• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం

ఆంగ్ల సామ్రాజ్య విస్తరణ విధానాలు, వారు సాధించిన రాజకీయ ఐక్యత, ఆంగ్ల పాలన, ఆంగ్ల విద్య, ఆధునిక రవాణా సౌకర్యాల కల్పన, ఆంగ్లేయులు అనుసరించిన జాతి, వర్ణ వివక్షా విధానాలు, ఆర్థిక దోపిడీ విధానాలతోపాటు సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు, వార్తాపత్రికలు, సాహిత్య రచనలు, ఇల్బర్ట్‌ బిల్లు వివాదం లాంటి సంఘటనలు భారతీయుల్లో జాతీయోద్యమ భావాలను పెంపొందించాయి. సుగంధ ద్రవ్యాల వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా దేశాన్ని ఆక్రమించడానికి అనేక సామ్రాజ్యవాద విధానాలను అనుసరించారు.  రాజ్యాలను కోల్పోయిన భారతీయ పాలకులు, ఆయా రాజ్యాల్లో ఉపాధి పోగొట్టుకున్న ఉద్యోగులు ఆంగ్లేయుల పట్ల ద్వేష భావాన్ని పెంచుకున్నారు. అనేక భూభాగాలు, రాజ్యాలుగా విడిపోయి ఉన్న భారతదేశాన్ని ఆంగ్లేయులు ఒకే పాలన కిందికి తెచ్చి, ఐక్యతా భావాన్ని పెంచడానికి తోడ్పడ్డారు. ఆంగ్లేయులు కల్పించిన ఆధునిక రవాణా సౌకర్యాలు కూడా దేశంలోని ప్రజల మధ్య పరస్పర అవగాహనకు ఉపకరించాయి. 

1835లో విలియం బెంటింక్‌ ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య భారతీయుల్లో జాతీయ చైతన్యం మరింత పెరగడానికి దోహదం చేసింది. ఆంగ్ల విద్యను అభ్యసించిన భారతీయులు మిగిలిన భారతీయులకు స్వేచ్ఛ, సమానత్వం లాంటి అంశాలను తెలియజేశారు.
 

19వ శతాబ్దంలో భారతదేశంలో వచ్చిన సాంఘిక, మత సంస్కరణ ఉద్యమాలు భారతీయుల్లో దేశభక్తిని, జాతీయవాద స్ఫూర్తిని పెంచాయి. భారతదేశం భారతీయులకే అని స్వామి దయానంద సరస్వతి పేర్కొన్నారు. స్వామి వివేకానందుడు ఆధునిక జాతీయతకు పితామహుడిగా పేరుగాంచారు. వార్తాపత్రికలు ఆంగ్లేయుల జాతి వివక్ష విధానాలను, ఆర్థిక దోపిడీ విధానాలను ఎప్పటికప్పుడు ప్రచారం చేసి జాతీయ చైతన్యాన్ని పెంచాయి. ముఖ్యంగా లార్డ్‌ రిప్పన్‌ కాలంలో ప్రవేశపెట్టిన ఇల్బర్ట్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఆంగ్లేయులు చేసిన ఉద్యమం భారతీయుల్లో జాతీయ భావాలను మరింత పెంచి, 1885లో భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనకు దారితీసింది. భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రనే జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్రగా పేర్కొంటారు.
 

తొలి రాజకీయ సంస్థలు

ఆధునిక భారతదేశ చరిత్రలో రాజకీయ సంస్థల ఏర్పాటుకు కారకులు కూడా ఆంగ్లేయులే. బెంగాల్‌ రాష్ట్రంలో 1828లో హెన్రీ డిరోజియో నాయకత్వంలో 'అకడమిక్‌ అసోసియేషన్‌' అనే సంస్థ ఏర్పడింది. డిరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా అభివర్ణిస్తారు.  1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘం ఏర్పాటైంది. భారతదేశ చరిత్రలో దీన్ని తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. అనంతరం 1843లో బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. 1851లో బెంగాల్‌ భూస్వాముల సంఘం, బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియా సంఘం కలిసి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌గా ఏర్పడ్డాయి. దీని తొలి అధ్యక్షుడిగా రాధాకాంత్‌దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌ పని చేశారు. 1852 లో దాదాభాయ్‌ నౌరోజీ, పర్థూన్‌జీ జగన్నాథ్‌ లాంటి వారు బాంబే అసోసియేషన్‌ను స్థాపించారు. 1853లో గాజుల లక్ష్మీనరసు శెట్టి మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు.
 

దాదాభాయ్‌ నౌరోజీ 1865లో లండన్‌ కేంద్రంగా 'లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌'ను ప్రారంభించారు. ఇదే తర్వాతి కాలంలో ఈస్ట్‌ ఇండియా అసోసియేషన్‌గా మారింది. 1870లో జి.వి. జోషి, చిప్లూంకర్‌ పూనా సార్వజనిక సభను స్థాపించారు. దీని తొలి సమావేశం 1871లో ఎం.జి. రనడే అధ్యక్షతన జరిగింది. (పూనా సార్వజనిక సభ స్థాపకుడిగా ఈయన్ను పేర్కొంటారు). 1875లో శిశిర్‌ కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో ఇండియన్‌ లీగ్‌ (బెంగాల్‌) ఏర్పడింది. 1876 జులై 26న సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలసి ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. సుబ్రహ్మణ్య అయ్యర్, వీరరాఘవాచారి, పి. ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి వల్ల 1884లో మద్రాస్‌ మహాజనసభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జీ, కె.టి. తెలాంగ్‌ లాంటి వారు బొంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. అయితే ఈ తొలి తరం రాజకీయ సంస్థలన్నీ ఆయా ప్రాంతాలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించాయి.
 

 భారతదేశంలో జాతీయోద్యమ భావాలు, ఆందోళనలు రాజా రామ్మోహన్‌రాయ్‌తో ప్రారంభమయ్యాయని ఆధునిక చరిత్రకారులు పేర్కొంటారు. స్వామి వివేకానంద బోధనలు యువకుల్లో దేశభక్తిని పెంపొందించాయి. సురేంద్రనాథ్‌ బెనర్జీ తొలిసారిగా ఒక అఖిల భారత రాజకీయ సంస్థను స్థాపించడానికి కృషి చేశారు. ఇల్బర్ట్‌ బిల్లు భారతీయులకు నేర్పిన గుణపాఠాన్ని విద్యావంతులైన భారతీయులెవరూ మరచిపోరని థాంప్సన్, గారట్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. 1867లోనే డబ్ల్యూసీ బెనర్జీ తన ఇంగ్లండ్‌ ఉపన్యాసంలో ప్రాతినిధ్య ప్రభుత్వ ఆవశ్యకత గురించి ప్రస్తావించారు. క్రిస్టోదాస్‌ పాల్‌ తన హిందూ పేట్రియాట్‌ పత్రికలో రాసిన వ్యాసంలో ‘‘ఆంగ్లేయులు ఆఫ్రికా, ఆసియా వలసల్లో రాజ్యాంగబద్ధ స్వపరిపాలన ప్రవేశపెట్టి, భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు’’ అని ప్రశ్నించారు.
 

లిట్టన్‌ ప్రవేశపెట్టిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టానికి వ్యతిరేకంగా భారతీయులు పంపిన తీర్మానాన్ని గ్లాడ్‌స్టన్‌ (నాటి ఇంగ్లండ్‌ పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత) కామన్స్‌ సభలో ప్రవేశపెట్టాడు. భారతీయులకు సివిల్‌ సర్వీస్‌ పరీక్షల అర్హత వయసును తగ్గించడంపై లాల్‌ మోహన్‌ ఘోష్‌ కామన్స్‌ సభలో మాట్లాడాడు. ఇల్బర్ట్‌ బిల్లు వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న నాటి కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిపై వ్యాఖ్యలు చేసినందుకు సురేంద్రనాథ్‌ బెనర్జీకి జైలుశిక్ష విధించారు. ఈ విధంగా తొలితరం నాయకులు జాతీయోద్యమ భావాలను ప్రచారం చేయడం ద్వారా భారతీయుల్లో జాతీయోద్యమ స్ఫూర్తిని పెంపొందింపజేశారు. 1883లో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తొలి మహాసభను కలకత్తాలో నిర్వహించారు. 
 

భారత జాతీయ కాంగ్రెస్‌

1885 డిసెంబరు 28న ఎ.ఒ.హ్యూమ్‌ అనే ఆంగ్లేయుడి నాయకత్వంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ఏర్పాటైంది. దీని తొలి సమావేశం బొంబాయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పూనాలో జరపాలని భావించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో బొంబాయిలో నిర్వహించారు. విద్యావంతులైన భారతీయులతోనే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా వచ్చే ఉద్యమాన్ని నీరుగార్చాలనే ఉద్దేశంతో హ్యూమ్ రక్షణ కవాటా సిద్ధాంతాన్ని అనుసరించాడు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన నాటి వైస్రాయ్‌ లార్డ్‌ డఫ్రిన్‌ ఈ‌ చర్యను కొనియాడాడు. కానీ తర్వాతి కాలంలో కాంగ్రెస్‌ను అల్ప సంఖ్యాక వర్గాలవారి సంస్థ (మైక్రోస్కోపిక్‌ మైనారిటీ ఇన్‌స్టిట్యూషన్‌) అంటూ విమర్శించాడు. భారతదేశంపై రష్యా దండెత్తుతుందనే  భయంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని ఛటర్జీ లాంటి పండితులు పేర్కొన్నారు. ‘భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం’ అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నారు.
 

1886లో ఐఎన్‌సీ రెండో సమావేశం కలకత్తాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి సుమారు 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1887లో మద్రాస్‌లో బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగిన మూడో సమావేశానికి సుమారు 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం వ్యక్తి బద్రుద్దీన్‌ త్యాబ్జీ. నాలుగో సమావేశం 1888లో జార్జియూలె అధ్యక్షతన అలహాబాద్‌లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడు జార్జియూలె. 5వ సమావేశం 1889లో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన బొంబాయిలో జరిగింది. ప్రముఖ ఆంగ్లేయ ప్రతినిధి చార్లెస్‌బ్రాడ్‌లా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇతడిని ఇంగ్లండ్‌లో ‘భారత ప్రతినిధి’ సభ్యుడిగా పేర్కొంటారు. కాంగ్రెస్‌ కోరికలను నెరవేర్చడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లేనని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. విలియం వెడ్డర్‌బ‌ర్న్‌ అధ్యక్షతన ఇంగ్లండ్‌లో ఏర్పడిన ‘బ్రిటిష్‌ కమిటీ’కి విలియం డిగ్బీని కార్యదర్శిగా నియమించారు. దాదాభాయ్‌ నౌరోజీని ఇంగ్లండ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రచారకర్తగా నియమించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వదేశంలో, ఇంగ్లండ్‌లో భారత జాతీయోద్యమ అభివృద్ధికి కృషి చేసింది. నౌరోజీ ఉద్యమ ప్రచారానికి ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు. కానీ తర్వాతి కాలంలో ఆంగ్లేయులు కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా లార్డ్‌ కర్జన్‌ ‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే నా ప్రధాన ఆశయం’ అని పేర్కొన్నాడు.     
 

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు పి.ఆనందాచార్యులు. 1891 నాగ్‌పుర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఐఎన్‌సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంట్‌. ఈమె 1917 కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు.  
భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ సరోజినీ నాయుడు. 1925 కాన్పూర్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. గాంధీజీ తన జీవితకాలంలో ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం సమావేశం గాంధీ అధ్యక్షతన జరిగింది. 1947లో స్వాతంత్య్రం వచ్చేనాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు జె.బి.కృపలానీ.

 

భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్రను మూడు యుగాలుగా విభజించారు. అవి: 
 

   

   1) మితవాద యుగం (1885 - 1905) 
     

   2) అతివాద యుగం (1905 - 1920) 
     

  3) గాంధీ యుగం (1920 - 1947)
 

మితవాద యుగం 
భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి దశను మితవాద యుగంగా పిలుస్తారు. ఈ కాలంలో భారతీయులు మితవాద విధానాలను అనుసరించారు. మితవాదులకు నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరు ప్రార్థన - విజ్ఞప్తి - నిరసన (విజ్ఞప్తి, ప్రార్థన, నిరసన - సరైన క్రమంగా భావించాలి) అనే విధానాలను అనుసరించారు.
భారతీయులకు ఉన్నతోద్యోగాలు, శాసనసభల్లో ప్రశ్నించే హక్కు కల్పించాలని, శాసనసభలను విస్తృతపరచాలని, సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును పెంచాలని కోరారు. ఇంగ్లండ్‌తోపాటు భారతదేశంలో కూడా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు నిర్వహించాలని, భారతదేశంలో ఆంగ్లేయుల సైనిక వ్యయం,  భూమి శిస్తు, ఇతర పన్నులను తగ్గించాలని మితవాదులు భారత జాతీయ కాంగ్రెస్‌ ద్వారా ఆంగ్లేయులను కోరారు. మితవాదులు ఆంగ్లేయులను మంచివారుగా, తమ స్నేహితులుగా భావించేవారు. ఆంగ్లేయులకు న్యాయం తెలుసని, వారు మాత్రమే  సమస్యలను పరిష్కరించగలరని విశ్వసించేవారు.
 

ఆంగ్లేయులు ప్రారంభంలో మితవాదుల కోర్కెలను ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించేవారు. దాంతో అతివాదులు మితవాదులను తీవ్రంగా విమర్శించేవారు. ‘ఇరవై సంవత్సరాలపాటు రొట్టె కోసం పోరాడిన మితవాదులు చివరకు రాళ్లను కూడా సంపాదించలేకపోయారు’ అని లాలాలజపతిరాయ్‌ మితవాదులను విమర్శించారు. అయితే మితవాదులు పూర్తిగా విఫలమయ్యారని చెప్పలేం. విద్యావంతులైన భారతీయులు ఇరవై సంవత్సరాలపాటు అనేక మందిని భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరేలా కృషిచేశారు. తొలి కాంగ్రెస్‌ సమావేశానికి కేవలం 72 మంది ప్రతినిధులు హాజరైతే 1888 నాటి నాలుగో కాంగ్రెస్‌ సమావేశానికి 1,888 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మితవాదుల కృషి ఫలితంగానే ఆంగ్ల ప్రభుత్వం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టింది. 1892 భారత కౌన్సిళ్ల చట్టం ద్వారా భారతదేశంలో పరోక్ష ఎన్నిక విధానం ప్రవేశపెట్టారు. బడ్జెట్‌పై చర్చ జరపడానికి శాసనసభ్యులను అనుమతించారు. సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాసే భారతీయుల అర్హత వయసును 19 నుంచి 21 సంవత్సరాలకు పెంచారు. 1886లో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఇంగ్లండ్, ఇండియాలలో ఒకేసారి ఐసీఎస్‌ పరీక్షల నిర్వహణకు అనుమతించారు.
 

మితవాదుల కోరిక మేరకే భారతదేశంలో సైనిక వ్యయం తగ్గింపు విషయంలో సూచనలు చేయడానికి ఆంగ్ల ప్రభుత్వం 1895లో వెల్సీ కమిషన్‌ను నియమించింది. ఈ విధంగా మితవాదులు 1885 నుంచి 1905 మధ్య సుమారు 20 సంవత్సరాల పాటు జాతీయోద్యమ అభివృద్ధికి కృషిచేశారు.
 

ఎ.ఒ.హ్యూమ్‌ (1829 - 1912) 
 

హ్యూమ్‌ 1849లో ఐసీఎస్‌ పరీక్షలు రాసి ఒక సివిల్‌ సర్వెంట్‌గా భారతదేశానికి వచ్చాడు. 1883లో ‘వాయిస్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పత్రికను ప్రారంభించాడు. 1885లో భారత తంతి సమాచార సంఘాన్ని స్థాపించాడు. లార్డ్‌ రిప్పన్‌ పదవీ విరమణ సమయంలో ‘ఇన్నర్‌ సర్కిల్‌’ అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, రిప్పన్‌కు ఘనంగా వీడ్కోలు సభలను నిర్వహించాడు. హ్యూమ్‌ రక్షణ కవాట సిద్ధాంతాన్ని అనుసరించి 1885 డిసెంబరు 28న భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. వాస్తవానికి 1884లోనే హ్యూమ్‌ ఇండియన్‌ నేషనల్‌ యూనియన్‌ అనే సంస్థను స్థాపించాడు. దానికే 1885లో దాదాభాయ్‌ నౌరోజీ కాంగ్రెస్‌ అనే పేరును సూచించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన తెలుగు అకాడమీ పుస్తకంలో కాంగ్రెస్‌ అనే పేరును సూచించింది డబ్ల్యూసీ బెనర్జీగా పేర్కొన్నారు.) ఎ.ఒ.హ్యూమ్‌ ‘భారత జాతీయ కాంగ్రెస్‌ పితామహుడి’గా గుర్తింపు పొందాడు.
 

దాదాభాయ్‌ నౌరోజీ (1825 - 1917)
 

భారతదేశ కురు వృద్ధుడిగా (Grand Oldman of India) పేరొందిన ప్రముఖ మితవాది దాదాభాయ్‌ నౌరోజీ. ఈయన బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. 1865లో లండన్‌ ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. అదే తర్వాతి సంవత్సరంలో ‘బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది.
 

1886 నాటి రెండో కాంగ్రెస్‌ సమావేశానికి (కలకత్తా), 1893 (లాహోర్‌), 1906 (కలకత్తా) కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. 1892లో ఇంగ్లండ్‌లోని కేంద్ర ప్రిన్స్‌బరీ నియోజకవర్గం నుంచి కామన్స్‌ సభకు ఎన్నికై, ఇంగ్లండ్‌ పార్లమెంట్‌కు ఎన్నికైన తొలి భారతీయుడిగా కీర్తి పొందారు. 1901లో ‘పావర్టీ అండ్‌ అన్‌ బ్రిటిష్‌ రూల్‌ ఇన్‌ ఇండియా’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని వెలువరించారు. ఆ గ్రంథంలోనే డ్రైన్‌ సిద్ధాంతాన్ని (సంపద తరలింపు సిద్ధాంతం) వివరించారు. ఆంగ్లేయులు భారతదేశ సంపదను ఏ విధంగా ఇంగ్లండ్‌కు తరలించుకుపోతున్నారో తెలిపారు. 1906 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశంలో నౌరోజీ అధ్యక్షతన స్వదేశీ తీర్మానం చేశారు. వెల్సీ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. బ్రిటిష్‌ పాలనను ‘భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదేశీ దండయాత్ర’గా అభివర్ణించారు. బ్రిటిష్‌ నియంతృత్వంలో శాంతి భద్రతల నడుమ మనిషి ప్రశాంతంగా ఆకలిని అనుభవిస్తున్నాడని, ప్రశాంతంగా సర్వనాశనమవుతున్నాడని నౌరోజీ పేర్కొన్నారు. ఈయనే భారతదేశంలో తొలిసారిగా జాతీయాదాయాన్ని అంచనా వేశారు.
 

ఫిరోజ్‌షా మెహతా (1845 - 1915)
 

మకుటంలేని బొంబాయి మహారాజు, బొంబాయి సింహంగా ప్రసిద్ధి చెందిన మితవాద నాయకుడు ఫిరోజ్‌షా మెహతా. ఈయన నాయకత్వంలోనే 1884లో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్‌ ఏర్పాటైంది. 1890 నాటి కలకత్తా కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1892 భారత కౌన్సిళ్ల చట్టాన్ని ‘భిక్షగాడి జీవితం లాంటిది’ అని విమర్శించారు. మితవాదులు 1892 చట్టాన్ని ఆంగ్లేయులు నవ్వుతూ చేసిన మోసంగా అభివర్ణించారు. వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదత్రయంగా పేరొందిన లాల్‌-బాల్‌-పాల్‌ విధానాలను ఫిరోజ్‌షా మెహతా వ్యతిరేకించారు. ముఖ్యంగా 1907 నాటి సూరత్‌ చీలిక సమయంలో మితవాదులకు ముఖ్య నాయుకుడిగా ఉన్నది ఫిరోజ్‌షా మెహతానే.
 

సురేంద్రనాథ్‌ బెనర్జీ (1848 - 1925)
 

ఇండియన్‌ బర్క్, సిల్వర్‌టంగ్‌ ఆరేటర్‌ లాంటి బిరుదులను పొందిన ప్రముఖ మితవాద నాయకుడు సురేంద్రనాథ్‌ బెనర్జీ. ఈయన 1869లో ఐసీఎస్‌ పరీక్ష ఉత్తీర్ణుడయ్యారు. 1876, జులై 26న ఆనంద్‌ మోహన్‌బోస్‌తో కలిసి కలకత్తాలో ‘ఇండియన్‌ అసోసియేషన్‌’ను స్థాపించారు. డబ్ల్యూ.సి. బెనర్జీ స్థాపించిన బెంగాలీ పత్రికను ఈయన నిర్వహించారు. ఇల్బర్ట్‌ బిల్లు వివాద సమయంలో ఉద్యమించి, జైలుకు వెళ్లారు. 1858 నాటి విక్టోరియా మహారాణి ప్రకటనను తర్వాతి కాలంలో ‘భారతదేశంలో మానవ హక్కుల ప్రకటన (మాగ్నాకార్ట్‌)’గా వ్యాఖ్యానించారు. 1883, 1885లలో కలకత్తాలో ఇండియన్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 1895 (పూనా), 1902 (అహ్మదాబాద్‌) భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలకు అధ్యక్షత వహించారు. మితవాది అయినప్పటికీ వందేమాతర ఉద్యమ కాలంలో అతివాదులతో చేయి కలిపారు. బెంగాల్‌ విభజన అమల్లోకి వచ్చిన 1905, అక్టోబరు 16న కలకత్తాలోని బహిరంగ సభల్లో ఆనంద్‌ మోహన్‌ బోస్‌తో కలిసి ప్రసంగించారు. ఈయన వ్యక్తిత్వాన్ని హెన్రీకాటన్, విలియం వెడ్డర్‌బర్న్‌ లాంటి ఆంగ్లేయులు కూడా కొనియాడారు. సురేంద్రనాథ్‌ బెనర్జీ ‘ఎ నేషన్‌ ఇన్‌ ద మేకింగ్‌’ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రాశారు.
 

గోపాలకృష్ణ గోఖలే (1866 - 1915)
 

మితవాద వర్గానికి ముఖ్య నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. ఈయనను గాంధీజీకి రాజకీయ గురువుగా పేర్కొంటారు. పూనాలోని ఫెర్గూసన్‌ కళాశాలలో ఆచార్యుడిగా పనిచేశారు. గోఖలే ఎం.జి. రనడే శిష్యుడైనప్పటికీ రాజకీయంగా ఫిరోజ్‌షా మెహతా అభిప్రాయాలతో ప్రభావితమయ్యారు. ఈయన 1905లో బెనారస్‌ కాంగ్రెస్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. 1905, జూన్‌ 12న ‘సర్వెంట్స్‌ ఆఫ్‌ ఇండియా సొసైటీ’ అనే సంస్థను స్థాపించారు.
 

గోరక్షక ఉద్యమాన్ని కూడా నడిపారు. ‘మహారాష్ట్ర సోక్రటీస్‌’గా పేరొందారు. 1912 లో గాంధీజీతోపాటు దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడి జాతి వివక్షా విధానాలకు వ్యతిరేకంగా పోరాడారు. గోఖలేను పవిత్రమైన గంగానది లాంటివారని గాంధీజీ, భారతదేశపు వజ్రం లాంటివారని బాలగంగాధర తిలక్‌ పేర్కొన్నారు. గోఖలేను ఆధునిక భారతదేశ ప్రథమ రాజనీతిజ్ఞుడిగా కె.ఎం. ఫణిక్కర్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు. మితవాదులు సుమారు 20 సంవత్సరాల పాటు గోఖలే నాయకత్వంలోనే ఆంగ్లేయులతో పోరాడారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు