• facebook
  • whatsapp
  • telegram

బౌద్ధమతం

          క్రీ.పూ.6వ శతాబ్దంలో భారతదేశంలో ఆవిర్భవించిన మతాల్లో ప్రధానమైంది బౌద్ధమతం. దీన్ని గౌతమ బుద్ధుడు స్థాపించాడు. భారతదేశ సాహిత్యం, వాస్తు, కళా రంగాలకు బౌద్ధమతం ఎనలేని సేవలను అందించింది. ఈ మతం క్రమంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది.
 

గౌతమ బుద్ధుడు

          గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. ఇతడు కపిలవస్తు రాజ్యానికి చెందిన శాక్య వంశీయుడు. తండ్రి శుద్ధోధనుడు, తల్లి మాయాదేవి (మహామాయ). సిద్ధార్థుడు క్రీ.పూ.563లో ప్రస్తుత నేపాల్‌లోని లుంబినీ వనంలో జన్మించాడు. తల్లి మరణంతో సవతి తల్లి ప్రజాపతి గౌతమి వద్ద పెరిగాడు. చిన్నతనంలోనే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకున్నాడు. 19వ ఏట యశోధరను వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు రాహులుడు. సిద్ధార్థుడు ఒకరోజు కపిలవస్తు నగరంలో పర్యటిస్తుండగా వృద్ధుడు, వ్యాధిగ్రస్తుడు, మృతదేహం, సన్యాసుడిని చూశాడు. ఈ నాలుగు దృశ్యాలు అతడి ఆలోచనలో మార్పు తీసుకువచ్చాయి. మొదటి మూడు దృశ్యాల వల్ల జీవితం దుఃఖమయమని గ్రహించాడు. సన్యాసి తనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ ఎంతో సంతోషంగా ఉండటాన్ని గమనించాడు. ‘దుఃఖం లేని జీవితాన్ని సాధించడం ఎలా?’ అని తెలుసుకోవడానికి 29వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలి వెళ్లిన వారిని పరివ్రాజకుడు అంటారు.
 

మహాభినిష్క్రమణం: సిద్ధార్థుడు తన 29వ ఏట ఇంటి నుంచి వెళ్లిపోవడాన్ని మహాభినిష్క్రమణం అంటారు. రథసారథి చెన్నడు సాయంతో అడవికి వెళ్లి తన రాజదుస్తులు, ఆభరణాలను తండ్రికి పంపించాడు. సిద్ధార్థుడి గుర్రం కంఠక ఆ దృశ్యాన్ని చూసి మరణించింది. అనంతరం ఇతడు వివిధ ప్రాంతాలకు వెళ్లి అనేక మంది గురువుల వద్ద శిష్యరికం చేశాడు. ఈయన గురువుల్లో ప్రధానమైనవారు అలారక, ఉద్దరక. 35వ ఏట ప్రస్తుత బిహార్‌లోని గయ ప్రాంతంలో ఒక రావిచెట్టు కింద 40 రోజుల ధ్యానం తర్వాత జ్ఞానాన్ని పొందాడు.
 

సంబోధి: బుద్ధుడు గయలో రావిచెట్టు కింద 40 రోజుల తపస్సు అనంతరం జ్ఞానాన్ని పొందడాన్నే ‘సంబోధి’ అంటారు. ఈయన తపస్సుకు భంగం కలిగించడానికి మార అనే దుష్టశక్తి ప్రయత్నించినట్లు, ఆ సమయంలో భూదేవి దాన్ని అంతమొందించినట్లు బౌద్ధసాహిత్యం పేర్కొంది. బౌద్ధమతంలో దీన్నే భూస్పర్శ ముద్రగా పేర్కొంటారు. సంబోధి చెందిన అనంతరం సిద్ధార్థుడిని బుద్ధుడిగా, గయను బుద్ధగయగా, రావిచెట్టును బోధివృక్షంగా పిలుస్తున్నారు.
 

ధర్మచక్ర పరివర్తన: గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన అనంతరం ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జింకలతోటలో తన పూర్వ సహచరులైన అయిదుగురికి తొలి ఉపదేశాన్ని ఇచ్చాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తన అంటారు. అందుకే అశోకుడు వారణాసి సమీపంలోని సారనాథ్‌లో స్తంభశాసనం, స్తూపాన్ని వేయించాడు. ఈ సారనాథ్‌ రాతిస్తంభ శాసనం నుంచే మన జాతీయ ముద్ర (సింహతలాటం) ను తీసుకున్నారు.
 

అష్టాంగమార్గం

      దుఃఖనివారణకు, మోక్షసాధనకు బుద్ధుడు చెప్పిన ఎనిమిది సూత్రాలను అష్టాంగమార్గం అంటారు. దుఃఖం, కోరికలు నశించాలంటే వీటిని పాటించాలి.
 

సూత్రాలు

1) సరైన దృష్టి                                       2) సరైన లక్ష్యం
3) సరైన వాక్కు                                     4) సరైన జీవనం
5) సరైన క్రియ                                       6) సరైన ఆలోచన
7) సరైన శ్రమ                                        8) సరైన ధ్యానం

 

 బోధనలు
            బుద్ధుడి బోధనలు లేదా బౌద్ధమత సిద్ధాంతాలను ఆర్యసత్యాలు అంటారు. గౌతమబుద్ధుడు నాలుగు ప్రధాన సిద్ధాంతాలను ప్రబోధించాడు.
1) ఈ ప్రపంచం మొత్తం దుఃఖమయం (దుఃఖ)
2) దుఃఖానికి కారణం కోరికలు (సముదయ)
3) దుఃఖం పోవాలంటే కోరికలు నశించాలి (నిరోధ)
4) కోరికలు నశించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి (మార్గ)

 

     వేదాలు ప్రామాణికం కాదని, యజ్ఞయాగాల వల్ల మోక్షం రాదని, కులమత భేదాలు పాటించరాదని, జీవహింసచేయకూడదని, అసత్యం మాట్లాడవద్దని, అవినీతికి పాల్పడరాదని, ఇతరుల ఆస్తిని స్వాధీనం చేసుకోకూడదని బుద్ధుడు బోధించాడు. కాశీ, మగధ, కపిలవస్తు, వైశాలి లాంటి రాజ్యాలను సందర్శిస్తూ తన ధర్మాన్ని ప్రచారం చేసి, అనుచరులను బౌద్ధ సంఘంగా ఏర్పరిచాడు. క్రీ.పూ.483లో 80వ ఏట ప్రస్తుత ఉత్తర్‌ ప్రదేశ్‌లోని కుశినగరంలో మహాపరి నిర్యాణం చెందాడు.
 

త్రిరత్నాలు: జైనమతంలో ప్రస్తావించినట్లు బౌద్ధమతంలో కూడా త్రిరత్నాల గురించి ప్రస్తావించారు. బుద్ధుడు, ధర్మం, సంఘం అనేవి బౌద్ధ త్రిరత్నాలు. వీటినే బౌద్ధ సంప్రదాయంలో.....
1) బుద్ధం శరణం గచ్ఛామి
2) ధర్మం శరణం గచ్ఛామి
3) సంఘం శరణం గచ్ఛామి అని పేర్కొంటారు.
ప్రతి బౌద్ధ మతస్తుడు వీటిని తప్పనిసరిగా ఆచరించాలి.

 

మధ్యేమార్గం: బౌద్ధమతం మోక్షసాధనకు చూపిన మార్గాన్ని మధ్యేమార్గం అంటారు. జైనమతం మోక్షసాధనకు అహింసతో కూడిన సల్లేఖన వ్రతాన్ని సూచించగా, బుద్ధుడు అష్టాంగమార్గాన్ని తెలియజేశాడు. బౌద్ధమతాన్నే ప్రతీయ - సముత్పాదన సిద్ధాంతంగా పేర్కొంటారు.
 

సాహిత్యం: బౌద్ధమత గ్రంథాలను త్రిపీటకాలు అంటారు. అవి వినయ పీటకం, సుత్త పీటకం, అభిదమ్మ పీటకం. వీటిని ప్రాకృత భాషలో రచించారు. హీనయానులు ప్రాకృత భాషను ఉపయోగించగా, మహాయానులు సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో సుహృల్లేఖ, రత్నావళి రాజపరికథ, ఆరోగ్యమంజరి, రససిద్ధాంతం లాంటి గ్రంథాలను రచించాడు. వీటితో పాటు సింహళ గ్రంథాలైన మహావంశ, దీపవంశ విలువైన సాహిత్యంగా పేరొందాయి.
 

శాఖలు
            బౌద్ధమతం కాలానుగుణంగా కొన్ని శాఖలుగా చీలిపోయింది. ముఖ్యంగా రెండో బౌద్ధ సంగీతిలో సంప్రదాయవాదులు థేరవాదులుగా, సంప్రదాయేతరవాదులు మహాసాంఘికులుగా చీలిపోయారు. నాలుగో బౌద్ధ సంగీతిలో తిరిగి బౌద్ధం హీనయాన, మహాయాన శాఖలుగా చీలిపోయింది. హీనయానులు బుద్ధుడిని సాధారణ మానవుడిగా భావించగా, మహాయానులు దేవుడిగా విశ్వసించి పూజించారు.
 

 సాహిత్యం, వాస్తుకళారంగం
           భారతదేశానికి బౌద్ధమతం సాహిత్యం, వాస్తు, కళారంగాల్లో ఎనలేని సేవలను అందించింది. ప్రపంచ వ్యాప్తంగానూ ప్రాచుర్యం పొందింది. అశోకుడు, కనిష్కుడు లాంటి పాలకుల వల్ల బౌద్ధమతం శ్రీలంక, బర్మా, జపాన్, చైనా, టిబెట్‌ దేశాలకు వ్యాపించింది. భారత వాస్తుకళకు పేరొందిన సాంచి, సారనాథ్, బార్హూత్, అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాల్లో స్తూపాలను నిర్మించారు. స్తూప, చైత్య, విహారాలు దేశమంతా విస్తరించాయి. బౌద్ధ ఆరామాలైన నలంద, నాగార్జునకొండ, వల్లభి ప్రసిద్ధ విశ్వవిద్యాలయాలుగా పేరొందాయి. ముఖ్యంగా బౌద్ధమత ప్రేరణతో గాంధార, అమరావతి శిల్పకళలు అభివృద్ధి చెందాయి. ప్రాకృత, సంస్కృత భాషలతో పాటు ప్రాంతీయ భాషల్లో కూడా బౌద్ధ సాహిత్యం వెలువడింది. నాసిక్, కార్లే, కన్హేరి, అజంతా గుహాలయాల్లో చిత్రలేఖనాలు అభివృద్ధి చెందాయి. బౌద్ధ విహారాలు ఎక్కువగా ఉన్నందున బిహార్‌ను విహార దేశంగా పిలిచేవారు.
 

బౌద్ధ సంగీతులు
        బుద్ధుడి మరణానంతరం బౌద్ధమత అభివృద్ధికి జరిగిన సమావేశాలనే బౌద్ధ సంగీతులుగా పేర్కొన్నారు. మొత్తం నాలుగు బౌద్ధసంగీతులు జరిగాయి.
 

మొదటి సంగీతి: ఇది క్రీ.పూ.483లో రాజగృహంలో అజాతశత్రువు కాలంలో జరిగింది. మొదటి బౌద్ధ సంగీతికి మహాకశ్యపుడు అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలోనే మొదటి రెండు పీటకాలను (వినయ, సుత్త) సంకలనం చేశారు.
 

రెండో సంగీతి: ఇది క్రీ.పూ.383లో వైశాలి నగరంలో కాలాశోకుడి కాలంలో జరిగింది. దీనికి అధ్యక్షుడు సబకామి.
 

మూడో సంగీతి: ఇది క్రీ.పూ.250లో పాటలీపుత్రంలో అశోకుడి కాలంలో జరిగింది. ఈ సమావేశానికి మొగలిపుతతిస్స అధ్యక్షత వహించాడు. ఈ సంగీతిలోనే అభిదమ్మ పీటకాన్ని సంకలనం చేశారు.
 

నాలుగో సంగీతి: ఇది క్రీ.శ.100లో కశ్మీర్‌ (కుందనవనం)లో కనిష్కుడి కాలంలో జరిగింది. దీనికి వసుమిత్రుడు అధ్యక్షుడు, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడు.
 

బుద్ధుడి జీవితంలో ముఖ్యమైన వారు

           తండ్రి           శుద్ధోధనుడు
 తల్లి  మహామాయ
 భార్య   యశోధర
 పుత్రుడు  రాహులుడు
 బౌద్ధమతంలో చేరిన వేశ్య  ఆమ్రపాలి
 బౌద్ధమతంలో చేరిన దొంగ  అంగుళీమాలుడు
 బుద్ధుడికి గంజి ఇచ్చిన బాలిక (తపస్సుకు ముందు)  సుజాత
 గురువులు   అలారక లామా, ఉద్దారక
 ప్రియశిష్యుడు  ఆనందుడు
 బౌద్ధ సంఘంలో చేరిన తొలి మహిళ  ప్రజాపతి గౌతమి (తొలి బౌద్ధ సన్యాసిని)

 

పంచకల్యాణాలు: బుద్ధుడి జీవితంలో చోటుచేసుకున్న అయిదు ప్రధాన సంఘటనలను బౌద్ధసాహిత్యంలో పంచకల్యాణాలుగా పేర్కొంటారు.

 సంఘటనలు  గుర్తు
 బుద్ధుడి జననం  తామర పువ్వు
 మహాభినిష్క్రమణం  గుర్రం
 సంబోధి  బోధివృక్షం
 ధర్మచక్ర పరివర్తన   చక్రం
 మహాపరి నిర్యాణం  స్తూపం


 

 రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌