• facebook
  • whatsapp
  • telegram

స్వరాజ్య పార్టీ స్థాపన

     గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధంతరంగా నిలిపివేయడం కాంగ్రెస్‌లో ఒక వర్గాన్ని అసంతృప్తికి గురి చేసింది. 1922 మార్చిలో గాంధీజీ అరెస్ట్ తర్వాత జాతీయ నాయకుల్లో నిరాశ, నిస్పృహ చోటు చేసుకున్నాయి. ఈ సంధికాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాల విషయమై కాంగ్రెస్ నాయకుల్లో తలెత్తిన భేదాభిప్రాయాలు చివరకు కాంగ్రెస్ చీలిపోవడానికి దారితీశాయి.
 

  చిత్తరంజన్‌దాస్, మోతీలాల్ నెహ్రూ, హకీం అజ్మల్‌ఖాన్, అలీ సోదరులు తదితరుల నాయకత్వంలోని ఒక వర్గం శాసన మండళ్ల బహిష్కరణకు స్వస్తి పలకాలని నిశ్చయించుకుంది. తద్వారా జాతీయవాదులు మండళ్లలోకి ప్రవేశించి వాటిలో ప్రభుత్వ బలహీనతలను ఎత్తిచూపే అవకాశం ఉంటుందని భావించాడు. ఈ వర్గాన్ని 'స్వరాజ్యవాదులు', 'మార్పు కోరుకునే వర్గం'గా పేర్కొంటారు.
 

* వల్లభాయ్ పటేల్, రాజేంద్రప్రసాద్, సి. రాజగోపాలాచారి, ఎం.ఎ. అన్సారీ నాయకత్వంలోని మరో వర్గాన్ని 'మార్పు కోరని వర్గం'గా పేర్కొంటారు. వీరు శాసన మండళ్లలోకి ప్రవేశించడాన్ని వ్యతిరేకించారు. ఈ వర్గం నిర్మాణాత్మక కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, బహిష్కరణ, సహాయ నిరాకరణ కార్యక్రమాలను కొనసాగించాలని భావించింది.
 

* అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మోతీలాల్ నెహ్రూ, డాక్టర్ ఎం.ఎ. అన్సారీ, జమ్నాలాల్ బజాజ్, సి. రాజగోపాలాచారిలతో కూడిన ఒక ఉపసంఘాన్ని నియమించింది. దేశంలో పర్యటించి శాసనోల్లంఘన ఉద్యమంపై ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయడం ఈ ఉపసంఘ కర్తవ్యం. ఈ ఉపసంఘం సిఫారసులు గాంధీజీ విధేయులకు, గాంధీజీ వ్యతిరేకవర్గానికి మధ్య భేదాభిప్రాయాలకు దారితీశాయి.

* 1922 డిసెంబరులో గయలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో స్వరాజ్యవాదులు ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. దీంతో చిత్తరంజన్‌దాస్, మోతీలాల్‌నెహ్రూ కాంగ్రెస్ అధ్యక్ష, కార్యదర్శి పదవులకు రాజీనామా చేశారు. 1923 జనవరి 1 న కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్య పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఈ పార్టీకి చిత్తరంజన్‌దాస్ అధ్యక్షుడిగా, మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా వ్యవహరించారు. స్వరాజ్యవాదులు శాసన మండళ్లలో తమ బలాన్ని ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ప్రజల్లో ఉత్సాహం నింపడానికి ఎన్నికలే ప్రధాన సాధనమని వీరు భావించారు.

* 1923 ఫిబ్రవరిలోనే మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఈ రెండు కాంగ్రెస్ వర్గాల మధ్య విభేదాలను తగ్గించడానికి యత్నించారు. చివరకు 1923 మేలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 'స్వరాజ్య పార్టీ' ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆమోదం తెలిపింది.

* 1925 నాటికి గాంధీజీ కూడా ఈ విషయంలో మెతక వైఖరి ప్రదర్శించి, స్వరాజ్య పార్టీని కాంగ్రెస్ రాజకీయ విభాగంగా అంగీకరించారు.

కార్యక్రమాలు

      1923 నవంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ మితవాదులను, ఉదారవాదులను ఓడించింది. కేంద్ర శాసనసభలో 101 సీట్లకు 42 గెలుచుకుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో సెంట్రల్ ప్రావిన్స్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించి, బెంగాల్‌లో అతిపెద్ద పార్టీగా అవతరించింది. బొంబాయి, యునైటెడ్ ప్రావిన్స్, అస్సాంలలో తగిన సీట్లు గెలుచుకుంది.
 

ప్రధాన డిమాండ్లు: రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని, పౌర, సైనిక సర్వీసుల్లో భారతీయులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను పూర్తిగా వ్యతిరేకించింది.
 

విజయాలు: 1924 లో కేంద్ర శాసనసభలో ఆర్థిక బిల్లును వ్యతిరేకించింది. స్వరాజ్యపార్టీ నాయకులను శాంత పరిచేందుకు 1924 లో తొమ్మిదిమంది సభ్యులతో కూడిన సంస్కరణల విచార సంఘాన్ని ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడు సర్ అలెగ్జాండర్ ముద్దిమాన్. దీన్నే ముద్దిమాన్ సంఘం అనే పేరుతో కూడా పిలుస్తారు.
 

* 1919 మాంటేగ్-చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల పనితీరును అధ్యయనం చేయడానికి ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు. భారతీయులకు  నష్టం  కలిగించేలా  ప్రభుత్వం 1928 లో ప్రవేశపెట్టిన   ప్రజా రక్షణ బిల్లు  చట్టం  కాకుండా చూడటం స్వరాజ్యపార్టీ సాధించిన మరో విజయం.

* ఉప్పు మీద పన్ను తగ్గించడం, కార్మికుల పరిస్థితులు మెరుగయ్యేలా చర్యలు చేపట్టడం, బెంగాల్‌లో కొన్ని చట్టాలను వెనక్కు తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం, సెంట్రల్ ప్రావిన్స్‌లో మంత్రులు రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చి ద్వంద్వ ప్రభుత్వం పనిచేయకుండా చూడటం, ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవకుండా దూరంగా ఉండటం, ప్రభుత్వ విధానాలను బాహాటంగా విమర్శించడం స్వరాజ్యవాదుల ఇతర విజయాలు.

* 1925 లో చిత్తరంజన్‌దాస్ మరణం తర్వాత స్వరాజ్యపార్టీ బలహీనపడింది. లాలా లజపతిరాయ్, మదన్ మోహన్ మాలవీయ, ఎన్.సి. కేల్కర్ హిందువులకు మేలు చేకూరాలంటే బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించి, పదవులు స్వీకరించాలని భావించారు. ఈ వర్గం మోతీలాల్ నెహ్రూపై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసింది.

* 1926 లో జరిగిన ఎన్నికల్లో స్వరాజ్యపార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ ఎన్నికల్లో కేంద్ర శాసనసభలో 40 సీట్లు, మద్రాసు రాష్ట్ర శాసన మండలిలో సగం సీట్లు సాధించినా, మిగతా రాష్ట్రాల్లో పరాజయాన్ని చవి చూసింది.

* 1929 లో లాహోర్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశం పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ఆమోదించింది. దీనికి అనుకూలంగా స్వరాజ్యపార్టీ శాసనసభలను బహిష్కరించి, చివరకు కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగమైంది.

ప్రాధాన్యం

      బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా ఉంటూ నిరాశ, నిస్పృహలో ఉన్న సాధారణ ప్రజానీకంలో ఉత్సాహం నింపడానికి ప్రయత్నం చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని మొదట ప్రతిపాదించింది స్వరాజ్యపార్టీనే. సైమన్ కమిషన్ నియామకం దీని కృషి ఫలితమే. శాసన మండళ్లలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని బహిర్గతం చేయడంలో విజయం సాధించింది. వీరి ప్రయత్నాల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం చివరకు ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి, రాష్ట్రాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి ఇవ్వడానికి అంగీకరించింది.
 

సైమన్ కమిషన్ 

బ్రిటిష్ ప్రభుత్వం 1927 నవంబరు 8 న సర్ జాన్ సైమన్ అధ్యక్షతన ఇండియన్ స్టాట్యుటరీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భారతీయులకు స్థానం లేకపోవడంతో ఈ కమిషన్‌ను బహిష్కరించాలని నిర్ణయించారు.
 

* మద్రాసులో 1927 డిసెంబరులో ఎం.ఎ. అన్సారీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సైమన్ కమిషన్‌ను అన్ని దశలు, అన్ని రూపాల్లో బహిష్కరించాలని నిర్ణయించారు. ఆల్ ఇండియా లిబరల్ ఫెడరేషన్, ముస్లిం లీగ్, హిందూ మహాసభ మొదలైన రాజకీయ పార్టీలు కూడా సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని తీర్మానించాయి.

* అయితే ముస్లింలలో ఒక వర్గం, ఐరోపావారు, ఆంగ్లో-ఇండియన్లు, అణగారిన వర్గాలు ఈ కమిషన్‌ను స్వాగతించాయి. సైమన్ కమిషన్ 1928 ఫిబ్రవరి 3 న బొంబాయిలో అడుగుపెట్టింది. ఆ రోజున దేశవ్యాప్త హర్తాళ్ పాటించారు. కమిషన్ కలకత్తా, లక్నో, పూనా, విజయవాడ, లాహోర్‌లలో పర్యటించింది. నల్లజెండాల ప్రదర్శన, 'సైమన్ వెనక్కి వెళ్లు' (సైమన్ గో బ్యాక్) నినాదాలతో నిరసన తెలిపారు.

* లక్నోలో జవహర్‌లాల్ నెహ్రూ, జి.బి. పంత్‌లపై లాఠీఛార్జ్ జరిగింది. 1928 అక్టోబరులో లాహోర్‌లో లాలా లజపతిరాయ్‌ని పోలీసులు తీవ్రంగా కొట్టారు. గాయాలపాలైన ఆయన చివరకు అదే ఏడాది నవంబరు 17 న మరణించారు. దీనికి ప్రతీకారంగా శాండర్స్ అనే పోలీసు అధికారిని భగత్‌సింగ్ కాల్చి చంపాడు.

* సైమన్ కమిషన్ 1930, మేలో నివేదిక సమర్పించింది. రాష్ట్రాల్లో ద్వంద్వ ప్రభుత్వ రద్దు, ప్రాతినిధ్య ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యమైన ప్రతిపాదనలు. సైమన్ కమిషన్ నివేదికపై లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో చర్చించారు. ఈ చర్చల ఆధారంగా 1935 చట్టాన్ని రూపొందించారు. అయితే ముస్లిం లీగ్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీలు సైమన్ నివేదికను వ్యతిరేకించాయి. భారతీయులను సంతృప్తిపరచడానికి అప్పటి వైస్రాయి లార్డ్ ఇర్విన్ 1929 అక్టోబరు 31 న (దీపావళి) భవిష్యత్తులో భారతదేశానికి అధినివేశ ప్రతిపత్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. దీన్నే దీపావళి ప్రకటనగా పేర్కొంటారు. 

బట్లర్ కమిటీ

      సైమన్ కమిషన్‌తోపాటు బ్రిటిష్ ప్రభుత్వం 1927 లో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యులు హార్‌కోర్ట్ బట్లర్, హోల్డ్స్ వర్త్, ఎస్.సి. పీల్. స్వదేశీ సంస్థానాలు, బ్రిటిష్ ప్రభుత్వం మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి మార్గాలను సూచించడమే దీని ప్రధాన బాధ్యత. ఈ సంఘానికి అధికారికంగా పెట్టిన పేరు - భారత రాజ్యాల సంఘం. ఈ సంఘం 16 స్వదేశీ సంస్థానాలను సందర్శించి, 1929 లో బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది.
 

నెహ్రూ నివేదిక (1928): నాటి భారత రాజ్య వ్యవహారాల కార్యదర్శి లార్డ్ బిర్కెన్ హెడ్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించగలరా అని భారతీయులకు సవాలు విసిరారు. దీనికి జవాబుగా 1928 ఫిబ్రవరిలో దిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
 

* 1928 లో బొంబాయిలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. కలకత్తాలో జరిగిన అఖిలపక్ష సమావేశం ముందు నెహ్రూ నివేదికను ఉంచారు. దీనిపై మహ్మద్ అలీ జిన్నా, ఎం.ఆర్. జయకర్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.

జిన్నా 14 సూత్రాలు (1929): దిల్లీలో 1929 మార్చిలో జరిగిన ముస్లింలీగ్ సమావేశంలో మహ్మద్ అలీ జిన్నా పద్నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. నెహ్రూ నివేదికను తోసిపుచ్చారు. పద్నాలుగు సూత్రాలను అమలు చేయకుండా భవిష్యత్తులో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన ఏ ప్రణాళికా ముస్లింలకు ఆమోదయోగ్యం కాదని ప్రకటించారు.

Posted Date : 05-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌