• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమ చరిత్ర

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే భారత జాతీయోద్యమ చరిత్రగా పేర్కొంటారు. 1885 నుంచి 1947 మధ్య మితవాదులు, అతివాదులు, గాంధేయవాదులతో పాటు విప్లవవాదులు దేశ స్వాతంత్య్రం కోసం చేసిన కృషి, ఆంగ్లేయులు ఆంగ్లేయులు భార‌తీయ ఉద్య‌మాల‌ను అణ‌చివేసిన‌ తీరు, ఆంధ్రదేశంలో జరిగిన ఉద్యమాల గురించి అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
చరిత్రకారులు భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు ముఖ్యమైన యుగాలు(దశలు)గా వర్గీకరించారు.

 

అవి: 1) మితవాదయుగం (1885 - 1905)
       2) అతివాదయుగం (1905 - 1920) 
       3) గాంధీయుగం (1920 - 1947) 

 

మితవాదులు ప్రార్థన, విజ్ఞప్తి, నిరసన విధానాల ద్వారా సుమారు ఇరవై ఏళ్లు భారత జాతీయోద్యమాన్ని నడిపారు. అతివాదులు ఆంగ్లేయుల పరుష విధానాలనే పాటిస్తూ ‘స్వరాజ్యం మా జన్మహక్కు’, దాన్ని సాధించి తీరుతామంటూ వందేమాతరం, హోంరూల్‌ ఉద్యమాలను నిర్వహించారు. గాంధీజీ శాంతి, సత్యం, అహింస, పద్ధతులను అనుసరించి సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమాల ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సంపాదించారు.
 

మితవాదయుగం (1885 - 1905)
భారత జాతీయోద్యమంలోని 1885 నుంచి 1905 వరకు గల తొలిదశను మితవాదయుగంగా పేర్కొంటారు. మితవాదుల నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు విజ్ఞప్తి - ప్రార్థన - నిరసన అనే పద్ధతులను పాటించారు. భారతీయుల సమస్యలపై విజ్ఞాపనలు ఇవ్వడం, వాటిని పరిష్కరించమని ఆంగ్లేయులను ప్రార్థించడం, అమలు చేయకపోతే నిరసన తెలియజేయడం లాంటి సాధారణ పద్ధతులను అనుసరించారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారిగా, న్యాయం తెలిసినవారిగా, మిత్రులుగా భావించి, వారు మాత్రమే తమ సమస్యలను పరిష్కరిస్తారనే విశ్వాసంతో ఉండేవారు. ఈ మితవాద విధానాల వల్ల వారేమీ సాధించలేకపోయారనేది అతివాదుల విమర్శ. మితవాదయుగంలో ఎ.ఒ. హ్యూమ్, గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్‌ బెనర్జీ, పి.ఆనందాచార్యులు, దాదాభాయ్‌ నౌరోజీ, ఫిరోజ్‌షా మెహతా లాంటి నాయకులు ప్రధానపాత్ర పోషించారు.

 

మితవాదుల ఆశయాలు 

* దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య మిత్రభావాన్ని, ఐక్యతను పెంచడం, వారంతా దేశ సౌభాగ్యానికి పాటుపడేలా కృషి చేయడం.
* భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలపై మేధావులు, విద్యావంతులు చర్చించి పరిష్కారానికి కృషి చేయడం.
* ప్రజల్లో దేశ సమైక్యతను, జాతీయతాభావాన్ని పెంపొందించడం.
* భారతీయులకు ప్రభుత్వోద్యోగాలు కల్పించడం, వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధికి చర్యలు చేపట్టేలా ఆంగ్లేయులను ఒప్పించడం.
* ఆంగ్లేయులతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం, బ్రిటిష్‌ సామ్రాజ్యాధినేతల పట్ల కాంగ్రెస్‌ పూర్తి విశ్వాసంతో వ్యవహరిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించడం.

మితవాదుల కోర్కెలు
* భారత శాసన సభల విస్తరణ, భారత రాజ్య కార్యదర్శి సలహామండలిని రద్దుచేయడం, భూమి శిస్తును తగ్గించడం, ప్రజాప్రతినిధి సంస్థలను నెలకొల్పడం.
* భారతీయులకు ఉద్యోగ అవకాశాలను కల్పించడం, జాతీయ విద్యా విధానాన్ని అమలుచేయడం, పరిశ్రమల అభివృద్ధికి కృషి చేయడం, నీటిపారుదల సౌకర్యాల కల్పన.
* విదేశాల్లో ఉన్న భారతీయులకు తగిన రక్షణ కల్పించడం, రైతులకు రుణ సౌకర్యాలను మెరుగుపరిచి వడ్డీ వ్యాపారుల నుంచి విముక్తి కల్పించడం.

మితవాదుల విజయాలు
1885 నుంచి 1905 మధ్య మితవాదులు భారత జాతీయోద్యమాన్ని బలపరిచారు. శాంతియుత, మితవాద పద్ధతులను అనుసరించినప్పటికీ, భారతీయుల సమస్యలను ప్రపంచానికి తెలిసేలా చేశారు. 1885లో జరిగిన మొదటి కాంగ్రెస్ సమావేశంలో 72 మంది ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. 1886లో జరిగిన రెండో  సమావేశానికి సుమారు 436 మంది, 1889 నాటి మూడో సమావేశానికి 1889 మంది ప్రతినిధులు హాజరయ్యారు. అంటే మితవాదుల కృషి వల్లనే భారత జాతీయ కాంగ్రెస్‌ విస్తరించి జాతీయోద్యమం అభివృద్ధి చెందిందని చెప్పవచ్చు. 1890 నాటి కాంగ్రెస్‌ సమావేశంలో కాదంబిని గంగూలీ ప్రసంగించారు (ఈమె కాంగ్రెస్‌లో సభ్యత్వం పొందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్‌). మితవాదుల కృషి ఫలితంగానే అనేక రాజ్యాంగ, ఆర్థిక, పాలనాపరమైన సంస్కరణలను ఆంగ్లేయులు ప్రవేశపెట్టారు.

 

మితవాదులు సాధించిన విజయాల్లో ముఖ్యమైనవి:
* 1886లో బ్రిటిష్‌ పార్లమెంట్‌ కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పబ్లిక్‌ సర్వీసు కమిషన్లను ఏర్పాటుచేసింది.
* 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా పరోక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు.
* ఇంగ్లండ్‌తో పాటు భారత్‌లో కూడా ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షలు నిర్వహించడానికి కామన్స్‌ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు (1893). కానీ ఇది 1923 నుంచి అమల్లోకి వచ్చింది.
* మితవాదుల కృషి ఫలితంగానే భారతదేశంలో ఆంగ్ల వ్యయం తగ్గింపు విషయంపై 1897లో వెల్సీ కమిషన్‌ ఏర్పాటైంది.
* మితవాదులు తమ రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా జాతీయతా భావాన్ని పెంపొందించారు. 
కానీ అతివాదులు మిత‌వాద విధానాల‌ను వ్య‌తిరేకించేవారు. ‘సుమారు 20 ఏళ్ల పాటు ఆంగ్లేయులతో రొట్టె కోసం పోరాడి, చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని అతివాద నాయ‌కుడు లాలాలజపతి రాయ్‌ మితవాదులను విమర్శించారు.

మితవాద నాయకులు

ఎ.ఒ. హ్యూమ్‌ (1829 - 1912)
ఆంగ్లేయుడైన అలెన్‌ ఆక్టేవియన్‌ హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షల్లో ఉత్తీర్ణుడై సివిల్‌ అధికారిగా భారతదేశానికి వచ్చాడు. 1882లో పదవీ విరమణ చేశారు. అనంతరం 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1884లో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని స్థాపించి రిప్పన్‌ వీడ్కోలు సభలను విజయవంతంగా నిర్వహించాడు. 1884లో ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ సంఘాన్ని స్థాపించాడు. ఈ సంఘమే 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌గా మారింది. ఈ ఏడాదిలోనే భారత తంతి సమాచార సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు.  1885, డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశాన్ని బొంబాయిలో డబ్ల్యు.సి. బెనర్జీ అధ్యక్షతన నిర్వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపకుడిగా, తొలి కార్యదర్శిగా పేరొందాడు. వాస్తవానికి ఆంగ్లేయుడైన హ్యూమ్‌ ‘రక్షణ కవాట సిద్ధాంతం’ అనుసరించి, కాంగ్రెస్‌ను స్థాపించాడని ఆధునిక భారతీయ చరిత్రకారుల అభిప్రాయం.

 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
ఈయన భారతదేశ కురువృద్ధుడి (గ్రాండ్‌ ఓల్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా)గా పేరొందాడు. బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. 1853లో బాంబే అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1865లో ఇంగ్లండ్‌లో తూర్పు ఇండియా సంఘాన్ని స్థాపించి, 1866లో దాన్ని లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా మార్చాడు. కలకత్తా (1886), లాహోర్‌ (1893), కలకత్తా (1906) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. 1906 నాటి కలకత్తా సమావేశంలో తొలిసారిగా స్వదేశీ తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. నౌరోజీ 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌లోని కామన్స్‌ సభకు ఎన్నికైన తొలి భారతీయుడు. 1892 - 95 మధ్య బ్రిటిష్‌ పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే గ్రంథాన్ని రచించి అందులో సంపద తరలింపు సిద్ధాంతాన్ని (డ్రైన్‌ సిద్ధాంతం) తెలియజేశాడు. హోంఛార్జీల రూపంలో భారతదేశ సంపద ఇంగ్లండ్‌కు ఏ విధంగా తరలిపోతుందో వివరించాడు. ఆంగ్ల పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్రగా అభివర్ణించాడు.

 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 ఈయన మితవాదుల నాయకుడు, గాంధీ రాజకీయ గురువు, మహారాష్ట్ర సోక్రటీస్‌గా పేరొందాడు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. గోఖలే వాస్తవంగా ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితుడయ్యాడు. 1905 నాటి బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ (భారత సేవా సంఘం)’ని స్థాపించాడు. 1912లో గాంధీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి వివక్షతా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాడు. గాంధీజీ గోఖలేను పవిత్రమైన గంగానది లాంటి వాడని పేర్కొనగా, తిలక్‌ భారతదేశపు వజ్రంగా వ్యాఖ్యానించాడు.
* మహారాష్ట్ర మాకియవెల్లిగా నానా ఫడ్నవీస్, బెంగాల్‌ సోక్రటీస్‌గా హెన్రీ డెరోజియో పేరుగాంచారు.

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
మకుటం లేని బొంబాయి మహారాజుగా పేరొందిన మితవాది ఫిరోజ్‌షా మెహతా. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ స్థాపనలో ప్రధానపాత్ర పోషించాడు. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించాడు. 1892 నాటి భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించాడు. వందేమాతర ఉద్యమకాలంలో లాల్‌ - బాల్‌ - పాల్‌ విధానాలను వ్యతిరేకించాడు. 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు నాయకత్వం వహించాడు.

 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
ఇండియన్‌ బర్క్, సిల్వర్‌ టంగ్‌ ఆరేటర్‌గా పేరొందిన మితవాది సురేంద్రనాథ్‌ బెనర్జీ. 1876 జులై 26న ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను (కలకత్తా) స్థాపించాడు. డబ్ల్యు.సి. బెనర్జీ స్థాపించిన ‘బెంగాలీ’ పత్రికను నడిపాడు. హ్యూమ్‌ కంటే ముందే ఒక జాతీయ సంస్థ స్థాపనకు కృషిచేశాడు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సమావేశాలను నిర్వహించాడు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమం చేసి జైలుకు వెళ్లాడు. పూనా (1895), అహ్మదాబాద్‌ (1902) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించాడు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమకాలంలో అతివాదులతో కలిసి పనిచేశాడు. సురేంద్రనాథ్‌ బెనర్జీ సేవలను హెన్రీ కాటన్, విలియం వెడ్డర్‌ బర్న్‌ లాంటి ఆంగ్లేయులు సైతం కొనియాడారు.  ఈయన ‘ఏ నేషన్‌ ఇన్‌ మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశాడు.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌