• facebook
  • whatsapp
  • telegram

అతివాద యుగం

మితవాద నాయకులు క్రీ.శ. 1905 వరకు జాతీయోద్యమానికి నాయకత్వం వహించారు. వీళ్లు రాజ్యాంగబద్దమైన విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలని భావించి విఫలమయ్యారు. దీంతో కాంగ్రెస్‌లోని ఒక వర్గం నాయకులు డిమాండ్లను పోరాడి సాధించుకోవాలన్న ఉద్దేశంతో అతివాద యుగ ప్రారంభానికి కారకులయ్యారు.
 

అతివాద యుగం ఆవిర్భవానికి కారణాలు:

i) బ్రిటిష్ పరిపాలకుల ఆర్థిక దోపిడీని భారతీయులు గ్రహించారు. ఆంగ్లేయులు అవలంబించిన ఆర్థిక విధానాలతో భారతదేశంలో 1896-1900 సంవత్సరాల మధ్య తీవ్ర కరవులు సంభవించాయని అర్థం చేసుకున్నారు.
 

ii) మితవాదులు అవలంబించిన విధానాలు విఫలం కావడం, 1892లో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన ఇండియా కౌన్సిళ్ల చట్టం భారతీయులను తీవ్ర నిరాశకు గురిచేసింది.
 

iii) బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత విధానాలు: జాతీయవాదాన్ని ప్రచారం చేయడం నేరమంటూ 1898లో చేసిన చట్టం, పత్రికల స్వేచ్ఛను హరించడానికి 1904లో చేసిన భారత అధికార రహస్యాల చట్టం, బాలగంగాధర తిలక్, ఇతర పత్రికా సంపాదకులను జాతీయవాదాన్ని ప్రచారం చేసినందుకు జైలులో నిర్బంధించడం దీనికి ఉదాహరణలు.
 

iv) సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఏడాదికోసారి సమావేశాల నిర్వహణకు బదులు, నిరంతర రాజకీయ కార్యక్రమాలు నిర్వహించాలని భావించారు.
 

v) భారతీయుల్లో ఆత్మగౌరవం పెంపొందించడం. స్వరాజ్యం ప్రతి భారతీయుడి జన్మ హక్కని తిలక్ ప్రకటించడం, వివేకానందుడు 'బలహీనత పాపం, బలహీనతే మరణం' అని బోధించడం.
 

vi) అంతర్జాతీయ సంఘటనల ప్రభావం: జపాన్ గొప్ప శక్తిగా ఎదగడం, 1905లో జపాన్, రష్యాను ఓడించడం, 1896లో ఇథియోపియా చేతిలో ఇటలీ సైన్యం ఓటమి, ఐర్లాండ్, రష్యా, ఈజిప్ట్, టర్కీ, చైనా దేశాల్లో విప్లవ ఉద్యమాలు భారతీయులు స్వరాజ్యం కోసం పోరాటాన్ని ముమ్మరం చేయడానికి తోడ్పడ్డాయి.
 

తక్షణ కారణం: అతివాదం ఆవిర్భవించడానికి తక్షణ కారణం కర్జన్ దుష్టపరిపాలన, బెంగాల్ విభజన.
 

అతివాదుల లక్ష్యాలు: స్వరాజ్య సాధనే తమ లక్ష్యమని అతివాదులు ప్రకటించారు. వీరి దృష్టిలో స్వరాజ్యం అంటే బ్రిటిష్ వలసలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మాదిరి స్వపరిపాలన కాదు. స్వరాజ్యం అంటే పూర్తి స్వాతంత్య్రం.
 

అతివాద నాయకులు: పంజాబ్‌కు చెందిన లాలా లజపతిరాయ్, మహారాష్ట్రకు చెందిన బాలగంగాధర తిలక్, బెంగాల్‌కు చెందిన బిపిన్ చంద్రపాల్ ముఖ్యమైన అతివాద నాయకులు. వీరే లాల్-బాల్-పాల్‌గా, అతివాదత్రయంగా ప్రసిద్ధిగాంచారు. వీరితోపాటు బెంగాల్‌కు చెందిన అరబిందోఘోష్ కూడా ప్రముఖ అతివాద నాయకుడు.
 

బాలగంగాధర తిలక్: ఈయన్ను భారతీయులు లోకమాన్య అని కీర్తించగా, బ్రిటిషర్లు ''భారత అశాంతి పితామహుడి"గా పేర్కొన్నారు. మితవాదిగా రాజకీయ జీవితం ప్రారంభించిన తిలక్, ఇరవయ్యో శతాబ్ద ప్రారంభం నాటికి అతివాదిగా మారారు.
 

సామాన్య ప్రజలను జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేయడానికి 1893లో గణపతి ఉత్సవాన్ని, 1895లో శివాజీ ఉత్సవాన్ని ప్రారంభించారు. 1896-97లో కరవుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహారాష్ట్రలో పన్నుల నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించారు. దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీలో ప్రముఖ సభ్యుడు. న్యూ ఇంగ్లిష్ స్కూల్ స్థాపనకు కృషి చేశారు. ఇదే తర్వాతి కాలంలో ఫెర్గుసన్ కళాశాలగా అభివృద్ధి చెందింది. ఆంగ్ల భాషలో మహారట్ట (Maharatta), మరాఠీ భాషలో కేసరి పత్రికలను స్థాపించారు. తిలక్ 1916 ఏప్రిల్‌లో హోం రూల్ లీగ్‌ను ప్రారంభించారు.
 

లాలా లజపతిరాయ్: పంజాబ్ కేసరిగా ప్రసిద్ధి చెందారు. ఈయన ఆర్య సమాజంలో 'కళాశాల' విభాగానికి నాయకుడు. సామాజిక, విద్యా సంస్కరణల కోసం కృషి చేశారు. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు 1907లో బ్రిటిష్‌వారు బర్మా దేశానికి పంపించారు.
లజపతిరాయ్ 'పంజాబీ' అనే వార్తా పత్రికకు సంపాదకత్వం వహించారు. 'అన్‌హ్యాపీ ఇండియా' అనే పుస్తకాన్ని రచించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమంలో పాల్గొని, పోలీసుల దెబ్బలకు గాయపడి, మరణించారు.

 

బిపిన్ చంద్రపాల్: భారత విప్లవ భావాల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన పారిదర్శక్ (Paridarshak) అనే వార పత్రికను ప్రారంభించారు. అలాగే బెంగాల్ పబ్లిక్ ఒపీనియన్, ట్రిబ్యూన్ పత్రికలకు సహ సంపాదకుడిగా వ్యవహరించారు.
క్రీ.శ. 1901లో 'న్యూ ఇండియా' అనే పత్రికను ప్రారంభించారు. క్రీ.శ. 1906లో అరబిందో ఘోష్, బిపిన్ చంద్రపాల్ ప్రారంభించిన వందేమాతరం పత్రిక అతివాద భావాలను ప్రచారం చేయడంలో కీలకపాత్ర వహించింది. అరబిందో ఘోష్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పనందుకు బ్రిటిష్ ప్రభుత్వం బిపిన్ చంద్రపాల్‌కు 1907లో ఆరునెలల కారాగార శిక్షను విధించింది. ఆ శిక్ష అనుభవించాక 1908-11 మధ్యకాలంలో ఇంగ్లండ్‌లో గడిపారు. తర్వాత 20 ఏళ్లపాటు జాతీయోద్యమంలో ఎలాంటి క్రియాశీలక పాత్ర వహించలేదు.

 

అరబిందో ఘోష్: బరోడాలో ఉపన్యాసకుడిగా పనిచేస్తూ 'న్యూ లాంప్స్ ఫర్ ఓల్డ్' అనే వ్యాసాల ద్వారా మితవాద రాజకీయాలను విమర్శించారు. వందేమాతర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా 1906లో కలకత్తాలో ప్రారంభించిన బెంగాల్ జాతీయ కళాశాలకు అరబిందో ప్రిన్సిపాల్‌గా వ్యవహరించారు- 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఈయన్ను అరెస్ట్ చేసింది. క్రీ.శ. 1910లో పాండిచ్చేరికి వెళ్లి ఆధ్యాత్మిక, సాహిత్య విషయాలపై దృష్టి సారించారు. సావిత్రి, ది లైఫ్ డివైన్ అనే రెండు గ్రంథాలు ఈయన రచనల్లో ప్రధానమైనవి.
 

వందేమాతరం ఉద్యమం

బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా భారతీయులు చేపట్టిన ఉద్యమమే వందేమాతర ఉద్యమంగా ప్రసిద్ధి చెందింది. ఈ కాలంలో బంకించంద్ర చటర్జీ రచించిన 'ఆనందమఠం' అనే గ్రంథం నుంచి స్వీకరించిన 'వందేమాతరం' నినాదాన్ని భారతీయులంతా ఎలుగెత్తి చాటారు. క్రీ.శ. 1905లో కర్జన్ (అప్పటి వైస్రాయి) ఢాకా, చిట్టగాంగ్, అస్సాం, మైమెన్‌సింగ్ ప్రాంతాలతో కూడిన తూర్పుబెంగాల్, అస్సాం రాష్ట్రాన్ని సృష్టించాడు. దీనికి ఢాకా రాజధాని. పరిపాలన సౌలభ్యం కోసమే బెంగాల్‌ను విభజించినా దీనికి ప్రధాన కారణం బెంగాల్‌లో జాతీయ ఉద్యమాన్ని బలహీన పరచడమే అనే నగ్నసత్యాన్ని బెంగాలీయులు గ్రహించారు. విభజన తర్వాత బెంగాల్‌లో బెంగాలీలు మైనారిటీలుగా మిగిలారు. ఈ విధంగా హిందూ-ముస్లింలను విభజించి జాతీయోద్యమాన్ని దెబ్బతీయాలని బ్రిటిష్‌వారు భావించారు. 

వందేమాతర ఉద్యమంలో భాగంగా స్వదేశీ వస్తు వినియోగం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమాలను చేపట్టారు. 1905 ఆగస్టు 7న కలకత్తాలోని టౌన్ హాల్‌లో జరిగిన సమావేశంలో వీటిని ఆమోదించారు. 1905లో గోపాల కృష్ణగోఖలే అధ్యక్షతన జరిగిన బెనారస్ సమావేశంలో కాంగ్రెస్ 'స్వదేశీ' ఉద్యమానికి పిలుపునిచ్చింది. బెంగాల్ విభజన అమల్లోకి వచ్చిన రోజైన 1905 అక్టోబరు 16ను జాతీయ దుర్దినంగా పాటించారు. ఆ రోజు కలకత్తాలోని అన్ని కార్యాలయాలు మూసివేశారు. జనపనార మిల్లులు, రైల్వే కర్మాగారాల్లో సమ్మెను పాటించారు. బాలగంగాధర్ తిలక్ ఈ ఉద్యమాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలకు ముఖ్యంగా పూనా, బొంబాయిలకు తీసుకెళ్లడంలో సఫలీకృతులయ్యారు. అజిత్‌సింగ్, లాలాలజపతిరాయ్ పంజాబ్‌లో, సయ్యద్ హైదర్ రజా ఢిల్లీలో, చిదంబరం పిళ్లై మద్రాసు రాష్ట్రంలో, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, అయ్యదేవర కాళేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌లో స్వదేశీ ఉద్యమాన్ని ప్రచారం చేశారు. వందేమాతర ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. 
 

క్రీ.శ. 1906లో దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్య సాధనే కాంగ్రెస్ లక్ష్యంగా ప్రకటితమైంది. అతివాదులు, మితవాదుల మధ్య నెమ్మదిగా విబేధాలు ప్రారంభమయ్యాయి. మితవాదులు విదేశీ వస్తు బహిష్కరణను ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలని భావించగా, అతివాదులు బహిష్కరణ ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు, బ్రిటిష్ ప్రభుత్వంతో సహాయ నిరాకరణకు కూడా ఉపయోగించాలని భావించారు. బ్రిటిష్‌వారు మితవాదులను తమవైపుకు తిప్పుకోవడానికి లెజిస్లేటివ్ కౌన్సిళ్ల సంస్కరణకు హామీ ఇచ్చారు.
క్రీ.శ. 1907 డిసెంబరు 26న సూరత్‌లో కాంగ్రెస్ సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి అధ్యక్షుడిగా మితవాదులు రాస్ బిహారి ఘోష్ పేరును ప్రకటించడంతో, అతివాదులు వ్యతిరేకించారు. దీంతో సుమారు 1600 మంది ప్రతినిధులు హాజరైన సభలో గందరగోళం నెలకొంది. ఇది చివరికి కాంగ్రెస్ అతివాదులు, మితవాదులుగా చీలిపోవడానికి దారితీసింది. 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో అనిబిసెంట్ ప్రయత్నాల వల్ల మితవాదులు, అతివాదులు మళ్లీ కలిశారు. అలాగే తిలక్ కృషితో కాంగ్రెస్, ముస్లింలీగ్ కలిసి పనిచేయడానికి అంగీకరించాయి.

 

విధానాలు

i) ప్రభుత్వ సర్వీసులు, న్యాయస్థానాలు, పాఠశాలలు, కళాశాలలను బహిష్కరించడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం పట్ల సహాయ నిరాకరణ ప్రకటించడం.

ii) స్వదేశీ వస్తు వినియోగాన్ని పెంచడం, విదేశీ వస్తువులను బహిష్కరించడం.

iii) జాతీయ విద్యను ప్రవేశపెట్టి, ఆచరించడం.
 

విజయాలు

* స్వరాజ్యం భారతీయుల జన్మహక్కు అని ప్రకటించారు.

* సామాన్య ప్రజలను కూడా జాతీయోద్యమంలో భాగస్వాములుగా చేశారు.

* జాతీయస్థాయిలో బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు.

అపజయాలు

* ఉద్యమాన్ని రైతులు, వ్యవసాయ కార్మికుల చెంతకు తీసుకెళ్లలేకపోయారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు