• facebook
  • whatsapp
  • telegram

క్విట్‌ ఇండియా ఉద్యమం (1942)

ప్రజలే సారథులై.. పోరాట యోధులై!


 

రెండో ప్రపంచ యుద్ధం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. అది తప్పిపోవాలంటే ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లాలని గాంధీజీ డిమాండ్‌ చేశారు. అప్పటికే ప్రజలంతా ఆగ్రహావేశాలతో ఉన్నారు. ‘విజయమో.. వీర స్వర్గమో’ అంటూ మహాత్ముడు ఇచ్చిన పిలుపుతో మరింత విజృంభించారు. అప్రమత్తమైన బ్రిటిష్‌ ప్రభుత్వం నేతలందరినీ అరెస్టు చేసింది. అయినా జనంలో రగిలే అసంతృప్తి జ్వాలలు ఆరలేదు, అదుపులోకి రాలేదు. నింôకుశ నిర్బంధాలను ధిక్కరించి, నాయకత్వం లేకపోయినా ప్రజలే సారథులై, పోరాట యోధులై పెద్ద ఎత్తున ఉద్యమించారు. క్విట్‌ ఇండియా నినాదం దేశమంతా మారుమోగింది. అణచివేతకు ప్రభుత్వం ప్రజలపై దమనకాండను సాగించింది. తిరగబడిన ఉద్యమకారులు సర్కారు ఆస్తులను ధ్వంసం చేశారు. యుద్ధం ఆగిపోవడంతో ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. కానీ సంపూర్ణ స్వాతంత్య్రమే భారతీయుల ఉక్కు సంకల్పమనే వాస్తవం తెల్లవారి తలకెక్కింది. 

దేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో క్విట్‌ ఇండియా ఉద్యమం జాతికి స్ఫూర్తినిచ్చిన మహోజ్వల ఘట్టం. 1942, ఆగస్టులో గాంధీ ఈ ఉద్యమానికి పిలుపునివ్వడానికి అనేక పరిస్థితులు ప్రేరేపించాయి. తక్షణం అధికార బదిలీ జరగాలనే కాంగ్రెస్‌ డిమాండ్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం నిరాకరించింది. రాజకీయ సంస్కరణల కోసం భారత నాయకులతో సంప్రదింపులు సాగించిన అనంతరం క్రిప్స్‌ చేసిన ప్రతిపాదనలు భారతీయులను మెప్పించలేకపోయాయి. క్రిప్స్‌ రాయబారం విఫలమైంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దేశంలో ఆహార పదార్థాల కృత్రిమ కొరత ఏర్పడింది. ధరలు ఆకాశాన్నంటాయి. కష్టకాలంలో ప్రభుత్వం వహించిన నిర్లక్ష్య ధోరణి వల్ల ప్రజాజీవితం దుర్భరంగా మారింది. మరోవైపు యుద్ధంలో అక్షరాజ్య కూటమి తరఫున జపాన్‌ సైన్యం ఆసియా ఖండంలో విజృంభించింది. ఆంగ్లేయులను మలయా, సింగపూర్, బర్మాల నుంచి తరిమేసి బంగాళాఖాతంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జపాన్‌ సైన్యం భారత్‌ పొరుగు దేశమైన అప్పటి బర్మాలోకి ప్రవేశించింది. ఆ యుద్ధాగ్ని జ్వాలలు భారతదేశాన్నీ తాక వచ్చనే భయం ప్రజల్లో వ్యాపించింది.

1942లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులను, ప్రజల ఆగ్రహావేశాలను గాంధీ గ్రహించారు. భారతదేశం సురక్షితంగా ఉండాలంటే బ్రిటిషర్లు ఈ దేశాన్ని వదిలివెళ్లడం ఒక్కటే పరిష్కారమని ప్రభుత్వానికి తన ‘హరిజన’ పత్రిక ద్వారా సూచించారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ 1942, జులై 14న వార్దాలో సమావేశమై ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించి ‘క్విట్‌ ఇండియా’ తీర్మానాన్ని ఆమోదించింది. అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ఆగస్టు 8న బొంబాయిలో సమావేశమై ఆ తీర్మానాన్ని ధ్రువీకరించింది. అహింసాయుతంగా, గాంధీ నాయకత్వంలో పోరాడాల్సిందిగా ఈ తీర్మానం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఒకవేళ ప్రభుత్వం దమననీతికి పాల్పడి ఉద్యమ నాయకులను అరెస్ట్‌ చేస్తే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రగాఢంగా కోరుకునే ప్రతి భారతీయుడు ఉద్యమస్ఫూర్తితో స్వయంగా కార్యక్రమం రూపొందించుకోవాలని కోరింది.


   బొంబాయిలోని గోవలియ ట్యాంక్‌ మైదానంలో (క్రాంతి మైదానం) ఆగస్టు 8న గాంధీజీ ఉపన్యసిస్తూ స్వాతంత్య్రానికి తక్కువైంది ఏదీ అంగీకరించడం కుదరదని స్పష్టం చేశారు. దానికోసం ఒక మంత్రం ఉపదేశించారు. అదే ‘విజయమో.. వీరస్వర్గమో’ (డూ ఆర్‌ డై), దేశాన్ని విముక్తి చేయడమో లేదా ఆ ప్రయత్నంలో మరణించడమో ఏదో ఒకటి జరగాలని ఉద్వేగంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలంతా స్వతంత్ర భారత పౌరులుగా జీవించాలని, బ్రిటిష్‌ ప్రభుత్వ ఆజ్ఞలను అహింసాయుతంగా ధిక్కరించాలని చెప్పారు. అయితే ఈ ఉద్యమ నిర్వహణ కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ అప్పటికి ఇంకా ఖరారు చేయలేదు. క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఫార్వర్డ్‌ బ్లాక్, జయప్రకాష్‌ నారాయణ్, అచ్యుత్‌ పట్వార్దన్, రామ్‌ మనోహర్‌ లోహియా మొదలైనవారు స్థాపించిన కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ వంటి రాజకీయ పార్టీలు మద్దతిచ్చాయి. ఇండియన్‌ ముస్లింలీగ్, కమ్యూనిస్ట్‌ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. తర్వాత ముస్లింలీగ్‌ ‘డివైడ్‌ అండ్‌ క్విట్‌’ అని డిమాండ్‌ చేసింది.


ప్రభుత్వ చర్య: బొంబాయిలో కాంగ్రెస్‌ క్విట్‌ ఇండియా తీర్మానం చేసిన వెంటనే ప్రభుత్వం కాంగ్రెస్‌ని నిషేధించింది. అదే రోజు రాత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ నాయకులపై విరుచుకుపడి 24 గంటల్లోనే దాదాపుగా అందరినీ నిర్బంధించింది. గాంధీజీతో పాటు కస్తూరిబా గాంధీని అరెస్ట్‌ చేసి పూనాలోని ఆగాఖాన్‌ ప్యాలెస్‌లో నిర్బంధించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ, మౌలానా ఆజాద్, పట్టాభి సీతారామయ్య, ఆచార్య కృపలానీ మొదలైనవారు అహ్మద్‌నగర్‌ కోటలో బందీలయ్యారు. డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌ పట్నాలో అరెస్టయ్యారు.


ప్రజా ప్రతిఘటన: 1942, ఆగస్టు 9 నాటికి దాదాపు నాయకులంతా అరెస్టయ్యారు. అప్పటికే బ్రిటిషర్ల నిరంకుశ, అణచివేత విధానాలతో ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. నిక్షిప్తంగా ఉన్న అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఉద్యమ నాయకులను ప్రభుత్వం నిర్బంధించినా, ప్రజలే ఉద్యమాన్ని నిర్వహించారు. అందుకే క్విట్‌ ఇండియా గొప్ప ప్రజా ఉద్యమంగా మారింది. అయితే ప్రజల ముందు ఒక స్పష్టమైన అజెండా లేదు. గాంధీ జైలులో నిర్బంధంలో ఉండటంతో ఎలాంటి మార్గదర్శకత్వం చేయలేకపోయారు. తొలి దశలో చాలాచోట్ల నిరసనలు, హర్తాళ్లు, శాంతియుత సమావేశాలు నిర్వహించారు. దిల్లీ, బొంబాయి, కాన్పుర్, లఖ్‌నవూ, నాగ్‌పుర్, బెంగళూరు, మద్రాసు, అహ్మదాబాద్‌ లాంటి ప్రముఖ నగరాలు, పట్టణాల్లో మహిళలు, విద్యార్థులు, కార్మికులు, మధ్యతరగతి వారు, చేతివృత్తులవారు క్విట్‌ ఇండియా నినాదంతో నిరసన ప్రదర్శనలు చేశారు. పోలీసులతో, సైన్యంతో ఘర్షణకు దిగారు. ఉద్యమానికి బొంబాయి కేంద్రంగా మారింది. దేశంలో అతిపెద్ద పారిశ్రామిక సంస్థ అయిన టాటా ఉక్కు కార్మికులు జాతీయ ప్రభుత్వం ఏర్పడే వరకు విధుల్లో చేరేది లేదంటూ సమ్మె చేశారు. ప్రజాజీవనం స్తంభించింది. క్విట్‌ ఇండియా ఒక్కటే ఉద్యమకారులందరి డిమాండ్‌గా మారింది.


ప్రభుత్వ చర్య - ప్రతిచర్య: ప్రభుత్వం ఈ ప్రజా ఉద్యమాన్ని బలప్రయోగంతో అణచివేయాలని నిశ్చయించింది. అరెస్టులు, జరిమానాలు, ప్రజల వ్యక్తిగత ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, లాఠీఛార్జీలు, నిరాయుధులపై కాల్పులు జరపడం ఈ ఉద్యమకాలంలో నిత్యకృత్యమయ్యాయి. ప్రభుత్వ దమనకాండ ప్రజల ఆగ్రహావేశాలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. హింసకు ప్రతిహింసను సృష్టించింది. ఉద్యమం గ్రామీణ ప్రాంతాలకు పాకింది. విద్యార్థులు విద్యాసంస్థలను బహిష్కరించారు. కార్మికులు, స్త్రీలు, చేతివృత్తులవారు రోడ్డుపైకి వచ్చి ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ప్రభుత్వ ఆస్తులు వారి లక్ష్యమయ్యాయి. టెలిగ్రాఫ్‌ లైన్‌లు తెగిపడ్డాయి. రైల్వే లైన్‌లు ధ్వంసమయ్యాయి. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు తగలబడ్డాయి. ఉద్యమకారులకు కాంగ్రెస్‌ సోషలిస్ట్‌ పార్టీ నాయకులు అరుణా అసఫ్‌ అలీ, అచ్యుత్‌ పట్వార్దన్, జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు తెరచాటు సహాయం అందించారు. విప్లవభావాలతో ఉన్న నాయకులు మిడ్నపూర్‌లోని తామ్రలుక్, మహారాష్ట్రలోని సతారా, ఒరిస్సాలోని తాల్చేరు లాంటి చోట్ల రహస్య పోటీ ప్రభుత్వాలను ఏర్పాటుచేశారు. ఉద్యమం ప్రారంభమైన మూడు నెలల్లో బ్రిటిష్‌ ప్రభుత్వం క్రూర విధానాలతో అణగదొక్కింది. యథావిధిగా సమాజంలోని ఉన్నత వర్గాలు, అధికార గణం ప్రభుత్వానికి విధేయులుగా మిగిలారు. ప్రభుత్వ హింసాకాండ తారస్థాయికి చేరింది. అధికారిక లెక్కల ప్రకారం 10 వేల మందికి పైగా కాల్పుల్లో మరణించగా, 60 వేలకు పైగా అరెస్టయ్యారు. ఈ ఉద్యమంలో జరిగిన హింసాత్మక సంఘటనలకు ప్రభుత్వం గాంధీని నిందించింది. దీంతో ఆయన తన ఆత్మశుద్ధికి 21 రోజులు నిరాహార దీక్ష చేశారు. తర్వాత గాంధీజీ నిర్బంధం నుంచి విడుదలయ్యారు. యుద్ధంలో మిత్ర రాజ్యాల విజయం వల్ల ఉద్యమం ఉద్ధృతి తగ్గింది. క్విట్‌ ఇండియా ఉద్యమానికి మూలకారణమైన రెండో ప్రపంచ యుద్ధం, దాని ప్రధాన కారకుడైన హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో పరిసమాప్తమైంది.

ఉద్యమ ప్రాముఖ్యం: ఉద్యమ ప్రారంభంలోనే ప్రముఖ నాయకులంతా అరెస్ట్‌ అయినప్పటికీ ప్రజలే ఉద్యమానికి నాయకత్వం వహించి దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమేనని ప్రభుత్వానికి చాటారు. ఈ మహా ప్రజాఉద్యమాన్ని ప్రభుత్వం నిరంకుశ విధానాలతో అణచివేసినప్పటికీ, ప్రజల్లో గొప్ప రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. కాంగ్రెస్‌ విధానాల పట్ల ప్రజల్లో మళ్లీ విశ్వాసం ఏర్పడింది. చిరకాలంగా ప్రభుత్వ ఎజెండాగా ఉన్న ‘డొమినియన్‌ ప్రతిపత్తి’ ఆగస్టు ఉద్యమంలో ఆహుతైంది. ప్రజల నినాదమైన సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప మరేదీ అంగీకారం కాదని ప్రభుత్వానికి స్పష్టమైంది. ఉవ్వెత్తున ఎగసిన తిరుగుబాటు పాలకుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది.స్వాతంత్య్రాన్ని భారతదేశ గుమ్మంలోకి తీసుకొచ్చింది.

నోట్‌: క్విట్‌ ఇండియా నినాదాన్ని మొదటిసారి రూపొందించినవారు యూసుఫ్‌ మెహర్‌ అలీ. ఈయన 1942 నాటి బొంబాయి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 04-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు