• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఆర్థికాభివృద్ధి

ఒక దేశ ఆర్థికాభివృద్ధి అనేది సంక్లిష్ట పునర్నిర్మాణ ప్రక్రియ. ఇది దీర్ఘకాలంలో ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా, సంస్థాగతంగా సంభవించే మార్పులను తెలియజేస్తుంది. ప్రత్యేక వాతావరణ పరిస్థితులు, విభిన్న సామాజిక సాంస్కృతిక విలువలు కలిగి, అభివృద్ధి చెందుతున్న భారత్‌ లాంటి దేశాల్లో ఆర్థికాభివృద్ధి.. అనేక సవాళ్లు, ఒడుదొడుకులతో నిత్యం అనిశ్చితిగా ఉంటుంది. అందుకే అభివృద్ధిని ఏ మేరకు సాధించామో తెలుసుకోవడానికి ఒక కొలమానం అవసరం. దానికి శాస్త్రీయమైన హేతుబద్ధత ఉండి లెక్కించడానికి వీలుగా ఉండాలి.    


అభివృద్ధి కొలమానాలు 
అభివృద్ధితో పాటు దాని సమగ్ర కొలమానాలపై కూడా ఆర్థికవేత్తలు చర్చించారు. భారతదేశ ఆర్థిక పరిస్థితిపై పశ్చిమ దేశాలైన ఇంగ్లండ్, అమెరికా అభిప్రాయాల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్థికాభివృద్ధిని కొలవడానికి ఉపయోగించే ముఖ్యమైన కొలమానాలు..


స్థూల జాతీయోత్పత్తి 
  సంవత్సర కాలంలో ఒక దేశ ప్రజల ద్వారా ఉత్పత్తయిన అంతిమ వస్తుసేవల మార్కెట్‌ విలువల మొత్తమే స్థూల జాతీయోత్పత్తి. ఇది ఆర్థిక విలువలను తెలియజేస్తుంది. దీనిలో నాలుగు అంశాలు ఉంటాయి. అవి:

    1. ప్రజల వినియోగ వ్యయం (C) 
    2. సంస్థల పెట్టుబడి వ్యయం (I)
    3. ప్రభుత్వ వ్యయం (G)   
    4. విదేశాల నుంచి వచ్చే ఆదాయం (Net foreign income )

  ( GNP= C+I+G+Net foreign income )


  ప్రపంచంలో మొదటిసారిగా జాతీయాదాయాన్ని సైమన్‌ కుజ్నెట్‌ అనే అమెరికా ఆర్థికవేత్త శాస్త్రీయంగా అంచనా వేశారు. ఈయన స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వల్ల ఆర్థిక నిర్మాణం, జీవనంలో మార్పులు సంభవిస్తాయని తెలిపాడు. ‘ఇది భవిష్యత్‌ పురోగతికి అవసరం. కానీ జాతీయాదాయ లెక్కల నుంచి ప్రజా సంక్షేమాన్ని గ్రహించలేం’ అని స్పష్టం చేశారు.

వాస్తవ జాతీయాదాయ అంచనాలు ధరల్లో మార్పులను తెలియజేయవు. ఆదాయ అసమానతలు, జనాభాలో వచ్చే మార్పులు, వాతావరణ కాలుష్యం వల్ల కలిగే నష్టాల గురించి పేర్కొనదు. భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అసంఘటిత రంగం, నిరక్షరాస్యత, బ్లాక్‌ మార్కెటింగ్‌ ఎక్కువ. కాబట్టి ఏ రంగానికి సంబంధించైనా కచ్చితమైన లెక్కలు లభించవు. 

* జాతీయాదాయ పరంగా భారతదేశం 2.7 ట్రిలియన్‌ డాలర్ల మొత్తంతో ప్రపంచంలో ఆరో స్థానాన్ని పొందింది. సామాజిక, సాంకేతిక, మానవ మూలధనం లాంటి అంశాల్లో ఇప్పటికీ వెనుకబడి ఉంది. కాబట్టి ఇది సమగ్రమైన అభివృద్ధి కొలమానం అని చెప్పలేం.


వాస్తవ తలసరి ఆదాయం 
   ఒక దేశంలో జాతీయాదాయ పెరుగుదలపై జనాభా ప్రభావాన్ని పరిశీలిస్తూ అభివృద్ధిని గణించడానికి వాస్తవ తలసరి ఆదాయం ఉపకరిస్తుంది. మొత్తం జాతీయాదాయాన్ని జనసంఖ్యకు పంచినప్పుడు సగటున వచ్చే మొత్తాన్ని తలసరి ఆదాయం అంటారు. 
   తలసరి ఆదాయం=  మొత్తం జాతీయాదాయం /   మొత్తం జనాభా

  సాధారణంగా తలసరి ఆదాయం పెరిగితే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. తలసరి ఆదాయం పెరగకుండా జాతీయాదాయం మాత్రమే పెరగడం వల్ల ప్రయోజనం ఉండదు. ఇది ఆర్థికాభివృద్ధిలో ప్రజల పాత్ర, వారి ఆదాయ స్థాయుల్లో మార్పులను తెలుపుతుంది. ప్రపంచ బ్యాంకు, ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు కూడా తలసరి ఆదాయం ఆధారంగా దేశాలను అభివృద్ధిచెందిన, చెందుతున్న దేశాలుగా వర్గీకరించి అధ్యయనం చేస్తున్నాయి. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న దేశాలన్నీ అభివృద్ధి చెందిన దేశాలే. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) నివేదిక ప్రకారం 2018 నాటికి ప్రపంచంలోని అయిదు అత్యధిక ధనవంత దేశాలు వరుసగా లక్సెంబర్గ్, మకావు, స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌లాండ్‌. ఈ దేశాలు 75000 డాలర్లకు పైగా తలసరి ఆదాయాన్ని కలిగి ఉన్నాయి. జాతీయాదాయ పరంగా అగ్ర దేశమైన అమెరికా 65000 డాలర్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే తలసరి ఆదాయం కూడా సరైన కొలమానం కాదని కొంతమంది ఆర్థికవేత్తలు విమర్శిస్తున్నారు.


విమర్శలు
ఇది అసమగ్రమైన జాతీయాదాయ లెక్కలపై ఆధారపడి ఉందని, జనసంఖ్య పెరిగి తలసరి ఆదాయంలో మార్పు లేకపోయినా లేదా తగ్గినా అభివృద్ధి జరగలేదని చెప్పలేం. 
* ఇది ప్రజల సగటు ఆదాయం మాత్రమే. అందరి ఆదాయం కాదు. ఆదాయ అసమానతలు, పంపిణీ గురించి తెలపదు. 
* అనేక దశాబ్దాలుగా చేసిన ప్రయత్నాల వల్ల భారతదేశం జాతీయాదాయపరంగా ఆరో పెద్ద దేశంగా ఉన్నప్పటికీ తలసరి ఆదాయంలో 119వ స్థానంలో ఉంది. దీని ఆధారంగా మనదేశం అభివృద్ధిని సాధించలేదని చెప్పలేం. తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్న దేశాలతో పోల్చలేం. ఎందుకంటే అవి పరిమాణం, జనాభా పరంగా చిన్న దేశాలు. పరిశ్రమలు, వ్యాపారాలు, పర్యాటకం, బ్యాంకింగ్‌ లాంటి సేవల రంగాల నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. అయితే మనదేశం ఇప్పటికీ 60% మేర రుతుపవనాలపై ఆధారపడుతున్న వ్యవసాయాధారిత దేశం.
* 1951తో పోల్చినప్పుడు మనదేశ తలసరి ఆదాయం పెరిగింది కానీ ఆదాయ అసమానతలు తీవ్రతరం అయ్యాయని ప్రభుత్వ నివేెదికలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పెరిగిన తలసరి ఆదాయం తెలపదు.


ఆర్థిక సంక్షేమం: జాతీయాదాయం, తలసరి ఆదాయాలు అభివృద్ధిని కొలవడంలో సంతృప్తికరంగా లేకపోవడంతో కొలిన్‌ క్లార్క్, కిండెల్‌ బర్గర్, డి. బ్రైట్‌ సింగ్‌ లాంటి ఆర్థికవేత్తలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.
ప్రజల మధ్య ఆదాయ పంపిణీలో సమానత్వం, కొనుగోలు శక్తి పెరిగేలా ధరల స్థిర త్వాన్ని సాధించినప్పుడు ఆర్థిక సంక్షేమం ఉంటుందని వీరు అభిప్రాయపడ్డారు. అధిక ఆర్థిక సంక్షేమాన్ని అధిక అభివృద్ధికి చిహ్నంగా భావించారు. అయితే ఆర్థిక సంక్షేమం అనేది మానసికమైంది. దాన్ని కొలవలేం. ఇద్దరు వ్యక్తుల మధ్య సంక్షేమ భావన ఒకేవిధంగా ఉండదు. జాతీయాదాయ మార్పుల స్వభావాన్ని, ఉత్పత్తి సామాజిక వ్యయాన్ని అంచనా వేయడం చాలా కష్టం. ఆర్థిక సంక్షేమం అభివృద్ధికి కొలమానంగా ఆచరణలో సాధ్యం కాదని విమర్శలను ఎదుర్కొంది.


భౌతిక జీవన ప్రమాణ సూచిక 
మోరీస్‌ డి మోరీస్‌ అనే శాస్త్రవేత్త ప్రజల ప్రాథమిక అవసరాల దృష్ట్యా ఈ కొలమానాన్ని రూపొందించారు. శిశు మరణాల రేటు, ఆయుఃప్రమాణం, అక్షరాస్యత లాంటి మూడు అంశాల సమాన భారాల సగటు ఆధారంగా ఈ సూచికను లెక్కిస్తారు.

విమర్శలు

ఇది ప్రాథమిక అవసరాలను మాత్రమే లెక్కించే పరిమిత కొలమానం.
* దీనిలో చేర్చే అంశాల సంఖ్య పట్ల ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు.
* ఈ సూచిక ఆర్థికాభివృద్ధిని విస్మరించింది. ఇది లేకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడవు. 
* భద్రత, న్యాయం, మానవ హక్కుల లాంటి సామాజిక, మానసిక అంశాల గురించి ఈ సూచిక పేర్కొనలేదు.


మానవాభివృద్ధే అంతిమ లక్ష్యం 
1990లో యూఎన్‌డీపీ వెలువరించిన మొదటి మానవాభివృద్ధి నివేదిక అభివృద్ధి ఆర్థికశాస్త్రం విధానాలు, కొలమానాల్లో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది. దీంతో పాలకులు, పరిశోధకులు,  ప్రజల అభివృద్ధి ధోరణి మారిపోయింది. అప్పటివరకు అభివృద్ధి అంటే ఆర్థికాభివృద్ధి అని ప్రజల వస్తుసేవల పెరుగుదలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఉన్నత మానవ శ్రేయస్సు వైపు పురోగమించడమే మానవాభివృద్ధి అని, అదే నిజమైన అభివృద్ధి అని ఐక్యరాజ్యసమితి నివేదికలో నిర్వచించారు. అర్థశాస్త్ర చారిత్రక మేధోమథనం నుంచి అభివృద్ధి కొలమానాలకు ప్రత్యామ్నాయాల అన్వేషణ ఎప్పటి నుంచో జరుగుతోంది. 


క్రీ.పూ.350లోనే అరిస్టాటిల్ "Well being as something genrated by our actions and not our belongings" అని అభిప్రాయపడ్డారు.
* 18వ శతాబ్దంలో జెర్మి బెంథామ్‌ ప్రయోజనవాదం వ్యక్తుల ప్రయోజనాల కలయికే సామాజిక ప్రయోజనంగా గుర్తించి The greatest happiness for the greatest number ను సూచించింది.
* 19వ శతాబ్దంలో మార్షల్‌ లాంటి నూతన సంప్రదాయ ఆర్థికవేత్తలు ‘నెరవేర్చుకునే కోరికలు’ అనే భావనను ప్రవేశపెట్టారు. ‘‘అపరిమితమైన కోరికలను నెరవేర్చే పరిమిత వనరులను అదనంగా సమకూర్చుకునే కొద్దీ వాటి నుంచి పొందే అదనపు ప్రయోజనం (Marginal Utility) క్షీణిస్తుంది’’ అని నిరూపించారు. కాబట్టి మిగులు వనరులు ధనికుల నుంచి పేదలకు చేరితే సాంఘిక ప్రయోజనం పెరుగుతుందని తీర్మానించారు. వీరు ఎక్కువగా వ్యక్తిగత ప్రయోజనం పైనే దృష్టి సారించారు.
20వ శతాబ్దంలో జాన్‌ రాల్స్‌ అనే తత్వవేత్త ‘ఎ థియరీ ఆఫ్‌ జస్టిస్‌’ (1971) అనే పుస్తకం ద్వారా ప్రజల మధ్య సమానత్వం, న్యాయం గురించి చర్చించడంతో అభివృద్ధిలో మానవత్వ కోణాన్ని జోడించినట్లయింది. ఇతడి సిద్ధాంతం ఆధారంగా అమర్త్యసేన్, మార్థానస్‌బామ్‌ మానవ శ్రేయస్సుకు మానవ సామర్థ్యాలు అవసరమని నిర్ధారించారు. మానవాభివృద్ధి అనేది మనిషి ఏమి కలిగి ఉన్నాడు అనేదానిపై కాకుండా ఏమి చేయగలడు అనే విషయంపై ఆధారపడి ఉంటుందని, సామర్థ్యాలు మాత్రమే మనిషి సంపాదన, దాని వినియోగాన్ని నిర్ణయించి అతడి సాధికారతకు దారి తీస్తాయని వివరించారు. ఆదాయాభివృద్ధి కాదు మానవాభివృద్ధే అంతిమ లక్ష్యమని చెప్పారు.

  జాతి, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా సర్వకాల సార్వజనీన విలువల ఆలంబనగా మహబూబ్‌-ఉల్‌-హక్‌ అనే పాకిస్థాన్‌ ఆర్థికవేత్త చొరవతో పాల్‌ స్ట్రీటెన్, ఫ్రాన్సిస్‌ స్టీవార్ట్, సుధీర్‌ ఆనంద్, మేఘనాథ్‌ దేశాయ్‌ లాంటి శాస్త్రవేత్తలు, మానవాభివృద్ధి సూచికను ప్రతిపాదించారు. అమర్త్యసేన్‌ సిద్ధాంతం దీనికి ఆధారం. 1990 నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
  మానవుల సామర్థ్యాన్ని పెంచే విద్య, ఆరోగ్యం, తలసరి ఆదాయాలను పరిగణనలోకి తీసుకొని మానవాభివృద్ధి సూచికను రూపొందించారు. అప్పటి నుంచి పరిపాలన అనేది ఆదాయ పెంపు కోసం కాకుండా ప్రజల శ్రేయస్సుకు కేంద్రీకృతంగా మారింది. ప్రపంచం దీన్ని జాతీయ, తలసరి ఆదాయాలకు ప్రత్యామ్నాయంగా గుర్తించింది.

భారత ఆర్థిక వ్యవస్థ: కొవిడ్‌ అనంతర పరిణామాలు
కొవిడ్‌19 వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 22 నుంచి భారత్‌లో లాక్‌డౌన్‌ విధించడంతో దేశ ఆర్థికవ్యవస్థ అస్తవ్యస్తమైంది. అన్ని రంగాల్లో వృద్ధిరేటు పూర్తిగా మందగించింది. జాతీయ గణాంక సంస్థ (ఎన్‌ఎస్‌ఓ) 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 202021 ఆర్థిÄక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో మనదేశ స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 23.9 శాతం తగ్గింది. రెండో త్రైమాసికంలో ఈ రేటు 12 శాతం తగ్గుతుందని ఆర్థిక నిపుణుల అంచనా.  2020, నవంబరు 27న ఎన్‌ఎస్‌ఓ రెండో త్రైమాసిక (జులై - సెప్టెంబరు) జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. ఇందులో జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం తగ్గింది. సిమెంట్, ఉక్కు, వ్యవసాయం, తయారీరంగాలు కీలకపాత్ర పోషించాయి. 202122 ఆర్థికసంవత్సరం ప్రారంభం నాటికి భారత ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుందనేది ఆర్థికవేత్తల అంచనా.


V - ఆకారపు జీడీపీ వృద్ధిరేటు  
* భారత ఆర్థిక వ్యవహారాల విభాగం నెలవారీ ఆర్థిక సమీక్ష - నవంబరు 2020 ప్రకారం మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం V ఆకారపు వృద్ధిరేటును చూపుతోంది (అంటే పడిపోయి మళ్లీ పైకి ఎగబాకింది). పారిశ్రామిక కార్యకలాపాలు మామూలు స్థాయికి రావడం, వ్యవసాయం, విద్యుత్‌ లాంటి ప్రజావినియోగ రంగాల్లో సానుకూల ఎదుగుదల భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) తిరిగి పుంజుకోవడానికి తోడ్పడ్డాయి. 
* కొవిడ్‌19 కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రం ఆత్మనిర్భర్‌ భారత్‌ (స్వయం సమృద్ధ భారత్‌) పథకాన్ని ప్రకటించింది. దీని ద్వారా మూడు దశల్లో 29.87 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని అందించింది. ఇదే భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటునిచ్చిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) అభిప్రాయపడింది. ఈ ప్యాకేజీ విలువ భారతదేశ జీడీపీలో 15 శాతం. జాతి సంపద పెరిగినప్పుడు దేశ పౌరుల తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది. 


G -20 అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు

దేశంపేరు తొలి త్రైమాసికం (Q1)(శాతంలో) రెండో త్రైమాసికం (Q2)(శాతంలో)
కెనడా 12.5 5.2
ఫ్రాన్స్ 18.9 3.9
జర్మనీ 11.2 4
ఇటలీ 18 5
జపాన్‌ 10.3 5.9
స్పెయిన్ 21.5 8.7
బ్రిటన్ 21.5 9.6
యూఎస్‌ఏ 9 2.9

G - 20 అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు

 బ్రెజిల్‌ 11.4 -
చైనా 3.2 4.9
ఇండియా 23.9 7.5
ఇండోనేసియా 5.4 3.6
మెక్సికో 18.7 8.6
రష్యా 5.6 -
దక్షిణాఫ్రికా 17.2 -
టర్కీ 8.5 5.4

ఆధారం: కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ - 2020


* ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు భారత్‌కు సానూకూలమైన రేటింగ్స్‌ ఇచ్చాయి. మూడీస్‌ సంస్థ 2021 అంచనాలను 8.1 శాతం నుంచి 8.6 శాతానికి పెంచింది. గోల్డ్‌మాన్‌శాక్స్, బార్‌క్లేస్‌ కూడా తమ అంచనాలను మార్చుకున్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్ధ అంచనాలను మించి వేగంగా కోలుకుంటోందని ఆక్స్‌ఫర్డ్‌ ఆర్థిక నివేదిక పేర్కొంది. 2020 అక్టోబరులో ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ ్ఞతి ల్ని-్ణ ్చ-్ట దీi÷÷i‘్యః్మ తి(‘’-్మ్ఠ పేరుతో ఒక నివేదికను విడుదలచేసింది. దీని ప్రకారం భారత ఆర్థికాభివృద్ధి రేటు 2021లో 8.8 శాతం ఉంటుందని, ఇది ప్రపంచంలోనే అత్యధికమని ఐఎంఎఫ్‌ తెలిపింది.


ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు
* కొవిడ్‌19 కారణంగా 202021 ఆర్థిÄక సంవత్సరంలో G-20 దేశాల స్థూలదేశీయోత్పత్తి వృద్ధిరేట్లు కింది విధంగా ఉన్నాయి. 
*  కొవిడ్‌19 నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచ జీడీపీ వృద్ధిరేటు 2020లో 4.4 శాతం తగ్గింది. 2021లో 5.2 శాతం వృద్ధిరేటు నమోదవుతుందని ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ 2020 అక్టోబరులో పేర్కొంది. 2020లో మనదేశ వృద్ధిరేటు 10.3 శాతం తగ్గగా, 2021లో 8.8 వృద్ధి రేటు నమోదవుతుందని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అంటే చైనా వృద్ధిరేటు 8.2% కంటే ఇది ఎక్కువ.
* ప్రపంచ మిశ్రమ కొనుగోలు నిర్వహణ సూచీ (Global Composite Purchasing Managers Index) నవంబరులో 52.5 ఉండగా, అక్టోబరులో 53.3గా నమోదైంది.


ప్రాంతాలు/ దేశాల వృద్ధి రేట్లు - అంచనాలు

 ప్రాంతాలు/ దేశాలు 2019 2020 2021
ప్రపంచం 2.8 4.4 5.2
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 1.7 -5.8 3.9
యూఎస్‌ఏ 2.2 -4.3 3.1
యూరో ఏరియా 1.3 -8.3 5.2
జపాన్ 0.7 -5.3 2.3
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాలు 3.7 -3.3 6.0
చైనా 6.1 1.9 8.2
భారత్‌ 4.2 -10.3 8.8

ఆధారం: ఐఎంఎఫ్‌ వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ అక్టోబరు 2020

కొవిడ్‌ 19 ప్రభావం - భారత్‌లో వివిధ రంగాల వృద్ధి ధోరణులు

వ్యవసాయరంగం
* భారత ఆర్థిక సర్వే  2019 20 నివేదిక ప్రకారం నేటికీ మనదేశంలో ప్రాథమికంగా 70 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. 82 శాతం సన్నకారు రైతులు (ఒకటి నుంచి రెండు హెక్టార్ల మధ్య భూమి ఉన్నవారు), ఉపాంత రైతులు (ఒక హెక్టారులోపు భూమి ఉన్న రైతులు) ఉన్నారు. ఒక హెక్టారు అంటే 2.5 ఎకరాలు. 201920 జీవీఏలో వ్యవసాయ రంగం వాటా 16.5 శాతం. వ్యవసాయ వాణిజ్యంలో మన దేశ మొత్తం వ్యవసాయ ఎగుమతులు 2.15 శాతం. వ్యవసాయరంగంలో ఉపాధి వాటా 49 శాతం ఉండగా, స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 15 శాతంగా నమోదైంది. 
* 1991 నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత 201819లో 2.7 లక్షల కోట్ల వ్యవసాయ రంగ ఎగుమతులు, 1.37 లక్షల కోట్ల దిగుమతులతో భారత్‌ నికర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుగా నిలిచింది. వ్యవసాయ ఉత్పత్తులను ప్రధానంగా యూఎస్‌ఏ, సౌదీ అరేబియా, ఇరాన్, నేపాల్, బంగ్లాదేశ్‌లకు ఎగుమతి చేస్తోంది. మనదేశ వ్యవసాయం దాదాపు రుతుపవనాలపై ఆధారపడి ఉంది. రుతుపవనాలు ఆలస్యమైనా లేదా విఫలమైనా ఆ ఏడాది వ్యవసాయం విఫలమవుతుంది. అందుకే ఒకప్పుడు భారతదేశ వ్యవసాయాన్ని ‘‘రుతుపవనాలతో ఆడే జూదంగా’’ వర్ణించారు. 
* దేశంలో ప్రధాన రిజర్వాయర్‌లలో ఉన్న ప్రత్యక్ష నీటి నిల్వలను 202021లో 90 శాతం సాగుకు ఉపయోగిస్తున్నారని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అఫైర్స్‌ నెలవారీ ఆర్థిక సమీక్ష నవంబరు, 2020 నివేదిక పేర్కొంది. ఇది 201920 కంటే  (97 శాతం) తక్కువ, పదేళ్ల క్రితం కంటే (76 శాతం) ఎక్కువ.  
* 202021 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌), రెండో త్రైమాసికం (జులై - సెప్టెంబరు)లో 201112 స్థిర ధరల వద్ద స్థూల అదనపు విలువ (జీవీఏ)లో భారత వ్యవసాయరంగం వృద్ధి రేటు 3.4 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించినప్పటికీ వ్యవసాయరంగంలో ధనాత్మక వృద్ధిరేటు నమోదైంది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్‌ కాలంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 301 మిలియన్‌ టన్నులు కాగా 201920తో పోలిస్తే అది 1.5 శాతం పెరిగి రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరిగింది. 201920 పంటకాలంలో (జులై-జూన్‌) మనదేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 291.1 మిలియన్‌ టన్నులు. 202021లో ఈ అంచనాను 296.65 మిలియన్‌ టన్నులకు పెంచారు. అంటే ఇది 201920 కంటే 4 శాతం అధికం. 2020 నవంబరు 27 నాటికి భారత్‌లో మొత్తం రబీ విస్తీర్ణం 348.24 లక్షల హెక్టార్లు. 201920తో పోలిస్తే ఇది 4.02 శాతం ఎక్కువ. 202021 రబీలో పప్పుధాన్యాల ఉత్పత్తి 43.3 శాతం పెరిగింది. 202021 ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీకాలంలో వివిధ రకాల పంటలకు కనీస మద్దతు ధరను 2.1 శాతం నుంచి 12.7 శాతం పరిధి కంటే అధికంగా పెంచారు. 202021లో దేశవ్యాప్తంగా ఖరీఫ్‌లో బియ్యం సేకరణ లక్ష్యం 495.37 లక్షల టన్నులు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2020, నవంబరు 27 నాటికి ఖరీఫ్‌లో 208.81 లక్షల టన్నుల బియ్యాన్ని సేకరించారు. 


పారిశ్రామిక రంగం
    ఎన్‌ఎస్‌ఓ 2020, ఆగస్టు 31న ప్రకటించిన నివేదిక ప్రకారం 202021 తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌ - జూన్‌) స్థూల అదనపు విలువలో (జీవీఏ) పారిశ్రామిక రంగం వృద్ధిరేటు 38.1 శాతం పతనమైంది. రెండో త్రైమాసికంలో (జులై-సెప్టెంబరు) కాస్త పుంజుకుని 2.1 శాతానికి తగ్గింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో తయారీరంగం కీలకమైంది. మనదేశ స్థూలదేశీయోత్పత్తిలో (జీడీపీ) తయారీ రంగం వాటా 15 శాతం. 201920 భారత ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం మన దేశ స్థూల అదనపు విలువ (జీవీఏ)లో తయారీ రంగం వాటా 16.4 శాతం. దేశ కార్మిక శక్తిలో తయారీ రంగం వాటా 12 శాతం. సుమారు 250 పరిశ్రమల మీద ఇది ప్రభావం చూపిస్తుంది. న్యూ ఇండియా సమాచార్‌ నవంబరు  2020 నివేదిక ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ తయారీరంగ హబ్‌ ్బబీగీత్శీ గా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 10 రంగాలకు రూ.1.5 లక్షల కోట్లను ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకంగా ప్రకటించింది. 
* 202021 తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో మనదేశ జీడీపీలో తయారీ రంగం 39.3 శాతం పతనమైంది. ఎన్‌ఎస్‌ఓ నవంబరు 27, 2020న ప్రకటించిన నివేదిక ప్రకారం రెండో త్రైమాసికం (జులై-సెప్టెంబరు)లో తయారీరంగం నెమ్మదిగా పుంజుకుని ధనాత్మక దిశలో 0.6 శాతం వృద్ధి సాధించింది. 202021లో తొలి త్రైమాసికంలో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలు 7 శాతం పతనమయ్యాయి. రెండో త్రైమాసికంలో ధనాత్మక దిశలో 4.4 శాతం సాధించాయి. తొలి త్రైమాసికంలో నిర్మాణరంగం 50.3 శాతం పతనమైంది. తొలి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో ఈ రంగం వృద్ధి చెంది (రుణాత్మకంగా) 8.6 శాతం వద్ద నిలిచింది.  
* 202021 లో ‘కాంటాక్ట్‌- సెన్సిటివ్‌ సర్వీసెస్‌ రంగం తొలి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 20.6 శాతం పతనమై, రెండో త్రైమాసికంలో పుంజుకుని 11.4 శాతం తగ్గింది. అయితే 202021 తొలి త్రైమాసికంలో సేవారంగంలో ఉపరంగాలైన వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాలు 47 శాతం పతనమయ్యాయి. రెండో త్రైమాసికం (జులై - సెప్టెంబరు) నాటికి నెమ్మదిగా పుంజుకుని 15.6 శాతం తగ్గాయి.
* విత్తం, రియల్‌ ఎస్టేట్‌ సేవా రంగం, ప్రభుత్వ పరిపాలన సేవలు నెమ్మదిగా పతనమయ్యాయి. 2020 21లో తొలి త్రైమాసికం (ఏప్రిల్‌ - జూన్‌)లో విత్తం, రియల్‌ ఎస్టేట్, ఇతర సేవలు 5.3 శాతం పతనమైతే, రెండో త్రైమాసికంలో (జులై - సెప్టెంబరు) 8.1 శాతం పతనమయ్యాయి. 202021 తొలి త్రైమాసికంలో ప్రభుత్వ పరిపాలన, రక్షణ రంగం, ఇతర సేవలు 10.3 శాతం పతనం కాగా, రెండో త్రైమాసికంలో 12.2 శాతం తగ్గాయి.
* కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ, ఆర్థిక సమీక్ష నవంబరు 2020 నివేదిక ప్రకారం డిమాండ్‌ను పరిశీలిస్తే మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 90 శాతం కంటే ఎక్కువ వినియోగం, పెట్టుబడి నమోదయ్యాయి. 202021 తొలి త్రైమాసికంలో స్థిరపెట్టుబడి వృద్ధి 47.1 శాతం పతనమవగా, రెండో త్రైమాసికంలో 7.3 శాతం పతనమైంది.  
* ప్రయివేట్‌ అంతిమ వినియోగ వ్యయం అంటే ప్రజలు వివిధ రకాల వస్తు, సేవల కోసం చేసే కొనుగోలు లేదా ఖర్చు. 202021లో తొలి త్రైమాసికంలో ఈ వ్యయం 26.7 శాతం తగ్గింది. రెండో త్రైమాసికంలో 11.3 శాతం తగ్గింది. అంటే ప్రయివేట్‌ అంతిమ వినియోగ వ్యయం కొంత మెరుగుపడింది.
*  ప్రభుత్వ అంతిమ వినియోగ వ్యయం అంటే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేసే ఖర్చు. ఇది తొలి త్రైమాసికంలో 16.4 శాతం తగ్గగా, రెండో త్రైమాసికంలో 22.2 శాతం తగ్గింది.
*  202021 తొలి త్రైమాసికంలో సప్లయ్‌ రంగం స్థూల అదనపు విలువ (జీవీఏ) వృద్ధి 22.8 శాతం తగ్గగా, రెండో త్రైమాసికంలో 7 శాతం తగ్గింది. అంటే తయారీ రంగం, విద్యుత్, వ్యవసాయ రంగాలు లాభాల బాటలో వృద్ధి చెందాయి.
* 202021 లో తొలి ఆరునెలల్లో మన దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 40 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఇది 10 శాతం అధికం. నవంబరు 2020 నాటికి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడుల ప్రవాహం (ఎఫ్‌పీఐ) 8.5 బి.డాలర్లుగా నమోదయ్యాయి. 2020 నవంబరు 20 నాటికి విదేశీ మారకద్రవ్య నిల్వలు 575 బి.డాలర్లుగా ఉన్నాయి.

Posted Date : 15-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌