• facebook
  • whatsapp
  • telegram

ఆంధ్రదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు

సంస్కరణలు తెచ్చిన సరికొత్త చైతన్యం!
 

భారతదేశంలో ఆంగ్ల విద్య తెచ్చిన సానుకూలతల్లో సాంస్కృతిక, సంఘ సంస్కరణ ఉద్యమాల గురించి తప్పనిసరిగా ప్రస్తావించుకోవాలి. గత వైభవాన్ని మరచి సాంఘిక దురాచారాలు, మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాల చట్రంలో కూరుకుపోయిన జాతిని తట్టి లేపి, ఆధునిక భావజాలం దిశగా అవి నడిపించాయి. మొదట బెంగాల్‌లో    మొదలైన ఈ చైతన్యం ఆ తర్వాత దేశమంతా వ్యాపించింది. ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతంలో పలువురు సంఘసంస్కర్తలు బ్రహ్మసమాజం కార్యకలాపాలను ప్రచారం చేశారు. బ్రాహ్మణాధిపత్యం, కుల వివక్ష, లింగ అసమానతలను నిరసించారు. పత్రికల ద్వారా జనంలో ఆలోచనా శక్తిని, విచక్షణను పెంపొందించారు. సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను చాటి చెప్పి, స్త్రీ విద్యకు, వితంతు పునర్వివాహాలకు నాంది పలికారు. ఆ మహానుభావులు చేసిన కృషి, సమాజంలో తెచ్చిన మార్పులపై పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆంధ్రా వైతాళికుడిగా ప్రసిద్ధి చెందిన కందుకూరి వీరేశలింగం పంతులు పోరాట పటిమ, అసమాన సేవలను తెలుసుకోవాలి.


సాంస్కృతిక పునరుజ్జీవననాన్ని ఆంగ్లంలో ‘రినైజన్స్‌’ అంటారు.దీనికి అర్థం తిరిగి జన్మించడం.ఈ ఉద్యమాలు ప్రపంచంలో మొదటిసారిగా 15వ శతాబ్దంలో ఐరోపాలోని ఇటలీలో ప్రారంభమయ్యాయి.పునరుజ్జీవనం అనే పదం మొదటిసారిగా వాడినవారు   స్విట్జర్లాండ్‌కు చెందిన ‘జాకబ్‌ బక్‌హర్ట్‌’. ప్రపంచ సాంస్కృతిక పునరుజ్జీవన  పితామహుడు డాంటే.


భారతదేశంలో మొదటి సాంస్కృతిక ఉద్యమాలు 19వ శతాబ్దంలో బెంగాల్‌లో మొదలయ్యాయి. భారతదేశపు సాంస్కృతిక ఉద్యమ పితామహుడు రాజా రామ్‌మోహన్‌ రాయ్‌. ఈయన స్థాపించిన సంస్థలు ఆత్మీయసభ (1815), బ్రహ్మసమాజం (1828). మనదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమాలు ప్రారంభం కావడానికి ప్రధాన కారణం ఆంగ్ల విద్యావ్యాప్తి, పత్రికలు. ఆంధ్రాలో ఈ ఉద్యమాలను నిర్వహించినవారు కందుకూరి వీరేశలింగం.

ఆంగ్ల విద్య: మెకాలే కమిటీ సూచనల మేరకు విలియం బెంటిక్‌ మన దేశంలో 1835లో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టారు. ‘‘ఆంగ్ల విద్య భారతీయులను నాగరికులను చేస్తుంది’’ అన్న అభిప్రాయాన్ని మెకాలే వ్యక్తపరిచారు.  ఆంగ్ల విద్యావిధానం పాశ్చాత్య సంస్కృతీ సంప్రదాయాలను, విజ్ఞాన శాస్త్రాలను భారతీయులకు పరిచయం చేసి ఆధునికీకరించింది. పాశ్చాత్యవాదం, హేతువాదం, మానవతావాదం, వ్యక్తివాదాలను అలవాటు చేసి సంఘంలోని దురాచారాలు, మూఢ విశ్వాసాలను వ్యతిరేకించింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆంగ్ల విద్య వల్ల ప్రభావితులైనవారు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి, రఘుపతి వేంకటరత్నం, కొమర్రాజు లక్ష్మణరావు తదితరులు. నిద్రాణమైన ఆంధ్ర జాతిని జాగృతం చేయడంలో పత్రికలు ప్రధాన పాత్ర పోషించాయి. దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను సమాయత్తం చేసి, ఆధునిక విజ్ఞాన విషయాలపై జిజ్ఞాస రేకెత్తించాయి. తెలుగులో ప్రప్రథమంగా వెలువడిన పత్రిక ‘సత్యదూత’ అనే మాస పత్రిక. ఇది బళ్లారి క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో మద్రాసు నుంచి వెలువడింది.

రఘుపతి వెంకటరత్నం నాయుడు 

మచిలీపట్నంలో 1862లో జన్మించారు. మద్రాసు క్రైస్తవ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. ఈయన బిరుదులు రావు బహద్దూర్, దివాన్‌ బహద్దూర్, సర్, బ్రహ్మర్షి. పండిత శివనాథ శాస్త్రి ఆధ్వర్యంలో బ్రహ్మధర్మ దీక్ష స్వీకరించారు. బ్రహ్మసమాజం ఆదర్శాల వ్యాప్తికి కృషి చేశారు. అనేక కళాశాలల్లో అధ్యాపకుడిగా, మద్రాసు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రాజమండ్రి వద్ద ‘కరుణాలయం’ అనే శరణాలయం స్థాపించారు. వేశ్యావృత్తిని, ధూమపానాన్ని, మద్యపానాలను వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాల కోసం, స్త్రీ విద్య కోసం కృషి చేశారు. బ్రహ్మసమాజ సిద్ధాంతాలు ప్రచారం చేయడానికి ఈయన స్థాపించిన సంస్థలు బ్రహ్మోపాసన మందిరం, ఆంధ్ర బ్రహ్మధర్మ ప్రచారక నిధి. బెంగాలీలో ఉన్న బ్రహ్మసమాజ గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. పిఠాపురంలో బ్రహ్మమందిరం నిర్మించారు. బ్రహ్మ ప్రణాళిక ఫెలో సర్కార్, పీపుల్స్‌ ఫ్రెండ్‌ అనే ఆంగ్లపత్రికలను, బ్రహ్మ ప్రణాళిక అనే తెలుగు పత్రిక నడిపారు. శిష్యులు ఈయనను  అభినవ సోక్రటీస్‌గా పిలిచేవారు. 1939, మే 26న మరణించారు.

ఆంధ్రలో సంఘసంస్కర్తలు 

ఏనుగుల వీరాస్వామి: ఆంధ్ర దేశ సంస్కర్తల్లో మొదటివారు. మద్రాసు న్యాయస్థానంలో దుబాసీగా పనిచేశారు. హిందూ లిట్రసీ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు. విగ్రహారాధనను, కుల వివక్షను ఖండించారు. స్త్రీవిద్యను ప్రోత్సహించారు. ‘కాశీయాత్ర చరిత్ర’ అనే గ్రంథం రచించారు.

గాజుల లక్ష్మీనరసుశెట్టి: మద్రాసులో స్థిరపడిన ఆంధ్రుడు. ‘క్రిసెంట్‌’ అనే పత్రిక స్థాపించారు. 1852లో మద్రాసు నేటివ్‌ అసోసియేషన్‌ స్థాపించారు. వెట్టిచాకిరి, క్రూరమైన కొరడా దెబ్బలు లాంటి శిక్షల నిర్మూలనకు కృషి చేశారు.

సామినేని ముద్దు నరసింహం: ‘హితసూచిని’ గ్రంథం రచించారు. ‘ప్రమేయం’ అనే వ్యాసాలు రాశారు. వేశ్యవృత్తి, బానిసత్వ నిర్మూలనకు కృషి చేశారు. మత్తుపానీయాలు, మంత్రతంత్రాలను వ్యతిరేకించారు.

ఆత్మూరి లక్ష్మీనరసింహం: కందుకూరి వీరేశలింగం ప్రథమ గురువు. పురోహితుల ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. బ్రాహ్మణుల ప్రమేయం లేకుండా యజ్ఞం నిర్వహించి సోమయాజీగా బిరుదు పొందారు. మచిలీపట్నంలో  బ్రహ్మసమాజ భావాలను ప్రచారం చేశారు. స్త్రీ పునర్వివాహాలకు కృషి చేశారు.

అనంతరామ శాస్త్రి: ఈయన నెల్లూరు ప్రాంతానికి చెందినవారు. హరిజన సంఘాన్ని స్థాపించి హరిజనోద్ధరణకు కృషిచేశారు. హరిజనులకు దేవాలయ ప్రవేశం కల్పించారు.

పరవస్తు వేంకట రంగాచార్యులు: ఈయన రచన ‘వితంతు పునర్వివాహ సంగ్రహం’. పునర్వివాహాల కోసం కృషి చేశారు. ఈయనను వ్యతిరేకించింది కొక్కొండ వెంకటరత్నం.


కందుకూరి వీరేశలింగం (1848-1919)

ఈయన బిరుదులు ఆంధ్ర సాంఘిక సంస్కరణ ఉద్యమ పితామహుడు. ఆంధ్రా వైతాళికుడు, గద్య తిక్కన,  యుగకర్త, దక్షిణ భారత విద్యాసాగర్, రావు బహద్దూర్‌.

పత్రికలు: వివేకవర్థిని, హాస్య సంజీవని, సతీహిత బోధిని, తెలుగుజననీ, సత్య సంవర్థిని, సత్యవాదిని.

వీరేశలింగం పంతులు 1848, ఏప్రిల్‌ 16న రాజమండ్రిలో జన్మించారు. తల్లిదండ్రులు పూర్ణమ్మ, సుబ్బారాయుడు. భార్య బాపమ్మ. కేశవ్‌ చంద్రసేన్‌ బోధనలతో చిన్నతనం నుంచే ప్రభావితులయారు. ఆంగ్ల విద్య అభ్యసించారు. విద్య పూర్తయిన తర్వాత 1871లో కోరంగి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా నియమితులయ్యారు. రాజమండ్రి మోడ్రన్‌ ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా చేరారు. 1898లో మద్రాసు వద్ద జరిగిన భారత సంస్కర్తల సభ వీరేశలింగం అధ్యక్షతన జరిగింది. ఈ సమయంలో ఎం.జి.రనడే కందుకూరికి ఇచ్చిన బిరుదు ‘దక్షిణ భారతదేశపు ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌’. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండిట్‌గా పనిచేశారు. పదవీ విరమణ తర్వాత రాజమండ్రిలో స్థిరపడి సంస్కరణ ఉద్యమాలు చేశారు. బాల్యవివాహాలు, వృద్ధ వివాహాలు, వేశ్యా వృత్తి, కన్యాశుల్కం లాంటి సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. 1876లో ‘వివేకవర్థిని’, ‘హాస్య సంజీవని’ అనే పత్రికలు స్థాపించి, సంఘంలోని లోపాలను అధికారుల దుశ్చర్యలను, పెద్దమనుషుల భోగవిలాసాలను తీవ్రంగా విమర్శించారు. రాజమండ్రి జిల్లా జడ్జి వాలెస్‌ దొర అవినీతిని, కావరాజు ప్లీడర్‌ వేశ్యాలోలతను బహిర్గతం చేశారు. సంజీవని పత్రికలో కొక్కొండ వెంకటరత్నం పంతుల్ని విమర్శించారు.


* వీరేశలింగం 1881, డిసెంబరు 11న ఆంధ్రాలో మొదటి వితంతు పునర్వివాహం చేశారు. 1887లో సంస్కరణ సమాజాన్ని, 1897లో ప్రార్థనా సమాజాన్ని రాజమండ్రిలో స్థాపించి వీటి ద్వారా వితంతు పునర్వివాహానికి, స్త్రీ విద్యకు, సాంఘిక దురాచారాల నిర్మూలనకు కృషి చేశారు. తాను ప్రారంభించిన ఉద్యమాలు తన తదనంతరం కూడా కొనసాగడానికి రాజమండ్రిలో హితకారిణి సమాజం స్థాపించారు. 1905లో రాజమండ్రిలో వితంతు శరణాలయం ఏర్పాటు చేశారు. స్త్రీ విద్య కోసం 1874లో ధవళేశ్వరం వద్ద, 1881లో రాజమండ్రిలోని ఇన్నీస్‌పేట వద్ద పాఠశాలలు స్థాపించారు. పిఠాపురం రాజు ఇచ్చిన రూ.పది వేల ధనంతో రాజమండ్రిలో ఉన్నత పాఠశాల స్థాపించారు. ఆంధ్రలో మొదట రాత్రి పాఠశాల స్థాపించారు. వీరేశలింగం సేవలకు మద్రాసు ప్రభుత్వం రావు బహద్దూర్‌ బిరుదు ఇచ్చింది. కందుకూరి 120కి పైగా గ్రంథాలు రచించారు. ‘రాజశేఖర చరితము’, ‘సత్యరాజు పూర్వదేశ యాత్రలు’, స్వీయచరిత్ర మొదలైనవి ఆయన సుప్రసిద్ధ రచనలు. కందుకూరి ప్రేరణతో 1902లో మచిలీపట్నంలో స్త్రీ సమాజం,1905లో విశాఖపట్నంలో స్త్రీ భారత సమాజం, 1909లోఅనంతపురంలో శారద సమాజం, 1910లో గుంటూరులో అఖిలాంధ్ర మహిళాసభ లాంటి సంస్థలు ఏర్పడ్డాయి.


దేశిరాజు పెదబాపయ్య
 

మచిలీపట్నంలో జన్మించారు. బాపట్ల వద్ద సంఘసంస్కరణ ఉద్యమాలు నడిపారు. బ్రహ్మ   సమాజంలో సభ్యుడు. కందుకూరి వీరేశలింగం పంతులుకి ఆప్తుడు. బహుభార్యత్వం, బాల్యవివాహాలను ఖండించారు. వితంతు పునర్వివాహాలను, స్త్రీవిద్యను ప్రోత్సహించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. ఈయన పత్రిక ‘వాయిస్‌ ఆఫ్‌ ట్రూత్‌’. ఈయన సంస్థలు ‘యంగ్‌ మెన్స్‌ ప్రియర్స్‌ యూనియన్‌’, ‘టెంపరెన్స్‌ సోషల్‌ ప్యూరిటీ అసోసియేషన్‌’. పెదబాపయ్య, రఘుపతి వెంకటరత్నం, కందుకూరి వీరేశలింగం పంతులును కలిపి ఆంధ్రలో బ్రహ్మసమాజ త్రయం అంటారు.


రచయిత:గద్దె నరసింహా రావు


 

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌