• facebook
  • whatsapp
  • telegram

రక్తవర్గాలు

వర్ణం ఒక్కటే.. వర్గాలు వేర్వేరు! '


ప్రమాదాల్లో, ప్రసవాల్లో అధిక రక్తస్రావం వల్ల మరణాలు సంభవించడం తరచూ కనిపిస్తుంటుంది. వీటిని నివారించడానికి, శస్త్ర చికిత్సల సమయాల్లో అవసరమైన రక్తాన్ని ఎక్కిస్తుంటారు. కొన్ని రకాల వ్యాధులకు రక్తమార్పిడులు చేస్తుంటారు. మనుషులందరి శరీరాల్లో ప్రవహించే రక్తం ఎరుపు వర్ణంలో ఒకే విధంగా కనిపించినప్పటికీ, అందులో తేడాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికీ ఒకే రకమైన రక్తాన్ని ఇవ్వడం కుదరదు. అందుకే  ఎవరికి ఏ వర్గం సరిపోతుందో నిపుణులు నిర్ణయిస్తారు. నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైన ఈ అంశాలను పోటీ పరీక్షల అభ్యర్థులు క్షుణ్ణంగా, శాస్త్రీయంగా తెలుసుకోవాలి. ప్రధానంగా ఉన్న నాలుగు రక్తవర్గాలతో పాటు అరుదైన వర్గాల గురించి తగిన అవగాహన పెంపొందించుకోవాలి. 


రక్తమార్పిడిలో రెండు రకాలను పరిగణనలోకి తీసుకుంటారు. అవి (1) A, B, AB, O రక్తవర్గాలు. (2) Rh రకం రక్తవర్గం. ఈ రెండింటిని సరిపోల్చి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి రక్తమార్పిడి చేస్తారు.

A, B, AB, O రకం రక్తవర్గం: లాండ్‌ స్టీనర్‌ అనే శాస్త్రవేత్త ఈ రక్తవర్గాన్ని కనుక్కున్నారు. ఎర్రరక్త కణాలపై ఉండే యాంటీజెన్‌ (ప్రతిరక్షక జనకం), ప్లాస్మాలోని యాంటీబాడీ (ప్రతిరక్షక దేహం)ల ఆధారంగా వీటిని వర్గీకరించారు. ప్రతి రక్త గ్రూపులో ఒక్కోరకం యాంటీజెన్‌లు, యాంటీబాడీలు ఉంటాయి.

 A - రక్తవర్గంలో ఎర్రరక్త కణాలపైన A యాంటీజెన్, ప్లాస్మాలో B యాంటీబాడీలు ఉంటాయి.


*   B రక్తవర్గంలో ఎర్రరక్త కణాలపై B యాంటీజెన్, ప్లాస్మాలో A యాంటీబాడీలు ఉంటాయి. 


*  AB రక్తవర్గంలో ఎర్రరక్త కణాలపై AB యాంటీజెన్‌లుంటాయి, ప్లాస్మాలో ఎలాంటి యాంటీబాడీలు ఉండవు.


*  O రక్తవర్గంలో ఎర్రరక్త కణాలపై ఎలాంటి యాంటీజెన్‌లుండవు, ప్లాస్మాలో AB యాంటీబాడీలు ఉంటాయి.


A, B, AB, O - రక్తవర్గంలో రక్తమార్పిడి: 


*  A రక్తవర్గం ఉన్నవారు A, AB రక్తవర్గాలున్న వ్యక్తులకు రక్తం దానం చేయవచ్చు. A, O రక్త వర్గాల వారి నుంచి స్వీకరించవచ్చు.


 B రక్తవర్గం వ్యక్తులు B, AB రక్తవర్గాలున్న వారికి ఇవ్వవచ్చు. B,O రక్తవర్గాల వ్యక్తుల నుంచి స్వీకరించవచ్చు.


 AB రక్తవర్గం వారు కేవలం AB రక్తవర్గానికి చెందిన వారికి మాత్రమే దానం చేయం కుదురుతుంది. అలాగే A, B, AB, O రక్తవర్గాల నుంచి (అన్ని రక్తవర్గాల వారి నుంచి) స్వీకరించవచ్చు. అందుకే AB రక్తవర్గాన్ని విశ్వ గ్రహీత అంటారు.

Rh-కారకం Rh రక్తవర్గం: మొదటగా రీసస్‌ అనే కోతిలో ఈ కారకాన్ని కనుక్కున్నారు. Rh కారకం అనేది ఒక యాంటీజెన్‌. ఇది ఎర్ర రక్తకణాలపై ఉంటుంది. Rh కారకాన్నే D యాంటీజెన్‌ అని అంటారు. ఇది రెండు రకాలు. అవి 1) Rh పాజిటివ్‌ (Rh+), (2) Rh నెగెటివ్‌ (Rh-)

Rh+: ఎవరి ఎర్రరక్త కణాలపైన  Rh యాంటీజెన్‌ ఉంటుందో వారిని Rh+ (Rh+ పాజిటివ్) రక్తవర్గంగా పరిగణిస్తారు.

Rh-: ఎవరి ఎర్రరక్త కణాలపైన Rh యాంటీజెన్‌ ఉండదో వారిని (Rh- నెగెటివ్‌) రక్తవర్గంగా పరిగణిస్తారు.

Rh- : రక్తవర్గం రక్త మార్పిడి, శిశుజనన సమయంలో ప్రధానపాత్ర వహిస్తుంది.


Rh   వర్గ రక్తమార్పిడి: సాధారణంగా రక్తమార్పిడి సమయంలో Rh+ రక్తవర్గాన్ని Rh+ వ్యక్తికి; Rh-రక్తవర్గాన్ని  Rh- వ్యక్తికి మాత్రమే ఇస్తారు. కానీ, అత్యవసర సమయంలో Rh+రక్తవర్గాన్ని Rh- రక్తవర్గం ఉన్న వ్యక్తులకు ఇవ్వవచ్చు. అయితే Rh+ రక్తవర్గాన్ని Rh- రక్తవర్గం ఉన్నవారికి ఇవ్వకూడదు. ఆ విధంగా ఇచ్చినట్లయితే  Rh- రక్తవర్గం ఉన్న వ్యక్తుల్లో Rh+ వ్యతిరేక యాంటీబాడీలు తయారై Rhఎర్రరక్త కణాలపై దాడి చేసి వాటిని నశింపజేస్తాయి.


*      Rh- రక్తవర్గం వ్యక్తులు Rh- , Rh+ వ్యక్తులకు దానం చేయవచ్చు.


*    Rh- రక్తవర్గం  Rh-  నుంచి మాత్రమే స్వీకరిస్తుంది.


*    Rh+ రక్తవర్గం వ్యక్తులు Rh+వ్యక్తులకు మాత్రమే దానం చేయవచ్చు.


*      Rh+ రక్తవర్గం Rh- , Rh+ నుంచి స్వీకరిస్తుంది.


శిశు జననంలో Rh కారకం పాత్ర: తల్లిదండ్రుల Rh రక్తవర్గం కొన్నిసార్లు శిశుజననంపై వ్యతిరేక ప్రభావం చూపి శిశు మరణానికి కారణమవుతుంది.తల్లి రక్తవర్గం  Rh-, తండ్రి రక్తవర్గం Rh+ ఉన్నప్పుడు వీరికి పుట్టిన మొదటి శిశువు Rh+ లేదా Rh-  ఎవరైనా కావొచ్చు. ఈ పుట్టిన శిశువు ఆరోగ్యంగా ఉంటుంది. మొదటి శిశువు రక్తవర్గం Rh+ అయి ఉండి తరువాత జన్మించిన శిశువు రక్తవర్గం కూడా Rh+ అయినప్పుడు ఆ శిశువు గర్భంలోనే మరణించే అవకాశం ఉంది. దీనికి కారణం మొదటి Rh+ శిశువు జన్మించినప్పుడు శిశువు నుంచి Rh+ ఎర్రరక్త కణాలు తల్లి శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల Rh- రక్తవర్గం ఉన్న తల్లి శరీరంలో Rh+ వ్యతిరేక యాంటీబాడీలు ఏర్పడతాయి. రెండో శిశువు Rh+ రక్తవర్గంతో గర్భంలో ఉన్నప్పుడు అప్పటికే మొదటి Rh+ శిశువు వల్ల తల్లి శరీరంలో ఏర్పడిన Rh+ వ్యతిరేక యాంటీబాడీలు పుట్టబోయే Rh+ రక్తవర్గం శిశువు శరీరంలోని ఎర్రరక్త కణాలపై దాడి చేసి వాటిని నశింపజేయడం వల్ల  Rh+ రక్తవర్గం ఉన్న శిశువు తల్లి గర్భంలోనే మరణించే అవకాశం ఉంది. దీన్నే ఎరిథ్రోబ్లాస్టోసిస్‌ ఫీటాలిస్‌ లేదా హీమోలైటిక్‌ డిసీజ్‌ ఆఫ్‌ న్యూబోర్న్‌ అంటారు. దీన్ని నివారించడానికి తల్లికి రోగామ్‌ (Rhogam) ఇంజక్షన్‌ను మొదటి Rh+ శిశువు జననం తరువాత ఇవ్వాలి.

A, B, AB, O, Rh కారకం రక్తవర్గాలను అనుసరించి రక్త మార్పిడి:


1) A+ రక్తవర్గం A+, AB+ రక్తవర్గాలకు దానం చేస్తుంది.


2) A+ ర రక్తవర్గం A+ A-, O+, Oరక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


3) A- రక్తవర్గం A+ , A-, AB+, AB- రక్తవర్గాలకు దానం చేస్తుంది.


4) A- రక్తవర్గం A-, O- రక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


5) B+ రక్తవర్గం B+, AB+రక్తవర్గాలకు దానం చేస్తుంది.


6) B+రక్తవర్గం B+, B-, O+, O- రక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


7) B- రక్తవర్గం B+, B-, AB+, AB-  రక్తవర్గాలకు దానం చేస్తుంది.


8) B- రక్తవర్గం B-,O- రక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


9) AB+ రక్తవర్గం AB+రక్తవర్గానికి మాత్రమే దానం చేయగలదు.


10) AB+ రక్తవర్గం A+ , A-, B+, B-, AB+, AB- ,O+, O- లాంటి అన్ని రకాల రక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది. కాబట్టి AB*+ రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అంటారు.


11) AB- రక్తవర్గం AB-,AB+ రక్త వర్గానికి దానం చేస్తుంది.


12)  AB- రక్తవర్గం A-, B-, AB- , Oరక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


13) O+ రక్తవర్గం A+, AB+, O+ రక్తవర్గాలకు దానం చేస్తుంది.


14) O+ రక్తవర్గం O+, O-  రక్తవర్గాల నుంచి స్వీకరిస్తుంది.


15) O- రక్తవర్గం A+ , A-, B+, B-, AB+, AB- ,O+, O-  లాంటి అన్ని రక్తవర్గాలకు దానం చేస్తుంది కాబట్టి Oను విశ్వదాత అంటారు.


16) O- రక్తవర్గం O- రక్తవర్గం నుంచి మాత్రమే స్వీకరిస్తుంది.

అరుదైన, ఇతర రక్త వర్గాలు:


1) బాంబే (Bombay) రక్త వర్గం: hh బ్లడ్‌ గ్రూప్‌గా పిలిచే దీనిని మొదట ముంబయిలో కనుక్కున్నారు.


2) Rh నల్‌ (Rh null) రక్త వర్గం: ప్రపంచంలోనే అరుదైన రక్త వర్గాల్లో ఇదొకటి. దీన్ని గోల్డెన్‌ బ్లడ్‌ గ్రూప్‌ అంటారు.


3) INRA రక్త వర్గం: దీన్ని ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో కనుక్కున్నారు. ప్రపంచంలో పది మంది కంటే తక్కువ వ్యక్తుల్లో ఈ రక్తవర్గం ఉండవచ్చని భావిస్తున్నారు.


రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే కారకాలు (క్లాటింగ్‌ ఫ్యాక్టర్స్‌)


1) ఫ్యాక్టర్‌ - I  = ఫైబ్రినోజెన్‌


2) ఫ్యాక్టర్‌ - II = ప్రోత్రాంబిన్‌


3) ఫ్యాక్టర్‌ - III = టిష్యూ థ్రాంబోప్లాస్టిన్‌ 


4) ఫ్యాక్టర్‌ - IV = కాల్షియం అయాన్‌లు


5) ఫ్యాక్టర్‌ - V =  లేబుల్‌ కారకం (Labile Factor)


6) ఫ్యాక్టర్‌ - VI =ఎసిల్లరిన్‌  (Accelerin) (ఇటీవల దీనికి అంతగా ప్రాముఖ్య లేదని గమనించారు)


7) ఫ్యాక్టర్‌ - VII - స్టేబుల్‌ ఫ్యాక్టర్‌


8) ఫ్యాక్టర్‌   - VIII -  యాంటీ హీమోఫిలిక్‌ ఫ్యాక్టర్‌. ఇది మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా A వ్యాధి వస్తుంది. ఇది జన్యుసంబంధ వ్యాధి.


9) ఫ్యాక్టర్‌  - IX -  క్రిస్‌మస్‌ ఫ్యాక్టర్‌ లేదా ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్‌ కాంపోనెట్‌. ఇది మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా B వ్యాధి వస్తుంది. ఇది కూడా జన్యుసంబంధ వ్యాధి.


10) ఫ్యాక్టర్‌ - X - స్టుఅర్ట్‌ పవర్‌ కారకం (stuart power factor)


11) ఫ్యాక్టర్‌ - XI -  ప్లాస్మా థ్రాంబోప్లాస్టిన్‌ యాంటీసిడెంట్‌. ఇది మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల హీమోఫీలియా A వ్యాధి కలుగుతుంది. ఇది జన్యుసంబంధ వ్యాధి.


12) ఫ్యాక్టర్‌ - XII -హేజ్‌మాన్‌ కారకం


13) ఫ్యాక్టర్‌ -XIII -  ఫైబ్రిన్‌ స్టెబిలైజింగ్‌ ఫ్యాక్టర్‌

మాదిరి ప్రశ్నలు

1. A, B, AB, O రక్తవర్గాలను వేటి ఆధారంగా వర్గీకరించారు?

1) యాంటీజెన్‌లు, యాంటీబాడీల ఆధారంగా

2) ఎర్రరక్త కణాల సంఖ్య ఆధారంగా

3) తెల్లరక్త కణాల సంఖ్య ఆధారంగా

4) తెల్లరక్త కణాల ఆకారం ఆధారంగా



2. ఏ రక్తవర్గాన్ని విశ్వదాత అంటారు?

1) O  2) O   3) AB+    4) AB-



3. ఏ రక్తవర్గాన్ని విశ్వగ్రహీత అంటారు?

1) AB-    2) B+   3) AB+    4) B-



4. ఎరిథ్రోబ్లాస్టోసిస్‌ ఫీటాలిస్‌ అనేది కిందివాటిలో దేనితో సంబంధం చూపుతుంది?

1) శిశువుకు చెందిన Rh కారకంతో

2) తల్లి A, B, AB, O రక్తవర్గంతో

3) తండ్రి A, B, AB, O రక్తవర్గంతో

4) శిశువు A, B, AB, O రక్తవర్గంతో


5. ఎవరెవరి మధ్య వివాహం జరిగినప్పుడు పుట్టబోయే Rh+ · రెండో శిశువులో ఎరిథ్రోబ్లాస్టోసిస్‌ ఫీటాలిస్‌ కలుగుతుంది?

1) Rh+  తల్లి X Rh- తండ్రి

2) Rh- తల్లి X Rh+  తండ్రి

3) Rh+ తల్లి X Rh+ తండ్రి 

4) Rh- తల్లి X Rh- తండ్రి



6. ఏ కారకలోపం వల్ల హీమోఫీలియా-A వ్యాధి వస్తుంది? 

1) ఫ్యాక్టర్‌ 4     2) ఫ్యాక్టర్‌ 6      3) ఫ్యాక్టర్‌ 8    4) ఫ్యాక్టర్‌ 10


 

7. ఫ్యాక్టర్‌ IX మన శరీరంలో తయారు కాకపోవడం వల్ల కలిగే వ్యాధి- 

1) హీమోఫీలియా-A  2) కలర్‌ బ్లైండ్‌ నెస్‌

3) హీమోఫీలియా-C  4) హీమోఫీలియా-B


 

8. O- రక్త వర్గం కింది దేన్నుంచి మాత్రమే రక్తాన్ని స్వీకరిస్తుంది.

1) O   2) O-   3) AB   4) AB-


సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-1; 5-2; 6-3; 7-4; 8-2.

రచయిత: డాక్టర్‌ బి.నరేశ్‌ 

Posted Date : 06-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌