• facebook
  • whatsapp
  • telegram

ఢిల్లీ సుల్తానులు - ఖిల్జీ వంశం

అల్లాఉద్దీన్‌ ఖిల్జీ - పరిపాలనా విధానం సుల్తాన్‌

రిపాలనా విభాగానికి అధిపతి సుల్తాన్‌. అతడే సర్వసైన్యాధ్యక్షుడు, ఉన్నత న్యాయాధికారి. ముఖ్యమైన విషయాల్లో తానే స్వయంగా నిర్ణయాలు తీసుకునేవాడు.


* పరిపాలన సక్రమంగా జరిగేందుకు, సుల్తాన్‌కు సలహాలు ఇచ్చేందుకు మంత్రిమండలి ఉండేది. ఇందులో సమర్థవంతులను, సుల్తాన్‌ క్షేమం కోరేవారిని, దగ్గరి బంధువులను నియమించాడు. ఖలీఫాకు ప్రాధాన్యం ఇవ్వలేదు.సుల్తాన్‌ దైవాంశ సంభూతుడని విశ్వసించేవాడు.


రాష్ట్రపాలన


పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ‘రాష్ట్రాలు’ (ఇక్తాలు)గా విభజించి వాటికి రాష్ట్ర పాలకులను నియమించాడు. వీరు సుల్తాన్‌ కింద పనిచేసేవారు. అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంలో 11 రాష్ట్రాలు ఉండేవని జియాఉద్దీన్‌ బరౌని పేర్కొన్నాడు.


న్యాయపాలన


సుల్తాన్‌ అత్యున్నత న్యాయమూర్తి అయినప్పటికీ న్యాయశాఖకు ‘ఖాజీ ఉల్‌కజత్‌’ అనే అధికారి ముఖ్య న్యాయాధిపతిగా ఉండేవాడు. 


రాష్ట్రాల్లో రాష్ట్రపాలకుడు, ఖాజీ న్యాయ సమస్యలు పరిష్కరిస్తే; గ్రామాల్లో గ్రామాధికారులు న్యాయవిచారణ చేసేవారు. చెడు అలవాట్లకు ఖాజీ దూరంగా ఉండాలి. ఖాజీలు మత్తుపానీయం సేవిస్తే, వారికి మరణ శిక్ష విధించేవారు.


 న్యాయం ముందు అందరూ సమానులే. అంగవిచ్ఛేదనం సాధారణ శిక్షగా ఉండేది. శిక్షలు కఠినంగా అమలయ్యేవి.


పోలీస్‌ - గూఢచారి విధానం


శాంతిభద్రతల పరిరక్షణకు కొత్వాల్‌ అనే అధికారి ఉండేవాడు. 


కేంద్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అనేకమంది పోలీస్‌ అధికారులు ఇతడి అధీనంలో ఉండేవారు. 


అల్లాఉద్దీన్‌ ‘మున్సీలు’ అనే గూఢచారులను నియమించి, రాజ్యంలో జరిగే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు. 


ఉన్నతవర్గాలు, అమీర్‌లు, సర్దారులపై నిఘా ఉంచి, ఎప్పటికప్పుడు సమాచారం సేకరించేవాడు. ఇది పాలనలో ఎంతగానో ఉపయోగపడింది.


రెవెన్యూ సంస్కరణలు


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంలో దాదాపు 5 లక్షలకు పైగా సైన్యం ఉండేది. వీరి పోషణకు, ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అపార ధనం అవసరమైంది. కాబట్టి ప్రజలపై అనేక రకాల పన్నులను విధించాడు. 


‘భూమిశిస్తు’ ప్రధాన ఆదాయ వనరు. భూములను సర్వే చేయించి, పంట పొలాలపై ధనం లేదా ధాన్యం రూపంలో పన్నులు వసూలు చేశాడు. 


పంట దిగుబడిని బట్టి పన్ను ఉండేది. దీన్ని నిర్ణయించేందుకు ‘దివాని ముస్తాక్‌ రాజ్‌’ అనే ఉన్నత ఉద్యోగిని నియమించాడు. ఇతడ్ని స్వయంగా సుల్తానే పర్యవేక్షించేవాడు. 


అవినీతిపరులైన రెవెన్యూ అధికారులను కఠినంగా శిక్షించేవాడని బరౌని పేర్కొన్నాడు. 


ప్రభువర్గం అనుభవించే ‘ఇనామ్‌’ భూములను రద్దు చేశాడు. 


ముస్లింలు పంటలో 1/4 వంతు, హిందువులు సగభాగాన్ని పన్నుగా చెల్లించేవారు. పట్వారీల్లో అవినీతిని తొలగించేందుకు కఠిన చర్యలు తీసుకున్నాడు. 


భూమిశిస్తుతో పాటు ఇంటిపన్ను, పశువులపై పన్ను, జిజియా పన్ను (హిందువులపై), ఖామ్స్‌ (యుద్ధంలో దొరికిన దానిలో 4/5వ భాగం), జకాత్‌ (ముస్లింలపై మతపరమైన పన్ను), గర్హి (ఇంటి పన్ను), చరాయ్‌ (పచ్చికబయళ్లపై పన్ను) ఉండేవి.


సాహిత్యం - కళాపోషణ 


అల్లాఉద్దీన్‌ సారస్వతం, లలిత కళలను ప్రోత్సహించాడు. పారశీక కవి అమీర్‌ఖుస్రూ ఇతడి ఆస్థానంలో ఉండేవాడు. ఈయన ‘తారిఖ్‌-ఇ-అలై’ అనే గ్రంథాన్ని రాశారు. ఇందులో అల్లాఉద్దీన్‌ విజయాలు ఉన్నాయి. అమీర్‌ఖుస్రూకి 'tuti-e-hind’ (భారతదేశ చిలుక) అనే బిరుదు ఉంది. 


అల్లాఉద్దీన్‌ ఆస్థానంలో సుమారు 46 మంది పండితులు ఉండేవారని జియాఉద్దీన్‌ బరౌని పేర్కొన్నాడు. అమీర్‌ అర్సలన్, అమీర్‌ హస్మన్, కోహీ కబీరుద్దీన్, షేక్‌ నిజాముద్దీన్, షేక్‌ రుక్నుద్దీన్, ఖాజీ మొయినుద్దీన్‌ లాంటి వారు ఇతడి ఆస్థానంలో ఉన్నారు. 


నిర్మాణాలు 


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ అనేక దర్గాలు, మసీదులు, సుందర భవనాలు, కోటలు నిర్మించాడు. వీటికోసం ఇతడు 70 వేల మంది కార్మికులను నియమించాడని జియాఉద్దీన్‌ బరౌని పేర్కొన్నాడు. 


ఇతడు ఢిల్లీలో అలయ్‌ దర్వాజా నిర్మించాడు. దీనికి 7 ద్వారాలున్నాయి.  


 ఢిల్లీలో హజార్‌ సుతున్‌ (1000 స్తంభాల భవనం), జామా మసీదును నిర్మించాడు.


మంత్రిమండలి


అన్ని శాఖలకు సుల్తాన్‌ అధిపతి. కొన్ని అధికారాలను వికేంద్రీకరించి, శాఖలు ఏర్పర్చి వాటికి మంత్రులను నియమించాడు. 


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ కాలంలో కింది వారు పాలనలో ముఖ్యపాత్ర పోషించారు.


వజీర్‌: ఇతడు ప్రధానమంత్రి లాంటి వాడు. సుల్తాన్‌ తర్వాతి స్థానంలో ఉండేవాడు. ఆర్థిక, సివిల్, సైనిక వ్యవహారాలు ఇతడి అధీనంలో ఉండేవి. ఇతడు ఇతర మంత్రులపైనా అజమాయిషీ చెలాయించేవాడు.


ఖాజి ఉల్‌కజత్‌: న్యాయశాఖ మంత్రి.


మీర్‌ అరీజ్‌: వినతిపత్రాల అధికారి.


దివానీ అశ్రఫ్‌: గణాంకశాఖాధికారి


ముస్తాఫి: లెక్కలను తనిఖీ చేసే అధికారి


అరిజ్‌ మాలిక్‌: రక్షణమంత్రి


ఒషీఫౌజ్‌: సైనికులకు వేతనాలు చెల్లించే అధికారి


అమీర్‌ కోహి: వ్యవసాయశాఖ మంత్రి


దివాన్‌-ఇ-రియాసత్‌:  మార్కెటింగ్‌ శాఖ అధిపతి. ఈ మార్కెటింగ్‌ శాఖకు అనే మరో అధికారి ఉండేవాడు.


కొత్వాల్‌: శాంతిభద్రతలను కాపాడే పోలీస్‌ అధికారి.


 వీరే కాకుండా రాష్ట్రాల నుంచి గ్రామాల వరకు అనేకమంది ఉద్యోగులు పాలనలో తోడ్పడేవారు. ప్రభువర్గంపై కఠిన ఆంక్షలు ఉండేవి.

సైనిక విధానం


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ సైనిక రాజ్యాన్ని స్థాపించాడు. ఇతడి సైన్యంలో 4,75,000 సిద్ధసైన్యం (స్టాండింగ్‌ ఆర్మీ)తో పాటు అశ్వ, గజ, పదాతి దళం అనే మూడు భాగాలు ఉండేవని పర్షియన్‌ చరిత్రకారుడైన పెరిష్టా పేర్కొన్నాడు. 


విశాల సామ్రాజ్యం స్థాపించాలన్నా, శాంతి భద్రతలు రక్షించాలన్నా, దండయాత్రలు చేయాలన్నా బలమైన సైనిక వ్యవస్థ అవసరమని అల్లాఉద్దీన్‌ గుర్తించాడు. దానికి అనుగుణంగా సైన్యాన్ని పటిష్ఠం చేశాడు. 


కీలకస్థానాల్లో కోటలు నిర్మించి, అర్హతల ఆధారంగా సైన్యంలో ఉద్యోగాలు ఇచ్చాడు.


జాగీర్లు కూడా సైన్యాన్ని పోషించేవారు. వీరు అవసరమైనప్పుడు సుల్తాన్‌కు సైనికసాయం చేసేవారు. 


‘ముక్తీలు’ కూడా సుల్తాన్‌కి సైన్యాన్ని సరఫరా చేసేవారు. తర్వాతి కాలంలో అల్లాఉద్దీన్‌ దీన్ని రద్దు చేశాడు. 


ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని జయించడంలో; మంగోలుల దండయాత్రలను ఎదుర్కోవడంలో సైన్యం కీలకపాత్ర పోషించింది. 


  ఖిల్జీ యుద్ధ వ్యూహాలు అమలు చేయడం, సైనిక నాయకత్వం, ధైర్య సాహసాలు ప్రదర్శించడంలో దిట్టగా పేరొందాడు. 


సంస్కరణలు: ఇతడు సైనికులకు భూములు ఇచ్చే పద్ధతిని రద్దు చేసి, జీతాలిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాడు. సాధారణ అశ్వ సైనికులకు ఏడాదికి 234 టంకాల జీతం ఉండేది. సైనికుల హోదాకి తగ్గట్లు వేతనం ఉండేది.


సైనిక వ్యవస్థలోనూ వివిధ సంస్కరణలు అమలు చేశాడు. వాటిలో ముఖ్యమైనవి ‘దాగ్‌’- అంటే గుర్రాలపై ముద్రలు వేయడం, ‘చెహ్రా’ - సైనికులు, గుర్రాల వివరాలను పుస్తకంలో నమోదు చేయడం. దీనివల్ల సైనిక వ్యవస్థలోని మోసాలను అరికట్టగలిగాడు. 


ప్రతి సైనిక విభాగంలో గూఢచారులను నియమించాడు. సైన్యంలో క్రమశిక్షణ తప్పనిసరి చేశాడు. రోజూ సైనిక వ్యవస్థలపై నివేదికలు సుల్తాన్‌కు సమర్పించాలి.


మార్కెట్‌ సంస్కరణలు లేదా ఆర్థిక సంస్కరణలు


అల్లాఉద్దీన్‌ ఖిల్జీ ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణల్లో అత్యంత ముఖ్యమైనవి మార్కెట్‌ సంస్కరణలు. మార్కెట్‌ ధరలను అదుపులో ఉంచడం వీటి ప్రధాన లక్ష్యం. షహనాయి మండి అనేది మార్కెట్‌ పేరు. నిర్ణయించిన ధరలను అమలుచేయడానికి దివాన్‌-ఇ-రియాసత్‌ అనే అధికారి ఉండేవాడు. 


ఒక సాధారణ సైనికుడికి కావాల్సిన నిత్యావసర సరకులన్నీ నిర్ణయించిన ధరలకే అమ్మాలి. ప్రతి దుకాణం ముందు ధరల పట్టిక ఉండేది. కూరగాయలు, పండ్లు, చక్కెర, నూనెలు, పశువులు, గుర్రాలు, బానిసలు, టోపీలు, చెప్పులు, దువ్వెనలు, సూదులు, అలంకార వస్తువులు, గృహానికి, వ్యక్తికి కావాల్సిన అన్ని వస్తువులు నిర్ణయించిన ధరకే లభించేవి. ప్రభుత్వ ధాన్యాగారాల్లో ధాన్యం నిల్వ ఉండేది.


సాంఘిక సంస్కరణలు


అల్లాఉద్దీన్‌ ప్రజాసంక్షేమం కోసం అనేక సామాజిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. మద్యం తయారీని, అమ్మకాన్ని నిషేధించాడు. జూదం అడేవారిని శిక్షించాడు. కల్తీని, వ్యభిచారాన్ని నిషేధించాడు.


చివరి రాజులు

అల్లాఉద్దీన్‌కు మాలిక్‌ కపూర్‌ విషం ఇచ్చి చంపాడని ఎల్ఫిన్‌స్టోన్‌ అనే చిత్రకారుడు పేర్కొన్నాడు. ఇతడు మరణించాక షహబుద్దీన్‌ ఉమర్, కుతుబుద్దీన్‌ ముబారక్‌షా, నసీరుద్దీన్‌ ఖుస్రూషా ఢిల్లీని పాలించారు. 


ఖిల్జీ వంశంలో చివరివాడు ఖుస్రూషా. ఇతడ్ని వధించిన ఘాజీమాలిక్, ఘియాజుద్దీన్‌ తుగ్లక్‌ పేరుతో తుగ్లక్‌ వంశాన్ని స్థాపించడంతో తుగ్లక్‌ వంశ పాలన ప్రారంభమైంది.

Posted Date : 27-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌