• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రప్రదేశ్‌ - ఇంధన వనరులు

 తరిగిపోయే.. తిరిగి తయారయ్యే!

ఆర్థిక వ్యవస్థ సజావుగా, ప్రగతిపథంలో సాగేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల్లో విద్యుత్తు కీలకం. విద్యుత్తు రంగం వ్యవస్థాగతంగా బలంగా ఉండి నిలకడగా విద్యుత్తును సరఫరా చేసే స్థితిలో ఉంటేనే అభివృద్ధి వేగంగా జరుగుతుంది. వ్యవసాయ ప్రధానమైన ఆంధ్రప్రదేశ్‌లో నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరిగినప్పుడే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయి. గతంలో అమలైన విద్యుత్తు రంగ సంస్కరణలు ఏపీకి పురోగామి రాష్ట్రంగా పేరు తెచ్చాయి. రాష్ట్రంలో విద్యుత్తు రంగ స్థితిగతులు, అందుకు అవసరమైన సంప్రదాయ, సంప్రదాయేతర వనరుల లభ్యతపై పోటీ పరీక్షార్థులకు సమగ్ర అవగాహన ఉండాలి. తరిగిపోయే సంప్రదాయ, తిరిగి తయారయ్యే సంప్రదాయేత ఇంధన వనరుల గురించి వివరంగా తెలుసుకోవాలి. 

దేశాభివృద్ధిలో ఇంధన వనరులు అత్యంత కీలకం. వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, ఆర్థికాభివృద్ధికి విద్యుత్తు తప్పనిసరి. ప్రధానంగా బొగ్గు, డీజిల్, సహజవాయువు, పెట్రోలియం ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి జరుగుతుంది. ప్రస్తుతం దేశంలో విద్యుత్తు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో ఉంది. మొదటి 3 స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి.ఇంధన వనరులు ప్రధానంగా రెండు రకాలు.


1) సంప్రదాయ ఇంధన వనరులు: వీటిని పునరుత్పాదక రహిత ఇంధన వనరులు అని కూడా అంటారు. నిల్వలు పరిమితం. ఇవి తిరిగి ఏర్పడటానికి మానవ జీవితకాలం కంటే చాలా ఎక్కువ సమయం కావాలి. ఒకసారి తరిగిపోతే పునరుద్ధరించడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. వీటి వినియోగం వల్ల హరిత గృహవాయువుల విడుదల పెరిగి పర్యావరణానికి హాని జరుగుతుంది. 

ఉదా: బొగ్గు, ముడిచమురు, సహజవాయువు, అణువిద్యుత్తు. ప్రస్తుతం ఇవే ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. అయితే ఈ వనరుల లభ్యత అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండదు.


2) సంప్రదాయేతర ఇంధన వనరులు: పునరుత్పాదక వనరులు అంటే పునరుద్ధరించగలిగినవి లేదా త్వరగా భర్తీ అయ్యేవి. వీటి వినియోగంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగదు. కానీ నూతన సాంకేతిక పరిజ్ఞానం, అధిక పెట్టుబడులు అవసరం. 

ఉదా: సౌరశక్తి, పవనశక్తి, తరంగశక్తి, భూతాపశక్తి, బయోమాస్, బయోగ్యాస్, జీవ ఇంధనాలు, చిన్నతరహా జలవిద్యుత్తు.

ఆధునిక ఇంధన వనరులు: ఇవి పూర్తిగా కొత్తతరం శక్తివనరులు. ఇప్పుడిప్పుడే వినియోగంలోకి వస్తున్నాయి. 

ఉదా: హైడ్రోజన్‌ శక్తి, జియోథర్మల్‌ శక్తి, సముద్ర తరంగ శక్తి, ఓషన్‌ థర్మల్‌ గ్రేడియంట్‌ ఎనర్జీ.


థర్మల్‌ విద్యుత్తు

బొగ్గు, నీటిఆవిరి, సహజవాయువు ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేపట్టడాన్ని థర్మల్‌ విద్యుత్తు అంటారు. ప్రపంచంతో పాటు మన దేశం, రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్తు అధికంగా వినియోగంలో ఉంది. దేశంలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి (2023)లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్‌. దేశంలో థర్మల్‌ విద్యుత్తు ఉత్పాదన, నిర్వహణ కోసం 1975లో విగిశిది (నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌) ఏర్పాటైంది.


ఏపీలో థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలు:

విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌: దీనికి నార్ల తాతారావు థర్మల్‌ విద్యుత్తు కేంద్రం అని పేరు పెట్టారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద థర్మల్‌ విద్యుత్తు కేంద్రం. ఉత్పాదక సామర్థ్యం - 1760 మెగావాట్లు.

* 4000 మె.వా., అంతకంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాలను అల్ట్రా మెగా పవర్‌ ప్రాజెక్టు అని, 1000 మె.వా. విద్యుత్తు ఉత్పత్తి చేసే కేంద్రాలను సూపర్‌ థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలని అంటారు.

సింహాద్రి సూపర్‌ థర్మల్‌ స్టేషన్‌: దీనిని 2002లో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇందులో మొత్తం నాలుగు ప్లాంట్లు 2000 మె.వా. సామర్థ్యం (4 × 500)తో ఉన్నాయి. జపాన్‌ సహకారంతో ఎన్‌టీపీసీ స్థాపించి నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా చేసే థర్మల్‌ స్టేషన్‌ ఇది.


రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌: దీనిని వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు వద్ద నెలకొల్పారు. ఈ కేంద్రంలో 5 యూనిట్లు ఉన్నాయి. మూడు దశల్లో అభివృద్ధి చేశారు. స్థాపిత సామర్థ్యం 1050 మెగావాట్లు.(5 × 210)


దామోదరం సంజీవయ్య విద్యుత్తు కేంద్రం: దీనిని నెల్లూరు జిల్లా, ముత్తుకూరు మండలం కృష్ణపట్నం సమీపంలో 2016, ఫి‡బ్రవరి 27న ప్రారంభించారు. ఉత్పాదక సామర్థ్యం 1600 మె.వా. దీనికి అవసరమైన బొగ్గును ఒడిశాలోని తాల్చేరు గనుల నుంచి 70%, విదేశాల నుంచి 30% దిగుమతి చేసుకుంటున్నారు. రెండో దశలో మరో 800 మె.వా. ప్లాంటు నిర్మించనున్నారు.


వైజాగ్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌: దీన్ని విశాఖపట్నం జిల్లా పాలవలస వద్ద హిందూజా నేషనల్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ నిర్మించింది. స్థాపిత సామర్థ్యం 1040 మె.వా. (2 × 520)


గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రాలు: రాష్ట్రంలో మొదటి గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రం విజ్జేశ్వరం (1990). రాష్ట్రంలో దాదాపు 14 గ్యాస్‌/డీజిల్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రాలను స్థాపించారు. సహజవాయువు తగినంత లభించక వీటిలో చాలావరకు పనిచేయడం లేదు.

* ఆంధ్రప్రదేశ్‌ గ్యాస్‌ పవర్‌ కార్పొరేషన్‌ను 1988లో స్థాపించారు.

* రాష్ట్రంలో కృష్ణా-గోదావరి బేసిన్‌ పరిధిలో సహజ వాయువు నిల్వలు విరివిగా ఉన్నాయి.

* ప్రస్తుతం రాష్ట్రంలో సహజ వాయువు ఆధారిత విద్యుత్తు ఉత్పత్తి 907.64 మెగావాట్లు.


1) విజ్జేశ్వరం సహజవాయువు విద్యుత్తు కేంద్రం: పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు మండలం, విజ్జేశ్వరం గ్రామంలో 1990లో స్థాపించారు. దేశంలో ప్రభుత్వ రంగంలో మొదటిసారి ఏర్పాటైన గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు ప్లాంట్‌ ఇది. దక్షిణ భారతదేశంలో సహజ వాయువు ఆధారిత విద్యుత్తు కేంద్రం కూడా ఇదే. ఆసియాలో అత్యంత వేగంగా పూర్తయిన విద్యుత్తు ఉత్పాదన కేంద్రంగా పేరొందింది. దీని సామర్థ్యం 272 మె.వా. (నోట్‌: 2022, ఏప్రిల్‌ 4న జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణతో విజ్జేశ్వరం గ్రామం తూర్పు గోదావరి జిల్లాకు మారింది.)


2) జేగురుపాడు సహజవాయువు విద్యుత్తు కేంద్రం: దేశంలో ప్రైవేటు రంగంలో ఏర్పాటైన మొదటి గ్యాస్‌ ఆధారిత విద్యుత్తు కేంద్రం. దీన్ని 1997లో ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడు వద్ద ఉంది.

జల విద్యుత్తు


శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రం: దీనిని నీలం సంజీవరెడ్డి జలవిద్యుత్తు కేంద్రం అని పిలుస్తారు. 1964లో నిర్మాణం ప్రారంభమైంది. 1982-83లో విద్యుత్తు ఉత్పత్తి మొదలైంది. శ్రీశైలం కుడికాలువ విద్యుత్తు కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది. దీని ఉత్పత్తి సామర్థ్యం 770 మె.వా. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని అతిపెద్ద జల విద్యుత్తు కేంద్రం.


తుంగభద్ర జలవిద్యుత్తు కేంద్రం: ఈ పథకం కింద రెండు విద్యుత్తు కేంద్రాలున్నాయి. 1957లో తుంగభద్ర ఆనకట్ట వద్ద ఒకటి, కాలువ మీద హంపి దగ్గర మరొకటి నిర్మించారు. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేశాయి. 80:20 నిష్పత్తిలో ఖర్చు, విద్యుత్తు వినియోగాన్ని పంచుకుంటున్నాయి. దీని ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సరఫరా అవుతుంది. ఇందులో భాగంగా ఏపీ వాడుకునే విద్యుత్తు 28.8 మె.వా.


మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్తు కేంద్రం: గోదావరి ఉపనది మాచ్‌ఖండ్‌ నదిపై ఉన్న డుడుమా జలపాతంపై 1955లో ఈ విద్యుత్తు కేంద్రాన్ని నిర్మించారు. ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో ఉన్న ఈ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు 70:30 నిష్పత్తిలో సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. మొత్తం ఉత్పత్తి 120 మె.వా. అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 84 మె.వా. ఇక్కడి నుంచి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు విద్యుత్తు సరఫరా అవుతుంది.


దిగువ సీలేరు జలవిద్యుత్తు ప్రాజెక్టు: సీలేరు నదికి దిగువన భద్రాచలం సమీపంలో (తడికెవాగు, సీలేరు నది కలిసే చోట) నిర్మించారు. విద్యుత్తు ఉత్పత్తి 1976లో ప్రారంభమైంది. ఉత్పత్తి సామర్థ్యం 460 మె.వా.


ఎగువ సీలేరు జల విద్యుత్తు కేంద్రం: మాచ్‌ఖండ్‌ విద్యుత్తు కేంద్రం దిగువన సీలేరు నది మీద మరగంటాడ వద్ద నిర్మించారు. దీని పవర్‌ హౌస్‌ విశాఖ జిల్లా చింతపల్లికి 64 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ విద్యుత్తు ఉత్పత్తి ప్రతి కిలోవాట్‌కి సుమారు రూ.600/- మాత్రమే అవుతుంది. దీని నిర్మాణ వ్యయం కేవలం రూ.19 కోట్లు. ఉత్పత్తి సామర్థ్యం 240 మె.వా.


నాగార్జునసాగర్‌ కుడి కాలువ జలవిద్యుత్తు కేంద్రం: నందికొండ (పల్నాడు జిల్లా) వద్ద కృష్ణా నదిపై నిర్మించారు. 1978లో విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభమైంది. ఉత్పాదక సామర్థ్యం 815.6 మె.వా.


పెన్నా అహోబిలం జలవిద్యుత్తు కేంద్రం: పెన్నా నదిపై అహోబిలం వద్ద ఒక్కొక్కటి 10 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం ఉండే 2 యూనిట్లు నిర్మించారు. దీని మొత్తం ఉత్పాదక సామర్థ్యం 20 మె.వా.


పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు: ఆంధ్రప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.5,339 కోట్ల వ్యయంతో (12 × 80) 960 మెగావాట్ల విద్యుత్తు కేంద్రం పనులు కొనసాగుతున్నాయి. మొదటి 3 యూనిట్లు 2024, జులై నుంచి ప్రారంభమవుతాయి. 2026, జనవరి నాటికి మొత్తం యూనిట్లు వినియోగంలోకి రానున్నాయి.


డొంకరాయి జల విద్యుత్తు కేంద్రం: తూర్పు గోదావరి జిల్లా దిగువ సీలేరు నది నుంచి నిర్మించిన డొంకరాయ కాలువపై 25 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్తు కేంద్రం నిర్మించారు. 1983లో ఉత్పత్తి ప్రారంభమైంది.


బలిమెల జల విద్యుత్తు కేంద్రం: ఇది ఆంధ్రప్రదేశ్‌ - ఒడిశాల ఉమ్మడి ప్రాజెక్ట్‌. ఇరు రాష్ట్రాలు 50 : 50 భాగస్వామ్యంతో ఒడిశాలోని కోరాపుట్‌ జిల్లాలో బలిమెల డ్యామ్‌ జలవిద్యుత్తు కేంద్రం నిర్మించాయి. ఉత్పత్తి సామర్థ్యం 30 మె.వా.


చెట్టిపేట మినీ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌: పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్మించారు. ఉత్పాదక సామర్థ్యం 1 మె.వా.

 



రచయిత: దంపూరు శ్రీనివాస్‌ 

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌