• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక సంస్కరణల కోసం మహమ్మదీయుల ఉద్యమాలు

* మహమ్మదీయుల్లోని కులవ్యవస్థ, పరదా పద్ధతి లాంటి దురాచారాలను రూపుమాపడానికి ఉత్తర్ ప్రదేశ్‌లోని బెరైలికి చెందిన సయ్యద్ అహ్మద్ ఖాన్, బెంగాల్‌కు చెందిన షరియతుల్లా కృషిచేశారు.

* షరియతుల్లా ఫైరైజి ఉద్యమానికి నాయకత్వం వహించాడు.

* నవాబ్ అబ్దుల్ లతీఫ్ (1828 - 1893) 'మహమ్మదన్ లిటరరీ సొసైటీ ఆఫ్ కలకత్తా' అనే సంస్థను 1863లో స్థాపించాడు. ఈ సంస్థ కూడా మహమ్మదీయుల సంస్కరణల కోసం కృషి చేసింది.

* అబ్దుల్ లతీఫ్ హిందూ, మహమ్మదీయుల ఐక్యతకు; మహమ్మదీయల్లో విద్యావ్యాప్తికి కృషిచేశాడు.

* సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ (1817 - 1898) మొగల్ దర్బారుకు చెందిన గొప్ప వంశస్థుడు. ఇతడు 1875లో అలీఘర్‌లో ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని స్థాపించాడు. ఇది తర్వాతి కాలంలో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా అభివృద్ధి చెందింది.

* మహమ్మదీయుల్లో సాంఘిక జాగృతి కోసం సయ్యద్ అహ్మద్ ఖాన్ నేతృత్వంలో చేసిన ఉద్యమాన్ని 'అలీగఢ్ ఉద్యమం' అంటారు. ఇతడు హిందువులు, ముస్లింలు భారతీయులేనని విభేదాలు ఉండకూడదని బోధించాడు.


ఈశ్వర చంద్ర విద్యాసాగర్ (1820 - 1891):

* ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 1820లో బెంగాల్‌లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సంస్కృతాన్ని అభ్యసించిన గొప్పవిద్వాంసుడు. కలకత్తాలోని సంస్కృత కళాశాల ఇతడికి 'విద్యాసాగర్' అనే బిరుదును ఇచ్చి గౌరవించింది. సమాజానికి అవసరమైన సంస్కరణలు తీసుకురావడానికి బెంగాలీ పత్రికల్లో ఉత్తేజపరిచే రచనలు చేశాడు.

* అనేక మంది సంఘ సంస్కర్తలు వితంతు పునర్వివాహాలు, స్త్రీ విద్యకు కృషి చేశారు. వారిలో కందుకూరి వీరేశలింగం (1848 - 1919), నారాయణ గురు (కేరళ) ముఖ్యమైనవారు.

సాంస్కృతిక జాగృతీ ప్రభావం:

* యూరోపియన్ విద్వాంసులు భారత సాహిత్యాన్ని ప్రశంసించారు. ఈ విషయంలో విలియం జోన్స్ మార్గదర్శకత్వం వహించి 'ఏషియాటిక్ సొసైటీ'ని స్థాపించాడు.

* విలియం జోన్స్ కాళిదాసు రచించిన 'అభిజ్ఞాన శాకుంతలాన్ని' ఆంగ్లంలోకి అనువదించాడు.

* 19వ శతాబ్దపు విద్వాంసులు మౌర్య చక్రవర్తి అయిన అశోకుడి శాసనాలను అనువదించారు.

* ఏషియాటిక్ సొసైటీ ఈ రచనలన్నింటినీ ముద్రించింది. భారతీయులు ఈ గ్రంథాలను చదివి ప్రాచీన భారతదేశ సంస్కృతిని, నాగరికతను తెలుసుకోగలిగారు.


సాహిత్యం, భాష, కళలు:

* మనదేశంలో 19వ శతాబ్దంలోని సాహిత్యం ప్రాచీన సాహిత్యం కంటే భిన్నమైంది.

* ప్రాచీన సాహిత్యం పద్య, శ్లోకాల రూపంలో ఉండేది. 19వ శతాబ్దంలో గద్య రచనలకు ఎక్కువ ప్రాముఖ్యం ఉండేది.

* భరతేందు హరిశ్చంద్ర (1850 - 1885) ఆధునిక హిందీ సాహిత్యాభివృద్ధికి కృషి చేశాడు.

* బంకించంద్ర ఛటోపాధ్యాయ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటివారు బెంగాలీ సాహిత్యంలో మార్గదర్శకులు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన 'జనగణమన' స్వతంత్ర భారతదేశానికి జాతీయ గీతం అయ్యింది. ఠాగూర్ సాహిత్య కృషికి 1913లో అత్యున్నత అంతర్జాతీయ నోబెల్ పురస్కారం లభించింది.

* బంకించంద్ర రాసిన 'వందేమాతరం', మహమ్మద్ ఇక్బాల్ రచించిన 'సారేజహాసే అచ్ఛా' గేయాలను ప్రజలు దేశభక్తి ప్రబోధకాలుగా పాడుకుంటున్నారు.

* గురజాడ అప్పారావు - తెలుగు, హరినారాయణ - మరాఠీ, సుబ్రమణ్య భారతి - తమిళం, హేమచంద్ర బారువా - అసోం, ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా, కె.వి. పుట్టప్ప - కన్నడ; కుమరన్ ఆసన్, వి.కె. నారాయణ మీనన్ - మళయాళం భాషల్లో ప్రసిద్ధ రచయితలు. వీరంతా 19వ, 20వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో రచనలు చేసి సొంత భాషల్లో సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు.

* భారతదేశ గ్రామాల్లోని పేదరికాన్ని ప్రేమ్‌చంద్ తన హిందీ రచనల్లో వర్ణించాడు.

* రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రలేఖనాన్ని శాస్త్రీయంగా అభ్యసించాడు. దీనికోసం బెంగాల్‌లో పాఠశాలను స్థాపించాడు.

* రాజారామ్మోహన్ రాయ్ రామాయణ, మహాభారత గాథలను; అమృతా షేర్గిల్ భారతీయుల నిత్యజీవితాలను, నందలాల్ బోస్ వృత్తి పనుల వారి నిత్యజీవితాలను, ప్రాచీన గాథలను, స్వాతంత్య్రోద్యమంలోని కొన్ని ఘట్టాలను చిత్రాల రూపంలో చూపారు.


పత్రికల అభివృద్ధి, వాటి పాత్ర:

* ది హిందూ, అమృత్‌బజార్, ది మరాఠా, ది ఇండియన్ మిర్రర్, ది స్వదేశ్ మిత్రన్, ది ప్రభాకర్, ది ఇందు ప్రకాశ్ లాంటి పత్రికలు భారత ప్రజలను ఉత్తేజపరచి స్వాతంత్రోద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేశాయి.
 

సైన్సు అభివృద్ధి:

* ప్రాచీన భారతదేశ విద్యావిధానంలో సైన్సును బోధించేవారు కాదు.

* రాజారామ్మోహన్ రాయ్ లాంటివారు ఆంగ్ల విద్యను అభ్యసించాలని, తద్వారా సైన్సు చదవడంతో భారతదేశం అభివృద్ధి చెందుతుందని భావించారు.

* 19వ శతాబ్దపు ఆరంభంలో సైంటిఫిక్ సొసైటీలు ఏర్పడ్డాయి. వీటి ద్వారా భారతదేశంలో సైన్సు అభివృద్ధి చెందింది.

* మహేందర్‌లాల్ సర్కార్ మొదటి వైద్య విద్యార్థి. ఇతడు 1876లో సైన్సు అభివృద్ధికి 'ఇండియన్ అసోసియేషన్' అనే సంస్థను ఏర్పాటు చేశాడు.

* 20వ శతాబ్దంలో 'ఇండియన్ సైన్సు కాంగ్రెస్ అసోసియేషన్‌'ను స్థాపించారు.

* 1930లో సర్ సి.వి. రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన కృషికిగానూ ఆయనకు నోబెల్ బహుమతి లభించింది.

* శ్రీనివాస రామానుజన్ గణితంలో; మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో ప్రసిద్ధులు.

* విశ్వేశ్వరయ్య హైదరాబాద్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో పని చేసి, దేశానికి విశిష్ట సేవలందించారు. జల విద్యుదుత్పత్తి, ఆనకట్టల నిర్మాణం, పట్టు పరిశ్రమాభివృద్ధికి కృషి చేశారు.

* ప్రఫుల్ల చంద్ర రే, సత్యేంద్రనాథ్ బోస్, జగదీష్ చంద్ర బోస్, డి.ఎన్. వాడియా, బీర్బల్ సహాని, మేఘనాథ్ సాహ లాంటివారు సుప్రసిద్ధ శాస్త్ర విజ్ఞానవేత్తలు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు