• facebook
  • whatsapp
  • telegram

ఆర్థిక వృద్ధి - అభివృద్ధి భావనలు

    రెండో ప్రపంచ యుద్ధం చివరివరకూ పేద దేశాల సమస్యలపై ఆర్థికవేత్తలు దృష్టి సారించలేదు. పెట్టుబడిదారీ, వృద్ధి చెందిన దేశాల అస్థిరత్వ, వ్యాపార చక్రాల సమస్యల గురించే శ్రద్ధ వహించారు. వలస పాలిత దేశాల స్వాతంత్య్రంతో, మూడో ప్రపంచ దేశాలు తెర ముందుకు వచ్చాయి. 1950వ దశకం నుంచి వృద్ధి, అభివృద్ధి అనే రెండు సమస్యలను గుర్తించారు. ఆర్థిక వ్యవస్థ స్వభావం, అభివృద్ధి స్థాయులతో సంబంధం లేకుండా, ప్రతి దేశం శీఘ్రవృద్ధి, అభివృద్ధి అనే ధ్యేయంతో ఉన్నాయి.
     నిత్య జీవితంలో అభివృద్ధి అనే పదాన్ని తరచుగా వింటుంటాం. సాధారణంగా అభివృద్ధి అనే పదాన్ని బాగుపడటం, పురోగతి సాధించడం అనే అర్థంలో ఉపయోగిస్తారు. అంటే ఆర్థికాభివృద్ధిని (Economic Development), ఆర్థిక వృద్ధిని (Economic Growth) పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికీ హిక్స్, షుంపీటర్ లాంటి ఆర్థికవేత్తలు వీటి మధ్య స్పష్టమైన వ్యత్యాసాలు చూపించారు.

ఆర్థిక వృద్ధి:

     'దీర్ఘకాలంలో తలసరి వాస్తవ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి తెలియజేస్తుంది'. ఈ నిర్వచనంలో దీర్ఘకాలం, తలసరి, వాస్తవ అనే మూడు పదాల ప్రాధాన్యాన్ని గుర్తించాలి.
ఎ) జాతీయోత్పత్తిలో పెరుగుదల అనేది వ్యాపార చక్రాల వల్ల తాత్కాలికంగా సంభవించవచ్చు. దీన్ని ఆర్థిక వృద్ధిగా పరిగణించరు. జాతీయోత్పత్తి పెరుగుదల అనేది దీర్ఘకాలంలో కొనసాగాలి.
బి) స్థూల జాతీయోత్పత్తి కంటే జనాభా వేగంగా పెరిగితే తలసరి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి జనాభా పెరుగుదల కంటే స్థూల జాతీయోత్పత్తి ఎక్కువ రేటులో పెరగాలి. అందుకే తలసరి స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా ఆర్థిక వృద్ధిని నిర్వచిస్తారు.
సి) ధరల పెరుగుదల వల్ల జాతీయాదాయం పెరగవచ్చు. ఆ రకమైన పెరుగుదల ఆర్థిక వృద్ధి కాదు. ధరల పెరుగుదల ప్రభావాన్ని తొలగించి స్థిర ధరల్లో లెక్కించిన వాస్తవ జాతీయాదాయ పెరుగుదలే ఆర్థిక వృద్ధి.
ఆర్థికవేత్తల అభిప్రాయంలో ఒక దేశ ఆర్ధిక వృద్ధి కింది నాలుగు కారణాలపై ఆధారపడి ఉంటుంది.
    i) శ్రామిక శక్తి, నాణ్యత, పరిమాణం
    ii) భూమి, ఇతర సహజ వనరులు అధికంగా ఉండటం
    iii) మూలధన కల్పన ఎక్కువగా ఉండటం
    iv) సాంకేతిక విజ్ఞానంలో మార్పులు, నవకల్పనలు
ఆర్థిక వృద్ధి సూచికలు: ఒక దేశంలో జరిగే ఆర్థిక వృద్ధిని కింది సూచికల ద్వారా లెక్కిస్తారు.
    ఎ) నామమాత్రపు స్థూల దేశీయోత్పత్తి
    బి) వాస్తవ స్థూల దేశీయోత్పత్తి
    సి) నామమాత్రపు తలసరి ఆదాయం
    డి) వాస్తవ తలసరి ఆదాయం
ఆధునిక ఆర్థిక వృద్ధి లక్షణాలు:
     ఆధునిక ఆర్థిక వృద్ధి ఒక ప్రత్యేకమైన ఆర్థిక శకాన్ని సూచిస్తుంది. ప్రొఫెసర్ సైమన్ కుజ్నెట్స్ ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల చారిత్రక అనుభవాల దృష్ట్యా ఆధునిక ఆర్థికవృద్ధికి సంబంధించి ఆరు లక్షణాలను గుర్తించారు.
1. తలసరి ఉత్పత్తి, జనాభా పెరుగదల
2. తలసరి ఉత్పత్తి సామర్థ్యం పెరగడం
3. నిర్మాణాత్మక మార్పుల రేటు ఎక్కువగా ఉండటం
4. సాంకేతిక పరిజ్ఞానం, పారిశ్రామికీకరణ, రవాణా, సమాచార సౌకర్యాల పెరుగుదల వల్ల పట్టణీకరణ పెరగడం
5. అభివృద్ధి చెందిన దేశాల పరదేశ విస్తరణ
6. మూలధనం, వస్తువులు, మానవ వనరుల అంతర్జాతీయ ప్రవాహాలు
ఆర్థికాభివృద్ధి (Economic Development)
    ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా, ఆ పెరుగుదలను సాధించడానికి అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూర్వక, సాంఘిక మార్పులతో కూడిన గుణాత్మక మార్పును కూడా సూచిస్తుంది. ఇది ఆర్థిక వృద్ధి కంటే ఎక్కువ సమగ్రమైంది. వస్తువుల స్వరూపంలో, వస్తూత్పత్తికి ఉపయోగించే సాంకేతిక ఉత్పత్తి పద్ధతుల్లో; ఆర్థిక వ్యవస్థలోని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాల స్వరూపంలో ఉత్పత్తిని ప్రభావితం చేసే సాంఘిక, ఆర్థిక వ్యవస్థల్లో; సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు వస్తాయి. కాబట్టి ఆర్థికాభివృద్ధిలో ఈ వ్యవస్థాపూర్వక సాంకేతిక మార్పులు ఇమిడి ఉంటాయి.

 

ఆర్థికాభివృద్ధి లక్షణాలు
* తలసరి వాస్తవ జాతీయాదాయంలో పెరుగుదల.
* ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం.
* ఆర్థిక వ్యవస్థలో సంస్థాగత, సాంకేతిక మార్పులు రావడం.
* పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు తగ్గి, ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడటం.
* సంపద సమానంగా, న్యాయంగా పంపిణీ కావడం.
* నిర్ణయాల్లో సాధికారత పెరగడం.

 

ఆర్థికాభివృద్ధి - వివిధ ఆర్థికవేత్తల అభిప్రాయాలు
గున్నార్ మిర్దాల్: ఆర్థిక వ్యవస్థ, పూర్తి సాంఘిక వ్యవస్థ కింది స్థాయి నుంచి పైస్థాయికి కదలడాన్నే ఆర్థికాభివృద్ధి అంటారు.
డడ్లీశీర్స్: ఏ దేశంలోనైతే పేదరికాన్ని అసమానతలను, నిరుద్యోగితను వాటి అధిక స్థాయుల నుంచి తగ్గించగలుగుతారో, ఆ దేశంలో ఆ కాలాన్ని అభివృద్ధి కాలంగా చెప్పవచ్చు.
సి.ఇ. బ్లాక్: ఒక దేశం అనేక ఆధునికీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి అవుతుంది.
మైఖేల్.పి. తొడారో: ఆర్థికాభివృద్ధి ఒక బహుముఖమైన అభివృద్ధి ప్రక్రియ. సామాజిక నిర్మాణంలో ప్రజామోదమైన వైఖరులు, జాతీయ సంస్థల్లో చెప్పుకోదగిన మార్పులు ఈ ప్రక్రియలో భాగం. అంతేకాకుండా త్వరితగతిన ఆదాయ పెరుగుదల, అసమానతల తగ్గుదల, సాపేక్ష పేదరిక నిర్మూలన ఈ ప్రక్రియలో ఉంటాయి.
కిండల్ బెర్జర్: ఆర్థికాభివృద్ధి అంటే ఉత్పత్తిలో పెరుగుదలే కాకుండా, ఆ పెరుగుదలను సాధించడానికి అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూర్వక మార్పులు కూడా ఇమిడి ఉంటాయి.
జి.ఇ. మేయర్, జె.ఇ. రాచ్: అమెరికా డాలర్లలో లెక్కించిన తలసరి జాతీయాదాయం దీర్ఘకాల పెరుగుదలను ఆర్థికాభివృద్ధి అంటారు.
కొలిన్ క్లార్క్: వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక, సేవా రంగాలకు శ్రామికులు తరలివెళ్లడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు.
సుమన్. కె. ముఖర్జీ: ఒక దేశంలో లేదా ఒక ప్రాంతంలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా వస్తు, సేవల సగటు ఉత్పత్తిలో నిరంతర పెరుగుదలను తెచ్చే ప్రక్రియ ఆర్థికాభివృద్ధి.

 

ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు:
* ఆర్థిక వృద్ధితోపాటు ప్రజల జీవన ప్రమాణ స్థాయిలో పెరుగుదల.
* సామాజిక న్యాయం చేకూర్చడం.
* సాంకేతిక నైపుణ్యంలో పెరుగుదల.
* ఆర్థిక స్థిరీకరణ.
* సమ్మిళితమైన అభివృద్ధి.
* ఆర్థిక స్వావలంబన.

 

ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశాలు:
* సహజ వనరుల లభ్యత.
* మూలధన లభ్యత.
* సాంకేతిక అభివృద్ధి.
* మూలధన ఉత్పత్తి నిష్పత్తి.
* మానవ వనరుల సద్వినియోగం.
* సమర్థవంతమైన ఉద్యమిత్వం.
* నిర్మాణాత్మక మార్పులు సంభవించడం.
* విదేశీ వ్యాపారం, విదేశీ మూలధనం.
* ప్రభుత్వ పాత్ర.
* సాంఘిక వ్యవస్థ అనుకూలత, రాజకీయ స్థిరత్వం.

 

ఆర్థికాభివృద్ధికి నిరోధకాలు:
* మూలధన పెరుగుదల రేటు తక్కువగా ఉండటం.
* పేదరిక విష వలయాలు
* మార్కెట్ అసంపూర్ణతలు.
* అల్ప సాంకేతిక పరిజ్ఞానం
* మూలధన ఉత్పత్తి - నిష్పత్తి ఎక్కువగా ఉండటం.
* అభివృద్ధి చెందని మానవ వనరులు.
* వ్యవసాయ రంగ ప్రగతి తక్కువగా ఉండటం.
* ఉమ్మడి కుటుంబ వ్యవస్థ.
* విదేశీ వాణిజ్య లోటు ఎక్కువగా ఉండటం.
* ప్రదర్శనా ప్రభావానికి గురికావడం
* జాతీయాదాయ వృద్ధిరేటు కంటే జనాభా వృద్ధిరేటు ఎక్కువగా ఉండటం.
* సామాజిక కారణాలు.

 

నిలకడ గల అభివృద్ధి లేదా సుస్థిర అభివృద్ధి (Sustainable Development)

     సహజ వనరుల క్షీణత జరగకుండా ఆర్థికాభివృద్ధిని సాధించడాన్నే 'నిలకడ గల అభివృద్ధిగా చెప్పవచ్చు. ఒకవైపు మానవుల జీవన విధానాన్ని, శ్రేయస్సును పెంచవలసిన అవసరానికి, మరోవైపు భవిష్యత్ తరాలవారు ఆధారపడే సహజ వనరులు, జీవావరణ వ్యవస్థ సంరక్షణకు మధ్య సున్నితమైన సంతులనాన్ని సాధించడాన్నే నిలకడ గల అభివృద్ధి తెలియజేస్తుంది.
    ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్, 'అవర్ కామన్ ఫ్యూచర్' అనే సెమినార్ నివేదికలో మొదటిసారిగా నిలకడగల అభివృద్ధి అనే పదాన్ని ఉపయోగించింది. ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యావరణ అభివృద్ధి కమిషన్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం 'నేటితరం ప్రజల అవసరాలు ఇదే స్థాయిలో తీరుస్తూ, భావితరాల అవసరాలతో ఏ విధంగానూ రాజీ పడకుండా చూడటమే నిలకడ గల అభివృద్ధి.'
» 1987లో బ్రట్‌లాండ్ కమిషన్ 'భవిష్యత్ తరాలవారి అవసరాలు తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలవారు తమ అవసరాలు తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది. మరోవిధంగా చెప్పాలంటే దీర్ఘకాలంలో మానవుల అత్యవసర అవసరాలను సంతృప్తిపరిచే లక్ష్యంతో మానవ, ప్రకృతి, ఆర్థిక వనరుల సమర్థమైన నిర్వహణను ఈ భావన తెలియజేస్తుంది.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు:
» సుస్థిర అభివృద్ధి అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే ఉద్దేశంతో ఉంటుంది.
» సుస్థిర అభివృద్ధిలో భౌతిక, మానవపరమైన సహజ మూలధనాలను పరిరక్షించి, నియమబద్ధంగా ఉపయోగిస్తారు.
» ఆర్థికాభివృద్ధి పర్యావరణ క్షీణతకు దారితీస్తూ, నాణ్యమైన జీవన విధానానికి హాని కలిగించే రీతిలో ఉండకూడదు.
» సుస్థిర అభివృద్ధి జీవ వైవిధ్య రక్షణకు ప్రాధాన్యాన్నిస్తుంది.
» పర్యావరణానికి ఉన్న శోషక సామర్థ్యాన్ని (absorbing capacity) దృష్టిలో ఉంచుకుని ఆర్థిక కార్యకలాపాలకు పరిమితులను విధిస్తుంది.

సమ్మిళిత వృద్ధి భావన (Concept of Inclusive Growth)
    భారత ఆర్థిక వ్యవస్థ స్థూల ఆర్థిక అంశాల్లో సంతృప్తికరమైన ప్రగతి సాధించినా, సంస్కరణల కాలంలో పేదరిక నిర్మూలన, గ్రామీణ, పట్టణ వ్యత్యాసాలు; ఆదాయ అసమానతలు, ప్రాంతీయ అసమానతలు అంతగా తగ్గలేదు. వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు స్వల్పంగా ఉండి రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని పదకొండో ప్రణాళికలో సమ్మిళిత, సుస్థిర వృద్ధి లక్ష్యానికి ప్రాధాన్యమిచ్చారు. పన్నెండో ప్రణాళికలో కూడా దీన్ని కొనసాగించారు.
'సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందే విధంగా వనరులను న్యాయబద్ధంగా కేటాయించడం ద్వారా సాధించే అభివృద్ధిని సమ్మిళిత అభివృద్ధి'గా నిర్వచించవచ్చు.
» సమ్మిళిత వృద్ధి అనేది ఒక విస్తృత భావన. సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలు ఇందులో అంతర్భాగాలు. వ్యవసాయ రంగంలో వృద్ధి, ఉపాధి కల్పన, పేదరిక నిర్మూలన, ప్రాంతీయ అసమానతల తగ్గింపు, న్యాయబద్ధమైన వృద్ధి, వైద్య సదుపాయాలు, అందరికీ సార్వత్రిక ప్రాథమిక విద్య అందుబాటు, ఉన్నత విద్యలో నమోదు, నాణ్యత పెరగడం, నైపుణ్యాల పెంపు, బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ లాంటి అంశాలు భారతదేశ సమ్మిళిత వృద్ధిలో ప్రధాన భాగాలుగా ఉన్నాయి.
ప్రధాన లక్ష్యం: ఇప్పటివరకూ విస్మరించిన వర్గాలకు ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే సమ్మిళిత వృద్ధి ప్రధాన లక్ష్యం. ఆర్థిక వ్యవస్థ సమవృద్ధి మార్గంలో ముందుకు వెళ్లడానికి ఈ లక్ష్య సాధన వీలు కల్పిస్తుంది.

ఆర్థిక వృద్ధి - ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు

      ఆర్థిక వృద్ధి                        ఆర్థికాభివృద్ధి
 1) అభివృద్ధి చెందిన దేశాల స‌మ‌స్య‌కు చెందిన భావ‌న‌.  1) అభివృద్ధి చెందుతున్న దేశాల స‌మ‌స్య‌కు చెందిన భావ‌న‌.
 2) వాస్త‌విక వ‌స్తు, సేవ‌ల ఉత్ప‌త్తిలో వ‌చ్చిన పెరుగుద‌ల‌ను తెలుపుతుంది.  2) ఉత్ప‌త్తిలోని పెరుగుద‌ల‌తో పాటు దేశంలో ఆర్థిక, సాంఘిక వ్య‌వ‌స్థాప‌ర‌మైన మార్పుల‌ను తెలుపుతుంది.
 3) ఆర్థిక వృద్ధి ముఖ్య‌మైంది.  3) ఆర్థికాభివృద్ధి బ‌హుముఖ‌మైన అభివృద్ధి ప్ర‌క్రియ.
 4) ప‌రిమాణాత్మ‌క మార్పుల‌ను తెలియ‌జేస్తుంది.  4) గుణాత్మ‌క మార్పుల‌ను తెలియ‌జేస్తుంది.
 5) సంకుచిత భావ‌న.  5) విస్తృత భావ‌న‌.
 6) ప్ర‌భుత్వ జోక్యం లేకుండా సాధించ‌గ‌లం.  6) ప్రాథ‌మిక ద‌శ‌లో ఆర్థికాభివృద్ధి సాధ‌న‌కు ప్ర‌భుత్వ ప్ర‌మేయం అవ‌స‌రం.
 7) కిండ‌ల్ బ‌ర్గ‌ర్ చెప్పిన‌ట్లుగా శారీర‌క ప‌రిమాణంలో వ‌చ్చే మార్పును తెలిపేది వృద్ధి.  7) శారీర‌క పెరుగుద‌ల‌తో పాటు వ్య‌క్తిత్వంలో, మేధ‌స్సుతో వ‌చ్చే మార్పును తెలుపుతుంది.
 8) ఆదాయ పంపిణీని సూచించ‌దు.  8) ఆదాయ పెరుగుద‌ల, ఆదాయ పంపిణీని తెలుపుతుంది.
 9) సంప్ర‌దాయ అర్థ‌శాస్త్ర నేప‌థ్యంలో ఆర్థిక వృద్ధి అనేది ఒక కీల‌క అంశం.  9) ఆధునిక అర్థ‌శాస్త్ర సాహిత్యంలో ఆర్థికాభివృద్ధి అనేది ముఖ్య‌మైన అంశం.


 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌