• facebook
  • whatsapp
  • telegram

చేరువైన స్వాతంత్య్రం (1944-45)

అందరూ ఏకమై.. అంతిమ లక్ష్యం వైపు!

 రాయబారాలు, రాజకీయ సంస్కరణల పేరుతో బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రయోజనం లేని ప్రతిపాదనలను భారత జాతీయ నేతల ముందుకు తీసుకొచ్చింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో భాగంగానే వాటిని చేసినప్పటికీ, ముస్లిం లీగ్‌ మంకుపట్టుతో మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి. దాంతో గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలో ప్రధాన పాత్ర పోషించే అవకాశం భారతీయుల చేజారిపోయింది. నేతాజీ నేతృత్వంలో ఆంగ్లేయులను హడలెత్తించిన జాతీయ సైన్యంపై గవర్నమెంటు కఠిన చర్యలకు తెగబడటంతో దేశం మరోసారి భగ్గుమంది. పరిస్థితులను పసిగట్టిన రాజప్రతినిధి శిక్షలను రద్దు చేశాడు. ఈ పరిణామాలు ప్రజల్లో ఐక్యతను పెంచి, దేశభక్తిని రగిలించాయి. అంతిమ లక్ష్యమైన సంపూర్ణ స్వాతంత్య్రం దిశగా వడి వడిగా అడుగులు వేయించాయి. 


రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయులను సానుకూలం చేసుకోవడానికి ఆంగ్లేయులు ప్రకటించిన ఆగస్టు ఆఫర్‌ (1940), క్రిప్స్‌ రాయబారం (1942) విఫలమయ్యాయి. భారత జాతీయ కాంగ్రెస్‌ సంపూర్ణ స్వరాజ్యమే లక్ష్యమని ప్రకటించింది. ఇదే సమయంలో ఇండియన్‌ ముస్లింలీగ్‌ ప్రత్యేక పాకిస్థాన్‌ తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని సృష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో ఆ రెండు వర్గాల మధ్య సామరస్యం లేకపోవడంతో భారత రాజకీయ సంస్కరణల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. వాటి మధ్య సయోధ్యకు కొందరు జాతీయ నాయకులు ప్రయత్నించారు.


రాజగోపాలచారి ఫార్ములా (1944): అనారోగ్య కారణాలతో 1944 మేలో గాంధీ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ సమయంలో దేశంలో అశాంతి, అలజడి అలముకొని ఉన్నాయి. గాంధీజీ 1944 సెప్టెంబరులో జిన్నాను కలిసి దేశ సమైక్యతను కాపాడేందుకు హిందూ-ముస్లిం ఐక్యత గురించి చర్చించినా ఫలితం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ నాయకుడు చక్రవర్తుల రాజగోపాలచారి దేశ స్వాతంత్య్ర సాధనలో హిందూ-ముస్లిం ఐక్యత, సామరస్యం ఆవశ్యకత ప్రాధాన్యంగా ఒక పథకాన్ని సూచించారు.రాజాజీ ఫార్ములాలోని ముఖ్యాంశాలు:  


* దేశ స్వాతంత్య్ర సాధనలో ఇండియన్‌ ముస్లింలీగ్, భారత జాతీయ కాంగ్రెస్‌తో సహకరించి అధికార బదిలీకి ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వంలో చేరాలి. * యుద్ధానంతరం ముస్లింలు అధికసంఖ్యలో ఉన్న దేశ ఈశాన్య, వాయవ్య ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, దానికి అనుగుణంగా దేశ విభజన లేదా సమైక్యత ప్రక్రియను నిర్ణయించాలి.* ఒకవేళ విభజనకు అనుగుణంగా నిర్ణయం జరిగితే దేశ రక్షణ, వాణిజ్యం, సమాచార సౌకర్యాలు వంటి అంశాలపై ఉభయులు ఒడంబడిక కుదుర్చుకోవాలి. అవన్నీ బ్రిటిషర్లు అధికారాన్ని పూర్తిగా బదిలీ చేసిన తర్వాతే అమల్లోకి వస్తాయి.ముస్లింలీగ్‌ మొండివైఖరి కారణంగా రాజాజీ ఫార్ములా విఫలమైంది. 1945 ఏప్రిల్‌లో జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ ఆత్మహత్య చేసుకోవడంతో ఐరోపా ఖండంలో రెండో ప్రపంచ యుద్ధ జ్వాలలు సద్దుమణిగాయి. అయినా ఆసియా ఖండంలో జపాన్‌ ముప్పు తొలగలేదు. ఇంగ్లండ్‌లో ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో అప్పటి వరకు ప్రతిపక్షంగా ఉన్న లేబర్‌ పార్టీ క్లిమెంట్‌ అట్లీ నేతృత్వంలో (ప్రధానమంత్రిగా) అధికారంలోకి వచ్చింది. భారత రాజకీయ సమస్య పరిష్కారం కోసం బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. అప్పటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ లండన్‌ వెళ్లి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాడు. 1945 జూన్‌లో, రాజ్యాంగ ప్రతిష్టంభన తొలగించడానికి తన ప్రణాళికను  ప్రకటించాడు.వేవెల్‌ ప్రణాళిక:


* ఈ ప్రణాళిక భారతదేశ గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలి పునర్నిర్మాణానికి ఉద్దేశించింది.* నూతన కార్యనిర్వాహక మండలిలో గవర్నర్‌ జనరల్, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ తప్ప మిగతా వారంతా భారతీయులే నియమితులవుతారు.


* కార్యనిర్వాహక మండలిలో హిందువులు, ముస్లింలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తారు. ఇతర మతాల వారికి నైష్పత్తిక ప్రాతినిధ్యం ఉంటుంది. 


* విదేశీ వ్యవహారాల శాఖ గవర్నర్‌ జనరల్‌ నుంచి భారత మంత్రికి బదిలీ (రక్షణ వ్యవహారాలు మినహా) అవుతుంది.


* కార్యనిర్వాహక మండలి ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం (1935 భారత ప్రభుత్వ చట్టం) పనిచేస్తుంది. యుద్ధానంతరం నూతన రాజ్యాంగ రచనకు చర్చలు జరుగుతాయి.ఈ ప్రకటన విడుదల తర్వాత లార్డ్‌ వేవెల్‌ సిమ్లాలో సమావేశాన్ని ఏర్పాటుచేసి భారత రాజకీయ నాయకులను ఆహ్వానించాడు. సుదీర్ఘంగా చర్చలు జరిపినప్పటికీ రాజకీయ పరిష్కారం విషయంలో విఫలమైంది. దీనికి ప్రధాన కారణం ముస్లింలీగ్, జిన్నాల మొండివైఖరేనని పలువురు విమర్శించారు. కాంగ్రెస్‌ తరఫు నుంచి కార్యనిర్వాహక మండలిలోకి ముస్లిం సభ్యులను ఎంపిక చేసేందుకు లీగ్‌ అంగీకరించలేదు. ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థ ముస్లిం లీగ్‌ మాత్రమేనని, గవర్నర్‌ జనరల్‌ కార్యనిర్వాహక మండలిలోని ముస్లిం సభ్యులనంతా ముస్లింలీగ్‌ సభ్యుల నుంచే తీసుకోవాలని పట్టుబట్టింది. కాంగ్రెస్‌ కూడా తనను హిందూ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నాన్ని అంగీకరించలేదు. కార్యనిర్వాహక మండలిలోని స్థానాలకు తమ తరఫున అన్ని మతాల వారిని ప్రతిపాదించే హక్కు ఉందని వాదించింది. గవర్నర్‌ జనరల్‌ కూడా ఉదాసీన వైఖరి అవలంబించడంతో చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం జిన్నా వాదనకు లొంగిపోయిందని పలువులు విమర్శించారు.భారత జాతీయ సైనికుల విచారణ:
రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆగ్నేయాసియాలో సుభాష్‌ చంద్రబోస్‌ నాయకత్వంలో భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) అప్రతిహతంగా విజృంభించింది. బోస్‌ ప్రవాసంలో సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు. అయితే జపాన్‌ సైనిక సహాయం అందకపోవడం, ఈశాన్య భారతదేశంలో ప్రతికూల వాతావరణ పరిస్థితి, బోస్‌ విమాన ప్రమాదంలో మరణించడం వంటి కారణాలతో ఐఎన్‌ఏ బ్రిటిషర్లకు లొంగిపోయింది. ఐఎన్‌ఏలో ప్రముఖపాత్ర వహించిన సైనికాధికారులపై రాజద్రోహ నేరారోపణ చేసి, ప్రభుత్వం బహిరంగంగా విచారించేందుకు నిశ్చయించింది. దీనికి కారణం వారికి వేసే శిక్షలతో భారతీయులను భయానికి గురి చేయాలని భావించడమే. 1945, నవంబరులో దిల్లీలోని ఎర్రకోటలో విచారణ ప్రారంభమైంది. జాతీయ సైన్యానికి చెందిన మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను ప్రభుత్వం విచారిస్తున్న విషయాన్ని వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రచురించి దేశ ప్రజలను జాగృతం చేశాయి. ఆ విచారణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు మొదలయ్యాయి. హర్తాళ్లు, బంద్‌లు జరిగాయి. 1945, నవంబరు 5 నుంచి 11 మధ్య ‘భారత జాతీయ సైన్య వారం’గా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాదులు భూలాభాయ్‌ దేశాయ్, తేజ్‌ బహదూర్‌ సప్రూ, జవహర్‌లాల్‌ నెహ్రూ తదితరులు ఐఎన్‌ఏ యుద్ధ ఖైదీల తరఫున వకాల్తా తీసుకుని వాదించారు. దేశం ఇంతటి ఆగ్రహావేశాలతో ఉన్నప్పటికీ ప్రభుత్వం తన పని చేసుకుంటూ పోయింది. మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ఖాన్, కల్నల్‌ గురుభక్ష్ సింగ్‌ ధిల్లాన్, మేజర్‌ పి.కె.సెహెగల్‌లను దేశద్రోహులుగా నిర్ణయించి ఉరిశిక్ష విధించడంతో దేశం ఒక్కసారిగా భగ్గుమంది. దేశ ప్రజల మానసిక స్థితిని గమనించిన ప్రభుత్వం ఒక మెట్టు దిగింది. అప్పటి రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ వీరికి విధించిన శిక్షను రద్దు చేశాడు. స్వాతంత్రోద్యమ గతిని ప్రభావితం చేసిన ఈ ఉదంతం ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికను పంపింది.భారత జాతీయ సైన్యం ఒకప్పుడు ఆంగ్లేయుల అధీనంలోని సైన్యమే. వీరు ఆగ్నేయాసియాలో జపాన్‌కి పట్టుబడి, యుద్ధ ఖైదీలైన తర్వాత సంభవించిన పరిణామాల వల్ల భారత జాతీయ సైన్యంగా మారారు. వీరు మాతృదేశ విముక్తి కోసం చేసిన పోరాటం చూసిన అనంతరం వారి విధేయతపై బ్రిటిష్‌ ప్రభుత్వానికి విశ్వాసం సడలింది. ఐఎన్‌ఏ స్ఫూర్తి బ్రిటిష్‌ భారతీయ సైన్యంలోకి పాకడం పట్ల కూడా అధికారులు ఆందోళన చెందారు. ఆ త్యాగధనుల పోరాటం భారత జాతీయవాద పార్టీల్లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఐక్యతను పెంచింది. ఐఎన్‌ఏ పోరాటం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. భారతీయుల్లో దేశభక్తిని మరింతగా ఇనుమడింపజేసి, స్వాతంత్య్ర సాధన లక్ష్యాన్ని మరింత చేరువ చేసింది.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం


 

Posted Date : 30-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు