• facebook
  • whatsapp
  • telegram

మొండి బకాయిలు (లేదా)  నిరర్థక ఆస్తులు

భారతదేశ బ్యాంకింగ్‌ రంగాన్ని కేంద్రబ్యాôకైన ఆర్‌బీఐ నిర్దేశిస్తుంది. ద్రవ్య స్థిరత్వ నివేదికల ద్వారా ద్రవ్య వ్యవస్థలో దుర్బర సంకేతాల గురించి ఇది ముందస్తు అవగాహన కల్పిస్తుంది. ద్రవ్య వ్యవస్థలోని సవాళ్లను ఆర్థిక వ్యవస్థ ఎలా తట్టుకుంటుందనే అంశంపై కూడా నివేదిక ఇస్తుంది. భారతీయ వాణిజ్య బ్యాంక్‌లు ఏటా లక్షల కోట్లు అప్పులు ఇస్తాయి. వాటిలో కొన్ని తిరిగిరావు. ఈ పరిస్థితి మరింత పెరగడాన్ని బ్యాంకింగ్‌ పరిభాషలో ‘రుణాల నాణ్యత’ తగ్గడం అంటారు.

బ్యాంక్‌ల నుంచి తీసుకున్న రుణాలకు వరుసగా మూడు నెలలు వాయిదా చెల్లించకపోతే వాటిని మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు (Non-Performing Assets-NPA) లేదా పారుబాకీలు అంటారు. ఒక బ్యాంక్‌ చెల్లించిన రుణాల మొత్తం, దాని నిరర్థక ఆస్తుల మొత్తానికి మధ్య ఉన్న నిష్పత్తిని బట్టి ఆ బ్యాంక్‌ ఆర్థికంగా ఎంత మెరుగ్గా ఉందో తెలుస్తుంది. భారతదేశ బ్యాంక్‌లు ఇచ్చే రుణాల్లో అధికభాగం అయిదు రంగాలకే వెళ్తున్నాయి. అవి:

1. మౌలిక వసతుల కల్పన (ఉదా: రవాణా, నీటిపారుదల, విద్యుత్‌ శక్తి మొదలైనవి.)

2. ఇనుము-ఉక్కు, విద్యుత్, వజ్రాలు, రత్నాభరణాలు

3. జౌళి రంగం, స్పిన్నింగ్‌ మిల్లులు, వస్త్ర పరిశ్రమలు

4. పౌర విమానయానం

5. గనులు, నిర్మాణ రంగం మొదలైనవి.

‣ బ్యాంక్‌లు గతంలో ఇచ్చిన రుణాలను పునరుద్ధరించి వాటిని కొత్త రుణాలుగా నమోదు చేసుకుంటాయి. వీటిలో అధికభాగం పారిశ్రామిక రంగానిదే. కానీ ఈ రంగంలో తిరోగమన పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరోవైపు మొండిబాకీలు, పునర్‌వ్యవస్థీకరించిన రుణాలు పైన పేర్కొన్న అయిదు రంగాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ రంగాల్లో ఇప్పటికీ ఎక్కువగా ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఏదైనా ఒక పెద్ద కంపెనీ లేదా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో సంక్షోభం తలెత్తితే, దాని ప్రభావం మొత్తం బ్యాంకింగ్‌ రంగంపై పడుతుంది.

ఆర్థిక దుస్థితి ప్రభావం

‣ 2020 - 21 ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం 2018 - 19 జీడీపీలో మనదేశ పొదుపురేటు 30.1 శాతంగా ఉంది. 2020 - 21 ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాది మనదేశ జీడీపీలో ప్రస్తుత ఖాతాలోటు (కరెంట్‌ అకౌంట్‌ డెఫిసిట్‌) 3.1 శాతంగా ఉంది. ప్రస్తుత ఖాతాలోటు అంటే రోజువారీ విదేశీమారక అవసరాల్లో లోటు. ఇదే పరిస్థితి కొనసాగితే బ్యాంక్‌లు ఇచ్చిన అప్పుల రికవరీ మరింత కష్టమవుతుందని ఆర్‌బీఐ తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కూడా దేశీయ ద్రవ్య స్థిరత్వంపై ప్రభావం చూపుతాయి. 

‣ కొవిడ్‌ కారణంగా అతలాకుతలమైన ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకునేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ  రూ.29.87 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. ఇది మనదేశ జీడీపీలో దాదాపు 15 శాతం. ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద కేంద్ర ప్రభుత్వం దేశ జీడీపీలో 9 శాతానికి సమానమైన ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది.

‣ బ్యాంకింగ్‌ ఒక వ్యాపారం. బ్యాంక్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు స్వీకరించి పరపతిని సమకూరుస్తాయి. ఖాతాదారులకు ఇతర బ్యాంకింగ్‌ సేవలను అందిస్తాయి. ద్రవ్య సప్లయ్‌ పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి. ఆర్థికాభివృద్ధిలోనూ కీలకపాత్ర పోషిస్తాయి.

‣ 1949 భారత బ్యాంకింగ్‌ క్రమబద్ధీకరణ చట్టం ప్రకారం కోరిన వెంటనే లేదా మరో సమయంలో చెక్, డ్రాఫ్ట్, ఆర్డర్ల ద్వారా తిరిగి చెల్లించే షరతుల మీద బ్యాంకులు ప్రజల నుంచి ద్రవ్య డిపాజిట్లు స్వీకరిస్తాయి. ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించడాన్ని బ్యాంకింగ్‌ వ్యాపారంగా పేర్కొంటారు. 

‣ అప్పులు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోతే బ్యాంక్‌ల ఉనికి ప్రమాదంలో పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డిపాజిటర్ల సొమ్ముకు భరోసా ఉండదు. అందుకే మొండిబాకీల పరిమితి మించకుండా బ్యాంక్‌లు జాగ్రత్త పడతాయి. కానీ కొంతకాలంగా దేశీయ బ్యాంక్‌లకు మొండిబాకీలు ఎక్కువయ్యాయి.

‣ ప్రయివేట్‌ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వరంగ బ్యాంక్‌లకే బాకీల సమస్య ఎక్కువగా ఉంది. ఇచ్చిన అప్పులు తిరిగి రాని పరిస్థితుల్లో కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంక్‌లకు వీలు కావడం లేదు.

ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులు

‣ కొన్ని సంవత్సరాలుగా మనదేశ బ్యాంకింగ్‌ రంగం మొండి బాకీల సమస్యతో అతలాకుతలం అవుతోంది. 2020 - 21 భారత ఆర్థిక సర్వే ప్రకారం 2020 మార్చి నాటికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 8.2 శాతం ఉండగా, సెప్టెంబరు చివరి నాటికి 7.5 శాతానికి తగ్గింది. అదే సంవత్సరంలో ‘పునర్నిర్మాణ ప్రామాణిక ఆస్తులు’ (Restructured Standard Advances-RSA) నిష్పత్తి 0.36 శాతం నుంచి 0.41 శాతానికి పెరిగాయి. 

‣ 2020, మార్చి నాటికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో ఒత్తిడి ఆస్తుల నిష్పత్తి (Stressed advances ratio)  8.6 శాతం ఉండగా, సెప్టెంబరు నాటికి 7.9 శాతానికి తగ్గింది. 

‣ భారతదేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2020, మార్చి నాటికి స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 10.25 శాతం ఉండగా, సెప్టెంబరు నాటికి 9.4 శాతానికి తగ్గింది. అదే సంవత్సరంలో ఒత్తిడి ఆస్తుల నిష్పత్తి 10.75 శాతం నుంచి 9.96 శాతానికి తగ్గింది. 

‣ 2020, సెప్టెంబరు నాటికి షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో నికర ఆస్తుల నిష్పత్తి 2.1 శాతం ఉండగా, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 2.85 శాతం ఉంది. 

‣ 2021 జనవరి 11న కేంద్ర బ్యాంక్‌ ఆర్థిక స్థిరత్వ నివేదికలో (Financial Stability Reportn-2021) 2021, సెప్టెంబరు నాటికి అన్ని షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 13.5 శాతం పెరుగుతుందని తెలిపింది. ఈ విలువ 2020, సెప్టెంబరులో 7.5 శాతంగా ఉంది. మొండి బకాయిల నిష్పత్తి 14.8 శాతం కావొచ్చని కేంద్ర బ్యాంక్‌ అంచనా వేసింది. 

‣ బ్యాంకులపై పారుబాకీల భారాన్ని తగ్గించేందుకు 2016 - 17 ఆర్థిక సర్వే ప్రభుత్వరంగ అసెట్‌ రిహాబిలిటేషన్‌ ఏజెన్సీని స్థాపించాలని సూచించింది. 

‣ కేంద్ర బ్యాంక్‌ మాజీ గవర్నర్‌ ఎం. నరసింహం కమిటీ సిఫార్సుల మేరకు 2002లో కేంద్ర ప్రభుత్వం ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంక్‌ల సారథ్యంలో తొలి అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీని స్థాపించింది.

 2020, ఆగస్టు 31 వరకు బ్యాంక్‌లు ప్రకటించని నిరర్థక ఆస్తులను తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకు ప్రకటించకూడదని 2020, సెప్టెంబరు 3న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

స్థూల నిరర్థక ఆస్తుల గణాంకాలు (రూ. కోట్లలో)

నివేదిక సంవత్సరం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు  ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌లు
మార్చి 2017 6,84,732 91,915
మార్చి 2018 8,95,601 1,25,863
మార్చి 2019 7,39,541 1,80,872
మార్చి 2020 6,78,317 2,05,848
సెప్టెంబరు 2020 6,09,129 1,88,191

ఆధారం: భారత ఆర్థిక సర్వే  202021

బ్యాంక్‌ల విలీనం

‣ దేశంలో మూడంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థ (అంతర్జాతీయ స్థాయి, జాతీయ స్థాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లు) ఉండాలని  1998లో నరసింహం కమిటీ సిఫార్సు చేసింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌లను విలీనం చేసి, వాటి సంఖ్యను గణనీయంగా తగ్గించాలని పేర్కొంది. కేవలం విలీనంతోనే ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ బలోపేతమై దేశ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి ఎదిగేందుకు దోహదపడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్‌ల విలీనం ఆశించిన ఫలితాలను ఇవ్వాలంటే ప్రభుత్వం సంస్కరణలు చేపట్టాలి. ప్రధానంగా ప్రభుత్వరంగ బ్యాంకులన్నీ (విలీనమైన, విలీనం చేసుకొన్న బ్యాంక్‌లు) భారీ నిరర్థక ఆస్తులతో సతమతమవుతున్నాయి. 

‣ పారుబాకీలను తగ్గించేందుకు పెద్దఎత్తున చర్యలు చేపట్టాలి. వీటిని తగ్గించుకుంటూ రుణవితరణ పెంచుకోవాలి. ఈ దిశలో బ్యాంక్‌ యాజమాన్యాలు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. రుణ వితరణ విధానాలను సమీక్షించుకోవడంతో పాటు భవిష్యత్తులో పారుబాకీలు పెరగకుండా చర్యలు చేపట్టాలి. విలీనానంతరం ఏర్పడే పెద్దబ్యాంక్‌ల పనితీరును రిజర్వ్‌బ్యాంక్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. అయితే అతిపెద్ద బ్యాంక్‌లను ఏర్పాటు చేసినంత మాత్రాన భవిష్యత్తులో అవి ఎలాంటి సంక్షోభంలో చిక్కుకోవని చెప్పలేం. 2008లో అమెరికాలో సంభవించిన తాకట్టు రుణాల (Subprime mortgage crisis) సంక్షోభంలో ప్రపంచ దిగ్గజ బ్యాంక్‌లు సైతం కుప్పకూలాయి. దేశంలో విలీనానంతరం ఏ ఒక్క బ్యాంక్‌ విఫలమైనా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం, ఆర్‌బీఐ పటిష్ఠ నియంత్రణా యంత్రాంగాన్ని రూపొందించాలి.

డాక్టర్‌ ఎం. వీరప్ప మొయిలీ కమిటీ (2015-16)

‣ భారత్‌లో బ్యాంకింగ్‌ రంగంలో పెరుగుతున్న మొండిబాకీల అంశాన్ని పరిశీలించేందుకు  16వ లోక్‌సభ డాక్టర్‌ ఎం. వీరప్ప మొయిలీ అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ ఆన్‌ ఫైనాన్స్‌ను (2015 - 16) ఏర్పాటు చేసింది.

‣ ఆర్థిక మంత్రిత్వశాఖ (ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం), ఆర్థిక సంస్థల నిరర్థక ఆస్తులు అనే పేరుతో ఈ కమిటీ తన 27వ నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. 

‣ మనదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అంతర్భాగంగా భారత విత్త వ్యవస్థలో రెండు ముఖ్యమైన అంశాల్లో మార్పులు వచ్చాయని నివేదిక పేర్కొంది. అవి:

1) 1969లో మొదటిసారిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంక్‌లను జాతీయం చేయడం.

2) 1991లో అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాలు.

‣ అదే సమయంలో ప్రతీ సంవత్సరం మొండి బకాయిలు లేదా నిరర్థక ఆస్తులు పెరగడంతో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఆరోగ్యకరంగా లేవని కమిటీ పేర్కొంది.

కారణాలు:

‣ గతంలోనూ, ప్రస్తుతం దేశీయ వృద్ధిలో అలసత్వం.

‣ అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా కోలుకోవడం.

‣ అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న నిరంతర అనిశ్చితి కారణంగా వివిధ ఉత్పత్తుల ఎగుమతులు తక్కువగా జరగడం. 

ఉదా: వస్త్రాలు, ఇంజినీరింగ్‌ వస్తువులు, తోలు, రత్నాలు, విదేశీ కారకాలు, గనుల ప్రాజెక్టుల రద్దు, విద్యుత్‌ రంగ అనుమతులు ఆలస్యమవ్వడం, ఇనుము-ఉక్కు ముడిసరుకు ధరలు పెరగడం, వస్త్ర పరిశ్రమలో విద్యుత్‌ రంగ లభ్యత ప్రభావం. 

 వివిధ మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులకు బ్యాంక్‌లు గతంలో ఎక్కువగా రుణాలు మంజూరు చేశాయి. ప్రస్తుతం వాటినుంచి బాకీల వసూలు ఆలస్యం అవుతోంది. నిరర్థక ఆస్తులు పెరగడానికి ఇదీ ఒక కారణం.

డా.వీరప్ప మొయిలీ కమిటీ ప్రకారం మన దేశంలో స్థూల నిరర్థక ఆస్తులు

సంవత్సరం కోట్లలో శాతం
2011 (మార్చి) 71,080 2.32
2012 (మార్చి) 1,12,489 3.17
2013 (మార్చి) 1,55,890 3.84
2013 (జూన్‌) 1,83,778 4.59
2014 (డిసెంబరు) 3,69,990 5.47

ఆధారం: డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ కమిటీ (2015-16) నిరర్థక ఆస్తుల పరిశీలన
 

మొండి బకాయిలు - నియంత్రణ చర్యలు

దివాలా స్మృతి చట్టం లేదా విధానం (Insolvency And Bankruptcy code – IBC)
దివాలా స్మృతి చట్టం 2016లో అమల్లోకి వచ్చింది. బ్యాంకుల పారుబాకీలు పెరగకుండా చూడటానికి; మొండిబాకీలను తగ్గించడానికి; వాటిని వసూలు చేయడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. బ్యాంకుల పారుబాకీలను తగ్గించేందుకు 2002లో సెక్యూరిటైజేషన్‌ చట్టాన్ని (Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act) రూపొందించారు. తాకట్టులో ఉన్న ఆస్తిని స్వాధీనం చేసుకుని, వేలం వేసే అవకాశం బ్యాంకులకు ఈ చట్టం ద్వారా లభించింది. 
కేంద్ర ప్రభుత్వం 2016, నవంబరు 8న పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయం బ్యాంకులకు నిధుల లభ్యత మరింత పెరిగేందుకు దోహదం చేసింది. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాల్సి రావడంతోపాటు ఆ సొమ్మును తిరిగి తీసుకునేందుకు ఆంక్షలు విధించారు. దీంతో ఆ సొమ్ము చాలాకాలం బ్యాంకుల వద్దే ఉండిపోయింది. కేంద్రం డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడంతో ఎక్కువ మొత్తంలో నగదు బ్యాంకుల్లోనే ఉంది. సాధారణంగా ఇచ్చిన అప్పులు తిరిగిరాని పరిస్థితుల్లో కొత్త అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులకు వీలుపడదు. ఈ పరిస్థితుల్లో డిజిటల్‌ లావాదేవీల పరిణామం వాటికి మేలు చేసింది. 


బ్యాడ్‌ బ్యాంక్‌/ మొండి బకాయిల బ్యాంక్‌ (2021-22)
* ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ 2021, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ (2021-22) ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా, కొత్తగా బ్యాడ్‌ బ్యాంక్‌ను (మొండి బకాయిల బ్యాంక్‌) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
* ఆర్థికమంత్రి ప్రకటించిన కొత్త డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ)ను ‘నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’ (నాబ్‌ ఫిడ్‌)గా పిలుస్తున్నారు. దేశ దీర్ఘకాలిక రుణ అవసరాలను తీర్చే వీలు కల్పించడం దీని ఉద్దేశం. ఇది మౌలిక సదుపాయాల కల్పన, మొండిబాకీలు తగ్గించడానికి తోడ్పడతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి భరోసా కల్పిస్తుంది. విదేశీ సంస్థాగత మదుపుదార్లకు దేశీయ రుణ మార్కెట్‌ని మరింత ఆకర్షణీయం చేస్తుంది. బ్యాడ్‌ బ్యాంక్‌లో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు చెందినవారు ఉంటారు.
* ప్రభుత్వరంగ బ్యాంకుల్లోని నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) సంక్షోభాన్ని బ్యాడ్‌ బ్యాంక్‌ సరైన పద్ధతిలో పరిష్కరిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఒత్తిడిలో ఉన్న బ్యాంకులు తమ బ్యాలెన్స్‌ షీట్లను ప్రక్షాళన చేసే అవకాశం ఉంటుంది.
* బ్యాడ్‌ బ్యాంకుల్లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టదు, వాటాలు తీసుకోదు. కొత్త డీఎఫ్‌ఐలలో ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్‌) విలీనం అయ్యే అవకాశం ఉంది. 
* 2020 - 21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులు  ఈక్విటీ, రుణ మిశ్రమ రూపంలో రూ.1,00,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలనేది లక్ష్యం కాగా బ్యాంకులు రూ.50,700 కోట్ల వరకు సమీకరించాయి. తర్వాత రూ.8000 కోట్ల నుంచి రూ.10,000 కోట్ల వరకు సమీకరించగలవని అంచనా వేశారు. 
* ప్రభుత్వరంగ బ్యాంకులతో పోలిస్తే ప్రయివేట్‌ రంగ బ్యాôకులు సగటున మంచి పనితీరును చూపుతున్నాయి. కార్పొరేట్‌ ఎగవేతలు, మొండి బకాయిలు వీటిలో తక్కువగా నమోదవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో రుణ నాణ్యతను, పరిమాణాన్ని పెంచడానికి ప్రయివేటీకరణ దోహదపడుతుంది.
* బ్యాంకింగ్‌ వ్యూహాత్మక రంగం. పారుబాకీలను బ్యాడ్‌ బ్యాంక్‌కు బదిలీచేసే క్రమంలో బ్యాంకులు కొన్ని నష్టాలను భరించాల్సి ఉంటుంది. నిరర్ధక ఆస్తుల విలువలో కొంతభాగాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతిపాదిత బ్యాడ్‌బ్యాంక్‌ సమర్థంగా పనిచేసి, సత్వర నిర్ణయాలు తీసుకున్నప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. భవిష్యత్తులో బ్యాంక్‌ల పారుబాకీలు భారీగా పెరగకుండా పరిమిత స్థాయిలో 4% నుంచి 5% మధ్య ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వాటి రుణ వితరణ, రుణ వసూళ్ల విధానాలను సమీక్షించాలి. బ్యాంకుల పారుబాకీలు పెరగకుండా రిజర్వ్‌బ్యాంక్‌ మరిన్ని విధానపర  చర్యలు చేపట్టాలి.


నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలు - చర్యలు
* కొవిడ్‌ - 19, ఇతర కారణాల వల్ల స్థూల నిరర్ధక ఆస్తులు లేదా మొండి బకాయిలు (Gross Non Performing Assets GNPA) అమాంతం పెరిగాయి. ఈ మొండి బాకీలు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. భారీ స్థాయి స్థూల నిరర్ధక ఆస్తులు బ్యాంకింగ్‌ వ్యవస్థను అనేక విధాలుగా అస్థిరపరుస్తాయి. మొండి బకాయిల కోసం బ్యాంక్‌లు చేసే కేటాయింపులు వాటి లాభాలను ప్రభావితం చేస్తాయి. పెట్టుబడి పునాదులను కదిలిస్తాయి. నిధుల చలామణి తగ్గుతుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నిధుల లభ్యత తగ్గుతుంది. అంతిమంగా స్థూల దేశీయోత్పత్తిపై (Gross Domestic Product - GDP) ప్రభావం పడుతుంది. అందుకే రుణం తిరిగి చెల్లించాల్సిన నైతిక బాధ్యత ఎంత ముఖ్యమో వివరిస్తూ రుణ గ్రహీతల్లో చైతన్యం తీసుకురావాలి. 
* మొండి బకాయిల సమస్యను పరిష్కరించకుంటే చివరకు ఎగవేత రుణాలను రద్దుచేయడానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పన్ను చెల్లింపుదారుల కష్టార్జితాన్ని వినియోగించాల్సి ఉంటుంది. రుణాలను ఉద్దేశపూర్వకంగా ఎగవేసే నేరగాళ్లకు శిక్షలు పడేలా చూడటం తప్పనిసరి. 
* మొండి బకాయిలు లేదా పారుబాకీల సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. వితరణ సామర్థ్యాన్ని పెంచుకుంటూనే, రుణాల నాణ్యతను కాపాడుకునేందుకు దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించుకోవాలి. రుణాల నాణ్యత పట్ల అప్రమత్తంగా ఉండాలి. అలాగని క్రెడిట్‌ రిస్క్‌ తీసుకోవడంలో వెనకడుగు వేస్తే ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకం ఏర్పడుతుంది.


మాదిరి ప్రశ్నలు
1. 2020 - 21 భారత ఆర్థిక సర్వే ప్రకారం మనదేశంలో షెడ్యూల్డ్‌ వాణిజ్య బ్యాంకుల్లో 2020, మార్చి ముగింపు నాటికి స్థూల నిరర్ధక ఆస్తుల విలువ (జీఎన్‌పీఏఎస్‌) ఎంత శాతం ఉంది? 
జ: 8.2% 

 

2. కిందివాటిలో మొండి బకాయిలు లేదా స్థూల నిరర్ధక ఆస్తులకు సంబంధించి సరైంది ఏది?
ఎ) 2020 - 21 భారత ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా 2020, సెప్టెంబరు ముగింపు నాటికి స్థూల నిరర్ధక ఆస్తులు 7.5%.
బి) 2019, మార్చి నాటికి మనదేశంలోని ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు రూ.7,39,541 కోట్లు.
సి) 2020, సెప్టెంబరు నాటికి మనదేశంలో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు రూ.6,09,129 కోట్లు.
డి) స్థూల నిరర్ధక ఆస్తులు ప్రయివేట్‌ రంగ బ్యాంకుల కంటే ప్రభుత్వరంగ బ్యాంకుల్లోనే అధికం.
జ:  పైవన్నీ


3. 2020 - 21 భారత ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా 2017, మార్చి నాటికి ప్రయివేట్‌ రంగ బ్యాంకుల్లో స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏఎస్‌) రూ.91,915 కోట్లు. ఇవి 2020, మార్చి నాటికి ఎంతకు చేరాయి?
జ:  రూ.1,88,191 కోట్లు 


4. డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ (డీఎఫ్‌ఐ) ప్రధాన ఉద్దేశం?
1) దేశ దీర్ఘకాలిక రుణ అవసరాలను తీర్చేందుకు వీలు కల్పించడం
2) మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పడటం.
3)  మొండి బాకీల సమస్యకు పరిష్కారం చూపడం
4) పైవన్నీ 
జ: పైవన్నీ 


5. 2020 - 21 భారత ఆర్థిక సర్వే నివేదిక ఆధారంగా మన దేశంలో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగ బ్యాంకుల్లో కలిపి మొత్తం స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏఎస్‌) విలువ?
జ: రూ.7,97,320 కోట్లు 


6. కిందివాటిని జతపరచండి.
జాబితా - 1            జాబితా - 2 
i)  డాక్టర్‌ ఎం.వీరప్ప      a) 3.17%
  మొయిలీ కమిటీ ఏర్పాటు
ii) 2012, మార్చి నాటికి     b) 2015 - 16
  స్థూల నిరర్ధక ఆస్తుల శాతం
iii) 2013, జూన్‌ నాటికి      c) 5.47%
  స్థూల నిరర్ధక ఆస్తుల శాతం
iv) 2014, డిసెంబరు నాటికి   d) 4.59%
  స్థూల నిరర్ధక ఆస్తుల శాతం
జ:  i-b ii-a iii-d iv-c 


7. మన దేశంలో బ్యాంకింగ్‌ రంగంలో పెరుగుతున్న మొండి బకాయిల అంశాన్ని పరిశీలించేందుకు 16వ లోక్‌సభ 2015-16లో ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది?
జ: డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ


8. భారతదేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలో అంతర్భాగంగా విత్త వ్యవస్థలో వచ్చిన మార్పులు?
జ: 1969లో మొదటిసారిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం 14 బ్యాంకులను జాతీయం చేయడం,  1991లో అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాలు


9. మనదేశంలో మూడంచెల బ్యాంకింగ్‌ వ్యవస్థ (అంతర్జాతీయ, జాతీయ స్థాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు) ఉండాలని ఏ సంవత్సరంలో ఎం.నరసింహం కమిటీ సిఫార్సు చేసింది?
జ: 1998


10. భారతదేశంలో బ్యాంకులు ఇచ్చే రుణాల్లో అధికభాగం ఏ రంగాలకు వెళ్తున్నాయి?
1) మౌలిక వసతుల కల్పన (రవాణా, నీటిపారుదల, విద్యుత్‌ శక్తి)
2) ఇనుము - ఉక్కు, విద్యుత్, వజ్రాలు, రత్నాభరణాలు
3) గనులు, నిర్మాణ రంగం, జౌళిరంగం, స్పిన్నింగ్‌ మిల్లులు, వస్త్ర పరిశ్రమలు
4) పైవన్నీ
జ: 4) పైవన్నీ


11. భారత వాణిజ్య బ్యాంకులు ఏటా లక్ష కోట్లు రుణాలు ఇస్తాయి. వాటిలో కొన్ని తిరిగిరావు. ఈ పరిస్థితి మరింత పెరగడాన్ని బ్యాంకింగ్‌ పరిభాషలో ఏమంటారు?
జ: రుణాల నాణ్యత తగ్గడం 


12. 2002లో కేంద్రప్రభుత్వం ఏ కమిటీ సూచనల మేరకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీబీఐ బ్యాంకుల సారథ్యంలో తొలి అసెట్స్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కంపెనీని స్థాపించింది?
జ: ఎం. నరసింహం కమిటీ 


13. మన దేశంలో దివాలా స్మృతి చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు?
జ: 2016


14. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) ప్రధాన లక్ష్యం?
1) బ్యాంకుల మొండి బాకీలు పెరగకుండా చూడటం
2) బ్యాంకుల మొండి బాకీలను తగ్గించడం
3) మొండి బాకీలు వసూలు చేయడం
4) పైవన్నీ
జ: 4) పైవన్నీ


15. బ్యాడ్‌ బ్యాంక్‌ను ఏ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు?
జ: 2021-2022 కేంద్ర బడ్జెట్‌


16. బ్యాడ్‌ బ్యాంకును ఏమని పిలుస్తారు?
జ: మొండిబాకీల బ్యాంక్‌

Posted Date : 20-04-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌