• facebook
  • whatsapp
  • telegram

నైసర్గిక స్వరూపాలు - హిమాలయ పర్వతాలు

* 1957లో సెన్సెస్‌ కమిషన్‌ రూపొందించిన అంచనాల ప్రకారం భారతదేశ మొత్తం భూభాగంలో...
పర్వత ప్రాంతం - 10.7%
కొండల ప్రాంతం - 18.6%
పీఠభూమి ప్రాంతం - 27.7%
మైదాన ప్రాంతం - 43.0% విస్తరించి ఉన్నాయి.


* భారతదేశాన్ని ప్రధానంగా 5 నైసర్గిక స్వరూపాలుగా విభజించవచ్చు.
అవి:
1. ఉత్తర ఉన్నత ప్రాంతాలు/ హిమాలయాలు
2. ఉత్తర మైదానాలు/ గంగా - సింధు మైదానం
3. ద్వీపకల్ప పీఠభూమి
4. తీర మైదానాలు
5. దీవులు


ఉత్తర ఉన్నత ప్రాంతాలు/ హిమాలయాలు
* భూవిజ్ఞానశాస్త్ర పలక విరూప కారక సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం హిమాలయాలు - గంగా - సింధు మైదానం విస్తరించి ఉన్న భూభాగంలో మధ్య మహాయుగ కాలంలో టెథీస్‌ సముద్రం అనే పెద్ద భూ అభినతి ఉండేది.
* ఈ టెథీస్‌ సముద్రానికి ఉత్తరాన ఉన్న భూభాగాన్ని అంగారా లేదా లారెన్షియా అని పిలిచేవారు.
* ఉత్తర అమెరికా, గ్రీన్‌లాండ్, రష్యా, ఐరోపా, ఆసియా ప్రాంతాలు ఈ అంగారా భూమిలో భాగంగా ఉండేవి.
* టెథీస్‌ సముద్రానికి దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా అని పిలిచేవారు.
* ఈ గోండ్వానా భూభాగంలో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా, భారత ద్వీపకల్ప ప్రాంతం భాగాలుగా ఉండేవి.
* గోండ్వానా భూభాగంలో ఉన్న భారత ద్వీపకల్ప ప్రాంతం ఉత్తరంగా చలనం చెందుతూ అంగారాలో భాగంగా ఉన్న యురేషియా పలకతో ఢీకొన్నాయి. దీనివల్ల అపారమైన సంపీడన బలాలు ఏర్పడి వీటి మధ్య ఉన్న టెథీస్‌ సముద్రంలోని నిక్షేప అవక్షేపాలు ముడతలు పడి ప్రస్తుతం ఉన్న హిమాలయ పర్వతాలుగా రూపాంతరం చెందాయి.
* ఇవి జమ్మూ - కశ్మీర్‌ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌ వరకు దేశానికి ఉత్తర సహజ సరిహద్దుగా ఒక చాపం లేదా విల్లు ఆకారంలో ఏర్పడ్డాయి.
* హిమాలయాలు సుమారు 2,400 కి.మీ. పొడవునా సింధు - బ్రహ్మపుత్ర నదుల గార్జుల మధ్య వాయవ్య - ఆగ్నేయ దిశగా విస్తరించి ఉన్నాయి.
* ప్రపంచంలోని ముడుత పర్వతాలన్నింటిలో చివరిగా ఏర్పడ్డాయి కాబట్టి హిమాలయాలను నవీన లేదా అతితరుణ ముడుత పర్వతాలు అంటారు.
* హిమాలయాల వెడల్పు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది. జమ్మూ కశ్మీర్‌లో వీటి వెడల్పు 500 కి.మీ., అరుణాచల్‌ప్రదేశ్‌లో 200 కి.మీ.
* హిమాలయాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలతో ఉన్నాయి.
 హిమాలయాలు ప్రధానంగా 3 సమాంతర శ్రేణులుగా విస్తరించి ఉన్నాయి.
అవి:
1. హిమాద్రి/ అత్యున్నత హిమాలయాలు
2. హిమాచల్‌/ నిమ్న హిమాలయాలు
3. శివాలిక్‌/ బాహ్య హిమాలయాలు


హిమాద్రి/ అత్యున్నత హిమాలయాలు
* హిమాలయ శ్రేణుల్లో ఉత్తరంగా ఉన్న అత్యున్నత శ్రేణి హిమాద్రి.
* హిమాద్రి శ్రేణి గ్రానైట్, షిస్ట్, నీస్‌ లాంటి స్ఫటికాకార రూపాంతర శిలలతో ఏర్పడింది.
* హిమాద్రి శ్రేణి సగటు ఎత్తు 6,100 మీటర్లు.
* ప్రపంచంలోని ఎత్తైన శిఖరాలు అన్నీ హిమాద్రి శ్రేణిలోనే ఉన్నాయి.
* ప్రపంచంలోని ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని నేపాల్‌లో సాగర్‌మాత, చైనాలో చోమోలుంగ్మా అని పిలుస్తారు.
* హిమాద్రి శ్రేణి అనేక హిమానీ నదాలకు పుట్టినిల్లు. మంచు పేరుకుపోవడం, హిమానీ నదాలు కరగడం లాంటి వార్షిక చక్రం ద్వారా అనేక జీవ నదులు ఆవిర్భవిస్తున్నాయి.


హిమాచల్‌/ నిమ్న హిమాలయాలు
* హిమాచల్‌ శ్రేణి హిమాద్రికి, శివాలిక్‌ కొండలకు మధ్య ఉంది.
* హిమాచల్‌ శ్రేణి సగటు ఎత్తు 4,500 మీటర్లు.
* హిమాచల్‌ శ్రేణిలో పొడవైంది కశ్మీర్‌లోని పిర్‌పంజల్‌ పర్వతశ్రేణి.
* ఈ పిర్‌పంజల్‌ పర్వతశ్రేణి నైరుతి భాగాన్ని దేలధార్‌ శ్రేణి అంటారు.
* హిమాచల్‌ శ్రేణి సతతహరిత శృంగాకార అరణ్యాలకు ప్రసిద్ధి.
* హిమాచల్‌ పర్వతాలు - హిమాద్రి మధ్య ప్రసిద్ధిగాంచిన కశ్మీర్‌లోయ ఉంది.
* హిమాచల్‌ శ్రేణి అనేక లోయలకు, వేసవి విడిది కేంద్రాలకు ప్రసిద్ధి.


శివాలిక్‌ కొండలు/ బాహ్య హిమాలయాలు
* హిమాలయాల్లో దక్షిణంగా విస్తరించి ఉన్న శ్రేణిని శివాలిక్‌ కొండలు అంటారు.
* ఇవి ప్రధానంగా హిమాలయ నదుల క్రమక్షయం వల్ల ఏర్పడిన ఇసుక, గ్రావెల్, కంగ్లామరేట్‌ లాంటి తృతీయ మహా యుగపు అవక్షేప శిలలతో కూడి ఉన్నాయి.
* శివాలిక్‌ కొండలు అయనరేఖా మండల తేమతో కూడిన ఆకురాల్చు అడవులతో నిండి ఉన్నాయి.
* శివాలిక్‌ శ్రేణిని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు. జమ్మూ ప్రాంతంలో జమ్మూ కొండలు, అరుణాచల్‌ప్రదేశ్‌లో మిష్మి కొండలు, అసోంలో కచార్‌ అని పిలుస్తారు.
* నిమ్న హిమాలయాలకు - శివాలిక్‌ కొండలకు మధ్య ఉన్న లోయలను స్థానికంగా డూన్‌లు అని పిలుస్తారు.
ఉదా: డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లీడూన్‌.


పూర్వాంచల్‌ పర్వతాలు
* హిమాలయాలు అరుణాచల్‌ ప్రదేశ్‌లో జడపిన్ను వంపు తీసుకుని దక్షిణానికి తిరిగి ఈశాన్య రాష్ట్రాలన్నింటిలోనూ విస్తరించి ఉన్నాయి.
* భారతదేశానికి తూర్పు సరిహద్దుగా ఉన్న ఈ పర్వతాలను ‘పూర్వాంచల్‌ పర్వతాలు’ అంటారు.
* పూర్వాంచల్‌ పర్వతాలను ఈశాన్య భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. 


పాట్‌కాయ్‌భమ్‌ కొండలు - అరుణాచల్‌ప్రదేశ్‌
నాగా కొండలు - నాగాలాండ్‌
మణిపూర్‌ కొండలు - మణిపూర్‌
మిజో కొండలు, లుషాయి కొండలు - మిజోరాం
కాశీ, గారో, జయంతియా కొండలు - మేఘాలయ
మికిర కొండలు - అసోం
త్రిపుర కొండలు - త్రిపుర
ట్రాన్స్‌ హిమాలయాలు
* హిమాద్రి/అత్యున్నత హిమాలయాలకు ఉత్తరంగా ఉన్న శ్రేణులను ‘ట్రాన్స్‌ హిమాలయాలు’ అంటారు.

 

ట్రాన్స్‌ హిమాలయాల్లో ఉన్న ముఖ్య శ్రేణులు
1. కారకోరం శ్రేణి
2. లఢక్‌ శ్రేణి
3. జస్కార్‌ శ్రేణి
4. హిందూకుష్‌ పర్వతాలు
5. కున్‌లూన్‌ పర్వతాలు
* కారకోరం పర్వతశ్రేణిలో ప్రపంచంలో రెండో ఎత్తైన K2 లేదా గాడ్విన్‌ ఆస్టిన్‌ పర్వత శిఖరం ఉంది. దీని ఎత్తు 8,611 మీటర్లు. దీన్నే ‘చోగోరి’ అని కూడా పిలుస్తారు.
* లఢక్, జస్కార్‌ పర్వత శ్రేణుల మధ్య సింధు నది ప్రవహిస్తుంది.
ఉత్తర మైదానాలు/ గంగా - సింధు మైదానం
* హిమాలయ పర్వతాలకు దక్షిణంగా, ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తరంగా ఉన్న మధ్యలోని లోతట్టు ప్రాంతం ప్లీస్టోసోన్‌ కాలం నుంచి ఇప్పటివరకూ హిమాలయ నదులు తీసుకువచ్చిన ఒండ్రు మట్టితో నిక్షేపితమై విశాలమైన మైదాన ప్రాంతంగా ఏర్పడింది.
* ఇక్కడ ప్రవహించే గంగా - సింధు నదుల పేరు మీదుగా ఈ మైదాన ప్రాంతానికి గంగా - సింధు మైదానం అనే పేరు వచ్చింది.
* గంగా - సింధు మైదానం సుమారు 7 లక్షల చ.కి.మీ. విస్తీర్ణంతో ఉంది.
* ఇది సింధు నది ముఖ ద్వారం నుంచి గంగా నది ముఖద్వారం వరకు సుమారు 3,200 కి.మీ. పొడవున విస్తరించి ఉంది.
* భారతదేశంలో దీని పొడవు సుమారు 2,400 కి.మీ.
* గంగా - సింధు మైదానాల వెడల్పు అత్యధికంగా ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అలహాబాద్‌ వద్ద (సుమారు 280 కి.మీ.), అతి తక్కువ వెడల్పు రాజ్‌మహల్‌ కొండల వద్ద (90 - 100 కి.మీ.) ఉంది.
* గంగా - సింధు మైదాన ప్రాంతంలో ప్రధానంగా నాలుగు రకాల భూస్వరూపాలు కనిపిస్తాయి.
1. భాబర్‌ నేలలు
2. టెరాయి నేలలు
3. భంగర్‌ నేలలు
4. ఖాదర్‌ నేలలు

 

భాబర్‌ నేలలు
* శివాలిక్‌ కొండల పాదాల వెంబడి విసనకర్ర ఆకారంలో ఉండే గుళకరాళ్లతో కూడిన సచ్చిద్ర మండలాన్ని భాబర్‌ అంటారు.
* సింధూ నది నుంచి తీస్తా నది వరకు ఈ ప్రాంతం విస్తరించి ఉంది.
* చిన్నచిన్న హిమానీ నదాలు ఈ ప్రాంతానికి వచ్చేటప్పటికి కనుమరుగైపోతాయి.
* వీటి వెడల్పు సుమారు 8 నుంచి 16 కి.మీ. వరకు ఉంటుంది.
* అసోంలో భాబర్‌ నేలలు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ‘డ్యూర్స్‌’ అని పిలుస్తారు.


టెరాయి నేలలు
* ఇవి భాబర్‌ నేలలకు దక్షిణంగా విస్తరించి ఉన్నాయి.
* భాబర్‌ ప్రాంతంలో ఇంకిపోయిన చిన్నచిన్న హిమానీ నదాలు భాబర్‌కు దక్షిణంగా మళ్లీ భూ ఉపరితలంపైకి వచ్చి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతంలో ఏర్పడిన చిత్తడి నేలలనే టెరాయి నేలలు అంటారు.
* ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు, అనేక వన్య మృగాలు ఉంటాయి.


భంగర్‌ నేలలు
* టెరాయి నేలలకు దక్షిణంగా ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మట్టిని భంగర్‌ నేలలు అంటారు.


ఖాదర్‌ నేలలు
* నదీ తీరానికి దగ్గరగా ఉండి, ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి మట్టి ఉన్న నేలలను ఖాదర్‌ నేలలు అంటారు. పంజాబ్‌ ప్రాంతంలో వీటిని ‘బెట్స్‌’ అని పిలుస్తారు.
ఈ నాలుగు రకాల భూ స్వరూపాలే కాకుండా గంగా - సింధు మైదానాల్లో ఉత్తర్‌ ప్రదేశ్, హరియాణా రాష్ట్రాల్లో చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగాలు ఉన్నాయి. వీటిని  రే/ కల్లార్‌ అంటారు. చవిటి నేలలు అని కూడా పిలుస్తారు. కార్బొనేట్, బైకార్బొనేట్‌ లాంటి లవణాల వల్ల ఇవి క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి.
* పంజాబ్‌లోని శివాలిక్‌ కొండల పాదాల వద్ద ఏర్పడే చిన్నచిన్న నీటి గుంటలను ‘చోస్‌’ అని పిలుస్తారు.


గంగా - సింధు మైదానం విస్తరించి ఉన్న ప్రాంతాలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
పంజాబ్‌ - హరియాణా మైదానాలు
* ఈ ప్రాంతంలో రావి, బియాస్, సట్లెజ్‌ నదులు ప్రవహిస్తున్నాయి.
* ఈ ప్రాంతం ప్రధానంగా దోఆబ్‌లకు ప్రసిద్ధి.
* రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతాన్ని 'దోఆబ్‌' అంటారు.


రాజస్థాన్‌ మైదానాలు
* దీన్నే మరుస్థలి ప్రాంతం, రాజస్థాన్‌ భగర్‌ అని కూడా అంటారు.
* ఈ మైదాన ప్రాంతంలోనే థార్‌ ఎడారి విస్తరించి ఉంది.
* ఈ ప్రాంతంలోని ఉప్పునీటి కయ్యలను ‘రన్స్‌’ అని పిలుస్తారు.


గంగా మైదానం
* ఇది యమునా నది నుంచి గంగా నది ముఖ ద్వారం వరకు విస్తరించి ఉంది.
* ఈ ప్రాంతంలో ఉన్న అతిపెద్ద దోఆబ్‌ ‘గంగా యమున దోఆబ్‌’.
* ఈ ప్రాంతాన్ని ఎగువ, మధ్య, దిగువ గంగా మైదానాలుగా విభజించవచ్చు.
* ఎగువ గంగా మైదాన ప్రాంతం ఉత్తర్‌ ప్రదేశ్‌లో, మధ్య గంగా మైదానం ఉత్తర్‌ ప్రదేశ్, బిహార్‌లో, దిగువ గంగా మైదానం పశ్చిమ్‌బంగలో విస్తరించి ఉంది.
* ఎగువ గంగా మైదానం వాలు ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఎక్కువగా ఉండటం వల్ల వరదలు అధికంగా సంభవిస్తాయి.
* మధ్య గంగా మైదానంలో ఉన్న బిహార్‌లోని కోసి నదిని ‘బిహార్‌ దుఃఖదాయని’ అని పిలుస్తారు.
* ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా అయిన సుందర్‌బన్స్‌ ప్రాంతం దిగువ గంగా మైదానంలో ఉన్న పశ్చిమ్‌ బంగ, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది.


బ్రహ్మపుత్ర మైదానం
* అసోం ప్రాంతంలోని మైదానాన్ని బ్రహ్మపుత్ర మైదానం అంటారు.
* ఇది సాధియా నుంచి దుబ్రి వరకు విస్తరించి ఉంది.
* ఈ ప్రాంతం నదీ క్రమక్షయాలకు ప్రసిద్ధి.
* ఈ మైదాన ప్రాంతంలోనే బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడిన నదీ ఆధార ‘మజులీ దీవి’ ఉంది.


ద్వీపకల్ప పీఠభూమి
భారతదేశంలోనే అత్యంత ప్రాచీన శిలలతో కూడిన ప్రాంతం ద్వీపకల్ప పీఠభూమి. ఇది అగ్నిశిలలు, రూపాంతర శిలలతో కూడి గోండ్వానా భూమిలో భాగంగా ఉండేది. సుమారు 16 లక్షల చ.కి.మీ. విస్తీర్ణం కలిగిన ఈ పీఠభూమి  దేశంలోనే అతి పెద్ద భౌతిక విభాగం.
ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులు
వాయవ్యాన - ఆరావళి పర్వతాలు; ఉత్తరాన బుందేల్‌ ఖండ్‌ ఉన్నత భూమి అంచు; ఈశాన్యంలో రాజ్‌మహల్‌ కొండలు; పడమటి అంచులో పశ్చిమ కనుమలు, తూర్పు అంచున తూర్పు కనుమలు సరిహద్దులుగా ఉన్నాయి.
* ఈ బృహత్‌ ద్వీపకల్పాన్ని ప్రధానంగా ఉత్తరాన మాల్వా పీఠభూమి, దక్షిణాన దక్కన్‌ పీఠభూమి అని రెండు ప్రాంతాలుగా విభజించవచ్చు.
* మాల్వా పీఠభూమి నర్మదా నది పగులు లోయకు ఉత్తరంగా ఉంది.
* ఈ పీఠభూమికి వాయవ్యంగా ఆరావళి పర్వతాలు, దక్షిణంగా వింధ్య పర్వతాలు విస్తరించి ఉన్నాయి.
* ప్రాచీన కాలంలో అగ్నిపర్వత ఉద్భేదనం జరిగినప్పుడు లావాపటలాలు ఒకదానిపై మరోటి పేరుకుపోవడం వల్ల దక్కన్‌ పీఠభూమి ఏర్పడింది. ఇది క్రమరహిత త్రిభుజాకారంగా విస్తరించి ఉంది.
* ఈ పీఠభూమి వాయవ్యం నుంచి ఆగ్నేయానికి వాలి ఉండటం వల్ల ఈ ప్రాంతం నుంచి ప్రవహించే మహానది, గోదావరి, కృష్ణ, తుంగభద్ర లాంటి నదులన్నీ తూర్పువైపుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
* దక్కన్‌ పీఠభూమిని మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ పీఠభూములుగా విభజించవచ్చు.
* మహారాష్ట్ర పీఠభూమి ప్రాంతం నాప స్థలాకృతిని కలిగి ఉంది.
* దక్కన్‌ పీఠభూమికి దక్షిణాన ఉన్న కర్ణాటక పీఠభూమి గ్రానైట్‌ శిలలతో ఏర్పడింది.
* తెలంగాణ పీఠభూమి ప్రధానంగా ఆర్కియన్‌ శిలలతో ఏర్పడింది.
* మేఘాలయ ప్రాంతంలో విస్తరించి ఉన్న పీఠభూమి ప్రాంతాన్ని షిల్లాంగ్‌ పీఠభూమి అంటారు.
* ఝార్ఖండ్, చత్తీస్‌గఢ్, పశ్చిమ్‌ బంగ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పీఠభూమి ప్రాంతాన్ని ఛోటానాగ్‌పూర్‌ పీఠభూమి అని పిలుస్తారు.
* ఛోటానాగ్‌పూర్‌ పీఠభూమి అనేక ఖనిజాలకు, బొగ్గు గనులకు ప్రసిద్ధి. అందుకే ఈ ప్రాంతాన్ని ‘రూర్‌ ఆఫ్‌ ఇండియా’ అని పిలుస్తారు.


 తీరమైదానాలు
* భారత తీరరేఖ పొడవు (దీవులతో కలుపుకుని) సుమారు 7,516 కి.మీ.
* భారతదేశ ప్రధాన భూభాగాన్ని ఆనుకుని ఉన్న తీరమైదానం పొడవు సుమారు 6,100 కి.మీ.
* భారత ద్వీపకల్ప భూభాగాన్ని ఆనుకుని ఉన్న తీరమైదానాన్ని ప్రధానంగా
1. తూర్పు తీరమైదానం
2. పశ్చిమ తీరమైదానం అని విభజించవచ్చు.


తూర్పు తీరమైదానం
* ఇది ఉత్తరాన హల్దియా నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు విస్తరించి ఉంది.
* తూర్పు తీరమైదానం ప్రధానంగా తూర్పు కనుమలకు - బంగాళాఖాతానికి మధ్య విస్తరించి ఉంది.
* గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా లాంటి నదులు డెల్టాలు ఏర్పరచడం వల్ల పశ్చిమ తీరమైదానంతో పోలిస్తే తూర్పుతీర మైదానం వెడల్పు ఎక్కువ.
* తూర్పు తీరంలో ఉన్న ఈ డెల్టాలను దక్షిణ భారతదేశ ధాన్యాగారాలు అని పిలుస్తారు.


తూర్పు తీరంలో ఉన్న ప్రధాన డెల్టాలు
* మహానది డెల్టా - ఒడిశా
* కృష్ణ, గోదావరి డెల్టా - ఆంధ్రప్రదేశ్‌
* కావేరి డెల్టా - తమిళనాడు
* తూర్పు తీరంలో పొడవైన తీరరేఖ ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు.
* తూర్పు తీరమైదానాన్ని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో పిలుస్తారు.
1. పశ్చిమ్‌ బంగ - వంగతీరం
2. ఒడిశా - కళింగ తీరం/ఉత్కళ్‌ తీరం
3. ఆంధ్రప్రదేశ్‌ - కోస్తా తీరం/సర్కార్‌ తీరం
4. తమిళనాడు - కోరమండల్‌ తీరం


వంగ తీరమైదానం
* దీన్నే బెంగాల్‌ తీరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గంగానది డెల్టా ఉంది.
* ప్రపంచంలోనే పెద్ద అడవులైన ‘సుందర్‌బన్స్‌’ ఈ తీరమైదానంలోనే ఉన్నాయి.


కళింగ తీరమైదానం
* కళింగ తీరమైదానంలో ఉన్న ప్రముఖ డెల్టా మహానది.
* కళింగ తీరంలోని కోణార్క్‌ వద్ద ఉన్న చంద్రభాగ బీచ్‌ ఆసియాలోనే మొదటి బ్లూఫ్లాగ్‌ బీచ్‌.
* ఈ తీర మైదానంలోనే సిమ్లిపాల్‌ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, చిల్కా సరస్సు అనే లాగూన్‌ ఉంది. దేశంలో రెండో మిస్సైల్‌ లాంచింగ్‌ పాడ్‌ వీలర్‌ ఐలాండ్‌ ఈ సరస్సులోనే ఉంది.


సర్కార్‌ తీరమైదానం
* ఇది పులికాట్ సరస్సు నుంచి ఉత్తరాన ఉన్న ఉత్కళ్‌ తీరం వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించి ఉంది.
* దీన్ని కుతుబ్‌షాహీల కాలంలో గోల్కొండ తీరం అని పిలిచేవారు.
* తూర్పు తీరమైదానంలోని కృష్ణ - గోదావరి నదుల మధ్య ఉన్న పల్లపు ప్రదేశంలో కొల్లేరు సరస్సు ఏర్పడింది. ఇది మంచినీటి సరస్సు. దీని విస్తీర్ణం 250 చ.కి.మీ. ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల మధ్య ఉంది.
* కోస్తా, కోరమండల్‌ తీరమైదాన సరిహద్దుల్లో పులికాట్‌ అనే ఉప్పునీటి సరస్సు ఉంది. ఇది ఒక లాగూన్. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉంది. శ్రీహరికోట ఈ సరస్సులోని ప్రముఖ దీవి.
* శ్రీహరికోటలో సతీష్‌ధావన్‌ రాకెట్‌ ప్రయోగకేంద్రం ఉంది.


కోరమండల్‌ తీరం
* ఇది తమిళనాడులో పులికాట్‌ సరస్సు నుంచి రామేశ్వరం వరకు విస్తరించి ఉంది. ఈ తీరంలోనే కావేరి డెల్టా ఉంది.


దీవులు
* భారతదేశంలో మొత్తం 247 దీవులు ఉన్నాయి.
* వీటిలో 204 దీవులు బంగాళాఖాతంలోనూ; మిగిలినవి అరేబియా మహాసముద్రం, మన్నార్‌ సింధు శాఖల్లో ఉన్నాయి.
* అరేబియా సముద్రంలో ఉన్న దీవులను లక్షదీవులు,  బంగాళఖాతంలో ఉన్న దీవులను అండమాన్, నికోబార్‌ దీవులు అని పిలుస్తారు.


లక్షదీవులు
* ఇవి ప్రవాళ భిత్తికలతో ఏర్పడిన దీవులు. అందుకే వీటిని పగడపు దీవులు అని కూడా పిలుస్తారు. ఇవి 36 దీవుల సముదాయం. వీటి విస్తీర్ణం సుమారు 32 చ.కి.మీ. ఇది అత్యధిక అక్షరాస్యత ఉన్న కేంద్రపాలిత ప్రాంతం.
* లక్షదీవుల రాజధాని కవరత్తి.
* ఇక్కడి ప్రధాన పంట కొబ్బరి.
* దీనికి సమీపంలో ఉన్న దేశం మాల్దీవులు.


అండమాన్‌ - నికోబార్‌ దీవులు
* భారతదేశంలో అతిపెద్ద ఆర్చిపెలాగో అండమాన్‌ నికోబార్‌ దీవులు. ఇవి అగ్నిపర్వత సంబంధిత దీవులు.
* ఈ దీవుల రాజధాని పోర్ట్‌బ్లెయిర్‌. వీటి విస్తీర్ణం సుమారు 8249 చ.కి.మీ.
* ఇక్కడి ప్రధాన అగ్నిపర్వతాలు బారెన్, నార్కొండం.
* ఇటీవలి కాలంలో వార్తల్లోకెక్కిన అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని ఆదిమవాసీ తెగ సెంటినలీస్‌.
* అండమాన్‌ దీవులను, నికోబార్‌ దీవులను వేరుచేస్తున్న ఛానల్‌ 10º ఛానల్‌.
* 1943 డిసెంబరు 30న సుభాష్‌ చంద్రబోస్‌ అండమాన్, నికోబార్‌ దీవులకు షాహిద్, స్వరాజ్‌ ద్వీపాలుగా పేరుపెట్టారు.
* సుభాష్‌ చంద్రబోస్‌ గౌరవార్థం ప్రధాని నరేంద్రమోదీ 2018 డిసెంబరు 30న పోర్టుబ్లెయిర్‌ను సందర్శించి పలు ద్వీపాలకు పేర్లు మార్చారు.


రాస్‌ ఐలాండ్‌ - నేతాజీ సుభాస్‌ చంద్రబోస్‌ ద్వీప్‌
నీల్‌ ఐలాండ్‌ - షహిద్‌ ద్వీప్‌
హేవ్‌లాక్‌ ఐలాండ్‌ - స్వరాజ్‌ద్వీప్‌


థార్‌ ఎడారి
* భారత ఉపఖండంలో అతిపెద్ద ఎడారి థార్‌ ఎడారి. ఇది ఆరావళి పర్వతాలకు వెనుక భాగంలో, భారతదేశానికి పశ్చిమాన భారత్, పాకిస్థాన్‌లలో సుమారు 2 లక్షల చ.కి.మీ.లలో విస్తరించి ఉంది.
* థార్‌ ఎడారిలోని అధికభాగం రాజస్థాన్‌లో; హరియాణా, పంజాబ్‌లలో కొద్ది ప్రాంతం విస్తరించి ఉంది.
* ఈ ప్రాంతంలో వార్షిక వర్షపాతం తక్కువగా ఉండటం వల్ల ముళ్లపొదలు లాంటి జీరోఫైటిక్‌ వృక్షాలు కనిపిస్తాయి. ఇక్కడ జోధ్‌పూర్, జైసల్మేర్, బికనీర్‌ లాంటి భారతదేశపు జనపదాలు నెలకొని ఉన్నాయి.
* రాజస్థాన్‌కు పశ్చిమాన ఉన్న థార్‌ ఎడారి ప్రాంతాన్నే ‘మరుస్థలి’ అని కూడా అంటారు.
* పవన నిక్షేపణ చర్య వల్ల ఇక్కడ ఏర్పడే ఇసుక దిబ్బలను డ్రెయిన్స్‌ అంటారు.
* మరుస్థలికి తూర్పుగా ఆరావళి పర్వతాల మీదుగా విస్తరించి ఉన్న అర్ధ శుష్క శీతోష్ణస్థితి ఉన్న ప్రాంతాన్ని రాజస్థాన్‌ భగర్‌ అంటారు.
* ఈ ప్రాంతంలో ప్లాయాలు/దాండియాలు అనే ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి.
ఉదా: సాంభర్‌ సరస్సు
* ఈ ప్రాంతంలో ఉండే తాత్కాలిక నీటి ప్రవాహాలను రోహీలు అంటారు.
ఉదా: లూని, బాని నదులు.
* ఎడారి నేలల పరిశోధనా కేంద్రం జోధ్‌పూర్‌లో ఉంది.
* ఈ ప్రాంతంలో లిగ్నైట్, సహజవాయువు, జిప్సం, సున్నపురాయి లాంటి ఖనిజాలు ఇటీవలే బయటపడ్డాయి.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌