• facebook
  • whatsapp
  • telegram

 సహజ ఉద్భిజ సంపద

అడవులు సహజమైన, అపార విలువ ఉన్న విశిష్ట వనరులు. మానవ అవసరాలకు ఉపయోగపడే అనేక వస్తువులు అడవుల నుంచి లభిస్తాయి. ప్రపంచ భూభాగంలో నాలుగింట ఒక వంతు అడవులు ఉన్నా, అవి అన్ని ఖండాల్లో సమానంగా వ్యాపించిలేవు. దీనికి ప్రధాన కారణాలు: వాతావరణంలోని తారతమ్యాలు, మనిషికి అవసరమైన ఆహారం, వంట చెరకు, కలప, ఔషధాలు, ఫలాల సేకరణ, ఇతర అవసరాల కోసం అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం.


భారతదేశంలోని సహజ ఉద్భిజ సంపద అధికంగా ఉష్ణ, సమశీతోష్ణ మండలాలకు చెందింది.
    అడవులను ఆంగ్లంలో ‘ఫారెస్ట్‌’ అంటారు. ఫారెస్ట్‌ అనే పదం ‘ఫారీస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. అంటే ‘గ్రామం వెలుపల ఉన్న అటవీ సముదాయం’ అని అర్థం. అడవుల అధ్యయనాన్ని ‘సిల్వాలజీ’  (Silvology)  అని, అటవీ మొక్కల పెంపకాన్ని ‘సిల్వికల్చర్‌’ అని అంటారు. ఏటా మార్చి 21న ప్రపంచ అటవీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అడవుల అభివృద్ధి - సంరక్షణ, జీవవైవిధ్య పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 2014 ఫిబ్రవరి 24న ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని 2016లో ప్రారంభించిన 8 జాతీయ మిషన్‌లలో విలీనం చేశారు.


అడవులు - రకాలు
    భారతదేశంలోని కొంత భాగం అడవుల్లో ఒకే రకమైన చెట్లు; ఎక్కువ విస్తీర్ణంలోని అడవుల్లో వివిధ రకాల చెట్లు పెరుగుతాయి.కారణం - మన దేశ భౌగోళిక వైశాల్యంలో అధికభాగం అడవులపై ఉష్ణమండల సమశీతోష్ణ పరిస్థితి ప్రభావం ఉంటుంది. అందుకే శీతోష్ణస్థితి అంశాలైన ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా అడవులు పెరుగుతాయి.
    భారతదేశంలో మొదటిసారిగా 1936లో హెచ్‌.జి.చాంపియన్, ఎస్‌.కె.సేథ్‌ అటవీ రకాలను వర్గీకరించారు. ఆ తర్వాత వీరే 1968 లో ‘రివైజ్డ్ సర్వే ఆఫ్‌ ఫారెస్ట్‌ టైప్స్‌ ఆఫ్‌ ఇండియా’ అనే పేరుతో శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని అనుసరించి భారతీయ అడవులను 5 ప్రధాన సమూహ రకాలుగా, 16 శీతోష్ణస్థితి రకాల అడవులుగా, సుమారు 200 రకాల ఉప గ్రూపులుగా వర్గీకరించారు. ఈ వర్గీకరణను డెహ్రాడూన్‌లోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌’ (ICFRE) ఆమోదించింది.  
    2012లో డెహ్రాడూన్‌లోని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా  (FIS) ఫారెస్ట్‌ రకపు అట్లాస్, డిజిటైజింగ్‌ ఫారెస్ట్‌ టైప్‌ ఆఫ్‌ ఇండియాను అమల్లోకి తెచ్చింది. 2012 లో రష్యాలో నిర్వహించిన వరల్డ్‌ హెరిటేజ్‌ కమిటీ 36వ సెషన్‌లో ‘పశ్చిమ కనుమల’ను యునెస్కో (UNESCO) హెరిటేజ్‌ సైట్‌గా గుర్తించింది.


సతత హరితారణ్యాలు 
    సతత హరితారణ్యాలు (Evergreen Forests) అధిక వర్షపాతం ్బ200 సెం.మీ.కంటే ఎక్కువ) ఉన్న ప్రాంతాల్లో ఏడాది పొడవునా పెరుగుతాయి. ఈ అరణ్యాల్లోని చెట్లు వెడల్పైన ఆకులతో 45 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ రకం దట్టమైన అడవులు భూమధ్యరేఖ ప్రాంత శీతోష్ణస్థితిలో ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే అధిక విస్తీర్ణంలో ఉన్న అమెజాన్‌ అడవులు ఈ రకానికి చెందినవే. ఈ అడవులు దట్టంగా ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే కాంతి/వెలుతురు 2% మాత్రమే కిందికి చేరుతుంది. అందుకే అడవి మొత్తం చీకటిగా ఉండి, జీవజాతులకు అనుకూలంగా మారింది. సతతహరితారణ్యాలు ఒకదానితో ఒకటి బాగా అల్లుకుపోయి అర్ధచంద్రాకారంలో కనిపిస్తాయి. వీటినే ‘కనోపి’ అంటారు. భారతదేశంలో ఈ రకమైన అడవులు పశ్చిమ కనుమలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఈశాన్య అసోం, బెంగాల్, హిమాలయ పర్వతాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా మహాగని, ఎబోని, రోజ్‌వుడ్, ఐరన్‌ఉడ్, వెదురు, పామ్స్‌ జాతులు, సింకోనా, రబ్బరు, సిడార్, ఎయిని, కదంబం, దేవదారు మొదలైన వృక్షాలు పెరుగుతాయి. ఈ అడవుల నుంచి లభించే కలపను రైలు, భవన నిర్మాణాలు, ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రకమైన అడవులు లేవు.


ఆకురాల్చే అరణ్యాలు 
    ఆకురాల్చే అడవులు (Deciduous Forests) రుతుపవన ప్రభావ శీతోష్ణస్థితి ఆధారంగా, 100  200 సెం.మీ. వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. భారతదేశంలో వర్షాలు ఒక కాలంలో కురిసి, మిగతా కాలాల్లో కురవవు. అందుకే వేసవి (వసంత రుతువు) కాలంలో అడవులు ఆకులు రాలుస్తాయి. కాబట్టి వీటిని రుతుపవన/ ఆకురాల్చే/ బోడి అడవులు అని పిలుస్తారు. మనదేశంలో అత్యధికంగా ్బ65  శాతానికి పైగా) ఈ రకానికి చెందిన అడవులు ఉన్నాయి. ఇవి ఆర్థిక వనరుల రీత్యా, వాణిజ్యపరంగా అత్యంత ఉపయోగకరం. గృహోపకరణాలు, పనిముట్ల తయారీలో ఈ అడవుల నుంచి లభించే కలపను అధికంగా వినియోగిస్తారు. శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని అనుసరించి భారతదేశం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ రకమైన అడవులను స్థూలంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.


ఎ) అధిక వర్షం కురిసే ఆర్ధ్రత ఆకురాల్చే అడవులు: ఈ రకమైన అడవులు పశ్చిమ, తూర్పు కనుమలు, ఈశాన్య రాష్ట్రాలు, శివాలిక్‌ కొండలు, చోటా నాగ్‌పుర్‌ పీఠభూమి ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, తూర్పు గోదావరి, కర్నూలు, కడప, తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో అధికంగా పెరుగుతాయి. ఈ అడవుల్లో అధికంగా టేకు, సాల్, వెదురు, ఇప్ప, జిట్టెగి, యూకలిప్టస్‌ (నీలగిరి) చెట్లు పెరుగుతాయి.


బి) తక్కువ వర్షం కురిసే అనార్ధ్ర ఆకురాల్చే అడవులు: ఇవి అధికంగా ద్వీపకల్ప పీఠభూమి ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, శ్రీకాకుళం, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా శ్రీగంధం, మంచిగంధం, ఎర్రచందనం, ఇరుగుడు చెట్లు పెరుగుతాయి.


వర్షాభావ ప్రాంత అరణ్యాలు 
    అల్ప వర్షపాతం ఉన్న  (50-70 సెం.మీ.) ప్రాంతాల్లో వర్షాభావ ప్రాంత అడవులు  (Scrub Forests) పెరుగుతాయి. ఇవి రెండు రకాలు:
ఎ) చిట్టడవులు: 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉన్న పర్వత, కొండ, పీఠభూమి ప్రాంతాల్లో, వర్షచ్ఛాయ ప్రాంతాలైన ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం, గుంటూరు; తెలంగాణలోని నల్గొండ, మెదక్, నిజామాబాద్‌ జిల్లాల్లో ఈ రకం అడవులు పెరుగుతాయి. ఈ అడవుల్లో ప్రధానంగా పనిముట్ల తయారీ, వంటచెరకుకు ఉపయోగపడే వేప, మర్రి, సుబాబుల్, తంగేడు, మోదుగ, పాలకొడిశ చెట్లు పెరుగుతాయి.


బి) ముళ్ల అడవులు: 50 సెం.మీ. కంటే ఎక్కువ వర్షం కురిసే ప్రాంతాల్లో ఈ అడవులు పెరుగుతాయి. ప్రధానంగా రాజస్థాన్‌ ఎడారి ప్రాంతం, పంజాబ్, హరియాణా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ అడవులు కనిపిస్తాయి. ముళ్ల అడవుల్లో పెరిగే చెట్లు మందంగా ఉండి, ఎండను తట్టుకుంటాయి. వీటినే గ్జెరోఫైటిక్‌ లక్షణాలు ఉన్న అడవులు అంటారు. ఇందులో ప్రధానంగా తుమ్మ, ముళ్ల పొదలు, బాబుల్, జంద్, టమారిక్స్, షిషకు, నాగజెముడు, బ్రహ్మజెముడు, రేగు, బలుసు చెట్లు పెరుగుతాయి.


క్షార జలారణ్యాలు 
    క్షార జలారణ్యాలు (Mangrove Forests) వర్షంతో సంబంధం లేకుండా సముద్ర తీర ప్రాంతాలు  (Littoral), నదీ ముఖద్వారాల్లో ఉప్పు నీరు నిల్వ ఉన్న బురద నేలల్లో పెరుగుతాయి. అందువల్ల వీటిని టైడల్‌ లేదా మాంగ్రూవ్‌ లేదా క్షార జలారణ్యాలు అంటారు. ఇవి దేశంలో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కోరింగా ప్రాంతం, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలో ఇవి ఉన్నాయి. మాంగ్రూవ్స్‌ నుంచి సేకరించిన కలపను నావలు, కాగితం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.
    మన దేశంలో మాంగ్రూవ్‌ అడవులు అత్యధికంగా పశ్చిమ్‌బెంగాల్, గుజరాత్, అండమాన్‌లో అత్యల్పంగా కేరళ, కర్ణాటక, గోవాలో విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో ప్రధానంగా సుంద్రి, పుస్సార్, ఉరడ, మొగలి, పొన్న, పొనికి, ఫేము, కాజురైనా చెట్లు పెరుగుతాయి.


పర్వత ప్రాంత అడవులు 
    ఎత్తు, శీతోష్ణస్థితి, వర్షపాతాన్ని బట్టి, ఉష్ణోగ్రతలు మారడం వల్ల పర్వత ప్రాంత అడవులు (Mountain Forests) ధ్రువ, ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో పెరుగుతాయి. భారతదేశంలో అధికంగా హిమాలయ పర్వతాల్లో, అసోం నుంచి లద్దాఖ్‌ వరకు అక్కడక్కడ, నీలగిరి పర్వతాల్లో పెరుగుతాయి. ఈ అడవుల నుంచి లభించే కలపను ఎక్కువగా నగిషీ వస్తువులు, హస్తకళలు, ఔషధాల తయారీలో వినియోగిస్తారు. ఈ అడవుల్లో ఎత్తుకు వెళ్లే కొద్ది వేర్వేరు వృక్షజాతులు పెరుగుతాయి.


మాంగ్రూవ్స్‌ విస్తరించి ఉన్న ప్రాంతాలు
* పశ్చిమ్‌బెంగాల్‌ - సుందర్బన్‌ డెల్టా
* ఒడిశా - బితర్‌కనిక
* ఆంధ్రప్రదేశ్‌ - కోరింగా 
* తమిళనాడు - పిచ్చావరం
* కేరళ - వెంబనాడ్‌
* కర్ణాటక - కార్వార్‌
* మహారాష్ట్ర - ముంబయి, థానే, రత్నగిరి
* గుజరాత్‌ - కచ్‌ ప్రాంతం
* అండమాన్‌ - భరతాంగ్‌ దీవులు


ఎత్తు (అడుగుల్లో)  - అరణ్యాలు
* 5000   ఉష్ణమండల అరణ్యాలు
* 9000   సతత హరితారణ్యాలు
* 12,000   శృంగాకారపు అరణ్యాలు
* 14,000   టండ్రా అడవులు
* 15,000   మంచుతో కూడిన శిఖరాలు
* ఈ అడవుల్లో ప్రధానంగా పైౖన్, సల్రాస్, లార్చ్, బిర్చ్, దేవదారు, చెస్ట్‌నట్, వాల్‌నట్, మేఫిల్, విల్లోబ, మల్బరీ, పాప్లర్, సిల్వర్‌ఫర్, జానీఫర్, రోడోడింట్రిన్‌ లాంటివి పెరుగుతాయి.


అటవీ సంపద - కలప ఉత్పత్తులు
తమంతట తామే వృద్ధి చెందే వృక్ష సమూహాన్ని సహజ వృక్షసంపద అంటారు. ఈ సంపదను అడవులు, పచ్చిక బయళ్లు, ఎడారులుగా వర్గీకరించవచ్చు. అడవుల నుంచి మనకు అనేక రకాలైన వస్తువులు లభిస్తాయి. అటవీ సంపదను ప్రధాన, గౌణ ఉత్పత్తులుగా పేర్కొంటారు.
* సిల్వర్‌ ఫర్‌ - మెత్తగా, తెలుపురంగులో ఉంటుంది. దీన్ని ప్యాకింగ్‌ కాగితం, అగ్గిపెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.
* దేవదారు - గోధుమరంగులో ఉండి రైలు పరిశ్రమలో ఉపయోగపడుతుంది. ఇది పుష్పించని వృక్షం.
* బ్లూపైన్‌ - ఊదారంగులో ఉంటుంది. దీన్ని భవన నిర్మాణంలో ఉపయోగిస్తారు.
* టేకు - దీన్ని గృహ నిర్మాణం, పరికరాలు, ఓడల తయారీ, వంతెనల నిర్మాణంలో వాడతారు.
* సాల్‌ - ఈ కలపను రైల్వే స్లీపర్లకు ఉపయోగిస్తారు.
* షీషమ్‌ - దీన్ని సిస్సో చెట్టు అంటారు. దీని కలపను బండ్లు, పడవల తయారీలో వినియోగిస్తారు.
* చీర్‌ - ఇది ఎరుపుతో కూడిన గోధుమరంగులో ఉంటుంది. తేయాకు నిల్వపెట్టెలు, రేసిన్, టర్పంటైన్‌ తయారీలో వాడతారు.
* మంచి గంధం - పసుపు వర్ణంతో కూడిన గోధుమరంగులో ఉంటుంది. సుగంధ పరిమళాలు, అగరువత్తుల తయారీలో వాడతారు.
* ఎర్ర చందనం - దీన్ని జంత్ర వాయిద్యాలు, రంగుల తయారీలో వినియోగిస్తారు.
* సెమూల్‌ - దీన్ని ఆట వస్తువులు, ప్యాకింగ్‌ సామాన్ల తయారీలో వాడతారు.
* హల్దా - పసుపుపచ్చ రంగులో ఉంటుంది. దీన్ని సిగరెట్‌ పెట్టెల తయారీలో ఉపయోగిస్తారు.
* రోజ్‌వుడ్‌ - దీన్ని అలంకరణ సామగ్రి, తుపాకులు, చెస్‌ కాయిన్స్, రైలు పెట్టెల తయారీకి వాడతారు.
* లక్క - దీన్ని వార్నిష్, గ్రామ్‌ఫోన్‌ రికార్డ్‌ తయారీ, ప్రింటింగ్‌ ఇంక్‌లో, ఉత్తరాలు సీలు వేసేందుకు ఉపయోగిస్తారు. లక్కకు ఝార్ఖండ్‌ ప్రసిద్ధి.
* కరక్కాయలు - రంగులు, మందుల తయారీలో ఉపయోగిస్తారు.
* గుగ్గిలం - కాగితం, సబ్బు పరిశ్రమ, టర్పంటైన్‌ తయారీలో వినియోగిస్తారు. 

Posted Date : 17-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌