• facebook
  • whatsapp
  • telegram

ఉమ్మడి సంస్థల విభజన

కొలిక్కిరాని పంపకాలు!



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌  విభజన జరిగి తొమ్మిదేళ్లు పూర్తయినా ఉమ్మడి ఆస్తులు, సంస్థల విభజన కొలిక్కి రావడం లేదు. అశాస్త్రీయంగా, హడావిడిగా సాగిన విభజనతో అన్నివిధాలుగా నష్టపోయిన అవశేష ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిస్థితి ఆర్థికంగా శరాఘాతంగా మారింది. విభజన చట్టంలో ఉన్న లోపాలకు తోడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య సయోధ్య కుదరకపోవడం, సమస్యల పరిష్కారంలో కేంద్రం మెతక వైఖరి అవలంబించడం ఇందుకు ప్రధాన కారణాలు. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూళ్లలో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన పంపకాల తీరు, ఇన్నేళ్లుగా నెలకొన్న స్తబ్ధత, ప్రస్తుత పరిస్థితిపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ నుంచి విభజన వరకు అంటే 1956 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన, ఆర్థిక, మానవాభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన కంపెనీలు, కార్పొరేషన్లు ఉమ్మడి సంస్థల కిందికి వస్తాయి. వీటి గురించి ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014లోని 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్నారు.


* 9వ షెడ్యూల్‌లో రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సిన 89 కంపెనీలు, కార్పొరేషన్ల జాబితాను పేర్కొన్నారు. తర్వాత మరో రెండు రాష్ట్ర స్థాయి సంస్థలను చేర్చడంతో మొత్తం 91 సంస్థలయ్యాయి.


* 10వ షెడ్యూల్‌లో రెండు రాష్ట్రాల మధ్య కొనసాగించే శిక్షణా సంస్థలు, కేంద్రాల జాబితాను పొందుపరిచారు. మొదట్లో 107 సంస్థలను చేర్చగా, 2015, మే 7న మరో 35 సంస్థలను ఆ జాబితాలో కలిపారు. దీంతో మొత్తం సంఖ్య 142కు చేరింది.


* 9, 10 షెడ్యూళ్లలో పేర్కొన్న కొన్ని సంస్థల్లో ఉద్యోగులు, చరాస్తుల విభజన జరిగినప్పటికీ స్థిరాస్తులు, అప్పుల విభజన అలాగే ఉండిపోయాయి. ముఖ్యంగా దిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌తో పాటు స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్, డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ ్బదీఖిల్శి, మినరల్‌ డెవలప్‌మెంట్‌ లాంటి సంస్థల విభజనపై గందరగోళం నెలకొంది. మరికొన్ని సంస్థల్లో ఉమ్మడి ఖాతాల కింద ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా స్పష్టత లేదు.


* 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన పరిష్కారం కోసం కేంద్ర హోంశాఖ సుమారు 31 సార్లు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలతో సమీక్షలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు.


* విభజన చట్టంలోని సెక్షన్‌ 64 ప్రకారం ఉమ్మడి సంస్థల ఆస్తులను జనాభా నిష్పత్తికి అనుగుణంగా  58 : 42 నిష్పత్తిలో పంచాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ అంగీకరించడం లేదు.


* 9, 10 షెడ్యూళ్ల సంస్థలతో పాటు ఏ షెడ్యూల్‌లో చేర్చని 12 ఉమ్మడి సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా ఉన్నాయి. మొత్తం ఉమ్మడి సంస్థలు 245 (91 + 142 + 12). వీటి మొత్తం ఫిక్స్‌డ్‌ ఆస్తుల విలువ రూ.1.42 లక్షల కోట్లని అంచనా.


విభజన చట్టంలో ఏముంది?

* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజన గురించి విభజన చట్టంలోని 68, 71 సెక్షన్లలో పేర్కొన్నారు. 


* సెక్షన్‌ 68లో కొన్ని కార్పొరేషన్లకు సంబంధించిన నియమాలున్నాయి. సెక్షన్‌ 68(1) ప్రకారం ‘‘9వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం ఏర్పాటైన కంపెనీలు, కార్పొరేషన్లు అవతరణ తేదీన, ఆ తేదీ నుంచి అంతకుముందు రోజున ఏవిధంగా పనిచేస్తున్నాయో, ఈ సెక్షన్‌లోని నియమాలకు లోబడి అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో పని కొనసాగించాలి.’’


అలాగే సెక్షన్‌ 68(2) ప్రకారం ‘‘సెక్షన్‌ 68(1)లో సూచించిన కంపెనీలు, కార్పొరేషన్ల ఆస్తులు, హక్కులు, బాధ్యతలను సెక్షన్‌ 53లో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల మధ్య పంచాలి.’’


* సెక్షన్‌ 71లో కంపెనీల కోసం కొన్ని నిబంధనలను పొందుపరిచారు. సెక్షన్‌ 71 ప్రకారం ‘‘ఈ భాగంలో ఉన్న దేనితోనూ నిమిత్తం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న కంపెనీల కోసం కొన్ని ఆదేశాలు జారీ చేయవచ్చు.


ఎ) కంపెనీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాలు, వాటాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీకి ఆదేశించవచ్చు.


బి) కంపెనీ డైరెక్టర్ల బోర్డులో రెండు రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తూ కొత్త బోర్డును ఏర్పాటు చేయవచ్చు.


* 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల్లో సౌకర్యాల కొనసాగింపు గురించి విభజన చట్టంలోని సెక్షన్‌ - 75లో పేర్కొన్నారు.


* సెక్షన్‌ 75(1) ప్రకారం ‘‘ఈ చట్టం 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల విషయంలో సందర్భాన్ని బట్టి కొత్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లేదా తెలంగాణ సర్కారు ఆ రాష్ట్రాల్లో ఉన్న ఇతర రాష్ట్ర ప్రజలకు సేవలు కొనసాగించాలి. అవతరణ తేదీ ముందునాటికి (2014, జూన్‌ ముందు నాటికి) సమకూర్చిన సేవల కంటే ఆ సేవలు తక్కువ అనుకూలంగా ఉంటాయి. ఈ సేవలను ఎంతకాలం, ఏ షరతులతో కొనసాగించాలనే అంశంపై పరస్పర అంగీకారం ఆధారంగా అవతరణ దినం నుంచి ఏడాదిలోగా నిర్ణయం తీసుకోవాలి. ఆ లోపు ఒప్పందం కుదరకపోతే సేవలను కొనసాగించే కాలపరిమితిని కేంద్రం నిర్ణయించాలి. అలాగే సెక్షన్‌ 75(2) ప్రకారం ‘‘కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్‌ డే నుంచి ఒక సంవత్సరం లోపల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఏదైనా ఇతర సంస్థను 10వ షెడ్యూల్‌లో చేరుస్తూ నోటిఫికేషన్‌ జారీ చేయవచ్చు’’.


9, 10 షెడ్యూళ్ల సంస్థలపై విభజన ప్రభావం: 

* ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో 89 ప్రభుత్వ రంగ సంస్థలను చేర్చినట్లు సెక్షన్‌ - 68 సూచిస్తుంది. అలాగే సెక్షన్‌ - 53 ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం గురించి సూచిస్తుంది.


* 9వ షెడ్యూల్‌లో 89 రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థలను చేర్చినప్పటికీ నమోదైన సొసైటీలు/కంపెనీలు 70 మాత్రమే. మిగిలినవి అనుబంధ సంస్థలు.


* ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం రూపొందించేటప్పుడు నాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సంస్థల పునర్‌వ్యవస్థీకరణ, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన సూత్రాలు, విధానంపై తగినంత శ్రద్ధ చూపలేదు.


* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ కోసం ‘షీలా బిడే’ అధ్యక్షతన నిపుణుల కమిటీ ఏర్పాటు చేసిన్పటికీ, ఆ కమిటీ సిఫార్సులు పూర్తిగా అమలుకాలేదు.


* రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల నిర్వహణలో అనిశ్చితి ఏర్పడింది.


* 10వ షెడ్యూల్‌లోని జాబితాలో చేర్చిన 142 సంస్థల విషయంలో నిశితంగా విశ్లేషిస్తే 22 ప్రభుత్వ శాఖలు, 10 శాసనబద్ధ సంస్థలు, 17 సొసైటీలు, మరో రెండింటిని బోర్డు/కౌన్సిల్‌గా వర్గీకరించారు. అలాగే 142 సంస్థల్లో 4 సంస్థలు నిర్వహణలో లేవు. వీటిలో 55 సంస్థలు వాటి సమగ్రత విషయంలో రెండు రాష్ట్రాలకు అవసరమవుతాయి. వాటిని రెండు రాష్ట్రాల మధ్య పంచడం కుదరదు. 142 సంస్థల్లో 9 విశ్వవిద్యాలయాలు కాగా, 16 సంస్థలు ప్రభుత్వ శాఖల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్ర చట్టాలు, కేంద్ర చట్టాల కింద ఏర్పాటైన అనేక ఇతర సంస్థలను మినహాయిస్తూ, ప్రతి రాష్ట్ర పరిపాలనకు అంతర్భాగంగా ఉన్న శాఖాధిపతులు, రెగ్యులేటరీ ఏజెన్సీలను 10వ షెడ్యూల్డ్‌లో చేర్చడం ద్వారా ఒక విచిత్ర పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య 10వ షెడ్యూల్‌ సంస్థల సిబ్బంది, ఆస్తుల పంపిణీపై విభజన చట్టం ఏమీ చెప్పలేదు.


* 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న మెజారిటీ సంస్థల ప్రధాన కార్యస్థానం హైదరాబాద్‌. వీటిని అవశేష ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి ఏర్పాటు చేయడానికి చాలా కాలం పడుతుంది.


* చట్టబద్ధంగా ఏర్పాటైన సమాచార కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్, లోకాయుక్త, మావన హక్కుల కమిషన్‌ లాంటి అనేక సంస్థలను విభజన చట్టంలో ప్రస్తావించలేదు.


షీలా బిడే కమిటీ: ఏపీ విభజన చట్టంలోని 9వ షెడ్యూల్‌లో పేర్కొన్న ఉమ్మడి సంస్థల విభజన కోసం సిఫార్సులు చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2014, మే 30న డాక్టర్‌ షీలా బిడే (రిటైర్డ్‌ ఐఏఎస్‌) అధ్యక్షతన ఎ.కె.గోయెల్‌ (రిటైర్డ్‌ ఐఏఎస్‌), కె.వి.రావు (రిటైర్డ్‌ ఐఏఎస్‌), కె.నరసింహమూర్తి (ఆర్థిక నిపుణులు)తో కమిటీని ఏర్పాటు చేసింది.


* తొలుత 9వ షెడ్యూల్‌లో చేర్చని మరో రెండు రాష్ట్రస్థాయి సంస్థలను తెలంగాణ ప్రభుత్వ సమ్మతితో ఈ కమిటీకి అప్పగించారు. ఈ కమిటీ 9వ షెడ్యూల్‌కు చెందిన మొత్తం 91 (89 + 2) సంస్థల్లో 90 సంస్థల విభజనకు సిఫార్సు చేసింది. అందులో 55 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను ఇరురాష్ట్రాలు సమ్మతించాయి. 15 సంస్థలకు సంబంధించి తెలంగాణ ఆమోదం తెలియజేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌ వ్యతిరేకిస్తోంది. 22 సంస్థలకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండూ విముఖత చూపాయి. ఈ 22 సంస్థల ఆస్తుల విలువే మొత్తంలో దాదాపు 89% ఉంటాయని అంచనా.


* ఉమ్మడి సంస్థల విభజన, షీలా బిడే కమిటీ సిఫార్సుల అమల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో 31 సార్లు సమీక్షా సమావేశాలను ఏర్పాటు చేసింది. చివరకు కమిటీ చేసిన సిఫార్సులన్నీ యథాతథంగా అంగీకరించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ అంగీకరించలేదు. తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా ‘డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌’ ఆస్తుల విభజనకు కమిటీ సిఫార్సులు చేసిందని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. చాలావరకు ఉమ్మడి సంస్థల విభజనకు ప్రధాన కార్యస్థానం (హెడ్‌క్వార్టర్‌) అంశమే చిక్కుముడిగా మారింది.


ప్రధాన కార్యస్థానంపై చట్టంలో వివరణ: విభజన చట్టంలోని సెక్షన్‌ - 53లో పేర్కొన్న విధంగా 9వ షెడ్యూల్‌ ఉమ్మడి సంస్థల్లోని ఆస్తులు, అప్పులను విభజించాలి. ఈ సెక్షన్‌ ప్రకారం అలాంటి సంస్థ లేదా దాని విభాగం ఉన్న ప్రాంతం లేదా దాని కార్యకలాపాలు పరిమితమైన ప్రాంతం ఉన్న రాష్ట్రానికే సంస్థ ఆస్తులు చెందుతాయి. ఆ సంస్థ నిర్వహణ అంతర్రాష్ట్ర అంశమైనప్పుడు నిర్వహణ యూనిట్‌ ఆస్తులు, అప్పులను ప్రాంతం ప్రాతిపదికపై విభజించాలి. ప్రధాన కార్యస్థానాల్లో ఉన్నవాటిని జనాభా ప్రాతిపదికపై రెండు రాష్ట్రాలకు విభజించాలి. అయితే విభజన చట్టంలో ప్రధాన కార్యస్థానం అనే పదాన్ని నిర్వచించలేదు.


* ప్రధాన కార్యస్థానం అనే పదానికి అర్థం ప్రధాన కార్యాలయానికి చెందిన ఆస్తులు, అప్పులు. అలాగే ఉమ్మడి రాష్ట్రం వినియోగం కోసం ఏర్పాటు చేసిన ఉమ్మడి కేంద్రాలు, సదుపాయాలను జనాభా నిష్పత్తి ఆధారంగా విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ అభిప్రాయపడింది. ప్రధాన కార్యస్థానం మాత్రమే అంటే వారు పనిచేసే ప్రదేశం నుంచి రిజిస్టరైన ప్రాంతం అని, అందులో ఇతర ఆస్తులు ఉండవని తెలంగాణ అభిప్రాయపడింది. దీంతో ఉమ్మడి ఆస్తుల విభజనకు సంబంధించి ప్రధాన కార్యస్థానం అంశం ప్రధాన సమస్యగా మారింది. ఎందుకంటే సుమారు 94 శాతం ఉమ్మడి సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయి.


* విభజన చట్టంలో నిర్దేశించిన 9వ షెడ్యూల్‌ సంస్థల విభజనకు సంబంధించి 2017, మేలో కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా 9వ షెడ్యూల్‌ ఉమ్మడి సంస్థల ఆస్తులు, అప్పుల విభజనకు కీలకంగా మారిన ప్రధాన కార్యస్థానం (హెడ్‌క్వార్టర్‌) విభజనపై స్పష్టమైన నిర్వచనం ఇచ్చింది. దీని ప్రకారం ప్రధాన కార్యాలయం ఒక్కదానికి సంబంధించే జనాభా ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 58 : 42 నిష్పత్తిలో పంచాలి. మిగిలిన కార్యాలయాలు, విభాగాలు, ఆస్తులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయి.


* 9వ షెడ్యూల్‌ సంస్థల విభజన సందర్భంగా హైదరాబాద్‌లోని ఆస్తుల విభజనపై చాలాకాలంగా ప్రతిష్ఠంభన నెలకొంది. ఉమ్మడి రాజధానిలోని ప్రధాన కార్యాలయాలతో పాటు అక్కడున్న ఇతర కార్యాలయాలు, వర్క్‌షాపులు, అతిథి గృహాలు వంటివాటిని కూడా జనాభా ప్రాతిపదికన విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ వ్యతిరేకించింది. ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌తోపాటు కల్యాణ మండపం, మియాపూర్‌లోని వర్క్‌షాప్, తార్నాకలోని ఆసుపత్రి, హకీంపేటలో ఉన్న వర్క్‌షాప్‌లు, ఆగ్రోస్, విజయ డెయిరీ, ఏపీ ఫుడ్స్‌ లాంటి ఆస్తుల విషయమై తీవ్ర స్థాయిలో వివాదం నడిచింది.


* 2017, మే లో కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయం (ప్రిన్సిపల్‌ ఆఫీసు)ను మాత్రమే జనాభా నిష్పత్తిలో విభజించాలి. ఇతర నిర్వహణ విభాగాల (ఆపరేషనల్‌ యూనిట్స్‌)పై స్థానికత ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఒక సంస్థకు ప్రధాన కార్యాలయాలతో పాటు వర్క్‌షాప్‌లు, అతిథిగృహాలు, ఇతర నిర్వహణ విభాగాలు ఉన్నప్పటికీ ప్రధాన కార్యాలయం మాత్రమే కేంద్రం (హెడ్‌ క్వార్టర్‌)గా ఉంటుంది. మిగిలిన విభాగాలు, కార్యాలయాల విభజన చట్టంలోని సెక్షన్‌ - 53ని అనుసరించి ఉంటాయి.


సయోధ్య కుదిరేనా?: షీలా బిడే కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ఉమ్మడి సంస్థలను విభజించాలని తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కోరుతోంది. 9వ షెడ్యూల్‌లోని దక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ల్యాండ్‌ హోల్డింగ్‌ ్బదీఖిల్శి కు కేటాయించిన 5 వేల ఎకరాల భూములపై ఆంధ్రప్రదేశ్‌ రిట్‌ పిటిషన్‌ వేసి స్టే తీసుకొచ్చింది. అదేవిధంగా ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌కు కేటాయించిన సుమారు 250 ఎకరాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్‌ స్టే తెచ్చుకుంది.


* 10వ షెడ్యూల్‌లో ఉన్న ఏపీ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌కు సంబంధించి రిట్‌ పిటిషన్‌ దాఖలైంది. ఈ కోర్టు కేసులు తేలేంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని తెలంగాణ వాదిస్తోంది.


* విభజన చట్టంలో పేర్కొనని 12 సంస్థలను విభజించాలని ఆంధ్రప్రదేశ్‌ కోరగా, తెలంగాణ వ్యతిరేకిస్తోంది.


* 10వ షెడ్యూల్‌లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తోంది. ఈ షెడ్యూల్‌లోని 142 సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని కోరుతోంది.


సుప్రీంను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్‌: ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజనపై ఆంధ్రప్రదేశ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, జస్టిస్‌ సుందరేశ్‌తో కూడిన ధర్మాసనం 2023, మే 12న విచారణ చేపట్టింది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉమ్మడి ఆస్తుల విభజనపై నాలుగు వారాల్లోగా అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై రిజాయిండర్‌ దాఖలుకు ఏపీ ప్రభుత్వానికి రెండు వారాల గడువిచ్చింది. విచారణను 2023, జులై చివరి వారానికి వాయిదా వేసింది.


రచయిత: వి.కరుణ
 

Posted Date : 09-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌