• facebook
  • whatsapp
  • telegram

శీతోష్ణ మార్పులు

ప్రకృతి రక్షణ కవచాలకు తూట్లు!

 


చెట్ల ఆకుల్లో పచ్చదనం తగ్గిపోతోంది. ఎండిపోయి రాలిపోతున్నాయి. పంటచేలు బీడుబారి, వ్యవసాయ ఉత్పత్తులు క్షీణిస్తున్నాయి. చారిత్రక కట్టడాల్లో పగుళ్లు ఏర్పడుతున్నాయి. జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి జీవరాశులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల సంభవించే విపరిణామాలు. మనిషి ఆధునిక జీవన విధానంతో శీతోష్ణస్థితిపై పడుతున్న ప్రభావం వల్ల పర్యావరణానికి కలుగుతున్న హాని, దుష్ఫలితాలు, వాటి నివారణ చర్యల గురించి పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. ఈ పరిస్థితులను అధిగమించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు, నిర్వహించిన సదస్సులు, చేసిన నిర్ణయాలపై అవగాహన పెంచుకోవాలి. 

ఒక భౌగోళిక ప్రాంతంలో గాలిలోని తేమ, ఉష్ణోగ్రత, మేఘాలు, పవనాలు, వర్షపాతం లాంటి వాతావరణ అంశాలను దీర్ఘకాలంలో సగటుగా తీసుకుని శీతోష్ణస్థితిగా పేర్కొంటారు. భూమిపై జీవరాశి అవతరించిన నాటి నుంచి వాటికి శీతోష్ణస్థితితో అన్యోన్యత కొనసాగుతూనే ఉంది. అయితే గత రెండు శతాబ్దాల నుంచి మనిషి సున్నిత, యాంత్రికమైన జీవితం వల్ల కలుషిత వాయువులు గాలిలోకి విడుదలై వికృతీకరణ జరుగుతోంది. ఫలితంగా ఆమ్లవర్షాలు, ఓజోన్‌ పొర క్షీణత లాంటి శీతోష్ణ మార్పులు ఏర్పడి జీవజాతుల మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత, జీవనోపాధి, సుస్థిర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి.


ఆమ్ల వర్షాలు: థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గును మండించినప్పుడు విడుదలైన సల్ఫర్‌ డయాక్సైడ్, వాహనాల నుంచి విడుదలవుతున్న నైట్రోజన్‌ ఆక్సైడ్, అగ్నిపర్వత విస్ఫోటాల ద్వారా బయటపడిన సల్ఫర్, నైట్రోజన్‌ వాయువులు వాతావరణంలోని తేమ, కాంతితో రసాయన చర్య జరుపుతాయి. ఇవి వెంటనే సల్ఫ్యూరిక్‌ ఆమ్లం, నత్రికామ్లం, హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరతాయి. ఆ విధంగా కురిసిన వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు. ఒక శతాబ్దం క్రితమే ఇంగ్లండులోని మాంచెస్టర్‌ నగరంలో ఆమ్ల వర్షాలను మొదటిసారిగా గుర్తించారు. అప్పట్లో ఈ సమస్య తీవ్రతను అంతగా పట్టించుకోలేదు. తర్వాత అది పెనుసవాలుగా మారింది. మన దేశంలో మొదటి ఆమ్ల వర్షాన్ని 1974లో ముంబయిలో గుర్తించారు. ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదట 1852లో స్కాట్‌లాండ్‌కు చెందిన రాబర్ట్‌ అంగస్‌ స్మిత్‌ అనే రసాయన శాస్త్రవేత్త ఉపయోగించారు.


ఆమ్ల వర్షాల ప్రభావం:

* మొక్కల్లో పత్రహరితం క్షీణించి పంటల ఉత్పాదకత తగ్గుతుంది.


* మానవుల్లో నాడీవ్యవస్థ దెబ్బతింటుంది. శ్వాస సంబంధ వ్యాధులు, చర్మ క్యాన్సర్‌లు వస్తాయి.


* నేలలో ఆమ్లత్వం పెరిగి నిస్సారంగా మారతాయి.


* జలాశయాల్లో ఆమ్లత్వం పెరిగి ఆల్గల్‌ బ్లూమ్‌ ఎక్కువగా వ్యాపిస్తుంది. దాంతో బ్యాక్టీరియాలు నశించి, జీవులకు ఆక్సిజన్‌ అందక జలచరాలూ చనిపోతాయి.


* అడవుల్లో ఈ వర్షాలు కురిసినప్పుడు సున్నితమైన కోనిఫెరస్‌ లాంటి వృక్షజాతులు నశించిపోతాయి.


* తాజ్‌మహల్‌ లాంటి చారిత్రక కట్టడాలు కళావిహీనమై, పగుళ్లు, గుంతలు లాంటి స్టోన్‌ లెప్రసీకి గురవుతున్నాయి.


ఆమ్ల వర్షాల ప్రభావాన్ని తగ్గించే చర్యలు


* ఆమ్లత్వం కలిగిన నీటిని, దానిలో గాఢతను నియంత్రించడానికి కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బొనేట్‌ రూపంలో సున్నాన్ని కలపాలి.


* సల్ఫర్‌ తక్కువగా ఉండే ఇంధనాలను వాడాలి. బొగ్గును మండించినప్పుడు అందులోని సల్ఫర్‌ని తొలగించాలి.


* శిలాజ ఇంధనాలకు బదులుగా సౌర, పవన, తరంగ ఆధారిత శక్తిని, హైడ్రోజన్‌ లాంటి హరిత ఇంధనాలను వినియోగించాలి.


* కలుషిత వాయువులను ఎక్కువగా విడుదల చేసే యంత్రాలను నవీకరించాలి.


* సల్ఫర్, నైట్రోజన్‌లను ఆధునిక సాంకేతికతను వినియోగించి హానిరహిత వాయువులుగా మార్చాలి.

ఓజోన్‌ క్షీణత: O3 రూపంలో లేత నీలిరంగులో ఉండే ఓజోన్‌ భూమి ఉపరితలం నుంచి రెండో వాతావరణ పొర అయిన స్ట్రాటో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. దీనిని 1913లో ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్తలు ఛార్లెస్‌ ఫాబ్రి, హెన్రీ బుయేసన్‌ కనుక్కున్నారు. ఓజోన్‌ ధర్మాలను జి.ఎమ్‌.బి.డాబ్సన్‌ అనే బ్రిటిష్‌ శాస్త్రవేత్త వివరించాడు.ఓజోన్‌ పొర మందాన్ని ‘డాబ్సన్‌ యూనిట్‌’లలో కొలుస్తారు. అందుకు వినియోగించే పరికరాన్ని ‘డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌’ అంటారు. ఓజోన్‌ పొర స్ట్రాటో ఆవరణంలో 25-35 కి.మీ. ఎత్తులో 90% కేంద్రీకృతమై ఉంటుంది. మిగిలిన 10% ట్రోపో ఆవరణంలో విస్తరించి ఉంటుంది. ఓజోన్‌ పొర సూర్యుడి నుంచి వస్తున్న సౌర వికిరణంలో శక్తిమంతమైన అతినీలలోహిత కిరణాలను వడపోసి, శక్తిని మాత్రమే భూమి పైకి పంపిస్తుంది. అందువల్ల ఓజోన్‌ పొరను భూమికి రక్షణ కవచం అంటారు.ఓజోన్‌ పొర క్షీణతకు ప్రధాన కారణం రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లు, కంప్యూటర్లు, ప్లాస్టిక్, ఫోమ్‌ల నుంచి విడుదలవుతున్న క్లోరోఫ్లోరో కార్బన్లు (CFC). ఈ ఫ్రియాన్‌ వాయువులకు అత్యధిక స్థిరత్వం ఉండటంతో ఓజోన్‌ను ఎక్కువగా నాశనం చేస్తున్నాయి. ఒక క్లోరిన్‌ పరమాణువు రెండేళ్లపాటు స్ట్రాటో ఆవరణంలో ఉండి O3 ని క్షీణింపజేస్తుంది. పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదలయ్యే నైట్రస్‌ ఆక్సైడ్‌ కూడా ఓజోన్‌ను హరింపజేస్తుంది. మంటలార్పడానికి ఉపయోగించే బ్రోమిన్‌ విడుదల చేసే బ్రోమో ఫ్లోరో కార్బన్లు (BFC) క్లోరిన్‌ కంటే మరింత సమర్థంగా ఓజోన్‌ పైన ప్రభావం చూపిస్తాయి. బెలూన్ల ద్వారా డాబ్సన్‌ ఓజోన్‌ స్పెక్ట్రో ఫొటో మీటర్‌ను పంపించడం ద్వారా తెలుసుకున్న వివరాల ప్రకారం 1970 నుంచి యూరప్‌పై 8% ఓజోన్‌ క్షీణించింది. అంటార్కిటికాపైన ఓజోన్‌కు పెద్ద రంధ్రం ఏర్పడింది. ఇప్పటివరకు భూమి ఉపరితలంపై సరాసరిగా 4% ఓజోన్‌ క్షీణించినట్లు తేలింది.

ఓజోన్‌ క్షీణత - ప్రభావాలు: 

* 4% ఓజోన్‌ తగ్గడం వల్ల 3% అతినీలలోహిత కిరణాలు భూమిని చేరుతున్నాయి. వీటి వల్ల మానవుల్లో కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్లు వస్తున్నాయి.


* రక్తనాళాల్లో రక్తప్రవాహ రేటు పెరిగి, చర్మం ఎర్రబారి బొబ్బలు ఏర్పడుతున్నాయి.


* ల్యూకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌), స్త్రీలలో రొమ్ము క్యాన్సర్లు వస్తున్నాయి. కంటి సంబంధ వ్యాధులు కలుగుతున్నాయి.  


* డీఎన్‌ఏ ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతోంది.


* మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ రేటు, పత్రాల్లో పత్రహరితం తగ్గి త్వరగా రాలిపోతున్నాయి. దాంతో ఉత్పాదకత, వృక్షసంపద తగ్గుతోంది.


* జీవ ఎరువుల్లో ఉపయోగించే సయనో బ్యాక్టీరియా అతినీల లోహిత కిరణాల వల్ల క్షీణించి పంట దిగుబడి తగ్గిపోతుంది. 


* ఓజోన్‌ పొర పలుచగా మారడం వల్ల భౌగోళిక ఉష్ణోగ్రతలు అధికం కావడంతో పాటు ధ్రువాల్లో మంచు కరిగి సముద్రనీటి మట్టం పెరుగుతుంది. ఆ విధంగా జరిగితే అనతికాలంలోనే మాల్దీవులు లాంటి ద్వీప దేశాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. 


ఓజోన్‌ క్షీణత అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు


వియన్నా కన్వెన్షన్‌: ఆస్ట్రియా రాజధాని వియన్నాలో 1985లో జరిగిన సమావేశంలో ఓజోన్‌ క్షీణతకు సంబంధించి పలు సూచనలతో ఒప్పందం రూపొందింది. దీనిపై భారత్‌ సహా 20 దేశాలు సంతకాలు చేశాయి.


మాంట్రియల్‌ ప్రోటోకాల్‌ ఒప్పందం: కెనడాలోని మాంట్రియల్‌ నగరంలో 1987లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందాన్ని 197 దేశాలు ఆమోదించాయి. దీనిపై 1992లో మనదేశమూ సంతకం చేసింది. 2000 నాటి కల్లా ప్రపంచవ్యాప్తంగా క్లోరోఫ్లోరో కార్బన్ల వినియోగాన్ని నిలిపేయాలని ఈ ప్రోటోకాల్‌లో నిర్ణయించారు. ఈ సమావేశం జరిగిన సెప్టెంబరు 16వ తేదీని ‘అంతర్జాతీయ ఓజోన్‌ దినోత్సవం’గా పాటించాలని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీని ఆధ్వర్యంలో ‘గ్లోబల్‌ క్లైమేట్‌ అబ్జర్వింగ్‌ సిస్టమ్‌’, ‘వరల్డ్‌ వెదర్‌ వాచ్‌’ సంస్థలు పనిచేస్తుంటాయి. ఇవి ప్రపంచ శీతోష్ణ మార్పులపై వివరాలను సేకరిస్తాయి.


లండన్‌ సదస్సు: క్లోరోఫ్లోరో కార్బన్‌లకు ప్రత్యామ్నాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి చెందిన దేశాలు ఆ పరిజ్ఞానాన్ని తృతీయ ప్రపంచ దేశాలకు బదిలీ చేయాలని 1992లో లండన్‌లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వీటిని పూర్తిగా నిషేధించాయి. 2030 కల్లా ఓజోన్‌ క్షీణతకు కారణమైన హైడ్రో ఫ్లోరో కార్బన్ల విడుదలను పూర్తిగా నియంత్రిస్తామని భారత్‌ ప్రకటించింది. ఈ మేరకు క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా 134-ఎ పదార్థాన్ని తయారుచేసి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనర్లలో ఉపయోగిస్తున్నారు.


కిగాలి ఒప్పందం: హైడ్రో ఫ్లోరో కార్బన్లను నియంత్రించడమే లక్ష్యంగా 2016, అక్టోబరులో రువాండా రాజధాని కిగాలిలో ఒప్పందం కుదిరింది. ఇది మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ ఒప్పందానికి జరిగిన సవరణ. క్లోరోఫ్లోరో కార్బన్లకు బదులుగా హైడ్రో ఫ్లోరో కార్బన్లు వాడిన దేశాలకు కూడా నష్టాన్ని వివరించి, నిషేధించాల్సిందిగా ఒప్పందం చేశారు. ఈ సమావేశంలో 197 దేశాలు పాల్గొన్నాయి. సభ్యదేశాలను మూడు గ్రూపులుగా విభజించారు. భారత్‌ను వీటిలో 3వ గ్రూప్‌లో చేర్చారు. ఓజోన్‌ పొర పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక సమావేశాలు, ఒప్పందాలు జరుగుతూనే ఉన్నప్పటికీ వాటి అమలులో చిత్తశుద్ధి కరవవుతోంది. ప్రతి దేశం సామాజిక బాధ్యతతో మెలిగి ఒప్పంద నియమాలను అమలుచేస్తేనే ప్రపంచానికి మేలు జరుగుతుంది.


 

రచయిత: జల్లు సద్గుణరావు


 

Posted Date : 16-10-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు