• facebook
  • whatsapp
  • telegram

బోస్‌ ప్రత్యక్ష పోరాటం (సుభాష్‌ చంద్రబోస్‌ - భారత జాతీయ సైన్యం)

 సాహసవీరుడి స్వతంత్ర సమరం!

నేతాజీ పేరు వినగానే ప్రతి భారతీయుడి ఛాతి ఉప్పొంగుతుంది. జాతి మొత్తం పులకిస్తుంది. గాంధీజీ స్ఫూర్తితో జాతీయోద్యమంలో చేరి, ఆయన నిర్ణయాలతోనే నిర్మొహమాటంగా విభేదించి బోస్‌ సాగించిన పోరాటం దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. సాయుధ సంగ్రామమే మార్గమని ప్రకటించి, స్వతంత్ర భారతావని ఒక్కటే మనకు స్వర్గమని చాటి, ప్రత్యేక సైన్యాన్ని సమకూర్చుకొని ఆంగ్లేయులతో యద్ధం చేశాడు. ప్రతి పౌరుడు సైనికుడిగా మారి ప్రాణార్పణకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. ఎనిమిది దేశాల గుర్తింపు పొందిన సమాంతర భారత ప్రభుత్వాన్ని స్థాపించాడు. దేశ స్వాతంత్య్ర సమరాన్ని అంతర్జాతీయ వేదికలకు చేర్చి, బ్రిటిషర్లకు కునుకు లేకుండా చేశాడు. ఆయన సాహసాలు, తెగింపు, త్యాగాలు దేశ ప్రజల్లో స్వాతంత్య్రకాంక్షను తీవ్రంగా రగిలించాయి. ప్రతి పోటీ పరీక్షలో ప్రశ్నలుగా వచ్చే ఈ అధ్యాయంపై అభ్యర్థులు సమగ్ర అవగాహన కలిగి ఉండాలి. 

పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్యశృంఖలాలను తెంచడానికి సాయుధ పోరాటమే ఉత్తమ మార్గమని సిద్ధాంతీకరించిన జాతీయ నాయకుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌. విజయసాధన కోసం అహర్నిశలు శ్రమించి తన శక్తియుక్తులను, సర్వస్వాన్ని ఫణంగా పెట్టిన త్యాగశీలి. ఉన్నత విద్యావంతుడైన బోస్, చిత్తరంజన్‌ దాస్‌ స్థాపించిన బెంగాల్‌ జాతీయ కళాశాల ప్రిన్సిపాల్‌గా, కలకత్తా నగర మేయర్‌గా విధులు నిర్వర్తించాడు. గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమం పిలుపుతో స్వాతంత్రోద్యమంలోకి వచ్చాడు.

సుభాష్‌ చంద్రబోస్‌ రాజకీయ జీవితాన్ని అతడి రాజకీయ గురువైన చిత్తరంజన్‌ దాస్‌ ప్రభావితం చేశారు. 1921లో బ్రిటన్‌ వేల్స్‌ రాకుమారుడి భారతదేశ పర్యటనను నిరసిస్తూ బోస్‌ ప్రదర్శనలు నిర్వహించాడు. ఆయన తన అభిప్రాయాలను వ్యక్తం చేయడంలో నిర్భయంగా వ్యవహరించేవాడు. చౌరిచౌరాలో జరిగిన ఒక హింసాయుత సంఘటన నేపథ్యంలో గాంధీజీ 1922, ఫిబ్రవరి 5న ఉద్ధృతంగా సాగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపేశారు. ఆ నిర్ణయాన్ని బోస్‌ తప్పుబట్టాడు. ఉద్యమాన్ని నిలిపేయడాన్ని జాతీయ విపత్తుగా అభివర్ణించాడు. ఆ తర్వాత చిత్తరంజన్‌ దాస్, మోతీలాల్‌ నెహ్రూ స్వరాజ్య పార్టీ (1922) స్థాపన, దాని నిర్వహణలో సహాయం అందించాడు. 1935 భారత ప్రభుత్వ చట్టం పట్ల కూడా విముఖత వ్యక్తం చేశాడు. అలాంటి చర్యలను ఆమోదిస్తే స్వాతంత్య్ర పోరాట స్వభావంలో ఏ అభివృద్ధి ఉండదని స్పష్టం చేశాడు.

1938లో భారత జాతీయ కాంగ్రెస్‌ వార్షిక సమావేశం సుభాష్‌ చంద్రబోస్‌ అధ్యక్షతన (ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు) గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఉన్న హరిపురా గ్రామంలో జరిగింది. అందులో ఆయన 1935 భారత ప్రభుత్వ చట్టంలోని లోపభూయిష్టమైన ఫెడరల్‌ వ్యవస్థతో పాటు ఇంకా అనేక అంశాలను విమర్శించాడు. స్వదేశీ సంస్థానాలతో సహా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్ర సాధనే లక్ష్యమని ఆ సమావేశం ఉద్ఘాటించింది. 1939లో నేటి మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పుర్‌ జిల్లా త్రిపురిలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశ అధ్యక్ష పదవికి బోస్‌ పోటీ చేశాడు. గాంధీజీ నిలబెట్టిన భోగరాజు పట్టాభి సీతారామయ్యపై విజయం సాధించి, కాంగ్రెస్‌లో తన పలుకుబడి నిరూపించుకున్నాడు. తర్వాత గాంధీజీతో ఏర్పడిన అభిప్రాయ భేదాలతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీని స్థాపించాడు. అది కాంగ్రెస్‌లోనే అంతర్భాగంగా పనిచేస్తుందని ప్రకటించాడు. 1940లో ఫార్వర్డ్‌ బ్లాక్‌ మహాసభ నాగ్‌పుర్‌లో జరిగింది. 

రెండో ప్రపంచ యుద్ధం: 1939 చివర్లో యుద్ధం ప్రారంభమైంది. గాంధీజీ బోధించిన అహింసాయుత విధానాల పట్ల కొంతమంది నాయకుల్లో భ్రమలు తొలగిపోవడం మొదలైంది. స్వాతంత్య్ర సాధనకు సాయుధ పోరాటమే మార్గమని, అవసరమైతే విదేశీ సహాయం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. వారిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఒకరు. యుద్ధకాలంలో ఆయన దేశమంతా పర్యటించాడు. గాంధీజీ అహింసా విధానం, నెహ్రూ మిత్ర రాజ్యాల కూటమి అనుకూల విధాన భావనలకు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశాడు. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదాన్ని, వలసవాద విధానాలను బహిరంగంగా విమర్శించాడు. యుద్ధ ప్రక్రియలో బ్రిటిషర్లకు, భారతీయులు సహకరించకూడదని సూచించాడు. దేశప్రజలకు తీవ్రవాద సిద్ధాంతాలు నూరిపోస్తున్నాడనే నెపంతో 1940లో ప్రభుత్వం బోస్‌ను అరెస్ట్‌ చేసింది. ఆ తర్వాత విడుదల చేసి గృహనిర్బంధంలో ఉంచింది. స్వాతంత్య్ర పిపాసకుడైన బోస్‌ 1941లో గృహనిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని పెషావర్, కాబూల్‌ మీదుగా జర్మన్‌ నగరం బెర్లిన్‌ చేరాడు. రెండో ప్రపంచయుద్ధం తీవ్రంగా సాగుతున్న సమయంలో భారతదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్‌ వ్యతిరేకులైన హిట్లర్, రిబ్బన్‌ ట్రాప్‌ లాంటి జర్మన్‌ నాయకులతో సంప్రదింపులు జరిపి సహాయం కోరాడు. బెర్లిన్‌ రేడియో ద్వారా భారతీయులకు సందేశం ఇచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. జర్మనీ నుంచి ఆశించినంత సహాయం లభించకపోవడంతో అక్కడి నుంచి జపాన్‌ చేరాడు.


జపాన్‌లో బోస్‌: అగ్రరాజ్య కూటమిలో సభ్య దేశమైన జపాన్, జర్మనీ పక్షాన ఆగ్నేయాసియాలో రెండో ప్రపంచ యుద్ధంలో వీరవిహారం చేసింది. ఆ దేశ సేనల ధాటికి బ్రిటిష్‌ వలస రాజ్య సైన్యాలు విలవిలలాడాయి. జపాన్‌ సైన్యం మలయాలో బ్రిటిష్‌ సైన్యాన్ని ఓడించింది. భారత బ్రిటిష్‌ సైన్యాధికారి కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ జపాన్‌ సైన్యానికి తలవంచాడు. అతడితో పాటు లొంగిపోయిన భారత-బ్రిటిష్‌ సైనికులు యుద్ధఖైదీలయ్యారు. ఈ భారతీయ యుద్ధఖైదీలు సహా కెప్టెన్‌ మోహన్‌సింగ్‌ను ఒప్పించి, అతడి నేతృత్వంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి 1942లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీని జపాన్‌ సైనికాధికారులు ఏర్పాటు చేశారు. భారతీయ విప్లవ పోరాట నాయకుడు రాస్‌ బిహారీ బోస్‌ అప్పటికే జపాన్‌ నగరం టోక్యోలో ఉన్నాడు. జపనీయుల మద్దతుతో సైన్యాన్ని సిద్ధం చేయడంలో సాయం చేశాడు. ‘ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌’ను స్థాపించి, దానికి నాయకత్వం వహించాల్సిందిగా రాస్‌ బిహారీని కోరారు. ఆగ్నేయాసియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు కూడా మాతృదేశ దాస్య విముక్తి కోసం ఆయనకు మద్దతు తెలిపారు. అన్నివిధాలుగా ఆగ్నేయాసియా తన కార్యకలాపాలకు అనువుగా ఉందని రాస్‌ బిహారీ భావించాడు. భారత జాతీయ సేన, జపాన్‌ ప్రభుత్వాల ద్వారా భారత స్వాతంత్య్ర పోరాటానికి అవసరమైన సంపూర్ణ సహాయ సహకారాలు సాధించే బాధ్యత తీసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌కు చేరిన సుభాష్‌ చంద్రబోస్, అక్కడి ప్రధాని టోజో, ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. టోజో ప్రోత్సాహం లభించింది. ఇదంతా సొంత వ్యక్తిత్వం, అంతర్జాతీయంగా తన సిద్ధాంతాలకు ఉన్న గౌరవంతోనే నేతాజీ సాధించారు.


భారత జాతీయ సైన్యం: సుభాష్‌ చంద్రబోస్‌కు జపాన్‌ ప్రోత్సాహం లభించడంతో ఆయన 1943, జులైలో రాస్‌ బిహారీ బోస్‌ నుంచి భారత స్వాతంత్య్ర సమితి (ఇండియన్‌ ఇండిపెండెన్స్‌ లీగ్‌) బాధ్యతలను, కెప్టెన్‌ మోహన్‌ సింగ్‌ నుంచి భారత జాతీయ సైన్యం బాధ్యతలను (ఐఎన్‌ఏ) స్వీకరించాడు. ఆ తర్వాత ఐఎన్‌ఏ పేరును ‘ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌’గా మార్చాడు. ఈ సైన్యంలోకి ఆగ్నేయాసియాలోని భారతీయులు, మలయా, సింగపూర్, బర్మాలో బందీలుగా ఉన్న భారతీయ సైనికులు చేరారు. భారత జాతీయ సైన్యాన్ని అయిదు రెజిమెంట్లుగా విభజించారు. వాటికి గాంధీ రెజిమెంట్, నెహ్రూ రెజిమెంట్, ఆజాద్‌ రెజిమెంట్, ఝాన్సీ రెజిమెంట్, బోస్‌ రెజిమెంట్‌ అని పేర్లు పెట్టారు. ఝాన్సీ రెజిమెంట్‌కు లక్ష్మీ సెహగల్‌ నాయకత్వం వహించారు. ఆ సైన్యానికి బోస్‌ కఠినమైన శిక్షణ ఇచ్చాడు. ‘నాకు రక్తపు బొట్టు ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను’ అని ఉద్రేకపూర్వకంగా ప్రజలను జాతిపోరాటంలో ఉత్తేజితులను చేశాడు.

సుభాస్‌ చంద్రబోస్‌ 1943, అక్టోబరు 21న సింగపూర్‌లో ‘ఆజాద్‌ హింద్‌’ తాత్కాలిక ప్రవాస భారత ప్రభుత్వం ఏర్పాటును ప్రకటించాడు. ప్రభుత్వాధినేతగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆర్థికమంత్రిగా ఎ.సి.ఛటర్జీ, ప్రచార సారథిగా ఎస్‌.ఎ.అయ్యర్‌ వ్యవహరించారు. సుభాష్‌ చంద్రబోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించాయి. ఆ దేశాలన్నీ ఎక్కువగా రెండో ప్రపంచ యుద్ధంలో అక్ష రాజ్య కూటమికి చెందినవే. అప్పటికే తమ అధీనంలో ఉన్న అండమాన్‌ నికోబార్‌ దీవులను బోస్‌ ప్రవాస ప్రభుత్వానికి జపాన్‌ బదిలీ చేసింది. బోస్‌ వాటికి షహీద్‌ దీవులు (అండమాన్‌), స్వరాజ్య దీవులు (నికోబార్‌) అని నామకరణం చేశాడు. తర్వాత నేతాజీ మాతృదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించాడు. సైన్యాన్ని బర్మా వైపు నడిపించాôడు. తన ప్రభుత్వ ప్రధాన కార్యాలయాన్ని, లీగ్‌ను, భారత జాతీయ సేన కమాండ్‌ను రంగూన్‌కు (బర్మా) తరలించాడు. జపాన్‌ సైనికులతో పాటు బోస్‌ సేన భారతదేశ ఈశాన్య ప్రాంతాలవైపు దూసుకొచ్చింది. మౌడాక్, కోహిమాలను స్వాధీనం చేసుకుంది. కోహిమాలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. జపాన్‌ సైన్యం, భారత జాతీయ సైన్యం అప్రతిహతంగా ముందుకు సాగుతున్న సమయంలో ప్రతికూల వాతావరణంతో ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక ఫలితాల ప్రభావం భారత జాతీయ సైన్యంపై పడింది. సైనిక సామగ్రి, మందుగుండు, ఆయుధాలు, నిధులు, ఆహారం సరఫరా నిలిచిపోయాయి. ఇంఫాల్‌ వద్ద భారత జాతీయ సైన్యం ఓటమి చవిచూసింది. 1945లో బోస్‌ జపాన్‌ విమానంలో పైగాస్, ఫార్మోసా మీదుగా టోక్యో బయలుదేరాడు. మార్గమధ్యంలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు జపాన్‌ రేడియో ప్రకటించింది. మహావీరుడిని కోల్పోయిన భారత జాతి దుఃఖసాగరంలో మునిగిపోయింది. సుభాస్‌ చంద్రబోస్‌ రచనల్లో ఒకటి ఇండియన్‌ స్ట్రగుల్‌. అసంపూర్ణంగా ఉన్న ఆయన ఆత్మకథ ‘యాన్‌ ఇండియన్‌ పిలిగ్రిమ్‌’. భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో భారత జాతీయ సేనకు ప్రత్యేక స్థానం ఉంది.  దేశ స్వాతంత్య్ర సమస్యను బ్రిటిష్‌ ఇండియా పరిధి దాటించి అంతర్జాతీయ వేదిక మీదకు భారత జాతీయ సేన విజయవంతంగా తీసుకెళ్లింది. భారతదేశ స్వాతంత్య్రాన్ని, బోస్‌ ప్రవాస ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా ఎనిమిది దేశాలు అధికారికంగా గుర్తించడం గొప్ప పరిణామం. దీనివల్ల బ్రిటిషర్లపై ఒత్తిడి పెరిగింది. భారతదేశ జాతీయసేన మత సామరస్యానికి, భారత జాతి సహజీవనానికి ప్రతీక. భారత జాతీయ సైనికుల వీరోచిత కార్యకలాపాలు, ధైర్యసాహసాలు, త్యాగనిరతి, దేశప్రజలకు గొప్ప స్ఫూర్తిగా నిలిచాయి. బ్రిటిష్‌ సైన్యంలోని భారతీయుల వైఖరిలో కూడా గణనీయమైన మార్పు వచ్చింది. దేశ స్వాతంత్య్ర సాధన వేగవంతమైంది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 18-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు