• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు 

 (వివిధ కమిటీల సిఫార్సులు)

పటిష్ఠ ప్రజాస్వామ్యానికి విశిష్ట సూచనలు!
 

ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో ఎన్నికలు అతిముఖ్యమైన ప్రక్రియ. భారత కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు విజయవంతంగా సాగుతున్నప్పటికీ, తరచూ అనేక రకాల అవరోధాలు తలెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసే పరిణామాలు సంభవిస్తున్నాయి. వాటిని పరిహరించేందుకు ఎప్పటికప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే కొన్ని కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చేసిన పలు సూచనలు ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేసేందుకు దోహదపడ్డాయి. దేశంలో ఇప్పటివరకు ఎన్నికల సంస్కరణల కోసం ఏర్పాటైన అధికారిక కమిటీలు, వాటి సిఫార్సులపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. అమలవుతున్న తీరునూ అర్థం చేసుకోవాలి. 


భారతదేశంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావడంలో ఎన్నికలు కీలక భూమిక పోషిస్తున్నాయి. 1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలు 2024లో జరగబోయే 18వ సార్వత్రిక ఎన్నికల  వరకు దేశ ఎన్నికల వ్యవస్థ సందర్భానుసారం సంస్కరణలకు గురైంది. సమర్థంగా కొనసాగుతోంది. 


సంయుక్త పార్లమెంటరీ కమిటీ సిఫార్సులు (1972): దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడం, శాసనసభలకు ఎన్నికలు జరపడం తదితర అంశాలన్నింటినీ ఒకే వ్యక్తి పర్యవేక్షించడం, నియంత్రించడం శ్రమతో కూడిన పని. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324(2) ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళసభ్య ఎన్నికల సంఘంగా’ మార్పు చేయాలి.


తార్కుండే కమిటీ సిఫార్సులు (1982): ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలి. ఓటుహక్కు పొందేందుకు కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించాలి.

* కేంద్ర ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడిన బహుళసభ్య ఎన్నికల సంఘంగా, పూర్తి స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థగా కొనసాగాలి. పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులను సభ్యులుగా నియమించకూడదు.


దినేష్‌ గోస్వామి కమిటీ (1990): నాటి వి.పి.సింగ్‌ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న దినేష్‌ గోస్వామి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పలు సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలకు ఎన్నికల నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వం నగదు రూపంలో కాకుండా వస్తురూపంలో ఇవ్వాలి. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలి. మిగిలిన పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకేసారి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసే విధానాన్ని రద్దు చేయాలి. ఎన్నికల పరిశీలనకు ఒక పర్యవేక్షణాధికారిని నియమించే అధికారం ఎన్నికల సంఘానికి ఇవ్వాలి.

* పోలింగ్‌ బూత్‌ల ఆక్రమణ, రిగ్గింగ్‌ వంటి నేరాలు జరిగినప్పుడు ఓట్ల లెక్కింపును నిలిపేసి, ఫలితాలు వెల్లడించవద్దని ఎన్నికల సంఘం రిటర్నింగ్‌ అధికారులను ఆదేశించాలి.

రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను నియమిత కాలాల్లో మారుస్తూ, రిజర్వేషన్‌ లేని అభ్యర్థులకు అవకాశం కల్పించాలి.

* ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)లను ఉపయోగించాలి.


ఇంద్రజిత్‌ గుప్తా కమిటీ (1998):

* రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాలను చెక్కుల రూపంలో మాత్రమే స్వీకరించాలి.

* ఎన్నికల వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలి.


టి.ఎస్‌.కృష్ణమూర్తి కమిటీ: ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన టి.ఎస్‌.కృష్ణమూర్తి అధ్యక్షతన ఎన్నికల సంస్కరణలపై అధ్యయనం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అది వివిధ సిఫార్సులు చేసింది.

* రాజకీయ పార్టీలు సంస్థాగత ఎన్నికలు (అంతర్గత ఎన్నికలు) నిర్వహించాలి.

* 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించదగిన నేరాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్న వ్యక్తులను నిర్దోషులుగా రుజువయ్యేంత వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలి.

*  ఎన్నికల్లో ఒక అభ్యర్థి ఒక నియోజకవర్గం నుంచి మాత్రమే పోటీ చేయడానికి అనుమతించాలి. టెలివిజన్‌లో ప్రకటనలకు సంబంధించిన విషయాలపై నియమావళిని రూపొందించాలి. 

* ఓటరుకి ఏ ఒక్కరికీ ఓటు వేయడం ఇష్టం లేకపోతే అభ్యర్థులందరినీ తిరస్కరించే అవకాశం కల్పించాలి. దానికోసం బ్యాలెట్‌ పేపర్‌లో ఒక కాలమ్‌ను ఏర్పాటు చేయాలి.

* ఎగ్జిట్‌పోల్స్‌ను నియంత్రించాలి.

సంతానం కమిటీ (1963): రాజకీయ అవినీతిని అంతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ‘విజిలెన్స్‌ కమిషన్ల’ను ఏర్పాటు చేయాలి.

వోహ్రా కమిటీ (1993):  నేరమయ రాజకీయాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ఈ కమిటీ పేర్కొంది.

15వ లా కమిషన్‌ సిఫార్సులు (2000):  జస్టిస్‌ జీవన్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైంది.

* ఎన్నికల్లో  స్వతంత్ర అభ్యర్థులు మరణించినప్పుడు ఎన్నిక వాయిదా వేయాల్సిన అవసరం లేదు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి మరణిస్తే కొత్త అభ్యర్థి పేరును సూచించడానికి వారం రోజులు సమయం ఇవ్వాలి.

* పార్టీ ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి.

* అభ్యర్థి నేరచరిత్ర  తెలిసి కూడా ఏదైనా రాజకీయ పార్టీ టికెట్‌ ఇస్తే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి.

* ప్రతి పార్టీ తమ సంస్థాగత ఎన్నికల్లో 30 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్‌ చేయాలి.

* ఒక అభ్యర్థి ఎన్నికల్లో ఒకటికంటే ఎక్కువ నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు అనుమతించకూడదు.

* ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఫిరాయింపుదారులు వేసే ఓట్లు చెల్లవని ప్రకటించాలి.

* రెండంచెల బ్యాలెట్‌ పద్ధతిని ప్రవేశపెట్టాలి.

* పార్టీ విరాళాల కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటుకు కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించాలి.

* అభ్యర్థులు చెల్లించే డిపాజిట్‌ను పెంచి, లక్ష్యరహితంగా పోటీచేసే వారిని నిరోధించాలి.


రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ సిఫార్సులు: వాజ్‌పేయీ ప్రభుత్వకాలంలో జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య అధ్యక్షతన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్‌ ఏర్పాటు చేశారు. 

సిఫార్సులు:

* ఓటర్లకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని పంచాయతీ స్థాయి నుంచి సేకరించాలి. అన్ని నియోజకవర్గాల్లో వీలైనంత త్వరగా ఈవీఎంలను ప్రవేశపెట్టాలి.

* ఎన్నికల్లో పోలైన ఓట్లలో కనీసం 50 శాతం +1 ఓట్లు సాధించిన అభ్యర్థులనే గెలుపొందినట్లుగా ప్రకటించాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమికిగాని స్పష్టమైన మెజార్టీ రాకపోతే స్పీకర్‌ను ఎన్నుకునే పద్ధతిలోనే సభానాయకుడిని కూడా చట్టసభల సభ్యులే ఎన్నుకోవాలి.

* సభానాయకుడైన ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే సమయంలోనే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని కూడా ప్రతిపాదించాలి.

* ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి రిజర్వ్‌ చేసిన నియోజకవర్గాలను రొటేషన్‌ పద్ధతిలో మార్పు చేస్తూ ఉండాలి.


రెండో పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు: మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో వీరప్ప మొయిలీ అధ్యక్షతన ఏర్పడింది. 

సిఫార్సులు:

* ఎన్నికల వివాదాలను 6 నెలల్లోపు పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాలి.

* ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చులో కొంతభాగాన్ని ప్రభుత్వమే భరించాలి.

* అధికార కూటమి నుంచి ఏదైనా రాజకీయ పార్టీ అర్థంతరంగా వెళ్లిపోతే, ఆ పార్టీ విధిగా తిరిగి ప్రజల తీర్పు కోరే విధంగా చట్టంలో మార్పులు చేయాలి. 

* ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం పారదర్శకంగా జరగాలి. ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు ఎన్నికల కమిషనర్లను రాష్ట్రపతి నియమించాలి.

* పార్టీలు ఎన్నికల కూటమిగా ఏర్పడినప్పుడు ఎన్నికల కంటే ముందుగానీ, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన తర్వాత గానీ, కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ప్రకటించాలి.

* పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన పార్లమెంటు సభ్యులను, రాష్ట్రాల శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం రాష్ట్రపతికి, గవర్నర్లకు ఇవ్వాలి.

* ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్‌ నిలిపివేయాలి. 

* హత్య, అత్యాచారం, దొంగతనం, అపహరణ మొదలైన నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నవారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీలు టికెట్లు ఇవ్వకూడదు.


టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సులు: భారత ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయడం ద్వారా టి.ఎన్‌.శేషన్‌ సిఫార్సుల్లో కొన్నింటిని ఎన్నికల సంస్కరణల్లో భాగంగా అమలుచేశారు.

* ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి మరణిస్తే ఎన్నికను వాయిదా వేయాలి, రద్దు చేయకూడదు. పోలింగ్‌ బూత్‌ సమీపంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం నేరంగా పరిగణించాలి. 

* ఒక అభ్యర్థి రెండు నియోజకవర్గాలకు మించి పోటీ చేయకూడదు. స్వతంత్ర అభ్యర్థి పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం 10 మంది అతడి అభ్యర్థిత్వాన్ని బలపరచాలి.

* నేరం నిరూపణ జరిగి, కనీసం 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవిస్తే, ఆ వ్యక్తి 6 సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడు.

* నామినేషన్ల  ఉపసంహరణ తేదీ నుంచి ప్రచార సమయాన్ని 14 రోజులుగా నిర్ణయించాలి (1997 నుంచి అమల్లోకి వచ్చింది).

* ఎన్నికల ప్రచార సమయం పూర్తయిన తర్వాత 48 గంటల వరకు మద్యపానం, మత్తుపానీయాల అమ్మకాలు, పంపిణీ చేయడం నేరంగా పరిగణించాలి.
 

  దినేష్‌ గోస్వామి     
   ఇంద్రజిత్‌ గుప్తా    
  జస్టిస్‌ జీవన్‌రెడ్డి      
   జస్టిస్‌ ఎం.ఎన్‌.వెంకటాచలయ్య 

    

   సంతానం    
   టి.ఎన్‌.శేషన్‌     
   టి.ఎస్‌.కృష్ణమూర్తి      
  వోహ్రా      

  వీరప్ప మొయిలీ 

   


 

రచయిత: బంగారు సత్యనారాయణ


 

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌