• facebook
  • whatsapp
  • telegram

అరబ్బుల దండయాత్రలు

అరబ్బుల దండయాత్రనాటికి భారతదేశ పరిస్థితులు

క్రీ.శ 7వ శతాబ్దం ద్వితీయార్ధంలో ఉత్తర భారతదేశంలో ఏర్పడిన అనేక చిన్న రాజ్యాలు తమలో తాము కలహించుకోవడం ప్రారంభించాయి. 

* క్రీ.శ. 712 నాటికి ఉత్తర భారతదేశంలోని కనౌజ్, మాళ్వా, కశ్మీర్, సింధు, బెంగాల్, నేపాల్, అసోంలు స్వతంత్రంగా ఉండేవి.

* క్రీ.శ. 703లో నేపాల్‌ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది. ఇది భారతదేశానికి దూరంగా ఉండటంతో నాటి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించలేదు. 

* క్రీ.శ. 8వ శతాబ్దం ప్రారంభంలో కనౌజ్‌ యశోవర్మ పాలనలో ఉంది. 

* ​​​​​​​ మాళ్వా రాజ్యం రాజపుత్రులకు చెందిన ప్రతిహార వంశం అధీనంలో ఉండేది. వీరి రాజధాని ఉజ్జయిని. మాళ్వా రాజు మొదటి నాగభట్టుడు అరబ్బుల దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 

* ​​​​​​​ అదే సమయంలో కశ్మీర్‌ను లలితాదిత్యుడు పాలించేవాడు. ఇతడు పంజాబ్, కనౌజ్, కాబుల్‌ రాజ్యాలను జయించాడు. కనౌజ్‌ రాజు యశోవర్మను యుద్ధంలో వధించాడు.

* ​​​​​​​ సింధ్‌ రాజ్యాన్ని బ్రాహ్మణ రాజైన దాహిర్‌ పాలించేవాడు. ఇతడు పరమతసహనాన్ని పాటించక, బౌద్ధులను అనేక బాధలకు గురిచేశాడు. దీంతో ప్రజల్లో ఇతడి పట్ల వ్యతిరేకత పెరిగి, అరబ్బులకు సహకరించారు. 

* ​​​​​​​ అరబ్‌ యువరాజు మహమ్మద్‌-బీన్‌-ఖాసిం సింధ్‌ను ఆక్రమించి, దేశంలో ముస్లిం పాలనను ప్రారంభించాడు. 

* ​​​​​​​ బెంగాల్‌ను పాల వంశానికి చెందిన గోపాలుడు; అసోంను భాస్కరవర్మ పాలించేవారు. ఈ రాజ్యాల మధ్య ఐకమత్యం లేదు. 

* ​​​​​​​ దక్షిణ భారతదేశంలోనూ పల్లవులు, చాళుక్యులు, చోళులు, పాండ్యులు, చేర రాజ్యాల మధ్య నిరంతరం యుద్ధాలు జరిగేవి. 

* ​​​​​​​ ఉత్తర, దక్షిణ భారతదేశాల్లో ఇదే విధమైన రాజకీయ అనైక్యత చోటు చేసుకుంది. దీన్ని అవకాశంగా మలచుకున్న అరబ్బులు తక్కువ కాలంలోనే భారతదేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నారు.


ఖలీఫాలు 

ఉమ్మాయిద్‌ వంశం వారు మక్కాలో ‘ఖలీఫా’ (ఇస్లాం రాజ్యానికి గురువు) పదవిని సృష్టించి ఇస్లాం మత వ్యాప్తికి కృషిచేశారు.

భారత్‌పై అరబ్బుల తొలి దండయాత్రలు అరబ్బులకు భారత్‌ను జయించాలనే కోరిక బలంగా ఉండేది. వీరు భారత్‌లోని వ్యాపారుల నుంచి దేశం గురించిన పూర్తి సమాచారం సేకరించి, దాడికి పథకం రచించారు.

* ​​​​​​​ వీరు భారతదేశంలో ఉన్న విగ్రహారాధన, బహుదేవతారాధనను నాశనం చేసి, ఇస్లాంను స్థాపించాలనే లక్ష్యంతో దండయాత్రలు ప్రారంభించారు. 

* ​​​​​​​ మొదటిసారి క్రీ.శ.636లో ఠానా, తర్వాత 643లో బ్రోచ్, దెబాల్‌పై దాడులు చేశారు. అవి విఫలం అయ్యాయి. 

* ​​​​​​​ క్రీ.శ.8వ శతాబ్దం నాటికి బెలూచిస్థాన్‌ను మహమ్మదీయులు గెలిచారు. భారత్‌పై దాడులకు ఇది కేంద్రంగా మారింది.

* ​​​​​​​ మహమ్మద్‌ ప్రవక్త క్రీ.శ. 632లో మరణించాక అతడి మామ అబూబకర్‌ మొదటి ఖలీఫాగా (క్రీ.శ. 632), తర్వాత ఒమర్‌ రెండో ఖలీఫాగా (క్రీ.శ.633 నుంచి 644 వరకు) ఉన్నారు. 

* ​​​​​​​ ఒమర్‌ సిరియా, ఈజిప్ట్, పర్షియాలను జయించాడు. తర్వాత ఒమ్మాయిడ్‌లు తిరుగుబాటు చేసి, ఖలీఫా స్థానాన్ని మక్కా నుంచి డమస్కస్‌కు మార్చారు. వీరు మొరాకో, స్పెయిన్, ఫ్రాన్స్, మధ్యఆసియాల్లో ఇస్లాంను వ్యాప్తి చేశారు. 

* ​​​​​​​ భారత్‌లో సింధ్‌ను ఆక్రమించే సమయంలో ‘ఖలీఫా’గా ఉన్నది మొదటి వాలిద్‌.

* ​​​​​​​ ఖలీఫా అబ్దుల్లా తన పీఠాన్ని డమస్కస్‌ నుంచి బాగ్దాద్‌కి మార్చాడు.


ఫలితాలు

ఈ దండయాత్రలతో ముస్లింలు భారత్‌లోకి చొచ్చుకుని రాలేకపోయినప్పటికీ, తర్వాతి కాలంలో భారత్‌ను తమ అధీనంలోకి తెచ్చుకోగలమనే విశ్వాసాన్ని కల్పించాయి.

* భవిష్యత్తులో జరిగే దండయాత్రలను సమష్టిగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై భారతీయులు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

* భారత్‌లోని ముస్లిం పాలకులు అరబ్‌ గవర్నర్ల అధికారాన్ని లెక్కచేయలేదు. దీంతో అరబ్బులు కోపంతో భారత్‌పై దాడి చేయాలనుకున్నారు. దీని పర్యవసానమే గజనీ దండయాత్రలు.

* అరబ్బులు పంటలో 2/5 వంతును పన్నుగా వసూలు చేశారు. హిందువులపై జిజియా పన్ను (ముస్లిం మతస్థులు కానివారిపై) వేశారు. దేశంలో ఖురాన్‌ చట్టాన్ని అమలు చేశారు. 

*   అరబ్బులు మన నుంచి ఖగోళశాస్త్రం, వైద్యం, గణితం, తత్వశాస్త్రాలను నేర్చుకున్నారు. చరక సంహిత, పంచతంత్ర గ్రంథాలు అరబ్బీ భాషలోకి తర్జుమా అయ్యాయి. 

* అరబ్బు ఖగోళ శాస్త్రవేత్త అబుమషార్‌ బెనారస్‌లో భారతీయ శాస్త్రాలను అధ్యయనం చేశాడు. భారతదేశానికి చెందిన సాహిత్య, ఖగోళ గ్రంథాలను అరబ్బీ, పర్షియన్‌ భాషల్లోకి తర్జుమా చేశారు.

* ముల్తాన్, మలబార్‌ అరబ్బుల సాంస్కృతిక కేంద్రాలయ్యాయి.

* రాజ్యాధికారం సింధూ, ముల్తాన్‌ ప్రాంతాలకే పరిమితమైంది.

* బాగ్దాద్‌కి చెందిన ఖలీఫాలు హిందూ పండితులను తమ ఆస్థానానికి ఆహ్వానించారు. ముఖ్యంగా మంకా, సెవా లాంటి హిందూ పండితులు ఖలీఫా హారున్‌ అల్‌రషీద్‌ ఆస్థానానికి వెళ్లారు. 

* ‘‘అరబ్బుల దండయాత్ర ఫలితాలు ఇవ్వని అద్భుత విజయమని’’ లెన్‌పూల్‌ అనే చరిత్రకారుడు వ్యాఖ్యానించారు.


అరబ్బుల చరిత్ర

అరబ్బులు నైరుతి ఆసియాలోని ఒక ద్వీపకల్పంలో నివసించేవారు. వీరు ప్రధానంగా పశుపాలన, వ్యాపారం చేసేవారు.

* మహమ్మద్‌ ప్రవక్త జన్మించేనాటికి అరబ్బులకు స్థిర నివాసం లేదు. దేశదిమ్మరులుగా ఉండేవారు. వీరికి మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. విగ్రహారాధన చేసేవారు. వారిలో ఐకమత్యం లేదు. అతిసామాన్య జీవితం గడిపేవారు. 

* మహమ్మద్‌ ప్రవక్త తన సిద్ధాంతాల ద్వారా అరబ్బులందరినీ ఏకం చేశారు. తన బోధనల ద్వారా వారిలో చైతన్యం తెచ్చారు. అదే ఇస్లాం మతంగా రూపొందింది. ఈ మతంలో పూజలు, విగ్రహారాధన, ఆడంబరాలు, ఆర్భాటాలు ఉండవు.

* ‘‘దేవుడు ఒక్కడే, మనుషులంతా సమానం, భక్తి ద్వారా మోక్షం పొందవచ్చని’’ మహమ్మద్‌ ప్రవక్త (క్రీ.శ 570-632) బోధించారు. ఈ సిద్ధాంతాలన్నింటినీ ఖురాన్‌లో పొందుపరిచారు. అరబ్బులు ముఖ్యంగా ఇస్లాం మత వ్యాప్తి కోసమే అనేక దేశాలపై దండెత్తారు. 


* దీంతో మొదటిసారి ఇస్లాం మతం అరేబియా సరిహద్దులు దాటి ఖండాంతరాలకు వ్యాపించింది. ఈజిప్ట్, సిరియా, పాలస్తీనా, ఇరాక్, మెసపటోమియా, పర్షియా దేశాలకు విస్తరించింది. తాము ఆక్రమించిన రాజ్యాలపై ఇస్లాం మతాన్ని బలవంతంగా రుద్దారు. 

* అరబ్బులకు ప్రాచీన కాలం నుంచే భారతీయులతో వ్యాపార సంబంధాలు ఉండేవి. వీరు ఇస్లాంను భారత్‌లోనూ వ్యాప్తి చేయాలని భావించారు. దేశంలో అమితంగా ఉన్న సిరిసంపదలు వీరిని మరింత ఆకర్షించాయి. అదే సమయంలో దేశంలోని రాజకీయ అనైక్యత వీరికి కలసివచ్చి, అనతి కాలంలోనే భారత్‌లో ముస్లిం రాజ్యాన్ని స్థాపించారు.


సింధ్‌ ఆక్రమణ

క్రీ.శ. 708లో శ్రీలంక రాజు బాగ్దాద్‌లోని ఖలీఫా వాలిద్‌కి బహుమానంగా కొంత సంపదను పంపాడు. అరేబియా సముద్రం మీదుగా ఓడలో తరలిస్తుండగా, ఆ సంపదను గుజరాత్‌ సమీపంలో సముద్రపు దొంగలు దోచుకున్నారు. 

* పర్షియా పాలకుడు హజ్జజ్‌ ఖలీఫా సంపదను అప్పగించాల్సిందిగా సింధ్‌ పాలకుడైన దాహిర్‌ను ఆదేశించాడు. దీనికి దాహిర్‌ సమాధానం చెప్పలేదు.

*  దీంతో దాహిర్‌ నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేసేందుకు ఉబయదుల్లా, బుదాయిల్‌లను భారత్‌పైకి దండెత్తమని హజ్జజ్‌ ఆజ్ఞాపించాడు. దాహిర్‌ సైన్యం వారిని ఓడించింది.

* దీంతో దాహిర్‌ను ఓడించేందుకు హజ్జజ్‌ తన బావమరిది మహమ్మద్‌-బీన్‌-ఖాసింను పంపాడు. అతడు క్రీ.శ. 712, జూన్‌ 20న పెద్ద సైన్యంతో దాహిర్‌పై దండెత్తి అతడ్ని ఓడించి, సింధ్‌ను  ఆక్రమించాడు. 

* ఖాసిం సింధ్‌ నుంచి అపార సంపదను, బంగారాన్ని దోచుకుని ఖలీఫాకు కానుకగా పంపాడు. 

* దాహిర్‌ - ఖాసిం మధ్య జరిగిన యుద్ధాన్ని ‘రేవార్‌ యుద్ధం’ అంటారు.

Posted Date : 17-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌