• facebook
  • whatsapp
  • telegram

సుస్థిరాభివృద్ధి

   అభివృద్ధి అనేది అతి ప్రాచీనమైన మానవ వ్యక్తిగత, సామూహిక కార్యక్రమం. దీనిలో భాగంగా గుహలు విడిచి గృహాలను నిర్మించారు. ఇది కుమ్మరి చక్రంతో మొదలైన మొదటి ఉత్పత్తి. ద్రవ్యం సంపద, సంతోషానికి మారుపేరుగా మారి పర్యావరణాన్ని బాధిస్తున్న విధ్వంసక ప్రక్రియ. ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో జరిగిన వాతావరణ కార్యాచరణ సదస్సులో 16 ఏళ్ల స్వీడన్‌ పర్యావరణ ఉద్యమకారిణి గ్రేటా థెన్‌బర్గ్‌  ‘మా తరాన్ని ముంచేస్తారా’ అని పాలకులను ప్రశ్నించింది. నేటి తరం ఇలా ఎందుకు స్పందిస్తుందో అర్థం కావాలంటే మనిషి అభివృద్ధి భావనా ప్రస్థానాన్ని అవగాహన చేసుకోవాలి. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు మొదట తక్కువ కాలంలో అభివృద్ధి చెందిన దేశాల్లో వాస్తవిక ఆదాయంలోని పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా పరిగణించారు. సాంకేతికతను అందిపుచ్చుకొని సంపదను వస్తువుల రూపంలో సేకరించి, మార్కెటింగ్‌ చేసుకోవడాన్నే ముఖ్యంగా భావించారు. ఈ క్రమంలో పర్యావరణ జాగ్రత్తలను విస్మరించారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం రాజకీయంగా స్వతంత్ర దేశంగా అవతరించిన భారత్‌ లాంటి దేశాలను పరిశీలిస్తే వెనుకబడిన దేశాలకు ఆర్థికవృద్ధితోపాటు ఆర్థికాభివృద్ధి కూడా అవసరమని తేల్చారు. దీర్ఘకాలంలో వాస్తవిక ఆదాయంతో పాటు సామాజిక, సంస్థాగత, సాంకేతిక మార్పులను తెలిపే విశాల ప్రక్రియను ఆర్థికాభివృద్ధి అని గుర్తించారు.

ఆర్థికాభివృద్ధి = ఆర్థికవృద్ధి + ఇతర ఆవశ్యక మార్పులు
    ఆర్థికాభివృద్ధి అనేది ఆర్థికవృద్ధిలా సంపద సృష్టికి ప్రాధాన్యం ఇస్తుంది. అంటే జాతీయాదాయ పెంపుదలే ముఖ్యం. ఇది తక్కువ కాలంలో అధిక వృద్ధిరేటు కోసం ప్రయత్నిస్తుంది. ఉత్పత్తి ఉపాధికి దారితీసి మరెన్నో పరోక్ష ప్రయోజనాలను కల్పిస్తుంది. దీని వల్ల అభివృద్ధి జరుగుతుందనేది సైద్ధాంతిక విశ్వాసం. దీన్నే ట్రికిల్‌ డౌన్‌ థియరీ అంటారు. ఈ సిద్ధాంతం ఆధారంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు అనేక ఆదాయ అభివృద్ధి పనులను చేపట్టాయి. మన దేశంలో 1951-1970 మధ్య కాలంలో సామాజిక అభివృద్ధి, గ్రామాల్లో భూసంస్కరణలు, వ్యవసాయ విస్తరణ, భారీ ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణం, హరిత విప్లవాలతో ఆర్థికాభివృద్ధి కోసం అనేక ప్రయత్నాలు జరిగాయి.

ఆర్థిక సంక్షేమం 
    ఆర్థికాభివృద్ధి ఫలాలు కొన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకే పరిమితమయ్యాయని ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. పేద ప్రజల స్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీన్ని అధిగమించడానికి ఆర్థిక సంక్షేమం ఏర్పడింది. అంటే పేద, బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలను అందించడానికి ప్రత్యేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. మన దేశంలో 1971 - 1990 కాలంలో అనేక పేదరిక, నిరుద్యోగ నిర్మూలన, గ్రామీణ - పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఇవి దారిద్య్రరేఖ కింద జీవించేవారి ప్రాథమిక అవసరాలను కొంతమేర తీర్చాయి. కానీ ఆశించిన ఫలితాలు కనిపించలేదు. ఈ పథకాలు ప్రజాస్వామ్య దేశాల్లో క్రమంగా ఓట్ల కోసం పేదలను ఆకర్షించే నినాదాలుగా మారాయి. వీటిలో జరిగే అవినీతి వల్ల ఖజానాపై భారం పెరిగింది.

ఆర్థిక సంక్షేమం = ఆర్థికాభివృద్ధి + ప్రత్యక్ష సంక్షేమ పథకాలు
మానవాభివృద్ధి 
    1991 నుంచి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ చాలా దేశాల్లో అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక శాస్త్రవేత్తలు పునరాలోచనలో పడ్డారు. మానవుడి కేంద్రీకృతమైన అభివృద్ధి జరగాలని భావించారు. ముఖ్యంగా పేదలు స్వయంగా ఎదిగే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి. సంక్షేమ పథకాల పేరుతో వారిని ప్రభుత్వ పథకాల లబ్ధిదారుగా మాత్రమే కాకుండా వారికి స్వేచ్ఛను ఇచ్చి సామర్థ్యాల మేరకు అభివృద్ధిలో చురుకైన భాగస్వాములను చేయాలి. ఇది వారి ఆర్థిక, సామాజిక సాధికారతకు దోహదపడుతుంది. ఇదే నిజమైన మానవాభివృద్ధి. ఆదాయంతోపాటు ప్రజలకు విద్య, ఆరోగ్యాన్ని అందించాలి. ప్రపంచ దేశాలు శ్రామికులను మానవ వనరులుగా గుర్తించి పలు చర్యలు చేపట్టాయి.

మానవాభివృద్ధి = ఆర్థికాభివృద్ధి  +  విద్య + ఆరోగ్యం
    మానవాభివృద్ధి, ఆర్థికాభివృద్ధిలో అభివృద్ధికి ప్రధాన అంశమైన పర్యావరణం గురించి చర్చించలేదు. ప్రకృతి మనిషి కంటే ప్రాచీనమైంది. సృష్టిలోని జీవ, నిర్జీవ పదార్థాలను ఉపయోగించుకుని మానవ నాగరికత రూపుదాల్చింది. ప్రస్తుతం మనుషుల సంఖ్య పెరిగింది. దాంతోపాటు పర్యావరణంలో అనేక మార్పులు వచ్చాయి. అభివృద్ధి పేరుతో సహజ వనరులను అతిగా ఉపయోగించడం వల్ల నేటి తరానికి సహజ సంపద తగ్గిపోయింది. ముఖ్యంగా 18వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం తర్వాత వనరుల దుర్వినియోగం వేగంగా జరిగి కాలుష్యం అధికమైంది. ఇది రేపటి తరాల భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని ప్రపంచ మేధావులు, పర్యావణ వేత్తలు భావించారు. 1970 దశాబ్దంలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని సమావేశాల్లో ఈ ఆలోచన ప్రారంభమైంది. 1980లో మొదటిసారిగా ప్రకృతి పరిరక్షణ అంతర్జాతీయ యూనియన్‌ (ఖిగీదివి) సుస్థిర అభివృద్ధి అనే పదాన్ని ప్రయోగించింది. 1987లో పర్యావరణం, అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ కమిషన్‌ విడుదల చేసిన ‘అవర్‌ కామన్‌ ఫ్యూచర్‌’లో ఈ పదానికి శాస్త్రీయ నిర్వచనం ఇచ్చింది. దీన్నే సాధారణంగా బ్రంట్‌లాండ్‌ రిపోర్ట్‌ అని పిలుస్తారు. ‘భవిష్యత్తు తరాల అవసరాలు తీర్చుకునే సామర్థ్యాలను దెబ్బతీయకుండా ప్రస్తుత తరాలు తమ అవసరాలను తీర్చుకునే అభివృద్ధే సుస్థిరాభివృద్ధి’.
* ప్రజలందరి అవసరాలు ముఖ్యంగా పేదలకు ప్రాధాన్యత. 
* పర్యావరణంపై సాంకేతికత విధించే పరిమితులు
* ప్రస్తుత, భవిష్యత్తు తరాల మధ్య సమన్యాయం 
* అభివృద్ధిని ముందు తరాలకు కొనసాగించడం. అందుకే దీన్ని కొనసాగించగల అభివృద్ధి అని కూడా అంటారు.
    ఈ నివేదిక తర్వాత ప్రపంచవ్యాప్తంగా సుస్థిరాభివృద్ధిపై చర్చలు, అవగాహన సదస్సులు ప్రారంభమయ్యాయి. 1992లో బ్రెజిల్‌లోని రియో-డి-జెనీరోలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ధరిత్రీ సదస్సులో అజెండా - 21 పేరుతో 21వ శతాబ్దంలో సుస్థిరాభివృద్ధి సాధనకు సాధ్యాసాధ్యాలు, పరిమితులను చర్చించారు. తర్వాత 20 ఏళ్లకు రియో నగరంలోనే రియో + 20 పేరుతో 2012లో సుస్థిరాబివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు జరిగింది. ఈ సదస్సులో గత అనుభవాలను సమీక్షించారు. ముఖ్యంగా వాతావరణ మార్పులు - ప్రభావంపై అవగాహన ఏర్పడింది. దీని ఆధారంగానే పారిస్‌ ఒప్పందం (2016) అమల్లోకి వచ్చింది.

భారత్‌ పనితీరు 
    ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి సూచిక - 2019 ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో డెన్మార్క్‌ ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. అమెరికా 35, చైనా 39, భారత్‌ 115వ స్థానంలో ఉన్నాయి. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక - బేస్‌ లైన్‌ రిపోర్ట్, 2018 తొలి నివేదిక ప్రకారం 100 పాయింట్లకు మన దేశం 58 పాయింట్లు సాధించింది. ఈ లక్ష్యాల సాధనలో హిమాచల్‌ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. SDG India Index ను కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ, గ్లోబల్‌ గ్రీన్‌ గ్రోత్‌ సంస్థ, ఐక్యరాజ్య సమితి కలిసి రూపొందించాయి.

లక్ష్యాలు
    ఐక్యరాజ్య సమితి 2015 సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన పర్యావరణ సదస్సులో 2015 - 30 మధ్యకాలంలో అన్ని దేశాలు సాధించాల్సిన 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఆమోదించింది. 
    1)  పేదరిక నిర్మూలన
    2) ఆకలి చావులను పూర్తిగా తగ్గించడం 
    3) మంచి ఆరోగ్యం  
    4) నాణ్యమైన విద్య
    5) లింగ సమానత్వం 
    6) పరిశుభ్రమైన నీరు, పరిసరాలు 
    7) పునరుజ్జీవన ఇంధన వాడకం 
    8) ఉపాధి, ఆర్థికవృద్ధి  
    9) పరిశ్రమలు, నూతన ఆవిష్కరణలు, అవస్థాపనా సౌకర్యాల కల్పన
    10) అసమానతల తగ్గింపు  
    11) సుస్థిర నగరాలు, సమాజాలు 
    12) బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తి 
    13) వాతావరణ మార్పులపై చర్యలు 
    14) నీటిలోని ప్రాణుల సంరక్షణ
    15) నేలపై జీవుల రక్షణ
    16) శాంతి, న్యాయం 
    17) ఉమ్మడి లక్ష్యాల కోసం భాగస్వామ్యం. 
    సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్థూలంగా 17గా విభజించినప్పటికీ అవి ఒకదానితో మరొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి సామాజిక, ఆర్థిక, పర్యావరణపరంగా సుస్థిరంగా ఉండాలి. మొదటిసారి ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 74వ సమావేశాల్లో భాగంగా 2019 సెప్టెంబరు 24, 25న న్యూయార్క్‌లో వాతావరణ కార్యాచరణ సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో పాటు పలువురు నేతలు, పర్యావణ శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఇప్పటివరకు సుస్థిరాభివృద్ధి కోసం చేపట్టిన చర్యలను సమీక్షించారు. సుస్థిరాభివృద్ధి అంటే అసలైన అర్థం నాలుగు కాలాల పాటు కాదు నాలుగు తరాల పాటు అందరినీ సంతోషపెట్టేది. 
                 p - people; p - planet; p - prosperity; p - partnership; p - peace  అనే 5 P's ను సాధించడానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉపయోగపడతాయి. 2000-2015 మధ్య ఎనిమిది సహస్రాబ్ది లక్ష్యాలు ఉన్నాయి.

 

Posted Date : 31-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌