన స్టాలగ్‌ టైట్స్, స్టాలగ్‌ మైట్స్‌లను కలిగి క్రమరహితంగా విస్తరించి ఉన్నాయి. వీటి ద్వారా గోస్తని నది అనేక మలుపులు తిరుగుతూ ప్రవహిస్తుంటుంది. విశాఖ నుంచి అరకు వెళ్లే రైలు మార్గంలో గాజు కప్పుతో కూడిన రైలు పేరు విస్టాడోమ్‌.

పాపికొండలు: తూర్పు గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విస్తరించిన తూర్పు కనుమలను పాపికొండలు అంటారు. వీటి మధ్య గోదావరి వల్ల ఏర్పడిన ఇరుకు లోయను ‘బైసన్‌ గార్జ్‌’గా పిలుస్తారు. ఇక్కడి సహజ సౌందర్యం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ కొండల నడుమ గోదావరి ఒంపులు తిరుగుతూ ప్రవహిస్తుండటంతో  నదిపై పడవ ప్రయాణం గొప్ప అనుభూతి ఇస్తుంది. వన్యజీవుల సంరక్షణ కోసం పాపికొండల జాతీయ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


నల్లమల పర్వతాలు: నంద్యాల జిల్లాలో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో 112 కి.మీ. వెడల్పుతో కృష్ణా-పెన్నా నదుల మధ్య ఈ పర్వతాలు విస్తరించి ఉన్నాయి. వీటికి  ఉత్తర సరిహద్దులో పల్నాడు ప్రాంతం ఉంది. దక్షిణం వైపు తిరుపతి కొండలతో కలుస్తాయి. రాష్ట్రంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాంతం నల్లమల. ఇందులో రాజీవ్‌గాంధీ టైగర్‌ రిజర్వ్‌ ఉంది. నల్లమల పర్వతాల్లో అత్యంత ఎత్తయిన శిఖరం బైరావి కొండ. ఈ అడవిలో నివసిస్తున్న ముఖ్యమైన గిరిజన తెగ చెంచులు.


చెంచులు: వీరు ప్రాచీన కాలం నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారు. తేనె సేకరణలో సుప్రసిద్ధులు. అడవిని తల్లిగా భావిస్తారు. పురాతన ఆర్థిక వ్యవస్థ విధానాలను ఆచరిస్తారు.వీరికి స్థిర వ్యవసాయ పద్ధతులను అలవాటు చేయడానికి ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. విద్యాపరంగా ప్రోత్సహించేందుకు అనేక పాఠశాలలను నిర్వహిస్తోంది. 1989లో సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రధాన కార్యాలయాన్ని శ్రీశైలంలో ఏర్పాటు చేసింది.


శేషాచల కొండలు: శేషాచల కొండలు తిరుపతి జిల్లాలో సముద్ర మట్టానికి 600 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉన్నాయి. ఇసుకరాయి, సున్నపురాయి, షీల్‌ వంటి శిలలతో ఏర్పడ్డాయి. ఈ శ్రేణులను అంజనాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి, నీలాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, వృషభాద్రి అనే పేర్లతో పిలుస్తారు. ఇవి ఎర్రచందనం చెట్లకు ప్రసిద్ధి. ఈ అడవులను కేంద్ర ప్రభుత్వం 2010లో బయోస్ఫియర్‌గా ప్రకటించింది. ఈ శ్రేణుల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర జాతీయ పార్కును ఏర్పాటు చేసింది. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఈ కొండల్లోనే ఉంది.


హార్స్‌లీ హిల్స్‌: హార్స్‌లీ హిల్స్‌కు మరో పేరు ఏనుగు మల్లమ్మ కొండలు. వీటిపై మల్లమ్మ అనే వృద్ధ మహిళను ఏనుగులు ఆదరించాయనే స్థానిక కథనాల ఆధారంగా వీటిని ఏనుగు మల్లమ్మ కొండలని పిలుస్తారు. 1870లో బ్రిటిష్‌ అధికారి డబ్ల్యు.డి.హార్స్‌లీ ఇక్కడ నివాసం ఏర్పరచుకోవడం వల్ల వాటికి ఆ పేరు వచ్చింది. ఇది ఏపీలో ప్రధాన వేసవి విడిది కేంద్రం. ఆంధ్రా ఊటీగా పేర్కొంటారు. సముద్ర మట్టానికి 1200 మీటర్ల ఎత్తులో ఉండటంతో వేసవిలో చల్లని, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.


లంబసింగి/లమ్మసింగి/కొర్రబయలు: ఆంధ్రప్రదేశ్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రదేశమిది. తూర్పు కనుమల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి సమీపంలో ఉంది. దక్షిణ భారతదేశంలోనే మంచు కురిసే ఏకైక ప్రాంతం ఇదే. జనవరి నెలలో 0 నుంచి -3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. సముద్ర మట్టానికి దాదాపుగా వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది. ‘ఆంధ్రా కశ్మీర్‌’గా పిలుస్తున్నారు.

ఆంధ్రా పీఠభూమి

రాష్ట్రంలో ఈ పీఠభూమి ప్రాంతం నైరుతి దిశలో, తూర్పు కనుమలకు పశ్చిమంగా విస్తరించి ఉంది. దక్కన్‌ పీఠభూమికి తూర్పు వైపు వాలుతో రాయలసీమ జిల్లాల్లో వ్యాపించింది. సముద్ర మట్టానికి 150 నుంచి 600 మీటర్ల ఎత్తులో అనేక నిమ్నోన్నతాలను కలిగి ఉంది. అతిపురాతన గ్రానైట్, ఆర్కియన్‌ శిలలతో ఏర్పడి, అనేక ఖనిజ వనరులకు నిలయంగా విరాజిల్లుతోంది. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో ముడి ఇనుము, బంగారం, వజ్ర గనులు ఉన్నాయి. వైయస్‌ఆర్, అన్నమయ్య జిల్లాల్లో యురేనియం, రాతినార, ముగ్గురాయి నిక్షేపాలు; తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో అభ్రకం గనులు ఉన్నాయి. పల్నాడు ప్రాంతమైన అగ్నిగుండాలలో రాగి నిక్షేపాలున్నాయి.

ఈ పీఠభూమి ప్రాంతం సముద్ర తీరానికి దూరంగా, వైవిధ్యమైన ఖండాంతర్గత శీతోష్ణస్థితి కలిగి ఉండటం మరో విశేషం. అల్ప, అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలా సందర్భాల్లో అసలు వర్షమే కురవదు. దీంతో కరవు పీడిత ప్రాంతంగా మారింది. అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు మైసూర్‌ పీఠభూమిని ఆనుకొని ఉన్నాయి. అత్యల్ప వర్షపాతం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో కొన్ని ప్రాంతాలు తీవ్ర నీటి కొరత ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రాంత నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోతూ, ఎడారీకరణ ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఉదాహరణకు రాయదుర్గం, కల్యాణదుర్గం ప్రాంతాలు. .

నిస్సార నేలలు, నీటి వసతి కొరతతో వ్యవసాయం అంతగా అభివృద్ధి చెందలేదు. ఇటీవల కాలంలో ఉద్యానవన పంటల కేంద్రంగా మారింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు అభివృద్ధి చెందకపోవడంతో జనసాంద్రత తక్కువగా ఉంటుంది.

* ఈ పీఠభూమిలో ఆవరించిన శిలలు ఉన్నాయి. 

ధార్వార్‌ శిలలు: ఇవి అత్యంత ప్రాచీన శిలలు. 230 కోట్ల సంవత్సరాల క్రితం ప్రీ-కేంబ్రియన్‌ కాలంలో భూ అంతర్భాగం నుంచి శిలాద్రవం బహిర్గతం కావడం వల్ల ఏర్పడి, ఆ తర్వాత ఉష్ణోగ్రత, పీడనాల వల్ల రూపాంతరం చెందాయి. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.


కడప శిలలు: వికోషీకరణ ప్రక్రియ వల్ల 50 కోట్ల సంవత్సరాల క్రితం మిగిలిపోయిన ధార్వార్‌ శిలల అవశేషాలే కడప శిలలు. ఇవి భూ ఉపరితలంపై ప్రకృతి బలాలైన గాలి, నీరు, సముద్ర తరంగాలతో ప్రభావితమై ఏర్పడిన అవక్షేప శిలలు. వైయస్‌ఆర్, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్యసాయి, బళ్లారి జిల్లాల్లో ప్రముఖంగా కనిపిస్తాయి. ముగ్గురాయి, మైకా, సున్నపురాయి ఖనిజాలకు ప్రసిద్ధి.


కర్నూలు శిలలు: ఇవి కూడా కడప శిలల తరహాలోనే ఏర్పడ్డాయి. వైయస్‌ఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్నాయి. ఆస్‌బెస్టాస్, బైరైటీస్, స్టియటైట్, సున్నపురాయి ఖనిజాలు ఇక్కడ లభిస్తాయి.


గోండ్వానా శిలలు: 25 కోట్ల ఏళ్ల క్రితం భూకంపాల వంటి ఉపద్రవాలు సంభవించడంతో గోదావరి, కృష్ణా, మహానది, దామోదర్‌ నది మార్గాల్లో పెద్దపెద్ద బీటలు ఏర్పడ్డాయి. భూమి కుచించుకుపోయి పొడవైన ద్రోణులుగా మారాయి. ఆ తర్వాత అరణ్యాలు పెరిగాయి. ప్రకృతి బలాలతో వృక్షజాలమంతా ఒండ్రుమట్టి ఇసుకతో నిండిపోయి శిలాజ ఇంధనమైన బొగ్గుగా మారింది. గోదావరి నది దిగువన తెలంగాణ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోనూ ఇలాంటి గోండ్వానా శిలల్లో బొగ్గు లభిస్తుంది.


రాజమండ్రి శిలలు: తూర్పు తీరంలో సముద్రం పొంగి కొంత భాగాన్ని ఆక్రమించిందని అంచనా. ఆ విధంగా ఆక్రమణకు గురైన చోట ఇసుక, సున్నం, మట్టి అవక్షేపాలు ఆవరించాయి. వీటినే అవక్షేప శిలలు అంటారు. ఈ ప్రాంతంలో పెట్రోలియం, సహజ వాయువు నిల్వలు నిక్షిప్తమై ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో ‘లంబసింగి’కి సంబంధించి సరికానిది?

1) లమ్మసింగి    2) ఆంధ్రా కశ్మీర్‌     3) ఆంధ్రా ఊటీ     4) కొర్రబయలు

జ: ఆంధ్రా ఊటీ

2. కిందివాటిలో సరికాని జత?

1) శేషాచల కొండలు - తిరుపతి      2) మొగల్‌రాజపురం కొండలు - ఎన్‌.టి.ఆర్‌.

3) నల్లమల కొండలు - కర్నూలు      4) హార్స్‌లీ హిల్స్‌ - అన్నమయ్య

జ: నల్లమల కొండలు - కర్నూలు

3. కిందివాటిలో సరికాని జతను గుర్తించండి.

1) బొర్రా గుహలు - విశాఖపట్నం    2) బెలూం గుహలు - నంద్యాల 

3) శ్రీహరికోట - తిరుపతి        4) కొల్లేరు సరస్సు - ఏలూరు

జ: బొర్రా గుహలు - విశాఖపట్నం

4. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక చిత్తడి నేలల సంరక్షణ ప్రాంతం?

1) పులికాట్‌ సరస్సు    2) కొల్లేరు సరస్సు    3) గోదావరి డెల్టా      4) కృష్ణా డెల్టా

జ: కొల్లేరు సరస్సు 

5. ఆంధ్రప్రదేశ్‌లో ఎత్తయిన శిఖరం?

1) అరోమకొండ     2) మహేంద్రగిరి    3) సింహగిరి       4) లంబసింగి

జ: అరోమకొండ​​​​​​​

6. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక బయోస్ఫియర్‌ రిజర్వ్‌?

1) పాపికొండలు    2) నల్లమల ప్రాంతం    3) అరకు లోయ      4) శేషాచలం

జ: శేషాచలం​​​​​​​

7. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పీఠభూమి ప్రాంతం ఏ దిశలో ఉంది?

1) వాయవ్యం     2) నైరుతి     3) ఈశాన్యం      4) ఆగ్నేయం

జ: నైరుతి​​​​​​​

8. కిందివాటిలో అత్యంత ప్రాచీన శిలలు? 

1) కడప శిలలు   2) కర్నూలు శిలలు    3) గోండ్వానా శిలలు    4) ధార్వార్‌ శిలలు

జ: ధార్వార్‌ శిలలు​​​​​​​

9. పాపికొండలకు సంబంధించి సరికానిది?

1) ఈ ప్రాంతాన్ని జాతీయ పార్కుగా ప్రకటించారు.    2) బైసన్‌గార్జ్‌ ఉంది.

3) ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

4) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

జ: ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.

10. కిందివాటిలో భిన్నమైంది?

1) పాపికొండలు       2) పళని కొండలు

3) కొండవీటి కొండలు         4) కొండపల్లి కొండలు

జ: పళని కొండలు​​​​​​​

రచయిత: దంపూరు శ్రీనివాసులు

Posted Date : 18-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌