• facebook
  • whatsapp
  • telegram

స్వాతంత్య్రానికి ఒక సంవత్సరం ముందు!

సామ్రాజ్య వాదానికి సైనికుల సవాలు!
 


  రెండో ప్రపంచ యుద్ధంతో ఆంగ్లేయులు అన్ని విధాలుగా బలహీనపడ్డారు. సరికొత్త శక్తులు ఆవిర్భవించడంతో ప్రపంచ రాజకీయం మారిపోయింది. వలస రాజ్యాలను నిరంకుశంగా పాలించలేని స్థితికి బ్రిటిష్‌ ప్రభుత్వం వచ్చేసింది. ఆ దశలో జాతి వివక్షకు గురైన భారతీయ నావికాదళ సైనికులు చేసిన ఉద్యమం సామ్రాజ్య వాదాన్ని సవాలు చేసింది. వారి వీరోచిత పోరాటాన్ని అణచి వేయడం తెల్లవారికి సాధ్యం కాలేదు. ఫలితంగా పరిపాలన కోసం భారతీయులపై ఆధారపడలేని పరిస్థితులు తలెత్తాయి. అంతర్జాతీయ పరిణామాలన్నీ దేశ స్వాతంత్య్ర సమరానికి సానుకూలంగా ఉండటంతో ఇంగ్లిషువారి వైఖరి మారింది. అదే సమయంలో బ్రిటన్‌లో కొత్త ప్రభుత్వం రావడం మరింత అనుకూలమై ఇండియాలో అధికార మార్పిడికి చర్యలు వేగవంతమయ్యాయి. స్వాతంత్య్రం ప్రకటించేందుకు సరిగ్గా ఏడాది ముందు జరిగిన ఈ పరిణామాలను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి.


జర్మనీ నాజీ నియంత హిట్లర్‌ ఆత్మహత్యతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. విజేతలకు, పరాజితులకు తీవ్ర నష్టం మిగిల్చింది. పశ్చిమ యూరప్‌ దేశాల స్థానంలో అమెరికా, సోవియట్‌ రష్యాలు అగ్రగామి దేశాలు (సూపర్‌ పవర్స్‌గా) గా అవతరించాయి. ఆ సమయంలో భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఇండియన్‌ ముస్లింలీగ్‌ మొండివైఖరి వాటిలో ప్రధానమైనది. అప్పటి బ్రిటిష్‌ రాజప్రతినిధి లార్డ్‌ వేవెల్‌ 1945లో భారత రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన సిమ్లా సమావేశం ఫలితం లేకుండానే ముగిసింది. ఆ విధంగా రాజకీయ పరిస్థితులన్నీ స్తబ్దుగా ఉన్న సమయంలో బ్రిటిష్‌ పాలకులపై ఒక పిడుగుపాటు పడింది అదే 1946, ఫిబ్రవరిలో జరిగిన ‘రాయల్‌ ఇండియన్‌ నేవీ’ తిరుగుబాటు. ఆనాటి బ్రిటిష్‌ ఇండియా సైన్యంలోని నావికాదళానికి ‘రాయల్‌ ఇండియన్‌ నేవీ’ అని పేరు. బొంబాయిలో ప్రారంభమైన ఈ మెరుపు తిరుగుబాటుకు అనేక కారణాలున్నాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రను ప్రభావితం చేసిన ముఖ్య ఘట్టాల్లో ఇది ఒకటి.


తిరుగుబాటుకు కారణాలు: మొదటి నుంచి భారతీయుల పట్ల బ్రిటిషర్లు జాత్యహంకార ధోరణితో వ్యవహరించేవారు. రాయల్‌ ఇండియన్‌ నేవీలోనూ అదే విధానాన్ని పాటించారు. నియామకాలు, జీతభత్యాలు, పదోన్నతులు, ఆహారం వంటి అన్ని విషయాల్లోనూ భారతీయ నావికాదళ ఉద్యోగులు జాతి వివక్షకు గురయ్యారు. భారతీయ అధికారులను కూడా తరచూ అవమానిస్తూ, చిన్నచూపు చూసేవారు. ఈ వివక్షా విధానానికి స్వస్తి చెప్పాలని, ఉద్యోగ విషయాల్లో తెల్లవారితో సమానంగా భారతీయులను చూడాలని, నాణ్యమైన ఆహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందే జరిగిన భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ) తిరుగుబాటు, తదనంతర పరిణామాల్లో యావత్‌ భారతీయుల మద్దతు వీరికి ప్రేరణగా నిలిచాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయ సైనికులు వివిధ ప్రాంతాల్లో పర్యటించడం వల్ల ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలు వారికి అర్థమయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం ఐరోపా సామ్రాజ్యవాద దేశాలు బలహీనపడ్డాయి. ఈ పరిస్థితులు రాయల్‌ నేవికి అనుకూలించాయి. 1946, ఫిబ్రవరి 18న హెచ్‌.ఎం.ఎస్‌.తల్వార్‌ అనే ఓడపై ‘క్విట్‌ ఇండియా’ అని రాసినందుకు ఒక భారతీయ నేవీ సైనికుడిని అరెస్ట్‌ చేశారు. దీనిపై ఇతర నావికుల్లో నిరసన వ్యక్తమైంది. ఓడలోని శిక్షణ సిబ్బంది తమకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ, జాతి వివక్షకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష ప్రారంభించారు. వారు బొంబాయి వీధుల్లో కాంగ్రెస్‌ జెండాలు పట్టుకొని ప్రదర్శనలు జరిపారు. ప్రజలు కూడా ఉద్యమకారులతో కలిసిపోయారు. బ్రిటిష్‌ వ్యతిరేక నినాదాలు బొంబాయి నగరంలో మార్మోగాయి. పౌరజీవనం అస్తవ్యస్తమైంది.


 కరాచీ, కలకత్తా లాంటి ఇతర ప్రధాన నౌకా కేంద్రాలకు ఉద్యమం వ్యాపించింది. మద్రాసు, విశాఖపట్నం, కొచ్చిన్‌ తదితర నౌకా కేంద్రాల్లోనూ సైనికులు తిరుగుబాటుకు మద్దతుగా నిలిచారు. ఉద్యమం ఉద్ధృతి పెరిగింది, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సమ్మె తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు 78 నౌకలు, 20 రేవు స్థావరాలు, 20,000 మంది నావికులు నిరసనలో పాల్గొన్నారు. ప్రభుత్వం దీన్ని అణచలేకపోయింది. అన్నిచోట్లా పరిస్థితి అదుపుతప్పింది. తిరుగుబాటు సమయంలో సుమారు 200 మందికి పైగా మరణించారని ప్రభుత్వ అంచనా. చివరికి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వంటి జాతీయ నాయకులు జోక్యం చేసుకొని నౌకాదళ సమ్మెను విరమింపజేశారు. నావికాదళ సైనికుల తిరుగుబాటు ఆంగ్లేయులపై తీవ్ర ప్రభావం చూపింది. భారతీయ సైన్యం విధేయతపై వలస పాలకులకు విశ్వాసం సడలింది. జాతీయోద్యమాన్ని అణచడానికి బ్రిటిష్‌ ఇండియా ప్రభుత్వం పౌర పాలనా యంత్రాంగంలోని భారతీయ ఉద్యోగులు లేదా భారత సైనిక బలాల మీద ఆధారపడలేని పరిస్థితి ఏర్పడింది. 

క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌-1946:  రెండో ప్రపంచ యుద్ధానంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సమ్మెలు, హర్తాళ్లు జరిగాయి. కార్మికుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రైతులు క్రియాశీలక పోరాటాలు మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్‌లోనూ భారత సానుకూల లేబర్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతర్జాతీయ పరిణామాలన్నీ భారతదేశానికి అనుకూలంగా ఉండటంతో బ్రిటిష్‌ ప్రభుత్వ వైఖరిలోనూ మార్పు కనిపించింది. దేశానికి అధికారాన్ని బదలాయించే విషయంపై భారత రాజకీయ నాయకులతో సంప్రదింపులు, చర్చలు జరిపేందుకు 1946, మార్చిలో మంత్రిత్రయ రాయబారాన్ని పంపింది. ఈ మిషన్‌లో లార్డ్‌ పెథిక్‌ - లారెన్స్‌ (భారత రాజ్య కార్యదర్శి), సర్‌ స్టాఫోర్డ్‌ క్రిప్స్‌ (బోర్డ్‌ ఆఫ్‌ ట్రేడ్‌ ప్రెసిడెంట్‌), ఎ.వి. అలెగ్జాండర్‌ (ఫస్ట్‌ లార్డ్‌ ఆఫ్‌ ది అడ్మిరాలిటీ) సభ్యులు. అందరూ బ్రిటిష్‌ ప్రభుత్వ క్యాబినెట్‌ మంత్రులవడంతో దీనికి క్యాబినెట్‌ రాయబారమనే పేరు వచ్చింది. భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఇది ఒక శుభపరిణామం. క్యాబినెట్‌ మిషన్‌ 1946, మార్చి 24న ఢిల్లీ చేరుకొని కాంగ్రెస్, ముస్లింలీగ్, ఇతర పార్టీల నాయకులతో చర్చలు ప్రారంభించింది. కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించకపోవడంతో తానే ఒక ప్రణాళికను రచించి ప్రకటించింది. దీన్నే క్యాబినెట్‌ మిషన్‌ ప్లాన్‌గా పేర్కొంటారు. 


ముఖ్యాంశాలు:


* ముస్లింలీగ్‌ ప్రధాన డిమాండ్‌ అయిన ప్రత్యేక పాకిస్థాన్‌ను తిరస్కరించడం.


* బ్రిటిష్‌ ఇండియా రాష్ట్రాలు, స్వదేశీ సంస్థానాలతో కూడిన భారత్‌ ఫెడరల్‌ యూనియన్‌ ఏర్పాటు.


* ఈ ఫెడరేషన్‌లో కేంద్ర ప్రభుత్వానికి రక్షణ, విదేశాంగ శాఖ, రవాణాలపైనే అధికారం ఉంటుంది.


* ఇతర అధికారాలతో పాటు అవశిష్ట అంశాలపై నియంత్రణ రాష్ట్రాలకు ఉంటుంది.


* భారత్‌ యూనియన్‌కు బ్రిటిష్‌ ఇండియా, స్వదేశీ సంస్థానాల ప్రతినిధులతో కూడిన కార్యనిర్వాహకవర్గం, శాసనసభ ఉంటాయి.


* భారతీయులకు అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుకోడానికి ఒక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేస్తారు.


* రాష్ట్రాల్లోని శాసనసభలు పరోక్ష ఎన్నిక ద్వారా రాజ్యాంగ సభ ప్రతినిధులను ఎన్నుకుంటాయి. ప్రతి 10 లక్షల జనాభాకు ఒక సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. రాష్ట్రానికి వచ్చిన స్థానాలను, రాష్ట్రంలోని విభిన్న మతాల వారికి జనాభా నిష్పత్తిలో కేటాయిస్తారు.


* స్వదేశీ సంస్థానాలు రాజ్యాంగ పరిషత్తుకు తమ ప్రతినిధులను నియామకం (నామినేషన్‌) ద్వారా పంపుతాయి.


* బ్రిటిష్‌ పాలిత రాష్ట్రాలు గ్రూపులుగా (ఉపసమాఖ్యలు) ఏర్పడటానికి స్వేచ్ఛ ఉంటుంది. హిందూ మెజారిటీ రాష్ట్రాలు ‘ఎ’  గ్రూపుగా; వాయవ్య రాష్ట్రాలైన సింధు, పంజాబ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రమైన బెలూచిస్థాన్‌లను ‘బి’ గ్రూపుగా; బెంగాల్, అస్సాంలను ‘సి’ గ్రూపుగా వర్గీకరించారు. ప్రతి విభాగం తమ రాష్ట్రాలకు సంబంధించిన రాజ్యాంగ విషయాలను నిర్ణయిస్తుంది. గ్రూపులన్నీ కలిసి యూనియన్‌ రాజ్యాంగాన్ని రూపొందిస్తాయి.


* అధికార మార్పిడి జరిగే వరకు దేశంలోని అన్నివర్గాలకు ప్రాతినిధ్యం వహించే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటవుతుంది.


తమ ప్రధాన డిమాండ్‌ అయిన ప్రత్యేక పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయకపోవడంతో ఇండియన్‌ ముస్లింలీగ్‌ క్యాబినెట్‌ మిషన్‌ ప్రణాళికను పూర్తిగా తిరస్కరించింది. 1946, ఆగస్టు 16న ప్రత్యక్ష చర్య దినంగా జరపాలని నిర్ణయించింది. దీని ఫలితంగా ఉత్తర భారతదేశంలో మత ఘర్షణలు చెలరేగాయి.

రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం

Posted Date : 09-09-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌