• facebook
  • whatsapp
  • telegram

బీమా రంగం(Insurance Sector)

బీమా ఒక సాంఘిక భద్రతా సౌకర్యం. మానవ జీవితంలో కొన్ని విపత్తుల వల్ల ప్రాణ నష్టం, అనారోగ్యం, ఆస్తి నష్టం లాంటివి సంభవించవచ్చు. అలాంటి క్లిష్ట సమయాల్లో సంబంధిత వ్యక్తికి లేదా కుటుంబానికి ఆర్థికంగా వెసులుబాటు కల్పించేదే బీమా. నష్ట భయాన్ని బీమా చేయడానికి ఆయా సంస్థలకు ఒకేసారి లేదా వాయిదా పద్ధతిలో కొంత రుసుం చెల్లించాలి. దీన్నే ప్రీమియం అంటారు. బీమా చేయించుకున్న వ్యక్తికి, బీమా చేసిన వ్యాపార సంస్థకు మధ్య ఒప్పందాన్ని తెలిపే పత్రమే బీమా పాలసీ (Insurance Policy)

బీమా రకాలు

బీమాను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి:

1) జీవిత బీమా (Life Insurance)

2) సాధారణ బీమా (General Insurance) లేదా జీవితేతర బీమా (Non-Life Insurance)

జీవిత బీమా: ఇది ప్రాణ నష్టానికి సంబంధించింది. జీవిత బీమా చేయించుకున్న వ్యక్తి తన పాలసీ కాలం పూర్తయ్యే లోపు మరణిస్తే, బీమా మొత్తాన్ని (Assured Sum) వారి కుటుంబానికి బీమా సంస్థ చెల్లిస్తుంది. వ్యక్తి చనిపోక ముందే పాలసీ కాలం పూర్తయితే, చెల్లించిన ప్రీమియం మొత్తానికి కొంత బోనస్‌ సొమ్మును కలిపి సంబంధిత వ్యక్తికి చెల్లిస్తుంది.

సాధారణ బీమా: ఒక వ్యక్తి ఏదైనా ప్రమాదానికి గురైనప్పుడు శరీరంలో ఒక భాగం కోల్పోవచ్చు లేదా కొన్ని అవయవాలు పనిచేయని పరిస్థితి తలెత్తవచ్చు లేదా అనారోగ్యానికి గురై వైద్య సహాయం పొందాల్సి రావచ్చు. ప్రమాదం కారణంగా అతడి/ ఆమె వాహనం దెబ్బతినొచ్చు. అగ్ని ప్రమాదాలు, దొంగతనాల వల్ల ఆస్తి నష్టం సంభవించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో నష్టభయాలకు సంబంధించిన బీమా సౌకర్యాన్ని సాధారణ బీమా అంటారు. వీటన్నింటికీ బీమా సౌకర్యం కల్పించే వ్యాపారమే జీవితేతర బీమా (Non-Life Insurance Business) వ్యాపారం. కింది బీమా పథకాలన్నీ ఈ రకానికి చెందుతాయి.

1) అగ్ని ప్రమాద బీమా     2) నౌక బీమా  

3) మోటారు బీమా     4) ఆరోగ్య బీమా

భారతదేశంలో బీమా వ్యాపారం పరిణామ క్రమం

మనదేశంలో ప్రాచీన కాలం నుంచే బీమా వాడుకలో ఉంది. మనుస్మృతిలో దీని ప్రస్తావన ఉంది. యజ్ఞవల్క్యుడి ‘ధర్మశాస్త్రం’లో, కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం’లోనూ దీన్ని పేర్కొన్నారు. ద్రవ్య వనరులను సమీకరించి అగ్ని ప్రమాదం, వరదలు, అంటు వ్యాధుల వ్యాప్తి, కరవు మొదలైనవి సంభవించినప్పుడు, వాటిని ప్రజలకు పంచిపెట్టడం గురించి ఈ గ్రంథాల్లో ప్రస్తావించారు. 

నౌకావ్యాపార రుణాలు, రవాణా నౌకల ఒప్పందాలు మొదలైనవి ఆధునిక బీమాకు సంబంధించిన తొలి రూపాలుగా పేర్కొనవచ్చు. భారత్‌ ఆధునిక బీమా విధానాన్ని ఇంగ్లండ్‌ నుంచి స్వీకరించింది.

భారతదేశంలో స్థాపించిన మొట్టమొదటి బీమా సంస్థ ఓరియంటల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ. దీన్ని 1818లో కొంత మంది ఐరోపా దేశస్థులు కలకత్తాలో ఏర్పాటు చేశారు.  

1829లో మద్రాస్‌ ప్రెసిడెన్సీలో మద్రాస్‌ ఈక్విటబుల్‌ అనే సంస్థ జీవిత బీమా వ్యాపారాన్ని ప్రారంభించింది. 

మన మొదటి స్వదేశీ బీమా సంస్థ ‘బాంబే మ్యూచువల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌ సొసైటీ’. దీన్ని 1870లో  నెలకొల్పారు.

1870లో బ్రిటిష్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని చేశారు.

బాంబే ప్రెసిడెన్సీలో 1871లో బాంబే మ్యూచువల్, 1874లో ఓరియంటల్, 1897లో ఎంపైర్‌ ఆఫ్‌ ఇండియా అనే బీమా సంస్థలను స్థాపించారు.

1896లో భారత్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీని నెలకొల్పారు.

స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 1905-07 మధ్య కాలంలో దేశంలో అనేక ప్రాంతాల్లో బీమా సంస్థలు స్థాపించారు.

1906లో మద్రాస్‌లో యునైటెడ్‌ ఇండియా, కలకత్తాలో నేషనల్‌ ఇన్సూరెన్స్, లాహోర్‌లో కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలను ఏర్పాటు చేశారు.

1907లో కలకత్తాలో రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కుటుంబానికి చెందిన ‘జొరసంకో’ గృహంలో హిందుస్థాన్‌ కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రారంభమైంది. అదే కాలంలో ఇండియన్‌ మర్కంటైల్, జనరల్‌ అస్యూరెన్స్‌ అండ్‌ స్వదేశీ లైఫ్‌ సంస్థలను నెలకొల్పారు. 

బీమా వ్యాపారం క్రమబద్ధీకరణ

భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌ ప్రకారం బీమారంగం కేంద్ర జాబితాలో ఉంది.

1912 వరకు మనదేశంలో బీమా వ్యాపారంపై ప్రభుత్వ నియంత్రణ లేదు.

దేశంలో బీమా వ్యాపారాన్ని క్రమబద్ధీకరించాలనే లక్ష్యంతో 1912లో భారత ప్రభుత్వం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. అదే ఏడాది ప్రావిడెంట్‌ఫండ్‌ చట్టం కూడా చేసింది.

1914లో భారత ప్రభుత్వం దేశంలోని బీమా సంస్థల రిటర్న్‌లను ప్రచురించడం ప్రారంభించింది.

1938లో ప్రభుత్వం సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడం దీని ఉద్దేశం. 

1999లో ప్రభుత్వం బీమా క్రమబద్ధీకరణ, డెవలప్‌మెంట్‌ అథారిటీ చట్టాలను చేసింది. అప్పటివరకు   సమగ్ర లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చట్టం అమల్లో ఉంది.

1950లో ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ అమెండ్‌మెంట్‌ చట్టం ద్వారా ప్రధాన ఏజెన్సీలను రద్దు చేసింది.

ఎల్‌ఐసీ అనుబంధ సంస్థలు 

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌

ఎల్‌ఐసీ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ కార్డ్స్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ లిమిటెడ్‌

ఎల్‌ఐసీ పెన్షన్‌ ఫండ్‌ లిమిటెడ్‌

ఐడీబీఐ బ్యాంక్‌ 

2020 నాటికి ఎల్‌ఐసీలోని ఉద్యోగుల సంఖ్య 1,14,000

2021 నాటికి ఎల్‌ఐసీ మొత్తం ఆస్తుల విలువ రూ.38,04,610 కోట్లు (510 బిలియన్‌ డాలర్లు)

1956లో ఎల్‌ఐసీకి 5 జోన్లు, 33 డివిజన్లు, 240 బ్రాంచి కార్యాలయాలు ఉండేవి. ఆ సమయంలో ఇందులో 89,000 మంది ఏజెంట్లు పనిచేసేవారు.

2017 నాటికి 8 జోన్లు, 113 డివిజన్లు, 2048 బ్రాంచి కార్యాలయాలకు వృద్ధి చెందింది. 

200012 మధ్య కాలంలో బీమా రంగంలో 23 ప్రైవేట్‌ సంస్థలను నెలకొల్పారు. 

ప్రస్తుతం ఎల్‌ఐసీలో 15,37,064 మంది స్వతంత్ర ఏజెంట్లు,  342 మంది కార్పొరేట్‌ ఏజెంట్లు, 109 మంది రెగ్యులర్‌ ఏజెంట్లు, 114 మంది బ్రోకర్లు పనిచేస్తున్నారు.

జోనల్‌ కార్యాలయాలు

ఎల్‌ఐసీకి దేశవ్యాప్తంగా ఎనిమిది జోనల్‌ కార్యాలయాలు ఉన్నాయి. అవి:

నార్త్‌ జోన్‌ - న్యూదిల్లీ 

సెంట్రల్‌ జోన్‌ - భోపాల్‌

ఈస్ట్‌ జోన్‌ - కోల్‌కతా

వెస్ట్‌ జోన్‌ - ముంబయి

సౌత్‌ జోన్‌ - చెన్నై 

ఈస్ట్‌-సెంట్రల్‌ జోన్‌ - పట్నా

నార్త్‌-సెంట్రల్‌ జోన్‌ - కాన్పూర్‌

సౌత్‌-సెంట్రల్‌ జోన్‌ - హైదరాబాద్‌

ఉత్పత్తులు 

జీవిత బీమా 

ఆరోగ్య బీమా

పెట్టుబడి 

నిర్వహణ 

మ్యూచువల్‌ ఫండ్‌

సాధారణ బీమా (జనరల్‌ ఇన్సూరెన్స్‌) జాతీయం

భారతదేశంలో మొట్టమొదటి సాధారణ బీమా సంస్థను 1850లో కలకత్తాలో ట్రియోటాన్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ అనే పేరుతో ఏర్పాటు చేశారు.

1906లో ఏర్పడిన యునైటెడ్‌ ఇండియా (మద్రాస్‌), నేషనల్‌ ఇన్సూరెన్స్‌ (కలకత్తా), కో-ఆపరేటివ్‌ ఇన్సూరెన్స్‌ (లాహోర్‌) సాధారణ బీమా సంస్థలే. 

1907 లో ఏర్పడిన ఇండియన్‌ మర్కంటైల్‌ కంపెనీ అన్ని రకాల బీమా వ్యాపారాలు నిర్వహించేది.

నాలుగో పంచవర్ష ప్రణాళికా సమయంలో ్బ1969-74్శ జీఐసీ  ఏర్పాటుకు పునాదులు వేశారు. 

1972 నవంబరు 22 న జనరల్‌ ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ (నేషనలైజేషన్‌) చట్టాన్ని ఆమోదించారు.

1973 జనవరి 1న జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను నెలకొల్పారు. అంతవరకు దేశంలో పని చేస్తున్న 107 సాధారణ బీమా సంస్థలను జాతీయం చేయగా, నాలుగు సంస్థలను విలీనం చేశారు. అవి:

 1. యునైటెడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (మద్రాస్‌)

 2. న్యూ ఇన్సూరెన్స్‌ కంపెనీ (బొంబాయి)

 3. నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (కలకత్తా)

 4. ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (న్యూదిల్లీ)

2000 నవంబరు నుంచి జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (జీఐసీ) రీఅస్యూరర్‌గా పని చేస్తోంది. 

పై సంస్థలు బీమా చేసిన మొత్తంలో 120% శాతానికి ఇది పునఃబీమా సౌకర్యం కల్పిస్తుంది.

సాధారణ బీమా సంస్థ (జీఐసీ) ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. 

2020 నాటికి జీఐసీ మొత్తం ఆస్తులు రూ.116,19,620;  రెవెన్యూ రూ.52,63,805

2020 నాటికి జీఐసీ ఉద్యోగుల సంఖ్య 567

జీఐసీ నినాదం: ఆపద సమయంలో నేను నిన్ను రక్షిస్తాను (I Shall protect in times of distress). 

జీఐసీ ప్రస్తుత చైర్‌పర్సన్‌ దేవేష్‌ శ్రీవాస్తవ.

జీఐసీ ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తోంది. జీఐసీ లొకేషన్స్‌: దుబాయ్, కౌలాలంపూర్, లండన్, మాస్కో.

భారత పంచవర్ష ప్రణాళికలు - జీవిత బీమా జాతీయం

1956, జనవరి 19న దేశంలో పనిచేస్తున్న జీవిత బీమా కంపెనీలన్నింటినీ జాతీయం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

రెండో పంచవర్ష ప్రణాళిక (195661్శలో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాను ప్రవేశపెట్టారు.

1956, జూన్‌ 19న పార్లమెంట్‌లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) చట్టాన్ని ఆమోదించారు.

1956, సెప్టెంబరు 1 నుంచి ఎల్‌ఐసీ ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. జాతీయం చేసిన అన్ని జీవిత బీమా సంస్థలను ఇందులో విలీనం చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వరంగంలో పనిచేస్తున్న ఏకైక జీవిత బీమా సంస్థ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌. ఇది చట్టబద్దమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబయిలో ఉంది. ఇందులో ఒక ఛైర్మన్, నలుగురు మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీలు) ఉంటారు. ఎల్‌ఐసీ ప్రస్తుత ఛైర్మన్‌ - ఎంఆర్‌ కుమార్‌.  రాజ్‌కుమార్, ఐపే మిని, సిద్ధార్థ మొహంతి, బి.సి. పట్నాయక్‌ ఎండీలుగా ఉన్నారు.

ఇది భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలో పని చేస్తుంది.

1956లో 154 భారతీయ సంస్థలు, 16 విదేశీ సంస్థలు, 75 ప్రావిడెంట్‌ ఫండ్‌ సంస్థలను జాతీయం చేశారు.

రచయిత

బండారి ధనుంజయ

విషయ నిపుణులు 

Posted Date : 19-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌