• facebook
  • whatsapp
  • telegram

ప్రాథమిక హక్కులు

1. మత స్వాతంత్య్రపు హక్కు గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్‌లో వివరించారు?
జ: ఆర్టికల్స్‌ 25 - 28

 

2. ‘భారతీయులు తమకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు’ అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 25

 

3. ఆర్టికల్‌ 26లో పేర్కొన్న అంశాన్ని గుర్తించండి.
1) భారతీయులు మతపరమైన వ్యవహారాల నిర్వహణలో స్వేచ్ఛను కలిగి ఉన్నారు.
2) మతాభివృద్ధికి అవసరమైన ధర్మాదాయ సంస్థలను స్థాపించి, నిర్వహించుకోవచ్చు.
3) ధర్మాదాయ సంస్థలు సమకూర్చుకునే నిధులపై పన్నులు ఉండవు.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

4. మన దేశంలో మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజల నుంచి ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది?
జ: ఆర్టికల్‌ 27

 

5. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ధన సహాయం పొందే ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో మత బోధనను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిషేధిస్తోంది?
జ: ఆర్టికల్‌ 28

 

6. ఆర్టికల్‌ 25 ప్రకారం హిందువులు అంటే?
1) హిందువులు            2) జైనులు, బౌద్ధులు         3) సిక్కులు            4) అందరూ
జ: 4 (అందరూ)

 

7. ఎస్‌.పి. మిట్టల్‌ ‌VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు సంబంధించి సరికానిది?
జ: ఆర్య సమాజం హిందూమతంలో అంతర్భాగం

 

8. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నారని రాజ్యాంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటోంది?
జ: ఆర్టికల్‌ 29

 

9. అల్పసంఖ్యాక వర్గాలవారు తమ ప్రత్యేక భాష, లిపి, సంస్కృతులను అభివృద్ధి చేసుకునేందుకు ప్రత్యేక విద్యాసంస్థలను స్థాపించుకోవచ్చు. దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని ప్రభుత్వం నుంచి అందుకోవచ్చని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ చెబుతోంది?
జ: ఆర్టికల్‌ 30

 

10. పార్లమెంటు రూపొందించిన చట్టం ప్రకారం అల్ప సంఖ్యాక వర్గాన్ని గుర్తించండి.
జ: మతపరమైన అల్పసంఖ్యాక వర్గం, సంస్కృతి పరమైన అల్పసంఖ్యాక వర్గం

 

11. మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను గుర్తించేదుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: దేశం

 

12. భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలను నిర్దారించేందుకు దేన్ని యూనిట్‌గా తీసుకుంటారు?
జ: రాష్ట్రం

 

13. ప్రారంభ రాజ్యాంగంలో ఆస్తిహక్కు గురించి ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?
జ: ఆర్టికల్‌ 31

 

14. ఆస్తిహక్కుకు సంబంధించి కిందివాటిలో సరికానిది?
జ: దీన్ని 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు.

 

15. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిదని ఎవరు అభివర్ణించారు?
జ: డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌

 

16. కిందివాటిలో రిట్స్‌కు సంబంధించి సరికానిది?
1) రిట్‌ అంటే ఉన్నత న్యాయస్థానం జారీ చేసే తప్పనిసరిగా పాటించాల్సిన ఆదేశం.
2) ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.
3) ఆర్టికల్‌ 32 ప్రకారం సుప్రీంకోర్టు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తుంది.
4) ఆర్టికల్‌ 226 ప్రకారం హైకోర్టులు 5 రకాల రిట్స్‌ జారీ చేస్తాయి.
జ: 2 (ఆదేశిక సూత్రాల అమలు కోసం వీటిని న్యాయస్థానాలు జారీ చేస్తాయి.)

 

17. ఆర్టికల్‌ 33 ప్రకారం ప్రాథమిక హక్కులు ఎవరికి పూర్తిగా లభించవు?
1) సైనిక, పారామిలటరీ దళాలు                           2) గూఢచార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు
3) పోలీసు, ఇతర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు            4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

18. ఆర్టికల్‌ 34 ప్రకారం విధించే ఏ శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తారు?
జ: సైనిక శాసనం

 

19. ‘మీరు నిర్బంధించిన వ్యక్తిని ప్రయాణ సమయం మినహాయించి మొత్తం శరీరంతో సహా 24 గంటల్లోగా నా ముందు హాజరు పరచు’ అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశం/రిట్‌ ఏది?
జ: హెబియస్‌ కార్పస్‌

 

20. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అధికారాలు లేనప్పటికీ ఎవరైనా అధికారాలు చెలాయిస్తుంటే వారిని నియంత్రించేందుకు న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: కోవారెంటో

 

21. దిగువ న్యాయస్థానం తన పరిధిలో లేని కేసును విచారిస్తుంటే తక్షణం ఆ విచారణను నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం జారీచేసే రిట్‌?
జ: ప్రొహిబిషన్‌

 

22. కిందివాటిలో న్యాయస్థానాలు న్యాయస్థానాలపైన జారీ చేసే రిట్‌ ఏది?
1) సెర్షియోరరీ          2) ప్రొహిబిషన్‌        3) సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌         4) మాండమస్‌
జ: 3 (సెర్షియోరరీ, ప్రొహిబిషన్‌)

 

23. ప్రభుత్వోద్యోగి తన విధిని సక్రమంగా నిర్వహించకపోతే ‘నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు’ అంటూ ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్‌?
జ: మాండమస్‌

 

24. హెబియస్‌ కార్పస్‌ రిట్‌ను ఎవరిపై జారీచేసే అవకాశం ఉంటుంది?
జ: ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేట్‌ వ్యక్తులు

 

25. హక్కులు, విధులు ఒకే నాణేనికి ఉన్న రెండు పార్శ్వాల వంటివి అని అభివర్ణించినవారు?
జ: హెచ్‌.జె. లాస్కి

 

26. న్యాయస్థానం ఒక పనిని చేయమని లేదా వద్దని ఇచ్చే ఆదేశాన్ని ఏమంటారు?
జ: ఇంజక్షన్‌

 

27. PIL అంటే?
జ: Public Interest Litigation

 

28. PIL అనే భావన (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) మొదటిసారిగా ఏ దేశంలో ఆవిర్భవించింది?
జ: అమెరికా

 

29. మన దేశంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) అనే భావనకు విస్తృత ప్రాచుర్యం కల్పించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి?
జ: జస్టిస్‌ పి.ఎన్‌. భగవతి

 

30. న్యాయస్థానం కేసును స్వతహాగా అంటే తనకు తానే తీసుకుని విచారించడాన్ని ఏమంటారు?
జ: సుమోటో

 

రచయిత - బంగారు సత్యనారాయణ

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్ర సంబంధాలు

1. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర శాసన సంబంధాల గురించి ఎక్కడ పేర్కొన్నారు?
1) 10వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
2) 11వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 245 నుంచి 255 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 246 నుంచి 256 వరకు


2. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?
1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 263 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు
3) 13వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 300 వరకు
4) 14వ భాగంలోని ఆర్టికల్‌ 256 నుంచి 262 వరకు


3. రాజ్యాంగంలో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలను ఎక్కడ పేర్కొన్నారు?
1) 11వ భాగంలోని ఆర్టికల్‌ 244 నుంచి 261 వరకు 
2) 12వ భాగంలోని ఆర్టికల్‌ 263 నుంచి 290 వరకు 
3) 12వ భాగంలోని ఆర్టికల్‌ 264 నుంచి 300 వరకు 
4) 13వ భాగంలోని ఆర్టికల్‌ 300 నుంచి 322 వరకు

 

4. మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు అనే మూడు రకాల అధికారాల విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్‌లో పేర్కొన్నారు?
1) 5          2) 6               3) 7              4) 8


5. భారత ప్రభుత్వం అంతర్‌ రాష్ట్ర నదీజలాల వివాదాల చట్టం, రివర్‌ బోర్డ్‌ చట్టాలను ఎప్పుడు రూపొందించింది?
1) 1956        2) 1958         3) 1959         4) 1963


6. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1966లో ఎవరి అధ్యక్షతన మొదటి పరిపాలనా సంస్కరణల సంఘాన్ని ఏర్పాటు చేసింది?
1) ఫజుల్‌ అలీ       2) కేదారనాథ్‌      3)  మొరార్జీ దేశాయ్‌       4) జయప్రకాష్‌ నారాయణ్‌


7. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం ఎవరి అధ్యక్షతన ఒక అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసింది?
1) ఎం.సి. సెతల్‌వాడ్‌        2) నరహరిరావు      3)  అశోక్‌బింద్రా        4) సందీప్‌ వాఘేలా


8. కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ‘అంతర్‌ రాష్ట్ర మండలి’ని ఏర్పాటు చేయాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ పేర్కొంటుంది?
1) ఆర్టికల్‌ 261        2) ఆర్టికల్‌ 262         3)  ఆర్టికల్‌ 263          4) ఆర్టికల్‌ 264


9. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 1969లో తమిళనాడులోని కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది?
1) పి.వి. రాజమన్నార్‌       2) పి.కె.తుంగన్‌        3)  వి.కె.అన్నామలై         4) దత్తుమిశ్రా


10. అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లను రద్దు చేయాలని సిఫారసు చేసిన కమిటీ? 
1) నానీపాల్కీవాలా కమిటీ            2)రంగరాజన్‌ కమిటీ 
3)  పి.వి. రాజమన్నార్‌ కమిటీ     4) చంద్రశేఖర్‌ కమిటీ


11. పంజాబ్‌లోని అకాలీదళ్‌ పార్టీ 1973లో రూపొందించిన ‘ఆనందపూర్‌ సాహెబ్‌’ తీర్మానంలో కేంద్రం యొక్క అధికార పరిధి దేనికి పరిమితం కావాలని సిఫారసు చేసింది?
1) రక్షణ, కరెన్సీ        2) అంతర్జాతీయ సంబంధాలు 
3)  కమ్యూనికేషన్ల వ్యవస్థ         4) అన్నీ


12. ఇందిరా గాంధీ ప్రభుత్వం 1983లో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం ఎవరి అధ్యక్షతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది? 
1) రంజిత్‌ సింగ్‌ సర్కారియా  2) రంగనాథ్‌ మిశ్రా 
3)  గోపాల ద్వివేది              4) నానీపాల్కీవాలా


13. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫారసు? 
1) ఒక వ్యక్తిని సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు. 
2) క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నవారిని గవర్నర్‌గా నియమించకూడదు.
3)  గవర్నర్‌ను నియమించే ముందు సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించాలి.
4) పైవన్నీ


14. రంజిత్‌సింగ్‌ సర్కారియా కమిషన్‌ 247 సిఫారసులతో 1987లో తన నివేదికను ఎవరికి సమర్పించింది?
1) ఇందిరా గాంధీ   2) రాజీవ్‌ గాంధీ     3)  వి.పి.సింగ్‌  4) చంద్రశేఖర్‌


15. కిందివారిలో సర్కారియా కమిషన్‌లోని సభ్యులు? 
1) బి. శివరామన్‌                       2) ఎస్‌.ఆర్‌. సేన్‌     
3)  బి. శివరామన్, ఎస్‌.ఆర్‌. సేన్‌  4) ఎల్‌.ఎన్‌.సిన్హా


16. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై అధ్యయనం కోసం 2007లో డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఎవరి అధ్యక్షతన ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసింది?
1) మదన్‌మోహన్‌ పూంచీ  2) రఘురాం రాజన్‌   3)  వినీత్‌ బ్రిజ్‌లాల్‌   ) రాజేంద్రసచార్‌


17. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న ఎన్‌.టి.రామారావు ప్రభుత్వం చొరవతో కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై రాజకీయ తీర్మానాన్ని ఎక్కడ చేశారు? 
1) హైదరాబాద్‌   2) విశాఖపట్నం    3)  విజయవాడ   4) కర్నూలు


18. ఆంధ్రప్రదేశ్‌లో 1983 మే 28న జరిగిన సమావేశానికి ఎన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు హాజరయ్యాయి? 
1) 9            2) 14           3)  16              4) 18


19. విజయవాడలో 1983 మే 28న జరిగిన సమావేశంలో పాల్గొన్నవారు?
1) అటల్‌ బిహారి వాజ్‌పేయీ       2) చంద్రశేఖర్‌ 
3)  ఫరూక్‌ అబ్దుల్లా                4) పైవారందరూ


20. కేంద్ర, రాష్ట్ర సంబంధాలను చర్చించడానికి 1983లో ప్రతిపక్షాల రెండో సమావేశం ఫరూక్‌ అబ్దుల్లా అధ్యక్షతన ఎక్కడ జరిగింది?
1) శ్రీనగర్‌        2) సిమ్లా          3)  గాంధీనగర్          ‌     4) అలహాబాద్‌


21. కేంద్ర, రాష్ట్ర సంబంధాలపై 19 ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొన్న సమావేశం 1984 జనవరి 13న ఎక్కడ జరిగింది?
1) మద్రాసు         2) మైసూరు              3)  కలకత్తా          4) హైదరాబాద్‌


22. రాష్ట్ర జాబితాలోని ఏ అంశాన్ని 1976లో 42వ సవరణ ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం ‘ఉమ్మడి జాబితా’లోకి మార్చింది?
1) విద్య            2) తూనికలు, కొలతలు         3)  కుటుంబ నియంత్రణ      4) అన్నీ


23. 1967లో జరిగిన ఎన్నో లోక్‌సభ సాధారణ ఎన్నికల అనంతరం మన దేశంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో ఘర్షణలు ప్రారంభమయ్యాయి?
1) 3వ       2) 4వ           3)  5వ           4) 6వ


24.  సమాఖ్య విధానంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల సక్రమ పంపిణీకి తగిన సిఫారసులు చేసేందుకు ఏర్పాటైన ఏ కమిటీ 1971లో తన నివేదికను  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది?
1) డి.ఆర్‌.గాడ్గిల్‌        2) దంతెవాలా        3)  రిజువరై        4) భిమల్‌జలాన్‌


25. గవర్నర్‌లకు కచ్చితమైన పదవీకాలం ఉండాలని, వారిని 5 ఏళ్లపాటు పదవిలో కొనసాగించాలని సిఫారసు చేసిన కమిటీ? 
1) మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం     
2) రాజమన్నార్‌ కమిటీ 
3)  మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌     
4) లక్డావాలా కమిషన్‌


26. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ను చివరి అస్త్రంగా మాత్రమే వినియోగించాలని సిఫారసు చేసిన కమిషన్‌? 
1) సర్కారియా కమిషన్‌         2) మదన్‌మోహన్‌ పూంచీ కమిషన్‌ 
3)  రంగరాజన్‌ కమిషన్‌          4) రాగ్యానాయక్‌ కమిషన్‌


27. రెండో పరిపాలనా సంస్కరణల సంఘాన్ని 2005లో ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు?
1) జయప్రకాష్‌ నారాయణ్‌     2) వీరప్ప మొయిలీ    3)  చంద్రలాల్‌ మిశ్రా     4) ఉషా మెహ్రా


సమాధానాలు: 1-2; 2-1; 3-3; 4-3; 5-1; 6-3; 7-1; 8-3; 9-1; 10-3; 11-4; 12-1; 13-4; 14-2; 15-3; 16-1; 17-3; 18-2; 19-4; 20-1; 21-3; 22-4; 23-2; 24-1; 25-3; 26-1;  27-2. 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర ఎన్నికల సంఘం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. కేంద్ర ఎన్నికల సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ భాగంలో వివరించారు?
జ: XVవ భాగం, ఆర్టికల్‌ 324 - 329

 

2. మన దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
జ: 1950, జనవరి 25

 

3. ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ నినాదంతో నిర్వహిస్తున్నారు?
జ: Proud to be voter - Ready to vote

 

4. రాష్ట్రపతి నియమించే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన, ఇతర కమిషనర్‌ల పదవీ కాలం?
జ: 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు

 

5. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను ఎవరిని తొలగించే పద్ధతిలో తొలగిస్తారు?
జ: సుప్రీంకోర్టు న్యాయమూర్తి

 

6. 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చిన ప్రధాని ఎవరు?
జ: రాజీవ్‌గాంధీ

 

7. బహుళ సభ్య ఎన్నికల సంఘాన్ని అప్పటి ప్రధాని విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ఎప్పుడు ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చారు?
జ: 1990 జనవరి

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర ఎన్నికల సంఘం

       భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది.
రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించారు. మనదేశంలో 1950, జనవరి 25 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చింది. న్యూదిల్లీలోని ‘నిర్వాచన్‌ సదన్‌’ దీని ప్రధాన కార్యాలయం.

 

 జాతీయ ఓటర్ల దినోత్సవం 
కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడి 2011, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు. యువత ఓటర్ల జాబితాలో చేరడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. 'Proud to be Voter - Ready to Vote '  అనేది ఓటర్ల దినోత్సవ నినాదం.
 

ఓటర్ల ప్రతిజ్ఞ: ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని... కుల, మత, జాతి, వర్గ, భాష లాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని’ ప్రతిజ్ఞ చేస్తున్నాం.
 

 ఏకసభ్య - బహుళ సభ్య ఎన్నికల సంఘం
     1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో ఏకసభ్య ఎన్నికల సంఘంగా కొనసాగింది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళ సభ్య ఎన్నికల సంఘం’గా మార్చింది. దీనిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. 1990 జనవరిలో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తిరిగి ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చగా పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1993, అక్టోబరు 1న బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చింది.
 

ఆర్టికల్‌ 325: ఎన్నికల నిర్వహణ విషయంలో ఓటర్ల జాబితాను తయారుచేసేటప్పుడు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఒకే జాబితాను రూపొందించాలి.
 

ఆర్టికల్‌ 326: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలన్నీ సార్వజనీన వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై జరుగుతాయి. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వయోజన ఓటుహక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు. దీన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.
 

ఆర్టికల్‌ 327: రాజ్యాంగ నియమాలకు లోబడి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలను పార్లమెంటు రూపొందిస్తుంది.
 

ఆర్టికల్‌ 328: శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను పార్లమెంటు రూపొందించనప్పుడు రాష్ట్ర శాసనసభలు రూపొందించుకోవచ్చు.
 

ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన శాసనాల రాజ్యాంగ బద్ధత, వివిధ నియోజకవర్గాల సీట్ల కేటాయింపును న్యాయస్థానంలో సవాలు చేయకూడదు.
 

 డిపాజిట్‌ కోల్పోవడం

     రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థులు రూ.15000ను డిపాజిట్‌గా జమచేయాలి. లోక్‌సభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12500; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.10,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5000ను డిపాజిట్‌గా జమచేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్‌ను చెల్లిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. దీన్నే ‘డిపాజిట్‌ కోల్పోవడం’ అంటారు.
 

వ్యయ పరిమితి: అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితిని లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా; రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఎన్నికల వ్యయపరిమితికి 2014, ఫిబ్రవరి 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
 

తొలగింపు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలో అంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా మాత్రమే తొలగిస్తారు. ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.
 

 అధికారాలు, విధులు
* ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం పరిపాలనా, సలహారూపకమైన, అర్ధన్యాయ సంబంధమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
* కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది, సవరణ చేస్తుంది.
* పార్లమెంటు రూపొందించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చట్టం ప్రకారం దేశంలోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
* వివిధ రాజకీయ పార్టీలను గుర్తించి, వాటికి ఎన్నికల గుర్తులను కేటాయించడం. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తేదీలను నిర్ణయించడం.
* ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి, అమలుచేయడం.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్లకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* వివిధ రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలు విని పరిష్కరించడం.

 

 అభ్యర్థులను ఓటర్లు బలపరచడం
* రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాలి.
* ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 20 మంది బలపరచాలి.
* జాతీయ లేదా రాష్ట్ర పార్టీల తరఫున టికెట్‌ పొందిన వ్యక్తి లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయాలంటే కనీసం ఒక ఓటరు బలపరచాలి.
* స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ తరఫున లోక్‌సభ లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రానికి సంబంధిత నియోజకవర్గంలోని కనీసం పది మంది ఓటర్ల మద్దతు ఉండాలి.
* లోక్‌సభకు పోటీ చేయాలంటే దేశంలోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* రాష్ట్ర శాసనసభకు గవర్నర్‌ నామినేట్‌ చేసే వ్యక్తి తప్పనిసరిగా అదే రాష్ట్రానికి చెంది ఉండాలి.

 

 సుప్రీంకోర్టు తీర్పులు
మక్కాల్‌ శక్తి కచ్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం: ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే అధికారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
 

మహేందర్‌సింగ్‌ గిల్‌ Vs భారత ప్రభుత్వం: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు లేదా శాసనసభలు రూపొందించకపోతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని తెలిపింది.
 

ఎన్నికల యంత్రాంగం
కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్‌లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంటుంది. వర్గ స్థాయిలో ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా; పోలింగ్‌బూత్‌ స్థాయిలో ప్రభుత్వోద్యోగి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర మంత్రిమండ‌లి

 రాజ్యాంగరీత్యా దేశాధిపతి రాష్ట్రపతి. అయితే మంత్రి మండలి వాస్తవమైన కార్యనిర్వాహక సంస్థ. రాజ్యాంగం ప్రకారం విధినిర్వహణలో రాష్ట్రపతికి సలహాలు ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో మంత్రిమండలి ఉంటుంది. కేంద్ర మంత్రిమండలి అనేది కేంద్ర కార్యనిర్వాహకశాఖలో వివిధ రకాల మంత్రులతో కూడిన సమూహం.
 

కేంద్ర మంత్రిమండలి వర్గీకరణ : 
          భారతదేశంలో 1947 ఆగస్టు 15న ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ నాయకత్వంలో మొదటి 'మంత్రిమండలి' ఏర్పాటయినప్పుడు దాన్ని మంత్రిపరిషత్ లేదా క్యాబినెట్ అని పిలిచేవారు. నెహ్రూ మంత్రిమండలిని వ్యవస్థీకృతం చేయడానికి గోపాలస్వామి అయ్యంగార్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మొత్తం మంత్రిమండలిని మూడు వర్గాలుగా విభజించి, ఒక్కొక్క వర్గానికి ప్రత్యేక స్థాయి, హోదా కల్పించి, తగిన విధులు బాధ్యతలు అప్పగించాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసులను పూర్తిగా కాకున్నా, చాలావరకు పాటించి మూడు అంచెలలో కేంద్ర మంత్రిమండలిని ఏర్పరచారు. అవి:
1. క్యాబినెట్ మంత్రులు
2. స్టేట్ మంత్రులు లేదా రాజ్య మంత్రులు

3. డిప్యూటీ లేదా సహాయ మంత్రులు.
 

క్యాబినెట్ మంత్రులు :
*    కేంద్ర ప్రభుత్వంలోని రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, హోం, రైల్వే లాంటి ముఖ్య శాఖలకు అధిపతులుగా క్యాబినెట్ హోదాగల మంత్రులు వ్యవహరిస్తారు.
*    క్యాబినెట్ మంత్రులు తమ మంత్రిత్వశాఖల నిర్ణయాలు తీసుకోవడంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు.
*    కేంద్ర మంత్రిమండలి, కేంద్ర క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులకు నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది.
*    అంతర్జాతీయ, జాతీయ వ్యవహారాలను విశ్లేషించి నిర్ణయాలు తీసుకోవడంలో క్యాబినెట్ మంత్రులు ప్రధానమంత్రికి సన్నిహిత నాయకులుగా వ్యవహరిస్తారు.
*    క్యాబినెట్‌మంత్రులు అధికారపార్టీలో అత్యంత ప్రాబల్యం, విశేష పరిపాలనానుభవం పొందినవారై ఉంటారు.

 

రాజ్య మంత్రులు లేదా స్టేట్ మంత్రులు :
*    క్యాబినెట్ మంత్రికి అప్పగించిన ప్రభుత్వశాఖల్లో ఒక శాఖను స్టేట్‌మంత్రులు స్వతంత్రంగా నిర్వహించవచ్చు. వీరు తమ మంత్రిత్వశాఖకు సంబంధించి చర్చ జరిగే సమయంలో మాత్రమే ప్రత్యేక ఆహ్వానంపై క్యాబినెట్ సమావేశాలకు హాజరవుతారు. వీరికి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో ఏ పాత్ర ఉండదు. కొన్ని మంత్రిత్వశాఖల్లో ఇద్దరు లేదా ముగ్గురు రాజ్య మంత్రులు ఉండవచ్చు.

డిప్యూటీ మంత్రులు లేదా సహాయ మంత్రులు :
*    మంత్రిత్వశాఖకు సంబంధించిన శాసన, పరిపాలనా వ్యవహారాల్లో క్యాబినెట్ మంత్రులకు సహాయపడేందుకు నియమితులయ్యేవారు డిప్యూటీ మంత్రులు లేదా సహాయమంత్రులు. బ్రిటన్‌లో వీరిని జూనియర్ మంత్రులు, పార్లమెంట్ కార్యదర్శులని పిలుస్తారు.
*    డిప్యూటీ మంత్రులకు స్వతంత్ర ప్రభుత్వ శాఖలను నిర్వహించే బాధ్యత ఉండదు.
*    పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సిన బిల్లులకు సంబంధించి, సభ్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయడం మొదలైన కొన్ని విధులు నిర్వహిస్తారు.
*    ఈ విధంగా కేంద్ర మంత్రిమండలిలో క్యాబినెట్ మంత్రులు, రాజ్య మంత్రులు, డిప్యూటీ మంత్రులు ఉంటారు. మొత్తం కేంద్ర మంత్రిమండలికి ప్రధానమంత్రి అధినేత.

 

మంత్రిమండలి నియామకం :
*    75(1) ప్రకరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి సభ్యులను ప్రధానమంత్రి సలహాపై రాష్ట్రపతి నియమిస్తారు.
మంత్రివర్గ నిర్మాణంలో ప్రధానిదే అంతిమ నిర్ణయం.
*    ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలి సభ్యుల పేర్లతో కూడిన జాబితాను రాష్ట్రపతికి సమర్పిస్తే, రాష్ట్రపతి వారిని నియమిస్తారు.
*    సాధారణంగా ప్రధానమంత్రి తన పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుల్లో కొందరిని మంత్రులుగా ఎంపిక చేస్తాడు.

*    సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ప్రధానమంత్రి భావసారూప్యమున్న ఇతర పార్టీలవారికి కూడా కేంద్ర మంత్రిమండలిలో భాగస్వామ్యం కల్పించవచ్చు. సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులందరు కూడా ప్రధానమంత్రి మార్గదర్శకత్వంలోనే నడచుకోవాలి.
 

మంత్రుల సంఖ్య :
*    మంత్రిమండలిలో ఎందరిని నియమించాలి? కనిష్ఠ, గరిష్ఠ సంఖ్య ఎంత? అనే విషయాల గురించి రాజ్యాంగంలో వివరణలేదు.
*    మొదటి పరిపాలనా సంస్కరణల సంఘం క్యాబినెట్ మంత్రుల సంఖ్య 16కు మించరాదని, మొత్తం మంత్రుల సంఖ్య 45కు మించరాదని సిఫారసు చేసింది. కానీ ఈ నియమం ఆచరణలో లేదు.
*    2003లో రాజకీయపార్టీల్లో చీలికల నిరోధానికిగాను మంత్రివర్గ సైజును పరిమితం చేశారు. దీనికోసం 91వ రాజ్యాంగ సవరణ చట్టం తీసుకొచ్చారు. ఈ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ మంత్రుల సంఖ్య దిగువసభ అంటే లోక్‌సభ లేదా విధానసభలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 15 శాతం మించరాదు.

 

మంత్రుల అర్హతలు : కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులయ్యేవారికి కొన్ని అర్హతలుండాలి.
1. పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యత్వం ఉండాలి.
2. ఒకవేళ సభ్యత్వం లేనిపక్షంలో మంత్రిగా ప్రమాణం స్వీకరించాక ఆరునెలల్లోగా ఉభయసభల్లో ఏదో ఒకదానిలో సభ్యుడవ్వాల్సి ఉంటుంది.

పదవీ ప్రమాణం : రాష్ట్రపతి మంత్రులతో పదవీప్రమాణం చేయిస్తారు. రాజ్యాంగంలోని మూడో షెడ్యూల్‌లో పదవీ ప్రమాణ స్వీకార నమూనా పత్రం ఉంటుంది.
 

మంత్రి మండలి కాలపరిమితి : కేంద్ర మంత్రిమండలి సభ్యుల కాలపరిమితి గురించి భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొనలేదు. 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి ఇష్టాయిష్టాల మేరకు కేంద్ర మంత్రులు పదవుల్లో కొనసాగుతారు. అంటే రాష్ట్రపతి సంతృప్తి మేరకు కేంద్ర మంత్రులు అధికారంలో ఉంటారు. 75(3) ప్రకరణ ప్రకారం లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడంలో విఫలమైతే లేదా బాధ్యత వహించాల్సిన సభలో విశ్వాసం కోల్పోతే మంత్రివర్గం రాష్ట్రపతి సంతృప్తికి దూరమైనట్లే అవుతుంది. సాధారణంగా లోక్‌సభ కాల పరిమితి ప్రకారం మంత్రిమండలి అయిదేళ్లు ఉండవచ్చు.
 

మంత్రుల తొలగింపు :మంత్రులు వ్యక్తిగతంగా రాష్ట్రపతికి, సమష్టిగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. క్యాబినెట్ నిర్ణయాలలో మంత్రులు ఏకీభవించకపోతే వారు స్వయంగా రాష్ట్రపతికి రాజీనామా సమర్పించి తొలగిపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రధానమంత్రి ఒక మంత్రిని పదవినుంచి తొలగించాలని సంకల్పిస్తే తొలగించవచ్చు. ప్రధానమంత్రి తనకు ఇష్టంలేని మంత్రిని రాజీనామా చేయాల్సిందిగా కోరవచ్చు లేదా మంత్రిని తొలగించాల్సిందిగా రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఈ విధంగా మంత్రులు రాష్ట్రపతిచే నియమితులవుతారు. రాష్ట్రపతిచే తొలగించబడతారు. దీనినే 'మంత్రులు రాష్ట్రపతికి వ్యక్తిగత బాధ్యత వహించడం' అంటారు.

మంత్రిమండలి సమష్టి బాధ్యత : 
రాజ్యాంగ నిబంధన 75(3) ప్రకారం మంత్రిమండలి లోక్‌సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాతలు సమష్టి బాధ్యత సూత్రాన్ని బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు.
సమష్టి బాధ్యత అంటే, కార్యనిర్వాహకశాఖలోని మంత్రులు అధికారంలో ఉండగా తమ చర్యలకు, కార్యకలాపాలకు లోక్‌సభకు సమష్టిగా బాధ్యత వహించడం. మంత్రిమండలి తమవల్ల జరిగే తప్పొప్పులకు పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటుంది.
సమష్టి బాధ్యత ప్రకారం మంత్రిమండలి ప్రతి ప్రభుత్వ విధానానికి కట్టుబడి ఉండాలి. మంత్రులందరూ జట్టుగా కలిసి పదవిలో ఉంటారు లేదా పదవిని వదలుకుంటారు.
సమష్టి బాధ్యతా సూత్రాన్ని ప్రధానమంత్రి ఆచరణలో ఉంచుతారు. మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించిన నిర్ణయాలను ప్రతి ఒక్క మంత్రి గౌరవించేట్లు, అమలులో ఉంచేట్లు చర్యలు తీసుకుంటారు.
కార్య నిర్వాహకశాఖ సమష్టి బాధ్యతను శాసన నిర్మాణశాఖ అనేక విధాలుగా ఆచరణలో ఉంచుతుంది. ఉదాహరణకు పార్లమెంటు, మంత్రి మండలిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించి ఆమోదిస్తుంది. అవిశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తక్షణమే మంత్రిమండలి అధికారాన్ని కోల్పోతుంది.
సమష్టి బాధ్యత అనేది మంత్రిమండలికి, లోక్‌సభకు సంబంధించిన అంశం. శాసననిర్మాణశాఖ, కార్యనిర్వాహకశాఖలు రెండూ విడివిడిగా తమ సామర్థ్యాలను నిరూపించుకునేందుకు వీలుంటుంది. మంత్రిమండలి సమైక్యంగా, బాధ్యతాయుతంగా, సదవగాహనతో వ్యవహరించేందుకు సమష్టి బాధ్యత దోహదపడుతుంది.
సమష్టి బాధ్యతలో ఒక మంత్రి తన వ్యక్తిగత మంత్రిత్వశాఖ నిర్వహణ విషయంలో బాధ్యత వహించడంతోపాటు తన సహచర మంత్రుల మంత్రిత్వశాఖ విధానాలు, పనిచేసే తీరు మొదలైన విషయాల్లో కూడా కలిసికట్టుగా బాధ్యత వహిస్తారు.

 

మంత్రిమండలి పనిచేసే తీరులో పార్లమెంటరీ సంప్రదాయాలు - సూత్రాలు :
1. రాష్ట్రపతి పేరిట పరిపాలనా నిర్వహణ :
 రాజ్యాంగరీత్యా రాష్ట్రపతి దేశాధినేత. రాష్ట్రపతి స్వయంగాగానీ, అధికారుల ద్వారాగానీ విధులు, బాధ్యతలు నెరవేరుస్తారు.74(1) నిబంధన ప్రకారం రాష్ట్రపతికి బాధ్యతల నిర్వహణలో సలహాలు, సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నాయకత్వంలో మంత్రిమండలి ఉంటుంది.
* రాష్ట్రపతి తన విధుల నిర్వహణలో మంత్రిమండలి సలహాను తప్పక పాటించాల్సి ఉంటుంది. ఎప్పుడైనా భిన్నంగా భావించిన పక్షంలో మంత్రిమండలి సలహాను కేవలం ఒక్క పర్యాయం మాత్రమే పునః పరిశీలనకు పంపవచ్చు. పునఃపరిశీలించిన నిర్ణయం తన ఆమోదంకోసం వస్తే రెండోసారి తప్పకుండా ఆమోదముద్ర వేయాలి.

2. మంత్రులు లోక్‌సభ లేదా రాజ్యసభలో సభ్యత్వం పొందాలి : మంత్రులుగా నియమితులయ్యేవారు పార్లమెంటు ఉభయసభల్లో ఏదో ఒక సభలో సభ్యత్వం పొందడం తప్పనిసరి. ఒకవేళ సభ్యులుకానివారిని మంత్రిపదవిలో నియమిస్తే, పదవీ స్వీకారం తేదీ మొదలుకుని ఆరునెలల్లోగా ఏదో ఒక సభలో సభ్యత్వాన్ని పొందాలి.

3. మంత్రులు ఉభయసభలకు బాధ్యులు : మంత్రులు ఏ సభకు చెందినవారైనప్పటికీ వారు ఉభయసభలకు జవాబుదారీగా ఉంటారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. తమకు సభ్యత్వం లేని సభల్లో ఓటు వేయరు.

4. లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే మంత్రుల పదవీకాలం : మంత్రిమండలి లోక్‌సభ విశ్వాసం పొందినంతకాలం మాత్రమే పదవిలో ఉంటుంది. లోక్‌సభ ప్రధానమంత్రికి వ్యతిరేకంగాగానీ లేదా మంత్రిమండలికి వ్యతిరేకంగాగానీ అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించినట్లయితే మంత్రిమండలి పతనం అవుతుంది.

5. మంత్రులమధ్య సామరస్య భావన - సమైక్యత : మంత్రులందరూ సాధారణంగా ఒకే రాజకీయపార్టీకి చెందినవారై ఉంటారు. మంత్రిమండలి ఒక జట్టుగా పని చేస్తుంది. పార్టీలో క్రమశిక్షణ మూలంగా వారి మధ్య ఐక్యత ఉంటుంది.

6. మంత్రిమండలిపై పార్లమెంటు నియంత్రణ : పార్లమెంటు ప్రశ్నలు, తీర్మానాలు, బడ్జెట్ ఆమోదం, విశ్వాస, అవిశ్వాస తీర్మానాలు మొదలైనవాటిద్వారా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉండే విధంగా చేస్తుంది.

7. ప్రధానమంత్రి నాయకత్వం : మంత్రిమండలి ప్రధానమంత్రి నాయకత్వంలో పనిచేస్తుంది. లోక్‌సభలో అధికారపార్టీకి అత్యధిక మెజారిటీ ఉన్నప్పుడు ప్రధాన మంత్రికి మంత్రిమండలిమీదా, పార్లమెంటులోనూ మంచి పట్టు ఉంటుంది.

మంత్రిమండలి - క్యాబినెట్ పాత్ర : 
* మంత్రిమండలిలో క్యాబినెట్ అతి ముఖ్యమైంది. భారత రాజ్యాంగంలో మొదట క్యాబినెట్ అనే పదం లేదు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారు.
* కేంద్ర మంత్రిమండలిలోని సీనియర్ మంత్రులు క్యాబినెట్‌లో సభ్యులుగా ఉంటారు. రాజకీయ అనుభవం, పేరు ప్రఖ్యాతలు, పాలనా సామర్థ్యం, రాజ్యాంగ పరిజ్ఞానం కలిగిన కొందరు వ్యక్తులను సాధారణంగా ప్రధానమంత్రి క్యాబినెట్ సభ్యులుగా ఎంపిక చేస్తారు.
* భారత రాజకీయ వ్యవస్థలో క్యాబినెట్ కింది సూత్రాల ప్రాతిపదికపై పనిచేస్తుంది.
1. ప్రధానమంత్రి ఆధ్వర్యంలో అధికార విధులను క్యాబినెట్ నిర్వర్తిస్తుంది.
2. పార్లమెంటులోని దిగువసభకు సమష్టిగా బాధ్యత వహిస్తుంది.
3. క్యాబినెట్ సమావేశాలకు ప్రధానమంత్రి అధ్యక్షత వహిస్తారు.
4. క్యాబినెట్ సభ్యులు కనీసం వారానికోసారి లేదా అనివార్యమైతే ముందుగానే సమావేశమవుతారు.
5. సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను క్యాబినెట్ రహస్యంగా, విశ్వసనీయంగా ఉంచుతుంది.
6. పార్లమెంటులోని దిగువసభలో మెజారిటీ సభ్యుల మద్దతు ఉంటుంది.

క్యాబినెట్ విధులు :
1. కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందిస్తుంది. జాతి అంతర్గత, విదేశీ విధానాలను సుదీర్ఘమైన, తీవ్రమైన సమాలోచనల తర్వాత ఖరారు చేస్తుంది.
2. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నింటిలో రాష్ట్రపతికి సలహాలు అందిస్తుంది. రాష్ట్రపతి విధుల నిర్వహణలో క్యాబినెట్ మార్గదర్శకంగా ఉంటుంది.
3. పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు అత్యవసరమని భావిస్తే ఆర్డినెన్స్‌లను జారీచేయాల్సిందిగా రాష్ట్రపతికి సలహాలిస్తుంది. ఆర్డినెన్స్ అంటే పార్లమెంటు సమావేశాల్లో లేనప్పుడు రాష్ట్రపతి జారీ చేసే చట్టం లేదా శాసనం.
4. భూకంపం, వరదలు, అనావృష్టి, తుపాను మొదలైన ప్రకృతి ఉపద్రవాలు సంభవించినప్పుడు బాధిత ప్రజలను ఆదుకునేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది.

క్యాబినెట్‌పై ప్రముఖుల వ్యాఖ్యానాలు :
రామ్‌సేమ్యూర్ : 
రాజ్యమనే నౌకకు క్యాబినెట్ అనేది చోదక చక్రం వంటిది.

జాన్‌మారియట్ : మొత్తం రాజకీయ వ్యవస్థ క్యాబినెట్ చుట్టూనే పరిభ్రమిస్తుంది.

సర్ ఐవర్ జెన్నింగ్స్ : రాజ్యాంగ ప్రధాన భూమికయే క్యాబినెట్.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కేంద్ర, రాష్ట్రాల సంబంధాలు

భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని పరిపాలనా పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు. కానీ సిద్ధాంత పరమైన సమాఖ్యగా ఏర్పాటు చేయలేదు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పాల్సిన ఆవశ్యకతను రాజ్యాంగ నిర్మాతలు గుర్తించారు.

* మన దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలు 3 విధాలుగా ఉన్నాయి. అవి:
1) శాసన సంబంధాలు - 11వ భాగంలోని 245 - 255 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
2) పరిపాలన సంబంధాలు - 11వ భాగంలోని 256 - 263 వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.
3) ఆర్థిక సంబంధాలు - 12వ భాగంలోని 264 - 300 (A) వరకు ఉన్న ప్రకరణల్లో వివరించారు.

 

శాసన సంబంధాలు
రాజ్యాంగంలోని 11వ భాగంలో 245 నుంచి 255 వరకు ఉన్న 11 ప్రకరణల్లో కేంద్ర, రాష్ట్రాల శాసన సంబంధాలను వివరించారు.
ఆర్టికల్ 245
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల శాసనాధికార పరిధిని వివరిస్తుంది.

ఆర్టికల్ 245 (1)
దేశం మొత్తానికి లేదా కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఒక రాష్ట్రం మొత్తానికి లేదా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకు అవసరమైన శాసనాలను రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 245 (2)
పార్లమెంటు చేసిన శాననాలు ఇతర దేశాల్లో నివసిస్తున్న భారతీయులకు కూడా వర్తిస్తాయి. (Extra Territorial Operations)
ఆర్టికల్ 246
పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల మధ్య అధికారాల విభజన, చట్టాలకు సంబంధించిన విషయాలు.
ఆర్టికల్ 246 (1)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న కేంద్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు ఉంది.
ఆర్టికల్ 246 (2)
* 7వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు ఉంది.
* ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర చట్టాల మధ్య విభేదాలు వస్తే కేంద్ర శాసనమే చెల్లుతుంది. దీన్నే డాక్ట్రిన్ ఆఫ్ ఆక్యుపైడ్ ఫీల్డ్స్ అంటారు.
ఆర్టికల్ 246 (3)
7వ షెడ్యూల్‌లో పేర్కొన్న రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంది.
ఆర్టికల్ 246 (4)
రాష్ట్ర ప్రభుత్వాల భౌగోళిక పరిధికి వెలుపల ఉన్న భారత్‌లోని ఇతర ప్రాంతాలకు సంబంధించి పార్లమెంటు ఎలాంటి శాసనాలనైనా రూపొందించవచ్చు.
ఆర్టికల్ 247
కేంద్ర జాబితాలో పొందుపరిచిన అంశాలకు సంబంధించి పార్లమెంటు చేసిన చట్టాలను సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన అదనపు న్యాయస్థానాలను ఏర్పాటు చేయవచ్చు.
ఆర్టికల్ 248
* అవశిష్ట అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధానాన్ని రాజ్యాంగ నిర్మాతలు కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు.
* 1935 భారత ప్రభుత్వ చట్టంలోని అవశిష్ట అధికారాలను గవర్నర్ జనరల్‌కు అప్పగించారు. ఒక అంశం అవశిష్ట అధికారమా? కాదా? అనేది సుప్రీంకోర్టు ధ్రువీకరిస్తుంది.
ఆర్టికల్ 249
* జాతీయ ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందించగలదు.

ఆర్టికల్ 249 (1)
జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ 2/3వ వంతు ప్రత్యేక మెజారిటీ ద్వారా ఒక తీర్మానం చేస్తే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది. ఈ విధంగా రూపొందిన శాసనం ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది.
ఆర్టికల్ 250
భారత రాష్ట్రపతి ఆర్టికల్ 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని విధిస్తే ఆర్టికల్ 250 ప్రకారం రాష్ట్ర జాబితాలోని అంశాలపై శాసనాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
* ఈ విధంగా రూపొందిన శాసనం అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత 6 నెలల వరకు మాత్రమే అమల్లో ఉంటుంది.
ఆర్టికల్ 251
ఆర్టికల్ 249, 250 లను అనుసరించి పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై రూపొందించిన శాసనాలు రాష్ట్ర శాసనాలతో వైరుధ్యం కలిగి ఉంటే పార్లమెంటు రూపొందించిన శాసనాలే చెల్లుతాయి. పార్లమెంటు చేసే చట్టాలకు కాల పరిమితి ముగిసిన తర్వాత రాష్ట్ర శాసనసభలు చేసిన చట్టాలు తిరిగి అమల్లోకి వస్తాయి.

ఆర్టికల్ 252
రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు తమ ప్రయోజనార్థం శాసనాలను రూపొందించాలని కోరితే, రాష్ట్ర జాబితాలోని అంశాలపై పార్లమెంటు శాసనాలు రూపొందిస్తుంది.
ఉదా: ఎస్టేట్ సుంకం చట్టం, 1955
     ప్రైజ్ కాంపిటీషన్ చట్టం, 1955
     వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972
     జల కాలుష్య నివారణ చట్టం, 1974
     పట్టణ ఆస్తుల పరిమితి చట్టం, 1976
ఆర్టికల్ 253
భారత ప్రభుత్వం విదేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులను అమలు చేయడానికి సంబంధించిన శాసనాలను పార్లమెంటు రూపొందిస్తుంది. ఈ ఒప్పందాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాల శాసనాలు ఉంటే వాటిని పార్లమెంటు సవరించవచ్చు.
ఉదా: ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సౌకర్యాలు, రక్షణల చట్టం - 1947
     జెనీవా ఒప్పంద చట్టం - 1960
    హైజాకింగ్ వ్యతిరేక చట్టం - 1982

ఆర్టికల్ 254
* పార్లమెంటు చేసిన చట్టానికి, రాష్ట్ర శాసనసభ చేసిన చట్టానికి వైరుధ్యం ఏర్పడినప్పుడు పార్లమెంటు చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది.
* రాష్ట్ర జాబితాలోని ఏదైనా అంశంపై పార్లమెంటు చట్టాన్ని రూపొందిస్తే ఆ అంశంపై రాష్ట్రానికి ఎలాంటి అధికారం ఉండదని 1990లో బిహార్ రాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.
ఆర్టికల్ 255
* ఏదైనా అంశానికి సంబంధించి శాసనం చేయాలంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే వారి నుంచి ముందుగా అనుమతి పొందకుండానే పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభ శాసనాన్ని రూపొందించి ఉండవచ్చు.
* ఈ విధంగా రూపొందించిన శాసనానికి రాష్ట్రపతి లేదా గవర్నర్ ఆమోద ముద్ర వేస్తే 'ముందస్తు అనుమతి లేకుండా శాసనం చేశారనే' కారణంపై చెల్లకుండా పోదు.
ఆర్టికల్ 201
* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను సంబంధిత రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు. రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది.

ఆర్టికల్ 352
* రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించినప్పుడు రాష్ట్ర జాబితాలోని పాలనాంశాలపై చట్టాలను రూపొందించే అధికారం పార్లమెంటుకు లభిస్తుంది.
ఆర్టికల్ 356
* ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం కారణంగా రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్ర శాసనసభ తరఫున పార్లమెంటు శాసనాలను రూపొందిస్తుంది.
ఆర్టికల్ 31 (ఎ)
* రాష్ట్రాల్లో ఆస్తులను జాతీయం చేసే బిల్లులను రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి.
Doctrine of Pith and Substance:
      కేంద్ర, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగిన సందర్భంలో ఒక నిర్ణీత అంశం లేదా చట్టాన్ని ఒక జాబితాలో పొందుపరుస్తారు. ఆ జాబితాలో పొందుపరచిన అంశం మరో జాబితాలో పొందుపరచిన అంశంతో సందర్భానుసారం కొంతవరకు అతిక్రమించినా ఆ చట్టాలు చెల్లుతాయి. దీన్నే Pith and Substance అంటారు.

బెంగాల్ vs బెనర్జీ కేసు:
      ఈ కేసులో మనీ లెండింగ్ (అప్పులు) అనే అంశంపై శాసనం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని ప్రామిసరీ నోట్లు అనే అంశం కూడా ఇమిడి ఉండటం వల్ల అది రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. కొన్ని సార్లు అనుకోకుండా ఒక జాబితాలోని అంశంపై శాసనం చేసే సందర్భంలో మరో జాబితాలోకి చొచ్చుకుని రావడమే Pith and Substance అంటారు.

 

బల్లార్‌షా vs స్టేట్ ఆఫ్ ముంబయి కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ముంబయి రాష్ట్రం మద్యపానాన్ని నిషేధిస్తూ చట్టం చేసింది. ఈ సందర్భంలో కేంద్ర జాబితాలో పేర్కొన్న విదేశీ మద్యం అనే అంశాన్ని అనుకోకుండా చేర్చడం వల్ల ఆ చట్టం చెల్లుతుందని, అది రాజ్యాంగబద్ధమేనని పేర్కొంది.

 

కేతన్ ఈశ్వర్ షుగర్ మిల్స్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసు:
      ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భూములను జాతీయం చేసే సందర్భంలో కేంద్ర జాబితాలోని 'షుగర్ ఫ్యాక్టరీ'ని కూడా జాతీయం చేస్తూ చట్టం చేయడమనేది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని ఈ చట్టం చెల్లుతుందని పేర్కొంది.
      సదరన్ ఫార్మాస్యూటికల్ vs స్టేట్ ఆఫ్ కేరళ కేసు, చావ్లా vs స్టేట్ ఆఫ్ రాజస్థాన్, సింథటిక్ కెమికల్స్ లిమిటెడ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తర్‌ప్రదేశ్ కేసుల్లో Pith and Substance గురించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

 

Colourable Legislation:
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన శాసనాలు ఏవైనా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలు తీర్పునిచ్చిన తర్వాత, అవే శాసనాలను మరో రూపంలో తీసుకొచ్చినప్పుడు అవి కూడా చెల్లవని న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడాన్నే Colourable Legislation గా పేర్కొంటారు.
* ప్రత్యక్షంగా ఒప్పు కానిది ఏదీ పరోక్షంగా కూడా ఒప్పు కాదని, ఒక రూపంలో తప్పుగా భావించిన దాన్ని మరో రూపంలో కూడా ఒప్పు కాదని పేర్కొనడాన్నే Colourable Legislation అంటారు.
* కె.సి.జి. నారాయణ్‌దేవ్ vs స్టేట్ ఆఫ్ ఒడిశా కేసులో తొలిసారిగా సుప్రీంకోర్టు Colourable Legislation సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది.
* కామేశ్వరీ సింగ్ vs స్టేట్ ఆఫ్ బిహార్ కేసులో Colourable Legislation సిద్ధాంతాన్ని అనుసరించి సుప్రీంకోర్టు తొలిసారిగా తీర్పు ఇచ్చింది.
* ఉమ్మడి జాబితాలోని ఏదైనా అంశంపై కేంద్రం, రాష్ట్రాలు పరస్పర విరుద్ధమైన శాసనాలు రూపొందిస్తే, కేంద్ర శాసనమే చెల్లుతుందని చెప్పడాన్ని Doctrine of Repugnancy అంటారు.
* కానీ రాష్ట్రపతి ముందస్తు అనుమతితో రాష్ట్రాలు ముందుగా శాసనం రూపొందిస్తే రాష్ట్ర శాసనమే అమల్లో ఉంటుంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 11వ భాగంలో 256 నుంచి 263 వరకు ఉన్న ఆర్టికల్స్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే పరిపాలనా సంబంధాలను వివరిస్తున్నాయి.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధికి కట్టుబడి తమ కార్యనిర్వహణాధికారాలను నిర్వహించినప్పటికీ కొన్ని సందర్భాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సంబంధాలు కూడా ఉంటాయి.
* భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేయగా, ఆర్టికల్ 162 రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిని తెలియజేస్తుంది.
ఆర్టికల్ 256
* రాష్ట్రాలు తమ పరిపాలనను పార్లమెంటు చేసిన చట్టాలకు, కేంద్ర ప్రభుత్వ పరిపాలనకు విరుద్ధంగా నిర్వహించరాదు.
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పరిపాలనాపరమైన ఆదేశాలను జారీ చేసినప్పుడు వాటిని రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
* డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం కేంద్రానికి ఆర్టికల్ 256 ప్రకారం ఉన్న అధికారం లేకపోయినట్లయితే పార్లమెంటు చేసే చట్టాలను అమలు చేయడం సాధ్యం కాదు.

ఆర్టికల్ 257
* రాష్ట్ర ప్రభుత్వాల కార్యనిర్వహణాధికారాలను కేంద్రం నియంత్రిస్తుంది. రాష్ట్రాలు తమ అధికారాలను వినియోగించుకునే సందర్భంలో అవి కేంద్ర ప్రభుత్వ అధికారాలను ప్రశ్నించే విధంగా ఉండకూడదు.
* కేంద్ర ప్రభుత్వ ఆస్తులైన రైల్వేలు, టెలికమ్యూనికేషన్లు లాంటి వాటిని రాష్ట్రాలు పరిరక్షించాలి. జాతీయ ఆస్తుల సంరక్షణ విషయమై కేంద్ర ఆదేశాలను రాష్ట్రాలు తప్పనిసరిగా పాటించాలి.
ఆర్టికల్ 258
* కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రైల్వేలు, టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌లు లాంటి నిర్మాణాలను చేపట్టాలని ఆదేశించవచ్చు. వాటి నిర్మాణ ఖర్చులను కేంద్రమే భరిస్తుంది.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర కార్యనిర్వాహక అధికార పరిధిలోని ఏవైనా అంశాలను కేంద్ర ప్రభుత్వానికి లేదా కేంద్ర ప్రభుత్వ అధికారులకు షరతులతో లేదా షరతులు లేకుండా అప్పగించవచ్చు. అయితే దీనికి కేంద్రం అంగీకరించాలి. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 259
* శాంతి భద్రతల పరిరక్షణ కోసం కేంద్ర సాయుధ బలగాలను రాష్ట్రాల్లో మోహరించవచ్చు. దీన్ని 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 ద్వారా తొలగించారు.

ఆర్టికల్ 260
* భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలపై శాసన, కార్యనిర్వాహక, న్యాయాధికారాలను కేంద్ర ప్రభుత్వం కలిగి ఉండవచ్చు. అయితే దానికి సంబంధించిన ఒప్పందం భారతదేశానికి విదేశాలతో ఉండాలి. సంబంధిత ఒప్పందం విదేశీ భూభాగపు పరిపాలనకు సంబంధించి అమల్లో ఉన్న శాసనానికి అనుగుణంగా ఉండాలి.
ఆర్టికల్ 261
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ చట్టాలు, రికార్డులు, న్యాయపరమైన చర్యలను భారతదేశమంతా గౌరవించాలి.
* సివిల్ న్యాయస్థానాలు వెలువరించే అంతిమ తీర్పులను భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా చట్ట ప్రకారం అమలుచేయవచ్చు.
ఆర్టికల్ 262
* అంతర్‌రాష్ట్ర నదీ జలాల పంపకంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ట్రైబ్యునల్ తీర్పును అనుసరించి పార్లమెంటు ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తే, దాన్ని న్యాయస్థానాల్లో సవాలు చేయడానికి, న్యాయ సమీక్షకు గురి చేయడానికి వీల్లేదు.
* అయితే నదీ జలాల పంపకంపై పార్లమెంటు రూపొందించిన చట్టాన్ని ఏదైనా రాష్ట్రం ఉల్లంఘిస్తే దానిపై సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు.
* భారత పార్లమెంటు 1956లో అంతర్‌రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, రివర్ బోర్డ్ చట్టాన్ని రూపొందించింది.

ఇప్పటివరకు మన దేశంలో 8 అంతర్‌రాష్ట్ర నదీ జలాల ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అవి:
1. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
2. గోదావరి నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.
3. నర్మదా నదీ జలాల ట్రైబ్యునల్ (1969)
    దీని పరిధిలో రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి.
4. రావి, బియాస్ నదీ జలాల ట్రైబ్యునల్ (1986)
    దీని పరిధిలో పంజాబ్, హరియాణా రాష్ట్రాలు ఉన్నాయి.
5. కావేరి నదీ జలాల ట్రైబ్యునల్ (1990)
    దీని పరిధిలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ఉన్నాయి.
6. కృష్ణా నదీ జలాల ట్రైబ్యునల్ - II (2004)
    దీని పరిధిలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి.

7. వంశధార నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు ఉన్నాయి.
8. మహదాయి (మాండవి నది) నదీ జలాల ట్రైబ్యునల్ (2010)
    దీని పరిధిలో గోవా, కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి.
ఆర్టికల్ 263
* అంతర్ రాష్ట్ర మండలి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది.
* వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను విచారించి పరిష్కరించడానికి; అవసరమైన సలహాలు, సిఫార్సులు చేయడానికి రాష్ట్రపతి అంతర్‌రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు.

 

అంతర్‌రాష్ట్ర మండలి నిర్మాణం
* 1990, మే 28న వి.పి.సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ అంతర్‌రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం ఏర్పాటు చేశారు.
* అంతర్‌రాష్ట్ర మండలికి అధ్యక్షుడిగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు.
* దీనిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర హోంమంత్రితో సహా ఆరుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు సభ్యులుగా ఉంటారు.
* దిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనాధికారులు సభ్యులుగా ఉంటారు.

* అంతర్‌రాష్ట్ర మండలి సంవత్సరానికి 3 సార్లు సమావేశం కావాలి.
* 1991లో అంతర్‌రాష్ట్ర మండలి విధులను నిర్వర్తించడానికి ఒక సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేశారు.
* సెక్రటేరియట్ 2011 నుంచి జోనల్ కౌన్సిల్ సెక్రటేరియట్ నిర్వహించే విధులను నిర్వర్తిస్తోంది.
* అంతర్‌రాష్ట్ర మండలికి సంబంధించి 1996లో ఒక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ స్థాయీ సంఘానికి కేంద్ర హోంమంత్రి అధ్యక్షుడిగా, అయిదుగురు కేంద్ర కేబినెట్ మంత్రులు, 9 మంది ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు.
2015, డిసెంబర్ 18న అంతర్‌రాష్ట్ర మండలి సభ్యులను ప్రధాని నరేంద్ర మోదీ నియమించారు. వారు
1. రాజ్‌నాథ్ సింగ్
2. వెంకయ్యనాయుడు
3. సుష్మాస్వరాజ్
4. అరుణ్ జైట్లీ
5. నితిన్ గడ్కరీ
* 2013, డిసెంబర్ 12న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు, ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ అంతర్‌రాష్ట్ర మండలిని పునర్వ్యవస్థీకరించారు. దీని ప్రకారం కొత్తగా రైల్వే శాఖ మంత్రికి అవకాశం కల్పించారు. శాశ్వత ఆహ్వానితుల సంఖ్యను 6 నుంచి 5కు తగ్గించారు.

అంతర్‌రాష్ట్ర మండలి విధులు
* వివిధ రాష్ట్రాల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించేందుకు, సూచనలు, సలహాలు ఇవ్వడం.
* కేంద్రానికి, కేంద్రపాలిత ప్రాంతాలకు మధ్య వివాదాలను పరిష్కరించడం.
* రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి, ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణకు కృషి చేయడం.
* 1990 నుంచి 2005 వరకు అంతర్ రాష్ట్ర మండలి 9 సమావేశాలను నిర్వహించింది.
* 2006, డిసెంబర్ 9న అంతర్ రాష్ట్ర మండలి 10వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు.
* 2016, జులై 16న అంతర్ రాష్ట్ర మండలి 11వ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, జమ్మూ కశ్మీర్, కర్ణాటక ముఖ్యమంత్రులు తప్ప మిగిలిన ముఖ్యమంత్రులు అందరూ హాజరయ్యారు.
* ఈ సమావేశంలో ఆధార్ అనుసంధానానికి సంబంధించిన అంశాలతో పాటు ఎం.ఎం.పూంచీ కమిషన్ సిఫారసులపై చర్చించారు.

రాజ్యాంగంలోని ఇతర భాగాల్లో ఉన్న కేంద్ర, రాష్ట్ర పరిపాలనా సంబంధాలు
ఆర్టికల్ 155
    రాష్ట్రాల పరిపాలనలో కీలక పాత్రను పోషించే గవర్నర్లను నియమించేది, నియంత్రించేది, బదిలీ చేసేది కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రపతి.
ఆర్టికల్ 312
   అఖిల భారత సర్వీసుల ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలన్నింటిలో పరిపాలనా విధులను నిర్వహిస్తారు.
ఆర్టికల్ 315
  రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే ఉమ్మడి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ)ను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. అఖిల భారత సర్వీసుల ఉద్యోగులను ఎంపిక చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)ను కేంద్రమే నియమిస్తుంది.
ఆర్టికల్ 339
    షెడ్యూల్డ్ తెగల శ్రేయస్సును పెంపొందించడానికి తగిన కార్యక్రమాలను రూపొందించి, అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యనిర్వాహక ఆదేశాలను జారీచేయవచ్చు.

ఆర్టికల్ 340
   వెనుకబడిన తరగతుల స్థితిగతులను దర్యాప్తు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన సిఫారసులు చేయడానికి ఒక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 341
   షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాల్సిన ఇతర ప్రభావ వర్గాల విషయమై రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి రాష్ట్రపతి తగిన ఉత్తర్వులు జారీ చేయవచ్చు.
ఆర్టికల్ 355
   రాష్ట్రాల సంరక్షణ బాధ్యత కూడా కేంద్రానిదే. కేంద్రం అనేక సందర్భాల్లో రాష్ట్రాల కోరికపై తన సాయుధ బలగాలను రాష్ట్రాలకు సహాయంగా పంపుతుంది.

 

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంబంధాలు
* భారత రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 264 నుంచి 300 (A) వరకు ఉన్న ఆర్టికల్స్‌లో కేంద్ర, రాష్ట్రాల ఆర్థిక సంబంధాలను పొందుపరిచారు.
* ప్రొఫెసర్ అమల్ రే అభిప్రాయం ప్రకారం కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో మిగిలిన వాటి కంటే ఆర్థిక సంబంధాలే ఎక్కువ వివాదానికి కారణమవుతున్నాయి.

ఆర్టికల్ 264
కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల విధింపుకు సంబంధించి కచ్చితమైన విభజన చేశారు. కేంద్ర ప్రభుత్వం 15 రకాల పాలనాంశాలపై పన్ను విధించగలదు. అవి:
1. వ్యవసాయేతర ఆదాయంపై పన్ను
2. ఎగుమతి, దిగుమతి సుంకాలు
3. పొగాకుపై ఎక్సైజ్ పన్ను
4. కార్పొరేషన్ పన్ను
5. మూలధన విలువపై పన్ను
6. వ్యవసాయేతర ఎస్టేట్‌లపై పన్ను
7. వారసత్వ పన్ను
8. అంతర్ రాష్ట్ర రవాణా పన్ను
9. స్టాక్ మార్కెట్, స్టాక్ ఎక్స్చేంజ్ పన్ను
10. చెక్స్, ప్రామిసరీ నోట్లు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, ఇన్సూరెన్స్ పాలసీల బదిలీలపై పన్ను
11. అంతర్ రాష్ట్ర వ్యాపారంలో విధించే అమ్మకం పన్ను
12. వార్తా పత్రికలపై అమ్మకపు, ప్రకటనలపై పన్ను
13. అంతర్ రాష్ట్ర వాణిజ్యంలో సరకులపై విధించే పన్ను
14. సర్వీసులపై పన్ను
15. వ్యవసాయేతర భూముల వారసత్వ బదలాయింపు పన్ను

 

రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం 20 రకాల పాలనాంశాలపై పన్నులు విధిస్తాయి
1. భూమి శిస్తు
2. వ్యవసాయ ఆదాయంపై పన్ను
3. వ్యవసాయ భూములపై వారసత్వ పన్ను
4. వ్యవసాయ భూములపై ఎస్టేట్ పన్ను
5. స్థిరాస్తులపై పన్ను (భూములు, భవనాలు)
6. ఖనిజాలపై పన్ను
7. మద్యపానంపై పన్ను
8. ఆక్ట్రాయ్ పన్ను (స్థానిక ప్రాంతాల్లోకి రవాణా అయ్యే వస్తువులపై పన్ను)
9. విద్యుత్ వినియోగం, అమ్మకంపై పన్ను
10. వాణిజ్య పన్ను
11. ప్రకటనలపై పన్ను
12. రోడ్డు, జల రవాణాపై పన్ను
13. మోటారు వాహనాలపై పన్ను
14. పశువులపై పన్ను
15. టోల్ ట్యాక్స్
16. వృత్తి పన్ను
17. కస్టడీ పన్నులు
18. వినోదపు పన్నులు
19. కేంద్ర జాబితాలోని డాక్యుమెంట్లు మినహా మిగతావాటిపై స్టాంపు డ్యూటీ
20. రాష్ట్ర జాబితాలోని అంశాలకు సంబంధించిన ఇతర ఫీజులు

 

అవశిష్ట వన్నులు: కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే విధించే పన్నులు
1. బహుమతి పన్ను
2. సంపద పన్ను
3. వ్యయంపై పన్ను
సేవా పన్ను
రాజా చెల్లయ్య కమిటీ సిఫారసుల మేరకు 1994 నుంచి సేవా పన్ను అమల్లోకి వచ్చింది. సేవలపై విధించే పన్నును సేవా పన్నుగా వ్యవహరిస్తారు. కేంద్ర స్థాయిలో ఇది విలువ అధారిత పన్నులో అంతర్భాగంగా ఉంది.

* ప్రస్తుతం సేవా పన్ను రేటు 12%. సేవా పన్నుపై అదనంగా 2% విద్యా సెస్, 1% సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సెస్ విధించారు. కాబట్టి ప్రస్తుతం మొత్తం సేవా పన్ను రేటు 12.36%.
ఆర్టికల్ 265
 మన దేశంలో చట్టబద్ధంగా మాత్రమే పన్నులు విధించి వసూలు చేయాలి. చట్టం చేయనిదే ఎలాంటి పన్నులు విధించకూడదు.
* పార్లమెంటు రూపొందించే చట్టాలను అనుసరించి దేశవ్యాప్తంగా పన్నులు విధిస్తారు.
* రాష్ట్ర శాసనసభలు రూపొందించే చట్టాల ప్రకారం రాష్ట్రాల్లో పన్నులు విధించి వసూలు చేయాలి.
ఆర్టికల్ 266
   సంఘటిత నిధి, ప్రభుత్వ ఖాతాల గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 266 (1)
 
  కేంద్ర ప్రభుత్వం పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా కేంద్ర ప్రభుత్వం సేకరించే రుణాలు, ఇతర రుణాలు, అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా ప్రభుత్వానికి లభించే మొత్తాలన్నింటినీ భారత సంఘటిత నిధి (Consolidated Fund of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలు పొందే అన్ని పన్నులు, ట్రెజరీ బిల్లుల ద్వారా అడ్వాన్సులు, ఇతర మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు లభించే మొత్తాలన్నింటినీ సంబంధిత రాష్ట్ర సంఘటిత నిధి (Consolidated Fund of State) లో జమ చేయాలి.

ఆర్టికల్ 266 (2)
 కేంద్ర ప్రభుత్వం స్వీకరించే ఇతర ప్రభుత్వ ధనాన్ని కేంద్ర ప్రభుత్వ ఖాతా (Credited to the Public Account of India) లో జమ చేయాలి.
* రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఇతర ప్రభుత్వ ధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి.
ఆర్టికల్ 266 (3)
    కేంద్ర ప్రభుత్వ సంఘటిత నిధి లేదా రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధిలో జమ చేసిన మొత్తాలను రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా మాత్రమే శాసనబద్ధంగా వినియోగించాలి.
ఆర్టికల్ 267 (1)
   పార్లమెంటు ఒక శాసనం ద్వారా ఆగంతుక నిధి (Contingency Fund) ని ఏర్పాటు చేయవచ్చు. ఈ నిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది. దీన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ప్రభుత్వ కార్యదర్శి నిర్వహిస్తారు.
* 1950, ఆగస్టు 14న ఏర్పడిన ఆగంతుక నిధికి కేంద్ర సంఘటిత నిధి నుంచి రూ.50 కోట్లను బదిలీ చేశారు.
* ప్రస్తుతం కేంద్ర ఆగంతుక నిధిని రూ.500 కోట్లతో నిర్వహిస్తున్నారు.
ఆర్టికల్ 267 (2)
రాష్ట్ర శాసన సభ ఒక చట్టం ద్వారా రాష్ట్ర ఆగంతుక నిధిని ఏర్పాటు చేయవచ్చు. ఇది సంబంధిత రాష్ట్ర గవర్నర్ ఆధీనంలో ఉంటుంది.
* ఊహించని, ఆకస్మికంగా వచ్చే ప్రకృతి వైపరీత్యాలు లాంటి సందర్భాల్లో ఖర్చులు ఎదురైనప్పుడు పార్లమెంటు అనుమతి పొందడానికి ముందే ఆగంతుక నిధి నుంచి నగదు ఖర్చు చేయవచ్చు. తర్వాత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే నియమం రాష్ట్ర ఆగంతుక నిధికి కూడా వర్తిస్తుంది.
ఆర్టికల్ 268:
    కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ రాష్ట్రాలు వసూలు చేసి వినియోగించుకుంటాయి.
ఉదా: స్టాంపు డ్యూటీలు, అలంకరణ వస్తవులు, మందులు, పాలసీ మార్పిడులు, చెక్కులు.
ఆర్టికల్ 268 (A)
* సేవలపై పన్నులను కేంద్రమే విధిస్తుంది. కానీ వసూలు చేసి వినియోగించేటప్పుడు కేంద్ర, రాష్ట్రాల ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.
* 10వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 29% వాటా ఇవ్వాలి. ఈ పద్ధతినే ప్రత్యామ్నాయ నిధుల బదిలీ అంటారు. ఇది 1996, ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కేంద్ర పన్నులైన కార్పొరేషన్ టాక్స్, ఎక్సైజ్ సుంకాల్లో రాష్ట్రాలకు కూడా వాటా ఉంటుంది.
* 88వ రాజ్యాంగ సవరణ చట్టం (2003) ద్వారా ఆర్టికల్ 268 (A) సర్వీస్ టాక్స్‌ను చేర్చారు.

ఆర్టికల్ 269
కొన్ని పన్నులను కేంద్రమే విధిస్తుంది. వీటిని కేంద్రమే వసూలు చేసి రాష్ట్రాలకు కేటాయిస్తుంది.
* వస్తువుల కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్నును; వస్తువుల కన్‌సైన్‌మెంట్‌పై పన్నును కేంద్ర ప్రభుత్వమే విధించి వసూలు చేస్తుంది. అయితే వీటిని 1996, ఏప్రిల్ 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు కేటాయించాలి.
ఉదా: టెర్మినల్ ట్యాక్స్, విమానయానం, నౌకాయానం, రైల్వేలు.
ఆర్టికల్ 270
    కేంద్రం విధించి, వసూలు చేసి కేంద్ర, రాష్ట్రాల మధ్య పంపిణీ చేసే పన్నుల గురించి వివరిస్తుంది.
ఆర్టికల్ 270 (1)
    కొన్ని పన్నులను కేంద్ర ప్రభుత్వం విధించి వసూలు చేస్తుంది. ఆ విధంగా వచ్చిన మొత్తం రాబడిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేస్తుంది.
ఉదా: వ్యవసాయేతర ఆదాయంపై పన్ను, ఎక్సైజ్ పన్ను.
ఆర్టికల్ 270 (2)
ఒక ఆర్థిక సంవత్సరంలో ఆర్టికల్ 270 (1)లో పేర్కొన్న పన్నులు లేదా డ్యూటీల ద్వారా లభించే నికర మొత్తంలో కొంత శాతం కేంద్ర సంఘటిత నిధిలో కలపరు. ఏ రాష్ట్రాల నుంచి ఆ పన్ను వసూలైందో ఆ మొత్తం సంబంధిత రాష్ట్రాలకే లభిస్తుంది.

ఆర్టికల్ 270 (3)
ఆర్థిక సంఘం ఏర్పాటయ్యే వరకు రాష్ట్రపతి ఆదేశం ద్వారా సూచించిన విధానంలో ఆర్థిక వనరుల పంపిణీ జరుగుతుంది.
* ఆర్థిక సంఘం ఏర్పాటైన తర్వాత దాని సూచనల మేరకు పంపిణీకి సంబంధించి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు.
ఆర్టికల్ 271
ఆదాయపు పన్నుపై విధించే సెస్‌ను కేంద్ర ప్రభుత్వమే వసూలు చేసుకుని వినియోగించుకుంటుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి వాటా ఉండదు.
ఆర్టికల్ 272
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయాల్సిన పన్నులు. దీన్ని 80వ రాజ్యాంగ సవరణ చట్టం, 2000 ద్వారా తొలగించారు.
ఆర్టికల్ 273
అసోం, బిహార్, ఒడిశా, పశ్చిమ్‌ బంగ రాష్ట్రాలకు సంబంధించి జనుము, జనుము ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా వచ్చే ఎగుమతి సుంకాల్లో ఆ రాష్ట్రాలకు వాటా కేటాయించే బదులు ప్రతి సంవత్సరం ఒక నిర్ణీత విధానం ప్రకారం సహాయక గ్రాంటుగా సంఘటిత నిధి నుంచి క్రేంద్ర ప్రభుత్వం చెల్లించాలి.
ఆర్టికల్ 274
రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభావం చూపే పన్నులకు సంబంధించిన బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం అవసరం.

ఆర్టికల్ 274 (1)
కింద పేర్కొన్న అంశాలకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి.
1. ఏదైనా ఒక పన్నును విధించడానికి లేదా సవరించడానికి సంబంధించిన బిల్లు (లేదా)
2. ఆదాయ పన్ను సంబంధిత చట్టాలకు చెందిన వ్యవసాయ ఆదాయం అనే పదానికి అర్థాన్ని సదరు బిల్లు సవరించే అవకాశం ఉన్నప్పుడు
ఆర్టికల్ 275
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు మంజూరు చేసే సహాయక గ్రాంట్లు.
ఆర్టికల్ 275 (1)
ఏవైనా కొన్ని రాష్ట్రాలకు తగిన ఆర్థిక సహాయం అందించడం అవసరమని పార్లమెంటు భావించినట్లయితే, తనకు అవసరమని తోచిన మొత్తాన్ని సహాయక గ్రాంట్ల రూపంలో ఆయా రాష్ట్రాలకు అందజేయవచ్చు. ఈ సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* కేంద్ర ప్రభుత్వ అనుమతితో షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహాయక గ్రాంట్ల రూపంలో ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది.
* ఏదైనా ఒక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల పరిపాలనతో సమానంగా ఆ రాష్ట్రంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల పరిపాలన అభివృద్ధికి ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అవసరమైన మొత్తాన్ని కూడా సహాయక గ్రాంట్ల రూపంలో పార్లమెంటు అందజేయవచ్చు. ఉదా: అసోం.

ఆర్టికల్ 275 (2)
     సహాయక గ్రాంట్లకు సంబంధించి పార్లమెంటు శాసనం చేసే వరకు ఆయా అధికారాలను రాష్ట్రపతి కలిగి ఉంటారు. అయితే ఆర్థిక సంఘం ఏర్పాటు తర్వాత దాని సలహా లేనిదే రాష్ట్రపతి సహాయక గ్రాంట్లను కేంద్ర సంఘటిత నిధి నుంచి విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేయకూడదు.
ఆర్టికల్ 276
     వృత్తి, వ్యాపారం, ఉపాధి లాంటి అంశాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం లేదా స్థానిక ప్రభుత్వాలు ఒక్కో వ్యక్తిపై సంవత్సరానికి రూ.2500కు మించకుండా పన్ను విధించి వసూలు చేయవచ్చు.
ఆర్టికల్ 277: ఆర్థిక వనరులకు సంబంధించిన మినహాయింపులు.
ఆర్టికల్ 278: వివిధ రాష్ట్రాల ఆర్థిక ఒప్పందాలు.
ఆర్టికల్ 279: నికర ఆదాయం గురించి వివరణ, నిర్వచనం.
ఆర్టికల్ 279 (1)
     పన్నుల ద్వారా వసూలైన నికరాదాయం అంటే పన్ను వసూలుకు అయిన ఖర్చులు పోను మిగిలింది అని అర్థం. ఏ ప్రాంతం నుంచి ఎంత పన్ను వసూలైంది, అందులో నికరాదాయం ఎంత అనే విషయాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నిర్ధారించి ధ్రువీకరించాలి. దీనికి సంబంధించి ఆయన ఇచ్చిన ధ్రువీకరణ పత్రమే అంతిమమైంది.

ఆర్టికల్ 279 (2)
     రాష్ట్రపతి లేదా పార్లమెంటు పన్ను ద్వారా వసూలైన మొత్తాన్ని రాష్ట్రాలకు గ్రాంట్లుగా మంజూరు చెయ్యాలి.
ఆర్టికల్ 280
* కేంద్ర ఆర్థిక సంఘం నియామకం, నిర్మాణం.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలు, ఆర్థిక వనరులు సమానంగా లేవన్నది స్పష్టం. రాజ్యాంగం కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఇచ్చిందని, రాష్ట్రాలు కేవలం వాటి పరిధిలోని సొంత వనరులకే పరిమితమయ్యాయనే విమర్శ ఉంది. అందువల్ల సమాఖ్య ఆర్థిక విధానంలో ఆర్థిక విషయాలకు సంబంధించిన పన్నులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ లాంటి విషయాల్లో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధమైన సమన్వయాన్ని సాధించడానికి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు.
ఆర్టికల్ 280 (1)
రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోపు, ఆ తర్వాత ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
* ఆర్థిక సంఘానికి ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు.
ఆర్టికల్ 280 (2)
ఆర్థిక సంఘం సభ్యుల అర్హతలను, వారి ఎంపిక విధానాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్ణయిస్తుంది.

ఆర్టికల్ 280 (3)
ఆర్థిక సంఘం విధులు కింది విధంగా ఉంటాయి.
* భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్రాలకు గ్రాంట్ల రూపంలో సహాయం చేయడానికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలను సూచించడం.
* రాష్ట్రపతి ఆదేశం మేరకు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం.
* పన్నుల ద్వారా వచ్చిన నికర రాబడులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య హేతుబద్దంగా పంపిణీ చేయడం. సంబంధిత రాబడులను రాష్ట్రాల మధ్య వారి వాటాలకు అనుగుణంగా కేటాయించడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది.
ఆర్టికల్ 280 (4)
    ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఇది తన పని విధానాన్ని రూపొందించుకోవడంతో పాటు పార్లమెంటు ద్వారా తనకు సంక్రమించిన అధికార విధులను కూడా నిర్వహించాలి.

14వ ఆర్థిక సంఘం
     ఆర్టికల్ 280 ప్రకారం 2015 - 2020 మధ్య కాలానికి సిఫారసులు చేసేందుకు 2013, జనవరి 2న డాక్టర్ వై.వేణుగోపాల రెడ్డి అధ్యక్షతన 14వ ఆర్థిక సంఘాన్ని నియమించారు.
ప్రధాన సిఫారసులు
* కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచారు.
* రాష్ట్రాలకు మొత్తం గ్రాంట్లు రూ.5.37 లక్షల కోట్లు.
* విపత్తుల నిర్వహణకు రూ.55,000 కోట్లు.
గ్రాంట్ల మంజూరు కోసం 14వ ఆర్థిక సంఘం చేసిన/ అనుసరించిన ప్రామాణికాలు

ఆర్టికల్ 281
    రాష్ట్రపతి ఆర్థిక సంఘం సిఫారసులను, దానిపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించే నోట్‌తో సహా పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించాలి.
ఆర్టికల్ 282
    ప్రజా ప్రయోజనం నిమిత్తం శాసనం చేసే అధికారం పార్లమెంటు లేదా రాష్ట్ర శాసనసభకు లేకపోవచ్చు. అయినప్పటికీ అవి తమ రెవెన్యూల నుంచి అలాంటి ప్రయోజనాల నిమిత్తం గ్రాంట్లను విడుదల చేయవచ్చు.
ఆర్టికల్ 283
    ప్రభుత్వ నిధులైన సంఘటిత నిధి, ఆగంతుక నిధి, ప్రభుత్వ ఖాతాల నియంత్రణ గురించి తెలుపుతుంది.
ఆర్టికల్ 283 (1)
    భారత ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్మును జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 283 (2)
    రాష్ట్ర ప్రభుత్వ సంఘటిత నిధి, ఆగంతుక నిధుల్లో సొమ్ము జమ చేయడం, వాటి నుంచి ఖర్చు చేయడం, ఆ రెండింటిలోనూ జమ చేయని ఇతర ప్రజాధనాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయడం గురించి తెలుపుతుంది.

ఆర్టికల్ 284
    కోర్టులు స్వీకరించే పిటిషనర్ డిపాజిట్లు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సొమ్ము భారత ప్రభుత్వ ఖాతాకు లేదా సందర్భానుసారం ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు జమ చేయాలి.
* వివిధ వర్గాల నుంచి సేకరించిన డిపాజిట్లపై నియంత్రణను తెలుపుతుంది.
ఆర్టికల్ 285
    కేంద్ర ప్రభుత్వ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286
    సరకుల క్రయవిక్రయాలపై పన్ను మినహాయింపులు.
ఆర్టికల్ 286 (1)
    రాష్ట్రం వెలుపల జరిగే వస్తువుల క్రయవిక్రయాలు లేదా భారతదేశంలోకి వస్తువులను దిగుమతి చేసుకునే లేదా ఎగుమతి చేసే క్రమంలో జరిగే క్రయవిక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 286 (2)
    వస్తువుల క్రయవిక్రయాలను నిర్ధారించే క్రమాన్ని పార్లమెంటు శాసనం ద్వారా నిర్దేశిస్తుంది.
ఆర్టికల్ 287
    కేంద్ర ప్రభుత్వం వినియోగించిన విద్యుత్ లేదా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన విద్యుత్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించకూడదు. కేంద్ర ప్రభుత్వ రైల్వేల నిర్మాణం, నిర్వహణలపై ఉపయోగించే విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు చట్టరీత్యా పన్ను విధించకూడదు.

ఆర్టికల్ 288
    కొన్ని సందర్భాల్లో నీరు, విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించడం నుంచి మినహాయింపులు.
ఆర్టికల్ 288 (1)
    కొన్ని సందర్భాల్లో అంతర్ రాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధికి పార్లమెంటు శాసనం ద్వారా ఏర్పాటు చేసిన అథారిటీ నిల్వ ఉంచుకునే, ఉపయోగించే నీరు లేదా విద్యుచ్ఛక్తిపై రాష్ట్రాలు పన్ను విధించకూడదు.
ఆర్టికల్ 288(2)
    రాష్ట్ర శాసనసభ పన్ను విధించడానికి అధికారం కల్పించే శాసనం చేయవచ్చు. ఇలాంటి శాసనం రాష్ట్రపతి ఆమోదం పొందినప్పుడు మాత్రమే అమల్లోకి వస్తుంది.
ఆర్టికల్ 289
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులపై, ఆదాయంపై కేంద్ర ప్రభుత్వం పన్ను విధించడం నుంచి మినహాయింపు.
ఆర్టికల్ 289 (1)
    రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు, ఆదాయాలపై కేంద్రం పన్నులు విధించకూడదు.
ఆర్టికల్ 289(2)
    రాష్ట్ర ప్రభుత్వం లేదా దాని తరఫున నిర్వహించే ఆర్థిక, వాణిజ్య లావాదేవీలపై పన్ను విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

ఆర్టికల్ 290
    కొన్ని రకాలైన ఖర్చులు, పెన్షన్లకు సంబంధించిన సర్దుబాట్లను తెలియజేస్తుంది.
ఆర్టికల్ 290(A)
    కొన్ని దేవస్థానాలకు సాలీనా చెల్లించాల్సిన మొత్తాలను తెలియజేస్తుంది. దీని ప్రకారం ట్రావెన్‌కోర్ దేవస్థాన నిధికి కేరళ రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఏటా రూ.46,50,000 చెల్లించాలి.
* హిందూ దేవస్థానాలు, గుడుల నిర్వహణ కోసం తమిళనాడు రాష్ట్ర సంఘటిత నిధి నుంచి ఆ రాష్ట్ర దేవస్థాన నిధికి ఏటా రూ.13,50,000 చెల్లించాలి.
* ఈ నిబంధనను 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956 ద్వారా చేర్చారు.
ఆర్టికల్ 291
    మాజీ స్వదేశీ సంస్థానాధీశులకు చెల్లించే రాజభరణాల గురించి తెలియజేస్తుంది.
* 26వ రాజ్యాంగ సవరణ చట్టం (1971) ద్వారా ఇందిరా గాంధీ ప్రభుత్వం రాజభరణాలను రద్దు చేయడం వల్ల ఆర్టికల్ 291ని రాజ్యాంగం నుంచి తొలగించారు.
ఆర్టికల్ 292
    పార్లమెంటు నిర్ణయించిన మేరకు భారత సంఘటిత నిధిని హామీగా పెట్టి కేంద్ర ప్రభుత్వం రుణాలను పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటుంది.

ఆర్టికల్ 293
    రాష్ట్ర ప్రభుత్వాల రుణ సేకరణ.
ఆర్టికల్ 293 (1)
    రాష్ట్ర శాసనసభ నిర్ణయించిన మేరకు రాష్ట్ర సంఘటిత నిధిని హామీగా పెట్టి దేశం లోపల ఎక్కడి నుంచైనా రాష్ట్ర ప్రభుత్వాలు రుణాలు పొందే కార్యనిర్వహణాధికారాన్ని కలిగి ఉంటాయి.
ఆర్టికల్ 293 (2)
    పార్లమెంటు నిర్ణయించిన షరతులకు లోబడి కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల రుణాలకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత సంఘటిత నిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు రుణాలు ఇవ్వగలదు.
ఆర్టికల్ 293 (3)
    ఇచ్చిన రుణాలు తీరక ముందే కేంద్ర అనుమతి లేకుండా ఒక రాష్ట్రం కొత్తగా అప్పులు చేయకూడదు.
ఆర్టికల్ 293 (4)
    కేంద్రం కొన్ని షరతులతో అంతకు ముందు ఇచ్చిన రుణాలను పూర్తిగా తీర్చకముందే కొత్త రుణాలను పొందడానికి రాష్ట్రాలకు అవకాశం ఇవ్వవచ్చు.

ఆర్టికల్ 294
    కొన్ని కేసుల్లో వారసత్వం, ఆస్తులు, హక్కులు, రుణాల విషయంలో ప్రభుత్వ బాధ్యత.
ఆర్టికల్ 295
    ఇతర వివాదాలకు సంబంధించి వారసత్వంగా సంక్రమించే ఆస్తులు, హక్కులు, బాధ్యతలు.
ఆర్టికల్ 296
    స్వాతంత్య్రానికి ముందు ఉన్న రాష్ట్రాలు, సంస్థానాల ఆస్తులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులు.
ఆర్టికల్ 297
 * సరిహద్దు జలాలు లేదా ఖండాంతర్భాగంలోని ఖనిజాలు, ఇతర వనరులన్నింటిపై కేంద్రానికి అధికారం.
 *  ఆర్టికల్ 298 వాణిజ్య కార్యకలాపాలు, అధికారాలు.
*  ఆర్టికల్ 299 ఆస్తి ఒప్పందాలు.
* ఆర్టికల్ 300 వాజ్యాలు, ఇతర అంశాలు
ఆర్టికల్ 300 (A)
    చట్ట ప్రకారం తప్ప వ్యక్తుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోకూడదు.

ఇతర అంశాలు
గాడ్గిల్ ఫార్ములా:
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి ఉద్దేశించిన ఫార్ములానే గాడ్గిల్ ఫార్ములా అని పేర్కొంటారు. 4వ ఆర్థిక సంఘం సూచనలు మొదలు 8వ ఆర్థిక సంఘం సూచనల వరకు ఈ ఫార్ములానే అనుసరించారు.
ముఖర్జీ ఫార్ములా
     8వ ఆర్థిక సంఘం సూచనల నుంచి నేటి వరకు దేశంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి దీన్నే వినియోగిస్తున్నారు.
* కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీకి జనాభా, విస్తీర్ణం, తలసరి ఆదాయం, అభివృద్ధి, పన్నుల వసూలు సామర్థ్యం లాంటి అంశాలను ఆధారం చేసుకుంటున్నారు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ

మన దేశంలో ఇన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎలా ఏర్పడ్డాయి? ఇంతకు ముందు ఈ నిర్మాణం ఏవిధంగా ఉండేది? వివిధ సంస్కృతులతో విస్తరించి, భిన్నత్వాన్ని ప్రదర్శించే ఈ భూభాగంలో ఏకత్వాన్ని సాధించడంలో ఎలాంటి కృషి జరిగింది..? ఈ అంశాలను పాలిటీ అధ్యయనంలో భాగంగా పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

        స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలో రెండు రాజకీయ విభాగాలు ఉండేవి. మొదటిది బ్రిటిష్‌ ప్రభుత్వ ప్రత్యక్ష పాలనలోని ప్రావిన్సులు. రెండోది బ్రిటిష్‌ సర్వసమున్నతాధికారం కింద స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు. స్వాతంత్య్రానంతరం పాలనా సౌలభ్యం కోసం దేశాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా వర్గీకరించారు.

         భారత యూనియన్‌ కంటే భారత భూభాగం అనే భావన చాలా విస్తృతమైంది. యూనియన్‌లో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. కానీ భారత భూభాగంలో రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వం ఆర్జించిన ఇతర ప్రాంతాలూ ఉంటాయి. కేంద్రంతో రాష్ట్రాలు అధికారాలను పంచుకుంటాయి. కేంద్రపాలిత ప్రాంతాలు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ప్రత్యక్ష పాలనలో ఉంటాయి.

రాజ్యాంగం ప్రారంభంలో..
1950 జనవరి, 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చేనాటికి మన దేశంలోని భూభాగాలను నాలుగు విభాగాలుగా ఏర్పాటు చేశారు.
 

1) పార్ట్‌ - A రాష్ట్రాలు: గతంలో బ్రిటిష్‌ పాలిత ప్రాంతాలుగా ఉన్నవాటిని ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి అసోం, బిహార్‌, బాంబే, మధ్యప్రదేశ్‌, మద్రాస్‌, ఒడిశా, పంజాబ్‌, యునైటెడ్‌ ప్రావిన్స్‌, పశ్చిమ్‌బంగ.

2) పార్ట్‌ - B రాష్ట్రాలు: శాసనసభలు లేని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 9. అవి జమ్మూ-కశ్మీర్‌, మధ్యభారత్‌, హైదరాబాద్‌, మైసూర్‌, పాటియాలా అండ్‌ తూర్పు పంజాబ్‌, రాజస్థాన్‌, సౌరాష్ట్ర, ట్రావెన్‌కోర్‌ కొచ్చిన్‌, వింధ్యప్రదేశ్‌.

3) పార్ట్‌ - C రాష్ట్రాలు: గతంలో చీఫ్‌ కమిషనరేట్‌ ప్రాంతాలుగా ఉన్నవాటిని, కొన్ని స్వదేశీ సంస్థానాలను ఈ విభాగంలో చేర్చారు. వీటి సంఖ్య 10. అవి అజ్మీర్‌, భోపాల్‌, బిలాస్‌పూర్‌ కూంచ్‌, కూచ్‌-బిహార్‌, కూర్గ్‌, దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కచ్‌, త్రిపుర, మణిపూర్‌.

4) పార్ట్‌ - D రాష్ట్రాలు: ఈ విభాగంలో అండమాన్‌ నికోబార్‌ దీవులను చేర్చారు.

రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌
1953, అక్టోబరు 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రాలను ఏర్పాటుచేయాలని ఉద్యమించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ కర్ణాటకలోని బెల్గాంను సందర్శించినప్పుడు ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్దేశంతో తగిన సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం 1953 డిసెంబరులో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ను ఏర్పాటుచేసింది. దీనికి ఫజల్‌ అలీ ఛైర్మన్‌గా, కె.ఎం.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా వ్యవహరించారు. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.

సిఫారసులు:
* పార్ట్‌ - A, B, C, D లుగా ఉన్న రాష్ట్రాలన్నింటినీ రద్దుచేసి వాటిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా పునర్‌ వ్యవస్థీకరించాలి.
* ఒకే భాష - ఒకే రాష్ట్రం అనే వాదన సమంజసం కాదు.
* దేశాన్ని 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలి.
* పరిపాలనా సౌలభ్యం కోసం ప్రాంతీయ మండళ్లు (Zonal Councils) గా ఏర్పాటుచేయాలి.
* దిల్లీలో జాతీయ మైనార్టీ భాషల కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలి.

పార్లమెంటు - రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం
ఫజల్‌ అలీ కమిషన్‌ సిఫారసుల్లో కీలకమైన వాటిని 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత పార్లమెంటు ఆమోదించింది. దీంతో రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ చట్టం ఏర్పడి, మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఆవిర్భవించాయి.

1956లో ఏర్పాటైన రాష్ట్రాలు: అసోం, బెంగాల్‌, బిహార్‌, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌, మద్రాస్‌, కేరళ, మైసూర్‌, ముంబయి, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌.

1956లో ఏర్పాటైన కేంద్రపాలిత ప్రాంతాలు: దిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, అమోని, మినికాయ్‌, లాక్‌దీవులు, అండమాన్‌, నికోబార్‌ దీవులు, త్రిపుర, మణిపూర్‌.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఏ కమిటీ.. ఏ సిఫార్సులు?

      భారత రాజకీయ వ్యవస్థలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ ఒక ముఖ్యమైన అంశం. దీని కోసం కేంద్రం వివిధ కమిటీలను నియమించింది. అవి పలు సిఫార్సులు చేశాయి. ఇండియన్‌ పాలిటీ అధ్యయనంలో అభ్యర్థులు ఆ వివరాలను తెలుసుకోవాలి.   భారతదేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించారు. 1956లో మనదేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాత జరిగిన వివిధ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు కొనసాగుతున్నాయి.
 

ఎవరు, ఎలా చేస్తారు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్రాలను పునర్‌వ్యవస్థీకరించే అధికారం పార్లమెంటుకు ఉంది. రాష్ట్రపతి అనుమతితో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు ఉభయసభల్లో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. రాష్ట్రపతి పునర్‌వ్యవస్థీకరణ జరిగే రాష్ట్ర శాసనసభ అభిప్రాయాన్ని నిర్ణీత గడువు లోగా తెలపాలని కోరవచ్చు. రాష్ట్ర శాసనసభ అభిప్రాయం ఏదైనప్పటికీ రాష్ట్రపతి గౌరవించాల్సిన అవసరం లేదు. కేంద్రప్రభుత్వం సొంత నిర్ణయాన్ని అమలు చేయవచ్చు. పునర్‌వ్యవస్థీకరణ బిల్లులను పార్లమెంటు సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే సరిపోతుంది. పార్లమెంటు అంగీకారం అనంతరం రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారి కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది. రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వివిధ కమిటీలు సిఫార్సులు చేశాయి. వాటిలో ముఖ్యమైన అంశాలను అభ్యర్థులు పరీక్షల కోణంలో అధ్యయనం చేయాలి.
 

భాషాప్రయుక్త ప్రావిన్స్‌ల కమిటీ
భారతదేశంలో ‘భాష’ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశాన్ని అధ్యయనం చేసేందుకు అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి సరోజ్‌కుమార్‌ థార్‌ (ఎస్‌.కె.థార్‌) అధ్యక్షతన పన్నాలాల్‌, జగత్‌నారాయణ్‌లాల్‌ సభ్యులుగా ఒక కమిటీని 1948 జూన్‌లో అప్పటి రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుడైన డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ నియమించారు. ఈ కమిటీ తన నివేదికను 1948 డిసెంబరులో సమర్పించింది.
 

సిఫార్సులు:
» భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు సమంజసం కాదు.
» రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పాలనా సౌలభ్యం కోసం మాత్రమే జరగాలి.

 

జేవీపీ కమిటీ
ఎస్‌.కె.థార్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రత్యేకించి ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర నిరసనలకు దారితీయడంతో 1948 డిసెంబరులో జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణపై జేవీపీ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీలో J- జవహర్‌లాల్‌ నెహ్రూ, V - వల్లభాయ్‌పటేల్‌, P - పట్టాభి సీతారామయ్యలు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను 1949 ఏప్రిల్‌లో సమర్పించింది.
 

సిఫార్సులు:
» రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణకు పరిపాలన, అభివృద్ధి, జాతీయ సమైక్యత వంటి అంశాలు ప్రాతిపదిక కావాలి.
» భాష ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును వాయిదా వేయాలి.
» ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటును సానుభూతితో పరిశీలించాలి.

 


ఫజల్‌ అలీ కమిషన్‌

కైలాష్‌నాథ్‌ వాంఛూ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ‘ఆంధ్ర రాష్ట్రం’ అవతరించింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఇతర భాషాప్రయుక్త రాష్ట్రాలకు డిమాండ్లు తలెత్తాయి. దీంతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి నెహ్రూ ప్రభుత్వం 1953 డిసెంబరులో ఫజల్‌ అలీ అధ్యక్షతన కె.ఎమ్‌.పణిక్కర్‌, హెచ్‌.ఎన్‌.కుంజ్రూ సభ్యులుగా రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ తన నివేదికను 1955 సెప్టెంబరులో సమర్పించింది.
 

సిఫార్సులు:
» పార్టు - ఎ, బి, సి, డి రాష్ట్రాల వర్గీకరణను రద్దుచేయాలి.
» ‘ఒకే భాష - ఒకే రాష్ట్రం’ అనే నినాదం సమంజసం కాదు.

 

రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ అంటే?
» కొత్త రాష్ట్రాలను ఏర్పాటుచేయడం
» రాష్ట్రాల సరిహద్దులను మార్చడం
» రాష్ట్రాల విస్తీర్ణంలో మార్పులు చేయడం
» రాష్ట్రాల పేర్లు మార్చడం

 

సుప్రీంకోర్టు తీర్పు
బాబూలాల్‌ Vs స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేసు: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ - రాష్ట్రపతి పంపిన రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై సంబంధిత రాష్ట్ర శాసనసభ తన అభిప్రాయాన్ని తెలిపిన తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టేముందు కేంద్రప్రభుత్వం ఆ బిల్లులో ఏవైనా సవరణలు చేస్తే మళ్లీ శాసనసభ అభిప్రాయాన్ని కోరాల్సిన అవసరం లేదని పేర్కొంది.
 

- బంగారు సత్యనారాయణ

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కొత్త రాష్ట్రాల ఏర్పాటు - ఉద్యమాలు

     భారత రాజ్యాంగ నిర్మాతలు దేశాన్ని ‘రాష్ట్రాల సముదాయం’ (Union of States) గా పేర్కొన్నారు. వీరు దేశాన్ని పాలనాపరమైన సమాఖ్యగా ఏర్పాటు చేశారు కానీ సిద్ధాంతపరమైన సమాఖ్యగా పేర్కొనలేదు. దీనివల్ల దేశం నుంచి రాష్ట్రాలు విడిపోయే అవకాశం లేదు. ఒకే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య అభివృద్ధి విషయంలో అసమానతలకు గురైనవారు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, దేశంలోనే అంతర్భాగంగానే కొనసాగుతున్నారు. ఇది భారత ఉపఖండం విశిష్టతను తెలియజేస్తుంది.
 

కారణాలు
* కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జరుగుతున్న ఉద్యమాల వెనుక సాంస్కృతిక, ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత సహజవనరులను ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించకుండా మిగిలిన ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు కొత్త రాష్ట్రం కోసం డిమాండ్‌లు వస్తాయి.
* ఒక రాష్ట్రంలోని ఒక ప్రాంత ప్రజల సంస్కృతి, సంప్రదాయాల పట్ల మిగిలిన ప్రాంతాల ఆధిపత్యం పెరిగినప్పుడు; ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నిర్లక్ష్యానికి గురై, మిగిలిన ప్రాంతాలు వాటిని పొందడంలో ఆధిక్యం ప్రదర్శించినప్పుడు ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి.

* ఆర్థిక అభివృద్ధి రాష్ట్ర రాజధాని చుట్టూ కేంద్రీకృతమై, మిగిలిన ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబాటుకు గురైనప్పుడు; నదీజాలలు, ఖనిజ సంపద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలినప్పుడు కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమాలు వస్తాయి.

* ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, భౌగోళిక సామీప్యత ఉన్న కొన్ని ప్రాంతాలు కొత్త రాష్ట్రంగా ఏర్పడాలని భావిస్తాయి.

* రాజకీయ నాయకులూ తమ మనుగడ కోసం కొన్ని సముదాయాలను ఏకీకృతం చేసి కొత్త రాష్ట్రాల కోసం ఉద్యమిస్తున్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే అభివృద్ధి ప్రణాళికలు, పారిశ్రామిక విధానాలు, బడ్జెట్‌ కేటాయింపులు లోపభూయిష్టంగా ఉన్నప్పుడు నష్టపోతున్న ప్రాంతాల వారు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలని ఉద్యమిస్తారు.

1956 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ట్రాలు
ఫజల్‌ అలీ నేతృత్వంలోని రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ కమిషన్‌ ్బళీళిద్శి సిఫార్సుల మేరకు 1956లో 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో భారత రాజకీయ చిత్రపటంలో అనేక మార్పులు వచ్చాయి. వాటికి ప్రజా ఉద్యమాలు, రాజకీయ పరిస్థితులు ప్రధాన కారణంగా నిలిచాయి. భాష ప్రాతిపదికన లేదా సాంస్కృతిక సజాతీయత కారణాలపై ఏర్పడిన డిమాండ్‌ల వల్ల రాష్ట్రాలను తిరిగి విభజించాల్సి వచ్చింది.
 

15. గుజరాత్‌: భూమిపుత్రుల సిద్ధాంతం పేరుతో ‘మరాఠా’ ప్రాంతం మరాఠీయులకే చెందాలని కోరుతూ గుజరాతీ భాష మాట్లాడేవారిని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని బాంబేలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. 1960లో ద్విభాషా రాష్ట్రమైన బాంబేని విభజిస్తూ గుజరాతీయుల కోసం ప్రత్యేకంగా సౌరాష్ట్రను కలిపి గుజరాత్‌ను 15వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. మరాఠీ మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న బొంబాయిని మహారాష్ట్రగా పేరు మార్చారు.
 

16. నాగాలాండ్‌: ఎ.జి.పి.జో నేతృత్వంలోని నాగాలు, అసోంను విడగొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలని ఉద్యమించారు. దీంతో నాగాహిల్స్, ట్యూన్‌సాంగ్‌లను వేరు చేసి 1963లో నాగాలాండ్‌ను 16వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

17. హరియాణా: మాస్టర్‌ తారాసింగ్‌ నాయకత్వంలో అకాళీదళ్‌ ప్రత్యేక ‘సిక్కుల మాతృభూమి’ (పంజాబ్‌ సుబా) అనే డిమాండ్‌తో పంజాబ్‌ రాష్ట్రం పంజాబీయులకే (సిక్కులు) చెందాలని, హిందీ మాట్లాడేవారిని వేరు చేయాలని ఉద్యమించింది. 1966లో షా కమిషన్‌ సూచనల మేరకు పంజాబీ మాట్లాడే ప్రాంతాలను పంజాబ్‌ రాష్ట్రంగా ఉంచి, హిందీ మాట్లాడే ప్రాంతాలను వేరు చేసి హరియాణా పేరుతో 17వ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా చండీగఢ్‌ను నిర్ణయించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
 

18. హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రాల పునర్‌ వ్యవస్థీకరణ ఫలితంగా 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌కు బిలాస్‌పూర్‌ ప్రాంతాన్ని కలిపి 1971లో దాన్ని 18వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

19. మణిపూర్‌: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటైన మణిపూర్‌ను 1972లో 19వ రాష్ట్రంగా మార్చారు.
 

20. త్రిపుర: 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న త్రిపురను 1982లో 20వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

21. మేఘాలయ: ప్రజా ఉద్యమం కారణంగా అసోం రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తూ 1972లో ఉప ప్రాంతంగా ఉన్న మేఘాలయను 21వ రాష్ట్రంగా నిర్ణయించారు. ఈ సందర్భంలోనే మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్‌లు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి.
 

22. సిక్కిం: బ్రిటిషర్ల పాలనా కాలంలో ‘సిక్కిం’ చోగ్యాల్‌ అనే వారసత్వపు రాజు నియంత్రణలో ఉండేది. 35వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కిం భారత్‌లో ‘సహరాష్ట్ర హోదా’ (Associate State) గా విలీనమైంది. ఇది విమర్శకు దారి తీయడంతో కేంద్ర ప్రభుత్వం 36వ రాజ్యాంగ సవరణ చట్టం (1975) ద్వారా సిక్కింను భారత్‌లో 22వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.
 

23. మిజోరం: రాజీవ్‌ గాంధీ ప్రభుత్వ కాలంలో (1986) మిజో నేషనల్‌ ఫ్రంట్‌తో జరిగిన ‘మిజోరం శాంతి ఒప్పందం’ ఫలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న మిజోరంను 1987లో 53వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 23వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

24. అరుణాచల్‌ప్రదేశ్‌: కేంద్రపాలిత ప్రాంతమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 55వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో 24వ రాష్ట్రంగా మార్చింది.
 

25. గోవా: ‘ఆపరేషన్‌ విజయ్‌’ పేరుతో పోర్చుగీసు వారి నుంచి 1961లో విముక్తి పొందిన గోవా, డయ్యూ డామన్‌లను 10వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 56వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1987లో గోవాను 25వ రాష్ట్రంగా ఏర్పాటు చేసి డయ్యూ డామన్‌లను కేంద్రపాలిత ప్రాంతంగానే కొనసాగించారు.
 

¤ అటల్‌బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం 2000 సంవత్సరంలో భారత్‌లో మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అవి చత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, ఝార్ఖండ్‌.
 

26. చత్తీస్‌గఢ్‌: మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 1న చత్తీస్‌గఢ్‌ను 26వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

27. ఉత్తరాంచల్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 9న ఉత్తరాంచల్‌ను 27వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

28. ఝార్ఖండ్‌: బిహార్‌ను పునర్‌ వ్యవస్థీకరించి 2000, నవంబరు 15న ఝార్ఖండ్‌ను 28వ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
 

29. తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టం, 2014 ద్వారా డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విభజించి 2014 జూన్‌ 2న తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసింది.
 

ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్‌ చేస్తున్న ప్రాంతాలు: మహారాష్ట్ర - విదర్భ; అసోం - బోడోలాండ్‌; కర్ణాటక - కొడుగు; ఉత్తరప్రదేశ్‌ - హరితప్రదేశ్, బుందేల్‌ఖండ్‌; పశ్చిమ్‌ బంగ - గూర్ఖాలాండ్‌; గుజరాత్‌ - సౌరాష్ట్ర.
 

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

రాజ్యాంగం - చారిత్రక పరిణామం

1. భారతదేశంలో ప్రత్యేక మత నియోజక వర్గాలను ఏ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు?
జ: మింటో-మార్లే సంస్కరణల చట్టం - 1909

 

2. భారత్‌లో మత నియోజక వర్గాల పితామహుడని ఎవరిని పేర్కొంటారు?
జ: లార్డ్‌ మింటో

 

3. మన దేశంలో రాష్ట్రస్థాయిలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

4. భారతదేశంలో బాధ్యతాయుతమైన పరిపాలనను ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఏ చట్టంలో పేర్కొన్నారు?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

5. కేంద్ర శాసనసభలో మొదటిసారి ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టిన చట్టం?
జ: మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919

 

6. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా నియమితులైన తొలి భారతీయుడు?
జ: సత్యేంద్ర ప్రసాద్‌ సిన్హా

 

7. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919ను ‘సూర్యుడులేని ఉదయం’ అని ఎవరు అభివర్ణించారు?
జ: బాలగంగాధర్‌ తిలక్‌

 

8. మాంటేగ్‌-చెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం - 1919కు సంబంధించి సరైంది?
1) కేంద్ర బడ్జెట్‌ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను వేరుచేశారు.               
2) లండన్‌లో భారత హైకమిషనర్‌ పదవిని ఏర్పాటు చేశారు.
3) సాధారణ బడ్జెట్‌ నుంచి రైల్వే బడ్జెట్‌ను వేరుచేశారు.         
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

9. రాష్ట్రాల్లోని ‘ద్వంద్వ ప్రభుత్వ’ విధానాన్ని ఏ చట్టం రద్దు చేసింది?
జ: భారత ప్రభుత్వ చట్టం - 1935

 

10. భారత ప్రభుత్వ చట్టం - 1935కు సంబంధించి సరైంది.
1) కేంద్రం, రాష్ట్రాల మధ్య మూడు రకాల అధికారాల విభజనను పేర్కొటుంది.
2) రాష్ట్రస్థాయిలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టింది.
3) దిల్లీలో ఫెడరల్‌ కోర్ట్‌ను ఏర్పాటు చేసింది.
4) పైవన్నీ
జ: 4 (పైవన్నీ)

 

రచయిత - బంగారు సత్యనారాయణ

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

భారతదేశం - సమాఖ్య, ఏకకేంద్ర వ్యవస్థల సమ్మేళనం

        విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో విస్తరించిన భారతదేశం ఏకీకృతంగా ఎలా ఉంది? కేంద్రం, రాష్ట్రాలకు అధికారాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ వాటిని కలిపి ఉంచే శక్తి ఏమిటి? అధికారాల విభజనకు ప్రాతిపదిక ఏది? పాలిటీ అధ్యయనంలో భాగంగా వీటన్నింటిపై పోటీ పరీక్షార్థులు అవగాహనను పెంచుకోవాలి.
 

      కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఉన్న సంబంధాలను ఆధారం చేసుకొని రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థల నిర్మాణాన్ని సమాఖ్య, ఏకకేంద్రాలుగా పేర్కొంటారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అధికారాల పంపిణీ జరుగుతుంది. ఏకకేంద్రంలో పరిపాలన అధికారాలు మొత్తం కేంద్రం వద్ద ఉంటాయి.
 

సమాఖ్య లక్షణాలు
ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ: మన రాజ్యాంగం ప్రకారం జాతీయస్థాయిలో కేంద్ర, ప్రాంతీయస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యం ఉన్న విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్‌, రైల్వేలు, తంతి తపాలా మొదలైన అంశాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయం, ప్రజారోగ్యం, శాంతిభద్రతలు తదితరాలను పర్యవేక్షిస్తాయి.
 

రాజ్యాంగ ఆధిక్యత: భారతదేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ద్వారా ఏర్పడి, రాజ్యాంగం ద్వారానే అధికారాలను పొంది, రాజ్యాంగ పరిధికి లోబడి పనిచేస్తాయి. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు, న్యాయవ్యవస్థ రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరించాలి.
 

లిఖిత రాజ్యాంగం: భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. ప్రారంభ రాజ్యాంగంలో 395 ఆర్టికల్స్‌, 8 షెడ్యూల్స్‌, 22 భాగాలు ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూళ్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలు, విధులు వాటి నిర్వహణలో పరిమితులను రాజ్యాంగం నిర్దేశిస్తుంది. ఆర్టికల్‌ 73 కేంద్ర ప్రభుత్వ అధికార పరిధిని, ఆర్టికల్‌ 162 రాష్ట్రప్రభుత్వాల అధికార పరిధిని వివరిస్తాయి.
 

భారత రాజ్య వ్యవస్థ సాధారణ పరిస్థితుల్లో సమాఖ్యగానూ, అసాధారణ పరిస్థితుల్లో ఏక కేంద్రంగానూ వ్యవహరిస్తుంది. - డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌
భారత రాజ్యాంగం అర్ధ సమాఖ్య - కె.సి.వేర్

 

అధికారాల విభజన
          కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను మూడు రకాలుగా చేసి ఏడో షెడ్యూల్‌లో పొందుపరిచారు. ఇది సమాఖ్య వ్యవస్థ లక్షణం.
కేంద్ర జాబితా: దీనిలో జాతీయ ప్రాధాన్యం ఉన్న 97 అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 100.

 

రాష్ట్ర జాబితా: దీనిలో ప్రాంతీయ ప్రాముఖ్యం ఉన్న 66 అంశాలను పొందుపరిచారు. ప్రస్తుతం వీటి సంఖ్య దాదాపు 61.
 

ఉమ్మడి జాబితా: దీనిలో జాతీయ, ప్రాంతీయాలకు సంబంధించిన 47 అంశాలను పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి సంఖ్య సుమారు 52. ఈ జాబితాల్లో లేని అంశాలను ‘అవశిష్టాధికారాలు’ అంటారు. అవి కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి.
 

సమాఖ్య వ్యవస్థ దేశాలు: అమెరికా, రష్యా, స్విట్జర్లాండ్‌, కెనడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, మెక్సికో.
 

ఏకకేంద్ర వ్యవస్థ దేశాలు: శ్రీలంక, బ్రిటన్‌, చైనా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌.
 

రచయిత - బంగారు సత్యనారాయణ
 

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

సామాజిక వికాస ప్రయోగాలు

పల్లెసీమల్లో నవోదయం!


పల్లె సీమల్లో ప్రగతి వెలుగులు నింపి, గ్రామీణుల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో శతాబ్దంపైగా సామాజిక వికాస ప్రయోగాలు సాగుతున్నాయి. సమాజంలో సమానత్వాన్ని, చైతన్యాన్ని పెంపొందించి, స్వయం సమృద్ధిని సాధించడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం వ్యక్తులు, సంస్థలు మొదలు ప్రభుత్వాల వరకు ఎందరో కృషి చేశారు. అనేక విధానాలు, పథకాలను అమలు చేశారు. ఆ వివరాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి.

   

గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి, ప్రజలకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా వివిధ కార్యక్రమాలను చేపట్టారు. విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యమే ధ్యేయంగా స్వాతంత్య్రానికి పూర్వం పలువురు వ్యక్తుల ఆధ్వర్యంలో అవి జరిగాయి. స్వాతంత్య్రానంతరం అదే తరహాలో ఉపాధి, ఇల్లు, ఇతర మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి.

సుందర్బన్స్‌ ప్రయోగం(1903): పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్స్‌’ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు 1903లో ‘డేనియల్‌ హామిల్టన్‌’ శ్రీకారం చుట్టారు. గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించి ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించారు.

గుర్గావ్‌ ప్రయోగం (1920): 1920లో పంజాబ్‌లోని ‘గుర్గావ్‌’ జిల్లాలో ఎఫ్‌.ఐ.బ్రేయన్‌ అనే డిప్యూటీ కమిషనర్‌ గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. 1933 నుంచి ‘గుర్గావ్‌ గ్రామీణాభివృద్ధి ఉద్యమం’ విస్తృతంగా కొనసాగింది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం 1935-36లో రూ.కోటి కేటాయించి ప్రోత్సహించింది.

కీలకాంశాలు: 1) అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం. 2) వివాహం, ఉత్సవం, విందు, వినోదాల్లో జరిగే ధనవ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి వినియోగించడం. 3) వ్యవసాయోత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం. 4) మహిళా విద్య, గ్రామీణ పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం.

మార్తాండం ప్రయోగం(1921): తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో మార్తాండం ప్రాంతంలో అమెరికన్‌ వ్యవసాయ రంగ నిపుణుడు ‘స్పెన్సర్‌ హాచ్‌’ దీనికి ఆద్యుడు. సుమారు 70 గ్రామాలకు చెందిన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం వైఎంసీఏ (యంగ్‌ మెన్స్‌ క్రిస్టియన్‌ అసోసియేషన్‌)ను ఏర్పాటు చేసి, ఈ ప్రయోగం నిర్వహించారు. 

కీలకాంశాలు: 1) అభివృద్ధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం. 2) గ్రామీణ పునర్నిర్మాణం. 3) మౌలిక రంగాల్లో ప్రజలకు తర్ఫీదునివ్వడం. 4) అధునిక సాగు పద్ధతులను అవలంబించడం. 5) పాడి పరిశ్రమ, తేనెటీగల పెంపకం.

శ్రీనికేతన్‌ ప్రయోగం (1922): విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కలకత్తాలోని శాంతినికేతన్‌లో దీన్ని ప్రారంభించారు. సామాజిక వికాస ప్రయోగాల్లో ఆత్మగౌరవాన్ని కీలకాంశంగా తీసుకున్నారు.

కీలకాంశాలు: 1) చిన్నతరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 2) ఆత్మగౌరవంతో స్వయంసమృద్ధి సాధించడం. 3) వయోజన విద్య, ప్రజల ఆరోగ్య సంరక్షణ.

బరోడా ప్రయోగం (1932):  బరోడా సంస్థానంలో ‘దివాన్‌’గా పనిచేసిన వి.టి.కృష్ణమాచారి 1932లో సమాజ అభివృద్ధి సాధనలో భాగంగా ఈ ప్రయోగం చేపట్టారు.

కీలకాంశాలు: 1) గ్రామీణ యువతీ యువకులను చైతన్యపరచి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం. 2) రోడ్ల నిర్మాణం, పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం ద్వారా సమాజ ప్రగతికి కృషి చేయడం.

సేవాగ్రామ్‌ ప్రయోగం(1933):  మహారాష్ట్రలోని ‘వార్ధా’ ప్రాంతంలో మహాత్మాగాంధీ 1933లో దీన్ని ప్రారంభించారు. ఆచార్య వినోబా భావే, లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ తదితరులు విస్తృతపరిచారు.

కీలకాంశాలు: 1) సర్వోదయ, నవోదయ సిద్ధాంతాల ఆధారంగా సమాజాన్ని నిర్మించడం. 2) ఆర్థిక, సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు కృషి చేయడం.3) ప్రాతిపదిక విద్య (Basic Education)లో శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రజల స్వయంసమృద్ధికి పాటుపడటం.

ఫిర్కా ప్రయోగం (1946): టంగుటూరి ప్రకాశం మద్రాస్‌ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో ‘ఫిర్కా’ ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.

కీలకాంశాలు: 1) తాలుకాలను ఫిర్కాలుగా విభజించి వాటి సమగ్రాభివృద్ధికి కృషి చేయడం. 2) వెనుకబాటుతనం ఆధారంగా ఫిర్కాలను ఎంపిక చేయడం. 3) కుటీర పరిశ్రమల ఏర్పాటు, నిర్వహణ. 4) సహకార సంస్థల ఏర్పాటు. 5) అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వేతర సంస్థల భాగస్వామ్యం.

* 1952లో భారత ప్రభుత్వం ‘సమాజ అభివృద్ధి పథకం’ (Community Development Programme - CDP) ప్రవేశపెట్టడంతో ఫిర్కాలను ‘బ్లాకు’ల్లో విలీనం చేశారు.

ఇటావా ప్రయోగం(1948): ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా ‘మహేవా’ ప్రాంతంలో ఆల్బర్ట్‌ మేయర్‌ దీన్ని ప్రారంభించారు. సుమారు 97 గ్రామాలను ఎంపిక చేసుకుని పౌర సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నించారు.

కీలకాంశాలు: 1) కళారూపాలతో ప్రజల్లో సామాజిక చైతన్యం పెంచడం. 2) వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేనేత పరిశ్రమలకు ప్రోత్సాహం. 3) పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా గ్రామ పంచాయతీల ఏర్పాటుకు కృషి.

నీలోఖరి ప్రయోగం (1948):  హరియాణాలోని కర్నాల్‌ జిల్లా ‘నీలోఖరి’ ప్రాంతంలో దీన్ని ప్రారంభించారు. దేశ విభజన సందర్భంగా నిరాశ్రయులైన సుమారు 7 వేల మందికి పునరావాసం కల్పించడం ఈ ప్రయోగం లక్ష్యం. ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుడు సురేంద్ర కుమార్‌ డే (ఎస్‌కే డే). 

కీలకాంశాలు: 1) స్వయంశక్తితో అభివృద్ధి చెందే విధంగా ప్రజలను ప్రోత్సహించడం. 2) వ్యవసాయ పనిముట్ల తయారీ, ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో శిక్షణ ఇవ్వడం. 3) గృహ వసతి, మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించడం.

గ్రో మోర్‌ ఫుడ్‌ కాంపెయిన్‌ (1942): క్విట్‌ ఇండియా ఉద్యమ కాలంలో బెంగాల్‌లో కరవు, తుపానుల ఫలితంగా ఆహార ధాన్యాలకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆహారధాన్యాల ఉత్పత్తిని పెంచే విధంగా బ్రిటిషర్లు 'Grow More Food Campaign'ను 1942లో ప్రారంభించారు. కానీ ఆశించిన ఫలితాలివ్వలేదు.

* 1947, ఆగస్ట్‌ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చే సమయానికి దేశం తీవ్రమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ‘గ్రో మోర్‌ ఫుడ్‌’ లక్ష్యంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని నిర్ణయించింది.

* మొదటి పంచవర్ష ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గ్రామీణాభివృద్ధిపై వి.టి.కృష్ణమాచారి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. దాని సిఫారసుల మేరకు దేశంలో ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో (సమితులు) 1952, అక్టోబరు 2న ‘సమాజ అభివృద్ధి కార్యక్రమం’ (CDP) ప్రారంభించారు.

సమాజ అభివృద్ధి కార్యక్రమం (1952): అమెరికాలో అమలైన ‘బ్లాక్‌’ (Block) ను అభివృద్ధికి నమూనాగా తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికాకు చెందిన ఫోర్డ్‌ ఫౌండేషన్‌ ఆర్థిక సహకారం అందించింది. అప్పటి అమెరికా రాయబారి చెస్టర్‌ బౌల్స్‌ ద్వారా 5 మిలియన్‌ డాలర్లు సమకూర్చింది. 1971 నాటికి ఫోర్డ్‌ ఫౌండేషన్‌ అందించిన ఆర్థిక సహకారం సుమారు 104 మిలియన్‌ డాలర్లు.


ఎంపిక చేసిన అంశాలు: 1) పేదరికం, నిరుద్యోగం నిర్మూలన. 2) గ్రామీణ సమాచార వ్యవస్థ, వ్యవసాయం, కుటీర పరిశ్రమలు. 3) ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, సాంఘిక సంక్షేమం. 4) వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, గృహవసతి.


సీడీపీ లక్ష్యాలు: 1) ప్రజలు సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం. 2) వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం సాధించడం. 3) దేశ ప్రగతిలో ప్రజలందరినీ భాగస్వాముల్ని చేయడం.


కీలకాంశాలు:  1) ఈ పథకాన్ని మొదటిసారిగా ఎంపిక చేసిన 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో ప్రారంభించారు. ప్రతి బ్లాకులో సుమారు 100 గ్రామాలు, 70 వేల జనాభా ఉంటుంది.  2) ప్రతి బ్లాకుకు కార్యనిర్వహణాధికారిగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ వ్యవహరిస్తారు. 3) సీడీపీని ప్రచారం చేయడానికి గ్రామస్థాయిలో ‘గ్రామ్‌సేవక్‌’ అనే అధికారిని నియమించారు. 4) ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. 5) సీడీపీ తర్వాత కాలంలో 5011 బ్లాకులకు విస్తరించింది.

జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం: సీడీపీకి కొనసాగింపుగా దేశంలోని 1700 బ్లాకుల్లో ‘జాతీయ విస్తరణ సేవా కార్యక్రమం (National Extension Service Scheme n- NESS)’ ను 1953, అక్టోబరు 2న ప్రారంభించారు. సీడీపీని మూడేళ్ల కాలపరిమితితో రూపొందించగా, ‘ఎన్‌ఈఎస్‌ఎస్‌’ను శాశ్వత ప్రాతిపదికన చేపట్టారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ ద్వారా వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, విద్యా రంగాలు అభివృద్ధి చేయాలని సంకల్పించారు.

వివిధ స్థాయుల్లో అమలు:

కేంద్ర స్థాయి: సమాజ అభివృద్ధి, సహకార మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో అమలవుతుంది.

రాష్ట్ర స్థాయి: ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే ‘రాష్ట్ర అభివృద్ధి సంఘం’ పర్యవేక్షణలో అమలవుతుంది.

జిల్లా స్థాయి: కలెక్టర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

బ్లాకు స్థాయి: బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో అమలవుతుంది.

గ్రామ స్థాయి: విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌ (వీఎల్‌డబ్ల్యూ) పథకం అమలుకు కృషి చేస్తారు.

* సీడీపీ, ఎన్‌ఈఎస్‌ఎస్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌.కె.డే వ్యవహరించారు. ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం ‘సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం వంటిది’ అని ఆయన పేర్కొన్నారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం భారతదేశంలో ‘ఒక నిశ్శబ్ద విప్లవం’ వంటిదని జవహర్‌లాల్‌ నెహ్రూ అభివర్ణించారు.

* ఎన్‌ఈఎస్‌ఎస్‌ పథకం అమలులో గ్రామస్థాయిలో కీలకపాత్ర పోషించేది విలేజ్‌ లెవల్‌ వర్కర్స్‌.  వీరికి అన్ని రంగాల్లోనూ శిక్షణ ఇచ్చేవారు. అందుకే వీరిని మల్టీపర్పస్‌ వర్కర్స్‌గానూ పిలిచేవారు.

రచయిత: బంగారు సత్యనారాయణ

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌