• facebook
  • whatsapp
  • telegram

74వ రాజ్యాంగ సవరణ చట్టం

* పట్టణ, నగరపాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా పేర్కొనవచ్చు. మున్సిపల్ అనే పదం మున్సిపియం అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. మున్సిపియం అంటే సంఘటితత్వం అని అర్థం.
* భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పట్టణ, నగరపాలక సంస్థలు వర్ధిల్లుతున్నాయి. ప్రాచీన కాలంలో సింధునాగరికత మనదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతకు నిదర్శనం.
* క్రీ.పూ. 2750 - 1750 మధ్య మనదేశంలో సింధునాగరికత వర్థిల్లింది.ఈ కాలంలో...
 అద్భుతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ
 నిర్ణీత కొలతల ప్రకారం భవనాల నిర్మాణం
 ప్రధాన రహదారులను ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే విధంగా నిర్మించడం
 మహాస్నాన వాటిక నిర్మాణాలు
   ఇలా ప్రతి ఒక్కటిని అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా శాంతికాముక పరిపాలనా విధానాలను అనుసరించారు.
* మనదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం చోళులు కాగా, పట్టణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం మౌర్యులు.
* మౌర్యుల రాజధాని నగరం పాటలీపుత్రం. ఈ నగర పాలనను అయిదుగురేసి సభ్యుల చొప్పున, ఆరు బృందాలు (30 మంది) సమర్థంగా పౌరపాలనను నిర్వహించేవని, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన గ్రంథమైన ఇండికాలో వివరించారు.
* మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు, మొగలుల పరిపాలనా కాలంలో పట్టణ, నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో కొత్వాల్ అనే అధికారి కీలకపాత్ర వహించేవారు.
* ఆంగ్లేయులు మనదేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్‌ను 1687లో మద్రాస్‌లో నెలకొల్పారు.
* 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను నెలకొల్పారు.
* 1793 ఛార్టర్ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పించడానికి ఆంగ్లేయులు తొలిసారిగా ప్రయత్నించారు.
* 1870లో లార్డ్‌మేయో తీర్మానం భారతదేశంలో పట్టణ, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో, భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నించింది.
* 1882లో లార్డ్‌రిప్పన్ తీర్మానం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలను ఎక్కువగా కల్పిస్తూ, వాటి నిర్వహణలో అధికారుల సంఖ్యను 3వ వంతు తగ్గించేందుకు ప్రయత్నించింది.

 

1907 రాయల్ కమిషన్ సిఫారసులు

* 1907లో ఛార్లెస్ హాబ్‌హౌస్ నాయకత్వంలోని రాయల్ కమిషన్ అధికారాల వికేంద్రీకరణ కోసం కింది సిఫార్సులను చేసింది.

    A. పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో అధికారుల సంఖ్యను తగ్గించడం.
    B. ఓటు హక్కుపై ఉండే పరిమితిని తొలగించి, విస్తృత పరచడం.
    C. ఆర్థిక వనరులను అధికంగా కేటాయించడం.
* 1919లో మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రస్థాయిలో ద్వంద్వపాలనను ప్రవేశపెట్టారు.
* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తిని కల్పించారు.
 భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని నిర్దేశిక నియమాల్లోని ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి.
 పట్టణంలో/ నగరంలో నివసించే పౌరులు ఆమోదించి, ఎన్నుకున్న వ్యక్తులతో స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం ఏర్పాటైన సంస్థను పురపాలక సంస్థ/ నగరపాలక సంస్థ అంటారు.
 క్రీ.పూ. 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో 16 నగర రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.
 ఎల్. ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభలో చర్చిస్తున్న కాలంలోనే సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.
 పునర్వ్యవస్థీకరించిన నగరపాలక బిల్లును వి.పి. సింగ్ ప్రభుత్వం 1990, సెప్టెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టి విఫలమైంది.
 పి.వి. నరసింహారావు ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంట్ 1992, డిసెంబరు 22న ఆమోదించింది.
 పార్లమెంట్ ఆమోదం పొందిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది 1993, జూన్ 1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ రాజ్యాంగానికి IX(A) అనే నూతన భాగాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆర్టికల్ 243(P) నుంచి 243(ZG) వరకు ఉండే మొత్తం 18 ప్రకరణల్లో పట్టణ ప్రభుత్వాల గురించి పొందుపరిచారు.
 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారానే రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చి పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

 

74వ రాజ్యాంగ సవరణ చట్టం - విశేషాలు
 

ఆర్టికల్ 243(P): పట్టణ ప్రభుత్వాల నిర్వచనాన్ని తెలియజేస్తుంది.
* స్థానిక సంస్థల్లోని మున్సిపల్ సంస్థల నిర్వచనాలను గవర్నరు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.

* రాష్ట్రప్రభుత్వం గవర్నరు నోటిఫికేషన్‌ను అనుసరించి, కింది అంశాలపై చట్టాల ద్వారా నిర్వచనాలను రూపొందిస్తుంది.
1. జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.
2. పంచాయతీ: ఆర్టికల్, 243(B) ప్రకారం పంచాయతీగా ఏర్పాటు చేసిన ప్రాంతం.
3. జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
4. కమిటీ: ఆర్టికల్ 243(S) ప్రకారం ఏర్పాటైన కమిటీ.
5. మున్సిపల్ ప్రాంతం: గవర్నరు నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం.
6. మున్సిపాలిటీ: ఆర్టికల్, 243(Q) ప్రకారం ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
7. మెట్రోపాలిటన్ ప్రాంతం: 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం.

 

ఆర్టికల్ 243(Q): మున్సిపల్ సంస్థల వ్యవస్థాపన
1. మెట్రోపాలిటన్ నగరాలు: 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

2. నగరపాలక సంస్థలు: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు.
3. మున్సిపల్ కౌన్సిల్: 20 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మున్సిపల్ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.
4. నగర పంచాయతీలు: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు. వీటి కనీస జనాభా 11 వేల పైన, 20 వేల లోపు ఉంటుంది.
5. టౌన్‌షిప్‌లు: భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసే సంస్థలు.

 

ఆర్టికల్ 243(R) మున్సిపల్ వ్యవస్థల నిర్మాణం
* మున్సిపల్ ఛైర్‌పర్సన్, నగర కార్పొరేషన్ మేయర్, మెట్రోపాలిటన్ నగర మేయర్‌లు అంటే ఆయా సంస్థల అధిపతులు. వీరిని ఆయా సంస్థలకు చెందిన సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.

* నగర పంచాయతీల అధ్యక్షుల ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనే అంశాన్ని రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. పట్టణ, నగరపాలక సంస్థలు ఏ పార్లమెంటు నియోజక వర్గ పరిధి కిందకు వస్తాయో, సంబంధిత పార్లమెంటు సభ్యులు, శాసనసభల సభ్యులు ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్‌ల సభ్యులు కూడా ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.
* ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటుహక్కు కల్పించే అంశంపై రాష్ట్రప్రభుత్వం చట్టం చేయవచ్చు.
* 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటుహక్కు కల్పించింది.

 

ఆర్టికల్, 243(S): వార్డులు, వార్డు కమిటీల ఏర్పాటు
* పట్టణ, నగరపాలక సంస్థలను కొన్ని వార్డులు/ డివిజన్లుగా విభజిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహుళ సభ్య వార్డుల ఏర్పాటును సుప్రీంకోర్టు సమర్థించింది.

మెట్రోపాలిటన్ నగరాలు:
* మెట్రోపాలిటన్ నగరాలను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. వీటిలో 100 - 200 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికైనవారిని కార్పొరేటర్లు అంటారు.

* గ్రేటర్ ముంబై కార్పొరేషన్‌లో 228 డివిజన్లు ఉన్నాయి.
 

మున్సిపల్ కార్పొరేషన్:
* మున్సిపల్ కార్పొరేషన్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. కార్పొరేష‌న్‌లో 50 - 100 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికయ్యే సభ్యులను కార్పొరేటర్లు అంటారు.

మున్సిపాలిటీ

* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను కౌన్సిలర్లు అంటారు. మున్సిపాలిటీలో వార్డు సభ్యుల సంఖ్య 23 - 50 వరకు ఉంటుంది.
 

నగర పంచాయతీ
* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను వార్డు సభ్యులు అంటారు. నగర పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్య 15 - 21 వరకు ఉంటుంది.

* 3 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.
* రెండు లేదా అంత కంటే ఎక్కువ వార్డులు/ డివిజన్‌లు కలిసి వార్డు కమిటీగా ఏర్పాటైనప్పుడు ఆ వార్డులు/ డివిజన్‌ల సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.
* ఈ వార్డు కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తాయి.

 

ఆర్టికల్ 243 (T)
 

* పట్టణ, నగరపాలక సంస్థల్లో కొన్ని స్థానాలను జనాభా ప్రాతిపదికపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.
* వెనుకబడిన వర్గాలకు (OBC) రిజర్వేషన్లు కల్పించే అంశంపై 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేసింది.
* ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాలవారికి 34% స్థానాలను రిజర్వ్ చేస్తున్నారు.
* మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని మున్సిపాలిటీలో, ముగ్గురిని మున్సిపల్ కార్పొరేషన్‌లో కో ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసుకునే వీలుంది.
* ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా ప్రస్తుతం మనదేశంలో 11 రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల్లో మొత్తం స్థానాల్లో 50% స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు.
* వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వెనుకబడిన తరగతుల్లో జన్మించినవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని వివాహం చేసుకున్న అగ్ర కుల స్త్రీలు వెనుకబడిన తరగతులకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీచేయడానికి అర్హులు కాదని 2005లో సుప్రీంకోర్టు పేర్కొంది.

 

ర్టికల్ 243 (U): పదవీకాలం
* అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 5 సంవత్సరాలు.

* పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు.
* పదవీకాలం ముగియకముందే ఈ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు.
* ఏ కారణం వల్లనైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేసినట్లయితే, రద్దయిన 6 నెలల్లోగా తప్పనిసరిగా ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.
* ఏవైనా స్థానాలకు ఖాళీలు ఏర్పడినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకునే సభ్యుల పదవీకాలం మిగిలిన పదవీకాలం వరకే వర్తిస్తుంది. అయితే సంస్థ మొత్తం ఎన్నికలు కాలయాపన ద్వారా ఆలస్యం జరిగితే పూర్తి పదవీకాలం కొనసాగవచ్చు. సంస్థ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

 

ఆర్టికల్ 243 (V): అర్హతలు, అనర్హతలు
* పట్టణ, నగరపాలక సంస్థల్లోని అన్ని స్థాయుల్లో అధ్యక్షులు, వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.

* పార్లమెంటు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.
* స్థానిక సంస్థలకు పోటీచేసేవారి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి.
* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.

 

ఆర్టికల్ 243 (W): అధికారాలు, విధులు
* 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థలకు 18 రకాల అధికారాలు, విధులను బదిలీ చేయాలని నిర్దేశించారు.

* వీటిలో 11 విద్యుక్త (తప్పనిసరి) అంశాలు కాగా, 7 ఐచ్ఛిక అంశాలు. ఈ అధికారాల బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు.
 

పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులు:
    1. నగర ప్రణాళిక
    2. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి
    3. భూమి సమర్థవంత వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణలు
    4. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు
    5. రహదారులు, వంతెనలు
    6. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ
    7. అగ్నిమాపక వ్యవస్థ
    8. ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల, చెత్త నియంత్రణ
    9. పరిశ్రమలకు, గృహాలకు నీటివసతి
    10. వీధి దీపాలు, బస్‌స్టాండ్‌ల నిర్వహణ
    11. బలహీనవర్గాల సంరక్షణలు, వికలాంగులకు వసతి
    12. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు
    13. కబేళాలపై నియంత్రణ

Posted Date : 31-01-2021

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు