• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయోద్యమం - తొలి రాజకీయ సంస్థలు

భారతదేశంలో రాజకీయ చైతన్యానికి, రాజకీయ సంస్కరణలకు కృషిచేసిన తొలి వ్యక్తి రాజా రామ్మోహన్‌రాయ్‌. పత్రికా స్వేచ్ఛ, న్యాయ సంఘం ద్వారా విచారణలు, పరిపాలనా విభాగం నుంచి న్యాయ వ్యవస్థను వేరుచేయడం ఉన్నత పదవుల్లో భారతీయులకు ప్రవేశం కల్పించడం లాంటి అంశాలపై రాజా రామ్మోహన్‌రాయ్‌ పోరాడారు. ఆయన తర్వాత బెంగాల్‌లో ఉగ్రవాద భావాలున్న యువకులు హెన్రీ డెరోజియో నాయకత్వంలో రాజకీయ చైతన్యం, భారతీయుల హక్కుల కోసం పోరాటాలు మొదలుపెట్టారు. 1828లో వీరంతా కలిసి అకడమిక్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. డెరోజియన్లుగా వీరు పేరొందారు. హెన్రీ డెరోజియోను చరిత్రకారులు బెంగాల్‌ సోక్రటీస్‌గా పిలిచారు. డెరోజియన్లు రాజకీయ చైతన్యం కోసమే కాకుండా సాంఘిక, నైతిక సమస్యలపై కూడా పోరాడేవారు. కానీ వీరి విప్లవ భావాల వల్ల ఎక్కువగా ప్రజలను ఆకర్షించలేకపోయారు. 1838లో థియోడర్‌ డికెన్స్‌ నాయకత్వంలో బెంగాల్‌ భూస్వాముల సంఘాన్ని స్థాపించారు. దీన్నే భారతదేశంలో ఏర్పడిన తొలి రాజకీయ సంస్థగా పేర్కొంటారు. ఈ సంస్థ కూడా కేవలం బెంగాల్, బిహార్, ఒడిశా ప్రాంతాల్లో ఉన్న భూస్వాముల ప్రయోజనాల కోసం పనిచేసే సంస్థగా పేరొందింది.

1843లో జార్జి థాంప్సన్, డేనియల్‌ ఒకానల్‌ లాంటి ఆంగ్లేయులు బెంగాల్‌లో బ్రిటిష్‌ ఇండియా సంఘాన్ని స్థాపించారు. ద్వారకానాథ్‌ ఠాగూర్‌ లాంటి భారతీయులు ఈ సంఘంలో సభ్యులుగా పనిచేశారు. వీటన్నిటికంటే ముఖ్యమైన రాజకీయ సంస్థ 1851లో బెంగాల్‌ ఏర్పడింది. అదే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌. ఇంతకుముందు ఉన్న బెంగాల్‌ భూస్వాముల సంఘం (1838), బ్రిటిష్‌ ఇండియా సంఘం (1843) కలిసి ఏర్పడిందే బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌.

బెంగాల్‌ బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా రాథాకాంత్‌ దేవ్, కార్యదర్శిగా దేవేంద్రనాథ్‌ ఠాగూర్‌లు పనిచేశారు. శాసనసభల ప్రతినిధులను ప్రజలే ఎన్నుకోవాలని ఈ సంఘమే తొలిసారిగా ప్రతిపాదించింది. 1852లో బొంబాయి బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను దాదాభాయ్‌ నౌరోజీ, జగన్నాథ్, నౌరోజీ పర్థూన్‌జీ లాంటి వారు స్థాపించారు. (గమనిక: బొంబాయి అసోసియేషన్‌ను 1852లో స్థాపించినట్లు చాలా పుస్తకాల్లో పేర్కొన్నారు. 1885లో బాంబే ప్రెసిడెన్సీ అసోషియేషన్‌ స్థాపించారు. ఈ తేడాను అభ్యర్థులు గమనించాలి.) 1853లో గాజుల లక్ష్మీనరసుశెట్టి లాంటివారు మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. (గమనిక: తారాచంద్‌ రాసిన భారత జాతీయోద్యమ చరిత్ర 3వ భాగంలో 1853 అని ఉండగా బిపిన్‌చంద్ర రాసిన ఆధునిక భారతదేశ చరిత్ర పుస్తకంలో 1852లో అని ఉంది). బొంబాయి అసోసియేషన్‌ భారతీయుల విద్యాభివృద్ధికి, భారతీయ ప్రతినిధులతో కూడిన శాసనసభల ఏర్పాటుకు, భారతీయుల ఉన్నతోద్యోగాల కల్పనకు ఆంగ్లేయులు కృషిచేయాలని కోరితే, మద్రాస్‌ నేటివ్‌ అసోసియేషన్‌ రైతులు, కార్మికులు, కూలీ పనివారి సమస్యల సాధన కోసం కృషిచేసింది. ఈ విధంగా 1858కి పూర్వం ఏర్పడిన సంస్థలన్నీ కేవలం అయా ప్రాంతీయ ప్రాతిపదికపై ఏర్పడినవే. అందుకే అవి ఆయా ప్రాంతాల సమస్యల సాధనకు అధిక ప్రాధాన్యమిచ్చేవి.

1858 తర్వాత ఏర్పడ్డ సంస్థలు అఖిల భారత స్థాయి సమస్యల సాధన కోసం కొంతమేర కృషి చేశాయి. 1865 మార్చి 24న దాదాభాయ్‌ నౌరోజీ, డబ్ల్యూసీ బెనర్జీ లాంటివారు ఇంగ్లండ్‌లో లండన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ సంస్థ 1866 నాటికి ‘ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌’గా మారింది. భారతీయుల పరిస్థితులను ఇంగ్లండ్‌ ప్రభుత్వానికి, ఇంగ్లండ్‌ ప్రజలకు తెలిసేలా ఈ సంస్థ కృషి చేసింది. దాదాభాయ్‌ నౌరోజీ ఈ సంస్థ శాఖలను భారతదేశంలో కూడా నెలకొల్పారు. పూనాలో (1870) జీవీ జోషీ, చిప్లూంకర్‌ ‘పూనా సార్వజనిక సభ’ను స్థాపించారు. ఈ సంస్థ తొలి సమావేశం 1971లో మహదేవ గోవింద రనడే అధ్యక్షతన జరిగింది. భారతీయులు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను వివరిస్తూ విక్టోరియా మహారాణికి ఒక వినతి పత్రాన్ని సమర్పించారు.

బెంగాల్‌లో శిశిర్‌కుమార్‌ ఘోష్‌ నాయకత్వంలో బెంగాల్‌ ఇండియన్‌ లీగ్‌ (1875) అనే సంఘం ఏర్పడింది. 1876 జులై 26న కోల్‌కతాలో సురేంద్రనాథ్‌ బెనర్జీ, ఆనంద్‌మోహన్‌ బోస్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ అనే సంస్థను స్థాపించారు. సివిల్‌ సర్వీసు పరీక్షా విధానంలో సంస్కరణలు చేపట్టాలని ఈ సంస్థ తన ఆందోళనను ప్రారంభించింది. అఖిల భారత స్థాయిలో ప్రాచుర్యాన్ని పొందిన మొదటి ఆధునిక భారతీయుడిగా సురేంద్రనాథ్‌ బెనర్జీ పేరొందారు. జమీందారులకు వ్యతిరేకంగా కౌలుదారులు హక్కుల పరిరక్షణ, తేయాకు తోట కార్మికుల హక్కుల కోసం విదేశీ తేయాకు తోటల యజమానులకు వ్యతిరేకంగా ఇండియన్‌ అసోసియేషన్‌ పోరాడింది.

1884లో సుబ్రహ్మణ్య అయ్యర్, వీర రాఘవాచారి, ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు లాంటి వారి కృషి కారణంగా మద్రాస్‌ మహాజన సభ ఏర్పడింది. 1885లో ఫిరోజ్‌ షా మెహతా, బద్రుద్దీన్‌ త్యాబ్జి. కె.టి. తెలాంగ్‌ లాంటి వారి కృషి ఫలితంగా బాంబే ప్రెసెడెన్సీ అసోసియేషన్‌ను స్థాపించారు. ఈ విధంగా 1885కు ముందు స్థాపించిన సంస్థలన్నీ ఎక్కువగా ఆయా ప్రాంతాల సమస్యల కోసమే పోరాడేవి తప్ప అఖిల భారత స్థాయి ప్రాతినిధ్య సంస్థలుగా ఎదగలేదు. ఆ సంస్థలో సభ్యత్వం, నాయకత్వం ఆయా నగరాలకే పరిమితమై ఉండేది. సురేంద్రనాథ్‌ బెనర్జీ, 1883, 1885లో రెండుసార్లు కోల్‌కతాలో జాతీయసభ సమావేశాలను నిర్వహించినప్పటికీ అది జాతీయ ప్రాతినిధ్య సంస్థగా మారలేకపోయింది. సురేంద్రనాథ్‌ బెనర్జీ సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసే అభ్యర్థుల అర్హత వయసును లార్డ్‌ లిట్టన్‌ 21 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు తగ్గించి వేయడంపై దేశవ్యాప్తంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ముఖ్యంగా విద్యార్థులను జాతీయోద్యమంలో భాగస్వాములను చేయడానికి విద్యార్థి సంఘాలను స్థాపించారు. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్‌కు ముందు స్థాపించిన సంస్థలు, నాయకులు జాతీయోద్యమ వ్యాప్తికి ఎంతో కృషి చేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన (1885)

భారత జాతీయోద్యమ చరిత్రలో అతి ప్రధాన ఘట్టం భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపన. మొత్తం భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ఒక సంస్థను స్థాపించాలని అనేకమంది భారతీయ నాయకులు ఆలోచించినప్పటికీ ఆ ఆలోచనకు తుది రూపు ఇచ్చింది ఆంగ్లేయుడైన ఏవో హ్యూమ్‌. 1885, డిసెంబరు 28న హ్యూమ్‌ భారత జాతీయ కాంగ్రెస్‌ను స్థాపించాడు. దీని తొలి సమావేశం ముంబయిలోని గోకుల్‌దాస్‌ తేజ్‌పాల్‌ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ తొలి కాంగ్రెస్‌ సమావేశానికి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షత వహిస్తే మొత్తం 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌ స్థాపనలో హ్యూమ్‌ రక్షక కవాట సిద్ధాంతాన్ని అనుసరించాడని ఆధునిక భారతీయ చరిత్రకారులు పేర్కొంటున్నారు. అంటే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా భారతీయులు చేస్తున్న ఆందోళనలను భారతీయుల సహాయంతోనే అణచివేయాలనే భావంతోనే హ్యూమ్‌ కాంగ్రెస్‌ను స్థాపించాడని వారి భావన. ‘‘మన నిర్వాకం వల్ల ఉప్పొంగే మహాశక్తిని ఉపశమింపజేయడానికి అనువైన మార్గాన్ని చూడటం మన తక్షణ అవసరం’’ అని హ్యూమ్‌ పేర్కొన్నాడు. కాంగ్రెస్‌ స్థాపన కాలంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ డఫ్రిన్‌ తర్వాతి కాలంలో అదే కాంగ్రెస్‌ను ‘మైక్రోస్కోపిక్‌ మైనారిటీ సంస్థ’గా విమర్శించాడు. భారతీయుల ఆలోచనా విధానంపై పాశ్చాత్య నాగరికత ప్రసరించిన ప్రభావ ఫలితమే భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అని విలియం వెడ్డర్‌బర్న్‌ పేర్కొన్నాడు.

భారత జాతీయ కాంగ్రెస్‌ను నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. మొత్తం భారతీయులకు ప్రాతినిధ్య సంస్థగా పనిచేయడం, అందరి మధ్యా స్నేహబంధాన్ని పెంచి జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించడం, భారతీయుల అవసరాలు, కోర్కెలను బ్రిటిష్‌వారికి విన్నవించి పరిష్కరించడం, ప్రజాభిప్రాయాన్ని సుశిక్షితం చేసి, సమీకరించి ప్రజాస్వామ్య భావాలను పెంపొందించడం అనే నాలుగు ప్రధాన లక్ష్యాలతో స్థాపించారు. వాస్తవానికి భారత జాతీయ కాంగ్రెస్‌ తొలి సమావేశం పుణెలో జరపాలని నిర్ణయించారు. కానీ అక్కడ ప్లేగు వ్యాధి వ్యాపించడంతో ముంబయిలో నిర్వహించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ రెండో సమావేశం 1886, డిసెంబరులో కోల్‌కతాలో దాదాభాయ్‌ నౌరోజీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మొత్తం 436 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మూడో సమావేశం మద్రాస్‌లో (1887) బద్రుద్దీన్‌ త్యాబ్జీ అధ్యక్షతన జరిగింది. దీనికి మొత్తం 607 మంది ప్రతినిధులు హాజరయ్యారు. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం బద్రుద్దీన్‌ త్యాబ్జీ. 1888లో నాలుగో సమావేశం అలహాబాద్‌లో జార్జి యూలె అధ్యక్షతన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి విదేశీయుడిగా జార్జి యూలె పేరొందారు. 1889లో అయిదో సమావేశం ముంబయిలో విలియం వెడ్డర్‌బర్న్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి చార్లెస్‌ బ్రాడ్‌లా లాంటి ఆంగ్లేయులు హాజరయ్యారు.

భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి పి. ఆనందాచార్యులు. 1891 నాటి నాగపూర్‌ సమావేశానికి ఈయన అధ్యక్షత వహించారు. కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ అనిబిసెంటు, తొలి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు. 1917 నాటి కోల్‌కతా సమావేశానికి అనిబిసెంటు అధ్యక్షత వహిస్తే 1925 కాన్పూర్‌ సమావేశానికి సరోజినీనాయుడు అధ్యక్షత వహించారు. గాంధీజీ ఒకే ఒకసారి కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించారు. 1924 నాటి బెల్గాం కాంగ్రెస్‌ సమావేశం గాంధీజీ అధ్యక్షతన జరిగింది. 1947 నాటికి అంటే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి జె.బి. కృపలానీ. భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎక్కువసార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి జవహర్‌లాల్‌ నెహ్రూ, భారత జాతీయ కాంగ్రెస్‌ చరిత్ర గ్రంథాన్ని రచించిన భోగరాజు పట్టాభి సీతారామయ్య కాంగ్రెస్‌ చరిత్రకారుడిగా పేరొందారు. కాంగ్రెస్‌ ఆశయాలను ప్రచారం చేయడానికి దాదాభాయ్‌ నౌరోజీ ‘ఇండియా’ అనే పత్రికను ప్రారంభించారు.

ఆంగ్లేయులు ప్రారంభించిన భారత జాతీయ కాంగ్రెస్‌ క్రమంగా బలపడటంతో కాంగ్రెస్‌ పట్ల ఆంగ్లేయుల దృక్పథం మారిపోయింది. లార్డ్‌ డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను అల్పసంఖ్యాక వర్గాల సంస్థగా పేర్కొన్నాడు. ‘కాంగ్రెస్‌ కోర్కెలను మన్నించడమంటే భారతదేశానికి స్వపరిపాలన ఇచ్చినట్లే’ అని టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ పత్రిక వ్యాఖ్యానించింది. కాంగ్రెస్‌ నాయకుల ఆశయాన్ని ‘అంతగా లోతు తెలియని గొయ్యిలోకి అడుగువేస్తున్న అవివేక చర్య’గా డఫ్రిన్‌ అభివర్ణించాడు. కాంగ్రెస్‌ను కుట్రదారుల ముఠాగా ఆంగ్లేయులు పేర్కొన్నారు. ప్రభుత్వం పైన విశ్వాసంలేని వాళ్లనీ, రాజద్రోహపూరిత బ్రాహ్మణులనీ, తీవ్ర దుర్మార్గులనీ కాంగ్రెస్‌ నాయకులను విమర్శించేవారు.

డఫ్రిన్‌ కాంగ్రెస్‌ను ‘‘ప్రజారాశిలో ఒక నలుసని’’ గేలి చేశాడు. లార్డ్‌ కర్జన్‌ ‘‘కాంగ్రెస్‌ అంతాన్ని చూడటమే తన ప్రధాన ధ్యేయం’’ అని పేర్కొన్నాడు. 1900లో లార్డ్‌ కర్జన్‌ భారత రాజ్య కార్యదర్శికి లేఖ రాస్తూ ‘‘కాంగ్రెస్‌ పడిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను భారతదేశంలో ఉండగానే అది ప్రశాంతంగా కన్నుమూయడానికి సహాయపడాలని నా కోరిక’’ అని పేర్కొన్నాడు. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారత జాతీయ కాంగ్రెస్‌ స్వాతంత్య్ర పోరాటాన్ని నడిపి భారతదేశం నుంచి ఆంగ్లేయులను తరిమివేసింది.

Posted Date : 01-02-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు