• facebook
  • whatsapp
  • telegram

జీడీపీ వృద్ధిరేటు - కొవిడ్-19 ప్ర‌భావం

జాతీయ గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 2020 ఆగస్టు 31న ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ( 2020 - 21) సంబంధించి తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) భారీగా క్షీణించినట్లు ప్రకటించింది. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు, సేవల విలువను జీడీపీ వృద్ధి అంటారు. ఈ విలువను ఏడాదిలో మూడు నెలల కాలానికి లెక్కిస్తే దాన్ని త్రైమాసిక (క్వార్టర్‌) వృద్ధిరేటు అంటారు. గత సంవత్సరంతో ఈ ఏడాది వస్తు, సేవల విలువను పోలిస్తే వృద్ధి రేటు పెరిగిందో తగ్గిందో అర్థమవుతుంది. ఉదాహరణకు, గత ఏడాది మనదేశం 100 రూపాయలు ఆర్జించిందని, ఈ సంవత్సరం 105 రూపాయలు సంపాదించిందని అనుకుంటే, జీడీపీ వృద్ధిరేటు - 5% సాధించినట్లు. ఒకవేళ గత ఏడాది 100 రూపాయలు సంపాదించి, ఈ సంవత్సరం 95 రూపాయలే ఆర్జిస్తే అప్పుడు దాన్ని 5% వృద్ధిరేటు అని అంటారు. అలాకాకుండా ఈ ఏడాది కూడా 100 రూపాయలే సంపాదిస్తే 0% శాతం వృద్ధిరేటు అని అంటారు. 

* జీడీపీని రెండు రకాలుగా భావించవచ్చు. అవి 

1. వాస్తవ స్థూల దేశీయోత్పత్తి(Real GDP)

2. తాత్కాలిక జీడీపీ (Nominal GDP)

వాస్తవ స్థూల దేశీయోత్పత్తి

వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక నిర్దిష్ట సమయానికి ధరలను స్థిరంగా ఉంచి, అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తారు. అంటే ఎంత శాతం ధరలు పెరిగాయో లెక్కిస్తారు. ఉదా: 100 కోట్లు ఉత్పత్తి జరిగి, ధరలు 5% శాతం పెరిగాయనుకుంటే, 95 కోట్లు మాత్రమే ఉత్పత్తి జరిగినట్లు భావిస్తారు. ఇలా ద్రవ్యోల్బణాన్ని కూడా లెక్కించి చూపినప్పుడు దాన్ని వాస్తవ స్థూల దేశీయోత్పత్తి అంటారు. 

* ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే దాన్ని తాత్కాలిక జీడీపీ (నామినల్‌ జీడీపీ) అని వ్యవహరిస్తారు.

* వస్తు, సేవల ఉత్పత్తి మందగించడమే జీడీపీ తగ్గుదల. కొనేవారు తగ్గితే ఉత్పత్తి మందగిస్తుంది. ఆదాయాలు పడిపోతే కొనుగోలుదారులు తగ్గుతారు. ఉపాధి లేకపోతే ఆదాయం ఉండదు. ఉత్పత్తి అవసరం లేకపోతే ఉపాధి ఉండదు. డిమాండ్‌ తగ్గితే ఉత్పత్తి పడిపోతుంది. ఇవన్నీ ఒకదానితో మరొకటి ముడిపడిన అంశాలు. దీన్నే ‘విషవలయం’   అంటారు. 

భారత ఆర్థిక వ్యవస్థ కొవిడ్‌-19 వల్ల విషవలయంలో చిక్కుకుంది. దీన్ని వర్చువల్‌ సర్కిల్‌గా మార్చాలంటే ప్రజలకు ఉపాధి కల్పించాలి. తద్వారా ప్రజల ఆదాయాలు, వస్తు, సేవల కొనుగోలు శక్తి పెరుగుతాయి. వస్తు సేవల ఉత్పత్తి, డిమాండ్, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఉపాధిని సృష్టించాలంటే దాన్ని కల్పించే రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. ఉదా: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (MSME)  పరిశ్రమలు లేదా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆదాయాలు పెరగాలంటే ప్రభుత్వ ఆర్థిక విధానాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలపై ఖర్చు పెట్టాలి. ప్రముఖ ఆర్థిక వేత్త జె.ఎం. కీన్స్‌ ‘‘గోతులు తవ్వినప్పుడు, వాటిని పూడ్చినప్పుడు డబ్బులు ఇవ్వండి’’ అని సూచించారు. అంటే ప్రభుత్వాలు తమ ఆర్థిక విధానాల ద్వారా ప్రజలపై ఖర్చుపెట్టాలని ఆయన భావన. 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

2005 లో మనదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ్బవిళినిబిత్శి చట్టం వచ్చింది. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2 న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో అప్పటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ప్రారంభించారు. 2009 అక్టోబరు 2న మహాత్మా గాంధీ పేరును జోడించి (NREGA) (మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం)గా పేరు మార్చారు. దీని ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించి వారి ఆదాయాలు పెంచారు.  

* ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. కొవిడ్‌-19 ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగంలో మందగమనం చోటు చేసుకుంది. మనం ఎదుర్కొంటున్న మందగమనంలో ఒక భాగం కరోనా వల్ల ఏర్పడింది. కానీ మన దేశంలో సమస్యలకు ఇతర కారణాలూ ఉన్నాయి. భారత్‌ కొన్నేళ్ల పాటు వేగంగా వృద్ధి చెందుతున్న తొలి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుతం 23వ స్థానానికి దిగజారింది. కరోనా ప్రభావానికి రెండేళ్ల ముందే భారత్‌లో తీవ్రమైన మందగమనం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అమలుచేసిన లాక్‌డౌన్‌ తీరు వల్ల ఆర్థిక రంగం మరింత పతనమైంది. లాక్‌డౌన్‌ అనంతరం భారత్‌లో నిరుద్యోగితరేటు 20 శాతానికి చేరిందని ప్రముఖ ఆర్థికవేత్త, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత కౌశిక్‌ బసు పేర్కొన్నారు.

* సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ్బదిలీఖిన్శి 2020 సెప్టెంబరు 13న ప్రకటించిన నివేదిక ప్రకారం, మనదేశంలో ఉపాధి రేటు 37.9%. అయితే కొవిడ్‌-19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా దేశంలో నిరుద్యోగిత రేటు 62.1% ఉందని దిలీఖిని అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే ఎక్కువ.  ఈ నివేదిక ప్రకారం 2020 ఆగస్టు నాటికి ఏపీలో నిరుద్యోగిత రేటు 7%, తెలంగాణ రాష్ట్రంలో 5.8%గా ఉంది.

* భారత్‌కున్న ఆర్థిక మూలాలు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రపంచంలో వేగంగా ఎదిగే ఆర్థికశక్తిగా రూపొందే అవకాశం ఉంది. కొవిడ్‌-19 ప్రభావం వల్ల భారతదేశ ఆర్థిక వృద్ధిరేటు స్వాతంత్య్రం తర్వాత ఎప్పుడూ లేనంత తక్కువగా నమోదైంది. 1979లో నమోదైన 5.2%  వృద్ధిరేటే ఇప్పటి వరకు భారత్‌లో కనిష్ఠమైంది. ఈసారి అంతకంటే తక్కువగా నమోదైంది. 

* దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ పుంజుకుంటుందని భారత ఆర్థిక సర్వే 201920 నివేదిక పేర్కొంది. దీని ప్రకారం స్థిర మార్కెట్‌ ధరల వద్ద వాస్తవ జీడీపీ వృద్ధిరేట్లు 201617లో 8.2%, 201718లో 7.2%, 201819లో 6.8%, 201920 తొలి త్రైమాసికంలో 5% కాగా, ద్వితీయ త్రైమాసికంలో 4.5% తగ్గింది.

* గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్స్‌ (వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌) జూన్‌ - 2020 నివేదిక ప్రకారం దేశంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి వార్షిక వృద్ధి అంచనాలు వరుసగా... 2017 లో 7%, 2018 లో 6.1%, 2019 లో 4.2%గా నమోదయ్యాయి. అయితే ఇది 2020 లో 3.2%, 2021 లో 3.1% ఉంది (2017లో 7% నుంచి కొవిడ్‌-19 సమయంలో లాక్‌డౌన్‌ వల్ల వాస్తవ జీడీపీ వార్షిక వృద్ధి రేటు 2021 నాటికి 3.1% శాతానికి తగ్గుతుందని అంచనా).   

* 2020 ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 6 - 6.5% మధ్య ఉంటుందని భారత ఆర్థిక సర్వే 2019 - 20 నివేదిక అంచనా వేసింది. ఇందుకోసం ‘విస్తరణ విధానాలు’ అమలు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అందులో ప్రధానంగా మూడు సూచనలు చేసింది. అవి

1)  బడ్జెట్‌లోటుపై ఉన్న పరిమితులు ఎత్తివేయాలి.

2) ఆహార రాయితీల్లో కోత విధించాలి.

3) సంపద - ఉద్యోగాలు సృష్టిస్తున్న వ్యాపారులను గౌరవించాలి.

* ఐఎంఎఫ్‌ 2019 అక్టోబరులో విడుదల చేసిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఔట్‌లుక్‌ ్బజూనివ్శీ నివేదిక మనదేశం ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా (దాదాపు 2.9 ట్రిలియన్‌ డాలర్లు) ఉందని పేర్కొంది. ప్రపంచంలోని పది పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఉన్న దేశాలు వరుసగా: అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, బ్రెజిల్, దక్షిణ కొరియా.
* 2014-19 లో సగటు జీడీపీ వృద్ధిరేటు 7.4%గా నమోదైంది. 2019 జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ్బ2019-20) లో, 2024-25 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల (350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా రూపొందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. దీన్ని సాధించాలంటే,  ప్రభుత్వం వ్యాపార అనుకూల విధానాలను అవలంబించాలి. పారిశ్రామికవేత్తలు సంపద సృష్టిస్తేనే పన్ను వసూళ్లు పెరుగుతాయి.  




 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌