• facebook
  • whatsapp
  • telegram

భారత జాతీయవాద రాజకీయాలు

స్వరాజ్య కాంక్షను రగిలించిన రాజకీయం!


  త్యాగాలతో కూడిన భారతీయుల పోరాటాలు, నిజాయతీ నిండిన రాజకీయాలు తెల్లవారిని ఆలోచనలో పడేశాయి. వారిలోని ఉదారత్వాన్ని మేల్కొలిపాయి. తదనంతర కాలంలో దేశంలో పాలనకు మూలమైన ఒక చట్టాన్ని చేయడానికి ప్రేరణగా మారాయి. ఆ కొత్త చట్టం కింద జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతగా ప్రభావం చూపలేకపోయిన ముస్లింలీగ్‌ అవకాశవాద చర్యలతో ఆంగ్లేయుల వైపు చేరింది. బలవంతంగా భారతదేశాన్ని రెండో ప్రపంచ యుద్ధంలోకి లాగిన బ్రిటన్‌ నియంతృత్వ పోకడలను కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా నిరసించారు. మంత్రి పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. వైఖరి మార్చుకున్న వైస్రాయ్, ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపి ప్రత్యేక దేశ విభజన డిమాండ్లను ప్రోత్సహించాడు. సంగ్రామ కాలంలో సంభవించిన పరిణామాలతో రగిలిన స్వాతంత్య్రకాంక్ష తర్వాతి దశ జాతీయోద్యమంపై అత్యంత ప్రభావాన్ని ప్రదర్శించింది.


  గాంధీజీ నాయకత్వంలో జరిగిన శాసనోల్లంఘన ఉద్యమం భారత జాతి చరిత్రలో ఒక మహోజ్వల ఘట్టం. మనవాళ్ల ప్రగాఢ స్వాతంత్య్రాభిలాషను విభిన్న నిరసనలతో ప్రదర్శించింది. స్వాతంత్య్రం కోసం భారతీయులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నారని లోకానికి తెలియజేసింది ఈ క్రమంలో బ్రిటిషర్లలో కొంత ఉదారవాద చైతన్యం వచ్చింది. శాసనోల్లంఘన ఉద్యమం, నైతిక విలువలతో కూడిన గాంధీజీ రాజకీయాల వల్ల ఆంగ్లేయ ప్రభుత్వంలోనూ కొంత మార్పును తీసుకొచ్చింది. అయినా రాజ్యాంగ సంస్కరణల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఇంతలో సైమన్‌ కమిషన్‌ నివేదిక, మూడు రౌండ్‌ టేబుల్‌ సమావేశాల్లో వచ్చిన సూచనలు కలిపి 1933లో ఒక శ్వేతపత్రంగా వెలువడ్డాయి. ఈ సూత్రాలను పరిశీలించి బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడానికి లార్డ్‌ లిన్‌లిత్‌గో నాయకత్వంలో పార్లమెంట్‌ జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా బ్రిటిష్‌ పార్లమెంట్‌ ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ను ప్రవేశపెట్టింది. ఈ చట్టం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. స్వాతంత్య్రం వచ్చే వరకు ఆ చట్టంలోని అంశాలే భారతదేశ పాలనకు ప్రాతిపదికలయ్యాయి. ఆ తర్వాత అవే రాజ్యాంగ రచనకు మార్గదర్శకాలుగా మారాయి.


భారత ప్రభుత్వ చట్టం-1935 ముఖ్యాంశాలు: * ఈ చట్టం అఖిల భారత సమాఖ్య (ఫెడరల్‌) వ్యవస్థను ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య నిర్దిష్ట అధికార విభజన చేసింది. దీని ద్వారా ప్రభుత్వ అధికారాలను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలుగా విభజించి అవశిష్ట అధికారాలను వైస్రాయ్‌-గవర్నర్‌ జనరల్‌కు కట్టబెట్టింది.


* కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్ర శాసనసభ (సెంట్రల్‌ లెజిస్లేచర్‌), రాష్ట్ర జాబితాలోని అంశాలపై రాష్ట్రాల శాసనసభలు (ప్రొవిన్షియల్‌ లెజిస్లేచర్‌) చట్టాలను చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితాలోని అంశాలపై కేంద్ర, రాష్ట్ర శాసనసభలు చట్టాలను చేయవచ్చు. ఈ విధంగా రూపొందించిన కేంద్ర, రాష్ట్రాల చట్టాల మధ్య వైరుధ్యం ఉంటే కేంద్ర చట్టమే చెల్లుబాటు అవుతుంది. 


* కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఒక ఫెడరల్‌ కోర్టును కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని రాష్ట్రాల శాసనసభలను ద్విశాసన సభలుగా రూపొందించింది. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి గవర్నర్‌ల నియంత్రణలో రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని (అటానమీ) కల్పించింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వ విధానాన్ని ప్రవేశపెట్టింది. 


* భారత ప్రభుత్వ చట్టం-1858 ద్వారా భారత రాజ్య కార్యదర్శికి సలహాలను ఇవ్వడానికి లండన్‌లో ఏర్పాటు చేసిన ఇండియా కౌన్సిల్‌ను రద్దు చేసి, దాని స్థానంలో ఒక సలహా సంఘాన్ని నియమించింది. ఈ చట్టానికి జాతీయోద్యమ నాయకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. 


* భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగంలోని అనేక అంశాలను ఈ చట్టం నుంచే గ్రహించింది. 


భారత ప్రభుత్వ చట్టం-1935 కింద ఎన్నికలు: బ్రిటిష్‌ పార్లమెంటు రూపొందించిన రాజ్యాంగ సంస్కరణ చట్టాల్లో ‘భారత ప్రభుత్వ చట్టం-1935’ వివరణాత్మకమైంది, సుదీర్ఘమైంది. 1937, ఏప్రిల్‌ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. కానీ ఈ చట్టంలోని సమాఖ్య వ్యవస్థ ఆచరణలోకి రాలేదు. రాష్ట్రాలకు సంబంధించిన భాగం మాత్రమే అమలైంది. ఈ చట్టం ప్రకారం 1937లో 11 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. అత్యధిక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ముస్లింలీగ్‌ అతికష్టం మీద ఇతర పార్టీల సహాయంతో రెండు రాష్ట్రాల్లో గెలిచింది. అధిక సంఖ్యాక ప్రజలు కాంగ్రెస్‌ను బలపరుస్తున్నారని తేటతెల్లం కావడం ఆ పార్టీకి మింగుడు పడలేదు.* ఈ చట్టంలో పొందుపరిచిన అత్యంత ముఖ్యమైన అంశం ‘రాష్ట్రాల స్వయంప్రతిపత్తి’. దీని ద్వారానే మొదటిసారిగా రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. ప్రాంతీయ పాలనాంశాలన్నింటినీ మంత్రుల అధికార పరిధిలోకి బదిలీ చేశారు. రాష్ట్రాలపై కేంద్రం నియంత్రణ చాలా వరకు తగ్గింది. గవర్నర్లను రాష్ట్రాలకు రాజ్యాంగబద్ధమైన అధిపతులుగా పరిగణించారు. బొంబాయి, మద్రాసు, సెంట్రల్‌ ప్రావిన్స్, ఒరిస్సా, యునైటెడ్‌ ప్రావిన్స్, బిహార్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం, అస్సాంలలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వాలు కొలువుతీరాయి. ఈ ప్రభుత్వాలు తమకున్న పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చడానికి, పౌర హక్కులు కల్పించడానికి కృషి చేశాయి. పత్రికలపై ఆంక్షల తొలగింపు, కొన్ని సంస్థలపై బ్రిటిష్‌ ప్రభుత్వం విధించిన బహిష్కరణలను ఎత్తివేయడంతో పాటు రాజకీయ ఖైదీలను విడుదల చేశాయి. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రజానుకూల శాసనాలను తీసుకొచ్చాయి. ఖాదీని ప్రోత్సహిస్తూ హరిజనోద్ధరణ కార్యక్రమాలు చేపట్టాయి. పారిశ్రామికవేత్తలు, కార్మికుల మధ్య సామరస్యాన్ని నెలకొల్పాయి. మంత్రులు వేతనాలు, ఖర్చులను తగ్గించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో పాటు నిజాయతీతో వ్యవహరించిన కాంగ్రెస్‌ మంత్రివర్గాలు ప్రజాసేవలో కొత్త ప్రమాణాలను నెలకొల్పాయి.


రెండో ప్రపంచ యుద్ధం

 
  జర్మనీ నియంత హిట్లర్‌ రాజ్య విస్తరణ కాంక్షతో పోలెండ్‌పై యుద్ధం ప్రకటించడంతో 1939, సెప్టెంబరులో రెండో ప్రపంచ సంగ్రామం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్‌లు పోలెండ్‌కు మద్దతుగా జర్మనీతో తలపడాల్సి వచ్చింది. జర్మనీ, ఇటలీ, జపాన్‌ ఒక వైపు; బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా మరో వైపు యుద్ధానికి దిగాయి.  మన జాతీయ నాయకులు, కేంద్ర శాసనసభ సభ్యులెవరినీ సంప్రదించకుండానే బ్రిటిష్‌ ప్రభుత్వం భారతదేశాన్ని కూడా యుద్ధంలోకి దింపింది. నాజీ, ఫాసిస్ట్‌ వంటి ప్రపంచ నియంతృత్వ శక్తులతో పోరాటానికి కాంగ్రెస్‌ నాయకులు సుముఖంగానే ఉన్నప్పటికీ, భారతదేశంలో బ్రిటన్‌ అవలంబిస్తున్న పద్ధతుల పట్ల విముఖత చూపారు. దేశంలో రాజ్యాంగబద్ధ అసెంబ్లీ, కేంద్రంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు వంటి కనీస షరతులను ఆమోదిస్తేనే బ్రిటన్‌ యుద్ధ ప్రయత్నాలకు సహకరిస్తామని కాంగ్రెస్‌ చేసిన ప్రతిపాదనలను రాజప్రతినిధి లిన్‌లిత్‌గో తోసిపుచ్చాడు. ఈ ఏకపక్ష ధోరణికి నిరసనగా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ మంత్రివర్గాలు రాజీనామా చేశాయి. మరోవైపు మహమ్మద్‌ అలీ జిన్నా నాయకత్వంలోని ఇండియన్‌ ముస్లింలీగ్‌ మాత్రం బ్రిటిష్‌ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపింది. 1939, డిసెంబరు 22ను ముస్లింలీగ్‌ ‘విమోచన దినం’గా నిర్వహించింది.


ప్రత్యేక పాకిస్థాన్‌ డిమాండ్‌ 


  రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ రాజీనామా చేయడంతో వైస్రాయ్‌ వైఖరిలో మార్పు వచ్చింది. ముస్లిం లీగ్‌ వైపు మొగ్గు చూపుతూ, దాని డిమాండ్లను బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రోత్సహించడం ప్రారంభించింది. దాంతో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువుగా ముస్లింలీగ్‌ మారింది. 1940, మార్చిలో లాహోర్‌లో జరిగిన ముస్లింలీగ్‌ సమావేశంలో హిందువులు, ముస్లింలు వేర్వేరు జాతులు అనే ఒక అశాస్త్రీయ సిద్ధాంతాన్ని జిన్నా ప్రచారం చేశాడు. ఈ సమావేశంలోనే ముస్లింలీగ్‌ మొదటిసారిగా ముస్లింలకు ఒక ప్రత్యేక దేశం ‘పాకిస్థాన్‌’ కావాలని తీర్మానం జరిగింది. యుద్ధ కాలంలో భారతదేశ రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. రెండో ప్రపంచ సంగ్రామం హోరుగా సాగుతున్న సమయంలోనే, ఐరోపా వలస రాజ్యాల్లో స్వాతంత్య్ర కాంక్ష పెల్లుబికి ప్రజా పోరాటాలు పుంజుకున్నాయి. ఆ విధంగా రెండో ప్రపంచ యుద్ధం భారతదేశంలో తదుపరి స్వాతంత్య్ర పోరాట గతిని అనూహ్యంగా మార్చేసింది.


రచయిత: వి.వి.ఎస్‌.రామావతారం
 

Posted Date : 08-07-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌